
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ట్వీట్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది: ప్రియాంక
మీ ప్రేరణతోనే... మీ నాయకత్వంలోనే: సీఎం రేవంత్ రీట్వీట్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో వాగ్దానాన్ని నెరవేరుస్తూ బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించిందని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. జనగణన విషయంలో తెలంగాణ.. దేశానికి ఓ మార్గం చూపిందని, ఈ జనగణన దేశమంతా జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంగళవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశా రు.
‘జనగణన ద్వారా మాత్రమే వెనుకబడిన వర్గాల హక్కులు సాధ్యమవుతా యని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో ఉన్న 50 శాతం పరిమితి తొలగింపునకు మార్గం సుగమమైంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లభించనుంది’ అని రాహుల్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
మీకు అండగా ఉంటాం: ప్రియాంక
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చింది. 42% రిజర్వేషన్లతో బీసీ వర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తారు.
తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం రిజర్వేషన్ల కల్పన మాత్రమే కాదు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనం. మీరు మమ్మల్ని నమ్మినట్టుగానే, మేం మీకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జైహింద్, జైకాంగ్రెస్’ అని ప్రియాంక ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
కలలు సాకారమవుతున్నాయి: సీఎం రేవంత్
రాహుల్, ప్రియాంకాగాంధీలు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘గర్వించదగిన రోజు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం వాగ్దానాలను నెరవేర్చుతోంది. రాహుల్, ప్రియాంక నేతృత్వంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తూ, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, ప్రతి గ్యారంటీని నిజం చేస్తూ ముందుకెళుతోంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన విప్లవాత్మక నిర్ణయం. సామాజిక న్యాయ అమలులో తెలంగాణ దేశానికి మార్గదర్శనం చేయడం గర్వకారణం. ఆ ఇద్దరి ప్రేరణకు ధన్యవాదాలు’ అని రేవంత్‌రెడ్డి రీట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment