Presidential Elections 2022: Interesting Facts About Indian Former Presidents From 1950 - Sakshi
Sakshi News home page

Former Indian Presidents Facts: రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు?

Published Thu, Jul 21 2022 5:35 PM | Last Updated on Thu, Jul 21 2022 8:17 PM

Presidential Election 2022 Result: Interesting Facts About Indian Former Presidents - Sakshi

దేశానికి 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై 24తో ముగుస్తుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిగింది. ద్రౌపది ముర్ము తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలపై విహంగ వీక్షణం..


స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సేవలు అందించారు. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఆయనే కావడం విశేషం. అంతేకాదు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. కాగా, 1950 జనవరి 26న రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధ్రువీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు.  


స్వతంత్ర భారత మొట్ట మొదటి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్‌.. 1962లో రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 


జాకిర్‌ హుస్సేన్‌ 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దురదృష్టవశాత్తు పదవీలో ఉండగానే 1969, మే 3న ఆయన కన్నుమూశారు.  


జాకిర్‌ హుస్సేన్‌ మరణంతో 1969లో జరిగిన ఎన్నికల్లో వరాహగిరి వేంకటగిరి నాలుగో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచిన తొలి రాష్ట్రపతిగా ఆయన చరిత్ర కెక్కారు.   


ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌.. భారత ఐదో రాష్ట్రపతిగా పనిచేశారు. పదవిలో ఉండగానే 1977, ఫిబ్రవరి 11న మరణించారు. 


ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవిని దక్కించుకున్న ఘనత నీలం సంజీవరెడ్డికి దక్కింది. 1977 నాటి ఎన్నికల్లో పోటీలో ఉన్న 37 మందిలో సంజీవరెడ్డి నామినేషన్‌ మినహా మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


జ్ఞానీ జైల్‌ సింగ్‌ 1982లో దేశానికి 7వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడిగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతికెక్కారు. 


ఆర్‌. వెంకట్రామన్‌ దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన హయాంలోనే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమైంది. 


శంకర్‌దయాళ్‌ శర్మ 1992లో దేశానికి 9వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతిగానూ సేవలు అందించారు.


దేశానికి తొలి దళిత రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌. కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంట్‌గా గుర్తింపు పొందారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. 


భారతదేశపు మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన ఏపీజే అబ్దుల్‌ కలాం దేశానికి 11వ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు.  


రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళ ప్రతిభా పాటిల్‌. అంతకుముందు ఆమె రాజస్థాన్‌ గవర్నర్‌గా పనిచేశారు. రాష్ట్రపతి పనిచేసిన కాలంలో ఆమె పలు రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. 


సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ప్రణబ్‌ ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012లో ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన ఆరుగురు రాష్ట్రపతుల్లో ఆయన ఒకరు. ప్రణబ్‌ హయాంలోనే రాష్ట్రపతి భవన్‌ ట్విటర్‌ ఖాతా ప్రారంభమైంది. 


దేశానికి రెండో దళిత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. అంతకుముందు బిహార్‌ రాష్ట్రానికి గవర్నర్‌గా ఆయన పనిచేశారు. ఈ ఏడాది జూలై 24తో రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగియనుంది.  (క్లిక్: భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement