Draupadi Murmu
-
Republic Day 2025: జయమ్మ విజయం
‘మన దేశంలో పేదలు కలలు కనగలరు. వాటిని నిజం చేసుకోగలరు’ అనే మాట ఎన్నో సందర్భాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటి నుంచి వినిపించింది. పేదరాలైన జయమ్మ కల కన్నది. ‘నా కష్టాన్ని చూసి నలుగురు మెచ్చుకుంటే చాలు’ నలుగురు ఏం ఖర్మ... సాక్షాత్తూ రాష్ట్రపతిభవన్ ఆమె కష్టాన్ని గుర్తించింది.‘నీ భర్త ఏం పనిచేస్తాడు?’ అనే ప్రశ్నకు... జయమ్మ చెప్పిన జవాబుకు అవతలి వ్యక్తి ముఖం అదోలా మారిపోయేది. మాటల్లో చిన్న చూపు కనిపించేది.నెల్లూరుకు చెందిన జయమ్మ ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు. దీంతోపాటు భర్తతో కలిసి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులు చేస్తుంది.‘చేయడానికి మీకు ఈ పనే దొరికిందా తల్లీ’ అని వెక్కిరించిన వాళ్లు ఎందరో! అయితే ఏ రోజూ చేస్తున్న పనిపట్ల నిర్లక్ష్యం, విముఖత జయమ్మలో కనిపించలేదు. ఆమె రెక్కల కష్టం వృథా పోలేదు. వృత్తి పట్ల జయమ్మ అంకితభావానికి గుర్తింపుగా దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్న విందులో పాల్గొనబోతోంది జయమ్మ.‘పెద్దోళ్లకు అందరూ చుట్టాలే. పేదోళ్లకు కష్టాలే చుట్టాలు’ అంటుండేది జయమ్మ తల్లి రాజమ్మ.ఆ ఇంటికి కష్టాలు కొత్త కాదు. కష్టపడడం కొత్త కాదు. నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతానికి చెందిన జయమ్మ తన తల్లిదండ్రులకు సాయంగా రోజువారీ కూలిపనులకు వెళ్తుండేది. ‘ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే పనికి పోవడమే నాకు ఇష్టం’ అంటున్న జయమ్మకు ‘శ్రమ’ అనేది చిన్నప్పటి నేస్తం.జయమ్మకు రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ మొదట్లో సెప్టిక్‌ట్యాంక్ వాహనానికి డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా ఓ సెప్టిక్ ట్యాంకర్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసి క్లీనింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయస్సు వచ్చేవరకు గృహిణిగా ఉన్న జయమ్మ ఆ తరువాత భర్త చేసే సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులకు తాను కూడా తోడుగా వెళ్తుండేది.చిన్నచూపు చూసినా..భూగర్భ డ్రైనేజీ పారిశుధ్య పనులకు వెళ్లే జయమ్మను తోటివారే చిన్నచూపు చూసేవారు. అవేమీ పట్టించుకోకుండా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. క్లీనింగ్ సమయాల్లో చర్మవ్యాధుల బారిన పడేది. ఈ దంపతుల కష్టాన్ని చూసిన ‘నవజీవన్ ’ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల క్రితం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ షూరిటీతోపాటు ఎన్ ఎస్కేఎఫ్డీ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణం మంజూరు చేయించింది. రూ.10 లక్షల సబ్సిడీతో రూ.32 లక్షలు విలువైన కొత్త సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ వాహనాన్ని మంజూరు చేయించడంతో వారికి సొంతవాహనం సమకూరింది. దీంతో దంపతులిద్దరూ సొంత వాహనంతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలోని ఎన్నో నివాసాల్లో సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నారు.అన్ని అంశాల్లో మంచి మార్కులుకేంద్ర ప్రభుత్వ ఎన్ ఎస్కేఎఫ్డీసీ (నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్) పథకం లబ్ధిదారు అయిన జయమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనానికి యజమాని అయింది. పథకాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, సకాలంలో ఈఎంఐ కడుతున్నారా, లోడ్‌ను ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారా లేక ప్రభుత్వం చూపిన పాయింట్లోనే డంప్ చేస్తున్నారా... ఇలాంటి అంశాలతో పాటు తగినవిధంగా జీవనోపాధి పొందుతున్నారా.. పోలీస్ స్టేషన్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా... ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు ఎన్ఎస్కేఎఫ్డీసీ అధికారులు. అన్నింట్లో మంచి మార్కులు రావడంతో జయమ్మ కృషికి గుర్తింపు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.ఆ నమ్మకంతోనే...‘నమ్మిన పని ఎప్పుడూ మోసం చేయదు అనే మాట ఎన్నోసార్లు విన్నాను. ఆ నమ్మకంతోనే ఎంతమంది వెక్కిరించినా పట్టించుకోలేదు. మా ఆర్థిక స్థాయికి సెఫ్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ బండికి సొంతదారులమవుతామని అనుకోలేదు. కష్టపడితే ఆ కష్టమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది జయమ్మ.జీవితంలో మర్చిపోలేని రోజుమేము చేసే వృత్తి తప్పుడు పనేం కాదు. మా రెక్కల కష్టాన్నే నమ్ముకుని పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అందులోనే మాకు సంతృప్తి ఉంది. ఎవరేమి అనుకున్నా మేము ఎప్పుడూ బాధపడలేదు. నా భర్తకు తోడుగా సాయంగా వెళ్లి క్లీనింగ్ పనులు చేస్తున్నా. గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రిక రావడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంతో సంతోషంగా ఉంది.– జయమ్మ– చిలక మస్తాన్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నెల్లూరు -
ప్రతిభకు పట్టం...క్రీడాకారులకు అందలం
న్యూఢిల్లీ: ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు బహూకరించారు. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన మహిళా స్టార్ షూటర్ మనూ భాకర్ (హరియాణా), ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (తమిళనాడు), భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (పంజాబ్), పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్)లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ పురస్కారం దక్కింది. పారా స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్‌కు అర్జున అవార్డు (జీవిత సాఫల్య) అందిస్తున్న సమయంలో సెంట్రల్ హాల్ చప్పట్లతో మారుమోగింది. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన 22 ఏళ్ల షూటర్ మనూ భాకర్ మాట్లాడుతూ... ‘దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నిదానమే ప్రధానం అని నేను నమ్ముతా. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని పేర్కొంది. ‘కల నిజమైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఖేల్ రత్న అవార్డు అందుకున్న రెండో చెస్ ప్లేయర్‌ను కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో ఘనతలు అందుకునేందుకు ఇది మరింత స్ఫూర్తినిస్తుంది’ అని 18 ఏళ్లకే చదరంగ విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్ అన్నాడు. 32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు దక్కగా... వారిలో 17 మంది పారాథ్లెట్లు ఉండటం విశేషం. ‘అర్జున అవార్డు’ దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి యర్రాజీ (ఆంధ్రప్రదేశ్), జివాంజి దీప్తి (తెలంగాణ) కూడా ఉన్నారు.జ్యోతి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో ఉండటంతో ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరుకాలేదు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన దివ్యాంగ క్రీడాకారులకు అవార్డులు అందజేస్తున్న సమయంలో రాష్ట్రపతి సంప్రదాయాన్ని పక్కనపెట్టి... పారాథ్లెట్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు తన స్థానం నుంచి ముందుకు రావడం ఆహుతులను ఆకర్షించింది. ‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీతలకు రూ. 25 లక్షలు... అర్జున, ద్రోణాచార్య పురస్కారాలు పొందిన వారికి రూ. 15 లక్షల చొప్పున నగదు బహుమతి లభిస్తుంది. అవార్డీల వివరాలు‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డు: గుకేశ్ (చెస్) హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్), మనూ భాకర్ (షూటింగ్). ‘అర్డున’ అవార్డులు: జ్యోతి యర్రాజీ, అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు, స్వీటీ (బాక్సింగ్), వంతిక (చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ (హాకీ), రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ), ప్రీతి పాల్, జివాంజి దీప్తి, అజీత్ సింగ్, సచిన్ సర్జేరావు, ధరమ్వీర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సెమా, సిమ్రన్, నవ్‌దీప్ సింగ్ (పారా అథ్లెటిక్స్), నితీశ్ కుమార్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా (పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా జూడో), మోనా అగర్వాల్ (పారా షూటింగ్), రుబీనా (పారా షూటింగ్), స్వప్నిల్ కుసాలే, సరబ్జోత్ సింగ్ (షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్), అమన్ (రెజ్లింగ్). ‘అర్జున’ అవార్డు (లైఫ్‌టైమ్): సుచా సింగ్ (అథ్లెటిక్స్), మురళీకాంత్ పేట్కర్ (పారా స్విమ్మింగ్). ‘ద్రోణాచార్య’ అవార్డు: సుభాశ్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ (హాకీ), మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండో కొలాకో (ఫుట్‌బాల్). -
ఖేల్ రత్న అవార్డులు అందుకున్న గుకేశ్, హర్మన్‌ప్రీత్ సింగ్, మనూ బాకర్, ప్రవీణ్ కుమార్
భారత దేశపు అత్యున్నత క్రీడా పురస్కారం అయిన "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు" గతేడాది (2024) నలుగురిని వరించింది. చెస్‌లో డి గుకేశ్, పురుషుల హాకీలో హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల షూటింగ్లో మనూ బాకర్, పారా-అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ నలుగురు ఇవాళ (జనవరి 17) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో జరిగింది.A historic moment for 🇮🇳 Indian chess! 🏆Congratulations to 🇮🇳 GM Gukesh on receiving the prestigious Major Dhyan Chand Khel Ratna Award from Hon’ble President Droupadi Murmu👏Your hard work and passion continue to inspire us all—onward and upward 🥳👏@DGukesh📹Doordarshan pic.twitter.com/4AMZ8ClZD9— Chess.com - India (@chesscom_in) January 17, 2025గుకేశ్ అతి చిన్న వయసులో (18) ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన రెండవ భారతీయుడు గుకేష్. గుకేశ్ గత నెలలో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌ను ఓడించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు.హర్మన్‌ప్రీత్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్. హర్మన్ సారథ్యంలో భారత్ గతేడాది ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ పతకం సాధించడంలో హర్మన్ కీలకపాత్ర పోషించాడు.మనూ భాకర్ .. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. మనూ బాకర్ గతేడాది ఆగస్టులో జరిగిన విశ్వక్రీడల్లో రెండు కాంస్య పతకాలు (10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం ఈవెంట్లలో) గెలుచుకుంది.ప్రవీణ్ కుమార్.. గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్ విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు.పై నలుగురు భారత క్రీడా రంగంలో చేసిన విశేష కృషికి గాను ఖేల్ రత్న అవార్డులు అందుకున్నారు. -
అల్విదా మన్మోహన్జీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలతో భారతదేశ దశదిశను మార్చిన మహోన్నత నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్(92)కు జాతి యావత్తూ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో శనివారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. దివంగత మాజీ ప్రధానమంత్రిని కడసారి దర్శించుకొని వీడ్కోలు పలకడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగుచుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనుంజయ్ రామ్ఫుల్తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ దేశా ల ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు. మన్మోహన్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన అనంతరం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీ్వందర్ సింగ్ సుఖూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినోద్ కుమార్ సక్సేనా, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్ సింగ్ హుడా, అశోక్ గహ్లోత్, భూపేష్ భగేల్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అమర్ రహే శనివారం ఉదయం 9 గంటలకు మన్మోహన్ పార్థివ దేహాన్ని పుష్పాలతో అలంకరించిన సైనిక వాహనంలో ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు తలపాగాను చివరి ప్రయాణంలోనూ ధరింపజేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కడసారి నివాళులర్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ భార్య గురుశరణ్‌కౌర్, ఒక కుమార్తె కూడా పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే.. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, తబ్ తక్ తేరా నామ్ రహేగా’ అనే నినాదాల మధ్య వేలాది మంది అనుసరిస్తుండగా యాత్ర ముందుకు సాగింది. ఉదయం 11.30 గంటల సమయానికి నిగమ్‌బోధ్ ఘాట్‌కు చేరుకుంది. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతోపాటు రాహుల్ గాంధీ సైతం యాత్రలో చివరివరకూ పాల్గొన్నారు. పాడెను సైతం మోశారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ భౌతికకాయాన్ని ప్రత్యేక వేదికపైకి చేర్చారు. సిక్కు మత సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, మత గురువులు పవిత్ర గుర్బానీ కీర్తనలు ఆలపించారు. భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. త్రివిధ దళాల సైనికులు 21 తుపాకులు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత చితికి మన్మోహన్ పెద్ద కుమార్తె ఉపీందర్ సింగ్ నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. మన్మోహన్ సింగ్ జ్ఞాపకాలతో అందరి హృదయాలు బరువెక్కాయి. అల్విదా మన్మోహన్జీ అంటూ కొందరు బోరున విలపించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మన్మోహన్ ‘అఖండ్ పథ్’ను జనవరి 1న ఢిల్లీలోని నివాసంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 3న ‘భోగ్’ కార్యక్రమం ఉంటుందన్నారు. అంతిమ్ అర్దాస్(చివరి ప్రార్థనలు) జనవరి 3న ఢిల్లీలో గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి సభను సోమవారం నిర్వహించనున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇండియా ప్రగతికి బాటలు వేసిన నేత మన్మోహన్: లారెన్స్ వాంగ్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సంతాపం ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ అని కొనియాడారు. దార్శనికత, అంకితభావంతో దేశ ప్రగతికి బాటలు వేశారని, ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆంటోనియో గుటెరస్ సంతాపం మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విచారం వ్యక్తంచేశారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు, భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి సంతాపం ప్రకటించారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. మన్మోహన్ హయాంలో ఐక్యరాజ్యసమితితో భారత్ బంధం బలోపేతమైందని ఉద్ఘాటించారు. భూటాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ ఆత్మశాంతి కోసం భూటాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాజధాని థింపూలోని బౌద్ధ మందిరంతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించారు. 20 జిల్లాల్లో ప్రార్థనలు జరిగినట్లు భూటాన్ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయా లు, కాన్సులేట్లలో తమ జాతీయ పతాకాన్ని అవనతం చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన మన్మో హన్ అంత్యక్రియలకు భూటాన్ రాజు హాజరయ్యారు. మన్మోహన్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ధర్మరాజు స్థాపించిన శ్మశాన వాటిక! మన్మోహన్ అంత్యక్రియలు జరిగిన నిగమ్‌బోధ్ ఘాట్ శ్మశానవాటిక ఢిల్లీలో యమునా నది ఒడ్డునే ఉంది. నగరంలో అది అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద శ్మశానవాటిక. ప్రాచీనమైన ఈ మరుభూమిని పాండవుల అగ్రజుడు, ఇంద్రప్రస్థ పాలకుడైన యుధిష్టరుడు(ధర్మరాజు) స్థాపించాడని చెబుతుంటారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రకరకాల పక్షులు విహరిస్తుంటాయి. అందుకే పక్షులను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు వస్తుంటారు. పక్షి ప్రేమికులకు ఇదొక చక్కటి వేదిక. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, జనసంఘ్ నేత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ సహా పలువురు ప్రముఖుల అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. 5,500 సంవత్సరాల క్రితం మహాభారత కాలంలో సాక్షాత్తూ బ్రహ్మ ఇక్కడ యమునా నదిలో స్నానం ఆచరించాడని, దాంతో ఆయన పూర్వస్మృతి జ్ఞప్తికి వచ్చిందని, అందుకే దీనికి నిగమ్‌బోధ్ అనే పేరు స్థిరపడిందని కొన్ని పుస్తకాల్లో రాశారు. నిగమ్‌బోధ్ ఘాట్‌ను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) నిర్వహిస్తోంది. 1950వ దశకంలో ఎలక్ట్రిక్ దహన వాటిక, 2000 సంవత్సరం తర్వాత సీఎన్జీ దహన వాటిక సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా 1898లో ఈ శ్మశానవాటిక ప్రారంభమైంది. అప్పట్లో ఈ ప్రాంతం పేరు షాజహానాబాద్. మన్మోహన్ స్మారకం నిర్మించే చోటే అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరినప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ పరిణామంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశానికి తొలి సిక్కు ప్రధానమంత్రి అయిన మన్మోహన్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని మండిపడుతున్నారు. -
ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దివికేగిన ఆర్థిక సంస్కర్త మన్మో హన్ సింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసమైన 3, మోతిలాల్ నెహ్రూ రోడ్డుకు తరలించారు. నివాళులర్పించడానికి శుక్రవారం పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్‌ను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జె.పి.నడ్డాతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు మన్మోహన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా నివాళులర్పించారు. నేడు నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు దివంగత మాజీ ప్రధాని అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. మన్మోహన్ పారి్థవదేహాన్ని ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం సంతాపం మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. మన్మోహన్ ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వంతోపాటు యావత్తు దేశం తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించారు. మహోన్నత రాజనీతిజు్ఞడు, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మనందరిపై బలమైన ముద్ర వేశారని కొనియాడారు. మన్మోహన్ గౌరవార్థం ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీడబ్ల్యూసీలో సంతాప తీర్మానం ఆమోదం మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నివాళులర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యా లయంలో భేటీ అయ్యింది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. మన్మోహన్‌కు సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మా నం ఆమోదించారు. భారత రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో అగ్రగణ్యుడు మన్మోహన్ అని కొనియాడారు. ఆయన కృషితో ప్రపంచస్థాయిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయని పేర్కొన్నారు. దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ చిరస్మరణీయులని ఉద్ఘాటించారు. ప్రజల తలరాతలు మార్చేలా ఎన్నో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు. ఢిల్లీలో స్మారక చిహ్నం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌కు కూడా అందించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించాయి.అదే సంప్రదాయం పాటించాలి: ఖర్గే ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించడానికి వీలైన చోటేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. మన మాజీ ప్రధానమంత్రులకు, రాజనీతిజు్ఞలకు అంత్యక్రియలు జరిగిన చోటే స్మారకం నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి మన్మోహన్ అందించిన విశిష్టమైన సేవలను ఖర్గే తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకముందు ఆయన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మన్మోహన్ స్మారక నిర్మాణంపై చర్చించారు. మన్మోహన్ శాశ్వత విశ్రాంతి తీసుకొనే ప్రదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, అదొక పవిత్రమైన స్థలంగా ఉండాలని పేర్కొన్నారు. -
మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి,మంగళగిరి : ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్స్ కోర్స్ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది. ప్రతి సంవత్సరం నిర్వహించాలి. పానకాల స్వామికి నా ప్రార్ధన.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి.యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలి. ఎయిమ్స్ మొదటి బ్యాచ్‌గా మీరందరూ గుర్తుంటారు.దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలి.మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాను. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయం.ప్రపంచపటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివి. ప్రతీ రోగికీ సేవలందించాలి.. ప్రతీ డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి.యువ డాక్టర్లు సేవ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలి’’ అని అన్నారు.చంద్రబాబు మాట్లాడుతూఅనంతరం రాష్ట్ర సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇది.ప్రతి సంవత్సరం నిర్వహించాలి.కాన్వకేషన్ మీకు ఒక గుర్తింపు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాధారణ మహిళ, గిరిజన మహిళగా భారత ప్రథమ మహిళ అయ్యారు. ఉపాధ్యాయినిగా అంచెలంచెలుగా రాష్ట్రపతి అయ్యారు ’అని చంద్రబాబు అన్నారు. -
ఊరు కాదిది... నా కుటుంబం!
రాయ్‌రంగ్‌పూర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్వేగభరితమయ్యారు. తను పుట్టిన ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించి, అక్కడి గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపర్బేడ గ్రామాన్ని కేవలం ఒక ప్రదేశంగా తానెన్నడూ భావించలేదని, అదొక కుటుంబమని తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అన్నారు. బమన్ఘటి సబ్ డివిజన్లోని ఉపర్బేడలోని సంతాలి కుటుంబంలో ముర్ము 1958 జూన్ 20న జన్మించారు. 2022 జూలై భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తను చదువుకున్న ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ఆ పాఠశాలతోపాటు యావత్తు గ్రామాన్ని అందంగా మార్చారు. గ్రామస్తులు, స్కూలు టీచర్లు, విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తను పుట్టిన ఇంటికి వెళ్లే దారిలో సంతాలి మహిళలు ఆమెకు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముర్ము కూడా వారితో కాలు కదిపారు. గ్రామ దేవతకు పూజలు చేశారు. నేనిప్పటికీ ఇక్కడి విద్యార్థినే...స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు. ‘‘నాకిప్పుడు 66 ఏళ్లు. అయినా మా స్కూల్లో చిన్న విద్యార్థిననే అనుకుంటున్నా. అప్పట్లో మట్టిగోడలుండేవి. మా ఏడో తరగతిలో ఉండగా స్కాలర్షిప్ పరీక్ష కోసం మదన్ మోహన్ సార్ వాళ్లింటికి తీసుకెళ్లారు. తన సొంత పిల్లలతోపాటు నన్ను కూడా పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ గ్రామం, ఈ స్కూలు నాకు అందించిన అభిమానం మరువలేనిది’’ అంటూ ఉప్పొంగిపోయారు. తోటి వాళ్లు, ఉపాధ్యాయులు కూడా బయటి వ్యక్తిగా కాక, తనను సొంత కుటుంబసభ్యురాలిగా చూసుకునేవారన్నారు. ‘ఆ రోజుల్లో లాంతరు వెలుగులో చదువుకునేదాన్ని. ఆ లాంతరు గ్లాస్ పగిలిపోయి ఉండేది. చదువుకోవడానికి ఇబ్బందయ్యేది. సిరా పెన్నుతో రాయడం కష్టంగా ఉండేది. ఇంకుతో బట్టలు పాడయ్యేవి’’ అని గుర్తు చేసుకున్నారు. గురువులకు వందనం తనకు విద్య నేర్పిన గురువులను రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. స్కూల్ హెడ్మాస్టర్ బిశేశ్వర్ మహంత, క్లాస్ టీచర్ బాసుదేశ్ బెహెరె, 4, 5 తరగతుల్లో ఉండగా క్లాస్‌టీచర్ బసంత కుమార్ గిరిలను సన్మానించారు. ఉపర్బేడ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని సుమారు 200 మందికి స్కూల్ బ్యాగులు, చాకెట్లు, టిఫిన్ బాక్సులు అందజేశారు. కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు ఎదగాలని వారిని కోరారు. -
నౌకా నిర్మాణంలోనూ ఆత్మనిర్భర్
పూరీ: నౌకల తయారీలో 2047కల్లా ఆత్మ నిర్భరత సాధించడంపై నావికాదళం దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. నేవీ డే సందర్భంగా బుధవారం ఒడిశాలోని పూరీ సాగర తీరంలో జరిగిన వేడుకల్లో త్రివిధదళాధిపతి హోదాలో ఆమె పాల్గొన్నారు. మహిళా సాధికారతకు నేవీ తన వంతు కృషి చేస్తోందని ప్రశంసించారు. ‘‘ఐదు వేల ఏళ్ల పై చిలుకు ఘన చరిత్ర భారత నావికా రంగం సొంతం. దేశంలో తొలి మహిళా అగ్నివీర్లు నేవీలోనే చేరారు’’ అన్నారు. 15 యుద్ధనౌకలు, 37 వాయుసేన విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఐఎన్ఎస్ జల్సా, మిసైల్, డి్రస్టాయర్ ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సూర్య, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ సతొపురా వంటి ప్రముఖ యుద్ధనౌకలతో పాటు జలాంతర్గాములూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. హాక్, సీ–కింగ్, మిగ్29కే వంటి యుద్ధవిమానాలు, చేతక్, ఎంఎస్ 60 హెలికాప్టర్లు, హాక్ విమానాల విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
విశ్వబంధు భారత్‌కు.. రాజ్యాంగమే పునాది
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతోపాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని, వారి పురోభివృద్ధికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. మన రాజ్యాంగం ఒక ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆలోచనలను అందిపుచ్చుకొనే వ్యవస్థను అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో ఘనతలు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. విశ్వబంధు భారత్ ‘‘దేశ ఐక్యత, సమగ్రతతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం, అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం పౌరుల ప్రాథమిక విధులు. నూతన పథంలో పయనిస్తే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి నూతన గుర్తింపును సాధించిపెట్టగలం. అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించేలా కీలక పాత్ర పోషించడానికి రాజ్యాంగ నిర్మాతలు భారత్‌కు మార్గనిర్దేశం చేశారు. నేడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. విశ్వబంధుగా ప్రపంచవ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే బలమైన పునాది రాయి. ప్రజల సమ్మిళిత, వ్యక్తిగత గౌరవాన్ని రాజ్యాంగం కాపాడుతోంది. స్వాతంత్య్ర పోరాట ఫలితమే రాజ్యాంగం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయి. మన ఐక్యతను బలోపేతం చేస్తాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో మనమంతా కలిసకట్టుగా ఉన్నామని తెలియజేశాయి. ఎందరో మహామహులు దాదాపు మూడేళ్లపాటు కృషి చేయడంతో రాజ్యాంగం మన చేతికి వచ్చింది. నిజానికి సుదీర్ఘంగా జరిగిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే భారత రాజ్యాంగం. ఈ పోరాట స్ఫూర్తి, ఆశయాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత ఆశయలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు. ఇవే దశాబ్దాలుగా భారత్‌ను నిర్వచిస్తున్నాయి. స్వశక్తితో పైకి ఎదిగే, సమాజానికి సేవలందించే, తోటి మానవులకు సాయం అందించే వాతావరణాన్ని రాజ్యాంగ పీఠిక కల్పించింది. 2015 నుంచి సంవిధాన దివస్ జరుపుకుంటున్నాం. దీనివల్ల రాజ్యాంగంపై యువతలో అవగాహన పెరుగుతోంది. మీ ప్రవర్తనలో రాజ్యాంగ విలువలను, ఆశయాలను జోడించాలని ప్రజలందరినీ కోరుతున్నా. పౌరులంతా ప్రాథమిక విధులను నిర్వర్తించాలి. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలే అత్యున్నతం: జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. ఆయన పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు. మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘భారతదేశ ప్రజలమైన మేము’ అని రాజ్యాంగ పీఠికలో ప్రారంభంలోనే పేర్కొన్నారని, ఇందులో లోతైన అర్థం ఉందని, ప్రజలే అత్యున్నతం అని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్ పని చేస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ అనే మూడు మూలస్తంభాలను రాజ్యాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరింత వెలుగులీనుతుందని సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను ప్రజలంతా నిర్వర్తించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ అనే లక్ష్య సాధనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. రాజ్యాంగం ఒక ఉ్రత్పేరకం: ఓం బిర్లా చట్టసభల్లో నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలు జరగాలని రాజ్యాంగ సభ సూచించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని చట్టసభల సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవంలో ఓం బిర్లా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, అంకితభావం, దార్శనికతకు రాజ్యాంగం ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగమే ఒక ఉ్రత్పేరకం అని చెప్పారు. సాధారణ ప్రజల స్థితిగతుల్లో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. చట్టసభల్లో చక్కటి చర్చల ద్వారా రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పట్ల మన తిరుగులేని అంకితభావం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి నిర్వహించాలని ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ సూచించారు. -
రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్.. బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలను షేర్ చేసింది.పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. राहुल गांधी को इतना घमंड है कि राष्ट्रपति जी का अभिवादन तक नहीं किया। सिर्फ इसलिए क्योंकि वो जनजातीय समाज से आती हैं, महिला हैं और राहुल गांधी कांग्रेस के राजकुमार? कैसी घटिया मानसिकता है ये? pic.twitter.com/shtP5s2dxs— Amit Malviya (@amitmalviya) November 26, 2024అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారుCongress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows. pic.twitter.com/CR3v8pAioL— Amit Malviya (@amitmalviya) November 26, 2024‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.Rahul Gandhi can’t hold his attention for even 50 seconds and he had the audacity to make an absolutely distasteful comment on the President of United States. pic.twitter.com/TAesrKmrmS— Amit Malviya (@amitmalviya) November 26, 2024 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. -
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: రెండురోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. గురు, శుక్రవారాల్లో (21, 22వ తేదీల్లో) ఆమె హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అటునుంచి రాజ్‌భవన్‌కు చేరుకొని 6.20 గంటల నుంచి 7.10 వరకు విశ్రాంతి తీసుకొంటారు. రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని, అక్కడ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు శిల్పకళా వేదికలో జరుగుతున్న ‘లోక్ మంథన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మ ధ్యాహ్నం 12.05 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రపతితో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల భేటీ
ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు అరుదైన అవకాశం లభించింది. నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో ఫ్యూజన్ స్కూల్ విద్యార్థులు అర్హత సాధించారు. బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ సందర్భంగా ఆమె చూపిన ఆప్యాయతపై ఫ్యూజన్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూజన్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి రావు మాట్లాడుతూ,రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వకారణం. ఇది జీవితకాల జ్ఞాపకం’అని అన్నారు.కాగా, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం, ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అరుదైన అవకాశం కేంద్రం కల్పిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు శారీరక, మానసిక, నాయకత్వ నైపుణ్యాల వంటి పరీక్షల్లో ప్రతిభను చాటాల్సి ఉంటుంది. -
సీజేఐగా జస్టిస్ ఖన్నా బాధ్యతల స్వీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: భారత సర్వోన్నత న్యాయస్థానం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆంగ్లంలో దైవసాక్షిగా ఆయన పదవీస్వీకార ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మాజీ సీజేఐలు జస్టిస్ జె.ఎస్.ఖేహర్, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఈ మేరకు ఎక్స్‌లో కూడా పోస్టు చేశారు. సీజేఐగా ఆదివారం రిటైరైన జస్టిస్ చంద్రచూడ్ స్థానంలో జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 183 రోజుల పాటు పదవిలో కొనసాగుతారు. 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. అయితే కృష్ణమీనన్ మార్గ్‌లోని సీజేఐ అధికారిక నివాసంలోకి మారకూడదని జస్టిస్ ఖన్నా నిర్ణయించుకున్నారు. పదవీ కాలం తక్కువగా ఉండడంతో ప్రస్తుత నివాసంలోనే కొనసాగనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.కీలక తీర్పుల్లో భాగస్వామి జస్టిస్ ఖన్నా 1960 మే 14న న్యాయమూర్తుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా చేశారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రాథమిక హక్కులపై ఆయన పెదనాన్న జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా ఇచ్చిన తీర్పు భారత న్యాయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది! తండ్రి తనను అకౌంటెంట్‌గా చూడాలనుకున్నా జస్టిస్ ఖన్నా న్యాయవాద వృత్తికేసి మొగ్గుచూపేందుకు పెదనాన్న స్ఫూర్తే కారణమంటారు. ఆయన 2019 జనవరి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. ఈ ఆరేళ్లలో 117 తీర్పులిచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు. తొలి రోజే 45 కేసుల విచారణ! సీజేఐగా తొలి రోజే జస్టిస్ ఖన్నా 45 కేసులను విచారించారు. న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తానని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. దేశ న్యాయ వ్యవస్థకు సారథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘న్యాయ వ్యవస్థ పాలన యంత్రాంగంలో అంతర్భాగమే. అయినా అది స్వతంత్ర వ్యవస్థ. రాజ్యాంగానికి కాపలాదారుగా, ప్రాథమిక హక్కుల పరిరక్షకురాలిగా న్యాయ వ్యవస్థ తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేలా చూసేందుకు కృషి చేస్తా’’ అని తెలిపారు. న్యాయ వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు.పెదనాన్న కోర్టు గదిలోనే... జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా న్యాయమూర్తిగా తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టులోని రెండో నంబర్ గదిలో ఆయన నిలువెత్తు చిత్రపటం ఇప్పటికీ సమున్నతంగా వేలాడుతూ ఉంటుంది. సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా సీజేఐగా తన తొలి రోజు కేసుల విచారణను అదే గదిలో చేపట్టడం విశేషం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన కెరీర్ మొదలైంది కూడా ఇదే కోర్టు గదిలో! సీజేఐగా ఆయన పదవీకాలం ఫలవంతంగా సాగాలని మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తదితర న్యాయవాదులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. విచారణకు కేసుల సీక్వెన్సింగ్‌కు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టు బార్ నేత ఒకరు లేవనెత్తగా ఆ అంశం తన దృష్టిలో ఉందని, దాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. లెటర్ ఆఫ్ సర్క్యలేషన్ ద్వారా కూడా వాయిదాలు కోరే విధానాన్ని పునరుద్ధరించాలన్న ఒక లాయర్ విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు నూతన సీజేఐ పేర్కొన్నారు. #WATCH | Delhi: President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Sanjiv Khanna at Rashtrapati Bhavan. pic.twitter.com/tJmJ1U3DXv— ANI (@ANI) November 11, 2024పూర్వీకుల ఇంటికోసం అన్వేషణజస్టిస్ సంజీవ్ ఖన్నా తన పూర్వీకుల ఇంటికోసం చిరకాలంగా అన్వేషిస్తున్నారు! ఆయన తాతయ్య సరవ్దయాల్ బ్రిటిష్ ఇండియాలో లాయర్‌గా చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జలియన్‌వాలాబాగ్ సమీపంలోని కట్రా షేర్సింగ్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారట. జస్టిస్ ఖన్నా ఐదేళ్ల వయసులో తండ్రితో కలిసి ఆ ఇంటికి వెళ్లారు. తాతయ్య మరణానంతరం 50 ఏళ్ల కింద ఆ ఇంటిని అమ్మేశారట. ఇన్నేళ్లలో కొత్త నిర్మాణాలు తదితరాలతో ఆ ప్రాంతం రూపురేఖలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. కానీ ఆ ఇంటి తాలూకు తన చిన్ననాటి జ్ఞాపకాలు జస్టిస్ ఖన్నా మదిలో అలాగే ఉండిపోయాయి. అందుకే దాన్ని వెతకడానికి జస్టిస్ ఖన్నా ఇప్పటికీ ప్రయతి్నస్తూనే ఉంటారట. అమృత్సర్ వెళ్లినప్పుడల్లా విధిగా కట్రా షేర్సింగ్ ప్రాంతానికి వెళ్తారని ఆయన సన్నిహితులు తెలిపారు. వేసవి సెలవుల్లో తాతయ్యతో గడిపిన జ్ఞాపకాలను కూడా జస్టిస్ ఖన్నా ఇప్పటికీ నెమరేసుకుంటూ ఉంటారు. పెదనాన్నకు ఇందిర నిరాకరించిన పీఠంపై... అది 1976. ఎమర్జెన్సీ రోజులు. సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా హరిద్వార్‌లో గంగా తీరాన సోదరితో కలిసి సేదదీరుతున్నారు. ‘‘నేనో తీర్పు ఇవ్వబోతున్నా. దానివల్ల బహుశా నాకు సీజేఐ పదవి చేజారవచ్చు’’ అని ఆమెతో అన్నారు. సరిగ్గా అలాగే జరిగింది. ప్రధాని ఇందిరాగాంధీ సిఫార్సు మేరకు పౌరుల ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తూ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉత్తరు్వలిచ్చారు. వాటిని పలు రాష్ట్రాల హైకోర్టులు కొట్టేశాయి. ఆ తీర్పులను ఇందిర సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అది పౌరుల హక్కులకు సంబంధించి కీలక ప్రశ్నలు లేవనెత్తిన ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసుగా చరిత్రలో నిలిచిపోయింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సమర్థిస్తూ సీజేఐ ఏఎన్ రే సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4–1 మెజారిటీతో తీర్పు వెలువరించింది. జస్టిస్ ఖన్నా ఒక్కరే దానితో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలోనైనా సరే, ప్రాథమిక హక్కులను నిషేధించే అధికారం కేంద్రానికి లేదంటూ మైనారిటీ తీర్పు వెలువరించారు. ఇది భారత న్యాయ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. ప్రాథమిక హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును అనివార్యంగా ఉటంకిస్తారు. అప్పట్లో విదేశీ మీడియా కూడా జస్టిస్ ఖన్నా తీర్పును ఎంతగానో కొనియాడింది. అత్యంత నిర్భీతితో కూడిన తీర్పులిచ్చిన భారత న్యాయమూర్తుల్లో అగ్రగణ్యులుగా జస్టిస్ ఖన్నా నిలిచిపోయారు. దీనిపై ఆగ్రహించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి అయిన ఆయన్ను కాదని జస్టిస్ హమీదుల్లా బేగ్‌ను 15వ సీజేఐగా ఎంపిక చేశారంటారు. అందుకు నిరసనగా అదే రోజున న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన అరుదైన వ్యక్తిత్వం జస్టిస్ ఖన్నాది. అలా 48 ఏళ్ల క్రితం చేజారిన అత్యున్నత న్యాయ పీఠం తాజాగా ఆయన కుమారుని వరసయ్యే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు దక్కింది. ఈ ఉదంతంపై చర్చోపచర్చలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. దీన్ని ప్రకృతి చేసిన న్యాయంగా నెటిజన్లు అభివరి్ణస్తున్నారు. జబల్పూర్ కేసులో మెజారిటీ తీర్పు వెలువరించిన నలుగురు న్యాయమూర్తుల్లో తాజా మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వై.వి.చంద్రచూడ్ కూడా ఉండటం విశేషం. ఆయన జస్టిస్ బేగ్ అనంతరం 16వ సీజేఐ అయ్యారు. ఇక జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఎమర్జెన్సీ అనంతరం లా కమిషన్ చైర్మన్‌గా సేవలందించారు. అనంతరం చరణ్‌సింగ్ మంత్రివర్గంలో కేంద్ర న్యాయ మంత్రిగా నియమితులైనా మూడు రోజులకే రాజీనామా చేశారు. 1982లో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసి జైల్‌సింగ్ చేతిలో ఓడిపోయారు. చదవండి: ట్రంప్ విజయంపై భారత్ ఆందోళన?.. జైశంకర్ రిప్లై ఇదే.. -
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్‌తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్‌తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
సత్యం, కరుణే ఆయుధం
సాక్షి, హైదరాబాద్: న్యాయానికి సత్యం, కరుణ జోడించినప్పుడే అసలైన విజయం సాధించినట్లని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. ఈ ఆయుధంతోనే మహాత్మా గాంధీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వేచ్ఛ ప్రసాదించారని చెప్పారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే ఆదర్శమని రాజ్యాంగం చెబుతోందన్నారు. సాంకేతికతను సాధనంగా మలచుకుని సత్వర న్యాయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు. మానవ శ్రేయస్సు కోసం జంతువులు, పక్షులూ అవసరమని, వాటి సంరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. నీటి వనరులను కూడా కాపాడాల్సిన అవసరం ఉందని, యువతరం దీని కోసం పాటుపడాలని ఆకాంక్షించారు. శనివారం శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ అలోక్ అరాధే హాజరయ్యారు. మంత్రిగా పని చేసిన రోజులు గుర్తొచ్చాయి... ‘నల్సార్‌లో యానిమల్ లా సెంటర్‌ను ఏర్పాటు చేయడం ఆనందదాయకం. ఇది 25 ఏళ్ల క్రితం ఒడిశా మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన నాటి సంగతిని గుర్తు చేసింది. జంతువుల రక్షణ, సంక్షేమం కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు విస్తృత ప్రయత్నాలు జరగాలి. ఆ దిశగా నల్సార్ ముందడుగు వేసింది. కృత్రిమ మేధ, సాంకేతికత న్యాయవ్యవస్థను ప్రభావితం చేయనుంది. ఆ మార్పులను ఎదుర్కొనేందుకు యువ న్యాయవాదులు సిద్ధంగా ఉండాలి.వృత్తిలో రాణించడానికి, సామాజిక న్యాయం పెంపొందించడానికి సాంకేతికతను సాధనంగా మలచుకోవాలి. మన న్యాయ వ్యవస్థ ఈ నాటిది కాదు. చంద్రగుప్తుడు, చాణక్యుల సమయం నుంచే న్యాయాధికారులు ఉన్నారు. ఒకే వ్యక్తి ఉండకుండా ముగ్గురితో బెంచ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. కేసులు పరిష్కారమయ్యే వరకు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య వ్యక్తిగత భేటీకి అనుమతి ఉండేది కాదు. నిష్పక్షపాత న్యాయ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు’అని ముర్ము పేర్కొన్నారు. పేదవాడికి న్యాయం అందడంలేదు ‘దేశానికి న్యాయం కోసం మహాత్మాగాంధీ న్యాయవాద వృత్తి వదులుకున్నారు. అయినా సత్యాగ్రహం, దోపిడీకి గురైన రైతులకు న్యాయం చేయడం కోసం ఓ న్యాయవాదిలా అడుగులు వేశారు. ఆర్థిక, ఇతర ఏ వైఫల్యాల కారణంగా ఏ పౌరుడికీ న్యాయం నిరాకరించకూడదు. దురదృష్టవశాత్తు ధనవంతుడికి లభించే న్యాయం పేదవాడికి అందడం లేదు. అట్టడుగు వర్గాలకు న్యాయం అందించడంపై యువ న్యాయవాదులు దృష్టి సారించాలి.సామాజిక న్యాయ సాధనకు మీరే ఏజెంట్లు. న్యాయ నిపుణులుగా మీరు ఏ రంగం ఎన్నుకున్నా విలువలకు కట్టుబడండి. శక్తికి నిజం తోడైతే మరింత శక్తివంతమవుతారు. ఇక్కడ పతకాలు పొందిన వారిలో బాలికలు ఎక్కువగా ఉన్నా.. డిగ్రీలు పొందిన వారిలో తక్కువగా ఉన్నారు. ఇది మారాలి. మహిళా సాధికారతకు న్యాయవాదులు కృషి చేయాలి. జువెనైల్ జస్టిస్, న్యాయ సాయం, వైకల్యమున్న వారిపై శ్రద్ధ వహించడంలో నల్సార్ కృషి అభినందనీయం’అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. అనంతరం న్యాయ విద్య పూర్తిచేసిన విద్యార్థులకు పట్టాలు, వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 592 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వర్సిటీ వీసీ శ్రీకృష్ణదేవరావు, రిజి్రస్టార్ విద్యుల్లత, అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న (శనివారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అడిషనల్ సీపీ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీవో ప్లాజా, టివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని తెలిపారు.ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. -
President Droupadi Murmu: మహిళా సాధికారతే దేశానికి బలం
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు. పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు. మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు. తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్‌ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు. -
మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ముర్ము ప్రసంగించారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు ఒక తరం ముగిసిన తర్వాత తీర్పులు వస్తున్నాయని ఆక్షేపించారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, బ్యాక్లాగ్ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తరచూ ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించాలి. ప్పారు. పెండింగ్ కేసులను తగ్గించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’’ అని సూచించారు. న్యాయం కోసం పోరాడితే మరిన్ని కష్టాలు: అంగ బలం, అర్థబలం కలిగిన కొందరు నేరగాళ్లు యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారని రాష్ట్రపతి ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారికి సకాలంలో శిక్షలు పడడం లేదన్నారు. అలాంటి నేరగాళ్ల వల్ల నష్టపోయిన బాధితులు మాత్రం భయాందోళనల మధ్య బతుకుతున్నారు. గ్రామీణ పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు కోర్టుల దాకా వస్తున్నారు’’ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. కోర్టుల్లో మహిళలకు వసతులు మెరుగుపడాలి: సీజేఐ జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళలకు తగిన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతున్నా కోర్టుల్లో వారికి సరిపడా సదుపాయాలు లేకపోవడం గర్హనీయమన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని మౌలిక సదుపాయాల్లో కేవలం 6.7 శాతమే మహిళలకు అనువుగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో న్యాయ నియామకాల్లో 70 శాతం మహిళలే ఉంటున్నారు. వారికి వసతులు మెరుగుపడాలి. కోర్టు ప్రాంగణాల్లో వైద్య సదుపాయాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు రావాలి. కక్షిదారుల కోసం ఈ–సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్ వంటివాటితో న్యాయం సులువుగా అందుబాటులోకి వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన, సానుకూల పరిస్థితులు కలి్పంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల సంక్షేమం న్యాయస్థానాల కర్తవ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు. -
President Droupadi Murmu: ఆవేదనతో చలించిపోయా..
న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆ భయానక సంఘటన గురించి తెలుసుకొని చలించిపోయానని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదని స్పష్టంచేశారు. మహిళలపై నేరాల పట్ల మనమంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని బుధవారం పీటీఐ వార్తా సంస్థకు రాసిన ప్రత్యేక ఆరి్టకల్‌లో రాష్ట్రపతి సూచించారు. జూనియర్ డాక్టర్ హత్యపై రాష్ట్రపతి స్పందించడం ఇదే మొదటిసారి. తల్లులు, అక్కచెల్లెమ్మలపై జరుగుతున్న అరాచకాలపై దేశం మేల్కోవాల్సిన సమయం వచ్చిందని ఆమె ఉద్ఘాటించారు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయాలు ఉంటే వారిని ఒక వస్తువుగా చూసే అలవాటు పెరుగుతుందని తెలిపారు. స్త్రీలను బలహీనులుగా, తెలివిలేనివారుగా పరిగణించే ఆలోచనా ధోరణిని అందరూ మార్చుకోవాలని హితవు పలికారు. మహిళల పట్ల ప్రజల దృష్టికోణం మారితే సమాజంలో వారిపై నేరాలు జరగబోవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం చెప్పారంటే... మనం పాఠాలు నేర్చుకున్నామా? దేశంలో సోదరీమణులపై ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న కోల్‌కతాలో వైద్యురాలపై జరిగిన అఘాయిత్యం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నాగరిక సమాజంలో ఆడబిడ్డలు ఇలాంటి అరాచకాల బారిన పడడానికి వీల్లేదు. జూనియర్ డాక్టర్ హత్య పట్ల దేశమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో నేను కూడా ఉన్నాను. కోల్‌కతాలో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగానే, మరోచోట నేరగాళ్లు చెలరేగిపోయారు. మహారాష్ట్రలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటన తర్వాత మహిళలపై నేరాలు జరగకుండా వ్యూహాలు రూపొందించుకున్నాం. ప్రణాళిక అమల్లోకి తీసుకొచ్చాం. అయినా నేరాలు ఆగడం లేదు. గత 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. కొన్ని మాత్రమే అందరి దృష్టికి వచ్చాయి. మనం నిజంగా పాఠాలు నేర్చుకున్నామా? ఆందోళనలు ముగిసిపోగానే ఘోరాలు మరుగునపడిపోతున్నాయి. వాటిని మనం మర్చిపోతున్నాం. మరో ఘోరం జరిగాక పాత ఘోరాలను గుర్తుచేసుకుంటున్నాం. ఇది సరైన విధానం కాదు. మహిళలపై వక్రబుద్ధిని మొదట్లోనే అడ్డుకోవాలి మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. వాటిని పోరాడి సాధించుకోవాలి. మహిళలకు మరిన్ని హక్కులు దక్కకుండా, హక్కుల విస్తరణ జరగకుండా కొన్ని సామాజిక అచారాలు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. మహిళలను ప్రాణంలేని వస్తువుగా చూసే ధోరణి వారిపై నేరాలకు పురిగొల్పుతోంది. ఈ పరిస్థితిలో కచి్చతంగా మార్పురావాలి. వారి హక్కులను అందరూ గౌరవించాలి. స్త్రీల పట్ల జనంలో ఉన్న దురభిప్రాయాన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు, సమాజంపై ఉంది. చరిత్రను ఎదిరించే సమయం వచ్చింది. స్త్రీలపై నేరాల పట్ల నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారిపై అత్యాచారాలు, హత్యలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జరిగిన తప్పులను సరిదిద్దుకోకపోతే సమాజంలోని సగం జనాభా మిగతా సగం జనాభాలాగా నిర్భయంగా జీవించలేదు. మీడియా ధైర్యంగా పనిచేయాలి ప్రసార మాధ్యమాలు ధైర్యంగా పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సూచించారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దడంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని వివరించారు. మీడియా ఎప్పటికీ సత్యానికే అండగా ఉండాలని చెప్పారు. సత్య మార్గం నుంచి పక్కకు మళ్లొద్దని కోరారు. ‘మనసు ఎక్కడ నిర్భయంగా ఉంటుందో’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన పద్యాన్ని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా వార్తాసంస్థల ఎడిటర్లు బుధవారం రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తుంటామని, మరోవైపు మన రోజువారీ ప్రవర్తనలో ఆ భావన కనిపించకపోవడం తనను అప్పుడప్పుడు ఆవేదనకు గురి చేస్తోందని ముర్ము వ్యాఖ్యానించారు. -
Paris Olympic Players: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్యారిస్ ఒలింపిక్ బృందం (ఫొటోలు)
-
President Droupadi Murmu: అసమానతలను రూపుమాపాలి
న్యూఢిల్లీ: సామాజిక అసమానతలను పెంచి పోషించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ‘‘వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన విభజన ధోరణులను సమూలంగా పెకిలించాలి. అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయేలా గట్టి కార్యాచరణ రూపొందించి అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినం సందర్భంగా మంగళవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. విస్తరిస్తున్న సామాజిక ప్రజాస్వామ్యానికి అది నిదర్శనమని చెప్పారు. భిన్నత్వం, బహుళత్వమే ఆభరణాలుగా దేశమంతా ఐక్యంగా ముందుకు సాగుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. సామాజిక న్యాయానికి మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన చర్యలను వివరించారు. మహిళల అభ్యున్నతికీ పెద్దపీట వేసిందన్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన అంతులేని అకృత్యాలు, మానప్రాణ నష్టం ఎన్నటికీ మర్చిపోలేనివంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్ఫూర్తిదాయక ప్రసంగం: మోదీ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా నవతరం ఆర్థిక సంస్కరణలకు రంగం సిద్ధమైందని రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్ దూసుకుపోతోందంటే దీర్ఘదృష్టితో కూడిన సారథ్యం, రైతులు, ఇతర సంపద సృష్టికర్తల నిరి్వరామ శ్రమే కారణమన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఏఐతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ, ఉరకలెత్తుతున్న ఆర్థిక రంగం భారత్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మారుస్తున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందంటూ మోదీ ప్రశంసించారు. -
ఒలింపిక్ బృందాన్ని అభినందించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పారిస్‌లో పాల్గొన్న భారత ఒలింపిక్ బృందాన్ని బుధవారం అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండప్‌లో భారత బృందంతో భేటీ అయిన ముర్ము... దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పతకాలు తెచ్చిన క్రీడాకారులతో పాటు పతకాల కోసం పారిస్‌లో శ్రమించిన అథ్లెట్లను ఆమె ప్రశంసించారు. పలువురు అథ్లెట్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించిన ఫొటోలు, బృందంతో దిగిన ఫొటోల్ని రాష్ట్రపతి భవన్ అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. మరోవైపు ఈరోజు ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆహా్వనం అందింది. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు కూడా ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. -
President Droupadi Murmu: మీరే సంధానకర్తలు
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్లు అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. శనివారం ముగిసిన గవర్నర్ల రెండు రోజుల సదస్సులో ఆమె ప్రసంగించారు. శాఖల మధ్య మరింత సమన్వయానికి చర్యలపై సదస్సులో చర్చించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. మెరుగైన పనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారాన్ని పొందేందుకు, నిరంతర సంప్రదింపులకు సాగించడంలో గవర్నర్లు సంశయించరాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్భవన్లలో ఆదర్శ పాలనా నమూనాను రూపొందించడానికి గవర్నర్లు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు. గవర్నర్లు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, డిజిటైజేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు. -
రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు
ఢిల్లీ : ఆగస్ట్ 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ,ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. నూతన నేర న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు యూనివర్సిటీలు అక్రిడేషన్ గిరిజన ప్రాంతాల అభివృద్ధి ,వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో గవర్నర్ల పాత్ర, మై భారత్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ వృక్ష మాకే నామ్, సేంద్రియ వ్యవసాయం, ప్రజా సంబంధాల మెరుగుదల, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో మెరుగైన సమన్వయం వంటి కీలక అంశాలపై రెండు రోజులపాటు చర్చలు జరగనున్నాయి. గవర్నర్లతో విడివిడిగా బృందాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక అంశాలపై ప్రజెంటేషన్ జరగనుంది. -
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు.