
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతించారు. ‘దేశానికి ఇది గర్వకారణం, సంతోషకరమైన విషయం. దేశ చరిత్రలో పార్లమెంట్ నూతన భవన ప్రారంభం స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. పార్లమెంట్‌పై విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించడం చాలా సంతృప్తినిచ్చింది’అని ఆమె అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్ప సంప్రదాయాలు, ఆదర్శాలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి పంపిన సందేశాన్ని పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు.
దేశ ప్రగతికి సాక్షి : ఉప రాష్ట్రపతి
పార్లమెంట్ కొత్త సౌధంపార్లమెంట్ నూతన భవనం, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, భారత ప్రజాస్వామ్యం, రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు, బానిస మనస్తత్వం నుంచి పొందిన స్వేచ్ఛకు ప్రతీకగా ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆకాంక్షించారు. కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు సందేశమిచ్చారు. ఈ సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ లోక్‌సభ చాంబర్‌లో చదివి వినిపించారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి, వారి సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ఈ భవనం తోడ్పడాలని జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. అమృతకాలంలో నిర్మించిన ప్రజాస్వామ్య సౌధం ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ మన దేశ ప్రగతికి సాక్షిగా నిలుస్తుందని వివరించారు. రాబోయే కాలంలో ఎన్నెన్నో చారిత్రక అధ్యాయాలను లిఖించడానికి ఇదొక వేదిక అవుతుందన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ కొత్త భవనాన్ని జాతికి అంకితం చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని దన్‌ఖడ్ వెల్లడించారు.