Indian democracy
-
పారదర్శకత అవసరం!
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఫిబ్రవరి 15 చరిత్రాత్మక దినమని ప్రజాస్వామ్య ప్రియుల అభిప్రాయం. కేంద్రంలోని మోదీ సర్కార్ తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకం (ఈబీఎస్) రాజ్యాంగ విరుద్ధమనీ, పారదర్శకత లోపించిన ఈ పథకం కింద వివిధ పార్టీలకు బాండ్ల రూపంలో నిధులిచ్చిన దాతల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ వెల్లడించాలనీ సుప్రీమ్ కోర్ట్ చరిత్రాత్మక తీర్పునివ్వడమే అందుకు కారణం. 2018 నుంచి రాజకీయ పార్టీలకు పాడి ఆవుగా మారిన ఈ పథకం రాజ్యాంగంలోని 19 (1)(ఎ) అధికరణాన్ని ఉల్లంఘిస్తోందనీ, దాతలకుండే గోప్యత హక్కు కన్నా పౌరుల సమాచార హక్కే ముఖ్యమనీ కోర్ట్ అభిప్రాయపడింది. బాండ్ల రూపంలో డబ్బులిచ్చిన దాతలు, అందుకున్న పార్టీలు, అందిన నిధులతో సహా మొత్తం వివరాల్ని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) వెల్లడించాలన్న సుప్రీమ్ ఆదేశం పాలక వర్గాలకు దెబ్బే! గత ఆరేళ్ళుగా జనం దృష్టి పడకుండా తప్పించుకున్న వివరాలన్నీ ఇక ప్రజాక్షేత్రంలోకి వస్తాయి. అలాగే, కొన్నేళ్ళుగా అనుమాని స్తున్న కార్పొరేట్ల– రాజకీయపార్టీల క్విడ్ ప్రోకో బంధంపై ఎంతో కొంత బయటపడవచ్చు. ఈ పథక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం కోర్ట్ తీర్పుపై ఇంకా మౌనముద్ర వీడలేదు. న్యాయశాఖ మంత్రి మాత్రం తీర్పును పరిశీలిస్తున్నా మనీ, సవాలు చేయదలిచినదీ లేనిదీ నిర్ణయిస్తామనీ వెల్లడించారు. నిజానికి, ఎన్నికల్లో లెక్క చూపని అక్రమ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల బాండ్లను తెచ్చామన్నది పాలకుల వాదన. కోర్ట్ తీర్పుతో మళ్ళీ అదే ధన ప్రవాహ పరిస్థితి తలెత్తుతుందని వారి మాట. కానీ, ఏ కార్పొరేట్ సంస్థల నుంచి, ఏ పార్టీకి, ఎంత నిధులు బాండ్ల రూపంలో వస్తున్నాయో తెలియని గోప్యమైన ఎన్నికల బాండ్ల వ్యవస్థ వల్ల కూడా మరో రకంగా జరుగుతున్నది అదే! అంతా గోప్యమే గనక సంస్థలు స్వప్ర యోజనాలు ఆశించి బాండ్ల రూపంలో పార్టీకి నిధులు కట్టబెట్టడం, ప్రతిగా వాటి ప్రయోజనాలను పాలకులు నెరవేర్చడమన్నది అచ్చమైన ‘క్విడ్‌ప్రోకో’యే! వివరాలు వెల్లడించాలన్న కోర్ట్ తాజా ఆదేశంతో ఈ ‘నీ కిది... నాకది’ పందేరాలు బట్టబయలవుతాయి. ఈ తలనొప్పి ఎందుకని బాండ్ల బదులు నేరుగా డబ్బులిస్తే అడ్డుకోవడం అప్పుడైనా, ఇప్పుడైనా కష్టమే. అందుకే, కోర్ట్ తీర్పు సర్వ రోగ నివారిణి కాకున్నా, ఎన్నికల నిధుల్లో పారదర్శకతనే అంశంపై మరోసారి చర్చ రేపగలిగింది. లెక్క తీస్తే, 2017–18 నుంచి 2022–23 వరకు 12 వేల కోట్ల పైచిలుకు విలువైన ఎన్నికల బాండ్లు అమ్మకమయ్యాయి. చిత్రమేమిటంటే అందులో 55 శాతం, అంటే రూ. 6,564 కోట్ల మేర నిధులు అధికార బీజేపీకే దక్కాయి. ఈ అయిదేళ్ళలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు దక్కిన బాండ్లు 9.5 శాతమే. మరో మాటలో రూ. 1,135 కోట్లే. ఈ మొత్తం డబ్బులు ఎవరిచ్చారు, ఎంతిచ్చారన్నది దేవరహస్యం. ఆ గోప్యత చెల్లనేరదన్నది సుప్రీమ్ తాజా ఆదేశం. ఆ ఆదేశాలను పాటిస్తామంటూ భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నిజానికి, ఎన్నికల బాండ్ల విషయంలో ఎన్నికల సంఘం (ఈసీ) సైతం రోజుకో రకం అభిప్రాయం వ్యక్తం చేసింది. మొదట్లో బాండ్లపై అభ్యంతరం చెబుతూ, ఇది వట్టి తిరోగమన చర్య అని పేర్కొంది. కారణాలేమో కానీ, తీరా సుప్రీమ్ ముందు తన మాట మార్చేసి, ఎన్నికల బాండ్లను సమర్థించింది. పథకాన్ని ఆపు చేయరాదని వాదించింది. ఇప్పుడేమో సుప్రీమ్ ఆదేశాల్ని పాటి స్తామంటోంది. వెరసి, బాండ్లపై ఈసీకి ఏపాటి నిర్దిష్టమైన అభిప్రాయముందో అర్థమైపోతోంది. చెల్లిస్తున్న వారి పేరేమీ లేకుండా ఏ సంస్థ అయినా వెయ్యి, పదివేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల వంతున ఎంతైనా ఓ పార్టీకి ఇచ్చే వీలు ఈ బాండ్ల పథకం కల్పించింది. అందుకు తగ్గట్టే, అపరిమిత రాజకీయ విరాళాలకు వీలు కల్పిస్తూ, కంపెనీస్ యాక్ట్‌లోని 182వ సెక్షన్‌ను 2017లో ప్రభుత్వం సవరించింది. గతంలో రూ. 20 వేల పైన వచ్చే ప్రతి విరాళానికీ పార్టీలు రికార్డులు సమర్పించాలని ఆదాయపన్ను చట్టం. పాలకులు దాన్నీ మార్చేశారు. ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాల మొత్తం ఎంతన్నది చెబితే చాలంటూ ఎన్నికల బాండ్లకు మినహాయింపు కల్పించారు. ఈ సవరణల్ని సుప్రీమ్ తాజాగా కొట్టేసింది. గత మూడేళ్ళలో సదరు సంస్థకొచ్చిన సగటు నికర లాభంలో 7.5 శాతమే గరిష్ఠంగా ఇవ్వాలనే మునుపటి పరిమితిని మళ్ళీ తెచ్చింది. అపరిమిత కార్పొరేట్ ఫండింగ్ దోవలో డొల్ల కంపెనీలతో అక్రమ ధనాన్ని పార్టీలకు చేరవేయకుండా అడ్డుకట్ట వేసింది. గత 2019 లోక్‌సభ ఎన్నికల ఖర్చు రూ. 2,994 కోట్లని చెబుతున్నా, అసలు ఖర్చు 55 – 60 వేల కోట్లని అంచనా. అందుకే, ఎన్నికల బాండ్ల కథ గోప్యంగా సాగుతోందంటూ సుప్రీమ్ కొట్టేయడం సరైనదే! నిర్ద్వంద్వమైన, సమగ్రమైన ఆ తీర్పును స్వాగతించాల్సిందే! అంత మాత్రాన ఇకపై అంతా పారదర్శకత నెలకొంటుందనుకోలేం. అలాగే, సుప్రీమ్ మాట సర్కార్‌కు ఎదురుదెబ్బే అయినా, కావాలనుకుంటే భవిష్యత్తులో పార్లమెంట్లో చట్టం ద్వారా కొత్త రూపంలో బాండ్లకు పాలకులు తెర తీసినా ఆశ్చర్యం లేదు. అయితే, కోర్ట్ తన పని తాను సమర్థంగా చేసింది గనక, ఇప్పుడా తీర్పు స్ఫూర్తిని అందిపుచ్చుకొని, ఆచరణలో పెట్టాలి. చట్టబద్ధమైన ఎస్బీఐ, రాజ్యాంగబద్ధమైన ఈసీ అందులో ముందుండాలి. ఎన్నికల్లో అక్రమ ధనాన్ని అడ్డుకట్టాలంటే పాలకులు సైతం చిత్తశుద్ధి చూపాలి. పార్టీ విరాళాలిచ్చేందుకు వీలుగా సంస్థలు ప్రత్యేక ట్రస్టుల ఏర్పాటు లాంటి ఆలోచన చేయాలి. పారదర్శకత నెలకొల్పడం పెను సవాలే కానీ, ప్రజలు, పార్టీలు, బడా సంస్థలు... అందరూ త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. సుప్రీమ్ తీర్పు ఆ దిశలో తొలి అడుగైతే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది! -
దేశానికి గర్వకారణం: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతించారు. ‘దేశానికి ఇది గర్వకారణం, సంతోషకరమైన విషయం. దేశ చరిత్రలో పార్లమెంట్ నూతన భవన ప్రారంభం స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశం. పార్లమెంట్‌పై విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించడం చాలా సంతృప్తినిచ్చింది’అని ఆమె అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్ప సంప్రదాయాలు, ఆదర్శాలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి పంపిన సందేశాన్ని పార్లమెంట్ ప్రారంభం సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చదివి వినిపించారు. దేశ ప్రగతికి సాక్షి : ఉప రాష్ట్రపతి పార్లమెంట్ కొత్త సౌధంపార్లమెంట్ నూతన భవనం, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, భారత ప్రజాస్వామ్యం, రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు, బానిస మనస్తత్వం నుంచి పొందిన స్వేచ్ఛకు ప్రతీకగా ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ఆకాంక్షించారు. కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు సందేశమిచ్చారు. ఈ సందేశాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ లోక్‌సభ చాంబర్లో చదివి వినిపించారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి, వారి సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి ఈ భవనం తోడ్పడాలని జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. అమృతకాలంలో నిర్మించిన ప్రజాస్వామ్య సౌధం ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ మన దేశ ప్రగతికి సాక్షిగా నిలుస్తుందని వివరించారు. రాబోయే కాలంలో ఎన్నెన్నో చారిత్రక అధ్యాయాలను లిఖించడానికి ఇదొక వేదిక అవుతుందన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ కొత్త భవనాన్ని జాతికి అంకితం చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని దన్ఖడ్ వెల్లడించారు. -
పార్లమెంటులో అదే సీను
న్యూఢిల్లీ: అదే గందరగోళం. అవే సీన్లు. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు ఎవరి పట్టు మీద వారు బెట్టుగా నిలిచారు. దాంతో పార్లమెంటులో వారం రోజులుగా కన్పిస్తున్న దృశ్యాలే రిపీటయ్యాయి. ఇరు పక్షాల డిమాండ్లు, హోరాహోరీ నినాదాలు, గందరగోళం మధ్య కార్యకలాపాలేవీ జరపకుండానే ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. అలా మార్చి 13న మొదలైన మలి విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా ఆరో రోజూ పూర్తిగా వృథా అయింది. సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలను అధికార బీజేపీ సభ్యులు మరోసారి లేవనెత్తారు. ఆయన క్షమాపణలకు డిమాండ్ చేశారు. ప్రతిగా అదానీ గ్రూప్ అవకతవకల అంశాన్ని కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు తెరపైకి తెచ్చారు. తాము డిమాండ్ చేస్తున్న మేరకు దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించి తీరాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. ఇరు పక్షాలూ పెద్దపెట్టున నినాదాలు మొదలుపెట్టాయి. ఉభయ పక్షాలూ తన చాంబర్‌కు వస్తే చర్చించుకుని పరిష్కారానికి వద్దామని స్పీకర్ ఓం బిర్లా పదేపదే సూచించినా లాభం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కొన్ని బిల్లులను ప్రవేశపెట్టగానే ఇరువైపుల నుంచి తిరిగి నినాదాలు, గందరగోళం మొదలయ్యాయి. దాంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ... అటు రాజ్యసభలోనూ దాదాపుగా ఇదే దృశ్యాలు కన్పించాయి. సభ ప్రారంభమవుతూనే ఇరు పక్షాలూ నినాదాలకు దిగాయి. వాటి మధ్యే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించాలంటూ 267(9) నిబంధన కింద కాంగ్రెస్ సభ్యులు నోటీసు అందజేసినట్టు పేర్కొన్నారు. దాని ప్రకారం ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలను పక్కన పెట్టి నోటీసు అంశాన్ని చర్చకు చేపట్టాల్సి ఉంటుంది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణకు సీపీఐ, సీపీఎం సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాల హోరు, గందరగోళం అంతకంతకూ పెరిగిపోవడంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా, అనంతరమూ అదే పరిస్థితి కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. నా వ్యాఖ్యలపై లోక్‌సభలో మాట్లాడతా స్పీకర్‌కు రాహుల్ లేఖ ‘‘భారత ప్రజాస్వామ్యం గురించి బ్రిటన్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో స్పష్టత ఇస్తా. నేను మాట్లాడేందుకు అనుమతించండి’’ అంటూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. దీనిపై ఆయన ఇప్పటిదాకా బహిరంగంగా స్పందించలేదు. మంగళవారం మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశమివ్వాలని కోరినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘‘మేమేం మాట్లాడబోయినా మైకులు కట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని లండన్‌లో చెప్పినందుకు లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాచారు’’ అని మండిపడ్డారు. రాహుల్ నివాసానికి పోలీసులు వెళ్లడాన్ని తప్పుబట్టారు. పార్లమెంట్లో తాము లేవనెత్తుతన్న అదానీ, చైనా చొరబాటు వంటి కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలా చేస్తోందన్నారు. కేసులకు బెదరను వయనాడ్ (కేరళ): పోలీసు కేసులు, రాజకీయ దాడులతో తనను భయపెట్టలేరని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘సత్యంపై నాకు విశ్వాసముంది. ఎప్పుడూ దానికే కట్టుబడి ఉన్నా. నాపై ఎంతగా దాడి చేసినా పట్టించుకోను. దాంతో, నేనెందుకు భయపడటం లేదా అన్నదే వారికిప్పుడు పెద్ద సమస్యగా మారింది’’ అని బీజేపీపై చెణుకులు విసిరారు. -
భారత వ్యతిరేకి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక టూల్కిట్లో రాహుల్ శాశ్వత భాగస్వామిగా మారాడని ధ్వజమెత్తారు. భారత్‌కు బద్ధవ్యతిరేకి అయిన జార్జి సోరోస్ భాషలోనే రాహుల్ మాట్లాడాడని మండిపడ్డాడు. మన దేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు పెద్ద కుట్ర పన్నుతున్నాయని, ఇందులో కాంగ్రెస్‌తోపాటు సోకాల్డ్ వామపక్ష ఉదారవాదులు కూడా భాగమేనని ఆరోపించారు. దేశాన్ని ద్వేషించే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాషను వాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు నడ్డా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశీ శక్తులను కోరిన రాహుల్ గాంధీ దేశ సార్వభౌమత్వంపై దాడి చేశారని, ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్‌లో జోక్యం చేసుకోవాలంటూ అమెరికా, యూరప్ దేశాలను కోరడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ ఇంకా అర్థం చేసుకోలేదని, ప్రజలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు. భారత్‌ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడాన్ని విదేశీ కుట్రదారులు పనిగా పెట్టుకున్నారని, రాహుల్ గాంధీ సైతం వారితో చేతులు కలిపాడని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై ఆయన చేసిన పనిని స్వతంత్ర భారతదేశంలో గతంలో ఏ నాయకుడూ చేయలేదని నడ్డా వెల్లడించారు. రాహుల్ ధోరణి దేశంలో ప్రతి ఒక్కరి మనసులను గాయపర్చిందని చెప్పారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు దేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా దేశ వ్యతిరేక ముఠాలు చురుగ్గా మారుతున్నాయని, భారత్‌ను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా టూల్‌కిట్‌తో ముందుకొస్తున్నాయని జేపీ నడ్డా ఆక్షేపించారు. భారత్‌లో దృఢమైన ప్రజాస్వామ్యం, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉన్నాయని, దుష్టశక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. రాహుల్ వ్యాఖ్యలు జాతివ్యతిరేకం కాదు : శశిథరూర్ తమ నేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి జాతి వ్యతిరేకత లేదని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. భారత ప్రజాస్వామ్యంలోకి విదేశీ శక్తుల్ని రాహుల్ ఎందుకు రానిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఇండియా టుడే సదస్సులో శశిథరూర్ రాహుల్ వ్యాఖ్యలు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసేటంత ప్రధానమైనవా ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ఎన్నో ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన బీజేపీ రాహుల్ నుంచి క్షమాపణ కోరుతూ రాజకీయం చేయడం విడ్డూరమన్నారు. -
BJP: ముందు క్షమాపణ చెబితేనే..
న్యూఢిల్లీ: తీవ్ర ఆందోళనల నడుమ పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రధాన పార్టీల సభ్యుల ఆందోళనలతో వరుసగా రెండోరోజూ కూడా ఉభయ సభల నిర్వాహణ కష్టతరంగా మారింది. భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రసంగించేందుకు అనుమతిస్తామని బీజేపీ స్పష్టం చేస్తోంది. ఒకవైపు రాహుల్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రసంగంపై బీజేపీ క్షమాపణలు కోరుతోంది. మరోవైపు అదానీ-హిడెన్‌బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతపతిక్షాలు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) కూడా బీజేపీ-కాంగ్రెస్ నినాదాల నడుమ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కిందటి రోజు మైకులను ఆఫ్ చేశారు. ఇవాళ ఏమో ఏకంగా సభలనే నడవకుండా చేశారు. ప్రధాని మోదీ స్నేహితుడి(అదానీని ఉద్దేశిస్తూ..) పార్లమెంట్‌నే మూగబోయేలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ పేజీలో ట్వీట్ చేసింది. తనను మాట్లాడనిస్తే తన లండన్ ప్రసంగంపై వివరణ ఇస్తానంటూ రాహుల్ గాంధీ చెప్తుండగా.. మరోవైపు ముందు జాతికి క్షమాపణ చెబితే రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతిస్తామని చెబుతోంది. ఈ తరుణంలో పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. బ్రిటన్ లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని ఆరోపించారు. -
ప్రజాస్వామ్యంపై దారుణ దాడి
లండన్: నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్.. భారత ప్రజాస్వామ్య మౌలిక స్వరూపంపై దాడికి తెగబడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌దాకా భారత్ జోడో యాత్రగా ముందుకు కదిలామని ఆయన వివరించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం సాయంత్రం లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఐజేఏ) కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘ దేశ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం ప్రమాదంలో పడింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మోదీ సర్కార్ ముమ్మరం చేసింది. దేశం గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ యత్నాన్ని అడ్డుకునేందుకు భారత్ జోడో యాత్రగా ప్రజల వాణిని వినిపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే యాత్ర చేపట్టాం. విపక్షాల ఐక్యత కోసం సంప్రతింపులు చురుగ్గా సాగుతున్నాయి. నిరుద్యోగిత, పెరిగిన ధరలు, మహిళలపై హింసతో పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి జరుగుతోంది’ అని రాహుల్ అన్నారు. ‘ఇటీవల ముంబై, ఢిల్లీలో బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖతో సర్వే పేరిట ఆకస్మిక దాడులు చేయించి భయపెట్టి, కేంద్రం మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. బీబీసీ మోదీ సర్కార్ మాట వింటే సంస్థపై మోపిన తప్పుడు కేసులన్నీ మాయమవుతాయి’ అని ఆరోపించారు. ప్రతిష్ట దిగజార్చింది ఆయనే విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ మాట్లాడారని శుక్రవారం బీజేపీ చేసిన విమర్శలపై రాహుల్ బదులిచ్చారు. ‘ నా దేశాన్ని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అది నా స్వభావం కూడా కాదు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లి మోదీయే ఆ పనిచేశారు. గత దశాబ్దకాలంలో భారత్ అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. దేశ పురోగతికి పాటుపడిన ఇక్కడి ప్రజలను ఆయన అవమానించలేదా ? ’ అని ప్రశ్నించారు. -
అత్యంత సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యం అత్యంత సంక్లిష్ట దశలో ఉందని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఆమె ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్చార్జుల సమావేశంలో మాట్లాడారు. ఎన్డీయే సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు. వివిధ కీలక అంశాల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. హరిత విప్లవం ఫలితాలను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలు కోట్లాది రైతులు, కౌలుదారులు, కూలీల పాలిట మరణ శాసనాలేనని అన్నారు. కేంద్ర సర్కారు కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే కరోనా విజృంభిస్తోందని ఆరోపించారు. 21 రోజుల్లో కరోనాను ఓడిస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులపై అరాచకాలు పెరిగిపోయాయని, బాధితుల గొంతులను నొక్కేయడమేనా కొత్త రాజధర్మం అని నిలదీశారు. -
భారత ప్రజాస్వామ్యం అత్యుత్తమమైనది
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భారత్‌లోని ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ అత్యుత్తమమైనవని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. ఎన్నికల రాజకీయాల్లో కొంత మేరకు అర్థ బలం, అంగబలం, దొంగ ఓట్లు వంటి సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రెండున్నర లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 30 వేల మంది వరకు భద్రతా సిబ్బందికి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ శిక్షణనివ్వడం.. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన ఎస్ఈసీని, కమిషనర్ వి.నాగిరెడ్డిని గవర్నర్ అభినందించారు. శనివారం తారామతి బారాదరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ, ఇతర ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారు, చదువుకున్న వారు సైతం పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతేడాది పంచాయతీ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది, ఓటరు చైతన్యం కనబరిచిన వారికి ఎస్ఈసీ ఏర్పాటుచేసిన మొదటి ‘తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య పురస్కారాల’ను గవర్నర్ ప్రదానం చేశారు. కష్టపడితే ఫలితం వస్తుంది: ఎర్రబెల్లి కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వస్తాయని చెప్పడానికి తమ శాఖకు చెందిన అనేక మందికి ప్రజాస్వామ్య పురస్కారాలు రావడమే నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల కమిషన్ విధి నిర్వహణ చాలెంజ్‌తో కూడుకున్నదని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారని, వీటన్నింటినీ ఎదుర్కొని సజావుగా ఎన్నికలు నిర్వహించడం గొప్పవిషయమని కొనియాడారు. కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 65 నుంచి 70% వరకు పోలింగ్ నమోదైతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% ఓటింగ్ జరగ డం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ఎస్ఈసీస్ చైర్మన్, పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బిహార్ ఎస్ఈసీ ఏకే చౌహాన్, స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ఎస్ఈసీస్ కన్వీనర్, ఢిల్లీ, చండీగఢ్ ఎస్ఈసీ ఎస్కే శ్రీవాస్తవ, పలు రాష్ట్రాల ఎస్ఈసీలు పాల్గొన్నారు. పురస్కారాలు పొందిన వారిలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు ఉన్నారు. -
‘ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం’
రాయదుర్గం: ఎన్నికల్లో వ్యయం పెరగడం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమని, దీన్ని పూర్తిగా తగ్గిస్తేనే ప్రజాస్వామ్యం ఆశించిన స్థాయిలో విజయవంతమవుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్, ఐఎస్బీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ వార్షిక సదస్సుల సిరీస్‌లో భాగంగా ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’అనే అంశంపై 2 రోజుల చర్చా కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ డిస్కషన్లో ‘ఆర్గనైజేషనల్ బర్డన్ ఆన్ పొలిటికల్ పార్టీస్’అనే అంశంపై జరిగిన చర్చకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభలో అత్యధికంగా కోటీశ్వర్లు ఉన్నట్లు పత్రికల్లోనే వస్తున్నాయని అన్నారు. అయిదేళ్ల పదవీకాలం తర్వాత కొందరి ఆస్తులు 500 రెట్లు పెరిగాయని మనం వింటున్నామని తెలిపారు. ఢిల్లీలో తాను పాల్గొన్న ఓ సమావేశంలో మాజీ ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఒక ఎంపీ ఎన్నికల్లో రూ.50 కోట్లు వ్యయం చేశారని, ఒక మహిళ కూడా రూ.50 కోట్ల వరకు వ్యయం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు వెల్లడించారు. ప్రముఖులు ఎవరేమన్నారు.. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే అంశంపై అంతటా చర్చ జరగాలని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో 2018, 2019లో నిర్వహించిన ఎన్నికల్లో డబ్బు, మద్యం గణనీయంగా పట్టుబడిందని తెలిపారు. ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటి వాటిని సులభంగా అరికట్టవచ్చని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు ఇచ్చే నిధులపై నిషేధం విధించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలమని, కేడర్‌పై చేసే వ్యయం ఏమాత్రం భారం కాబోదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలను నడపడం వ్యయంతో కూడుకున్న ప్రక్రియగా మారిందని ఎంపీ రాజీవ్‌గౌడ తెలిపారు. స్థానిక సంస్థలకు పార్టీయేతర ఎన్నికలు పెడితే గ్రామీణ స్థాయిలో డబ్బు ప్రభావం గణనీయంగా తగ్గే అవకా«శం ఉందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె మాధవరావు అభిప్రాయపడ్డారు. సమావేశంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భారత్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది
వాషింగ్టన్ : భారత్ ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం విషయంలో(సీఏఏ) తాము స్పందించిన తీరులో ఎటువంటి మార్పు ఉండబోదని అమెరికా స్పష్టం చేసింది. అయితే దేశంలోని అంతర్గత చర్చల తర్వాతే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించారని అమెరికా దౌత్యవేత్త తెలిపారు. మైనారిటీ వర్గాల పరిరక్షణకు తాము నిరంతరం పాటుపడతామని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో తెలిపారు. బుధవారం వాషింగ్టన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాంపియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాంపియో మాట్లాడుతూ.. భారత్‌లో ప్రజాస్వామ్య చర్చలు హేతుబద్దంగా జరుగుతాయని పేర్కొన్నారు. భారత్ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని కొనియాడారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ పాల్గొన్నారు. భారత్‌కు సంబంధించిన విషయాలపైనే కాక ప్రపంచంలోని అనేక సమస్యలపై అమెరికా స్పందించిందని పాంపియో స్పష్టం చేశారు. అనంతరం పౌరసత్వ చట్టం ప్రజాస్వామ్యాన్ని, మతపరమైన హక్కులను కాపాడడానికి ఏ మేరకు ఉపయోగపడుతుందోనని పాంపియో ప్రశ్నించగా.. ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన మైనారిటీలపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని, భారత్‌లో మైనారిటీలకు రక్షణ కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని జయశంకర్ సమాధానం ఇచ్చారు. -
ఇది పేదలను పట్టించుకోని ప్రజాస్వామ్యం
పశ్చిమ బెంగాల్ గవర్నర్, మహాత్మాగాంధీ, రాజగోపాలాచారి మనవడు, ప్రముఖ జీవిత చరిత్ర కారుడు, మేధావి రాజమోహన్ గాంధీ విజయవాడ విచ్చేసిన సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అడ్లూరి రఘురామరాజు సాక్షి పాఠకులకోసం ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు, ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి సాధారణంగానూ, భారత్‌లో ప్రజాస్వామ్యంపై ప్రత్యేకంగానూ మీ అభిప్రాయాలు వివరించండి.ప్రజాస్వామ్యంపై మహాత్మాగాంధీ అభిప్రాయాలను తెలుపండి గ్లోబల్‌గా మారిపోయిన ప్రపంచం ఇప్పుడు, ఇటీవలి సంవత్సరాల్లో ట్రైబల్‌గా మారిపోయింది. దేశం తర్వాత దేశంలో రాజకీయనాయకులు తమ దేశం ప్రతిఒక్కరిదీ కాకుండా కొద్ది గ్రూపుల స్వంతమై ఉందనే భావాన్ని ముందుకు తెస్తున్నారు. అమెరికాను మళ్లీ వెనక్కు తీసుకెళదాం అంటున్న ట్రంప్ అమెరికా శ్వేత ప్రజలు తమ దేశాన్ని మళ్లీ నల్లజాతి ప్రజలనుంచి, స్పానిష్ మాట్లాడే అమెరికన్ల నుంచి, ఆసియన్ అమెరికన్ల నుంచి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే భావాన్ని ప్రతిపాదిస్తున్నారు. నల్లవారు, శ్వేతేతరులు అమెరికన్లు కాదని చెబుతున్న ఆయన అభిప్రాయం ప్రతి ప్రజాస్వామిక నియమాన్నే కాకుండా అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తోంది. ఇక్కడ భారత్‌లో కూడా అదేవిధమైన ప్రకటనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆలోచన గాంధీ, మన స్వాతంత్య్రోద్యమం పునాదులనే పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పైగా ఇది మన రాజ్యాంగానికే అభాస. ప్రతి భారతీయుడికీ భారతదేశం సమానంగా చెందుతుందన్నది గాంధీ 1909లో హింద్ స్వరాజ్ అనే శక్తివంతమైన రచన చేసినప్పటి నుంచే పెట్టుకున్న స్థిరమైన అభిప్రాయం. ఇక ప్రజాస్వామ్యం, అభివృద్ధి విషయానికి వస్తే, ధనబలం ఎన్నికలను ప్రభావితం చేస్తున్నప్పుడు అభివృద్ధి అంటే ఇప్పటికే ధనవంతులైన వారిని మరింత ధనవంతులుగా చేస్తుందనే అర్థం. నేడు మానవ వనరులతో సహా సహజ వనరులను ఆలోచనారాహిత్యంతో ఉపయోగిస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వికలాంగులు, రోగులు, గ్రామీణులు, పేదలు, నిర్వాసితులు, మహిళలు, పిల్లలు తదితరులకు సహకరించని అభివృద్ది ఇప్పటికే బలంగా ఉన్నవారికి, సంపన్నులుగా ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సహజ వనరులను జాగ్రత్తగా, వివేకంతో ఉపయోగించుకోవడానికి బదులుగా వాటిని విచ్చలవిడిగా కొల్లగొడుతున్నట్లయితే భవిష్యత్తు ఇప్పటికంటే భయంకరంగా మారిపోతుంది. ఈ వాస్తవం గురించి జాగరూకత పెరుగుతోంది. మనలో ప్రతి ఒక్కరూ మన అభివృద్ధి చట్రాన్ని తిరగదోడి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ భారతంలో విద్య, వైద్య స్థాయిలను పెంచుతూ, మన సహజవనరులను భూమి, నీరు, అడవులు, మానవ నైపుణ్యాలను పరిరక్షించేలా ఉద్యమాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. నేటివరకు గాంధీ ప్రవచించిన గ్రామస్వరాజ్ ఊహాస్వర్గం గానే ఉంటూ వస్తోందా? కొంతమంది గ్రామస్వరాజ్యాన్ని ఊహాస్వర్గం అని పిలుస్తూండవచ్చు. కానీ మన గ్రామాల్లో జీవితాన్ని పునరుద్ధరించని సుసంపన్న భారత్ గురించిన స్వప్నమే పూర్తిగా ఊహాస్వర్గం అని చెప్పాలి. భారత్‌లోని కోట్లాది మంది ప్రజలందరూ ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లవచ్చు అని ఆలోచించేవారు తమ మెదడును పరీక్షించుకోవలసి ఉంది. పైగా ఈ అన్ని నగరాలూ ఇప్పటికే నివాసయోగ్యం కాకుండా పోయాయి. అందుకే మన గ్రామాల్లోని జీ వితాన్ని పునరుద్ధరించడమనేది ఈ రోజు యుద్ధప్రాతిపదికపై చేయాల్సిన విధి. ఆధునిక దక్షిణ భారతదేశంపై మీరు ఇటీవల ప్రచురించిన ’’ఎ హిస్టరీ ఫ్రమ్ ది 17త్ సెంచరీ టు అవర్ టైమ్స్’’ గురించి క్లుప్తంగా మా పాఠకులకు చెబుతారా? ప్రాచీన చరిత్ర గురించి రెండు ముక్కల్లో చెప్పడం సాధ్యం కాదు కదా? కానీ, ఆంధ్ర, తెలంగాణ ప్రజలు దక్షిణ భారత దేశం గురించిన ఈ నాలుగు శతాబ్దాల చిత్రణను తప్పకుండా చదువుతారని భావిస్తాను. ఈ పుస్తకరచనలో రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు స్నేహితులు నాకు ఎంతగానో సహకరించారు. దక్షిణభారత్ గురించి అధ్యయనానికి నోచుకోని పరిణామపూర్వక సందర్భాలను పునశ్చరణ చేయడమే నా ప్రాజెక్టు లక్ష్యం. 17, 18, 19, 20 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశం ఎలా ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన ఏ పాలకులనుంచి బ్రిటిష్ పాలకులు తమ ఆధిపత్యాన్ని స్థిరపర్చుకున్నారు? బ్రిటన్ ఆక్రమణను అడ్డుకోవడానికి ఇక్కడి పాలకులు చేతులు కలపడానికి ప్రయత్నించారా? ఈ ప్రాంతంలోని అనేక కులాలు, భాషా బృందాల మధ్య ఎలాంటి సంబంధాలు ఏర్పడ్డాయి? వేరుగా ఉన్నప్పటికీ రాజకీయ స్వాతంత్య్రం, సామాజిక న్యాయం కోసం ఇక్కడి పోరాటాలు ఎలా రూపుదిద్దుకున్నాయి? నాలుగు శతాబ్దాల కాలంలో దక్షిణ భారత్‌ను మార్చిన గుర్తించదగిన ఉద్యమాల్లో స్త్రీపురుషుల పాత్ర ఎలాంటింది? అఖిల భారత స్థాయిలో నాయకత్వం కోసం దక్షిణ భారతదేశం గట్టిగా ప్రయత్నిస్తోందా?ఆధునిక దక్షిణ భారత్‌కి ఒక విశిష్టమైన గుణం ఉందా ఇలాంటి ప్రశ్నలే నేను ఈ పుస్తకంలో సంధించాను. పండితులు నా సమాధానాలను విమర్శిస్తారని, నేను లేవనెత్తని ప్రశ్నలను సంధిస్తారని ఆశిసున్నాను. తాము ఇప్పటికే చేస్తున్న పనికి అదనంగా జోడించాల్సిన రంగాలను కనుగొనడానికి కొంతమంది యువ, ప్రతిభావంతులైన రచయితలు, స్కాలర్లు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వారికి ఏం సూచిస్తారు? పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలు (గాంధీ, పటేల్, రాజాజీ, దర్బార్ గోపాల్‌దాస్, జిన్నా) రాసిన అనుభవంతో నేను జీవిత చరిత్రలు రాయాలనే సూచిస్తాను. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వారి వారి జీవితాలనుంచి శక్తివంతమైన గాధలను చెప్పగలరు. ఒక పరిశోధకుడు లేక రచయిత మరొక వ్యక్తి గురించి తీవ్రంగా ఆసక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవిత చరిత్ర రాయడమే విలువైనదిగా ఉంటుంది. 1972లో లండన్‌లోని ఒక స్కాలర్ నాకు జీవిత చరిత్ర రచన గురించి రెండు చిట్కాలు సూచించారు. ఒకటి మీరెన్నుకున్న అంశంపై సహానుభూతి, రెండు అతడిని లేక ఆమెను విమర్శించాలని భావించడం. అలాగే చరిత్ర ప్రత్యేకించి చిన్న, పెద్ద ప్రాంతాల చరిత్ర చాలా ఆసక్తికరమైనది. అవిభాజ్య పంజాబ్ గురించి నేను 2013లో నేను రాసిన పుస్తకం ప్రచురించిన తర్వాత చాలామంది దాన్ని ఆదరించారు. దాంతో నేను మరింత పెద్దదైన దక్షిణ భారత్ చరిత్ర గురించి రాయాలనే కుతుహలం పెరిగింది. నిజానికి అవి అసాధారణమైన, అనూహ్యమైన, మరువలేని పరిణామాలను క్రోడీకరించినట్లయితే జిల్లా, తాలూకా, పట్టణం, గ్రామం వంటి వాటి చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఎ.రఘురామరాజు -
భారత్‌లో ప్రజాస్వామ్యం పతనం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత దేశంలో ప్రజాస్వామ్య ప్రమాణాలు దారుణంగా పడిపోతూ వచ్చాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. భారత్ ఉదార ప్రజాస్వామ్య సూచికలో 2010 నుంచి అతి స్వల్ప పతనం కనిపించగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భారీ పతనం ప్రారంభమైందని అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రజాస్వామ్య సూచికలో ప్రస్తుతం భారత స్థానం 81 అని నివేదిక పేర్కొంది. దక్షిణాసియాలో శ్రీలంక, నేపాల్‌కన్నా వెనకబడి పోవడం గమనార్హం. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ యూనివర్శిటీ పొలిటికల్ విభాగానికి చెందిన 2,500 మంది నిపుణుల బృందం ఈ అధ్యయనాన్ని జరిపింది. స్వేచ్చా, స్వతంత్య్ర పరిస్థితుల మధ్య ఎన్నికలు జరిగాయా లేదా?, ప్రభుత్వ సంస్థలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి సమతౌల్యంగా పనిచేస్తున్నాయా, లేదా?, వ్యక్తిగత మానవ హక్కులు, సంస్థాగత హక్కులు ఎలా అమలు జరుగుతున్నాయి? రెండింటి మధ్య సమతౌల్యత ఉందా, లేదా? అన్న పలు అంశాల ప్రాతిపదికన ఈ అధ్యయనం చేశారు. భారత దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలోనే జరిగాయని అధ్యయనం అభిప్రాయపడింది. మోదీ ప్రభుత్వం కాస్త అధికార కేంద్రీకృత ధోరణిలో పనిచేస్తోందని అధ్యయనం పేర్కొంది. మోదీ హయాంలో ప్రధానంగా మీడియాపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి. దేశంలో భావ ప్రకటన స్వాతంత్య్రం కూడా 2014 నుంచి 27 శాతం పడిపోయిందని అధ్యయనం తెలిపింది. అలాగే పౌర సంస్థల సామాజిక కార్యక్రమాలు బాగా స్తంభించిపోయాయని, దేశంలో ప్రధానంగా మానవ హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న దాదాపు 20 వేల సంస్థల (ఎన్జీవోలు) లైసెన్స్‌లను ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కంట్రీబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్) కింద మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం 13 వేల సంస్థలు మాత్రమే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఫలితంగా దేశ ప్రజాస్వామ వ్యవస్థలో సామాజిక సంస్థల పాత్ర పతనమైందని పేర్కొంది. 1975–77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పటికీ దేశంలో రాలేదని, ప్రజాస్వామ్య ప్రమాణాలు మరింతగా పడిపోతుంటే ఆనాటి పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అధ్యయన బృందం వ్యాఖ్యానించింది. ఒక్క భారత్‌లోనే కాకుండా బ్రెజిల్, రష్యా, టర్కీ, అమెరికా దేశంల్లో కూడా ప్రజాస్వామ్య ప్రమాణాలు పడిపోయాయని అధ్యయనం తెలిపింది. -
వర్సిటీల్లో భయానక వాతావరణం ప్రమాదకరం
నోబెల్ బహుమతి గ్రహీత ఆమర్త్యసేన్ న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో భయానక వాతావరణం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విమర్శనాత్మక ప్రసంగాలు చేసే ప్రొఫెసర్లు తదితరులపై చర్యలు తీసుకోవడం సమకాలీన భారత్‌లో స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో తన ‘సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా సేన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వాహక హక్కులు ఉన్నంత మాత్రానా ప్రభుత్వమే అన్నీ తానై వ్యవహరించరాదని సూచించారు. విధాన రూపకల్పనల్లో సమానత్వం కోసం చేయాల్సిన ప్రయత్నాలు నీరుగారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నారని, దీని వల్ల సోదరభావం పెంపొందించడం అవరోధంగా మారిందన్నారు. ఆరోగ్య రంగం వృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. చైనా తన జీడీపీలో 2 శాతం ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తుంటే భారత్‌లో మాత్రం 1 శాతం కన్నా తక్కువ వెచ్చిస్తున్నారని అమర్త్యసేన్ తెలిపారు. -
ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
ప్రధాని ఇందిరాగాంధీ.. ఈ పేరు వింటే ఒక ఉక్కు మహిళ గుర్తొస్తుంది. అత్యంత ధైర్యసాహసాలు కలిగిన ప్రధానిగా ఆమెకు ఎంతో పేరుంది. ఇందిర హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆమె ఖ్యాతిని ఉన్నత శిఖరానికి తీసుకెళ్లాయి. కానీ అధికారం మహా చెడ్డది. దానికి అలవాటు పడినవాళ్లు ఎంతకైనా తెగిస్తారనడానికి ఇందిరాగాంధీనే ఉదాహరణ. ఆమె అధికార దాహానికి నిదర్శనమే దేశ చరిత్రలో బ్లాక్‌డేగా మిగిలిన ఎమర్జెన్సీ. ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు మాయని మచ్చలా మిగిలిన ఎమర్జెన్సీని ఇదేరోజు (1975 జూన్ 25న) విధించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీపై పోటీచేసి ఓడిపోయిన రాజ్‌నారాయణ్ అనే సోషలిస్ట్ నేత ఇందిర ఎన్నిక చెల్లదంటూ కోర్టులో కేసు వేశారు. ఆమె అధికార దుర్వినియోగం చేసి గెలిచారని రాజ్‌నారాయణ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ సిన్హా ఇచ్చిన తీర్పు చరిత్రను మలుపు తిప్పింది. 1975 జూన్ 12న ఇందిర ఎన్నిక చెల్లదంటూ కోర్టు స్పష్టం చేసింది. ఆ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించడమే కాకుండా ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇందిరా గాంధీపై నిషేధం విధించింది. ఈ తీర్పు రాజకీయంగా పెను తుపాను సృష్టించింది.అధికారం లేకుండా ఉండలేని ఇందిర తన ఎన్నిక చెల్లదంటూ కోర్టు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకపోయారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయ స్థానం కూడా కింది కోర్టు తీర్పును సమర్థించింది. దాంతో చేసేది లేక పదవి వదులుకోలేక ఎమర్జెన్సీ వైపు మొగ్గు చూపారు. ఇష్టారాజ్యంగా.. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇందిరా గాంధీ తన అననూయులతో సమావేశమై చకాచకా పావులు కదిపారు. ఈ విషయాన్ని తన మంత్రి వర్గ సహచరులకు తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ ముసాయిదాను సిద్ధం చేసి అర్ధరాత్రి రాష్ట్రపతి ఆమోదం పొందారు. దాంతో దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల అరెస్ట్‌లకు ఆదేశాలు వెళ్లాయి. ప్రాథమిక హక్కులను పూర్తిగా కాలరాశారు. పత్రికలపై సెన్సార్షిప్ విధించారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రభుత్వపరంగా జరిగిన దాషీ్టకం అంతాఇంతా కాదు. ఇందిర రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఆ కాలంలో రాజ్యాంగేతర శక్తిగా మారారు. దాదాపు రెండేళ్ల పాటు కొనసాగిన ఈ చీకటి రోజులకు 1977 మార్చి 21తో తెరపడింది. ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు ఇందిర ప్రకటించారు. ఇందుకు ఆమె తర్వాత జరిగిన ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఎమర్జెన్సీకి ప్రతీకారంగా ఆమె పార్టీని ప్రజలు దారుణంగా ఓడించారు. తిరిగి అధికారంలోకి.. ఇందిరా గాంధీని ఓడించి అధికారారంలోకి వచ్చిన జనతా పార్టీ స్వాతంత్య్రానంతరం ఏర్పడిన తొలి కేంద్ర కాంగ్రేసేతర పార్టీగా చరిత్ర సృష్టించింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జయప్రకాష్ నారాయణ్ కలలు కన్న సంపూర్ణ విప్లవం వాస్తవ రూపం దాల్చకుండానే ‘జనత ప్రయోగం’ విఫలమైంది. రాజకీయ స్వలాభాల కోసం చేతులు కలిపిన పార్టీలు అదే స్వార్థంతో కత్తులు దూసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఫలితంగా ఇందిరకు రాజకీయ పునర్జన్మ లభించింది. ముక్కలు చెక్కలయిన జనతా పార్టీని ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మట్టి కరిపించారు. ఏ ప్రజలైతే ఎమర్జెన్సీ కారణంగా తిరస్కరించారో.. తిరిగి మళ్లీ వారే ఇందిరా గాంధీకి అధికారం అప్పగించారు. మూడు ఎమర్జెన్సీలు.. మనదేశం స్వాతంత్య్రం పొందాక మూడుసార్లు అత్యవసర పరిస్థితులను చవిచూసింది. 1962 అక్టోబర్ 26 నుంచి 1968 జనవరి 10 వరకు భారత్–చైనాల మధ్య చెలరేగిన యుద్ధం కారణంగా ఎక్ట్సర్నల్ ఎమర్జెన్సీ విధించారు. అలాగే 1971 డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు ఇండో పాక్ వార్ సందర్భంగా అత్యవసర పరిస్థితి తలెత్తింది. మూడోసారి ఇందిరాగాంధీ హయాంలో దేశ భద్రత, ఆంతరంగిక కల్లోలాలను బూచిగా చూపించి 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీఅమల్లోకి తెచ్చారు. అయితే మొదటి రెండూ అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇందిరా గాంధీ తెచ్చిన అత్యవసర పరిస్థితి మాత్రం ప్రజలకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. మారిన మనిషిగా.. ప్రధాని అయిన తర్వాత ఇందిరలో మునుపటి తెంపరితనం తగ్గిపోయింది. విద్వేష పూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ప్రతీకార రాజకీయాలను పక్కన పెట్టేశారు. కానీ ఆమె దురదృష్టం.. ప్రజలు ఇచ్చిన రాజకీయ పునుర్జన్మను పూర్తిగా వినియోగించుకోలేక పోయారు. పదవీ కాలం పూర్తికాక ముందే అంగరక్షకుల తుపాకీ తూటాలకు బలైపోయారు. భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఇందిరాగాంధీ తన జీవితకాలంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. అధికారం చేతిలో ఉందికదా! ఏం చేసినా చెల్లుతుందనుకునే వారికి ఇందిర జీవితమే ఒక ఉదాహరణ. ప్రజలు కొందరిని కొన్నాళ్లు నమ్ముతారు. అందరినీ ఎల్లకాలం నమ్మరు. -
మార్పు అంకెల గారడీ కాదు: మోడీ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం భారత డీఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మార్పు ప్రజల విశ్వాసానికి సంబంధించినదని చెప్పారు. దేశవ్యాప్తంగా అంతర్గతంగా ఏకాభిప్రాయం రాకపోతే మార్పు జరగదన్నారు. ఆదివారమిక్కడ నిర్వహించిన బీజేపీ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆశావాద దృక్పథంతో ఈసారి ఎన్నికలు జరిగాయన్నారు. ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చుకోవడం కోసం ప్రజలు మార్పు తెచ్చారని అభిప్రాయపడ్డారు. మనం చేసే పనులను బట్టి ప్రపంచం మనల్ని అంచనా కడుతుందన్నారు. ఒక్క తాటిపై నడిచే జాతి ప్రపంచంపై ప్రభావం చూపగలుగుతుందన్నారు. ఎన్నికల్లో మార్పు అన్నది అంకెల గారడీ కాదని స్పష్టం చేశారు. ఎన్నికల తీరును విశ్లేషించేందుకు విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని సూచించారు. సమగ్ర విశ్లేషణలు ప్రపంచం ముందు ఉంచాలన్నారు. -
నేడే ‘పాంచ్’ పటాకా
తొమ్మిది దశల 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు విడతలు పూర్తయ్యాయి. వందకు పైగా నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. దాదాపు అంతటా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ ప్రక్రియలో పాలుపంచుకున్నారు. ఊహించని స్థాయిలో భారీగా పోలింగ్ నమోదయింది. ఇది క్షేత్రస్థాయిలో వేళ్లూనుకుపోయిన ప్రజల సాధికారతకు, భారత ప్రజాస్వామ్యంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఐదో విడత పోలింగ్: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యే రోజు ఇది. ఢిల్లీ పీఠం అటో, ఇటో.. ఎటో తేల్చే ఓటు పడేదీ ఈ రోజే. 12 రాష్ట్రాల్లోని 121 స్థానాల్లో నేడు (ఏప్రిల్ 17) ఐదో దశ పోలింగ్ జరగనుంది. పైనున్న జమ్మూ, కాశ్మీర్ నుంచి దక్షిణాన కర్ణాటక, మధ్య భారతంలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ ప్రాంతంలోని మహారాష్ట్ర, ఎడారి రాష్ట్రం రాజస్థాన్, తూర్పున పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, తూర్పు తీరాన ఒడిశా, ఈశాన్యాన మణిపూర్, ఉత్తరాన ఉత్తరప్రదేశ్.. ఇలా భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ రోజు పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్‌లలో తమ గాలి బలంగా వీస్తోందని బీజేపీ.. కర్ణాటక, యూపీలపై నమ్మకంతో కాంగ్రెస్‌లు ఉన్నాయి. ఒడిశాలో నవీన పట్నాయక్ మాయాజాలంతో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేడీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. బెంగాల్‌పై వామపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తున్న మరో మార్పు.. భారీ ఓటింగ్ శాతం. ముఖ్యంగా కొత్తగా ఓటర్లైన యువత ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. వారి మొగ్గు ఎటువైపన్న విషయం కూడా కీలకమే. మొత్తం 9 విడతల సార్వత్రిక పోరులో నేటితో 232 స్థానాల్లో పోలింగ్ పూర్తవనుంది. పోలింగ్ శాతం భారీగా పెరగడాన్ని ఎవరికి వారు తమకనుకూలంగా చెప్పుకుంటున్నారు. ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతను ఇది ప్రతిబింబిస్తోందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని బీజేపీ అంటుండగా.. యూపీఏ పాలన కొనసాగాలన్న ప్రజల ఆకాంక్షను భారీగా పెరిగిన పోలింగ్ చూపిస్తోందని, మోడీ గాలి భ్రమేనన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోందని కాంగ్రెస్ విశ్లేషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ల వాదనను రుజువు చేసే ఆధారాలేవీ లేవు. పోలింగ్ శాతం పెరగడానికి ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు కారణం కావచ్చు. అంతేకానీ ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొనడానికి ఇదీ కారణం అని కచ్చితంగా చెప్పడం అజ్ఞానం, అమాయకత్వమే అవుతుంది. ఢిల్లీ, ఢిల్లీ చుట్టుపక్కలా పోలింగ్ శాతం పెరగడానికి మొదటిసారి ఓటేస్తున్న వారి సంఖ్య భారీగా పెరగడం, ఎన్నికల సంఘం, ఆర్డబ్ల్యూఏ లాంటి సంస్థలు చేపట్టిన అవగాహన, చైత్యన్య కార్యక్రమాలు కారణం కావచ్చు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్ మత కలహాల నేపథ్యంలో మతం ప్రాతిపదికన అక్కడి ఓటర్లు రెండుగా చీలడం వల్ల అక్కడ పోలింగ్ శాతం భారీగా పెరిగిందని భావిస్తున్నారు. ఏడునెలల క్రితం ముజఫర్‌నగర్‌లో జరిగిన తీవ్రస్థాయి హింసను ఇంకా అక్కడి ఓటర్ల వురువలేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సంస్కరించడం, బోగస్ ఓటర్లను ఏరివేయడం ద్వారా ఎన్నికల సంఘం చేపట్టిన సంస్కరణలు పోలింగ్‌లో పాల్గొంటున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. - ప్రవీణ్ రాయ్ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) 12 రాష్ట్రాలు.. 121 స్థానాలు 2009లో ఎవరికెన్ని? ఈ 121 స్థానాల్లో 2009లో కాంగ్రెస్ 37, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలు 6 స్థానాల్లో, బీజేపీ 44, ఆ పార్టీ మిత్రపక్షాలు 5 సీట్లలో గెలుపొందాయి. వామపక్షాలు 4, బీఎస్పీ 1, ఎస్పీ 4, ఇతరులు 20 స్థానాల్లో విజయం సాధించాయి. అంటే మొత్తంమీద సింహభాగం సీట్లను కాంగ్రెస్, బీజేపీ పక్షాలు సొంతం చేసుకోగా, మిగిలిన 24% సీట్లను ఇతరులు, ఇతర ప్రాంతీయ పార్టీలు గెల్చుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఈ స్థానాల్లో యూపీఏ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్డీయేకు ఉపకరిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. జార్ఖండ్ ఓటర్లు-85,25,179, అభ్యర్థులు-106, మహిళా అభ్యర్థులు-7 జార్ఖండ్‌లో దక్షిణ ప్రాంతంలోని 4, ఉత్తర ప్రాంతంలోని 2 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. వీటిలో 3 చోట్ల ముస్లిం ఓటర్లు 10% పైగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో వీటిలో బీజేపీ అభ్యర్థులు 4, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు తలో స్థానం గెలుచుకున్నారు. ఈసారి కూడా గత ఫలితాలే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఓటర్లు-1,85,35,994 అభ్యర్థులు-150 మహిళా అభ్యర్థులు-17 ఉత్తరప్రదేశ్‌లోని 11 స్థానాల్లో 10 రూహేల్‌ఖండ్ ప్రాంతంలో, ఒకటి అవధ్‌లో ఉన్నాయి. ఈ స్థానాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ముఖ్యంగా మొరాదాబాద్, రామ్‌పూర్ స్థానాల్లో 40%పైగా ముస్లిం ఓటర్లే. షాజహాన్‌పూర్, ఖేరీ స్థానాల్లో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లుండగా, మిగతా స్థానాల్లో 20% పైగా ముస్లిం ఓటర్లున్నారు. 2009 ఎన్నికల్లో ఈ 11 స్థానాల్లో కాంగ్రెస్, ఎస్పీలు చెరో 4 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ కేవలం 2 సీట్లే గెలుచుకుంది. ఏప్రిల్ 10 నాటి ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొన్నారు. ముజఫర్‌నగర్ మత కలహాల కారణంగా ఆ ఎన్నికల్లో ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్ లేదా బీఎస్పీకి ఓటేసి ఉండొచ్చని, అలాగే జాట్లు, ఇతర హిందువులు మొత్తంగా బీజేపీకే మొగ్గు చూపి ఉండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ నేత అమిత్‌షా, ఎస్పీ మంత్రి ఆజంఖాన్‌ల విద్వేషపూరిత ప్రసంగాల వల్ల ఓటర్లు మత ప్రాతిపదికన మరింతగా చీలిపోయారు. అయితే, ఇప్పటికే రాష్ట్రంలోని లౌకికతత్వం దెబ్బతిన్నది. ఏప్రిల్ 10 నాటి 10సీట్లు, నేటి 11 స్థానాలు మొత్తం ఈ 21 సీట్లలో ఫలితాలు ఏకపక్షంగా ఉండవచ్చు. కాంగ్రెస్, బీఎస్పీలకు అనుకూలంగానో లేదా బీజేపీకి అనుకూలంగానో ఫలితాలు ఉండొచ్చు. అయితే, జాట్/హిందూ ఓట్లు మొత్తంగా బీజేపీకే పడతాయన్నది మీడియా ఊహాగానంగానే కనిపిస్తోంది. రాజస్థాన్ ఓటర్లు-3,46,17,656, అభ్యర్థులు-239, మహిళా అభ్యర్థులు-17 బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటి రాజస్థాన్. రాజస్థాన్‌లోని 20 స్థానాల్లో నేడు పోలింగ్ జరగనుంది. 2009లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల్లోని కొన్నిట్లో ఈసారి బీజేపీ పాగా వేసే పరిస్థితి ఉంది. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రాంతంలో 5, మధ్య ప్రాంతంలో 3, పశ్చిమ ప్రాంతంలో 5, దక్షిణ ప్రాంతంలో 5, హాఢోతీ ప్రాంతంలో 2 స్థానాల్లో నేడు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జైపూర్, అజ్మీర్, బన్స్వారా, భిల్వారా, బికనీర్, చిత్తోఢ్‌గఢ్, ఝలావర్, జోధ్‌పూర్, పాలి, రాజ్సవుంద్, ఉదయ్‌పూర్, కోట, కరౌలీ-ధోల్పూర్, అల్వార్, భరత్పూర్-ఈ 15 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోరు నెలకొంది. నేడు పోలింగ్ జరిగే చోట్ల బీజేపీ రెండంకెల సంఖ్యలో సీట్లు కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. బీజేపీ రెబల్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్ పోటీలో ఉన్న బార్మేర్ సహా మిగిలిన 5 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్ధులు, బలమైన స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండటంతో బహుముఖ పోటీలు తప్పడం లేదు. బీహార్ ఓటర్లు-1,18,50,786 అభ్యర్థులు-117 మహిళా అభ్యర్థులు-9 బీహార్‌లో 7 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో మగధ ప్రాంతంలో 5, భోజ్‌పూర్ ప్రాంతంలో 2 ఉన్నాయి. జేడీయూ బలంగా ఉన్న నియోజకవర్గాలు ఇవి. 2009 ఎన్నికల్లో జేడీయూ 5, బీజేపీ, ఆర్జేడీలు చెరో స్థానంలో విజయం సాధించాయి. వీటిలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కూతురు మీసా యాదవ్ పోటీ చేస్తున్న పాటలీపుత్రపైనే అందరి దృష్టి ఉంది. ఆమెకు పోటీగా బీజేపీ తరఫున బరిలో ఉన్న రామ్‌కృపాల్ యాదవ్ గట్టి పోటీ ఇస్తున్నారు. మణిపూర్ ఓటర్లు-8,74,704 అభ్యర్థులు-8 మహిళా అభ్యర్థులు-1 ఇన్నర్ మణిపూర్ స్థానం కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన సిటింగ్ ఎంపీ తక్చామ్ మీన్యాకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో మంచి పేరున్న రంజన్‌సింగ్‌ను బీజేపీ బరిలో నిలిపింది. గత రెండు ఎన్నికల్లో మీన్యా చేతిలో ఓడిపోయిన సీపీఐ నేత మొయిరాంగ్దమ్ నారా సింగ్.. ఈసారి పోటీలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ ఓటర్లు-45,58,873 అభ్యర్థులు-50 మహిళా అభ్యర్థులు - 5 కాంగ్రెస్ కన్నా బీజేపీ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్న రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్. ఛత్తీస్‌గఢ్‌లో నేడు రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2009 ఈ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి వీటిలో మహాసముంద్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగీ బరిలో ఉండటమే దానికి కారణం. పశ్చిమబెంగాల్ ఓటర్లు-60,23,258, అభ్యర్థులు-47, మహిళా అభ్యర్థులు 3 కూచ్‌బీహార్, జాల్పాయిగుడి, అలీపూర్‌దువార్, డార్జిలింగ్ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో మొదటి రెండింటిని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2009లో డార్జిలింగ్ నుంచి బీజేపీ తరఫున జశ్వంత్ సింగ్ గెలిచారు. ప్రస్తుతం ఆయనను పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మిగతా మూడు స్థానాలను వామపక్షాలు(కూచ్‌బీహార్- ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాల్పాయిగుడి- సీపీఎం, అలీపూర్‌దువార్- రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న స్థానాల్లో డార్జిలింగ్ ఒకటి. ఇక్కడి నుంచి తృణమూల్ తరఫున ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భాటియా, బీజేపీ నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ అహ్లూవాలియా, సీపీఎం తరఫున సమన్ పాఠక్‌లు బరిలో ఉన్నారు. ప్రత్యేక గూర్ఖా రాష్ట్ర ఏర్పాటును హామీ ఇస్తూ బీజేపీ ఇక్కడ ముందంజలో ఉంది. అయితే దాన్ని మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తమ్మీద ఈ 4 స్థానాల్లో వామపక్షాలు కనీసం 3 స్థానాలు గెలుచుకుంటాయని అంచనా. ఒడిశా ఓటర్లు 1,53,41,460 అభ్యర్థులు 98 మహిళా అభ్యర్థులు 11 ఇక్కడ 11 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో ఇవే చివరి దశ ఎన్నికలు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఇక్కడ బలమైన పార్టీ. 2009లో ఆ పార్టీ 9 స్థానాలు గెలుచుకుని తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మిగతా రెండు స్థానాలను కాంగ్రెస్(బాలాసోర్), సీపీఐ(జగత్సింగ్పూర్)లు పంచుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 21 స్థానాల్లో అత్యధిక సీట్లను ఈ సారి కూడా బీజేడీనే గెలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఇక్కడ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మెజారిటీ స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని భావిస్తున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం బీజేడీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని తెలుస్తోంది. సీఎంగా నవీన్ పట్నాయక్ పనితీరు, ఆయన ఇమేజ్ బీజేడీకి అనుకూల అంశాలుగా పరిణమించాయి. కర్ణాటక ఓటర్లు-4,62,11,844 అభ్యర్థులు-434, మహిళా అభ్యర్థులు-21 కర్ణాటక రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఈ రోజే పోలింగ్ జరుగుతుంది. 2009 ఎన్నికల్లో బీజేపీ 19 సీట్లు కైవసం చేసుకుని ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 6, జేడీఎస్ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇంకా లోతుగా విశ్లేషిస్తే.. ముంబై- కర్ణాటక ప్రాంతంలోని మొత్తం 6 స్థానాలు.. చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బీజాపూర్, హవేరి, ధార్వాడ్లను బీజేపీ గెలుచుకుంది. హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గా, బీదర్లను కాంగ్రెస్.. రాయచూర్, కొప్పల్లను బీజేపీ గెలుచుకున్నాయి. ఈ స్థానాల్లో 10 శాతానికి పైగా ముస్లిం ఓటర్లున్నారు. కర్ణాటక తీర ప్రాంతంలోని 3 నియోజకవర్గాలు- ఉత్తర కన్నడ, ఉడుపి- చిక్‌మగళూరు, దక్షిణ కన్నడలను 2009లో బీజేపీనే గెలుచుకుంది. కాకపోతే మెజారిటీ మాత్రం చాలా తక్కువ. కేవలం 2% నుంచి 4% తేడాతోనే ఈ స్థానాల్లో బీజేపీ గెలిచింది. 2009లో మధ్య కర్ణాటక ప్రాంతంలోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. ఈ ప్రాంతంలోని బళ్లారి, దావణగెరె, షిమోగా, చిత్రదుర్గ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే, దక్షిణ కర్నాటక ప్రాంతంలోని ఆరు(హాసన్, తువుకూరు, మాండ్యా, మైసూర్, చావురాజనగర్, కోలార్) స్థానాల్లో బీజేపీ ఒకటే గెలుచుకోగా, కాంగ్రెస్ 3, జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. బెంగళూరు ప్రాంతంలోని నాలుగు స్థానాల్లో బీజేపీ 2, కాంగ్రెస్, జేడీఎస్‌లు చెరో స్థానంలో గెలుపొందాయి. మహారాష్ట్ర ఓటర్లు-3,24,27,558 అభ్యర్థులు-358, మహిళా అభ్యర్థులు-24 ఈ రాష్ట్రంలో నేడు జరగనున్నవి రెండో దశ ఎన్నికలు. మొత్తం 19 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో 11 పశ్చిమ మహారాష్ట్రలో, 6 మరఠ్వాడా ప్రాంతంలో, 2 కొంకణ్ ప్రాంతంలో ఉన్నాయి. 2009లో ఈ స్థానాల్లో కాంగ్రెస్ 6, ఎన్సీపీ 4, శివసేన 5, బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మరఠ్వాడాలోని 6 స్థానాల్లో యూపీఏ, ఎన్డీఏలు చెరో 3 సీట్లు గెలుచుకున్నాయి. వీటిలో హింగోలీ, నాందేడ్, పర్భణీ, బీడ్, ఉస్మానాబాద్ నియోజకవర్గాల్లో 10% పైగా ముస్లిం ఓటర్లున్నారు. మరోస్థానం లాతూర్ ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం. పశ్చిమ మహారాష్ట్రలోని 11 స్థానాలకు గానూ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 3, ఎన్సీపీ 3, బీజేపీ 1, శివసేన 2, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఈ 11 సీట్లలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే(బారామతి), కేంద్రమంత్రి సుశీల్‌కుమార్ షిండే(షోలాపూర్), మాజీ సీఎం అశోక్‌చవాన్(నాందేడ్), గోపీనాథ్ ముండే(బీడ్) సహా 358 మంది బరిలో ఉన్నారు. ఈ స్థానాల్లో యూపీఏ, ఎన్డీఏలకు సమానంగా విజయావకాశాలున్నా.. కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండటంతో యూపీఏ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. యూపీఏ 2009 నాటి కన్నా కొన్ని స్థానాలు తక్కువగా గెలుపొందవచ్చు. మధ్యప్రదేశ్ ఓటర్లు -1,67,22,163 అభ్యర్థులు -142, మహిళా అభ్యర్థులు 11 బీజేపీ బలంగా ఉన్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వురోసారి విజయం సాధించింది. ఇక్కడ నేడు 10 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. వాటిలో 4 చంబల్ లోయ, 4 వింధ్య, 2 మాల్వా ప్రాంతాల్లో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో వీటిలో 8 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలవగలిగింది. కానీ ఈ సారి పరిస్థితి తారుమారైంది. ఈ ఎన్నికల్లో బీజేపీయే అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నాయి. జమ్మూ, కాశ్మీర్ ఓటర్లు - 14,68,886 అభ్యర్థులు-13, మహిళా అభ్యర్థులు-1 జమ్మూ, కాశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ నియోజకవర్గంలో ఈ రోజు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనతో బీజేపీ నుంచి డాక్టర్ జితేందర్ సింగ్, పీడీపీ నుంచి మొహమ్మద్ అష్రాఫ్ మాలిక్‌లు పోటీ పడ్తున్నారు. ఈ త్రిముఖ పోరులో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆజాద్ గెలుపు ఖాయమేనని కాంగ్రెస్ భావిస్తోంది. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఉధమ్‌పూర్ నియోజకవర్గంలో 17 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కిష్తవార్ జిల్లాలోని బెల్లెస్లా గ్రామానికి చెందిన ఆజాద్‌కు స్థానికుడిగా నియోజకవర్గంలో మంచి పరిచయాలున్నాయి. -
ఇంతితై వటుడింతై అన్నట్లుగా ఎన్నికల ఖర్చు