గవర్నర్ తమిళిసైకి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎర్రబెల్లి. చిత్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భారత్‌లోని ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ అత్యుత్తమమైనవని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. ఎన్నికల రాజకీయాల్లో కొంత మేరకు అర్థ బలం, అంగబలం, దొంగ ఓట్లు వంటి సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రెండున్నర లక్షల మంది ఎన్నికల సిబ్బంది, 30 వేల మంది వరకు భద్రతా సిబ్బందికి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ శిక్షణనివ్వడం.. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఇందుకు కారణమైన ఎస్‌ఈసీని, కమిషనర్ వి.నాగిరెడ్డిని గవర్నర్ అభినందించారు. శనివారం తారామతి బారాదరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ, ఇతర ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వారు, చదువుకున్న వారు సైతం పెద్దసంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతేడాది పంచాయతీ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది, ఓటరు చైతన్యం కనబరిచిన వారికి ఎస్‌ఈసీ ఏర్పాటుచేసిన మొదటి ‘తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య పురస్కారాల’ను గవర్నర్ ప్రదానం చేశారు.
కష్టపడితే ఫలితం వస్తుంది: ఎర్రబెల్లి
కష్టపడి, అంకితభావంతో పనిచేస్తే అవార్డులు వస్తాయని చెప్పడానికి తమ శాఖకు చెందిన అనేక మందికి ప్రజాస్వామ్య పురస్కారాలు రావడమే నిదర్శనమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల కమిషన్ విధి నిర్వహణ చాలెంజ్‌తో కూడుకున్నదని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారని, వీటన్నింటినీ ఎదుర్కొని సజావుగా ఎన్నికలు నిర్వహించడం గొప్పవిషయమని కొనియాడారు. కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 65 నుంచి 70% వరకు పోలింగ్ నమోదైతే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% ఓటింగ్ జరగ డం స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ఎస్‌ఈసీస్ చైర్మన్, పీఆర్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బిహార్ ఎస్‌ఈసీ ఏకే చౌహాన్, స్టాండింగ్ కమిటీస్ ఆఫ్ ఎస్‌ఈసీస్ కన్వీనర్, ఢిల్లీ, చండీగఢ్ ఎస్‌ఈసీ ఎస్‌కే శ్రీవాస్తవ, పలు రాష్ట్రాల ఎస్‌ఈసీలు పాల్గొన్నారు. పురస్కారాలు పొందిన వారిలో మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment