మార్పు అంకెల గారడీ కాదు: మోడీ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం భారత డీఎన్ఏలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మార్పు ప్రజల విశ్వాసానికి సంబంధించినదని చెప్పారు. దేశవ్యాప్తంగా అంతర్గతంగా ఏకాభిప్రాయం రాకపోతే మార్పు జరగదన్నారు. ఆదివారమిక్కడ నిర్వహించిన బీజేపీ సమావేశంలో మోడీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆశావాద దృక్పథంతో ఈసారి ఎన్నికలు జరిగాయన్నారు. ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చుకోవడం కోసం ప్రజలు మార్పు తెచ్చారని అభిప్రాయపడ్డారు. మనం చేసే పనులను బట్టి ప్రపంచం మనల్ని అంచనా కడుతుందన్నారు. ఒక్క తాటిపై నడిచే జాతి ప్రపంచంపై ప్రభావం చూపగలుగుతుందన్నారు.
ఎన్నికల్లో మార్పు అన్నది అంకెల గారడీ కాదని స్పష్టం చేశారు. ఎన్నికల తీరును విశ్లేషించేందుకు విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని సూచించారు. సమగ్ర విశ్లేషణలు ప్రపంచం ముందు ఉంచాలన్నారు.