ఎల్రక్టానిక్ డాక్యుమెంట్లు ప్రజలకు అందుబాటులో ఉండవు
సీసీటీవీ కెమెరా, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లు పొందలేరు
ఎన్నికలకు సంబంధించిన ఇతర పత్రాలు తనిఖీ చేయడానికే అనుమతి
‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961’లోని రూల్ 93లో సవరణ
వీడియోల దుర్వినియోగాన్ని అరికట్టడానికే అంటున్న ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని, అనుమానాలకు తావులేని విధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం గోప్యతకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల ప్రక్రియను మరింత గోప్యంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణతోపాటు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు(సీసీటీవీ కెమెరా ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ లాంటివి), వీడియో రికార్డింగ్‌లను సామాన్య ప్రజలు తనిఖీ చేసేందుకు వీల్లేకుండా ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేసింది.
ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961’లోని రూల్ 93లో కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం సవరణ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలను ప్రజలందరూ చూసేలా బహిరంగపర్చడానికి అవకాశం ఉండదు. ఆంక్షలు అమలవుతాయి. కాండక్డ్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్–1961లోని రూల్ 93(2)(ఎ) ప్రకారం.. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను బహిరంగపర్చాల్సిందే. ప్రజలంతా వాటిని చూడొచ్చు. తనిఖీ చేసుకోవచ్చు. కొత్తగా చేసిన సవరణ ప్రకారం.. ఎన్నికలకు సంబంధించి కొన్ని రకాల పత్రాలను మాత్రమే బహిరంగపర్చవచ్చు. ఎల్రక్టానిక్ డాక్యుమెంట్లు బహిర్గతం చేయడం నేరమవుతుంది.
⇒ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్‌లో నామినేషన్ పత్రాలు, ఎలక్షన్ ఏజెంట్ల నియామకం, ఎలక్షన్ అకౌంట్ స్టేట్‌మెంట్లు, ఎన్నికల ఫలితాల వంటివి ఉన్నాయి. వీటిని బయటపెట్టడానికి అనుమతి ఉంటుంది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో చిత్రీకరించిన సీసీటీవీ ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీ, వీడియో రికార్డింగ్‌లు ఈ నిబంధనల పరిధిలో లేవు కాబట్టి కొత్త సవరణ ప్రకారం వాటిని ప్రజలకు ఇవ్వడం సాధ్యం కాదు.
⇒ సీసీటీవీ కవరేజీ, పోలింగ్ కేంద్రాల వెబ్‌కాస్టింగ్ కూడా నిబంధనల పరిధిలోకి రాదని, అది బయటపెట్టడం నిబంధనలను అతిక్రమించడమే అవుతుందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు.
⇒ పోలింగ్ కేంద్రాల్లో చిత్రీకరించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ దుర్వినియోగమవుతోందని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
⇒ కృత్రిమ మేధ(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి కొందరు సీసీటీవీ కెమెరా ఫుటేజీని సృష్టిస్తున్నారని, ఇలాంటి ఫేక్ వీడియోలను అడ్డం పెట్టుకొని ఎన్నికల ప్రక్రియపై దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులు అంటున్నారు.
⇒ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల పత్రాలు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, వీడియోలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. సామాన్య ప్రజలు మాత్రం కోర్టు అనుమతితోనే వీటిని పొందాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.
⇒ అభ్యర్థుల విషయంలో నిబంధనల్లో ఎలాంటి సవరణ చేయలేదని, ప్రజల విషయంలోనే సవరణ చోటుచేసుకుందని పేర్కొన్నారు. ⇒ మహమూద్ ప్రాచా వర్సెస్ ఎన్నికల సంఘం కేసులో పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఇటీవల తీర్పు ఇచి్చంది. హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రూల్ 93(2) కింద అనుమతించిన అన్ని రకాల డాక్యుమెంట్లు (సీసీటీవీ కెమెరా ఫుటేజీ సహా) మహమూద్ ప్రాచాకు అందజేయాలని ఆదేశించింది.
⇒ ఎలక్షన్ పత్రాలు, డాక్యుమెంట్లు అంటే ఎలక్ట్రానిక్ పత్రాలు, వీడియో రికార్డింగ్‌లు కాదని ఈసీ అధికారులు చెప్పారు. ఈ విషయంలో సందిగ్ధానికి తెరదించడానికే నిబంధనల్లో సవరణ చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ దుర్వినియోగం కాకుండా చేయాలన్నదే అసలు ఉద్దేశమని వివరించారు.
⇒ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు మినహా ఇతర పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని కేంద్ర న్యాయ శాఖ అధికారులు చెప్పారు.
పారదర్శకత అంటే ఎందుకు భయం?: జైరామ్ రమేశ్
ఎన్నికల నిబంధనల్లో సవరణ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్నికల సమగ్రతను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అంటే ఎందుకు భయమని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘ఎన్నికల ప్రక్రియపై పూర్తి సమాచారం ప్రజలకు అందజేస్తేనే వారిలో ఎన్నికలపై విశ్వాసం పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు సహా అన్ని రకాల పత్రాలు ప్రజలకు ఇవ్వాలని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఇటీవలే తేలి్చచెప్పింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా నిబంధనల్లో హడావుడిగా సవరణ చేయడం దారుణం’’ అని జైరామ్ రమేశ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment