‘బుల్‌డాగ్‌’ తీరు వేరుగా ఉండేది! | Sakshi Guest Column On Election Commission | Sakshi
Sakshi News home page

‘బుల్‌డాగ్‌’ తీరు వేరుగా ఉండేది!

Published Mon, May 20 2024 4:28 AM | Last Updated on Mon, May 20 2024 4:28 AM

భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌

భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టి.ఎన్‌.శేషన్‌

కామెంట్‌

ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్‌ ఇంతవరకూ చర్య తీసుకోలేదు. మోదీ స్టార్‌ క్యాంపెయినర్‌ అనే బలహీనమైన కారణంతో నేరుగా ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్‌ మరొక వారం పొడిగింపునకు అంగీకరించింది. ఆ తర్వాత ఇంకొక వారం పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ప్రస్తుత కమిషనర్లు ఎన్నికల కమిషన్‌కు అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు. అదే టి.ఎన్‌. శేషన్‌ అయితే ఏం చేసి ఉండేవారు? ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా పిలిపించి ఉండేవారు.

‘‘నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటే ఉండొచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాను. మీరు చూసేదే మీకు కనిపిస్తుంది. నాలో మాత్రం ఏ పార్శా్వలూ  లేవు.’’ – ఎన్నికల కమిషన్‌ను తన పనితీరుతో ప్రశంసనీయమైన గట్టి వ్యవస్థగా తయారు చేశారని పేరుగాంచిన ఎన్నికల ప్రధాన అధికారి టి.ఎన్‌.శేషన్‌ తన గురించి తాను ఇలా చెప్పేవారు. ‘‘నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని నేను నా సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా చేస్తాను. ఏవీ నన్ను ఆపలేవు’’ అనేవారు శేషన్‌. ఇక ఆయన ‘బుల్‌డాగ్‌’ అని ముద్దుగా పేరు పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా ఇది ఆయనను ఉల్లాసపరిచిన పేరు కూడా!

దురదృష్టం... నేటి ఎన్నికల సంఘం ఎంతో భిన్నమైన జంతువులా ప్రవర్తిస్తోంది. ఈ పోలికను పొడిగించాలనుకుంటే కనుక ఇప్పుడది కాపలా కుక్క కంటే కూడా గారాల పెంపుడు కుక్కగానే ఎక్కువగా నడుచుకుంటోంది. నిష్పాక్షికత, పారదర్శకతల అవసరాన్ని అది మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇకపై తాను – కోరలతో తీవ్రంగా ప్రతిఘటించవలసిన సమయాల్లో సైతం – తన పని తాను చేయవలసి అవసరం లేదని అది నిర్ణయించుకుంది. బదులుగా, బయట పడేందుకు సులభమైన దారులను వెతుకుతోంది.      

ప్రధానమంత్రి బాంస్‌వాడా(రాజస్థాన్‌)లో ప్రసంగించి నెల దాటింది. నిజానికి నేటి నుంచి ఇంకో పదమూడు రోజులలో ఓటింగ్‌ ముగియనుంది కూడా. ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై కమిషన్‌ ఇంతవరకు చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నదో గమనించండి. 

కె. చంద్రశేఖరరావు, ఎ. రాజా, సుప్రియా శ్రీనేత్, రణ్‌దీప్‌ సూర్జేవాలా కేసులలో మాదిరిగా... మోదీకి ప్రత్యక్షంగా నోటీసు జారీ చేయకూడదని కమిషన్‌ నిర్ణయించుకుంది. బదులుగా, మోదీ స్టార్‌ క్యాంపెయినర్‌ అనే ఒక బలహీనమైన కారణంతో ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. నోటీసులో ప్రధానమంత్రి పేరును, హోదాను పేర్కొనలేదు. అనుబంధ పత్రాలలో మాత్రమే అవి ఉన్నాయి. లేఖలో కమిషన్‌ పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్‌ మరొక వారం పొడిగింపునకు వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత కూడా గడువును ఇంకొక వారానికి పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా కమిషన్‌ ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ఉద్దేశపూర్వకమైన ఈ వాస్తవ దాటవేత కాలయాపన కోసమేనని అర్థమవుతోంది. 

ఇంతకీ, ప్రధాని ఏం చేశారు? ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను వారి నుంచి లాక్కుని ముస్లింలకు ఇవ్వటం జరుగుతుందని దాదాపు ప్రతిరోజూ ఆయన పదేపదే ఆరోపిస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలను దయ్యాలుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి మంగళ సూత్రాలు, స్త్రీధనం – మీకు రెండు గేదెలు ఉంటే వాటిలో ఒకటి – మీనుంచి లాక్కుని ముస్లింలకు ఇస్తారు అని కూడా ప్రధాని అన్నారు. 

ప్రధాని జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే ఇలా అనడం నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించటమే కదా? కమిషన్‌ అధికారాన్ని లెక్కచేయకపోవటం కమిషన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవటమే కదా?

ఈ విషయంలో కమిషన్‌ చేయగలిగిందల్లా వెనక్కు జారగిలబడి కూర్చోవటం, వినటం, చేతి బొటనవేళ్లు నొక్కుకోవటం అన్నట్లే ఉంది. కమిషన్‌ ఎందుకు కఠినచర్య తీసుకోలేదు? తనకై తాను సూమోటోగా ఎందుకు ముందుకు రాలేదు? ప్రధాన మంత్రిని, కనీసం బీజేపీని ఈ కొనసాగింపు, నిజానికి ఈ నిరంతరాయమైన ఉల్లంఘనపై ఎందుకు పిలిపించలేదు? రాజ్యాంగంలోని 324వ అధికరణం కమిషన్‌కు అవసరమైన అన్ని అధికారాలనూ ఇస్తోంది. కానీ వాటిని ఉపయోగించటానికే కమిషన్‌ ఇష్టపడటం లేదు. దానర్థం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే నిబద్ధత కమిషన్‌లో కొరవడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా వ్యవహరించే నైతిక అత్యవసరత కమిషన్‌లో లోపించింది. 

అదే టి.ఎన్‌. శేషన్‌ అయితే ఏం చేసి ఉండేవారో ఒక్కక్షణం ఊహించండి. ఆయన ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా, బాహాటంగా పిలిపించి ఉండేవారు. రెండు లేదా మూడు రోజులు ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ని దూరంగా ఉంచేవారు. ఆ తర్వాత ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చి తను తీసుకున్న చర్యను సమర్థిస్తూ, వివరణ ఇచ్చేవారు. ప్రతిస్పందనగా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తక్షణం ఆగిపోయేవి.  

మనకున్న అత్యంత ప్రామాణిక చరిత్రకారులు, సూక్ష్మగ్రాహ్యత గల ప్రజా వ్యాఖ్యాతలలో ఒకరైన రామచంద్ర గుహ... ‘‘ప్రస్తుత ముగ్గురు కమిషనర్లు ఎన్నికల కమిషన్‌కు అగౌరవాన్ని, అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు’’ అని అన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కమిషన్‌ చరిత్ర రాసినప్పుడు ఆ ముగ్గురూ చరిత్రహీనులుగా గుర్తుండిపోతారని ఆయన అన్నారు. అది నిజం.   

అయితే ఈ చేదు నిజం మరింత లోతైనది. మొదట మన ప్రజాస్వామ్యానికి గాయం అయింది. ప్రపంచంలోనే మనది అది పెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు మనం గర్విస్తూ ఉంటాం. కానీ మనకు ఏదైతే గర్వకారణమై ఉన్నదో దానికి ఎన్నికల సంఘం తూట్లు పొడుస్తోంది. ప్రపంచం గమనించలేదని అనుకోకండి! పైనుంచి వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. 

అంతిమంగా, ఎలాగూ మూల్యం చెల్లించవలసింది మనమే... ‘భారత ప్రజలమైన మనం’! చర్య తీసుకోవటంలో విఫలం అవటం ద్వారా కమిషన్‌ మనందరినీ లోకువ చేసేసింది.


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement