TN Seshan
-
‘బుల్డాగ్’ తీరు వేరుగా ఉండేది!
ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఇంతవరకూ చర్య తీసుకోలేదు. మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే బలహీనమైన కారణంతో నేరుగా ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు అంగీకరించింది. ఆ తర్వాత ఇంకొక వారం పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ప్రస్తుత కమిషనర్లు ఎన్నికల కమిషన్‌కు అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారు? ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా పిలిపించి ఉండేవారు.‘‘నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటే ఉండొచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాను. మీరు చూసేదే మీకు కనిపిస్తుంది. నాలో మాత్రం ఏ పార్శా్వలూ లేవు.’’ – ఎన్నికల కమిషన్‌ను తన పనితీరుతో ప్రశంసనీయమైన గట్టి వ్యవస్థగా తయారు చేశారని పేరుగాంచిన ఎన్నికల ప్రధాన అధికారి టి.ఎన్.శేషన్ తన గురించి తాను ఇలా చెప్పేవారు. ‘‘నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని నేను నా సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా చేస్తాను. ఏవీ నన్ను ఆపలేవు’’ అనేవారు శేషన్. ఇక ఆయన ‘బుల్డాగ్’ అని ముద్దుగా పేరు పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా ఇది ఆయనను ఉల్లాసపరిచిన పేరు కూడా!దురదృష్టం... నేటి ఎన్నికల సంఘం ఎంతో భిన్నమైన జంతువులా ప్రవర్తిస్తోంది. ఈ పోలికను పొడిగించాలనుకుంటే కనుక ఇప్పుడది కాపలా కుక్క కంటే కూడా గారాల పెంపుడు కుక్కగానే ఎక్కువగా నడుచుకుంటోంది. నిష్పాక్షికత, పారదర్శకతల అవసరాన్ని అది మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇకపై తాను – కోరలతో తీవ్రంగా ప్రతిఘటించవలసిన సమయాల్లో సైతం – తన పని తాను చేయవలసి అవసరం లేదని అది నిర్ణయించుకుంది. బదులుగా, బయట పడేందుకు సులభమైన దారులను వెతుకుతోంది. ప్రధానమంత్రి బాంస్వాడా(రాజస్థాన్)లో ప్రసంగించి నెల దాటింది. నిజానికి నేటి నుంచి ఇంకో పదమూడు రోజులలో ఓటింగ్ ముగియనుంది కూడా. ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఇంతవరకు చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నదో గమనించండి. కె. చంద్రశేఖరరావు, ఎ. రాజా, సుప్రియా శ్రీనేత్, రణ్‌దీప్ సూర్జేవాలా కేసులలో మాదిరిగా... మోదీకి ప్రత్యక్షంగా నోటీసు జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించుకుంది. బదులుగా, మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే ఒక బలహీనమైన కారణంతో ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. నోటీసులో ప్రధానమంత్రి పేరును, హోదాను పేర్కొనలేదు. అనుబంధ పత్రాలలో మాత్రమే అవి ఉన్నాయి. లేఖలో కమిషన్ పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత కూడా గడువును ఇంకొక వారానికి పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ఉద్దేశపూర్వకమైన ఈ వాస్తవ దాటవేత కాలయాపన కోసమేనని అర్థమవుతోంది. ఇంతకీ, ప్రధాని ఏం చేశారు? ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను వారి నుంచి లాక్కుని ముస్లింలకు ఇవ్వటం జరుగుతుందని దాదాపు ప్రతిరోజూ ఆయన పదేపదే ఆరోపిస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలను దయ్యాలుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి మంగళ సూత్రాలు, స్త్రీధనం – మీకు రెండు గేదెలు ఉంటే వాటిలో ఒకటి – మీనుంచి లాక్కుని ముస్లింలకు ఇస్తారు అని కూడా ప్రధాని అన్నారు. ప్రధాని జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే ఇలా అనడం నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించటమే కదా? కమిషన్ అధికారాన్ని లెక్కచేయకపోవటం కమిషన్‌ను పరిగణనలోకి తీసుకోకపోవటమే కదా?ఈ విషయంలో కమిషన్ చేయగలిగిందల్లా వెనక్కు జారగిలబడి కూర్చోవటం, వినటం, చేతి బొటనవేళ్లు నొక్కుకోవటం అన్నట్లే ఉంది. కమిషన్ ఎందుకు కఠినచర్య తీసుకోలేదు? తనకై తాను సూమోటోగా ఎందుకు ముందుకు రాలేదు? ప్రధాన మంత్రిని, కనీసం బీజేపీని ఈ కొనసాగింపు, నిజానికి ఈ నిరంతరాయమైన ఉల్లంఘనపై ఎందుకు పిలిపించలేదు? రాజ్యాంగంలోని 324వ అధికరణం కమిషన్‌కు అవసరమైన అన్ని అధికారాలనూ ఇస్తోంది. కానీ వాటిని ఉపయోగించటానికే కమిషన్ ఇష్టపడటం లేదు. దానర్థం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే నిబద్ధత కమిషన్‌లో కొరవడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా వ్యవహరించే నైతిక అత్యవసరత కమిషన్‌లో లోపించింది. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారో ఒక్కక్షణం ఊహించండి. ఆయన ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా, బాహాటంగా పిలిపించి ఉండేవారు. రెండు లేదా మూడు రోజులు ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ని దూరంగా ఉంచేవారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చి తను తీసుకున్న చర్యను సమర్థిస్తూ, వివరణ ఇచ్చేవారు. ప్రతిస్పందనగా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తక్షణం ఆగిపోయేవి. మనకున్న అత్యంత ప్రామాణిక చరిత్రకారులు, సూక్ష్మగ్రాహ్యత గల ప్రజా వ్యాఖ్యాతలలో ఒకరైన రామచంద్ర గుహ... ‘‘ప్రస్తుత ముగ్గురు కమిషనర్లు ఎన్నికల కమిషన్‌కు అగౌరవాన్ని, అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు’’ అని అన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కమిషన్ చరిత్ర రాసినప్పుడు ఆ ముగ్గురూ చరిత్రహీనులుగా గుర్తుండిపోతారని ఆయన అన్నారు. అది నిజం. అయితే ఈ చేదు నిజం మరింత లోతైనది. మొదట మన ప్రజాస్వామ్యానికి గాయం అయింది. ప్రపంచంలోనే మనది అది పెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు మనం గర్విస్తూ ఉంటాం. కానీ మనకు ఏదైతే గర్వకారణమై ఉన్నదో దానికి ఎన్నికల సంఘం తూట్లు పొడుస్తోంది. ప్రపంచం గమనించలేదని అనుకోకండి! పైనుంచి వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. అంతిమంగా, ఎలాగూ మూల్యం చెల్లించవలసింది మనమే... ‘భారత ప్రజలమైన మనం’! చర్య తీసుకోవటంలో విఫలం అవటం ద్వారా కమిషన్ మనందరినీ లోకువ చేసేసింది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోట అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బరిలోకి దిగిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రికార్డు స్థాయిలో 10 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని ఆ పార్టీ అంచనావేస్తోంది.గతంలో ఈ నియోజకవర్గానికి ఎల్‌కె అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి తదితర దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచి ఈ సీటు బీజేపీకి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ తరపున గతంలో ఎన్నికల బరిలోకి దిగిన టీఎన్ శేషన్, రాజేష్ ఖన్నాలు కూడా ఈ బీజేపీ కోటను చేధించలేకపోయారు.ఈసారి అమిత్‌షాపై గుజరాత్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోనాల్ పటేల్ పోటీకి దిగారు. 2019 ఎన్నికల్లో ఐదున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో షా గెలిచారు. 10 లక్షలకు పైగా గెలుపు మార్జిన్‌ను పెంచడమే తమ పార్టీ లక్ష్యమని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 21.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్పూర్, నారన్‌పురా, సబర్మతి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అహ్మదాబాద్ ప్రాంతంలోని ఐదు అర్బన్ స్థానాలు (ఘట్లోడియా, వేజల్పూర్, నారన్‌పురా, సబర్మతి, సనంద్) సహా మొత్తం ఏడు స్థానాలను 2022 అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీజేపీ గెలుచుకుంది.1999 సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. అదే సమయంలో అతనికి ప్రత్యర్థిగా బీజేపీ అద్వానీని రంగంలో నిలిపింది. ఆ ఎన్నికల్లో శేషన్ ఓటమి పాలైనా అద్వానీకి గట్టిపోటీ ఇవ్వడంలో విజయం సాధించారు. 1991 నుండి 2014 వరకు అద్వానీ గాంధీనగర్ నుండి ఆరుసార్లు గెలిచారు.1996 లో వాజ్‌పేయి ఈ స్థానంతో పాటు లక్నో నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. ఈ నేపధ్యంలో గాంధీనగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి చెందిన విజయ్ పటేల్‌పై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది. అయితే ఖన్నా ఓటమి పాలయ్యారు. 2019లో అద్వానీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి అమిత్ షా పోటీ చేశారు. గుజరాత్లో మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరగనుంది. -
మళ్లీ కావాలి ఒక ‘సెన్సేషన్’!
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను ఆగమేఘాల మీద నియమించారన్న విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం నిశితమైన వ్యాఖ్యానాలు చేసింది. టీఎన్ శేషన్ లాంటి ఒక బాధ్యతాయుతమైన అధికారిని కోరుకుంటున్నట్టు చెప్పింది. అయితే రెండు దశాబ్దాలుగా ఏ ఒక్క కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగడం లేదు. యూపీఏ, ఎన్డీయే రెండు పాలక కూటముల హయాంలోనూ జరిగింది ఇదే. ఇంత అస్థిరంగా పదవిలో ఉండే అధికారి, ఒకవేళ అత్యంత శక్తిమంతమైన స్థానంలో ఉన్నవారి మీద ఆరోపణలు వస్తే ఏం చర్యలు తీసుకోగలరు? స్వతంత్ర ప్రతిపత్తి, విలువలు ముఖ్యమైనందున సీఈసీ నియామకానికి స్వతంత్రమైన నిర్ణయాధికారం గల ప్యానెల్ ఉండి తీరాలి. ‘‘దేశంలో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారుల (సీఈసీ), ఇతర ఎన్నికల అధికారుల (ఈసీ) నియామకాల విషయంలో రాజ్యాంగపు మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నాయి. ఇది అవాంఛనీయ పోకడ. వారి నియామకానికి ఎలాంటి ప్రక్రియనూ దేశ రాజ్యాంగం, అందులోని 324వ అధికరణ నిర్దేశించలేదు. కానీ, ఎన్ని కల కమిషనర్ల నియామకం విషయంలో చట్టం చేయాలని రాజ్యాంగం నిర్దేశించిపోయినా గత 72 ఏళ్లుగా ఆ పనిని పాలకులు చేయలేదు. ఫలితంగా ఏ ఒక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా 2004 నుంచీ ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోలేదు. ఇక పదేళ్ల యూపీఏ (కాంగ్రెస్ కూటమి) పాలనలో ఏకంగా ఆరుగురు సీఈసీలు మారి పోగా, ప్రస్తుత ఎన్డీఏ (బీజేపీ కూటమి) ఎనిమిదేళ్ల పాలనలో ఏకంగా ఎనిమిదిమంది సీఈసీలను మార్చేశారు. ఈ పరిస్థితుల్లో ఒకనాడు భారతదేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా, వ్యక్తిత్వం ఉన్న అధికారిగా పని చేసిన టీఎన్ శేషన్ లాంటి వారు సీఈసీగా రావాలని మేము కోరు కుంటున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, విలువలు ముఖ్యమైనందున సీఈసీ నియామకానికి స్వతంత్రమైన నిర్ణయా ధికారం గల ప్యానెల్ ఉండి తీరాలి. ఎందుకంటే, ఇప్పటి పద్ధతిలో అస్వతంత్రమైన సీఈసీ నియామకం వల్ల ఒకవేళ ప్రధానమంత్రిపై ఆరోపణలొస్తే సీఈసీ నిర్ణయం తీసుకోగలరా?’’ – సీఈసీల స్వల్పకాలిక నియామకాలతో కేంద్ర పాలకులు అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం (22 నవంబర్ 2022) టీఎన్ శేషన్ 1990 డిసెంబర్ నుంచి 1996 డిసెంబర్ దాకా దేశ 10వ సీఈసీగా పనిచేశారు. అలాంటి బాధ్యతాయుత ఉన్నతాధికారి నేడు దేశానికి కావాలని సుప్రీంకోర్టు గౌరవ ధర్మాసనం ఎందుకు అభి ప్రాయపడవలసి వచ్చిందో ప్రతి పౌరుడు పరిశీలించాల్సిన అవసరం తలెత్తింది. 1950 మార్చి నుంచి 2022 ‘మే’ దాకా శేషన్ సహా సీఈసీ లుగా పనిచేసినవారు మొత్తం 25 మంది. ఒకసారి రాష్ట్రపతి నియ మించిన తర్వాత, ఏ సీఈసీ అయినా బాధ్యతలను సక్రమంగా నిర్వ హించక పోయినా, తప్పుడు నిర్ణయాలకు పాల్పడినా ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలంటే – లోక్‌సభ, రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు, తన పరిధిలో నిక్కచ్చి అయిన సాహసి కాబట్టే టీఎన్ శేషన్ తన హయాంలో దేశ ఎన్నికల నిర్వహణలోనే ‘పాపం’లా పేరుకుపోయిన వందకుపైగా అవకతవక లను గుర్తించి, దేశ ఎన్నికల నిర్వహణ తీరును సంస్కరించడానికి నడుం బిగించారు. మన కేంద్ర పాలకుల స్వార్థపూరిత విధానాలలోని అవకతవకలను సరిదిద్ది, సకాలంలో పాలకుల్ని ‘గాడి’లో పెట్టేందుకు దోహదపడమని అధికారుల నిబంధనలు ఘోషిస్తున్నా... ‘చూసి రమ్మంటే కాల్చి వచ్చే’ బాపతువాళ్లు అధికార గణంలో కూడా ఉండ బట్టే అనేక అవకతవకలకు ఆస్కారం కల్గుతోందని గతంలో ‘రీసెర్చి అండ్ ఎనాలిసిస్ వింగ్’ (‘రా’) గూఢచారి సంస్థ అధిపతిగా పనిచేసిన ‘కా’(కేఏడబ్ల్యూ) వెల్లడించిన విషయం ఈ సందర్భంగా గుర్తొస్తోంది. కానీ సీఈసీగా శేషన్ భారత ఎన్నికల నిర్వహణ వ్యవస్థలోని లొసుగుల ఆధారంగా రాజకీయ పార్టీలు చేస్తున్న అవినీతి, అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలోనే ఒక జనరల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ – ఆర్ఎస్ఎస్ అగ్రనాయకుల్ని శేషన్ అడ్డు కున్నారు. ‘రాజ్యాంగ సెక్యులర్ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారా, లేదా? అయినప్పుడు ఆ ప్రతిజ్ఞకు భిన్నంగా వ్యవహ రించిన మిమ్మల్ని, మీ పార్టీని ఎందుకు నిషేధించరాదో చెప్పమని (అద్వానీ ప్రభృతుల్ని) నిలేసినవారు శేషన్. ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళిని పకడ్బందీగా రూపొందించ డంతో పాటు, అర్హులైన వారందరికీ ఓటర్ల గుర్తింపు కార్డుల్ని సిద్ధం చేసి పంపిణీ చేసినవారు శేషన్! ఎన్నికల ప్రచారం పేరిట విచ్చల విడిగా డబ్బులతో ఓటర్లను కొనేయడానికి, మద్యాన్ని విచ్చలవిడిగా అభ్యర్థులు ఏరులై పారించడాన్ని చట్ట విరుద్ధ అవినీతికర చర్యలుగా ప్రకటించి తాను సీఈసీ హోదాలో వాటిని కొనసాగించవలసిన ఆదర్శాలుగా మలిచారు. ఈ కఠినమైన ఆదర్శ నిర్ణయాలను చేసి అమలు జరిపినందుకు శేషన్‌ను ప్రశంసించినవారూ ఉన్నారు, విమ ర్శించినవారూ ఉన్నారు. ఎన్నికల ప్రచారం పేరుతో ‘లౌడ్ స్పీకర్ల’ విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించిన వారాయన. కనుకనే గిట్టిన వారి దృష్టిలో ‘సెన్సేషన్’గానూ, గిట్టనివారి దృష్టిలో తమ పాలిట ‘అల్సేషన్’ గానూ ఆయన కనిపించారు. సీఈసీ పదవిలో అంత వరకూ పనిచేసిన మొత్తం 25 మంది సీఈసీలలో ఒక్క శేషన్‌కే ప్రసిద్ధ రామన్ మెగసెసే పురస్కారం లభించింది. లక్ష్యం సరైనదైతే ‘సుపరి పాలనా వ్యవస్థ నిర్మాణం అసాధ్యమేమీ కాదు’ అని స్పష్టంగా ప్రకటించినవాడు శేషన్. కనుకనే సీఈసీ పదవిలో ఉన్న వ్యక్తులు పాలకుల కోరికల మేరకు ‘తలలూపే’ బాపతుగా ఉండటం దేశ నడవడికకు ఆదర్శనీయమైన ఆచరణను ప్రసాదించలేదని దేశ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం దృఢాభిప్రాయంగా మనం తీర్మా నించుకోవచ్చు. సీఈసీ పదవికి ప్రతిపాదించిన నాలుగైదు పేర్లలో ఒకరిని (అరుణ్ గోయెల్) నిమిషాల మీద నియమించి దేశంలో ‘గత్తర’ లేపారు పాలకులు. ‘ఆగమేఘాల’ మీద ఒక అధికారిని నియ మించడానికి చూపిన చొరవను ఆక్షేపిస్తూ రాజ్యాంగ ధర్మాసనం తరఫున జస్టిస్ కె.ఎం. జోసఫ్ చేసిన ప్రకటనను సునిశిత వ్యాఖ్యగా మనం పరిగణించాలి. జస్టిస్ జోసఫ్ మాటల్లో: ‘స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. ఇంతకూ అసలు సమస్యల్లా సంబంధిత వ్యక్తి (అధికారి) నిజంగా స్వతంత్ర శక్తి ఉన్నవాడా కాదా అన్నదే అసలు ప్రశ్న’! కనుకనే కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రంలో తటస్థంగా వ్యవహరించే స్వతంత్రమైన యంత్రాంగం ఉండి తీరాలని జస్టిస్ జోసఫ్, జస్టిస్ అజయ్ రస్తోగి అభిప్రాయ పడ్డారు. ధర్మాసనం వేసిన సూటి ప్రశ్న: ‘ప్రధానమంత్రిపై ఆరోప ణలు వస్తే ప్రధాన ఎన్నికల అధికారి చర్యలు తీసుకోగలరా? అందుకే సీఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి, వ్యక్తిత్వం ముఖ్యం’! కులాతీత, వర్గాతీత, మతాతీత రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చుకున్నామా అన్నది ఈ రోజుకీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇందుకు కారణాన్ని అన్వేషించడం ఇప్పటికైనా కష్టమేమీ కాదు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు భారత ప్రజల అనుభవంలోకి, ఆచరణ లోకి అనువదించుకోవాలంటే – ముందు తక్షణమే జరగవలసిన పని – రాజ్యాంగంలో పొందుపరచిన ఆదేశిక సూత్రాలకు, పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా తొల గించగలగాలి. ఆచరణలో అమలు చేయకుండా సంపన్న వర్గాల ప్రయోజనాలను కాపాడే ఆదేశిక సూత్రాలను పౌరుల ప్రాథమిక హక్కుల జాబితాలోకి మార్చడానికి పాలక వర్గాలు సంసిద్ధం కావాలి. పౌరుల ప్రాథమిక హక్కులకు ఆచరణలో విలువ ఇచ్చిననాడే 75వ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు విలువా, సలువా ఉంటుంది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రసిద్ధ కవుల్లో, కథకుల్లో ఒకరైన అట్టాడ అప్పల్నాయుడు ‘చిటికెన వేలు’ కథలోని ఒక పాత్ర గుర్తుకొస్తోంది: ‘‘మన దేశంలో జరిగే ఎన్నికల్లో ధనమూ, దైవమూ, మద్యమూ గాక నెత్తురు కూడా గద్దె ఎక్కడానికి అవసరం అని తెలుసుకున్నాడు. నెత్తురు మన మూకదయినా సరే, శత్రు మూక దయినా సరే పారాల్సిందే.’’ మన ఎన్నికల నిర్వహణ తంతు 75 ఏళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగుతోందంటే ఆశ్చర్యమా?! abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
నేషన్ వెన్నెముక శేషన్
జాతీయ స్థాయిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన శేషన్ వక్రమార్గంలో వెళ్తున్న ఎన్నికల ప్రక్రియను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమించిన మహనీయుడు. టి.ఎన్.శేషన్‌గా సుప్రసిద్ధుడైన తిరునెళ్లై నారాయణ అయ్యర్ శేషన్ 1932 డిసెంబర్ 15న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు. సివిల్ సర్వీస్ పరీక్షలో మంచి ర్యాంకు పొంది, 1954లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1955లో తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగజీవితంలో ప్రవేశించారు. తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసి, కేంద్రప్రభుత్వంలో కీలక శాఖల్లో విధులు నిర్వహించారు. దేశానికి పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 1990 డిసెం బర్ 12న బాధ్యతలు చేపట్టిన శేషన్ ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగారు. విధి నిర్వహణలో చండశాసనుడిగా పేరుపొందారు. అవినీతి, అక్రమాలతో అపవిత్రమైన ఎన్నికల క్షేత్రాన్ని పునీతం చేసేందుకు ప్రయత్నించి, చాలావరకు విజయం సాధించారు. వందకు పైగా ఎన్నికల అక్రమ విధానాలను ఆయన గుర్తిం చారు. ఆ విధానాలను మార్చేందుకు శ్రమించారు. ఎన్నికల వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఒకరి బదులు మరొకరు ఓటేయడం. ఈ అక్రమ విధానాన్ని అరికట్టేం దుకు ప్రతి ఓటరుకూ గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు పరిమితులు విధించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల అధికారులను పర్యవేక్షణ కోసం నియమించడం కూడా తొలిసారిగా ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయమే. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం; ఎన్నికల్లో ధన ప్రవా హం, ప్రచారం కోసం ప్రభుత్వ నిధులను, యంత్రాంగాన్ని ఉపయోగించడం; ఓటర్లలో కుల, మత వైషమ్యాలను రెచ్చగొట్టడం; ధార్మిక కేంద్రాలను, దేవాలయాలను ప్రచారం కోసం వాడుకోవడం, పోలింగ్ బూతుల ఆక్రమణ మొదలైన ధోరణుల పట్ల శేషన్ కన్నెర్రజేశారు. ఎన్నికల్లో విచ్చలవిడి ధన ప్రవాహానికి చెక్ పెట్టారు. గతంలో ఎన్నికలంటే లౌడ్ స్పీకర్లే గుర్తొచ్చేవి. శేషన్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఎన్నికల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో 1992లో ఎన్నికలను శేషన్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం రద్దు చేసింది. లోక్‌సభకు 1993లో ఎన్నికల వ్యయాన్ని స్వయంగా కంట్రోల్ రూం నుండి పర్యవేక్షించారు శేషన్. ఆ ఎన్నికల్లో ఖర్చులకు లెక్కలు చూపని 1,488 మంది అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో మూడేళ్లపాటు పాల్గొనకుండా నిషేధం విధించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేం దుకు 14 వేల మందిని అనర్హులుగా ప్రకటించారు. శేషన్ ప్రవేశపెట్టిన ఎన్నికల సంస్కరణలు, పకడ్బందీగా అమలు చేసిన నియమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిం చాయి. ఎన్నికల వ్యవస్థలో శేషన్ తెచ్చిన సంస్కరణలను జీర్ణించుకోలేనివారు ‘నేషన్ వర్సెస్ శేషన్’ అన్నా, ‘అల్‌శేషన్’ అంటూ ఆల్సేషియన్ జాతి శునకంతో పోల్చినా జంకని ఉన్నత మనస్కుడు శేషన్. ‘నేను బంతిలాంటి వాడిని. ఎంత వేగంగా గోడకు కొడితే అంత వేగంగా వెనక్కు వస్తాను’ అనేవారు. ఎన్నికల సంస్కరణల అమలు కోసం విశేష కృషి చేసిన శేషన్‌ను 1996లో రామన్ మెగసెసె అవార్డు వరించింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ ఉన్నంతకాలం శేషన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. (నేడు శేషన్ మొదటి వర్ధంతి) డా‘‘ రాయారావు సూర్యప్రకాశ్ రావు 94410 46839 -
వీకెండ్ స్పెషల్ : వార్తల్లో వ్యక్తులు
రంజన్ గొగోయ్ దేశ రాజకీయాలను మలుపుతిప్పే ఎన్నో తీర్పులు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వెలువరించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న రామజన్మభూమి– బాబ్రీ మసీదు సమస్యని పరిష్కరిస్తూ తీర్పునిచ్చారు. సీజేఐ కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి చేర్చారు. ఆయన పదవీ విరమణకు ఏడెనిమిది రోజుల ముందు ఈ కీలక తీర్పులు వెలువడటం విశేషం. టీఎన్ శేషన్ దేశం గర్వించదగ్గ ఐఏఎస్ అధికారి టీఎన్శేషన్. నీతికీ, నిజాయితీకీ, నిఖార్సయిన వ్యక్తిత్వానికీ పర్యాయపదంగానే ఆయన్ను చెప్పాలి. భారత ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించిన శేషన్... ఎన్నికల సంస్కర్త గా పేరొందారు. ఆయన చెన్నైలో నవంబర్ 10న కన్నుమూయడం ప్రజాస్వామ్య కాంక్షాపరులందర్నీ దుఃఖసాగరంలో ముంచింది. పీఎస్ కృష్ణన్ దళిత ఆదివాసీల పక్షపాతి, నిత్య ఉద్యమకారుడు, ప్రజాస్వామ్య కాంక్షాపరుడు అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీఎస్.కృష్ణన్ కూడా నవంబర్ పదోతేదీన టీఎన్.శేషన్ కన్నుమూసిన రోజునే మరణించారు. కేరళలోని తిరువనంతపురంలో అగ్రవర్ణ కుటుంబంలో జన్మించిన కృష్ణన్ చివరి శ్వాస వరకు అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా పోరాడారు. భగత్ సింగ్ కొష్యారీ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ సంసిద్ధంగా లేకపోవడంతో రాష్ట్రపతి పాలనను పరిశీలించాల్సిందిగా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్రతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. షఫాలీ వర్మ హరియాణాలోని రోహతక్‌కు చెందిన పదిహేనేళ్ళ షఫాలీ వర్మ క్రికెట్ దిగ్గజం, కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ సామ్రాజ్యాన్నేలిన సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టి ప్రపంచం లోనే అతిచిన్న వయ స్సులో అర్ధ సెంచరీ సాధించిన ద్వితీయ మహిళగా నిలిచారు. -
చిరస్మరణీయుడు
కేవలం లాంఛనంగా, చెప్పాలంటే మొక్కుబడిగా దేశంలో సాగుతున్న ఎన్నికల క్రతువు రూపు రేఖా విలాసాలను మార్చి వాటికొక అర్థం, పరమార్థం ఉండేలా తీర్చిదిద్దిన టీఎన్ శేషన్ ఆదివారం కన్నుమూశారు. శేషన్ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ కాదు. ఆయనకు ముందు తొమ్మిది మంది పనిచేశారు. అయితే 1990లో ఆయన ఎన్నికల సంఘం చీఫ్‌గా పదవీబాధ్యతలు చేపట్టిననాటికి దానికి గుర్తింపు, గౌరవం అనేవి పెద్దగా లేవు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, ఆ తర్వాత జరిగేవాటన్నిటికీ మౌన ప్రేక్షక పాత్ర వహించడం ఎన్నికల సంఘానికి రివాజుగా మారిన తరుణంలో ఆయనొచ్చి ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. సమర్థవంతంగా వ్యవహరించగలిగే చేవ ఉంటే...ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడని సంసిద్ధత ఉంటే కొమ్ములు తిరిగిన నాయకగణం దారికి రావడం ఖాయమని శేషన్ ఆచరణాత్మకంగా నిరూపించారు. శేషన్‌కు ముందు ఎన్నికల సంఘం అసలు పనిచేయలేదని చెప్పలేం. అప్పుడు కూడా అన్ని పార్టీల నేతలూ ప్రత్యర్థులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసేవారు. ఆ సంఘం కూడా అవసరాన్నిబట్టి కేంద్ర ప్రభుత్వానికో, రాష్ట్ర ప్రభుత్వానికో ఉత్తరాలు రాసేది. కాకపోతే ఆ ఉత్తరాలకు జవాబులు ఆశించేది కాదు. చర్యలు తీసుకుంటారని ఎదురుచూసేది కాదు. ఫిర్యాదులు రావడం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం మాత్రమే తన బాధ్యతగా భావించేది. మీడియా సైతం ఏ నియోజకవర్గంలో ఏం జరిగిందో...పోలింగ్ కేంద్రాల్లో అసాంఘిక శక్తులు ఎలా స్వైరవిహారం చేశాయో...ఎక్కడెక్కడ దళితులు, ఇతర అణగారిన వర్గాలకు చెందినవారూ ఓటేయకుండా పెత్తందార్లు నిలువరించారో వెల్లడించేది. కత్తులతో, బాంబులతో పరస్పరం చంపుకుంటున్న ముఠాలను చూసి ఓటేయడానికి వచ్చినవారు సైతం ‘బతుకుజీవుడా’ అంటూ పారిపోయేవారు. ఇవన్నీ ఎన్నికల సంఘానికి పెద్దగా పట్టేవి కాదు. శేషన్‌కు ముందు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న తెలుగు వ్యక్తి ఆర్వీఎస్ పేరిశాస్త్రి మాత్రం 1987లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల విషయంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో విభేదించి ఆయన ఆగ్రహానికి గురయ్యారు. జైల్‌సింగ్ రెండోసారి రాష్ట్రపతి పదవికి పోటీ చేకుండా నిరోధించడం కోసం నామినేషన్ల ప్రక్రియను మార్చాలని రాజీవ్ ప్రభుత్వం కోరుకోగా పేరిశాస్త్రి అందుకు అంగీకరించలేదు. దాంతో అప్పటివరకూ ఏకవ్యక్తి నిర్వహణలో ఉన్న ఎన్నికల సంఘంలోకి మరో ఇద్దరిని నియమించేవిధంగా మార్చారు. కానీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్ ఓటమిపాలై, వీపీ సింగ్ అధికారంలోకి రావడంతో ఈ మార్పు ముగిసిపోయింది. అనంతరకాలంలో శేషన్ వ్యవహారశైలి నచ్చక పీవీ నరసింహారావు దాన్ని మళ్లీ బహుళ సభ్య కమిషన్‌గా మార్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో ఇద్దరు కమిషనర్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయి హోదా, అధికారాలు కూడా లభించాయి. శేషన్ వ్యవహారశైలి ఎలా ఉండేదో చెప్పడానికి ఆరోజుల్లో ఆయన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పెట్టుకున్న తగాదాను ప్రస్తావించాలి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)ని నియమించాలంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ‘మీ దగ్గరున్న ఫలానా ఐఏఎస్ అధికారిని సీఈఓగా నియమించదల్చుకున్నాం. ఆయన్ను రిలీవ్ చేయండ’ని ఎన్నికల సంఘం అర్థించేది. ‘మీరు కోరుకున్న అధికారిని ఇవ్వలేమ’ని ప్రభుత్వం చెబితే, అది మరొకరి పేరు సూచించేది. శేషన్ వచ్చాక పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఇలాంటి వినతే వెళ్లింది. ఆయన సూచించిన అధికారిని ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన శేషన్ ఆ రాష్ట్రంతో ఉత్తరప్రత్యుత్తరాలు నిలిపేశారు. ఎన్నికల సంఘం జారీచేసే ఆదేశాలన్నీ పశ్చిమ బెంగాల్ మినహా ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి. తన వినతిని అంగీకరించని పక్షంలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు నిలిపివేస్తానని కూడా ఒక దశలో శేషన్ హెచ్చరించారు. చివరకు న్యాయస్థానం జోక్యం తో అంతా సద్దుమణిగింది. ఎన్నికల సంఘం అడిగిన అధికారిని కేటాయించాల్సిందేనని ప్రభుత్వాన్ని... ఆ రాష్ట్రంతో కూడా ఉత్తరప్రత్యుత్తరాలు జరపాల్సిందేనని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. మొండిగా, ముక్కుసూటిగా, నిర్దాక్షిణ్యంగా, నిక్కచ్చిగా ఉండేవారిని శేషన్‌తో పోల్చేవారు. వోటర్లకు గుర్తింపు కార్డులు జారీచేయాలని 1994 చివరిలో శేషన్ నిర్ణయించినప్పుడు పార్టీలన్నీ అది వృధా ఖర్చని కొట్టిపారేశాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. అప్పుడు శేషన్ ‘కార్డుల్లేకపోతే...ఎన్నికలుండవ్’ అని హెచ్చరించారు. ఆ తర్వాత అన్నంత పనీ చేశారు. వోటర్ గుర్తింపు కార్డులు లేనందువల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం తప్పనిసరైంది. ఆ తర్వాత సైతం శేషన్ పట్టువీడక పోవడంతో గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ అమలైంది. ఎన్నికల వ్యయంపై జమాఖర్చులు సమర్పించాలని అభ్యర్థుల్ని ఆదేశించి, దాన్ని అందరిచేతా పాటింపజేయడంలో శేషన్ విజయం సాధించారు. జమాఖర్చులు చెప్పని 1,500మంది అభ్యర్థుల్ని, తప్పుడు లెక్కలిచ్చిన మరో 14,000మందిని అనర్హుల్ని చేశారు. 1992లో బిహార్, పంజాబ్ ఎన్నికలను రద్దు చేసినందుకు నాయకులంతా ఏకమై ఆయన్ను అభిశంసించాలని చూస్తే శేషన్ చెక్కు చెదరలేదు. ఎన్నికల్లో హింసను గణనీయంగా తగ్గించడంలో ఆయన పాత్ర గణనీయమైనది. శేషన్‌తో కొత్త చట్టం రాలేదు. ఉన్న చట్టం దుమ్ముదులిపి, అందులోని అధికారా లను ఆయన సంపూర్ణంగా వినియోగించుకున్నారు. దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచా రు. అనంతరకాలంలో ఆ పదవి చేపట్టినవారిని ఒకరకంగా ఆయన ఇరకాటంలో పడేశారు. అంద రినీ ఆయనతో పోల్చి చూసి, వారి వారి సామర్థ్యాన్ని లెక్కగట్టే ‘ప్రమాణం’ ఒకటి తెలియకుండానే ఏర్పడిపోయింది. నిరంకుశుడిగా, దురహంకారిగా ముద్రపడినా తాను ఎన్నుకున్న దారిలో నిబ్బరంగా ముందుకు నడిచి, ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేసిన శేషన్ చిరస్మరణీయుడు. -
ఎన్నికల సంస్కర్త ఇకలేరు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ముఖచిత్రంపై తనదైన ముద్రవేసి, కీలక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తిరునెల్లయ్ నారాయణ అయ్యర్ శేషన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన ఆయన ఆదివారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శేషన్ 1990–96 సంవత్సరాల్లో 10వ సీఈసీగా పనిచేశారు. కేరళలోని పాలక్కాడ్‌లోని తిరునెల్లయ్‌లో 1932లో జన్మించారు. మెట్రోమ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ. శ్రీధరన్ టీఎన్ శేషన్ ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. వీరిద్దరికీ ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో సీట్లు వచ్చినా శేషన్ మాత్రం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకునేందుకు మొగ్గు చూపారు. శ్రీధరన్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అక్కడే డెమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్లపాటు పనిచేసి, ఆ సమయంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం హార్వర్డ్ వర్సిటీలో 1968లో ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు. తమిళనాడుతోపాటు, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సీఈసీకి ముందు ఆయన అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా కూడా ఉన్నారు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న కాలంలో నలుగురు ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్డీ దేవెగౌడ మారారు. శేషన్ ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా చాలా క్లుప్తంగా మాట్లాడేవారని పేరు. 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్‌పై ఆయన పోటీ చేశారు. ఎన్నికల విధానంలో పారదర్శకత సాధించేందుకు చేసిన కృషికిగాను ఆసియా నోబెల్‌గా భావించే ప్రతిష్టాత్మక రామన్ మెగసేసే అవార్డును ఆయన అందుకున్నారు. 1959లో ఆయనకు జయలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. శేషన్ మృతికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆయన్ను లెజెండ్ అని శ్లాఘించారు. నిజాయితీకి నిలువుటద్దం: వైఎస్ జగన్ అమరావతి: శేషన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావం, నిజాయితీ, నిర్భీతికి శేషన్ నిలువుటద్దమని కొనియాడారు. పబ్లిక్ సర్వెంట్‌గా శేషన్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఉన్న శక్తిని ప్రజాస్వామ్య సౌధ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో నిరూపించారని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో శేషన్ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. ఎన్నికల్లో శేషన్ సంస్కరణలు డబ్బు, అధికారం ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చిన రోజుల్లో ఆయన సీఈసీ పగ్గాలు చేపట్టారు. అనేక విప్లవాత్మక చర్యలతో ఎన్నికలు నిర్వహించి ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సంఘానికి గౌరవం తెచ్చిపెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరనేటంత కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళిని అమలు చేశారు. ఆయన చర్యల కారణంగా రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా కొంత ఇబ్బందులకు గురయింది. ఈ రెండు వర్గాలు కలిసి ఆయన్ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాలతో అప్పట్లో కొందరు ఎన్నికల కమిషన్‌ను అల్–శేషన్(ఆల్సేషియన్) అనే వారని అంటుంటారు. ఎన్నికల్లో అరికట్టిన అక్రమాలు.. ► ఓటర్లకు లంచాలివ్వడం, ప్రలోభాలకు గురి చేయడం, మద్యం పంపిణీ ► ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం ► కులం, మతం ప్రాతిపదికన ఓట్లు కోరడం ► ప్రచారానికి ప్రార్థనా స్థలాలను వాడుకోవడం ► అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడటం -
శేషన్ ‘కొరడా’ లేకనే బాబు ‘డాబు’!
‘ఎన్నికల కోడ్ ఉన్నంత మాత్రాన నేను వివిధ కార్యక్రమాలకు సమీక్షలు నిర్వహించవద్దంటే ఎలా? అసలు ఎన్నికలకూ, ప్రభుత్వానికీ సంబంధం ఏమిటి?’ అని మన అర్ధజ్ఞాని చంద్రబాబు పేలుతున్నాడు. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఊడి కొత్త ప్రభుత్వం వచ్చి, ప్రమాణ స్వీకారం చేసి అధికారం స్వీకరించే దాకా ఎన్నికల కోడ్ అమలులోనే ఉంటుందనే విషయంకూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియదా? ఈసీ కోడ్ ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం 10వ కమిషనర్ టీఎన్ శేషన్ గతంలో రాజకీయ పక్షాలను వణికించాడని మరవద్దు. శేషన్ లాంటి నిక్కచ్చి అధికారి ప్రస్తుతం ఈసీలో లేకనే మన ‘బాబు’ల ‘డాబు’లు చెల్లుతున్నాయన్నది వాస్తవం. ‘‘దేశ రాజకీయవేత్తల ప్రవర్తన గురించి చర్చించే బదులు దేశ ఎన్నికల సంఘాన్ని చర్చలోకి లాగడం చాలా దురదృష్టకర పరిణామం. పాలకుల నిర్ణయాల అమలులో జరుగుతున్న తీవ్ర జాప్యంలో ఎన్నికల సంఘానిది పాక్షికంగా బాధ్యత ఉండవచ్చు. కానీ సకాలంలో కమిషన్ మేల్కొని వ్యవహరిస్తే దానికి ఇన్ని చిక్కులు రాకపోవచ్చు’’ – కేంద్ర ఎన్నికల కమిషన్ మాజీ అధినేత ఎస్.వై. క్వరేష్ ‘‘కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికీ తన అధికారాల గురించిన వెతుకులాటలోనే ఉండటం దురదృష్టకరం’’ – త్రిలోచన శాస్త్రి; అఖిల భారత ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ అధ్యక్షులు ఇరువురు జాతీయ స్థాయి ప్రముఖులు ఎన్నికల కమిషన్ తీరుతెన్నుల గురించి ఇలా ప్రస్తావించడానికి కారణం ఏమై ఉంటుందో ఊహించడం కష్టం కాదు. అలాగే అర్ధ సత్యవాదిగా, మిడిమిడి జ్ఞానవాదిగా రాజకీ యాల్లోకి అర్థంతరంగా దూసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఈ క్షణానికి మాత్రం చలామణి అవుతున్న నారా చంద్రబాబునాయుడు దృష్టిలో కూడా ఎన్నికల సంఘం ప్రతిపత్తి చులకన అయిందంటే అందుకు కార ణాలు దేశ పాత, కొత్త పాలకులే కారణం. రాజకీయ బ్రాండ్లతో నిమిత్తం లేకుండా పాలకులు ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో, ఆ తర్వాత అధికారంలో కాలుపెట్టింది లగాయతూ కోట్లకు పడగలెత్తే బాపతు కావడం వల్లనే ప్రజలకు ప్రధాన రాజ్యాంగ సంస్థల ప్రజా స్వామ్య లక్షణాలుగానీ, లక్ష్యాలు కానీ వాటివల్ల కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా అమలులోకి రావలసిన ఏ ప్రజాహిత సంస్కరణ గానీ అందుబాటులోకి రావటం లేదన్నది నగ్నసత్యం. పలు రిపబ్లిక్ రాజ్యాంగ వ్యవస్థల మొక్కట్లను కొన్నాళ్లు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ పరివార్ పరిపాలనా శక్తులు ఒక్కటొక్కటిగా చెదరగొ డుతూ చెల్లాచెదరు చేసేస్తూ వస్తున్నారు. దాని ఫలితమే–ఆ రాజ్యాంగ వ్యవస్థల స్వరూప స్వభావాల్ని మార్చడంలో భాగంగా ఓట్ల కోసం నోట్లు, నోట్లకోసం ఓట్లు.. ‘పుచ్చుకో ఇచ్చుకో వాయినం’ అన్నట్లుగా ధనస్వామ్య రాజకీయ ‘పక్షులు’ వ్యవహరించడమే కాకుండా ఏ గణాంక శాస్త్రానికీ, ఏ పన్నుల వసూళ్ల శాఖలకు, ఏ వాణిజ్య సూత్రాలకు అంద నంతగా ‘నోట్ల ముమ్మరం’తో పాలక రాజకీయవేత్తలు బలిసిపోయారని మరిచిపోరాదు. అవినీతి అంతా ఈ ముమ్మరంలోనే ఉంది! సరిగ్గా ఈ దశలోనే మిగతా రాజ్యాంగ వ్యవస్థలు ఎదుర్కొంటున్న పాలక జోక్యం దారీ విధానాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఎదుర్కోవలసి వచ్చింది! ఇక్కడొక మహాభారత సూక్తి గుర్తుకొస్తోంది: అరాచక రాష్ట్రానికి గానీ, అరాచక పాలనకు గానీ విముక్తి ఎలా ఎప్పుడు సాధ్యమో సత్యవతి వ్యాసుడితో మొరపెట్టుకుని మరీ చెప్పాల్సి వచ్చింది. పాలకుడు ప్రజాకంటకుడిగా తయారైనప్పుడు ఏం జరుగుతుందో ఆమె చెప్పాల్సి వచ్చింది. సత్యవతి మాటల్లోనే: ‘పాలకుడు తప్పుడు మార్గంలో పరిపా లన సాగిస్తుంటే, అన్ని ధర్మాలు నశించి ప్రజలు బాధలకు, అలజడికి గురవుతారు, అనావృష్టి బాధలు పెరుగుతాయి. ఇక కాలయాపన పనికి రాదు. కనుక వెంటనే ధర్మ మార్గంలో వెళ్లి అధర్మాన్ని పట్టం కట్టి కూర్చున్న దుష్ట పాలకుల్ని తొలగించేయ్. రాజ్యం పాడవకుండా కాపాడు’ అన్నది హితవు. అలాంటి కాలయాపనకు పాలకులు పట్టం కట్టారు కాబట్టే నేటి ఎన్నికల కమిషన్.. రాజ్యాంగం రూపొందించిన సర్వాధికార సంస్థే అయినా, తన ఉనికిని తాను వెతుక్కోవలసివచ్చి సుప్రీంకోర్టు రక్షణ కోసం వెతుకులాటలో పడింది. గాడి తప్పుతున్న ఎవరిపైన అయినా చర్య తీసుకోవాలన్నా చేతులు కట్టుబడిపోయి, నిశ్చేష్టమై పోతున్నానని కమిషన్ కోర్టుకు మొరపెట్టుకుంది. కానీ కొంత కాలంగా పరిణామాలను గమనిస్తున్న వారికి రాజ్యాంగ సంస్థల చేతుల్నే మెలిపెట్టి, తాము చేసే తప్పుడు నిర్ణయాలకు ప్రజా వ్యతిరేకంగా సప్త స్వాతంత్య్రాలకు భిన్నంగా పాలక శక్తులు బరితెగించుతుండటం దేశ పౌరులు గమనిస్తూనే ఉన్నారని మరవరాదు. ఈ ప్రజా వ్యతిరేక పాలక శక్తుల కోవకు చెందినవాడే మన ‘అర్ధ జ్ఞాని’ చంద్రబాబు కూడా. ఈసీ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ.. లేదా, పాలకులు ఆ నిబంధనావళిని బలహీనంగానే ఉంచాలని భావించినప్పటికీ– కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటిదాకా ప్రధాన అధినేతలుగా పనిచేసిన 22 మంది కమిషనర్లలో 10వ కమిషనర్‌గా (1990 డిసెంబర్–1996 డిసెంబర్) టీఎన్ శేషన్ అత్యంత ప్రతి భావంతుడిగా, మడమ తిప్పకుండా బాధ్యతలు నిర్వహించి, కేంద్ర రాష్ట్ర పాలకులందరినీ ఎన్నికల నిబంధనావళి నిర్వహణలో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్నే కాదు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని కూడా అదుపాజ్ఞల్లో ఉంచి గడగడలాడిం చాడు. రాజ్యాంగంపైన, దాని ప్రకటిత లక్ష్యాలైన సెక్యులరిజం, సోష లిస్టు, ప్రజాస్వామ్య రిపబ్లిక్ రక్షణకు కట్టుబడి ఉంటామని అన్ని పార్టీలు ప్రతిజ్ఞ చేయాలి. ఆ ప్రతిజ్ఞను ఎన్నికల సమయంలో ఉల్లంఘించి, జాతీయ మైనారిటీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నప్పుడు శేషన్ బీజేపీ సీనియర్ నాయకుల్ని పిలిపించి ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు: ‘మీరు, మీ పార్టీ భారత రాజ్యాం గంపైన, దాని లక్ష్యాలపైన ఆమోదిస్తూ ప్రతిన పూనారా లేదా’ అని ప్రశ్నించి, అందుకు విరుద్ధంగా మీరు ప్రచారాలు చేస్తున్నందుకు ‘మీ పార్టీ గుర్తును ఎందుకు రద్దు చేయకూడదో చెప్ప మని’ శేషన్ నిలదీ శాడు. అప్పుడు చాయంగల విన్నపాలతో బీజేపీ నాయకత్వం మొత్తు కుని ‘రాజ్యాంగాన్ని గౌరవిస్తాం’ అని ఒప్పుదలై బయటపడాల్సి వచ్చింది. ఆయన తర్వాత ఎలక్షన్ కమిషన్‌కు సీఈసీలుగా వచ్చిన వారిలో ఎం.ఎస్. గిల్, నవీన్ చావ్లా, జేఎం లింగ్డోలు కూడా ఉన్నంతలోనే స్వతంత్ర శక్తితోనే వ్యవహరించారని చెప్పాలి. అయితే 2018 జనవరి–డిసెంబర్ దాకా సీఈసీగా వ్యవహరించిన ఓంప్రకాశ్ రావత్ బీజేపీ పాలకులు నర్మగర్భంగా ‘కన్నెర్రజేసే’ ప్రవర్తనతో ఒకడుగు వెనక్కి తగ్గిపోతూ వచ్చాడు. కాగా, దొంగతనంగా ‘పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడ్డం లేదనుకొన్నట్లుగా’, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తరువాత నామ మాత్రావశిష్టంగా పేరుకు తెలుగుదేశం సైన్‌బోర్డు చాటున పాలన కొన సాగిస్తూ వచ్చిన చంద్రబాబు తన ‘నామ్‌కే వాస్తే’ పార్టీకి నూకలు చెల్లి పోయాయన్న గుర్తింపు ఆలస్యంగానైనా వచ్చినట్టుంది. అజ్ఞానంతో ఉన్నవాడికి ‘తెగింపు’ కూడా ఒక లక్షణమో దుర్లక్షణమో ఉంటుందట. కనుక ఒక రోజున ‘నేను ఓడిపోయినా నాకు పెళ్లాం, కొడుకు, మను మడూ ఉన్నారు’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే, మళ్లీ ‘2019 జూన్ 8 వరకూ నేనే ముఖ్యమంత్రిని’ అని ప్రజలకు గుర్తు చేస్తూ ‘అందువల్ల ఆ తేదీన నేను 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను కాబట్టి, ఈ ఏడాది అప్పటిదాకా నాకు సమయం ఉంటుంది. కనుక అధికారులతో ఎన్నికల కోడ్ ఉన్నంత మాత్రాన నేను వివిధ కార్య క్రమాలకు సమీక్షలు నిర్వహించవద్దంటే ఎలా? విధాన నిర్ణయాలతో పాటు మిగిలిన పనులు కూడా నిర్వహించుకోవచ్చు. ఎన్నికల కమిషన్ ఎన్నికల పనులను మాత్రమే చూసుకోవాలి. అసలు ఎన్నికలకూ, ప్రభు త్వానికీ సంబంధం ఏమిటి? ఈవీఎంలపై దేశం మొత్తాన్ని నేనే ఎడ్యు కేట్ చేస్తున్నా’ అని పేలుతున్నాడు. అయితే, ఈ అడ్డగోలు ‘వాచాలుడి’కి అసలు ఎన్నికల కోడ్ ఒకటుందని, ఎన్నికల ప్రక్రియ అన్ని దశలూ, చివ రికి ఉన్న ప్రభుత్వం ఊడి కొత్త ప్రభుత్వం వచ్చి, ప్రమాణ స్వీకారం చేసి అధికార స్థానాలలో అధిష్టించే దాకా ఎన్నికల ప్రవర్తన నిబంధనావళి అమలులోనే ఉంటుందని ‘రాజకీయ ఆర్థిక వేత్తన’ని ప్రగల్భాలు పోయే ముఖ్యమంత్రికి తెలియదా? ఎన్నికల మధ్యలో, లేదా కొత్త ప్రభుత్వం అధికారం స్వీకరించే వరకూ కొత్త సీఎం విధాన ప్రకటన విడుదల చేసేంత వరకూ నోరు మెదపకుండా ‘మాజీ’గా రాజీపడి కూర్చునేంతవరకూ– చేతివాటం కొద్దీ, నోటి తీటతో ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించటంగానీ, అధికా రులతో సమీక్షలు జరపడంగానీ, పురమాయింపులు చేయటంగానీ వీలు లేదని ఎన్నికల మోడల్ కోడ్ 5వ అధ్యాయంలో తెల్లకాగితాలపై నల్లని అక్షరాలతో వివరంగా అచ్చులో ఉందని బాబుకి తెలియదా? లేక చదవలేదా? ఈ ‘మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు’ను చట్టంగా తీసుకురాకపో యినా శేషన్ కత్తి ఝళిపించాడని మరవద్దు. ఎన్నికల నిర్వహణ అన్ని దశలూ, కేవలం ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో మినహా, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ద్రవ్య సంబంధమైన, పాలనాంశాలపైన నిర్ణయాలను అదుపుచేస్తూ ఆ నిబంధనావళిలో ఉన్న విషయం తెలియదా? అదే విషయాన్ని మరో రకంగా పునరుద్ఘాటిస్తూ కోడ్ 19వ అధ్యాయం (6వ నిబంధన)లో స్పష్టమైన సలహా, హెచ్చరిక ఉన్న సంగతి కూడా మన పోస్ట్ గ్రాడ్యుయేట్ బాబుకి తెలియదా? లేక ప్రాచీన సూక్తిని గుర్తు చేసుకుని సరిపెట్టుకోవటం మంచిదా– ‘మూర్ఖ నాయక చిత్తముల్’ మార్చడం ఎంత కష్టమో, ‘కుక్క తోక పుచ్చుకుని గోదావరి ఈదడం’ కూడా అంతే ప్రయాస. ఆంధ్రులకు అమరావతి పూర్ణ కలశంగా స్థిరపడకుండానే పాలకులు అమరులు కాలేరు. ఎన్నికల ప్రచారం చివరలో ప్రజలముందు వొంగి వొంగి మరీ బాబు చేసిన అభి వాదం ఆయన పదిహేనేళ్ల పాలనలో తొలి ‘ఆపద్ధర్మ’ నమస్కారం, దాని మరో పేరే ‘వొంక దణ్ణం’. అయినా స్వీకరించడం మన ధర్మం!! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
టీఎన్ శేషన్ మళ్లీ పుట్టాలేమో!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచే కాకుండా కేరళలోని వయనాడ్ నుంచి కూడా లోక్‌సభకు పోటీ చేయడం అంటే ‘ మెజారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీకి భయపడి పారిపోవడమే’ అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వ్యాఖ్యానించారు. ‘మెజారిటీలైన హిందువుల వ్యతిరేకతకు భయపడి రాహుల్ గాంధీ హిందువులు తక్కువగా ఉన్న నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారని మోదీ విమర్శించారు’ అంటూ ఆ వెంటనే ‘టైమ్స్ నౌ’ ఛానల్ ట్వీట్ చేసింది. దాంతో పలువురు నరేంద్ర మోదీ ఫాలోవర్లు మెజారిటీలైన హిందువులకు భయపడి ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేస్తున్నారంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. వాస్తవానికి వయనాడ్ జిల్లాలో హిందువులు 49.48 శాతం, ముస్లింలు 26.65 శాతం మంది ఉన్నారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఇచ్చిన ట్వీట్‌తో మోదీ ఫాలోవర్లు కాస్త తగ్గారు. వయనాడ్‌లో ఏ మతస్థులు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని పక్కన పెడితే, రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ విమర్శించడం ద్వారా క్రైస్తవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ లౌకిక స్వరూపాన్నే విమర్శించడం అవుతోంది. ఆయన ఒక్కరే కాదు, ఆయన పార్టీ నాయకులంతా మతం ప్రాతిపదికగానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి కూడా కుల, మత, జాతి, భాష పరంగా ఓటు అడగరాదు, అదే కారణంగా ఓటు వేయరాదంటూ కోరరాదు’ ఈలెక్కన మోదీ కూడా ఈ నియమావళిని ఉల్లంఘించినట్లే. (చదవండి: కేరళ నుంచి రాహుల్ పోటీ ఎందుకు?) ఇక మోదీ తరఫున ప్రచారం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో రెండు అడుగులు ముందుకేసి భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. యూపీలోని ఓ ర్యాలీలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘2015లో గోమాంసం తిన్న ఓ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రజల్లో భావోద్వేగాలు పెల్లుబికితే దాన్ని అణచివేసేందుకు అప్పటి సమాజ్‌వాది పార్టీ ప్రయత్నించింది’ అంటూ విమర్శించగా, ఆ సభలో ముందు వరుసలో కూర్చున్న నాటి సంఘటనలో ప్రధాన నిందితుడు లేచి ఈల వేసి గోల చేశాడు. యూపీలోని దాద్రిలో 2015, సెప్టెంబర్ 28వ తేదీన గోమాంసం తిన్నాడన్న అనుమానంతో అక్లాఖ్ అనే ముస్లింను మూక దాడిలో చంపిన విషయం తెల్సిందే. ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం నాడు ఓ ర్యాలీలో మాట్లాడుతూ బీజేపీని మరోసారి గెలిపిస్తే ‘మతపరమైన చట్టాలన్నింటిని సవరిస్తాం’ అని చెప్పారు. అంటే మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులకు, బౌద్ధులకు, సిక్కులకు సానుకూలంగా సవరిస్తారు కావచ్చు! 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి ప్రాతిపదికన సబ్కే వికాస్, అచ్చేదిన్ నినాదాలతో మోదీ, ఆయన పార్టీ నేతల గణం ప్రచారం చేసింది. అలాంటి పార్టీ ఇప్పుడు మతపరంగా ఓటర్లను విభజించి ఓట్లు అడుగుతుందంటే ‘హంగు’ భయమే కావచ్చు! ఏదీ ఏమైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు వచ్చే వరకు నిరీక్షించకుండా ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు టీఎన్ శేషన్ మళ్లీ పుట్టాలేమో! -
ఆయన్ని కట్టడి చేయడానికి రాజ్యాంగ సవరణ
ఎన్నికల సంఘం అంటే గుర్తుకు వచ్చేది టీఎన్ శేషనే. ఎన్నికల సంఘంపై చెరిగిపోని ముద్ర వేసి ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. కాగితాలకే పరిమితమైన ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన అధికారాలను విస్తృత స్థాయిలో ఉపయోగించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తన సంస్కరణల ద్వారా ఆయన రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఈ క్రమంలో ఆయన వివాదాస్పదుడిగా పేరు కూడా గడించారు. 1990లో ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో భారీగా అక్రమాలు, ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై పరిమితి లేకపోవడం, పోలింగ్ బూత్‌ల కబ్జా, అధికార దుర్వినియోగం ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రధాన కమిషనర్‌గా నియమితులయ్యారు. వీటన్నింటినీ కట్టడి చేసేందుకు ఆయన పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో ఆయన ప్రభుత్వాన్ని సైతం సవాలు చేశారు. రాజ్యాంగం ఇచ్చిన తన అధికారాల్లో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోరాదని తేల్చిచెప్పారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను, సమగ్రతను కాపాడటం, ఓటర్లకు సాధికారిత కల్పించడం, ఎన్నికల విధివిధానాలను మార్చడం, ఎన్నికల చట్టాలను సవరించడం వంటివి ఆయన ప్రధాన లక్ష్యాలు. అందుకు ముందు ప్రజల్లో ఎన్నికల కమిషన్ పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. దీనికి గాను ఆయన ముందుగా తన కార్యాలయాన్ని సంస్కరించడం మొదలుపెట్టారు. కార్యాలయాల్లోని గోడలపై ఉన్న దేవుళ్లు, దేవతల ఫొటోలను తీసేయించారు. ఎన్నికల కమిషన్ లౌకిక నిర్వచన పరిధిలోకి వస్తుందని ఉద్యోగులకు ఉద్భోధించారు. మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని తగ్గించారు. అధికారులను ఎక్కువ సమయం గ్రంథాలయంలో గడిపేలా చేశారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల కేసులపై దృష్టి సారించారు. అభిశంసన తీర్మానానికి దారితీసిన నిర్ణయాలు వివిధ ఆరోపణలపై పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులపై ఆయన అనర్హత వేటు వేశారు. దీంతో ఆయన రాజకీయ నాయకులకు లక్ష్యంగా మారారు. దీని తర్వాత ఆయనపై అభిశంసన తీర్మానాన్ని పెట్టగా అప్పటి స్పీకర్ తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల సమయంలో డిప్యుటేషన్ మీద తన పరిధిలోకి తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వాలకు, శేషన్‌కు మధ్య యుద్ధమే నడిచింది. దీనిపై సుప్రీంకోర్టు శేషన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. శేషన్ కట్టడికి రాజ్యాంగ సవరణ 1993లో తమిళనాడు ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర హోంశాఖ నిరాకరించింది. దీంతో శేషన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం అధికారాన్ని గుర్తించే వరకు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో శేషన్‌ను కట్టడి చేసేందుకు ఎన్నికల కమిషన్‌లో మరో ఇద్దరు కమిషనర్లను నియమిస్తూ రాజ్యాంగ సవరణ చేశారు. అభ్యర్థుల ప్రచార వ్యయానికి పరిమితులు అసెంబ్లీ అభ్యర్థి ప్రచార వ్యయాన్ని గరిష్టంగా రూ.40 వేలుగా, పార్లమెంట్ అభ్యర్థి ప్రచార వ్యయాన్ని రూ.1.70 లక్షలుగా నిర్ణయించారు. ఈ పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ పరిమితిని పెంచేందుకు ప్రయత్నించింది. అయితే ఈ పరిమితిని ఉల్లంఘిస్తే సహించేది లేదని శేషన్ తేల్చి చెప్పారు. 1993 ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఖర్చుపై ఆయన ఎక్కువ దృష్టి సారించారు. ఎన్నికల లెక్కలు సమర్పించనందుకు 1,488 మందిపై మూడేళ్ల పాటు అనర్హత వేటు వేశారు. ఓటరు గుర్తింపు కార్డు ఉండాల్సిందే.. ఎన్నికలు సజావుగా జరగటానికి ఓటర్లకు అవగాహన కల్పించడం ముఖ్యమని శేషన్ గ్రహించారు. అందుకోసం జాతీయస్థాయిలో ఓటరు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. ఓటరు హక్కులు, బాధ్యతల గురించి విస్తృత ప్రచారం నిర్వహించారు. 1992లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణ మొత్తం ఎన్నికల ప్రక్రియను మార్చేసింది. అర్హులైన ఓటర్లందరికీ ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. రాజకీయ నేతలు ఈ ప్రతిపాదనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఓటరు గుర్తింపు కార్డు విషయంలో ప్రభుత్వం 18 నెలలు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గుర్తింపు కార్డులు ఇచ్చేంత వరకు ఎన్నికలు నిర్వహించేది లేదని శేషన్ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత ఎన్నికలు జరిగాయి. ‘లౌడ్ స్పీకర్’ నిషేధం శేషన్ తీసుకొచ్చిన మరో సంస్కరణ గోడలపై రాతలు, లౌడ్ స్పీకర్ల వినియోగం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై పోస్టర్లు అతికించడం వంటి వాటిపై నిషేధం విధించారు. దీనివల్ల ఎన్నికల సందర్భంగా శబ్దకాలుష్యం తగ్గింది. ప్రచార ఖర్చుపై పరిమితి ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. కులం, మతం, భావోద్వేగాల ఆధారంగా ఓట్లు అడగరాదంటూ కూడా శేషన్ ఓ ఉత్తర్వులు ఇచ్చారు. వీటి అమలు కోసం ప్రత్యేక పరిశీలకులను నియమించారు. రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలను పరిశీలించే అధికారం పరిశీలకులకు ఇచ్చారు. అభ్యర్థుల ప్రసంగాలపై కూడా నిఘా ఉంచారు. సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైంది.. ప్రవర్తనా నియమావళి. ఎన్నికల సందర్భంగా ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోరాదో ఈ నియమావళి నిర్ణయిస్తుంది. ఇది మొత్తం ఎన్నికల తీరుతెన్నులనే మార్చేసింది. ఈ నియమావళికి ప్రతి అభ్యర్థితోపాటు రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కట్టుబడి ఉండాల్సి వచ్చింది. ఎన్నికల సందర్భంగా వీడియో బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నియమావళితో అనేక అక్రమాలకు, అవకతవకలకు తెరపడింది. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఈ సంస్కరణలకు మద్దతు లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ‘నోటా’ను తీసుకొచ్చింది. లెక్కలు చూపాల్సిందే.. అధికారులు, నేతలు కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఎన్నికల పరిశీలకులను నియమించాలని శేషన్ నిర్ణయించారు. ప్రధానంగా ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు వీరిని ఉపయోగించుకున్నారు. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. అంతేకాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77ను కూడా ఆయన ఉపయోగించారు. ఎన్నికల లెక్కలను ప్రమాణపూర్వక అఫిడవిట్ రూపంలో సమర్పించేలా చర్యలు తీసుకున్నారు. – యర్రంరెడ్డి బాబ్జీ సాక్షి, అమరావతి ప్రతి పైసాకూ -
శేషన్‌కు ముందు ..తరువాత
సాక్షి, మహబూబ్‌నగర్ : గ్రామస్థాయిలో పంచాయతీ ఎన్నికలు మొదలుకొని దేశస్థాయిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు పదుల సంఖ్యలో వాహన శ్రేణులు, రాత్రింభవళ్లు తేడా లేకుండా హోరెత్తించే ప్రచారాలు, లౌడ్ స్పీకర్ల హోరు, గోడలపై రాతలు, గుట్టలు గుట్టలుగా తమ నేతలను బలపరుస్తూ ప్రచార పత్రాలు ఇదంతా 1990కి ముందు ఎన్నికలు జరిగే తీరు. ఎన్నికలంటే శేషన్‌కు ముందు.. శేషన్‌కు తర్వాత అన్నంతగా ఎన్నికల నిర్వహణలో మార్పులు చేస్తూ అప్పట్లో హుకూం జారీ చేసి పోటీల్లో నిలిచే అభ్యర్థుల పట్ల సింహస్వప్నంలా మారి నిబంధనల కొరడా ఝులిపించారు. ప్రస్తుతం వీటన్నింటికి కళ్లెం వేసి అభ్యర్థుల హంగామాకు, ఎన్నికల ఖర్చుకు ముకుతాడు వేసిన ఘనత 1990 నుంచి 1996 వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన టీఎన్ శేషన్‌కే దక్కుతుంది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎన్నికల వ్యయానికి జమ, ఖర్చు చెప్పాలని, నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారంలో వినియోగించే వాహనాల ఖర్చు, కార్యకర్తల భోజనాల వ్యయం, పార్టీ ప్రచార ఖర్చు కట్టుదిట్టం చేశారు. వాహనాలకు జెండా కట్టాలంటే, మైక్ పెట్టాలంటే అనుమతి తప్పనిసరి చేశారు. ప్రచారంలో సమయ పాలన, ప్రత్యేకించి రాత్రి సమయాల్లో లౌడ్ స్పీకర్ల హోరెత్తించే ప్రచారం, గోడలపై రాతలు కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
టీఎన్ శేషన్ సతీమణి కన్నుమూత
చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్‌కు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న శేషన్ భార్య విజయలక్ష్మి శనివారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రఖ్యాత మీడియా సంస్థ ‘మనోరమ’ తెలిపింది. చెన్నైలోని గురుకులం ఓల్డేజ్ హోంలో ఉంటున్న శేషన్ దంపతులకు సంతానం లేరు. విజయలక్ష్మి మరణవార్తను తెలుసుకున్న బంధువులు, అభిమానులు శేషన్‌ను ఓదార్చేయత్నం చేశారు. కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో శేషన్ దంపతులు వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. వారి ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు. శేషన్ చనిపోయారంటూ..: కాగా, విజయలక్ష్మి మరణవార్తలపై పలు మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ‘శేషన్ కన్నుమూత’ అంటూ బ్రేకింగ్‌లు ఇచ్చాయి.