గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం బీజేపీకి కంచుకోట అని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బరిలోకి దిగిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రికార్డు స్థాయిలో 10 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని ఆ పార్టీ అంచనావేస్తోంది.
గతంలో ఈ నియోజకవర్గానికి ఎల్‌కె అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి తదితర దిగ్గజ నేతలు ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచి ఈ సీటు బీజేపీకి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ తరపున గతంలో ఎన్నికల బరిలోకి దిగిన టీఎన్ శేషన్, రాజేష్ ఖన్నాలు కూడా ఈ బీజేపీ కోటను చేధించలేకపోయారు.
ఈసారి అమిత్‌షాపై గుజరాత్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సోనాల్ పటేల్ పోటీకి దిగారు. 2019 ఎన్నికల్లో ఐదున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో షా గెలిచారు. 10 లక్షలకు పైగా గెలుపు మార్జిన్‌ను పెంచడమే తమ పార్టీ లక్ష్యమని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నారు.
గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 21.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్‌పూర్, నారన్‌పురా, సబర్మతి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అహ్మదాబాద్ ప్రాంతంలోని ఐదు అర్బన్ స్థానాలు (ఘట్లోడియా, వేజల్‌పూర్, నారన్‌పురా, సబర్మతి, సనంద్) సహా మొత్తం ఏడు స్థానాలను 2022 అసెంబ్లీ ఎన్నికలలో అధికార బీజేపీ గెలుచుకుంది.
1999 సార్వత్రిక ఎన్నికలలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. అదే సమయంలో అతనికి ప్రత్యర్థిగా బీజేపీ అద్వానీని రంగంలో నిలిపింది. ఆ ఎన్నికల్లో శేషన్ ఓటమి పాలైనా అద్వానీకి గట్టిపోటీ ఇవ్వడంలో విజయం సాధించారు. 1991 నుండి 2014 వరకు అద్వానీ గాంధీనగర్ నుండి ఆరుసార్లు గెలిచారు.
1996 లో వాజ్‌పేయి ఈ స్థానంతో పాటు లక్నో నుంచి కూడా పోటీ చేశారు. ఈ రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించారు. ఈ నేపధ్యంలో గాంధీనగర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి చెందిన విజయ్ పటేల్‌పై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది. అయితే ఖన్నా ఓటమి పాలయ్యారు. 2019లో అద్వానీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి అమిత్ షా పోటీ చేశారు. గుజరాత్‌లో మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment