జాతీయ స్థాయిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన శేషన్ వక్రమార్గంలో వెళ్తున్న ఎన్నికల ప్రక్రియను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమించిన మహనీయుడు. టి.ఎన్.శేషన్‌గా సుప్రసిద్ధుడైన తిరునెళ్లై నారాయణ అయ్యర్ శేషన్ 1932 డిసెంబర్ 15న కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించారు. సివిల్ సర్వీస్ పరీక్షలో మంచి ర్యాంకు పొంది, 1954లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 1955లో తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగజీవితంలో ప్రవేశించారు. తమిళనాడులో వివిధ హోదాల్లో పనిచేసి, కేంద్రప్రభుత్వంలో కీలక శాఖల్లో విధులు నిర్వహించారు.
దేశానికి పదవ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా 1990 డిసెం బర్ 12న బాధ్యతలు చేపట్టిన శేషన్ ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగారు. విధి నిర్వహణలో చండశాసనుడిగా పేరుపొందారు. అవినీతి, అక్రమాలతో అపవిత్రమైన ఎన్నికల క్షేత్రాన్ని పునీతం చేసేందుకు ప్రయత్నించి, చాలావరకు విజయం సాధించారు. వందకు పైగా ఎన్నికల అక్రమ విధానాలను ఆయన గుర్తిం చారు. ఆ విధానాలను మార్చేందుకు శ్రమించారు. ఎన్నికల వ్యవస్థ ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఒకరి బదులు మరొకరు ఓటేయడం. ఈ అక్రమ విధానాన్ని అరికట్టేం దుకు ప్రతి ఓటరుకూ గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు పరిమితులు విధించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల అధికారులను పర్యవేక్షణ కోసం నియమించడం కూడా తొలిసారిగా ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయమే.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం; ఎన్నికల్లో ధన ప్రవా హం, ప్రచారం కోసం ప్రభుత్వ నిధులను, యంత్రాంగాన్ని ఉపయోగించడం; ఓటర్లలో కుల, మత వైషమ్యాలను రెచ్చగొట్టడం; ధార్మిక కేంద్రాలను, దేవాలయాలను ప్రచారం కోసం వాడుకోవడం, పోలింగ్ బూతుల ఆక్రమణ మొదలైన ధోరణుల పట్ల శేషన్ కన్నెర్రజేశారు. ఎన్నికల్లో విచ్చలవిడి ధన ప్రవాహానికి చెక్ పెట్టారు. గతంలో ఎన్నికలంటే లౌడ్ స్పీకర్లే గుర్తొచ్చేవి. శేషన్ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఎన్నికల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో 1992లో ఎన్నికలను శేషన్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం రద్దు చేసింది. లోక్‌సభకు 1993లో ఎన్నికల వ్యయాన్ని స్వయంగా కంట్రోల్ రూం నుండి పర్యవేక్షించారు శేషన్. ఆ ఎన్నికల్లో ఖర్చులకు లెక్కలు చూపని 1,488 మంది అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలో మూడేళ్లపాటు పాల్గొనకుండా నిషేధం విధించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేం దుకు 14 వేల మందిని అనర్హులుగా ప్రకటించారు.
శేషన్ ప్రవేశపెట్టిన ఎన్నికల సంస్కరణలు, పకడ్బందీగా అమలు చేసిన నియమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిం చాయి. ఎన్నికల వ్యవస్థలో శేషన్ తెచ్చిన సంస్కరణలను జీర్ణించుకోలేనివారు ‘నేషన్ వర్సెస్ శేషన్’ అన్నా, ‘అల్‌శేషన్’ అంటూ ఆల్సేషియన్ జాతి శునకంతో పోల్చినా జంకని ఉన్నత మనస్కుడు శేషన్. ‘నేను బంతిలాంటి వాడిని. ఎంత వేగంగా గోడకు కొడితే అంత వేగంగా వెనక్కు వస్తాను’ అనేవారు. ఎన్నికల సంస్కరణల అమలు కోసం విశేష కృషి చేసిన శేషన్‌ను 1996లో రామన్ మెగసెసె అవార్డు వరించింది. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ ఉన్నంతకాలం శేషన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది.
(నేడు శేషన్ మొదటి వర్ధంతి)
డా‘‘ రాయారావు సూర్యప్రకాశ్ రావు
94410 46839
Comments
Please login to add a commentAdd a comment