శేషన్‌ ‘కొరడా’ లేకనే బాబు ‘డాబు’! | Chandrababu Naidu Violets Election Code | Sakshi
Sakshi News home page

శేషన్‌ ‘కొరడా’ లేకనే బాబు ‘డాబు’!

Published Tue, Apr 23 2019 12:36 AM | Last Updated on Tue, Apr 23 2019 10:47 AM

Chandrababu Naidu Violets Election Code - Sakshi

‘ఎన్నికల కోడ్‌ ఉన్నంత మాత్రాన నేను వివిధ కార్యక్రమాలకు సమీక్షలు నిర్వహించవద్దంటే ఎలా? అసలు ఎన్నికలకూ, ప్రభుత్వానికీ సంబంధం ఏమిటి?’ అని మన అర్ధజ్ఞాని చంద్రబాబు పేలుతున్నాడు. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఊడి కొత్త ప్రభుత్వం వచ్చి, ప్రమాణ స్వీకారం చేసి అధికారం స్వీకరించే దాకా ఎన్నికల కోడ్‌ అమలులోనే ఉంటుందనే విషయంకూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియదా? ఈసీ కోడ్‌ ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం 10వ కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ గతంలో రాజకీయ పక్షాలను వణికించాడని మరవద్దు. శేషన్‌ లాంటి నిక్కచ్చి అధికారి ప్రస్తుతం ఈసీలో లేకనే మన ‘బాబు’ల ‘డాబు’లు చెల్లుతున్నాయన్నది వాస్తవం.

‘‘దేశ రాజకీయవేత్తల ప్రవర్తన గురించి చర్చించే బదులు దేశ ఎన్నికల సంఘాన్ని చర్చలోకి లాగడం చాలా దురదృష్టకర పరిణామం.  పాలకుల నిర్ణయాల అమలులో జరుగుతున్న తీవ్ర జాప్యంలో ఎన్నికల సంఘానిది పాక్షికంగా బాధ్యత ఉండవచ్చు. కానీ సకాలంలో కమిషన్‌ మేల్కొని వ్యవహరిస్తే దానికి ఇన్ని చిక్కులు రాకపోవచ్చు’’ – కేంద్ర ఎన్నికల కమిషన్‌ మాజీ అధినేత ఎస్‌.వై. క్వరేష్‌

‘‘కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇప్పటికీ తన అధికారాల గురించిన వెతుకులాటలోనే ఉండటం దురదృష్టకరం’’ – త్రిలోచన శాస్త్రి; అఖిల భారత ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ అధ్యక్షులు

ఇరువురు జాతీయ స్థాయి ప్రముఖులు ఎన్నికల కమిషన్‌ తీరుతెన్నుల గురించి ఇలా ప్రస్తావించడానికి కారణం ఏమై ఉంటుందో ఊహించడం కష్టం కాదు. అలాగే అర్ధ సత్యవాదిగా, మిడిమిడి జ్ఞానవాదిగా రాజకీ యాల్లోకి అర్థంతరంగా దూసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఈ క్షణానికి మాత్రం చలామణి అవుతున్న నారా చంద్రబాబునాయుడు దృష్టిలో కూడా ఎన్నికల సంఘం ప్రతిపత్తి చులకన అయిందంటే అందుకు కార ణాలు దేశ పాత, కొత్త పాలకులే కారణం. రాజకీయ బ్రాండ్లతో నిమిత్తం లేకుండా పాలకులు ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో, ఆ తర్వాత అధికారంలో కాలుపెట్టింది లగాయతూ కోట్లకు పడగలెత్తే బాపతు కావడం వల్లనే ప్రజలకు ప్రధాన రాజ్యాంగ సంస్థల ప్రజా స్వామ్య లక్షణాలుగానీ, లక్ష్యాలు కానీ వాటివల్ల కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా అమలులోకి రావలసిన ఏ ప్రజాహిత సంస్కరణ గానీ అందుబాటులోకి రావటం లేదన్నది నగ్నసత్యం.

పలు రిపబ్లిక్‌ రాజ్యాంగ వ్యవస్థల మొక్కట్లను కొన్నాళ్లు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ పరివార్‌ పరిపాలనా శక్తులు ఒక్కటొక్కటిగా చెదరగొ డుతూ చెల్లాచెదరు చేసేస్తూ వస్తున్నారు. దాని ఫలితమే–ఆ రాజ్యాంగ వ్యవస్థల స్వరూప స్వభావాల్ని మార్చడంలో భాగంగా ఓట్ల కోసం నోట్లు, నోట్లకోసం ఓట్లు.. ‘పుచ్చుకో ఇచ్చుకో వాయినం’ అన్నట్లుగా ధనస్వామ్య రాజకీయ ‘పక్షులు’ వ్యవహరించడమే కాకుండా ఏ గణాంక శాస్త్రానికీ, ఏ పన్నుల వసూళ్ల శాఖలకు, ఏ వాణిజ్య సూత్రాలకు అంద నంతగా ‘నోట్ల ముమ్మరం’తో పాలక రాజకీయవేత్తలు బలిసిపోయారని మరిచిపోరాదు. అవినీతి అంతా ఈ ముమ్మరంలోనే ఉంది! సరిగ్గా ఈ దశలోనే మిగతా రాజ్యాంగ వ్యవస్థలు ఎదుర్కొంటున్న పాలక జోక్యం దారీ విధానాన్ని ఎన్నికల కమిషన్‌ కూడా ఎదుర్కోవలసి వచ్చింది!

ఇక్కడొక మహాభారత సూక్తి గుర్తుకొస్తోంది: అరాచక రాష్ట్రానికి గానీ, అరాచక పాలనకు గానీ విముక్తి ఎలా ఎప్పుడు సాధ్యమో సత్యవతి వ్యాసుడితో మొరపెట్టుకుని మరీ చెప్పాల్సి వచ్చింది. పాలకుడు ప్రజాకంటకుడిగా తయారైనప్పుడు ఏం జరుగుతుందో ఆమె చెప్పాల్సి వచ్చింది. సత్యవతి మాటల్లోనే: ‘పాలకుడు తప్పుడు మార్గంలో పరిపా లన సాగిస్తుంటే, అన్ని ధర్మాలు నశించి ప్రజలు బాధలకు, అలజడికి గురవుతారు, అనావృష్టి బాధలు పెరుగుతాయి. ఇక కాలయాపన పనికి రాదు. కనుక వెంటనే ధర్మ మార్గంలో వెళ్లి అధర్మాన్ని పట్టం కట్టి కూర్చున్న దుష్ట పాలకుల్ని తొలగించేయ్‌. రాజ్యం పాడవకుండా కాపాడు’ అన్నది హితవు. అలాంటి కాలయాపనకు పాలకులు పట్టం కట్టారు కాబట్టే నేటి ఎన్నికల కమిషన్‌.. రాజ్యాంగం రూపొందించిన సర్వాధికార సంస్థే అయినా, తన ఉనికిని తాను వెతుక్కోవలసివచ్చి సుప్రీంకోర్టు రక్షణ కోసం వెతుకులాటలో పడింది. గాడి తప్పుతున్న ఎవరిపైన అయినా చర్య తీసుకోవాలన్నా చేతులు కట్టుబడిపోయి, నిశ్చేష్టమై పోతున్నానని కమిషన్‌ కోర్టుకు మొరపెట్టుకుంది. కానీ కొంత కాలంగా పరిణామాలను గమనిస్తున్న వారికి రాజ్యాంగ సంస్థల చేతుల్నే మెలిపెట్టి, తాము చేసే తప్పుడు నిర్ణయాలకు ప్రజా వ్యతిరేకంగా సప్త స్వాతంత్య్రాలకు భిన్నంగా పాలక శక్తులు బరితెగించుతుండటం దేశ పౌరులు గమనిస్తూనే ఉన్నారని మరవరాదు. ఈ ప్రజా వ్యతిరేక పాలక శక్తుల కోవకు చెందినవాడే మన ‘అర్ధ జ్ఞాని’ చంద్రబాబు కూడా.

ఈసీ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ.. లేదా, పాలకులు ఆ నిబంధనావళిని బలహీనంగానే ఉంచాలని భావించినప్పటికీ– కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటిదాకా ప్రధాన అధినేతలుగా పనిచేసిన 22 మంది కమిషనర్‌లలో 10వ కమిషనర్‌గా (1990 డిసెంబర్‌–1996 డిసెంబర్‌) టీఎన్‌ శేషన్‌ అత్యంత ప్రతి భావంతుడిగా, మడమ తిప్పకుండా బాధ్యతలు నిర్వహించి, కేంద్ర రాష్ట్ర పాలకులందరినీ ఎన్నికల నిబంధనావళి నిర్వహణలో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వాన్నే కాదు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని కూడా అదుపాజ్ఞల్లో ఉంచి గడగడలాడిం చాడు. రాజ్యాంగంపైన, దాని ప్రకటిత లక్ష్యాలైన సెక్యులరిజం, సోష లిస్టు, ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ రక్షణకు కట్టుబడి ఉంటామని అన్ని పార్టీలు ప్రతిజ్ఞ చేయాలి. ఆ ప్రతిజ్ఞను ఎన్నికల సమయంలో ఉల్లంఘించి, జాతీయ మైనారిటీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నప్పుడు శేషన్‌ బీజేపీ సీనియర్‌ నాయకుల్ని పిలిపించి ఒక తీవ్ర హెచ్చరిక చేశాడు: ‘మీరు, మీ పార్టీ భారత రాజ్యాం గంపైన, దాని లక్ష్యాలపైన ఆమోదిస్తూ ప్రతిన పూనారా లేదా’ అని ప్రశ్నించి, అందుకు విరుద్ధంగా మీరు ప్రచారాలు చేస్తున్నందుకు ‘మీ పార్టీ గుర్తును ఎందుకు రద్దు చేయకూడదో చెప్ప మని’ శేషన్‌ నిలదీ శాడు. అప్పుడు చాయంగల విన్నపాలతో బీజేపీ నాయకత్వం మొత్తు కుని ‘రాజ్యాంగాన్ని గౌరవిస్తాం’ అని ఒప్పుదలై బయటపడాల్సి వచ్చింది. ఆయన తర్వాత ఎలక్షన్‌ కమిషన్‌కు సీఈసీలుగా వచ్చిన వారిలో ఎం.ఎస్‌. గిల్, నవీన్‌ చావ్లా, జేఎం లింగ్డోలు కూడా ఉన్నంతలోనే స్వతంత్ర శక్తితోనే వ్యవహరించారని చెప్పాలి. అయితే 2018 జనవరి–డిసెంబర్‌ దాకా సీఈసీగా వ్యవహరించిన ఓంప్రకాశ్‌ రావత్‌ బీజేపీ పాలకులు నర్మగర్భంగా ‘కన్నెర్రజేసే’ ప్రవర్తనతో ఒకడుగు వెనక్కి తగ్గిపోతూ వచ్చాడు.

కాగా, దొంగతనంగా ‘పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడ్డం లేదనుకొన్నట్లుగా’, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తరువాత నామ మాత్రావశిష్టంగా పేరుకు తెలుగుదేశం సైన్‌బోర్డు చాటున పాలన కొన సాగిస్తూ వచ్చిన చంద్రబాబు తన ‘నామ్‌కే వాస్తే’ పార్టీకి నూకలు చెల్లి పోయాయన్న గుర్తింపు ఆలస్యంగానైనా వచ్చినట్టుంది. అజ్ఞానంతో ఉన్నవాడికి ‘తెగింపు’ కూడా ఒక లక్షణమో దుర్లక్షణమో ఉంటుందట. కనుక ఒక రోజున ‘నేను ఓడిపోయినా నాకు పెళ్లాం, కొడుకు, మను మడూ ఉన్నారు’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే, మళ్లీ ‘2019 జూన్‌ 8 వరకూ నేనే ముఖ్యమంత్రిని’ అని ప్రజలకు గుర్తు చేస్తూ ‘అందువల్ల ఆ తేదీన నేను 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను కాబట్టి, ఈ ఏడాది అప్పటిదాకా నాకు సమయం ఉంటుంది. కనుక అధికారులతో ఎన్నికల కోడ్‌ ఉన్నంత మాత్రాన నేను వివిధ కార్య క్రమాలకు సమీక్షలు నిర్వహించవద్దంటే ఎలా? విధాన నిర్ణయాలతో పాటు మిగిలిన పనులు కూడా నిర్వహించుకోవచ్చు. ఎన్నికల కమిషన్‌ ఎన్నికల పనులను మాత్రమే చూసుకోవాలి. అసలు ఎన్నికలకూ, ప్రభు త్వానికీ సంబంధం ఏమిటి? ఈవీఎంలపై దేశం మొత్తాన్ని నేనే ఎడ్యు కేట్‌ చేస్తున్నా’ అని పేలుతున్నాడు. అయితే, ఈ అడ్డగోలు ‘వాచాలుడి’కి అసలు ఎన్నికల కోడ్‌ ఒకటుందని, ఎన్నికల ప్రక్రియ అన్ని దశలూ, చివ రికి ఉన్న ప్రభుత్వం ఊడి కొత్త ప్రభుత్వం వచ్చి, ప్రమాణ స్వీకారం చేసి అధికార స్థానాలలో అధిష్టించే దాకా ఎన్నికల ప్రవర్తన నిబంధనావళి అమలులోనే ఉంటుందని ‘రాజకీయ ఆర్థిక వేత్తన’ని ప్రగల్భాలు పోయే ముఖ్యమంత్రికి తెలియదా?

ఎన్నికల మధ్యలో, లేదా కొత్త ప్రభుత్వం అధికారం స్వీకరించే వరకూ కొత్త సీఎం విధాన ప్రకటన విడుదల చేసేంత వరకూ నోరు మెదపకుండా ‘మాజీ’గా రాజీపడి కూర్చునేంతవరకూ– చేతివాటం కొద్దీ, నోటి తీటతో ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించటంగానీ, అధికా రులతో సమీక్షలు జరపడంగానీ, పురమాయింపులు చేయటంగానీ వీలు లేదని ఎన్నికల మోడల్‌ కోడ్‌ 5వ అధ్యాయంలో తెల్లకాగితాలపై నల్లని అక్షరాలతో వివరంగా అచ్చులో ఉందని బాబుకి తెలియదా? లేక చదవలేదా? ఈ ‘మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్టు’ను చట్టంగా తీసుకురాకపో యినా శేషన్‌ కత్తి ఝళిపించాడని మరవద్దు.

ఎన్నికల నిర్వహణ అన్ని దశలూ, కేవలం ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో మినహా, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా ద్రవ్య సంబంధమైన, పాలనాంశాలపైన నిర్ణయాలను అదుపుచేస్తూ ఆ నిబంధనావళిలో ఉన్న విషయం తెలియదా? అదే విషయాన్ని మరో రకంగా పునరుద్ఘాటిస్తూ కోడ్‌ 19వ అధ్యాయం (6వ నిబంధన)లో స్పష్టమైన సలహా, హెచ్చరిక ఉన్న సంగతి కూడా మన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ బాబుకి తెలియదా? లేక ప్రాచీన సూక్తిని గుర్తు చేసుకుని సరిపెట్టుకోవటం మంచిదా– ‘మూర్ఖ నాయక చిత్తముల్‌’ మార్చడం ఎంత కష్టమో, ‘కుక్క తోక పుచ్చుకుని గోదావరి ఈదడం’ కూడా అంతే ప్రయాస. ఆంధ్రులకు అమరావతి పూర్ణ కలశంగా స్థిరపడకుండానే పాలకులు అమరులు కాలేరు. ఎన్నికల ప్రచారం చివరలో ప్రజలముందు వొంగి వొంగి మరీ బాబు చేసిన అభి వాదం ఆయన పదిహేనేళ్ల పాలనలో తొలి ‘ఆపద్ధర్మ’ నమస్కారం, దాని మరో పేరే ‘వొంక దణ్ణం’. అయినా స్వీకరించడం మన ధర్మం!!

- ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement