అస్మదీయులకు అందలం.. బాబు పంతం! | Proposal Of Two TDP leaders as Information Commissioners | Sakshi
Sakshi News home page

అస్మదీయులకు అందలం.. బాబు పంతం!

Published Sun, May 5 2019 3:31 AM | Last Updated on Sun, May 5 2019 9:54 AM

Proposal Of Two TDP leaders as Information Commissioners - Sakshi

సాక్షి, అమరావతి: అధికారాంతమున నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయులను అందలం ఎక్కించాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. ఓ వైపు ఎన్నికల ఫలితాల వరకు విధాన నిర్ణయాలు తీసుకోకూడదన్న కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ, దానిని బేఖాతర్‌ చేస్తూ అయినవాళ్లకు కీలక పోస్టులు కట్టబెట్టాలనుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వేచి ఉండకుండా ఇటీవల కొందరు పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేయడం వివాదాస్పదమైంది. ఇదే రీతిలో మరోవైపు ఇద్దరు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించాలని పట్టుబడుతున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాకే ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న విడుదల చేసింది. అంటే ఆ రోజు నుంచే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. కాగా మార్చి 29న ఇద్దరు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది.

నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రధాన ప్రతిపక్ష నేతతో పాటు ఓ రాష్ట్ర మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ రాష్ట్ర్‌ర సమాచార కమిషనర్ల నియామకానికి పేర్లను పరిశీలించి సిఫార్సు చేయాలి. కానీ ఈ కమిటీ సమావేశంపై చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించ లేదు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగానీ, ఆయన ప్రతినిధికి గానీ అవకాశం ఇవ్వకుండానే సమావేశాన్ని నిర్వహించినట్లు కథ నడిపించారు. అనంతరం దీనిపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే జాప్యం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యాక హడావుడిగా విజయవాడకు చెందిన హోటల్‌ ఐలాపురం యజమాని వెంకయ్య కుమారుడు రాజా, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఈర్ల శ్రీరామ్మూర్తి పేర్లను ప్రతిపాదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో ఈ అంశాన్ని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా ఎన్నికల సంఘానికి నివేదించిన అనంతరం గవర్నర్‌ పరిశీలనకు పంపారు.  

నిబంధనలు తుంగలో తొక్కి..  
సమాచార కమిషనర్లుగా ఎవరిని నియమించాలన్నది కేంద్ర సమాచార హక్కు చట్టం – 2005లోని సెక్షన్‌ 15, సబ్‌ సెక్షన్‌ 5, 6లో స్పష్టమైన విధివిధానాలు పొందుపరిచారు. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు ఆచరిస్తున్న వారినే నియమించాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. నియామక ప్రక్రియతో పాటు ఎవరి పేర్లను ప్రతిపాదించింది.. వారు ప్రజా జీవితంలో ఎంతటి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిందీ మొదలైన వివరాలను ప్రజలకు తెలియజేయాలి. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసింది. ఐలాపురం రాజా విజయవాడలో హోటల్‌ యజమాని, మాజీ ఎమ్మెల్సీ వెంకయ్య కుమారుడు. ఆయన ప్రజా జీవితంలో ఎలాంటి ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన వ్యక్తి కాదు. ఈర్ల శ్రీరామ్మూర్తి గతంలో విశాఖపట్నం జిల్లా చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేకేవీఎస్‌ రాజు వద్ద పీఏగా పని చేశారు. రాష్ట్ర వీఆర్‌వోల సంఘం నేతగా వ్యవహరించారు. వీరిద్దరి పేర్లు, ఇతర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా ప్రభుత్వం గోప్యంగా వ్యవహరిస్తోంది. ఈ పరిణామాలపై సమాచార హక్కు పరిరక్షణ ఉద్యమకారులు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

గవర్నర్‌ నిర్ణయంపై రగిలిపోతున్న బాబు 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాన్ని పాటించడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆ ఇద్దరి అర్హతలపై కూడా ఆయన సంతృప్తి చెందలేదని సమాచారం. ఈ విషయమై ఆయన వివరణ అడిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదన్న మేధావుల విజ్ఞప్తిని ఆయన సానుకూలంగా పరిశీలిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా, ఈ పరిణామాలపై చంద్రబాబు రగిలిపోతున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ నిబంధనలకు కట్టుబడటాన్ని సహించలేక చంద్రబాబు తన సన్నిహితుల వద్ద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో కూడా చంద్రబాబు గవర్నర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు.  

ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి 
పారదర్శకత, సమాచార పంపిణీ పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారినే సమాచార కమిషనర్లుగా నియమించాలి. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన వారినే ఈ పదవుల్లో నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పును పాటించాలి. ఏపీలో ఇప్పటికే నియమించిన సమాచార కమిషనర్లకు కార్యాలయాలు సమకూర్చలేదు. వారు పనిచేసే పరిస్థితులు కల్పించలేదు. తొలుత వారికి ఆ వసతులు కల్పించాలి. అంతేకానీ మరో ఇద్దరిని సమాచార కమిషనర్లుగా అప్పుడే నియమించాల్సిన అవసరం ఏముంది? దీనిపై నిర్ణయాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చాక కొత్త ప్రభుత్వానికి విడిచిపెట్టాలి. 
– మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్‌  

రాజకీయ పునరావాస కేంద్రంగా చేయొద్దు 
రాష్ట్ర సమాచార కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రంగా చేయకూడదు. తగిన విద్యార్హతలు, చిత్తశుద్ధి, ప్రజాజీవితంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన వారినే సమాచార కమిషనర్లుగా నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆ ఇద్దరికీ ఆ అర్హతలు లేవు కాబట్టి వారి నియామకాన్ని ఆమోదించవద్దని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించాం. 
– దాసరి ఇమ్మానియేలు,చక్రధర్‌ బుద్ధ, యూఎఫ్‌ఆర్‌టీఐ ఏపీ రాష్ట్ర కన్వీనర్, కో–కన్వీనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement