ఆ నిందితుడు చంద్రబాబు సన్నిహితుడే! | There is no National Level support for Chandrababu allegations | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై ఓటరు భరోసా..చంద్రబాబు రభస

Published Sun, Apr 14 2019 2:59 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

There is no National Level support for Chandrababu allegations - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కోట్ల మందికి పైగా ఓటేశారు. వారంతా వీవీ ప్యాట్‌లో తమ ఓటు పడిన గుర్తును నిర్ధారణ చేసుకున్నారు. ఆ తర్వాత సంతృప్తితో బయటకు వచ్చారు. తాము బటన్‌ నొక్కిన గుర్తు కాకుండా మరో గుర్తు వీవీ ప్యాట్‌లో కనిపించి ఉంటే అక్కడే ఫిర్యాదు చేసేవారు. కానీ మూడు కోట్లకు పైగా ఓటర్లలో ఒక్కరి నుంచి కూడా ఒక్క ఫిర్యాదు రాలేదు.

ఎన్నికల కమిషన్‌ వైఫల్యంతో రాష్ట్ర ప్రజలంతా తెల్లవారుజాము దాకా ఓటేయడానికి నిరీక్షించాల్సి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. కానీ రాష్ట్రంలోని 46 వేల పోలింగ్‌ బూత్‌లలో రాత్రి 8 గంటల తర్వాత పోలింగ్‌ కొనసాగిన బూత్‌ల సంఖ్య 200 పైచిలుకు మాత్రమే.

దొంగా దొంగా అని దొంగే అరచినట్టు.. వంద ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థ యాత్రకు వెళ్లినట్లు.. ప్రజాస్వామ్య వ్యవస్థల పని తీరుపై చంద్రబాబు మొగసాల కెక్కడం వింతగా,రోతగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ దొడ్లో కట్టేసుకున్న పెద్దమనిషి బహురూప వేషంపై విమర్శల జడి కురిసింది.

ట్యాంపరింగ్‌ దొంగ బాబు సన్నిహితుడే  
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చంద్రబాబు మాటలు చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పాడు పనులు అన్నట్లున్నాయి. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారితో సన్నిహిత సంబంధాలున్నది ఆయనకే. దశాబ్దం క్రితం ఎన్నికల సంఘం నుంచి ఈవీఎంను దొంగలించి ట్యాంపరింగ్‌కు పాల్పడిన నేరంంలో వేమూరి హరిప్రసాద్‌ మీద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇతను, ఇతని సోదరుడు రవికుమార్‌ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వారి సంస్థకే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్ల ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఆ సోదరుల సంస్థకే గన్నవరం వద్ద 100 ఎకరాలను కారుచౌకగా కేటాయించడం గమనార్హం. ఎన్‌ఆర్‌టీ సంస్థ పేరిట రాజధాని అమరావతిలో కూడా 5 ఎకరాల భూమిని కేటాయించారు. కాగా ఈవీఎంలపై సందేహాల నివృత్తి కోసం పంపించే బృందం నుంచి హరి ప్రసాద్‌ను తొలగించాలని సీఈసీ ఆదేశిస్తూ ఝలక్‌ ఇవ్వడం గమనార్హం.    

తప్పు చేసిన ప్రతిసారీ ఢిల్లీకెళ్లి యాగీ  
రాష్ట్రంలో చంద్రబాబు తప్పు చేసి దొరికిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీకి వెళ్లి యాగీ చేశారు. రాష్ట్ర విభజనకు తానే లేఖ ఇచ్చి.. తర్వాత ఆయనే వెళ్లి వద్దంటూ నిరాహార దీక్ష చేశారు.. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు.. వెంటనే ఢిల్లీకి వెళ్లి వ్యవస్థలను మేనేజ్‌ చేసేపనిలో పడ్డారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరించానంటారు.. చీకట్లో వెళ్లి బీజేపీ నాయకులతో మంతనాలు సాగించారు. ఇప్పుడు కూడా అయిదేళ్లూ అరాచకాలు చేశారు.. చివరి నిమిషంలో ఈవీఎంలమీద, ఈసీ చేసిన ట్రాన్స్‌ఫర్లమీద నేరం నెడుతున్నారు. మరోవైపు తనకు 130 సీట్లు వస్తాయంటున్నారు. టీచర్లు పోలింగ్‌ కేంద్రాల్లో ఉంటే తనకు నష్టం అని భావించిన చంద్రబాబు.. ఎన్నికల విధుల్లో ప్రైవేట్, ఇతర ఉద్యోగులను భారీగా నియమించారు. అనుభవం లేని ఉద్యోగులను నియమించడం వల్లే ఈవీఎంలు మొరాయించాయని తెలుస్తోంది. ఈ విషయంపై కూడా విచారణ జరపాలి. ఓటమి ఖాయమవడంతో చంద్రబాబు ఫ్రస్టేషన్‌ చూస్తుంటే.. దేశం వదిలి కుటుంబంతో సింగపూర్‌లోనో, మలేషియాలోనో సెటిల్‌ అవుతారనిపిస్తోంది.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు ఉన్న 3.13 కోట్ల మంది ఓట్లు వేశాక.. తాము ఓటేసిన అభ్యర్థి పేరు, గుర్తు వీవీ ప్యాట్‌లోని తెల్ల కాగితంపై స్పష్టంగా కనిపించడం చూసి సంతృప్తి చెందారు. తాము ఏ గుర్తుకు ఓటు వేశామో ఆ గుర్తుకే ఓటు పడిందని నిర్ధారించుకున్నాక పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు వచ్చారు. తమ ఓటు హక్కును సజావుగా, సులువుగా సద్వినియోగం చేసుకున్నామన్న సంతోషంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, సన్నిహితులకు.. పోలింగ్‌ ఎలా సక్రమంగా, సులువుగా జరిగిందో వివరించి చెప్పారు. దాంతో అంత వరకు కాస్త బద్దకించిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెంటనే పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి సజావుగా ఓటేశారు. అలా ఒకరు.. ఇద్దరు కాదు.. రాష్ట్రంలో 3.13 కోట్ల మంది నిర్భయంగా, సక్రమంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఒక్కరు కూడా తమ ఓటు ఎవరికి పడిందో తమకు తెలియలేదని ఫిర్యాదు చేయలేదు. ఈవీఎంలతోగానీ, వీవీప్యాట్‌లతోగానీ ఇబ్బంది ఏర్పడిందని ఒక్కరు కూడా ఆరోపించనే లేదు.   

అందరిదీ ఒకదారైతే.. చంద్రబాబుది మరోదారి 
రాష్ట్రంలో 80 శాతం మంది ఓటర్లుకు రాని సందేహం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఎందుకు వచ్చిందోనని జనం ఆశ్చర్యపోతున్నారు. తానేసిన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియలేదని ఆయన దిగజారుడు ఆరోపణలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంలతోపాటు వోటర్‌ వెరిఫెరబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రోల్‌ (వీవీప్యాట్‌)లను వినియోగించారు. ఈవీఎంలో బటన్‌ నొక్కగానే ఓటు పొందిన అభ్యర్థి పేరు, గుర్తు ఆ వీవీ ప్యాట్‌లో ఓటర్లందరికీ కనిపించాయి. తమ ఓటు ఎవరికి పడిందో తెలీలేదని నిరక్ష్యరాస్యులు, వయోవృద్ధులు కూడా సందేహం వ్యక్తం చేయలేదు. కానీ చంద్రబాబుకు మాత్రం తన ఓటు ఎవరికి పడిందో కూడా తెలీదట. మరి ఓటు ఎవరికి పడిందో తెలియకపోతే ఆయన వెంటనే ఆ పోలింగ్‌ బూత్‌లో అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఫిర్యాదు చేసి ఉంటే అధికారులు వెంటనే స్పందించే వారు కదా.. రాష్ట్రంలో 3.13 కోట్ల మంది సవ్యంగా ఓటేశారు. వారిలో టీడీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కానీ ఒక్కరు కూడా తమ ఓటు ఎవరికి పడిందో అన్న సందేహం వ్యక్తం చేయలేదు. నిజంగా ఎవరికి ఓటు పడిందో తెలియకపోతే రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అలజడులు జరిగేవి. అలా జరగలేదంటే తాము ఎవరికి అయితే అనుకున్నామో వారికే తమ ఓట్లు పడ్డాయని రాష్ట్రంలోని ఓటర్లందరికీ తెలిసిందన్నది సుస్పష్టం.  
ఈవీఎంలపై 80 శాతం మందికి పూర్తి నమ్మకం 
రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. 79.60 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అంటే మొత్తం 3.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతను నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో 78.41 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకంటే ఈసారి 1.23 శాతం ఎక్కువగా ఓటింగ్‌ నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో 46,120 పోలింగ్‌ బూత్‌లలో ఎన్నికలు నిర్వహించారు. అందు కోసం రికార్డు స్థాయిలో 92 వేల ఈవీఎంఎలను వినియోగించారు. గురువారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓపిగ్గా క్యూలలో నిలబడి మరీ క్రమశిక్షణతో పోలింగ్‌ బూత్‌లలోకి వచ్చారు.

ఈవీఎంల వద్దకు వెళ్లి తమకు నచ్చిన పార్టీకి ఓటేశారు. తాము వేసిన వారికే ఓటు పడిందో లేదా వీవీ ప్యాట్‌లలో నిర్ధారించుకుని సంతృప్తితో బయటకు వచ్చారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఓటరు కూడా పోలింగ్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎన్నికల సంఘం ఇంత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించబట్టే రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 సాధారణ ఎన్నికల ప్రక్రియలో తొలి దశలో దేశంలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గురువారం ఎన్నికలు నిర్వహించింది. దేశంలో దాదాపు 14 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఏపీ, బెంగాల్‌లలోనే 80 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా ఈవీఎంల పని తీరుపట్ల దాదాపు సంతృప్తి వ్యక్తమైంది. 

ఓటమి ఖాయమని తెలిసే బాబు చిందులు 
ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతోనే చంద్రబాబు నానా రభస చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించనుందని కొంత కాలంగా జాతీయ సర్వేలు స్పష్టం చేస్తుండటంతో చంద్రబాబులో గుబులు పట్టుకుంది. దాంతో ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు పన్నాగం పన్నారు. కానీ ఆయన అక్రమాలకు వత్తాసు పలికే అప్పటి ఇంటలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు శ్రీకాకుళం, వైఎస్సార్‌ జిల్లా ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. టీడీపీకి వత్తాసు పలుకుతున్న ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను కూడా పోలింగ్‌కు ముందు రోజు బదిలీ చేసింది. తమ కుతంత్రాలను ఎన్నికల సంఘం అడ్డుకోవడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. హడావుడిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వద్దకు నేరుగా వెళ్లి ఆయన్ని నిలదీయడం అందర్నీ విస్మయపరిచింది. అప్పటి నుంచి చంద్రబాబు అపరిచితుడి మాదిరిగా పూటకో రీతిలో చెలరేగిపోతున్నారు.  

అమరావతి, హస్తినలో నిస్సిగ్గుగా అబద్ధాలు 
పోలింగ్‌ రోజు గురువారం ఉదయం 10 గంటల్లోపే పోలింగ్‌ ట్రెండ్‌ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందని ఇంటలిజెన్స్‌ వర్గాలు చంద్రబాబుకు నివేదించాయి. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తూ నానా హడావుడి చేశారు. ఆయన ఉండవల్లిలోని పోలింగ్‌ బూత్‌కు వెళ్లి సజావుగా ఓటేసి బయటకు వచ్చారు. ఆ పోలింగ్‌ బూత్‌లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కానీ, అసౌకర్యంకానీ కలగలేదు. కానీ బయటకు రాగానే ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా 30 శాతం ఈవీఎంలు పని చేయడం లేదని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రీపోలింగ్‌కు డిమాండ్‌ చేశారు. ఏ గుర్తుకు ఓటేసినా ఫ్యాన్‌కు పడుతోంది.. కమలం గుర్తుకు పడుతోంది.. అంటూ నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేయడం ఆయనకే చెల్లింది. పోలింగ్‌ జరిగిన మర్నాడు అంటే శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘంపై చిందులు తొక్కారు. శనివారం ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ రభస చేయడం అందర్నీ విస్మయ పరిచింది. చంద్రబాబు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాతో శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై అహేతుకమైన, ఊహాజనితమైన ఆరోపణలు చేశారు. తాము నిబంధనల మేరకే ఎన్నికలు నిర్వహించామని అరోరా స్పష్టం చేసినట్లు తెలిసింది. దాంతో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అదేరీతిలో నిస్సిగ్గుగా అసత్య ఆరోపణలు చేశారు.  

0.03% మొరాయిస్తే 30% అన్న చంద్రబాబు  
ఈసారి ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడం చాలా తక్కువగానే జరిగింది. సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్‌ మేషిన్లు అయినా సాంకేతిక సమస్యలతో మొదట్లో 5 శాతం వరకు మొరాయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో  కేవలం 0.03 శాతం ఈవీఎంలే మొదట కాస్త మొరాయించాయి. మొత్తం 92 వేల ఈవీఎంలలో కేవలం 400 ఈవీఎంలు మాత్రమే మొరాయించాయి. అది కూడా ముందురోజు నిర్వహించిన మాక్‌ పోలింగ్‌ డాటా తొలగించక పోవడంతోనే సాంకేతిక సమస్య ఏర్పడింది. సంబంధిత ఇంజినీర్లు వెంటనే వచ్చి వాటిని సరిచేయడంతో పోలింగ్‌ సజావుగా సాగింది. చంద్రబాబు మాత్రం ఏకంగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని చెబుతూ అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయడం విస్మయ పరిచింది. అందుకే ఆయన డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.  

6 గంటల తర్వాత పోలింగ్‌ కేవలం 228 బూత్‌లలోనే 
రాష్ట్రంలో 46 వేల పోలింగ్‌ బూత్‌లలో కేవలం 228 బూత్‌లలోనే సాయంత్రం 6 గంటల తరువాత పోలింగ్‌ కొనసాగింది. అది కూడా ఎండ తీవ్రతతో ఆ బూత్‌లలో ఓటర్లు మధ్యాహ్నం ఓట్లు వేయడానికి రాలేదు. సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న వారందరినీ ఓటింగ్‌ను అనుమతించాలి. కాగా, పోలింగ్‌ చివరి దశలో అక్రమాలకు టీడీపీ మరింత బరితెగించడంతోనే ఆలస్యమైంది. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు వద్ద సాయంత్రం 7 గంటల తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వర్గీయులను క్యూలైన్లలోకి పంపించారు. వారికి  ఓటువేసే అవకాశం కల్పించకూడదని, పోలింగ్‌ ముగించాలని డిమాండ్‌ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులపై ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో దాడికి దిగారు కూడా. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఏకంగా 30 శాతం పోలింగ్‌బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉంది. 

2014 ఎన్నికల్లోనూ ఈవీఎంలే  
దేశంలో 2004 నుంచి ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారానే నిర్వహించారు. అప్పుడు ఆయన ఈవీఎంల మీద సందేహం వ్యక్తం చేయనే లేదు. అప్పట్లో వీవీ ప్యాట్‌లు లేవు. ప్రస్తుతం వీవీ ప్యాట్‌లు కూడా ఏర్పాటు చేయడంతో తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లకు కచ్చితంగా తెలుస్తోంది. ఇక 2016లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఈవీఎంలే వినియోగించారు. అప్పుడు అక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది. అప్పుడు కూడా ఆయన ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేయలేదు. 2014 నుంచి 2018వరకు కేంద్రంలో బీజేపీతో కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఏనాడు ఈవీఎంలు వద్దు.. పేపర్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించనే లేదు. అయితే ఇప్పుడు మాత్రం.. అదీ పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలు వద్దు.. మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేయడం గమనార్హం. కంప్యూటర్లు నేనే తెచ్చాను.. సెల్‌ఫోన్లు నేనే తెచ్చాను.. టెక్నాలజీ నేనే తెచ్చాను.. అంటూ హైటెక్‌ సీఎంగా చెప్పుకునే చంద్రబాబు మళ్లీ పేపర్‌ బ్యాలెట్‌ తేవాలని అనడం విడ్డూరమని జనం నవ్వుకుంటున్నారు. 

బాబుకు దక్కని మద్దతు  
ఎన్నికల సంఘం, ఈవీఎంలపై అసంబద్ధ ఆరోపణలు చేసిన చంద్రబాబు జాతీయ స్థాయిలో ఎలాంటి మద్దతు కూడగట్టలేకపోయారు. ఆయన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం కూడా తోసిపుచ్చినట్లు సమాచారం. తాము నిబంధనల మేరకు సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరా స్పష్టం చేశారని తెలిసింది. దాంతో చంద్రబాబు అసహనంగా బయటకు వచ్చేశారు. ఇరత పార్టీల నుంచి చంద్రబాబుకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌తోసహా పలు బీజేపీయేతర పార్టీలు ఆయన వాదనను సమర్థించేందుకు సుముఖత చూపలేదు. ఈవీఎంల ద్వారానే ఇటీవల రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అందుకే ఆ పార్టీ చంద్రబాబుకు ఈ విషయంలో మద్దతు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. ఢిల్లీలో తనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో చంద్రబాబు డీలా పడ్డారు. దాంతో మరో రోజు ఢిల్లీలో ఉండి కాస్త హడావుడి చేయాలని భావిస్తున్నారు. 

ఈసీ ఛాలెంజ్‌ను ఎందుకు స్వీకరించలేదు?  
ఈవీఎంలు ట్యాంపర్‌ చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెట్టడాన్ని ఢిల్లీలోని అధికార వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. అప్పటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నదీం జైదీ తీవ్రంగా స్పందించారు.ఎవరైనా ఈవీఎంలు ట్యాంపర్‌ చేయండి చూస్తాం అని ఆయన 2017 మేలో రాజకీయ పార్టీలకు సవాల్‌ విసిరారు. గడువులోగా టీడీపీతోపాటు ఏ పార్టీ కూడా ఆ సవాల్‌ను స్వీరించనే లేదు. అప్పుడు సవాల్‌కు స్పందించని చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్‌ చేస్తున్నారు.. చిప్పే కదా మేనేజ్‌ చేసేస్తున్నారని అసంబద్ధ ఆరోపణలు చేయడాన్ని ఎన్నికల సంఘం అధికారులు తప్పుబడుతున్నారు.  

చంద్రబాబు మాటలు హాస్యాస్పదం  
నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు తాను వేసిన ఓటు ఎవరికి పడిందో తెలియడం లేదని చెప్పడం చూస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారు. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్‌ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక  డిస్‌ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌లో కనిపిస్తుంది. నేను ఓటు వేసిన సమయంలో గమనించి సంతృప్తి చెందా. 
– రామకృష్ణమరాజు, విజయపురం, చిత్తూరు జిల్లా 

మేమంతా స్వేచ్ఛగా ఓటు వేశాం..   
బాబుకి చాదస్తం ఎక్కువైనట్లుగా ఉంది. అందుకే ఎన్నికల కమిషన్‌పై నిందలు మోపుతున్నారు. మేమంతా స్వేచ్ఛగా ఓటు వేశాం. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్‌ప్లేలో కనిపించాయి. నేను దీనిని గమనించా. ఓటు వేశాక  కొన్నిసెకన్ల పాటు మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌ డిస్‌ప్లేలో కనిపిస్తుంది.   
– రాజశేఖర్, గ్రామదట్ల, రాయదుర్గం మండలం, అనంతపురం 

పేరు, గుర్తు డిస్‌ప్లేలో కనిపించాయి
రాష్ట్రంలో అవినీతి పాలనతో విసుగు చెందారు. రాష్ట్రాభివృద్ధి కోసం పొరాడే వ్యక్తిని కోరుకుంటున్నారు. నేను ఎవరికి ఓటు వేశానో పేరు, ఎన్నికల గుర్తు డిస్‌ప్లేలో కనిపించాయి. ఓటు వేశాక  కొద్ది సమయం డిస్‌ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌లో కనిపిస్తోంది. నేను ఓటు వేసిన సమయంలో ఈ విషయం స్పష్టమయ్యింది. 
– సిరాజిన్‌బేగం, పులివెందుల  

ఓటు వేసినప్పుడు కనిపిస్తుంది
చంద్రబాబునాయుడుకు తన సొంత ఇంటెలిజెన్స్‌ బృందం ఓటమి తప్పదని హెచ్చరించడంతో ఆయన గుండెలు గుబిల్లుమంటున్నాయి. నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్‌ప్లేలో కనిపించాయి.  ఓటు వేశాక  కొన్ని సెకన్ల సమయం డిస్‌ప్లేలో మనం ఎవరికి ఓటు వేశామో వీవీప్యాట్‌లో కనిపిస్తుంది. నేను ఓటు వేసిన సమయంలో ఆ విషయాన్ని గుర్తించాను. 
– గర్నెపూడి వెంకటేశ్వరావు, అమృతలూరు 

భూతద్దంలో చూడాల్సిన పనిలేదు 
ఈవీఎంల్లో నేను వేసిన ఓటు వీవీ ప్యాడ్‌ల్లో గుర్తు కనిపించింది.  నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్‌ప్లేలో కనిపించాయి. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు.   
– అట్టాడ హేమసుందర్, రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ చైర్మన్, విజయనగరం

ఈవీఎంలలో మోసం ఉండదు.. 
మనం ఓటు ఎవరికి వేశామో సెకన్లలోపు తెలియడం ఆనందాన్నిచ్చింది. ఈవీఎం మిషన్లలో తారుమారు చేయడం అనేది జరగదని నేను నమ్ముతున్నాను. ఇందులో మోసం జరిగే అవకాశమే ఉండదు. అనవసర రాద్ధాంతం చేయడమేనని అనుకుంటున్నా. 
– సాయిన రమాగౌతమి, పాతూరు, బీడీఎస్‌ స్టూడెంట్, పశ్చిమగోదావరి జిల్లా  

గత ఎన్నికలూ ఈవీఎంలతోనే ..
గత ఎన్నికల్లోనూ ఈవీఎంలపైనే ఓటింగ్‌ జరిగింది. అపుడు అందరూ ఓటమిని, విజయాన్ని అంగీకరించారు. అప్పటి కన్నా ఇపుడు వీవీప్యాట్‌ మెషీన్‌ సంతృప్తికరంగా ఉంది. మనం వేసిన ఓటు ఏ గుర్తుకు పడిందీ కనిపించడం బాగుంది. 
– బేతా నూకరాజు, సీనియర్‌ సిటిజన్,రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, కొత్తకోట, విశాఖ జిల్లా  

నాకు కనిపించాయి..
కంప్యూటర్లను నేనే తెచ్చా, సెల్‌ఫోన్లను నేనే పరిచయం చేశానని నిత్యం చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఈవీఎంలు పనికి మాలినవి అని మాట్లాడుతుండటం వింతగా ఉంది.  నేను ఎవరికి ఓటు వేశానో ఆయన పేరు, ఎన్నికల గుర్తు డిస్‌ప్లేలో కనిపించాయి.   
– షేక్‌ నాయబ్‌ రసూల్, కావలి  

వీవీ ప్యాట్‌లో సరి చూసుకున్నా..
ఓటమి భయంతో చంద్రబాబు ఈసీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఓటు వేసి, వీవీ ప్యాట్‌లో సరిచూసుకున్నాను. అంతా సక్రమంగానే ఉంది. 
–పి.వైకుంఠరావు, న్యాయవాది, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా 

నాకు స్పష్టంగా కనిపించాయి..
నేను ఏ పార్టీకి ఓటు వేశానో చూసుకున్నా. అభ్యర్థి ఫొటో, పేరు, పార్టీ గుర్తు స్పష్టంగా కనిపించాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకు కనిపించలేదో!   
–జి సోమన్న యాదవ్, తడకనపల్లె, కర్నూలు జిల్లా  

వీవీ ప్యాట్‌లో నేను నొక్కిన గుర్తు కనబడింది  
మొదట ఈవీఎంలో నాకు నచ్చిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తు పక్కన ఉన్న బటన్‌ నొక్కా. తరువాత పక్కన ఏర్పాటు చేసిన వీవీప్యాట్‌లో నేను నొక్కిన గుర్తు కనబడిందా లేదా అని పరిశీలించుకున్నాను.   
– జెట్టి చంద్రశేఖరరెడ్డి, రోటరీ క్లబ్‌ అసిస్టెంట్‌ గవర్నర్, సింగరాయకొండ 

బీప్‌ శబ్దం కూడా వచ్చింది  
చంద్రబాబు ఓటమి భయంతో ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. ఈవీఎంలో ఏ గుర్తుపై ఓటు వేశామో వీవీ ప్యాట్‌లో ఎవరికి ఓటు పడిందో కూడా స్పష్టంగా కనిపించింది.  గుర్తుపై నొక్కినప్పుడు బీప్‌ శబ్దం కూడా వచ్చింది. వీవీ ప్యాట్‌లు సరిగా పనిచేయలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. 
– పమిడిపల్లి నానాజీ, ఏడిద, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా 

అందరికీ అర్థమయ్యేలా..   
గతంలో ఈవీఎం ద్వారా ఎన్నికల్లో ఓటు వేసినట్లు బీప్‌ శబ్ధం గుర్తించి సంతృప్తి చెందాం. ఇప్పుడు మాత్రం ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌ కూడా అదనంగా జతచేయడంతో అభ్యర్థి ఫొటో, పార్టీ గుర్తును చూడగలుగుతున్నాం. ఎవరికి ఓటు వేశామనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కమిషన్‌ ఈ సారి ఎన్నికలను చాలా పారదర్శకంగా, పగడ్భందీగా నిర్వహించింది..  
– జోజిమేరి, చిరువ్యాపారి ఆనందపురం,ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement