సాక్షి, అమరావతి: పేపర్ బ్యాలెట్‌కు ఉన్న సౌలభ్యాన్ని చూడకుండా ఈవీఎంల విషయంలో ఈసీ ఎందుకు ఇన్ని డ్రామాలాడుతోందని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. మీరే డిక్టేటర్ అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలను మీరే నియమించుకోండని విమర్శించారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద ప్రజావేదిక హాలులో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీ పంపిస్తే ఈసీ చదివిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి ఎన్నికలను గతంలో కంటే విరుద్ధంగా ఎందుకు ముందుగా పెట్టారంటే సమాధానం లేదన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో అధికారులను బదిలీ చేసి భయబ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. వీవీ ప్యాట్స్ విషయంలో లెక్కింపు కుదరదనడానికి ద్వివేది ఏమైనా ఎక్స్‌ఫర్టా? ఆయన నిన్నటి వరకు నా దగ్గర పని చేయలేదా? అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీని ప్రమోట్ చేసింది తానేనని, సాంకేతిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చానని చెప్పారు.
ఈవీఎంలను మేనేజ్ చేయడం చాలా సులువని అన్నారు. 191 దేశాలకుగాను 18 దేశాలు మాత్రమే ఈవీఎంలు వాడుతున్నాయన్నారు. జర్మనీ, నేదర్లాండ్, ఐర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం గతంలో వాడి ఇప్పుడు వెనక్కు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఈవీఎంల వినియోగం తీరుపై ఈ సందర్భంగా ఆయన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2009 నుంచి ఈవీఎంలకు వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తోందన్నారు. పోలింగ్ రోజునే అవకతవకలు జరుగుతూంటే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం ఏమిటని, ఎన్నికల సంఘం ఎక్కడ సజావుగా ఎన్నికలు జరిపిందని ప్రశ్నించారు. ఈవీఎం యంత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా సమీక్షించే సరైన వ్యవస్థ లేదన్నారు.
నా ఓటు ఎవరికి పడిందో?
వీవీ ప్యాట్‌లలోను ఓటు ఎవరికి వేశామనేది ఏడు సెకన్లు కన్పించాల్సి ఉండగా, మూడు సెకన్లు కూడా కనిపించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఓటు ఎవరికి వెళ్లిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికలకు ముందుగానే తమకు ఈవీఎంలపై అనుమానాలున్నాయని చెప్పామని చంద్రబాబు అన్నారు. ఎన్నికలకు ముందు బ్యాలెట్ అంటే సమయం సరిపోదన్నారని, అందువల్ల 100 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని డిమాండ్ చేశామన్నారు. కనీసం 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించడానికి వీరికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. వీవీ ప్యాట్ స్లిప్‌లు కౌంట్ చేయనప్పుడు వాటికి రూ.9 వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని అడిగారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత తీసుకు రావడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేస్తే సారీ అనే ఒక్క పదంతో ఈసీ తేల్చేసిందన్నారు. అసలు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ విధానంపై అందరికీ స్పష్టత ఉండాలని, ఎన్నికల సంఘం ముందు అనేక అంశాలు వివరించామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఇందుకు ఐక్య కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా 23 రాజకీయ పార్టీలు జాయింట్ పిటిషన్ వేశాయని చెప్పారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు పడుతుందని ఈసీ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్నారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపునకు ఆరు రోజులు ఎందుకు పడుతుందని, ఈ విధానంపై సుప్రీంకోర్టుకు కొత్త పిటిషన్ (రివ్యూ పిటిషిన్) వేస్తామన్నారు.
150 సీట్లకు పైగా గెలుస్తాం..
ఈవీఎంలపై తాను మాట్లాడుతుంటే తాము ఓడిపోతామనే అనుమానాలు రేపుతున్నారని చంద్రబాబు అన్నారు. ‘గెలుపు విషయంలో నేను భయపడటమేంటి? మేమెందుకు ఓడిపోతాం? ఎలా ఓడిపోతాం? ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అర్ధరాత్రి వరకు ఉండి ఒక స్ఫూర్తితో ఓటేశారు. ఎవరెన్ని మాట్లాడుతున్నా అండర్ కరెంట్ చూడబోతున్నారు. 150కి పైగా సీట్లలో మేమే గెలుస్తాం. మోదీ ఎన్నికల్లో డబ్బు పంచి గెలవాలనుకుంటున్నారు. హెలికాఫ్టర్‌లో డబ్బులు తీసుకుపోతున్నారు. మోడల్ కోడ్ మోదీకి వర్తించదా? మొత్తం వ్యవస్థను మోదీ భ్రష్ట్రు పట్టించారు. నేరస్తులకు ఆయన చౌకీదారు. పెద్ద నోట్లు రద్దు చేసి మళ్లీ రూ.2 వేలు తేవడం ద్వారా వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. రాఫెల్ విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు’ అన్నారు. పాకిస్తాన్‌పై దాడుల విషయంలో కూడా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment