బెడిసికొట్టిన పచ్చ వ్యూహం! | TDP has been Assisted by superiors to do irregularities in elections | Sakshi
Sakshi News home page

బెడిసికొట్టిన పచ్చ వ్యూహం!

Published Wed, Apr 17 2019 4:07 AM | Last Updated on Wed, Apr 17 2019 4:07 AM

TDP has been Assisted by superiors to do irregularities in elections - Sakshi

హరికృష్ణ ప్రసాద్, కలెక్టర్‌ ప్రద్యుమ్న

ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న అధికార టీడీపీ కొందరు ఉన్నతాధికారుల సహకారంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వేసిన పథకం గుట్టు రట్టయింది. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరి హరికృష్ణప్రసాద్‌ సోమవారం ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించిన అంశాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హోదాలో నేరుగా కలెక్టర్ల సమావేశాల్లో పాల్గొని వారికి నేరుగా ఆదేశాలు ఇచ్చినట్లే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో కూడా అదే విధంగా ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి.
– సాక్షి, అమరావతి

పోలింగ్‌కు ముందు రోజు చర్చలా?
ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్నతో పోలింగ్‌కు ముందు రోజు చర్చించినట్లు వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏప్రిల్‌ 10వ తేదీన చిత్తూరు జిల్లా పీలేరు 273వ నంబర్‌ బూత్‌లోని ఈవీఎంలో ఓటు వేస్తున్న వీడియో బయటకు వచ్చిన విషయం గురించి కలెక్టర్‌ ప్రద్యుమ్నకు ఫోన్‌చేసి మాట్లాడినట్లు హరిప్రసాద్‌ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య ఈవీఎంల గురించి సుదీర్ఘంగా సంభాషణ సాగిందని ఆ ఇంటర్వ్యూను బట్టి తెలుస్తోంది. ఈసీని, ఉన్నతాధికారులను సంప్రదించకుండా ఒక పార్టీకి చెందిన వ్యక్తితో కలెక్టర్‌ కీలక విషయాలు మాట్లాడకూడదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈవీఎంలను అన్నింటినీ పరిశీలించి బూత్‌లకు పంపిస్తారని, ఎన్నికల రోజు ఉదయం 5.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాత్రమే మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తారని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈవీఎంలకు బ్యాలెట్‌ పేపర్లు కూడా కమిషనింగ్‌ సెంటర్‌లోనే అతికించి అక్కడ ఒకసారి మాక్‌ పోలింగ్‌ నిర్వహించి ర్యాండమైజేషన్‌ చేసి పంపిస్తామని పేర్కొన్నాయి. కానీ హరిప్రసాద్‌ ఆ ఇంటర్వ్యూలో చిత్తూరు జిల్లా పీలేరు 273వ నంబర్‌ బూత్‌లో బ్యాలెట్‌ పేపర్‌ అతికిస్తున్నట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బయటకు వచ్చిన వీడియోలో కూడా సైకిల్‌ గుర్తుకే ఓటు వేసినట్లు ఉండటం.. అదీ పోలింగ్‌కు ముందు రోజు రాత్రే బయటకు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు పోలింగ్‌ విధుల్లో ఉన్న ఏ అధికారి కారణమో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్‌ ఆ అంశంపై దృష్టి సారించకుండా అధికార టీడీపీకి కొమ్ముకాసేలా ఎలా వ్యవహరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం ఈ అంశంపై దృష్టి పెట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సీఎం ఆదేశాల మేరకే..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కలెక్టర్లు హరిప్రసాద్‌ అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్లు తెలుస్తోంది. ఒక ఐటీ కంపెనీకి చెందిన హరిప్రసాద్‌పై 2010లో ఈవీఎంల దొంగతనం కేసు నమోదైనప్పటికీ అతన్ని తీసుకొచ్చి రాష్ట్ర సాంకేతిక సలహాదారుగా నియమించుకున్నారు. ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్‌ చేయడంలో చెయ్యి తిరిగిన హరిప్రసాద్‌ను ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ పదవిలోకి తీసుకురావడమే కాకుండా జిల్లా కలెక్టర్ల సమావేశాలకు తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశారు. హరిప్రసాద్‌కు టెక్నాలజీపై మంచి పట్టు ఉందని, ఇతను ఏమి చెప్పినా చెయ్యండంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హరిప్రసాద్‌.. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి టెక్నాలజీ వినియోగం, సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్‌ కనెక్షన్లు, టీవీలు, కంప్యూటర్ల కొనుగోళ్ల దగ్గర నుంచి అన్నీ తానై నడిపించారు. ఈవీఎంలు ఎలాగు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి ఎన్నికల సమయంలో ట్యాంపరింగ్‌ చేయడం సులభమవుతుందని ప్రణాళిక రచించుకున్నారు. ఇందులో భాగంగానే హరిప్రసాద్‌ చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, హరిప్రసాద్‌ల వ్యూహం ఇది వరకే బయట పడటంతో వారికి చేయూతనందించిన రాష్ట్ర ఎన్నికల సంఘంలోని కీలక అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వీరికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విభాగాల్లోని కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. దీంతో వీరు రచించుకున్న ప్రణాళిక అమలు కాక ఈవీఎంలపై అడ్డగోలు వాదనకు దిగుతూ జుట్టు పీక్కుంటున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఈవీఎంల దొంగ వేమూరి
వేమూరి హరికృష్ణ ప్రసాద్‌.. ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం వెనుక సూత్రధారి. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతో ఈవీఎంలపై నెపం నెట్టేందుకు చంద్రబాబు ఆడుతున్న నాటకంలో ముఖ్య పాత్రధారి. ఇంతకూ ఇతనెవరనేది ఒక్క మాటలో చెప్పాలంటే.. చంద్రబాబు బినామీ, అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి అవినీతి బంధం విడదీయరానిదని చెప్పేందుకు ఎన్నో రుజువులున్నాయి. హరికృష్ణ ప్రసాద్‌ 2010లో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఈవీఎంను దొంగిలించిన కేసులో పోలీసులు అయన్ను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 2009లో వరుసగా రెండోసారి టీడీపీ ఓడిపోయాక చంద్రబాబు కుయుక్తులకు తెరతీశారు. ఈవీఎంల వల్లే తాను ఓడిపోయానని దేశాన్ని నమ్మించాలనుకుని ఆ బాధ్యతను తన సన్నిహితుడు హరికృష్ణ ప్రసాద్‌కు అప్పగించారు. దాంతో ఈవీఎంలను ట్యాంపర్‌ చేయొచ్చని తాను నిరూపిస్తానని ఆయన ఢిల్లీలో ఓ ప్రదర్శన నిర్వహించారు. కాగా ఆయన అందుకోసం ముంబయిలోని ఎన్నికల సంఘం గోదాం నుంచి ఈవీఎంను దొంగలించినట్లు ఎన్నికల సంఘం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మహారాష్ట్ర పోలీసులు 2010 ఏప్రిల్‌ 20న అతన్ని అరెస్టు చేశారు. 454, 457, 380 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.  

బినామీ బంధం.. దోపిడీనే లక్ష్యం
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక వేమూరి హరికృష్ణ  ప్రసాద్‌ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది. ప్రభుత్వ వ్యవహారాలైనా, టీడీపీ వ్యవహారాలైనా ఆయనకే పెద్దపీట వేస్తూ వచ్చారు. రాష్ట్ర ఈ గవర్నెన్స్‌ అథారిటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్‌ సొసైటీ, స్టేట్‌ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ టెండర్ల పరిశీలన, మదింపు కమిటీలలో సభ్యుడిగా నియమించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ మరీ ఏకపక్షంగా భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అందులో కొన్ని..

అడ్డగోలుగా ఈపాస్‌ కాంట్రాక్టు
చంద్రబాబు అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖలో ఈపాస్‌ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌ సంస్థకు కట్టబెట్టారు. ఎల్‌–1, ఎల్‌–2లుగా వచ్చిన సంస్థలను కాదని ఎల్‌–3గా వచ్చిన టెరాసాఫ్ట్‌కు ఆ కాంట్రాక్టును అప్పగించడం వివాదాస్పదమైంది. మరోవైపు ఈపాస్‌ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌ సంస్థ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. దాంతో ఏపీ టెక్నాలాజికల్‌ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌) ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దాంతో ఇక టెరాసాఫ్ట్‌ సంస్థకు ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదు.

ఫైబర్‌ గ్రిడ్‌లో రూ.2 వేల కోట్ల కాంట్రాక్టులు
రాష్ట్ర ఫైబర్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) కాంట్రాక్టుల్లో వేమూరి హరి ప్రసాద్, రవికుమార్‌లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టులను అడ్డగోలుగా వారిద్దరికి చెందిన టెరాసాఫ్ట్‌ సంస్థకు కట్టబెట్టారు. అందుకోసమే ముందు జాగ్రత్తగా హరి ప్రసాద్‌ను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ టెండర్ల కమిటీలో సభ్యుడిగా నియమించారు. రూ.333 కోట్ల ఫైబర్‌ గ్రిడ్‌ మొదటి దశ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌కు 2015లో కట్టబెట్టారు. ఈ సంస్థ బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్నప్పటికీ  నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టు అప్పగించడం గమనార్హం. రెండో దశలో కూడా రూ.1,500 కోట్ల కాంట్రాక్టును అదే సంస్థకు కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ టెలికాం ఇండస్ట్రీ (ఐటీఐ), టెలీకమ్యూనికేషన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌) సంస్థల టెండర్లను కనీసం పరిశీలించకుండానే తిరస్కరించారు. టెరాసాఫ్ట్‌ సంస్థకు అనుకూలంగా నిబంధనలను పలుసార్లు సవరించి మరీ కాంట్రాక్టులను కట్టబెట్టారు. దీనిపై ఐటీఐ, టీసీఐఎల్‌ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టు కట్టబెట్టాలని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం చూస్తుంటే చంద్రబాబుకు వేమూరి హరి ప్రసాద్‌ ఎంతటి సన్నిహితుడో ఇట్టే తెలుస్తోంది.  

భూ పందేరం
అమరావతి ఇండస్ట్రియలిస్ట్స్‌ అసోషియేషన్‌ పేరిట వేమూరి హరికృష్ణ ప్రసాద్, రవికుమార్‌లకు చెందిన సంస్థలకు బాబు సర్కారు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏకంగా 98 ఎకరాలు కేటాయించింది. ఆ భూములను ప్రభుత్వ నిధులతోనే చదును చేసి అభివృద్ధి చేయడం గమనార్హం. నిర్ణీత గడువులోగా పరిశ్రమలు స్థాపించక పోయినప్పటికీ ప్రభుత్వం ఆ భూములను వెనక్కు తీసుకోలేదు. వీరి ఆధ్వర్యంలోని నాన్‌ రెసిడెంట్‌ తెలుగూస్‌ సంస్థకు అమరావతిలో 5 ఎకరాలు కేటాయించడం గమనార్హం. ఆ భూమిలో ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

బాబుతో వ్యాపారానుబంధం
వేమూరి హరి ప్రసాద్, ఆయన సోదరుడు వేమూరి రవి కుమార్‌ చంద్రబాబుకు బినామీలుగా, అత్యంత సన్నిహితులుగా అధికార వర్గాలకు చిరపరిచితులు. వారి బంధం చంద్రబాబు వ్యాపార సంస్థల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ అంతటా అల్లుకుపోయింది. వేమూరి హరి ప్రసాద్‌ టెరాసాఫ్ట్, టెరాసాఫ్‌ మీడియా క్లౌడ్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ కాగా, ఆయన సోదరుడు రవికుమార్‌ కూడా టెరాసాఫ్ట్‌ డైరెక్టర్‌. ఈ రెండు సంస్థలు కూడా చంద్రబాబు బినామీ సంస్థలేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న దేవినేని సీతారామయ్య టెరాసాఫ్ట్‌ సంస్థలోనూ డైరెక్టర్‌గా వ్యవహరించారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో మరో డైరెక్టర్‌గా ఉన్న కోలారు రాజేష్‌.. చంద్రబాబు సన్నిహితులకు చెందిన సీతాపల్లి గ్యాస్‌ పవర్‌ ప్రాజెక్టులోనూ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అదే సీతాపల్లి గ్యాస్‌ పవర్‌ ప్రాజెక్టులో వేమూరి హరి ప్రసాద్‌ కూడా డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. ఇక హెరిటేజ్‌ ఫుడ్స్, టెరా సంస్థల ఆడిటింగ్‌ వ్యవహారాలను బక్కన్నవార్‌ నిర్వహిస్తున్నారు. అంటే హెరిటేజ్‌ ఫుడ్స్, టెరా సంస్థలు, సీతాపల్లి గ్యాస్‌ పవర్‌ ప్రాజెక్టులలో స్పష్టంగా కనిపిస్తున్న సారూప్యత ఏమింటే.. ఈ మూడు సంస్థల్లోనూ చంద్రబాబు, వేమూరి హరి ప్రసాద్, కోలారు రాజేష్‌లు కీలకంగా వ్యవహరించడం.  
 
‘యూ విన్‌’కాంట్రాక్టూ అంతే..

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే కాంట్రాక్టులోనూ టెరాసాఫ్ట్‌ సంస్థకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం అసంఘటిత రంగ కార్మికులకు ‘యు విన్‌’ పేరిట గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి సంస్థలకు ఆ కాంట్రాక్టు అప్పగించాలని, ఒక్కో కార్డుకు గరిష్టంగా రూ.30 వ్యయం చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా ఒక్కో కార్డుకు రూ.120 చెల్లిస్తూ ఆ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌కు కట్టబెట్టింది.  రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది కార్మికులకు గుర్తింపు కార్డుల జారీ పేరిట ఈ సంస్థకు రూ.140 కోట్ల కాంట్రాక్టును ఏకపక్షంగా అప్పగించింది.

‘ఈ–ప్రగతి’ పేరుతో హాంఫట్‌
ఈ ప్రగతి పేరిట చంద్రబాబు, ఆయన బినామీ వేమూరి హరి ప్రసాద్‌ యథేచ్చగా దోపిడీకి పాల్పడ్డారు. రాష్ట్రంలో 33 శాఖలకు చెందిన అన్ని సేవలను మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏకంగా రూ.2,398 కోట్లతో టెండర్లు పిలిచింది. అందులో  రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,538 కోట్లు. ఈ కాంట్రాక్టును అడ్డదారిలో టెరాసాఫ్ట్‌ భాగస్వామిగా ఉన్న సిస్కో సంస్థకు ఖరారు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement