అరాచకమే టీడీపీ ఆఖరి అస్త్రం | Anarchy is the final Astra of TDP | Sakshi
Sakshi News home page

అరాచకమే టీడీపీ ఆఖరి అస్త్రం

Published Sat, Apr 6 2019 5:23 AM | Last Updated on Sat, Apr 6 2019 5:23 AM

Anarchy is the final Astra of TDP - Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో క్షణక్షణానికి మారిపోతున్న రాజకీయ వాతావరణంతో అధికార పార్టీ హడలిపోతోంది. వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని సర్వేలన్నీ స్పష్టంచేస్తుండడంతో ఓటమి భయం పట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇక అరాచకాన్ని చివరి అస్త్రంగా ఎంచుకుంది. వైరిపక్షాన్ని బెదరించడంతోపాటు ఓటర్లపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. విచ్చలవిడిగా డబ్బు ఎరవేసేందుకు సిద్ధపడింది. గడచిన 24 గంటల నుంచి టీడీపీ శిబిరం మొత్తం దీనిపైనే దృష్టి పెట్టింది. అన్ని ప్రాంతాల్లోనూ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నల్లధనం పంపిణీ జోరందుకుంది. ఎన్నికల నిఘా వర్గాలు  జరిపిన దాడుల్లో భారీగా నోట్ల కట్టలు వెలుగుచూస్తున్నాయి.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నియోజకవర్గాల్లో భయోత్పాతం సృష్టించేందుకు టీడీపీ కేడర్‌ బరితెగిస్తోంది. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో బెదిరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాధికారులు కొందరు ఎన్నికల నిబంధనలను సైతం బేఖాతర్‌ చేస్తూ చంద్రబాబు సేవలో తరిస్తున్నారు.

ఎక్కడ చూసినా నోట్ల కట్టలే..
నిఘా విభాగం అధిపతిగా ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలొచ్చాయి. టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఆయనే స్వయంగా డబ్బులు చేరవేస్తున్నట్లు విపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తాయి. ఎన్నికల కమిషన్‌ ఆయనను తొలగించిన తర్వాత అవన్నీ నిజమేననిపిస్తోందని రాజకీయక వర్గాలు సైతం అంటున్నాయి. ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో అనేకచోట్ల టీడీపీ అభ్యర్థులు డబ్బుల సంచులతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఉదాహరణకు..

- రాజమహేంద్రవరం టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ అనుచరులు ఏకంగా రూ.2 కోట్లు చేరవేస్తూ హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసులకు దొరికిపోయారు. రైల్వేస్టేషన్‌లో పోలీసుల కంటపడిన నిందితులను ఆరాతీస్తే, ఆ డబ్బు మురళీమోహన్‌కు చెందిన జయభేరీ సంస్థ ఉద్యోగులు తమకు ఇచ్చినట్టు చెప్పారు. మురళీమోహన్‌ కోడలు రూప రాజమహేంద్రవరం ఎంపీగా బరిలో ఉన్నారు. ఆ స్థానంలో డబ్బులు పంపిణీ చేసేందుకు చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

విశాఖ జిల్లాలో నల్లధనం చేరవేతలో టీడీపీ అనైతిక విధానాలు తెరమీదకొచ్చాయి. కొన్ని రోజుల క్రితం విశాఖ డెయిరీ వ్యాన్‌లో తరలిస్తున్న రూ.6 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. పాల వ్యాన్‌లో డబ్బులు పంపిణీ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. ఇది మర్చిపోక ముందే మళ్లీ విశాఖ డెయిరీ పాలవ్యాన్‌లోనే రూ.2 లక్షలు తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. చోడవరం నుంచి చీడకాడ వైపు టీడీపీ నేతలు దీన్ని చేరవేస్తున్నట్లు సమాచారం. 

చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ను కూడా నల్లధనం తరలించేందుకు ఉపయోగించుకోవడం విశేషం. మాకవరపాలెంలో హెరిటేజ్‌ పాలవ్యాన్‌లో తరలిస్తున్న రూ.3.95 లక్షలు పోలీసుల తనిఖీల్లో 
వెలుగుచూశాయి. 
చంద్రబాబు బినామీగా పేరున్న మంత్రి నారాయణ నెల్లూరులో జన బలం కన్నా ధనబలాన్నే నమ్ముకున్నట్లు కన్పిస్తోంది. గత రెండ్రోజులుగా బాలాజీనగర్‌లో సోదాలు జరిపిన పోలీసులు అనేక విషయాలు తెలుసుకున్నారు. నారాయణ కాలేజీ ఏజీఎం పద్మనాభరెడ్డి ఇంట్లో మెరుపుదాడి చేయగా రూ.15 లక్షలు దొరికాయి. దీంతోపాటు టీడీపీకి చెందిన పత్రాలు, ఓటరు స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు.

వైఎస్సార్‌ జిల్లాల్లో గెలుపు మాట అటుంచి కనీసం డిపాజిట్లయినా దక్కుతాయా అనేది టీడీపీని పీడిస్తోంది. నోట్లతో ఓట్లు కొనేందుకు చంద్రబాబు బినామీగా పేరుపడ్డ ఎంపీ సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ అడ్డదార్లు తొక్కుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సీఎం రమేష్‌ బంధువుల ఇళ్లలో జరిగిన తనిఖీలు ఆ పార్టీ నేతలే సానుభూతి కోసం చేయించుకున్నారనే అనుమానాలు వస్తున్నాయి. 

అడుగడుగునా దౌర్జన్యం
ఎన్నికల్లో ఓట్లన్నీ తమకే వేయాలని టీడీపీ నేతలు   ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులను బెదిరిస్తున్నారు.  ప్రభుత్వోద్యోగులనైతే చిత్రహింసలకు గురిచేస్తున్నారు. 
విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీకి చెందిన మాజీ చైర్మన్‌ ధనమ్మ సైకిల్‌కు ఓటేయాలంటూ విద్యుత్‌ సహకార సంఘం ఉద్యోగులను బెదిరించారు.   
డ్వాక్రా మహిళలను పర్యవేక్షించే సెర్ప్‌ అధికారి  ఏకంగా టీడీపీ కార్యకర్తగా మారిపోయారు. నందిగామకు చెందిన తన సిబ్బందిని మాటలతో వేధించారు. ముఖ్యమంత్రిని కాదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మద్దతిస్తావా? అంటూ నిందించారు. 
కుప్పంలో టీడీపీ అరాచకానికి హద్దులేకుండాపోయింది. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం మండలాల్లో 2,13,146 మంది ఓటర్లు ఉండగా మెజారిటీ బీసీలు వైఎస్సార్‌సీపీకే మద్దతిస్తున్నారు. ఈ పరిణామాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. రెండ్రోజుల క్రితం రామకుప్పం మండలం రాజుపేటలో వైస్సార్‌సీపీ జెండా కట్టావంటూ ఓ వ్యక్తిపై టీడీపీ నేతలు దాడిచేశారు. తప్పుడు కేసు పెట్టి పోలీసుస్టేషన్‌కు పిలిపించి పోలీసులతో బెదిరించారు. 
జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి గత రాత్రి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు విందు ఇచ్చినట్లు తెలిసింది. తమ పార్టీకి ఓటెయ్యాలని, లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. విందుకు రాని ఉద్యోగులకు ఆయనే ఫోన్లుచేసి బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి.  

పరాభవం తప్పదనే..
చంద్రబాబు స్వీయ సర్వేల్లో చాలాచోట్ల ఘోర పరాభవం ఆయనకు ఘోర పరాభవం తప్పదని తేలినట్లు సమాచారం. ఆయన సభలకు జన స్పందన పూర్తిగా కరవైంది. క్షేత్రస్థాయిలో  పరిస్థితిని సర్వేల ద్వారా తెలుసుకున్న టీడీనీ ముఖ్యనేతలు ఇక అరాచకం సృష్టించడమే చివరి అస్త్రంగా భావించి కేడర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాబుతో అంటకాగిన కొందరు ప్రభుత్వ అధికారులూ ఈ వ్యవహారంలో చేయూతనిస్తున్నారు. 

‘సాక్షి’ విలేకరిపై రెచ్చిపోయిన ‘కాలవ’..
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని స్థానిక బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ బారులు తీరిన ఉద్యోగులను మంత్రి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న దృశ్యాన్ని ‘సాక్షి’ విలేకరి ఫొటోలు తీస్తుండగా.. మంత్రి ఒక్కసారిగా రెచ్చిపోయారు. కెమెరాను లాక్కునే యత్నంలో అదిమిపట్టడంతో అది ధ్వంసమైంది. ‘ఫొటో ఎందుకు తీస్తున్నావ్‌.. ఏం తమాషా చేస్తావా.. అతి చేస్తున్నావు. నీ అంతు చూస్తా. నీ తాట తీస్తా. ఏమనుకున్నావో.’ అంటూ దాడికి యత్నించారు. ప్రచారం చేసి బయటకు వస్తున్న సమయంలోనూ విలేకరిని చూసి, వేలు చూపుతూ.. ‘ఫొటో డిలీట్‌ చెయ్, నా ఫొటో తీయడానికి నీకు అధికారం ఎవరిచ్చారు, దొంగ నా కొ.., వెదవ నా కొ..’.. అంటూ దుర్భాషలాడారు. ‘సరిగా మాట్లాడటం నేర్చుకోండి..’ అని విలేకరి అనగా.. ‘ఏం చేస్తావ్‌’ అంటూ మీదకు దూసుకొచ్చారు. ‘మొదట సంస్కారంతో మాట్లాడండి. విలేకరి స్థాయి నుంచి మంత్రిగా ఎదిగి విలేకరులపైనే దాడికి యత్నిస్తారా..’ అని విలేకరి అనడంతో మంత్రి తిట్టుకుంటూ వెళ్లిపోయారు. కాగా, నామినేషన్ల పరిశీలన రోజైన మార్చి 26న కూడా మంత్రి కాలవ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిని సైతం నానా మాటలన్నారు. ఏకవచనంతో దుర్భాషలాడారు. అప్పుడూ ‘సాక్షి’ విలేకరులపై దౌర్జన్యం చేశారు. 

చింతమనేని చిందులు 
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ జరుగుతున్న వట్లూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో పోలింగ్‌ ఏజెంట్లపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పెదవేగి ఎంపీపీ డి.బక్కయ్య, మాజీ జెడ్పీటీసీ గారపాటి రామసీత, ఎమ్మెల్యే పీఏ శివబాబులు పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహిస్తుండడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆళ్ల సతీష్‌చౌదరి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న చింతమనేని వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకదశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. 

మంగళగిరిలో టీడీపీకి అధికారుల వత్తాసు
గుంటూరు జిల్లా మంగళగిరి వీజీటీఎం ఐవీటీఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభమైన వెంటనే టీడీపీ నేతలు పోలింగ్‌ బూత్‌లలో హల్‌చల్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. టీడీపీ నాయకుడు తన అనుచరులతో కళాశాలకు చేరుకుని నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి పోలింగ్‌ అధికారులతో మాట్లాడడం, క్యూలో ఉన్న ఓటర్లను సైకిల్‌కు ఓటు వేయాలని కోరుతున్నా అక్కడున్న ఆర్‌ఓ కానీ, అధికారులు కానీ, పోలీస్‌ ఉన్నతాధికారులు కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. మీడియాను కళాశాల లోపలకు అనుమతించని పోలీసులు టీడీపీ నాయకులను మాత్రం అనుమతించడం గమనార్హం.  ఓటింగ్‌ ప్రక్రియ గందరగోళంగా ఉందంటూ ఉద్యోగులు ఆరోపించారు. ముందు ఫారం–12 అని చెప్పిన అధికారులు ఆ తర్వాత ఫారం–13ను నింపి అటెస్టు చేయాలని చెప్పడంతో అయోమయానికి గురయ్యారు. దీంతో కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ప్రలోభాలపై స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా సాగితే గెలవలేమనే టీడీపీ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని.. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

టీడీపీ అధినేత తనయుడు లోకేష్‌ పోటీచేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ శ్రేణులు ఓ రకంగా అరాచకమే సృష్టించాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చారు. టీడీపీ నేతలు ఏకంగా బూత్‌లోకి దూసుకెళ్లి ఉద్యోగులను తమకే ఓటెయ్యాలని బెదిరించినట్లు సమాచారం. ఇదేంటని ప్రశ్నించిన అధికారులపై తిరగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement