vemuri Hari Krishna Prasad
-
‘ఫైబర్’ ఫ్రాడ్ సూత్రధారి బాబే
సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది. ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్, ఇన్‌క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్)తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(సి)(డి) ప్రకారం కేసులు నమోదు చేసింది. ఫైబర్‌నెట్ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. ఐటీ శాఖకు బదులుగా.. టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. బిడ్లు.. టెండర్లు వేమూరివే వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు. అమాంతం విలువ పెంచేసి... ప్రాజెక్ట్ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ.. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. అమలు లోపభూయిష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. కీలక అధికారుల వాంగ్మూలం.. ఫైబర్‌నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్ 164 సీఆర్పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నెటాప్స్ ముసుగులో టెర్రర్ సాఫ్ట్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ ప్రాజెక్టు కుంభకోణంలో కీలక పాత్రధారి కనుమూరి కోటేశ్వరరావును సీఐడీ తాజాగా అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ముసుగులో రూ.284 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ నిధులను నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు, ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వేమూరి హరిప్రసాద్ కంపెనీలకు మళ్లించినట్లు వెల్లడైంది. ఈ కేసులో కనుమూరిని ఏ–23గా సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే విదేశాలకు ఉడాయించడంతో కనుమూరిపై సీఐడీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12న అమెరికా నుంచి తిరిగి వచ్చిన నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేసింది. నిందితుడికి న్యాయస్థానం ఈ నెల 21వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కీలక పురోగతి టీడీపీ హయాంలో ఇన్‌క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్(ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రామ్మూర్తి(ఏ–21)లను ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ–11 తుమ్మల గోపీచంద్, ఏ–22 రామ్‌కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో వేమూరి హరికృష్ణకు సహకరించిన కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేయడం ద్వారా సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్‌కు కేటాయించారు. వేమూరి హరికృష్ణ ప్రజాధనాన్ని కాజేసేందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. నెటాప్స్ – టెరాసాఫ్ట్ వయా వేమూరి ► నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. ► నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పని చేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ► నెటాప్స్ కంపెనీ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
వేమూరి హరికృష్ణ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంపై నమోదు చేసిన కేసులో నిందితుడిగా పేర్కొన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ విషయంలో మంగళవారం వరకు అతని అరెస్ట్‌తో సహా ఎలాంటి తొందరపాటు చర్యలేవీ వద్దని హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ఉత్తర్వులు జారీ చేశారు. ఫైబర్ నెట్ టెండర్ల మదింపు సాంకేతిక కమిటీలో సభ్యుడిగా ఉన్న హరికృష్ణ ప్రసాద్ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ లలిత విచారణ జరిపారు. -
ఫేక్ సర్టిఫికెట్ కోసం బెదిరించడం నిజమే
సాక్షి, అమరావతి: ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై విచారణలో సీఐడీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లను ఏకపక్షంగా కట్టబెట్టేందుకు ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే విషయంలో కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన టెండర్ల కుంభకోణంలో మొదటి దశలో రూ.330 కోట్ల టెండర్లలో అవినీతిపై సీఐడీ ఇప్పటికే టెరాసాఫ్ట్ కంపెనీతో సహా 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీడీపీ ప్రభుత్వంలో ఇన్‌క్యాప్ ఎండీగా వ్యవహరించిన కె.సాంబశివరావు, ఇ–గవర్నెన్స్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ సీఐడీ అధికారుల వద్ద మంగళవారం విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో కె.సాంబశివరావును అధికారులు మొదట విచారించారు. రెండు దఫాలుగా దాదాపు ఐదు గంటలపాటు సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కాగా టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంలో తప్పులు జరిగాయని సాంబశివరావు ఒప్పుకున్నట్లు సమాచారం. టెరాసాఫ్ట్ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ ఎక్స్పీరియన్స్ పత్రాలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను సీఐడీ అధికారులు ఆయన ముందుంచి వాటిపై విచారించారు. దాంతో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆయన అంగీకరించాల్సి వచ్చిందని తెలిసింది. ప్రశ్నల వర్షం.. టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేకపోయినప్పటికీ, సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఫోర్జరీ పత్రాలు సమర్పించడం కచ్చితంగా తప్పేనని సాంబశివరావు అంగీకరించారని తెలుస్తోంది. ఆ విధంగా టెరాసాఫ్ట్ కంపెనీ సమర్పించిన ఫోర్జరీ పత్రాలు సరైనవే అని చెప్పమని సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ సీఈడీ గౌరీశంకర్‌ను బెదిరించడం నేరంగానే పరిగణించక తప్పదని కూడా ఆయన సమ్మతించారని సమాచారం. అదే విధంగా ఫైబర్ నెట్ టెండర్ల ప్రక్రియలో కేంద్ర మార్గదర్శకాలను పాటించక పోవడం, నాసిరకం పరికరాల సరఫరా, నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు తదితర అంశాలపై సీఐడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారని తెలుస్తోంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వేమూరి హరి కృష్ణ ప్రసాద్‌ను కూడా సీఐడీ అధికారులు కాసేపు విచారించారు. ఆయన్ను బుధవారం కూడా పూర్తి స్థాయిలో విచారించనున్నారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులు అందరినీ వరుసగా విచారించేందుకు సీఐడీ అధికారులు సమాయత్తమవుతున్నారు. కాగా, సీఐడీ కార్యాలయం వద్ద వేమూరి హరి కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ టెరా సాఫ్ట్ కంపెనీకి, తనకు సంబంధం లేదన్నారు. సీఐడీ అధికారులకు విచారణలో సహకరిస్తానని చెప్పారు. -
ఆ సర్టిఫికెట్ కోసం.. ‘వేమూరి’ బెదిరించారు
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుడు, ఇ–గవర్నెన్స్ అథారిటీ గవర్నెన్స్ కమిటీలో సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ నన్ను తీవ్రంగా బెదిరించారు. దీంతో డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాల సరఫరాలో టెరాసాఫ్ట్ కంపెనీకి అనుభవం ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చాను’.. అని సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధిపతి గౌరీశంకర్ వివరించారు. ‘మేం చెప్పినట్లు సర్టిఫికెట్ ఇవ్వకపోతే విజయవాడలో ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాం’.. అని కూడా వేమూరి హరికృష్ణ తనను తీవ్రస్థాయిలో బెదిరించడంతో భయపడి ఆ విధంగా తాను సర్టిఫికెట్ ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఫైబర్‌నెట్ టెండర్ల కుంభకోణానికి పాల్పడినందుకు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్ కంపెనీ యాజమాన్యంతోపాటు 19మందిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాల సరఫరాలో టెరాసాఫ్ట్ సంస్థకు అనుభవం లేకపోయినా సరే ఉన్నట్లుగా సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను బెదిరించి సర్టిఫికెట్ పొందినట్లుగా సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిగ్నం డిజిటల్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అధినేత గౌరీశంకర్‌ను ‘సాక్షి’ సంప్రదించగా అప్పట్లో జరిగిన విషయాలను ఆయన వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నా ప్రాజెక్టు వేమూరి తీసుకున్నారు ఇంటర్నెట్–టీవీ సేవలు కలిపి కేబుల్ సేవలు అందించేందుకు నేను 2013లోనే ఓ ప్రాజెక్టు రిపోర్ట్ తయారుచేశా. అందుకు మూడు కంపెనీల నుంచి రూ.18 లక్షలు విలువైన డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు కొనుగోలు చేశాను. ఈ విషయం తెలిసి టెరాసాఫ్ట్ సంస్థ ప్రతినిధి వేమూరి హరికృష్ణ ప్రసాద్ నన్ను కలిశారు. ఆయనకు ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ (పీపీటీ) చూపించాను. ఆ తరువాత ఎన్నికల రావడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వేమూరి హరికృష్ణ ప్రసాద్ నన్ను హైదరాబాద్‌లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. నా పీపీటీనే తనదని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఫైబర్ కేబుల్ సేవలు అందిస్తుందని చెప్పారు. నన్ను టెక్నికల్ సపోర్ట్ అందించమన్నారు. ప్రభుత్వం చేస్తుంది కదా అని నేను సరేనన్నాను. డీపీఆర్ తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చాను. కానీ, ఆ తరువాత టెండర్లు పిలవడం.. టెక్నికల్ కమిటీలో వేమూరి హరికృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉన్నట్లు తెలిసింది. చివరికి నా పీపీటీ ఆధారంగానే టెరాసాఫ్ట్ బిడ్డింగ్ వేసి టెండర్లు దక్కించుకుంది. దాంతో వేమూరి హరికృష్ణ ప్రసాద్ చేసిన మోసం చూసి ఆశ్చర్యపోయాను. సర్టిఫికెట్ కోసం బెదరించారు.. ఓ రోజు రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఇన్‌క్యాప్) ఎండీ సాంబశివరావు నాకు ఫోన్‌చేశారు. నా మెయిల్‌కు ఓ లెటర్ పంపించానని చెబుతూ అది చూసి కాస్త సమయం తీసుకుని రిప్లై ఇవ్వమన్నారు. ఆ వెంటనే వేమూరి హరికృష్ణ ప్రసాద్ కూడా ఫోన్‌చేసి నా మెయిల్‌కు ఓ డాక్యుమెంట్ పంపానని చెబుతూ దానిపై సంతకం చేసి ఇన్‌క్యాప్ ఎండీ మెయిల్‌కు సమాధానంగా పంపించమన్నారు. నాకేమీ అర్థంకాలేదు. తీరా ఆ మెయిళ్లు చూస్తే అసలు విషయం తెలిసింది. టెరాసాఫ్ట్ కంపెనీ మా సిగ్నం డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు సరఫరా చేసినట్లుగా నేను సర్టిఫై చేస్తున్నట్లుగా ఆ డాక్యుమెంట్ ఉంది. నిజానికి మాకు టెరాసాఫ్ట్ ఎలాంటి పరికరాలు సరఫరా చేయలేదు. దాంతో నేనెందుకు సర్టిఫికెట్ ఇవ్వాలని అనుకున్నాను. అసలు ఏం జరిగిందో అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. మా కంపెనీకి డిజిటల్ హెడ్ ఎండ్ పరికరాలు సరఫరా చేసిన అనుభవం ఉందని టెరాసాఫ్ట్ కంపెనీ ఫైబర్‌నెట్ టెండర్ల అప్టికేషన్లో పేర్కొంది. దీనిపై ఆ టెండర్లలో పాల్గొన్న మరో కంపెనీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ విషయంపై కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖకు కూడా ఫిర్యాదు చేస్తే టెరాసాఫ్ట్ కంపెనీకి ఆ టెండరు దక్కదు.. కాబట్టి టెరాసాఫ్ట్ కంపెనీ మాకు పరికరాలు సరఫరా చేసినట్లుగా నేను సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. నేను అందుకు ఒప్పుకోలేదు. దాంతో వేమూరి హరికృష్ణ నాకు ఫోన్‌చేసి బెదిరించారు. సర్టిఫికెట్ ఇవ్వకపోతే విజయవాడలో వ్యాపారం ఎలా చేస్తావో చూస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. నా వెనక ఎంత పెద్దలు ఉన్నారో తెలుసు కదా అని కూడా అన్నారు. కానీ, నేను సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో తెనాలి నుంచి ఒకర్ని మా ఆఫీసుకు పంపించారు. వేమూరి హరికృష్ణ నాతో ఫోన్లో మాట్లాడుతూ.. వెంటనే సర్టిఫికెట్ ఆయనకిచ్చి పంపించమన్నారు. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేనని తీవ్రస్వరంతో మాట్లాడారు. దాంతో నేను భయపడి టెరాసాఫ్ట్ కంపెనీకి ఎక్స్పీరియన్స్ ఉందని సర్టిఫికెట్ ఇచ్చాను. కానీ, దీనిపై ఎప్పటికైనా సరే విచారణ జరుగుతుందని ఊహించా. అందుకే ‘మీరు నాకు చెప్పినట్లుగా టెరాసాఫ్ట్‌కు డిజిటల్ ఎండ్ పరికరాల సరఫరాలో ఎక్స్పీరియన్స్ ఉందని సర్టిఫికెట్ ఇచ్చాను’.. అని వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు ఓ మెయిల్ పంపించాను. ఆ మెయిల్‌ను భద్రపరిచాను. భవిష్యత్‌లో ఎవరైనా అడిగితే వేమూరి హరికృష్ణ ప్రసాద్ బెదిరిస్తేనే ఆ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఆధారం ఉండాలి కదా. ఇటీవల సీఐడీ అధికారులు నన్ను విచారించినప్పుడు అన్ని విషయాలు చెప్పాను. ఆ మెయిల్‌తోపాటు నా వద్ద ఉన్న ఇతర డాక్యుమెంటరీ ఆధారాలన్నీ కూడా సమర్పించాను. వాస్తవానికి సిగ్నం డిజిటల్ లిమిటెడ్‌కు పరికరాలు ఎవరు సరఫరా చేశారో ఆ డాక్యుమెంట్లు, బిల్లులు అన్నీ అందించాను. ఈ కేసు విచారణలో సీఐడీకి పూర్తిగా సహకరిస్తాను. -
సపరివార స'మేత'!
సాక్షి, అమరావతి: ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ముసుగులో నాటి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ అండదండలతో ఈవీఎంల చోరీ కేసులో నిందితుడు వేమూరి హరికృష్ణప్రసాద్ సకుటుంబ సపరివార సమేతంగా దోపిడీకి పాల్పడ్డారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలుకు ఏర్పాటైన ఏపీఎస్ఎఫ్ఎల్(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్)లో తన బంధు గణాన్ని, అనుచరులను నియమించుకుని యథేచ్ఛగా అక్రమాలకు తెగబడ్డారు. అంతా తనవాళ్లే...! ► టెరాసాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ చౌదరి స్నేహితుడు అట్లూరి రామారావు చౌదరిని ఏపీఎస్ఎఫ్ఎల్ టెక్నికల్ ఈడీగానూ, సమీప బంధువు, ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగి ఎం.వెంకటేశ్వరరావు చౌదరిని ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ ఈడీగానూ, మరో బంధువు, పురపాలక శాఖ ఉద్యోగి సూర్యదేవర హరికృష్ణ చౌదరిని కమర్షియల్ ఈడీగానూ నియమించేలా ఏపీఎస్ఎఫ్ఎల్ సలహాదారు హోదాలో వేమూరి చక్రం తిప్పారు. ► తన సంస్థ నెట్ ఇండియాలో పనిచేస్తున్న వల్లభనేని చంద్రశేఖర్ చౌదరిని ఏపీఎస్ఎఫ్ఎల్లో ఈడీ(టెక్నికల్‌స్ట్రాటజీ) గా నియమించుకున్నారు. ► ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా చేపట్టే పనులకు టెండర్ షెడ్యూళ్లపై వల్లభనేని చంద్రశేఖర్‌కు సూచనలు చేసి వాటిని టెరా సాఫ్ట్, అనుబంధ సంస్థలకే దక్కేలా పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. బ్లాక్‌లిస్ట్‌లో కంపెనీకి పనులు.. ► ఇక టెండర్ ఎవల్యూషన్ (మదింపు) కమిటీలోనూ నియమితుడైన వేమూరి హరికృష్ణప్రసాద్ టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్(ఏపీ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినా అక్రమంగా పనులు దక్కించుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా ఫైబర్ గ్రిడ్‌లో రూ.2 వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారు. తన సంస్థకు తానే సర్టిఫికెట్లు.. ► ఫైబర్ గ్రిడ్ తొలి దశలో రూ.333 కోట్ల విలువైన పనులను టెరా సాఫ్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన వేమూరి నాసిరకంగా పనులు చేశారు. తొలి దశ పనుల ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌గా జెమినీ కమ్యూనికేషన్స్ ఎంపిక కాగా ఆ సంస్థ నుంచి నెట్ ఇండియా సబ్ కాంట్రాక్టు తీసుకుంది. నాసిరకంగా చేసిన పనులు నాణ్యంగా ఉన్నట్లు నెట్ ఇండియా సర్టిఫికెట్ ఇస్తే టెరా సాఫ్ట్‌కు బిల్లులు చెల్లించారు. ఇలా తన సంస్థ చేసిన పనులకు తనకు చెందిన మరో సంస్థతో సర్టిఫికెట్ ఇప్పించుకుని దోచుకున్నారు. అనుభవం లేకున్నా కుమార్తె కంపెనీకి పనులు.. ► నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ సంస్థకు వేమూరి హరికృష్ణప్రసాద్ కూతురు అభిజ్ఞ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. నెటాప్స్ సంస్థకు ఫైబర్ లేయింగ్ అనుభవం లేకున్నా ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ గ్రిడ్ లైన్ల పనులను రూ.30 కోట్లతో అప్పగించారు. కిలోమీటర్ ఫైబర్ లేయింగ్‌కు ఇతర రాష్ట్రాల్లో రూ.15 వేలు మాత్రమే ఉండగా ఏపీలో మాత్రం 600 మీటర్ల ఫైబర్ లేయింగ్ పనులకు రూ.42 వేల చొప్పున నెటాప్స్‌కు బిల్లులు చెల్లించడం గమనార్హం. ► ఫైబర్ గ్రిడ్ తొలిదశ పనుల పర్యవేక్షణ, నిర్వహణకు 2016 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు ప్రతి నెలా రూ.1.2 కోట్ల చొప్పున చెల్లించారు. ఫైబర్ గ్రిడ్ రెండో దశలో రూ.1,410 కోట్ల విలువైన పనులను తన సంస్థ టెరా సాఫ్ట్‌కే కట్టబెట్టేలా చక్రం తిప్పిన వేమూరి నాసిరకం ఫైబర్ వేసి బిల్లులు చేసుకున్నారు. -
శాఖ బాబుది.. సంతకం చినబాబుది
తండ్రి ముఖ్యమంత్రి.. తనయుడు మంత్రి.. తండ్రి అధికారంతో తనయుడి నిర్వాకం.. తండ్రీ తనయుల తోడుతో పేట్రేగిన బినామీ వెరసి రూ.2 వేల కోట్లు ఖజానాకు తూట్లు! ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణలు సాగించిన అక్రమాల బాగోతం ఇదీ..! సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.రెండు వేల కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన వేమూరి హరికృష్ణప్రసాద్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫైబర్ గ్రిడ్ ఫైలుపై నారా లోకేశ్ సంతకం చేశారని అంగీకరించారు. ఆరోజు నాటి సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో సంతకం చేశారన్నారు. అయితే అంతలోనే సర్దుకుని లోకేశ్ సంతకం చేయలేదంటూ బుకాయించడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్ బాక్స్ రూ.2,200కే దొరుకుతుండగా గత సర్కారు రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు అంగీకరించిన వేమూరి ఆ తర్వాత కేవలం 40 వేల బాక్స్‌లు మాత్రమే ఉత్పత్తి చేశామంటూ మాట మార్చారు. ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణకైనా తాను సిద్ధమంటూ మీడియాతో పేర్కొన్న వేమూరి ఆ తర్వాత కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నిస్తే హైకోర్టును ఆశ్రయిస్తానంటూ బెదిరింపులకు దిగారు. దోపిడీకి అడ్డాగా ఫైబర్ గ్రిడ్... ► రాష్ట్రంలో ఒకే కనెక్షన్‌తో ఇంటింటికీ కారు చౌకగా కేబుల్ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాన్ని కల్పించడానికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టామని 2015లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలో ఏపీఎస్ఎఫ్ఎల్(ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్)ను ఏర్పాటు చేశారు. ఈ శాఖను ఐదేళ్లపాటూ చంద్రబాబే నిర్వహించారు. ► వేమూరి హరికృష్ణప్రసాద్ ఆగస్టు 10, 2012 నుంచి సెప్టెంబర్ 8, 2015 వరకూ టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబుకు బినామీ అయిన వేమూరిని ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. ► ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో తొలిదశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు ఆగస్టు 26, 2015న ఇన్‌క్యాప్(ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. ఈ టెండర్ మదింపు కమిటీలో ఐటీ సలహాదారు హరికృష్ణప్రసాద్‌ను చేర్చింది. ► తూర్పుగోదావరి జిల్లాలో ఈపాస్ యంత్రాల సరఫరాలో గోల్మాల్ చేసిన టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) సంస్థ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. కానీ.. ఫైబర్ గ్రిడ్ తొలి దశ టెండర్‌ను ఆగస్టు 30, 2015న టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టారు. ► టెరా సాఫ్ట్కుకేబుళ్లు, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్), హెడ్ ఎండ్ అనుభవం ఉన్నట్లు సిగ్నమ్ కంపెనీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి పనులు దక్కించుకున్నారు. సిగ్నమ్ కంపెనీ సీఈ, ఎండీ దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేయడం గమనార్హం. ► నాసిరకం కేబుల్, క్లాంప్‌లతో టెరా సాఫ్ట్ తొలి దశలోనే రూ.333 కోట్లను దోచేసింది. సంబంధిత శాఖ మంత్రే సంతకం చేయాలి.. ► నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. ► 2017లో ఏప్రిల్ 3న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను కేబినెట్లోకి తీసుకుని ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు అప్పగించారు. ► లోకేశ్ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్ 14న ఏపీఎస్ఎఫ్ఎల్కు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్ మాల్ పెద్ద ఎత్తున జరిగింది. ► లోకేశ్ వద్ద ఉన్న శాఖలకు, ఏపీఎస్ఎఫ్ఎల్కు సంబంధం లేదు. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్కు చెందిన ఫైల్ పై లోకేశ్ సంతకాలు చేశారు. ► భారత్ నెట్ ఫేజ్ 2కి సంబంధించిన ఎంవోయూ ఫైల్ పై నారా లోకేశ్ 2017 నవంబర్ 12న సంతకం చేశారు. బీబీఎన్ఎల్(భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్) రెండో దశకు సంబంధించి ఆ సంస్థకూ ఏపీఎస్ఎఫ్ఎల్కూ మధ్య ఎంవోయూను ఆమోదిస్తూ సంబంధిత ఫైల్‌పై లోకేశ్ సంతకం చేశారు. ఇక్కడే లోకేశ్ అడ్డంగా దొరికారు. ► బీబీఎన్ఎల్ మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అంతులేని అక్రమాలు.. ► 2014–2019 మధ్య సుమారు రూ.3,492 కోట్లవిలువైన పనులను ఫైబర్ గ్రిడ్‌లో చేపట్టారు. ఫేజ్ 1 కింద రూ.333 కోట్ల పనులు, సీసీ కెమెరాల కొనుగోలుకు రూ.959 కోట్లు, భారత్ నెట్‌కు రూ.1,600 కోట్లు, సెట్ టాప్ బాక్సుల కొనుగోలును రూ.600 కోట్లతో చేపట్టారు. ► ఫైబర్ గ్రిడ్ పరికరాలు, సెట్ టాప్ బాక్సులు, కేబుళ్ల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. చైనా కంపెనీలతో హరికృష్ణప్రసాద్ ముందుగానే డీల్ కుదుర్చుకుని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో నాసిరకమైన సెట్ టాప్ బాక్స్‌లను తయారు చేయించి ఖజానాను దోచేశారు. కొనుగోలు చేసిన 12 లక్షలసెట్‌టాప్ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది. సాంకేతిక సలహాలు మాత్రమే.. ఇచ్చేవాడిని వేమూరి హరికృష్ణప్రసాద్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ కమిటీలో తాను లేనని.. సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినని టీడీపీ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారుడు వేమూరి హరికృష్ణప్రసాద్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెట్ టాప్ బాక్సు ఒక్కొక్కటి రూ.3,700కు కొనుగోలు చేశామని చెప్పారు. 10 లక్షల బాక్సులకు టెండర్లు వేస్తే సుమారు 7 సంస్థలు పాల్గొన్నాయని.. అందులో తక్కువ రేటు ఉన్న దాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 10 లక్షల మంది ఏపీ ఫైబర్‌నెట్‌ను వినియోగిస్తున్నారని.. వాటి పనితీరు ఎలా ఉందో వారిని విచారించుకోవచ్చన్నారు. తాను అవకతవకలకు పాల్పడలేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
రూ.1,500 కోట్ల ‘ఫైబర్’ ఫ్రాడ్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఐటీ విభాగం సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణప్రసాద్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) బిజినెస్, ఆపరేషన్స్ మాజీ ఈడీ గౌరీశంకర్ వెల్లడించారు. వేమూరి నియమించిన వ్యక్తులే ఇప్పటికీ ఏపీఎస్ఎఫ్ఎల్లో పనిచేస్తున్నారని, అక్రమాలను బహిర్గతం చేసినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నారు. తన సర్టిఫికెట్లు నిజమైనవని సబర్మతీ యూనివర్సిటీ నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రంఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ లేదా పోలీసులతో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌ను కోరారు. ఫైబర్ గ్రిడ్‌లో అక్రమాలపై బహిరంగ చర్చకు వేమూరి సిద్ధమా? అని సవాల్ చేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.1,500 కోట్ల బిల్లులను చెల్లిస్తే అందులో 80 శాతం వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరాసాఫ్ట్, నెట్‌ఇండియా, నెటాప్స్ సంస్థల ఖాతాల్లోకే వెళ్లాయన్నారు. గౌరీ శంకర్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లలో అక్రమాలు.. ► సెట్ టాప్ బాక్స్‌ల కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కటి రూ.4,400 చొప్పున 12 లక్షల బాక్సులు కొనుగోలు చేశారు. ఇందులో 8.60 లక్షలు మాత్రమే పని చేస్తున్నాయి. ఒక్కో సెట్ టాప్ బాక్స్ కాల పరిమితి ఐదేళ్లు కాగా పదేళ్లుగా చూపించి ప్రభుత్వ గ్యారంటీతో ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.450 కోట్ల రుణం తీసుకున్నారు. ► ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ల నుంచి నెలకు రూ.11 కోట్లు బిల్లులు వసూలు కావాల్సి ఉండగా టెరా సాఫ్ట్ అక్రమాలకు పాల్పడి గరిష్టంగా రూ.ఏడు కోట్లు మాత్రమే వసూలైనట్లు చూపింది. తక్కువ బిల్లింగ్ చూపిస్తూ రూ.70 కోట్లకుపైగా దోపిడీ చేశారు. ఈ బిల్లింగ్‌ను సరి చేసేందుకు నేను సాఫ్ట్ వేర్ మార్చడంతో ఒక్క నెలలోనే రూ.8.50 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. హరికృష్ణప్రసాద్ ఓ 420, మోసగాడు. తన స్నేహితుడు కనుమూరి కోటేశ్వరరావు, కుమార్తె అభిజæ్ఞ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. కుంభకోణంలో బడా నేతల పాత్రను బయటపెడతా. దీనిపై సీబీఐ విచారణ చేస్తే నిజాలు నిర్ధారణవుతాయి. టెండర్ కమిటీలో టెరాసాఫ్ట్ డైరెక్టర్... ► వేమూరి హరికృష్ణప్రసాద్ 2012 ఆగస్టు 10 నుంచి 2015 సెప్టెంబరు 8 వరకు టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ► ఏపీ ఫైబర్ గ్రిడ్ తొలి దశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు 2015 ఆగస్టు 26న ఇన్‌క్యాప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా>ర్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. ► ఈ టెండర్‌ను 2015 ఆగస్టు 30న టెరా సాఫ్ట్ దక్కించుకుంది. టెరా సాఫ్ట్ డైరెక్టర్ అయిన హరికృష్ణప్రసాద్ టెండర్ మదింపు కమిటీ సభ్యుడుగా ఉండటం అక్రమం. టెరా సాఫ్ట్‌కు కేబుళ్లు వేయడం, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్) ఏర్పాటు, హెడ్ ఎండ్ అనుభవం లేకున్నా నా సంస్థ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పనులు దక్కించుకున్నారు. ► సిగ్నమ్ కంపెనీ సీఈ, ఎండీ అయిన నేను ఇదే అంశంపై ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ సాంబశివరావుకు ఫిర్యాదు చేశా. టెరాసాఫ్ట్‌కు అనుభవం ఉందని చెప్పాలంటూ హరికృష్ణప్రసాద్ నన్ను తీవ్రంగా బెదిరించారు. ► నాసిరకం కేబుళ్లు, క్లాంప్‌లతో తొలి దశ పనులను 2016లో ముగించి బిల్లులు తీసుకున్నారు. -
చంద్రన్న గోల్‌మాల్‌పై సీబీఐ
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ అక్రమాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం సచి వాలయంలో సమావేశమైన మంత్రివర్గం దీనిపై క్షుణ్నంగా చర్చించింది. అనంతరం మంత్రివర్గం తీర్మానం మేరకు ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణ కేంద్రంగా సాగిన ఈ అవినీతి వ్యవహారంలో విస్తుగొలిపే వాస్తవాలు మంత్రివర్గ ఉపసంఘం విచా రణలో వెలుగు చూశాయి. ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో నిందితుడైన వేమూరు హరి కృష్ణకు చెందిన బ్లాక్‌లిస్ట్‌లోని టెరాసాఫ్ట్‌కు గత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తు సంస్థ విచారణలో వెలుగు చూసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ ఫైబర్ గ్రిడ్ కథ... ► గ్రామీణులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్రం ఫైబర్ నెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటర్నెట్తోపాటు టీవీ చానెళ్లను ప్రసారం చేయడం కోసం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం(సీఎస్ఎస్) ఫైబర్ నెట్ నిధులతో టీడీపీ సర్కార్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ► ఏరియల్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ మొదటి దశలో భాగంగా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ పనులకు 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రపదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. హారిజోన్ బ్రాడ్‌క్రాస్ట్ ఎల్ఎల్పీ, సిగ్నమ్ డిజిటల్ నెట్‌తో టెరాసాఫ్ట్ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ► టెండర్ నిబంధనలు 15 ఏ (1), 15 బీ (5) ప్రకారం హారిజోన్ సంస్థకు టెండర్లో పాల్గొనే అర్హత లేదు. సిగ్నమ్ డిజిటల్ నెట్ దాఖలు చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం కూడా నకిలీది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్‌ను 2015 మే 11న ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై నివేదికను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఎల్ –1ని కాదని టెరాసాఫ్ట్‌కు.. ► నిబంధనల ప్రకారం బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల చోరీ కేసులో నిందితుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ బిడ్‌ను ఆమోదించాలని టీడీపీ సర్కార్ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్–1ను కాదని అధిక ధరక బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పారు. అనుమతి లేదు...రూ.558.77 కోట్లు అదనం ► భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) గిగాబైట్ పాసివ్ ఆప్టికల్ నెట్వర్క్ (జీపీవోఎన్) సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ నెట్ రెండో దశను అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం ఐఎంపీఎల్ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేపట్టింది. జీపీవోన్తో పనులు చేపడితే రూ.851.23 కోట్లు వ్యయం అవుతుందని బీబీఎన్ఎల్ తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత దాన్ని రూ.907.94 కోట్లకు సవరించింది. కానీ ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రం ఐఎంపీఎల్ఎస్తో పనులు చేసేందుకు రూ.1,410 కోట్లకు ఎల్ అండ్ టీ కన్సార్టియంకు అప్పగించింది. అంటే ఇది బీబీఎన్ఎల్ నిర్థారించిన మొత్తం కంటే రూ.558.77 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కార్ దీనికి అనుమతి కూడా తీసుకోలేదు. నాసిరకం సెట్‌టాప్ బాక్సులు.. ► ఏపీ ఏరియల్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశ అమలును పర్యవేక్షించేందుకు పీఎంఏ (ప్రాజెక్టు మానిటరింగ్ ఏజెన్సీ) ఎంపికలోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడింది. ► సెట్ బాక్స్‌ల టెండర్లలో 8 సంస్థలు పాల్గొంటే తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకుండా నాలుగు సంస్థలకు పనులు విభజించి అప్పగించారు. కానీ సెట్‌టాప్ బాక్స్‌లను కేవలం టెరాసాఫ్ట్ నుంచే కొనుగోలు చేసి బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారం కేబినెట్ సబ్ కమిటీ విచారణలో వెలుగు చూసింది. సెట్ టాప్ బాక్సుల నాసిరకంగా ఉన్నట్లు కమిటీ తేల్చింది. ఈ క్రమంలో పైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది. చంద్రన్న కానుకల్లో అవినీతి వెల్లువ.. చంద్రన్న కానుక, రంజాన్ తోఫా పేరిట గత సర్కారు పేదలకు పంపిణీ చేసిన రేషన్ సరుకుల్లోనూ పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు నిర్థారణ అయింది. కానుక అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపించాలని టీడీపీ నేతలే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అక్రమాలు వెలికి తీయాలని విజయనగరం జిల్లా గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు జడ్పీ సమావేశంలో డిమాండ్ చేయడం దుమారం రేపింది. అక్రమాలు రుజువైతే రెవన్యూ రికవరీ చట్టం ద్వారా డబ్బులు తిరిగి వసూలు చేయాలని అప్పుడు ఆయన డిమాండ్ కూడా చేశారు. హెరిటేజ్‌కు సంతర్పణ.. చంద్రన్న కానుక కింద సంక్రాంతి పండుగకు పేదలకు అందించిన గిఫ్ట్ ప్యాక్‌లో మిగిలిన సరుకులతో పాటు 100 గ్రాముల చొప్పున నెయ్యి కూడా పంపిణీ చేశారు. ఇందుకోసం ఏడాదికి 1,301 కిలో లీటర్ల నెయ్యి కొనుగోలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ పలు డెయిరీలు కిలో నెయ్యి ప్యాకింగ్‌తో సహా రూ.320 నుంచి రూ. 420 వరకు అప్పట్లో విక్రయించాయి. బహిరంగ మార్కెట్లో విశాఖ డెయిరీ నెయ్యి కిలో రూ. 320, దొడ్ల డెయిరీ నెయ్యి రూ. 350, తిరుమల డెయిరీ నెయ్యి రూ. 375, నందిని డెయిరీ నెయ్యి రూ.420 చొప్పున రిటైల్ అమ్మకాలు జరుపుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిటైల్ కొనుగోలు దారులకు కిలో గేదె నెయ్యి రూ.372కే విక్రయిస్తామని విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్ పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే ఇలా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే వారిని కాదని హెరిటేజ్ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ. 499తోపాటు దీనిమీద 14.5 శాతం విలువ ఆధారిత పన్ను కలిపి కిలో రూ.575 చొప్పున గత సర్కారు కొనుగోలు చేసింది. ఒక ఏడాది నెయ్యి సరఫరాలోనే రూ.26 కోట్లకు పైగా దుర్వినియోగం అయిందనే ఆరోపణలున్నాయి. కానుక పేరిట కోట్లు స్వాహా.. సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు అర కిలో కందిపప్పు, అర కిలో శనగలు, అర కిలో బెల్లం, అర లీటర్ పామాయిల్, కిలో గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. ఈ సరుకులన్నీ ఒక సంచిలో పెట్టి ఇచ్చేందుకు గిఫ్ట్ సంచుల పేరిట ఏటా అదనంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసి నాసిరకం సంచులిచ్చారు. బెల్లం దుర్వాసన రావడంతో సగం మంది లబ్ధిదారులు డస్ట్‌బిన్‌లో పారేశారు. ఈ విషయాన్ని కళ్లారా చూసిన నాటి సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించినా ఫలితం శూన్యం. చంద్రన్న కానుక సరుకుల సరఫరా టెండర్లను సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకున్నారు. 2015 – 2019 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.565.94 కోట్ల విలువైన సరుకులు పీడీఎస్ కింద సేకరించారు. మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా సరుకుల కోసం రూ.1,200.34 కోట్లు ఖర్చు చేశారు. అయితే ధరల్లో వ్యత్యాసం, నాసిరకం సరుకులు సరఫరా చేయడం ద్వారా రూ.158.38 కోట్ల మేర ఇందులో అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
బెడిసికొట్టిన పచ్చ వ్యూహం!
ఈవీఎంల పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న అధికార టీడీపీ కొందరు ఉన్నతాధికారుల సహకారంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు వేసిన పథకం గుట్టు రట్టయింది. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరి హరికృష్ణప్రసాద్ సోమవారం ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించిన అంశాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హోదాలో నేరుగా కలెక్టర్ల సమావేశాల్లో పాల్గొని వారికి నేరుగా ఆదేశాలు ఇచ్చినట్లే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా అదే విధంగా ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయి. – సాక్షి, అమరావతి పోలింగ్‌కు ముందు రోజు చర్చలా? ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నతో పోలింగ్‌కు ముందు రోజు చర్చించినట్లు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూలో వెల్లడించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏప్రిల్ 10వ తేదీన చిత్తూరు జిల్లా పీలేరు 273వ నంబర్ బూత్‌లోని ఈవీఎంలో ఓటు వేస్తున్న వీడియో బయటకు వచ్చిన విషయం గురించి కలెక్టర్ ప్రద్యుమ్నకు ఫోన్‌చేసి మాట్లాడినట్లు హరిప్రసాద్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య ఈవీఎంల గురించి సుదీర్ఘంగా సంభాషణ సాగిందని ఆ ఇంటర్వ్యూను బట్టి తెలుస్తోంది. ఈసీని, ఉన్నతాధికారులను సంప్రదించకుండా ఒక పార్టీకి చెందిన వ్యక్తితో కలెక్టర్ కీలక విషయాలు మాట్లాడకూడదని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈవీఎంలను అన్నింటినీ పరిశీలించి బూత్‌లకు పంపిస్తారని, ఎన్నికల రోజు ఉదయం 5.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాత్రమే మాక్ పోలింగ్ నిర్వహిస్తారని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈవీఎంలకు బ్యాలెట్ పేపర్లు కూడా కమిషనింగ్ సెంటర్లోనే అతికించి అక్కడ ఒకసారి మాక్ పోలింగ్ నిర్వహించి ర్యాండమైజేషన్ చేసి పంపిస్తామని పేర్కొన్నాయి. కానీ హరిప్రసాద్ ఆ ఇంటర్వ్యూలో చిత్తూరు జిల్లా పీలేరు 273వ నంబర్ బూత్‌లో బ్యాలెట్ పేపర్ అతికిస్తున్నట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. బయటకు వచ్చిన వీడియోలో కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేసినట్లు ఉండటం.. అదీ పోలింగ్‌కు ముందు రోజు రాత్రే బయటకు రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు పోలింగ్ విధుల్లో ఉన్న ఏ అధికారి కారణమో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్ ఆ అంశంపై దృష్టి సారించకుండా అధికార టీడీపీకి కొమ్ముకాసేలా ఎలా వ్యవహరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం ఈ అంశంపై దృష్టి పెట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకే.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కలెక్టర్లు హరిప్రసాద్ అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్లు తెలుస్తోంది. ఒక ఐటీ కంపెనీకి చెందిన హరిప్రసాద్‌పై 2010లో ఈవీఎంల దొంగతనం కేసు నమోదైనప్పటికీ అతన్ని తీసుకొచ్చి రాష్ట్ర సాంకేతిక సలహాదారుగా నియమించుకున్నారు. ఈవీఎంల హ్యాకింగ్, ట్యాంపరింగ్ చేయడంలో చెయ్యి తిరిగిన హరిప్రసాద్‌ను ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ పదవిలోకి తీసుకురావడమే కాకుండా జిల్లా కలెక్టర్ల సమావేశాలకు తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశారు. హరిప్రసాద్‌కు టెక్నాలజీపై మంచి పట్టు ఉందని, ఇతను ఏమి చెప్పినా చెయ్యండంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హరిప్రసాద్.. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి టెక్నాలజీ వినియోగం, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ కనెక్షన్లు, టీవీలు, కంప్యూటర్ల కొనుగోళ్ల దగ్గర నుంచి అన్నీ తానై నడిపించారు. ఈవీఎంలు ఎలాగు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి ఎన్నికల సమయంలో ట్యాంపరింగ్ చేయడం సులభమవుతుందని ప్రణాళిక రచించుకున్నారు. ఇందులో భాగంగానే హరిప్రసాద్ చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, హరిప్రసాద్‌ల వ్యూహం ఇది వరకే బయట పడటంతో వారికి చేయూతనందించిన రాష్ట్ర ఎన్నికల సంఘంలోని కీలక అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వీరికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విభాగాల్లోని కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. దీంతో వీరు రచించుకున్న ప్రణాళిక అమలు కాక ఈవీఎంలపై అడ్డగోలు వాదనకు దిగుతూ జుట్టు పీక్కుంటున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈవీఎంల దొంగ వేమూరి వేమూరి హరికృష్ణ ప్రసాద్.. ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం వెనుక సూత్రధారి. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతో ఈవీఎంలపై నెపం నెట్టేందుకు చంద్రబాబు ఆడుతున్న నాటకంలో ముఖ్య పాత్రధారి. ఇంతకూ ఇతనెవరనేది ఒక్క మాటలో చెప్పాలంటే.. చంద్రబాబు బినామీ, అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి అవినీతి బంధం విడదీయరానిదని చెప్పేందుకు ఎన్నో రుజువులున్నాయి. హరికృష్ణ ప్రసాద్ 2010లో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఈవీఎంను దొంగిలించిన కేసులో పోలీసులు అయన్ను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 2009లో వరుసగా రెండోసారి టీడీపీ ఓడిపోయాక చంద్రబాబు కుయుక్తులకు తెరతీశారు. ఈవీఎంల వల్లే తాను ఓడిపోయానని దేశాన్ని నమ్మించాలనుకుని ఆ బాధ్యతను తన సన్నిహితుడు హరికృష్ణ ప్రసాద్‌కు అప్పగించారు. దాంతో ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని తాను నిరూపిస్తానని ఆయన ఢిల్లీలో ఓ ప్రదర్శన నిర్వహించారు. కాగా ఆయన అందుకోసం ముంబయిలోని ఎన్నికల సంఘం గోదాం నుంచి ఈవీఎంను దొంగలించినట్లు ఎన్నికల సంఘం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో మహారాష్ట్ర పోలీసులు 2010 ఏప్రిల్ 20న అతన్ని అరెస్టు చేశారు. 454, 457, 380 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. బినామీ బంధం.. దోపిడీనే లక్ష్యం చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక వేమూరి హరికృష్ణ ప్రసాద్ ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది. ప్రభుత్వ వ్యవహారాలైనా, టీడీపీ వ్యవహారాలైనా ఆయనకే పెద్దపీట వేస్తూ వచ్చారు. రాష్ట్ర ఈ గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీ, స్టేట్ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్ల పరిశీలన, మదింపు కమిటీలలో సభ్యుడిగా నియమించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ మరీ ఏకపక్షంగా భారీ కాంట్రాక్టులు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అందులో కొన్ని.. అడ్డగోలుగా ఈపాస్ కాంట్రాక్టు చంద్రబాబు అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖలో ఈపాస్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టారు. ఎల్–1, ఎల్–2లుగా వచ్చిన సంస్థలను కాదని ఎల్–3గా వచ్చిన టెరాసాఫ్ట్‌కు ఆ కాంట్రాక్టును అప్పగించడం వివాదాస్పదమైంది. మరోవైపు ఈపాస్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ సంస్థ సకాలంలో పూర్తి చేయలేకపోయింది. దాంతో ఏపీ టెక్నాలాజికల్ సర్వీసెస్ (ఏపీటీఎస్) ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. దాంతో ఇక టెరాసాఫ్ట్ సంస్థకు ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వకూడదు. ఫైబర్ గ్రిడ్‌లో రూ.2 వేల కోట్ల కాంట్రాక్టులు రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) కాంట్రాక్టుల్లో వేమూరి హరి ప్రసాద్, రవికుమార్‌లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను అడ్డగోలుగా వారిద్దరికి చెందిన టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టారు. అందుకోసమే ముందు జాగ్రత్తగా హరి ప్రసాద్‌ను ఏపీఎస్ఎఫ్ఎల్ టెండర్ల కమిటీలో సభ్యుడిగా నియమించారు. రూ.333 కోట్ల ఫైబర్ గ్రిడ్ మొదటి దశ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌కు 2015లో కట్టబెట్టారు. ఈ సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు అప్పగించడం గమనార్హం. రెండో దశలో కూడా రూ.1,500 కోట్ల కాంట్రాక్టును అదే సంస్థకు కట్టబెట్టారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ (ఐటీఐ), టెలీకమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) సంస్థల టెండర్లను కనీసం పరిశీలించకుండానే తిరస్కరించారు. టెరాసాఫ్ట్ సంస్థకు అనుకూలంగా నిబంధనలను పలుసార్లు సవరించి మరీ కాంట్రాక్టులను కట్టబెట్టారు. దీనిపై ఐటీఐ, టీసీఐఎల్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు కట్టబెట్టాలని ఏకంగా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం చూస్తుంటే చంద్రబాబుకు వేమూరి హరి ప్రసాద్ ఎంతటి సన్నిహితుడో ఇట్టే తెలుస్తోంది. భూ పందేరం అమరావతి ఇండస్ట్రియలిస్ట్స్ అసోషియేషన్ పేరిట వేమూరి హరికృష్ణ ప్రసాద్, రవికుమార్లకు చెందిన సంస్థలకు బాబు సర్కారు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏకంగా 98 ఎకరాలు కేటాయించింది. ఆ భూములను ప్రభుత్వ నిధులతోనే చదును చేసి అభివృద్ధి చేయడం గమనార్హం. నిర్ణీత గడువులోగా పరిశ్రమలు స్థాపించక పోయినప్పటికీ ప్రభుత్వం ఆ భూములను వెనక్కు తీసుకోలేదు. వీరి ఆధ్వర్యంలోని నాన్ రెసిడెంట్ తెలుగూస్ సంస్థకు అమరావతిలో 5 ఎకరాలు కేటాయించడం గమనార్హం. ఆ భూమిలో ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బాబుతో వ్యాపారానుబంధం వేమూరి హరి ప్రసాద్, ఆయన సోదరుడు వేమూరి రవి కుమార్ చంద్రబాబుకు బినామీలుగా, అత్యంత సన్నిహితులుగా అధికార వర్గాలకు చిరపరిచితులు. వారి బంధం చంద్రబాబు వ్యాపార సంస్థల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ అంతటా అల్లుకుపోయింది. వేమూరి హరి ప్రసాద్ టెరాసాఫ్ట్, టెరాసాఫ్ మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ డైరెక్టర్ కాగా, ఆయన సోదరుడు రవికుమార్ కూడా టెరాసాఫ్ట్ డైరెక్టర్. ఈ రెండు సంస్థలు కూడా చంద్రబాబు బినామీ సంస్థలేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న దేవినేని సీతారామయ్య టెరాసాఫ్ట్ సంస్థలోనూ డైరెక్టర్‌గా వ్యవహరించారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో మరో డైరెక్టర్‌గా ఉన్న కోలారు రాజేష్.. చంద్రబాబు సన్నిహితులకు చెందిన సీతాపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టులోనూ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అదే సీతాపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టులో వేమూరి హరి ప్రసాద్ కూడా డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం. ఇక హెరిటేజ్ ఫుడ్స్, టెరా సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలను బక్కన్నవార్ నిర్వహిస్తున్నారు. అంటే హెరిటేజ్ ఫుడ్స్, టెరా సంస్థలు, సీతాపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టులలో స్పష్టంగా కనిపిస్తున్న సారూప్యత ఏమింటే.. ఈ మూడు సంస్థల్లోనూ చంద్రబాబు, వేమూరి హరి ప్రసాద్, కోలారు రాజేష్‌లు కీలకంగా వ్యవహరించడం. ‘యూ విన్’కాంట్రాక్టూ అంతే.. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే కాంట్రాక్టులోనూ టెరాసాఫ్ట్ సంస్థకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం అసంఘటిత రంగ కార్మికులకు ‘యు విన్’ పేరిట గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి సంస్థలకు ఆ కాంట్రాక్టు అప్పగించాలని, ఒక్కో కార్డుకు గరిష్టంగా రూ.30 వ్యయం చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా ఒక్కో కార్డుకు రూ.120 చెల్లిస్తూ ఆ కాంట్రాక్టును టెరాసాఫ్ట్‌కు కట్టబెట్టింది. రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది కార్మికులకు గుర్తింపు కార్డుల జారీ పేరిట ఈ సంస్థకు రూ.140 కోట్ల కాంట్రాక్టును ఏకపక్షంగా అప్పగించింది. ‘ఈ–ప్రగతి’ పేరుతో హాంఫట్ ఈ ప్రగతి పేరిట చంద్రబాబు, ఆయన బినామీ వేమూరి హరి ప్రసాద్ యథేచ్చగా దోపిడీకి పాల్పడ్డారు. రాష్ట్రంలో 33 శాఖలకు చెందిన అన్ని సేవలను మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏకంగా రూ.2,398 కోట్లతో టెండర్లు పిలిచింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1,538 కోట్లు. ఈ కాంట్రాక్టును అడ్డదారిలో టెరాసాఫ్ట్ భాగస్వామిగా ఉన్న సిస్కో సంస్థకు ఖరారు చేశారు. -
ఈవీఎంల చోరీ కేసులో నిందితుడికి పదవి
ఆర్టీజీసీ సాంకేతిక సలహాదారుగా హరికృష్ణ ప్రసాద్ హరికృష్ణ ప్రసాద్ నియామకంపై విస్తుపోతున్న అధికారులు సాక్షి, అమరావతి: రియల్ టైమ్ గుడ్ గవర్ననెన్స్ కమిటీ(ఆర్టీజీసీ) సాంకేతిక సలహాదారుగా వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)ల చోరీ కేసులో నిందితుడైన హరికృష్ణ ప్రసాద్‌ను ఆర్టీజీసీ సాంకేతిక సలహాదారుగా నియమించడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. హరికృష్ణ ప్రసాద్‌పై ముంబైలో కేసు నమోదు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన హరికృష్ణ ప్రసాద్ ఈవీఎంలను ట్యాంపర్ చేయటంపై 2010 ఏప్రిల్ 29 ఓ టీవీ ఛానల్లో లైవ్ షో ఇచ్చారు. ఇందులో ప్రదర్శించిన ఈవీఎంను మహారాష్ట్ర ఎన్నికల్లో వినియోగించారు. ఈ నేపథ్యంలో ఈవీఎంను అపహరించారంటూ ముంబై ఎన్నికల అధికారి 2010 మే 12న ఫిర్యాదు చేయటంతో పోలీసులు హరికృష్ణ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. దేశ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసేలా హరికృష్ణ ప్రసాద్ వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈఎంవీ చోరీ చేసులో నిందితుడైన ఆయన్ను ఏరి కోరి ఆర్టీజీఎస్ సలహాదారుగా నియమించడంపై అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి. హరికృష్ణ ప్రసాద్ సోదరుడైన డాక్టర్ వేమూరి రవికుమార్ ప్రసాద్‌ను ప్రవాస తెలుగు ప్రజల వ్యవహారాల విభాగం సలహాదారుగా నియమించారు. వీరికి సంబంధించిన సంస్థకే ఫైబర్ గ్రిడ్, ఈ–ప్రగతి ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టి భారీ ఎత్తున లబ్ధిచేకూర్చారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
బడా నజరానా!
బాబు బినామీకి రూ.320 కోట్ల ప్రాజెక్టు సులువుగా దక్కించుకున్న టీడీపీ ఐటీ అడ్వయిజర్ సాక్షి, హైదరాబాద్: ఈవీఎంల దొంగతనం, ట్యాంపరింగ్ కేసులో నిందితుడతను.. తెలుగుదేశం పార్టీ ఐటీ వ్యవహారాల అడ్వయిజర్‌గా బాధ్యతలు చేపట్టాడు..పార్టీ సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల జారీ అతని చేతుల మీదుగానే జరిగాయి... ఆ తర్వాత చంద్రబాబు కుటుంబానికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో డెరైక్టర్‌గా ఎదిగాడు... చంద్రబాబు సీఎం అయిన తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేస్తున్నాడు.. మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో అతడిని సభ్యుడిగా చంద్రబాబు నియమించారు. ఇపుడు ఏకంగా ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలిదశ పనుల టెండర్ కొట్టేశాడు.. హైలెవల్ కమిటీ ఖరారు చేసిన ఆ టెండర్ విలువ రూ. 320 కోట్లు.. చినబాబు ‘సన్నిహితుడు’ అయినందునే అనుమతులన్నీ ఆగమేఘాలపై వచ్చేశాయని వినిపిస్తోంది. బాబుగారి బినామీ గణంలో కనిపిస్తున్న ఈ కొత్త ముఖం.. పేరు వేమూరి హరికృష్ణప్రసాద్.. అతను డెరైక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్‌కి సోదరసంస్ధ అయిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కే ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ టెండర్ దక్కింది. విచిత్రమేమిటంటే.. ఈ టెండర్ మదింపు, పర్యవేక్షణ కమిటీల్లోనూ అతను సభ్యుడు.. నారా చంద్రబాబు నాయుడు పాలన ఎలా సాగుతోందో తెలుసుకునేందుకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక. ఈనాటి ఈ బంధం ‘ఈవీఎం’కేసు నాటిది.. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జట్టు కట్టి మహాకూటమిని ఏర్పాటు చేసినా 2009 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనాన్ని ఆపలేకపోయారు. ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఆ నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టారు. ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్ రంగంలోకి దిగారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని నిరూపించేందుకు పూనుకున్నారు. ముంబైలోని ‘కోట’లో గల గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను దొంగలించిన హరికృష్ణప్రసాద్, వాటిని ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్‌లో ప్రదర్శించారు. ఈవీఎంలు దొంగిలించినందుకు గాను ఏప్రిల్ 28, 2010న ముంబై పోలీసులు హరికృష్ణ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ చంద్రబాబు రాద్ధాంతం చేశారు. దాంతో చంద్రబాబు, హరికృష్ణ ప్రసాద్‌ల బంధం బైటపడింది. ఆ తర్వాత హరికృష్ణ ప్రసాద్‌కు టీడీపీ ఐటీ వ్యవహారాలను చంద్రబాబు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల జారీలో ఆయన కీలక భూమిక పోషించారు. చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న హరికృష్ణ ప్రసాద్ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సంస్థలో ఆగస్టు 10, 2012 నుంచి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దపీట చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అటు పార్టీ.. ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీల్లో ఆయనను సభ్యునిగా నియమించారు. రాష్ట్రంలో చౌక దుకాణాల్లో ఈ-పాస్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చౌక దుకాణాలకు ఈ-పాస్ యంత్రాల సరఫరా, ఏర్పాటు పనులకు జూలై 19, 2014న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వేమూరి హరికృష్ణ ప్రసాద్ డెరైక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సోదర సంస్థ అయిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసి.. ఎల్-3గా నిలిచింది. ఎల్-1, ఎల్-2లను కాదని ఉన్నత స్థాయి ఒత్తిళ్ల మేరకు ఈ-పాస్ టెండర్లను టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్) కట్టబెట్టింది. కానీ.. యంత్రాలను సరఫరా చేయకపోవడంతో టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌ను ఏడాదిపాటూ బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ ఏపీటీఎస్ మే 11న ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ఖరారు కమిటీలో స్థానం.. రాష్ట్రంలో అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ర్టప్రభుత్వం ైఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా అన్ని మండల కేంద్రాలకూ ఇంటర్ నెట్ సౌకర్యాన్ని కల్పించే పనులకు రూ.333 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ పనులకు టెండర్ విధి విధానాలను రూపొంది స్తూ ఆగస్టు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండరు మదింపు, పర్యవేక్షణ కమిటీల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు స్థానం కల్పించింది. ఆయన్ను ఏ ప్రాతిపదికన సభ్యునిగా నియమించారన్నది ఎవరికీ అర్ధంకాని విషయం. టెండర్ మదింపు కమిటీ ఎవరిని ప్రతిపాదిస్తే.. వారికే పనులు కట్టబెట్టాలంటూ హైలెవల్ టెండర్ అప్రూవల్ కమిటీకి ఆదిలోనే ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసింది. ఫైబర్ గ్రిడ్ తొలి దశ పనులను రూ.320.85 కోట్లకు కోట్ చేస్తూ టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసింది. టెండర్ మదింపు కమిటీ సూచన మేరకు.. (అంటే హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉ న్న కమిటీ సూచన మేరకు..) ఆ సంస్థకే ఫైబర్ గ్రిడ్ పనులను అప్పగించారు. నవంబర్ 2న హైలెవల్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌ను మే 11న ఏపీటీఎస్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడాన్ని టెండర్ మదింపు కమిటీ ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. సీఎం బాబు ఒత్తిళ్ల మేరకే నిబంధనలను తోసిరాజని.. ఆ సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులు కట్టబెట్టినట్లు అధికారవర్గాలు అంటున్నాయి. ‘టెరా’ సంస్థలకు బాబుగారి సంస్థలకు మధ్య బంధం.. టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థల్లో టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్‌తో పాటు సీతపల్లి గ్యాస్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, టెక్నాలజీ ట్రాన్సఫరెన్సీ ఫౌండేషన్, ప్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్యూచర్ స్పేస్ లిమిటెడ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్క టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ మినహా తక్కిన సంస్థలన్నింటీలోనూ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థలకూ చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ పుడ్స్, ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకూ అవినాభావ సంబంధం ఉంది. హెరిటేజ్ పుడ్స్, ఫిన్ లీజ్ సంస్థల్లో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న దేవినేని సీతారామయ్య టెరా సాఫ్ట్‌వేర్‌లో సెప్టెంబరు 30, 2014 వరకూ డెరైక్టర్‌గా పనిచేశారు. హెరిటేజ్ సంస్థల్లో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న కోలారు రాజేష్.. సీతపల్లి గ్యాస్ పవర్ లిమిటెడ్‌లో వేమూరి హరికృష్ణప్రసాద్‌తోపాటూ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. టెరా సంస్థలు.. హెరిటేజ్ సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలను ఆర్ఎస్ బక్కన్నవార్ పర్యవేక్షిస్తున్నారు. టెరా అనుబంధం సంస్థలన్నీ చంద్రబాబు కుటుంబ బినామీ సంస్థలేనని వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను బినామీ సంస్థ అయిన టెరా సాఫ్ట్‌వేర్‌కు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచుకోవడానికి ‘ముఖ్య’నేత వ్యూహం రచించారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.