సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ ప్రాజెక్టు కుంభకోణంలో కీలక పాత్రధారి కనుమూరి కోటేశ్వరరావును సీఐడీ తాజాగా అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ముసుగులో రూ.284 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ నిధులను నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు, ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వేమూరి హరిప్రసాద్ కంపెనీలకు మళ్లించినట్లు వెల్లడైంది.
ఈ కేసులో కనుమూరిని ఏ–23గా సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే విదేశాలకు ఉడాయించడంతో కనుమూరిపై సీఐడీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12న అమెరికా నుంచి తిరిగి వచ్చిన నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు.
సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేసింది. నిందితుడికి న్యాయస్థానం ఈ నెల 21వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
కీలక పురోగతి
టీడీపీ హయాంలో ఇన్‌క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్(ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రామ్మూర్తి(ఏ–21)లను ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ–11 తుమ్మల గోపీచంద్, ఏ–22 రామ్‌కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో వేమూరి హరికృష్ణకు సహకరించిన కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేయడం ద్వారా సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు.
షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు..
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్‌కు కేటాయించారు. వేమూరి హరికృష్ణ ప్రజాధనాన్ని కాజేసేందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్నాడు.
వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు.
ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది.
నెటాప్స్ – టెరాసాఫ్ట్ వయా వేమూరి
► నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు.
► నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పని చేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు.
► నెటాప్స్ కంపెనీ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు బదిలీ చేసింది.
► నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది.
► నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment