బడా నజరానా! | Rs 320 crore project to Babu Benami | Sakshi
Sakshi News home page

బడా నజరానా!

Published Sun, Dec 27 2015 3:35 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

బడా నజరానా! - Sakshi

బడా నజరానా!

బాబు బినామీకి రూ.320 కోట్ల ప్రాజెక్టు
సులువుగా దక్కించుకున్న టీడీపీ ఐటీ అడ్వయిజర్
 
 సాక్షి, హైదరాబాద్: ఈవీఎంల దొంగతనం, ట్యాంపరింగ్ కేసులో నిందితుడతను.. తెలుగుదేశం పార్టీ ఐటీ వ్యవహారాల అడ్వయిజర్‌గా బాధ్యతలు చేపట్టాడు..పార్టీ సభ్యత్వ నమోదు, గుర్తింపు కార్డుల జారీ అతని చేతుల మీదుగానే జరిగాయి... ఆ తర్వాత చంద్రబాబు కుటుంబానికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో డెరైక్టర్‌గా ఎదిగాడు... చంద్రబాబు సీఎం అయిన తర్వాత పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేస్తున్నాడు.. మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో అతడిని సభ్యుడిగా చంద్రబాబు నియమించారు.

ఇపుడు ఏకంగా ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలిదశ పనుల టెండర్ కొట్టేశాడు.. హైలెవల్ కమిటీ ఖరారు చేసిన ఆ టెండర్ విలువ రూ. 320 కోట్లు.. చినబాబు ‘సన్నిహితుడు’ అయినందునే అనుమతులన్నీ ఆగమేఘాలపై వచ్చేశాయని వినిపిస్తోంది. బాబుగారి బినామీ గణంలో కనిపిస్తున్న ఈ కొత్త ముఖం.. పేరు వేమూరి హరికృష్ణప్రసాద్.. అతను డెరైక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్‌కి సోదరసంస్ధ అయిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కే ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ టెండర్ దక్కింది. విచిత్రమేమిటంటే.. ఈ టెండర్ మదింపు, పర్యవేక్షణ కమిటీల్లోనూ అతను సభ్యుడు..  నారా చంద్రబాబు నాయుడు పాలన ఎలా సాగుతోందో తెలుసుకునేందుకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక.

 ఈనాటి ఈ బంధం ‘ఈవీఎం’కేసు నాటిది..
 టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జట్టు కట్టి మహాకూటమిని ఏర్పాటు చేసినా 2009 ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనాన్ని ఆపలేకపోయారు. ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఆ నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టారు. ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేమూరి హరికృష్ణ ప్రసాద్ రంగంలోకి దిగారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని నిరూపించేందుకు పూనుకున్నారు.

ముంబైలోని ‘కోట’లో గల గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను దొంగలించిన హరికృష్ణప్రసాద్, వాటిని ట్యాంపరింగ్ ఎలా చేయవచ్చో ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్‌లో ప్రదర్శించారు. ఈవీఎంలు దొంగిలించినందుకు గాను ఏప్రిల్ 28, 2010న ముంబై పోలీసులు హరికృష్ణ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారంటూ చంద్రబాబు రాద్ధాంతం చేశారు. దాంతో చంద్రబాబు, హరికృష్ణ ప్రసాద్‌ల బంధం బైటపడింది. ఆ తర్వాత  హరికృష్ణ ప్రసాద్‌కు టీడీపీ ఐటీ వ్యవహారాలను చంద్రబాబు అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు గుర్తింపు కార్డుల జారీలో ఆయన కీలక భూమిక పోషించారు. చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న హరికృష్ణ ప్రసాద్ టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సంస్థలో ఆగస్టు 10, 2012 నుంచి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.

 పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దపీట
 చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అటు పార్టీ.. ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఇన్నోవేషన్ సొసైటీల్లో ఆయనను సభ్యునిగా నియమించారు. రాష్ట్రంలో చౌక దుకాణాల్లో ఈ-పాస్ పద్ధతిలో సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చౌక దుకాణాలకు ఈ-పాస్ యంత్రాల సరఫరా, ఏర్పాటు పనులకు జూలై 19, 2014న ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. వేమూరి హరికృష్ణ ప్రసాద్ డెరైక్టర్‌గా ఉన్న టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ సోదర సంస్థ అయిన టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసి.. ఎల్-3గా నిలిచింది. ఎల్-1, ఎల్-2లను కాదని ఉన్నత స్థాయి ఒత్తిళ్ల మేరకు ఈ-పాస్ టెండర్లను టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌కు ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్) కట్టబెట్టింది. కానీ.. యంత్రాలను సరఫరా చేయకపోవడంతో టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌ను ఏడాదిపాటూ బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ ఏపీటీఎస్ మే 11న ఉత్తర్వులు జారీ చేసింది.

 టెండర్ ఖరారు కమిటీలో స్థానం..
 రాష్ట్రంలో అన్ని గ్రామాలకూ ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ర్టప్రభుత్వం ైఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా అన్ని మండల కేంద్రాలకూ ఇంటర్ నెట్ సౌకర్యాన్ని కల్పించే పనులకు రూ.333 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ పనులకు టెండర్ విధి విధానాలను రూపొంది స్తూ ఆగస్టు 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండరు మదింపు, పర్యవేక్షణ కమిటీల్లో వేమూరి హరికృష్ణ ప్రసాద్‌కు స్థానం కల్పించింది. ఆయన్ను ఏ ప్రాతిపదికన సభ్యునిగా నియమించారన్నది ఎవరికీ అర్ధంకాని విషయం.

టెండర్ మదింపు కమిటీ ఎవరిని ప్రతిపాదిస్తే.. వారికే పనులు కట్టబెట్టాలంటూ హైలెవల్ టెండర్ అప్రూవల్ కమిటీకి ఆదిలోనే ప్రభుత్వం మార్గనిర్దేశనం చేసింది. ఫైబర్ గ్రిడ్ తొలి దశ పనులను రూ.320.85 కోట్లకు కోట్ చేస్తూ టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ షెడ్యూలు దాఖలు చేసింది. టెండర్ మదింపు కమిటీ సూచన మేరకు.. (అంటే హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉ న్న కమిటీ సూచన మేరకు..) ఆ సంస్థకే ఫైబర్ గ్రిడ్ పనులను అప్పగించారు. నవంబర్ 2న హైలెవల్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్‌ను మే 11న ఏపీటీఎస్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టడాన్ని టెండర్ మదింపు కమిటీ ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. సీఎం బాబు ఒత్తిళ్ల మేరకే నిబంధనలను తోసిరాజని.. ఆ సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులు కట్టబెట్టినట్లు అధికారవర్గాలు అంటున్నాయి.
 
 ‘టెరా’ సంస్థలకు బాబుగారి సంస్థలకు మధ్య బంధం..
 టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థల్లో టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్‌తో పాటు సీతపల్లి గ్యాస్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కోఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, టెక్నాలజీ ట్రాన్సఫరెన్సీ ఫౌండేషన్, ప్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్యూచర్ స్పేస్ లిమిటెడ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒక్క టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ మినహా తక్కిన సంస్థలన్నింటీలోనూ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు.

టెరా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థలకూ చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ పుడ్స్, ఫిన్ లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకూ అవినాభావ సంబంధం ఉంది. హెరిటేజ్ పుడ్స్, ఫిన్ లీజ్ సంస్థల్లో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న దేవినేని సీతారామయ్య టెరా సాఫ్ట్‌వేర్‌లో సెప్టెంబరు 30, 2014 వరకూ డెరైక్టర్‌గా పనిచేశారు. హెరిటేజ్ సంస్థల్లో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న కోలారు రాజేష్.. సీతపల్లి గ్యాస్ పవర్ లిమిటెడ్‌లో వేమూరి హరికృష్ణప్రసాద్‌తోపాటూ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. టెరా సంస్థలు.. హెరిటేజ్ సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలను ఆర్‌ఎస్ బక్కన్నవార్ పర్యవేక్షిస్తున్నారు. టెరా అనుబంధం సంస్థలన్నీ చంద్రబాబు కుటుంబ బినామీ సంస్థలేనని వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను బినామీ సంస్థ అయిన టెరా సాఫ్ట్‌వేర్‌కు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచుకోవడానికి ‘ముఖ్య’నేత వ్యూహం రచించారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement