శాఖ బాబుది.. సంతకం చినబాబుది | Nara Lokesh Signature Is The Proof for Rs 2000 crore Fiber Grid Fraud | Sakshi
Sakshi News home page

Fibergrid Scam : శాఖ బాబుది.. సంతకం చినబాబుది

Published Mon, Sep 21 2020 3:25 AM | Last Updated on Mon, Sep 21 2020 10:56 AM

Nara Lokesh Signature Is The Proof for Rs 2000 crore Fiber Grid Fraud - Sakshi

తండ్రి ముఖ్యమంత్రి.. తనయుడు మంత్రి.. తండ్రి అధికారంతో తనయుడి నిర్వాకం.. తండ్రీ తనయుల తోడుతో పేట్రేగిన బినామీ వెరసి రూ.2 వేల కోట్లు ఖజానాకు తూట్లు! ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణలు సాగించిన అక్రమాల బాగోతం ఇదీ..!

సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.రెండు వేల కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం నిర్ధారించింది. ఇందులో కీలక పాత్ర పోషించిన వేమూరి హరికృష్ణప్రసాద్‌ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఫైబర్‌ గ్రిడ్‌ ఫైలుపై నారా లోకేశ్‌ సంతకం చేశారని అంగీకరించారు. ఆరోజు నాటి సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో సంతకం చేశారన్నారు. అయితే అంతలోనే సర్దుకుని లోకేశ్‌ సంతకం చేయలేదంటూ బుకాయించడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో అత్యంత నాణ్యమైన సెట్‌టాప్‌  బాక్స్‌ రూ.2,200కే దొరుకుతుండగా గత సర్కారు రూ.4,400 చొప్పున కొనుగోలు చేసింది. వీటిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లు అంగీకరించిన వేమూరి ఆ తర్వాత కేవలం 40 వేల బాక్స్‌లు మాత్రమే ఉత్పత్తి చేశామంటూ మాట మార్చారు. ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణకైనా తాను సిద్ధమంటూ మీడియాతో పేర్కొన్న వేమూరి ఆ తర్వాత కేసులో తనను ఇరికించడానికి ప్రయత్నిస్తే హైకోర్టును ఆశ్రయిస్తానంటూ బెదిరింపులకు దిగారు.


దోపిడీకి అడ్డాగా ఫైబర్‌ గ్రిడ్‌...
► రాష్ట్రంలో ఒకే కనెక్షన్‌తో ఇంటింటికీ కారు చౌకగా కేబుల్‌ టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫోన్‌ సౌకర్యాన్ని కల్పించడానికి ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును చేపట్టామని 2015లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ పరిధిలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌(ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌)ను ఏర్పాటు చేశారు. ఈ శాఖను ఐదేళ్లపాటూ చంద్రబాబే నిర్వహించారు. 
► వేమూరి హరికృష్ణప్రసాద్‌ ఆగస్టు 10, 2012 నుంచి సెప్టెంబర్‌ 8, 2015 వరకూ టెరా సాఫ్ట్‌ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబుకు బినామీ అయిన వేమూరిని ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. 
► ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌లో తొలిదశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు ఆగస్టు 26, 2015న ఇన్‌క్యాప్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) నుంచి ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ అనుమతి తీసుకుంది. ఈ టెండర్‌ మదింపు కమిటీలో ఐటీ సలహాదారు హరికృష్ణప్రసాద్‌ను చేర్చింది.
► తూర్పుగోదావరి జిల్లాలో ఈపాస్‌ యంత్రాల సరఫరాలో గోల్‌మాల్‌ చేసిన టెరా సాఫ్ట్‌ను ఏపీటీఎస్‌(ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌) సంస్థ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. కానీ.. ఫైబర్‌ గ్రిడ్‌ తొలి దశ టెండర్‌ను ఆగస్టు 30, 2015న టెరా సాఫ్ట్‌కు కట్టబెట్టారు. 
► టెరా సాఫ్ట్‌కుకేబుళ్లు, నెట్‌ వర్క్‌ ఆపరేషన్‌ సెంటర్‌(నాక్‌), హెడ్‌ ఎండ్‌ అనుభవం ఉన్నట్లు సిగ్నమ్‌ కంపెనీ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి పనులు దక్కించుకున్నారు. సిగ్నమ్‌ కంపెనీ సీఈ, ఎండీ దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేయడం గమనార్హం. 
► నాసిరకం కేబుల్, క్లాంప్‌లతో టెరా సాఫ్ట్‌ తొలి దశలోనే రూ.333 కోట్లను దోచేసింది.

సంబంధిత శాఖ మంత్రే సంతకం చేయాలి..
► నిబంధనల మేరకు సంబంధిత శాఖను నిర్వహిస్తున్న మంత్రి మాత్రమే ఆ శాఖలోని ఫైళ్లపై సంతకం చేయాలి. ఇతర మంత్రులు సంతకం చేయకూడదు. 
► 2017లో ఏప్రిల్‌ 3న చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖలు అప్పగించారు.
► లోకేశ్‌ మంత్రి కాగానే హరికృష్ణ ప్రసాద్‌ను 2017 సెప్టెంబర్‌ 14న ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సలహాదారుగా నియమించారు. అప్పటి నుంచి టెండర్లలో గోల్‌ మాల్‌ పెద్ద ఎత్తున జరిగింది.
► లోకేశ్‌ వద్ద ఉన్న శాఖలకు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు  సంబంధం లేదు. కానీ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన ఫైల్‌ పై లోకేశ్‌ సంతకాలు చేశారు. 
► భారత్‌ నెట్‌ ఫేజ్‌ 2కి సంబంధించిన ఎంవోయూ ఫైల్‌ పై నారా లోకేశ్‌ 2017 నవంబర్‌ 12న సంతకం చేశారు. బీబీఎన్‌ఎల్‌(భారత్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ నెట్‌ వర్క్‌ లిమిటెడ్‌) రెండో దశకు సంబంధించి ఆ సంస్థకూ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కూ మధ్య ఎంవోయూను ఆమోదిస్తూ సంబంధిత ఫైల్‌పై లోకేశ్‌ సంతకం చేశారు. ఇక్కడే లోకేశ్‌ అడ్డంగా దొరికారు. 
► బీబీఎన్‌ఎల్‌ మార్గదర్శకాలను తుంగలో తొక్కి.. టెండర్‌ షరతులను సడలించి.. నిబంధనలు ఉల్లంఘించి.. అర్హత లేని టెరా సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌కు 11.26 శాతం అధిక ధరలకు పనులు అప్పగించారు. దీనివల్ల అంచనా వ్యయం రూ.907.94 కోట్ల నుంచి రూ.1410 కోట్లకు పెరిగింది.  వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.

అంతులేని అక్రమాలు..
► 2014–2019 మధ్య సుమారు రూ.3,492 కోట్లవిలువైన పనులను ఫైబర్‌ గ్రిడ్‌లో చేపట్టారు. ఫేజ్‌ 1 కింద రూ.333 కోట్ల పనులు, సీసీ కెమెరాల కొనుగోలుకు రూ.959 కోట్లు, భారత్‌ నెట్‌కు రూ.1,600 కోట్లు, సెట్‌ టాప్‌ బాక్సుల కొనుగోలును రూ.600 కోట్లతో చేపట్టారు. 
► ఫైబర్‌ గ్రిడ్‌ పరికరాలు, సెట్‌ టాప్‌ బాక్సులు, కేబుళ్ల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. చైనా కంపెనీలతో హరికృష్ణప్రసాద్‌ ముందుగానే డీల్‌ కుదుర్చుకుని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కంపెనీలో నాసిరకమైన సెట్‌ టాప్‌ బాక్స్‌లను తయారు చేయించి ఖజానాను దోచేశారు. కొనుగోలు చేసిన 12 లక్షలసెట్‌టాప్‌ బాక్సుల్లో 3.40 లక్షల బాక్స్‌లు పని చేయకపోవడమే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నాయో నిరూపిస్తోంది.

సాంకేతిక సలహాలు మాత్రమే.. ఇచ్చేవాడిని
వేమూరి హరికృష్ణప్రసాద్‌  
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు టెండర్‌ కమిటీలో తాను లేనని.. సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినని  టీడీపీ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారుడు వేమూరి హరికృష్ణప్రసాద్‌ చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెట్‌ టాప్‌ బాక్సు ఒక్కొక్కటి రూ.3,700కు కొనుగోలు చేశామని చెప్పారు. 10 లక్షల బాక్సులకు టెండర్లు వేస్తే సుమారు 7 సంస్థలు పాల్గొన్నాయని.. అందులో తక్కువ రేటు ఉన్న దాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 10 లక్షల మంది ఏపీ ఫైబర్‌నెట్‌ను వినియోగిస్తున్నారని.. వాటి పనితీరు ఎలా ఉందో వారిని విచారించుకోవచ్చన్నారు. తాను అవకతవకలకు పాల్పడలేదన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement