సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక పథకాల్లో రూ.వందల కోట్లలో అవినీతి జరిగినట్లు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. ఈ అక్రమాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచి వాలయంలో సమావేశమైన మంత్రివర్గం దీనిపై క్షుణ్నంగా చర్చించింది. అనంతరం మంత్రివర్గం తీర్మానం మేరకు ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణ కేంద్రంగా సాగిన ఈ అవినీతి వ్యవహారంలో విస్తుగొలిపే వాస్తవాలు మంత్రివర్గ ఉపసంఘం విచా రణలో వెలుగు చూశాయి. ఈవీఎంల ట్యాంపరింగ్, చోరీ కేసులో నిందితుడైన వేమూరు హరి కృష్ణకు చెందిన బ్లాక్‌లిస్ట్‌లోని టెరాసాఫ్ట్‌కు గత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తు సంస్థ విచారణలో వెలుగు చూసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ ఫైబర్ గ్రిడ్ కథ...
► గ్రామీణులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కేంద్రం ఫైబర్ నెట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటర్నెట్‌తోపాటు టీవీ చానెళ్లను ప్రసారం చేయడం కోసం కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం(సీఎస్‌ఎస్) ఫైబర్ నెట్ నిధులతో టీడీపీ సర్కార్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది.
► ఏరియల్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ మొదటి దశలో భాగంగా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ పనులకు 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ (ఆంధ్రపదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
► ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. హారిజోన్ బ్రాడ్‌క్రాస్ట్ ఎల్‌ఎల్‌పీ, సిగ్నమ్ డిజిటల్ నెట్‌తో టెరాసాఫ్ట్ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్ దాఖలు చేసింది.
► టెండర్ నిబంధనలు 15 ఏ (1), 15 బీ (5) ప్రకారం హారిజోన్ సంస్థకు టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు. సిగ్నమ్ డిజిటల్ నెట్ దాఖలు చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రం కూడా నకిలీది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్‌ను 2015 మే 11న ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.
టీడీపీ సర్కారు హయాంలో జరిగిన అక్రమాలపై నివేదికను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు
ఎల్ –1ని కాదని టెరాసాఫ్ట్‌కు..
► నిబంధనల ప్రకారం బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల చోరీ కేసులో నిందితుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ బిడ్‌ను ఆమోదించాలని టీడీపీ సర్కార్ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్–1ను కాదని అధిక ధరక బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పారు.
అనుమతి లేదు...రూ.558.77 కోట్లు అదనం
► భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బీబీఎన్‌ఎల్) గిగాబైట్ పాసివ్ ఆప్టికల్ నెట్‌వర్క్ (జీపీవోఎన్) సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ నెట్ రెండో దశను అమలు చేయాలని ఆదేశించింది. అయితే ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ మాత్రం ఐఎంపీఎల్‌ఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేపట్టింది. జీపీవోన్‌తో పనులు చేపడితే రూ.851.23 కోట్లు వ్యయం అవుతుందని బీబీఎన్‌ఎల్ తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత దాన్ని రూ.907.94 కోట్లకు సవరించింది. కానీ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ మాత్రం ఐఎంపీఎల్‌ఎస్‌తో పనులు చేసేందుకు రూ.1,410 కోట్లకు ఎల్ అండ్ టీ కన్సార్టియంకు అప్పగించింది. అంటే ఇది బీబీఎన్‌ఎల్ నిర్థారించిన మొత్తం కంటే రూ.558.77 కోట్లు అధికం. కేంద్ర ప్రభుత్వం నుంచి గత సర్కార్ దీనికి అనుమతి కూడా తీసుకోలేదు.
నాసిరకం సెట్‌టాప్ బాక్సులు..
► ఏపీ ఏరియల్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశ అమలును పర్యవేక్షించేందుకు పీఎంఏ (ప్రాజెక్టు మానిటరింగ్ ఏజెన్సీ) ఎంపికలోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడింది.
► సెట్ బాక్స్‌ల టెండర్లలో 8 సంస్థలు పాల్గొంటే తక్కువ ధరకు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించకుండా నాలుగు సంస్థలకు పనులు విభజించి అప్పగించారు. కానీ సెట్‌టాప్ బాక్స్‌లను కేవలం టెరాసాఫ్ట్ నుంచే కొనుగోలు చేసి బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారం కేబినెట్ సబ్ కమిటీ విచారణలో వెలుగు చూసింది. సెట్ టాప్ బాక్సుల నాసిరకంగా ఉన్నట్లు కమిటీ తేల్చింది. ఈ క్రమంలో పైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.
చంద్రన్న కానుకల్లో అవినీతి వెల్లువ..
చంద్రన్న కానుక, రంజాన్ తోఫా పేరిట గత సర్కారు పేదలకు పంపిణీ చేసిన రేషన్ సరుకుల్లోనూ పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగినట్లు నిర్థారణ అయింది. కానుక అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపించాలని టీడీపీ నేతలే పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అక్రమాలు వెలికి తీయాలని విజయనగరం జిల్లా గజపతినగరం అప్పటి ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు జడ్పీ సమావేశంలో డిమాండ్ చేయడం దుమారం రేపింది. అక్రమాలు రుజువైతే రెవన్యూ రికవరీ చట్టం ద్వారా డబ్బులు తిరిగి వసూలు చేయాలని అప్పుడు ఆయన డిమాండ్ కూడా చేశారు.
హెరిటేజ్‌కు సంతర్పణ..
చంద్రన్న కానుక కింద సంక్రాంతి పండుగకు పేదలకు అందించిన గిఫ్ట్ ప్యాక్‌లో మిగిలిన సరుకులతో పాటు 100 గ్రాముల చొప్పున నెయ్యి కూడా పంపిణీ చేశారు. ఇందుకోసం ఏడాదికి 1,301 కిలో లీటర్ల నెయ్యి కొనుగోలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోనూ, పొరుగు రాష్ట్రాల్లోనూ పలు డెయిరీలు కిలో నెయ్యి ప్యాకింగ్‌తో సహా రూ.320 నుంచి రూ. 420 వరకు అప్పట్లో విక్రయించాయి.
బహిరంగ మార్కెట్లో విశాఖ డెయిరీ నెయ్యి కిలో రూ. 320, దొడ్ల డెయిరీ నెయ్యి రూ. 350, తిరుమల డెయిరీ నెయ్యి రూ. 375, నందిని డెయిరీ నెయ్యి రూ.420 చొప్పున రిటైల్ అమ్మకాలు జరుపుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా రిటైల్ కొనుగోలు దారులకు కిలో గేదె నెయ్యి రూ.372కే విక్రయిస్తామని విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్ పత్రికా ప్రకటన ఇచ్చింది. అయితే ఇలా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే వారిని కాదని హెరిటేజ్ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ. 499తోపాటు దీనిమీద 14.5 శాతం విలువ ఆధారిత పన్ను కలిపి కిలో రూ.575 చొప్పున గత సర్కారు కొనుగోలు చేసింది. ఒక ఏడాది నెయ్యి సరఫరాలోనే రూ.26 కోట్లకు పైగా దుర్వినియోగం అయిందనే ఆరోపణలున్నాయి.
కానుక పేరిట కోట్లు స్వాహా..
సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక పేరిట తెల్ల రేషన్ కార్డుదారులకు అర కిలో కందిపప్పు, అర కిలో శనగలు, అర కిలో బెల్లం, అర లీటర్ పామాయిల్, కిలో గోధుమపిండి, 100 గ్రాముల నెయ్యి పంపిణీ చేశారు. ఈ సరుకులన్నీ ఒక సంచిలో పెట్టి ఇచ్చేందుకు గిఫ్ట్ సంచుల పేరిట ఏటా అదనంగా రూ. 15 కోట్లు ఖర్చు చేసి నాసిరకం సంచులిచ్చారు. బెల్లం దుర్వాసన రావడంతో సగం మంది లబ్ధిదారులు డస్ట్‌బిన్‌లో పారేశారు. ఈ విషయాన్ని కళ్లారా చూసిన నాటి సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించినా ఫలితం శూన్యం. చంద్రన్న కానుక సరుకుల సరఫరా టెండర్లను సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకున్నారు. 2015 – 2019 మధ్య సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా పథకం పేరిట సరుకుల సేకరణకు రూ.1,766.28 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.565.94 కోట్ల విలువైన సరుకులు పీడీఎస్ కింద సేకరించారు. మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా సరుకుల కోసం రూ.1,200.34 కోట్లు ఖర్చు చేశారు. అయితే ధరల్లో వ్యత్యాసం, నాసిరకం సరుకులు సరఫరా చేయడం ద్వారా రూ.158.38 కోట్ల మేర ఇందులో అవినీతి జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment