‘ఫైబర్‌’ ఫ్రాడ్‌ సూత్రధారి బాబే | Fibernet Case: CID Charge Sheet In Vijayawada ACB Court - Sakshi
Sakshi News home page

‘ఫైబర్‌’ ఫ్రాడ్‌ సూత్రధారి బాబే

Published Sat, Feb 17 2024 5:13 AM | Last Updated on Sat, Feb 17 2024 12:57 PM

CID charge sheet in Vijayawada ACB court - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడైన, నేర చరిత్ర కలి­గిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్లు ఆధారాలతో నిగ్గు తేల్చింది.

ఈ నేపథ్యంలో ఏ 1గా మాజీ సీఎం చంద్రబాబు, ఏ 2గా టెరా­సాఫ్ట్‌ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ 3గా ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్, ఇన్‌క్యాప్‌ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు (ప్రస్తుతం ద.మ. రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌)తోపాటు మరికొందరిని నింది­తులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌ విత్‌ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్‌ విత్‌ 13(1)(సి)(డి)  ప్రకారం కేసులు నమోదు చేసింది.

ఫైబర్‌నెట్‌ పేరుతో చంద్రబాబు బృందంప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందీ సీఐడీ తన చార్జ్‌షీట్‌లో సవివరంగా పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు సమయంలో చంద్రబాబును ఏ 25గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా చార్జ్‌షీట్‌లో ఏ1గా చేర్చారు. ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది. 

ఐటీ శాఖకు బదులుగా..
టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో రూ.333 కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు. ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ  ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు. నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం. 

బిడ్లు.. టెండర్లు వేమూరివే
వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరిని ఏపీ ఈ–గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు. నిబంధనలను విరుద్ధంగా ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తులు నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు. చంద్రబాబు దీన్ని తుంగలోకి తొక్కారు.

అమాంతం విలువ పెంచేసి...
ప్రాజెక్ట్‌ విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్‌ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు, నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్‌ విలువను అమాంతం పెంచేశారు. వేమూరి హరికృష్ణ, నాటి ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు.

బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించి మరీ..
ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్‌ ప్రభుత్వ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ – పోస్‌ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్‌ను అధికారులు బ్లాక్‌ లిస్టులో చేర్చారు. చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించారు. పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్‌ పవర్‌ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతరు చేయలేదు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత టెరాసాఫ్ట్‌ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్‌ సాధించేందుకుగా వివిధ పత్రాలను ట్యాంపర్‌ చేశారు. 

అమలు లోపభూయిష్టం
ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్‌ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్‌ నోటిఫికేషన్‌ నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు.

వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌ పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్, ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది.

నకిలీ ఇన్వాయిస్‌లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో రూ.144 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా తరలించారు.  నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు రూ.119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేలింది. 

కీలక అధికారుల వాంగ్మూలం..
ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలను సేకరించింది. ఇండిపెండెంట్‌ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్‌ ద్వారా ఆడిటింగ్‌ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్‌ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్‌ నిర్ధారించింది.

ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలంగా వ్యవహరించారని సెక్షన్‌ 164 సీఆర్‌పీసీ ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement