సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఐటీ విభాగం సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణప్రసాద్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) బిజినెస్, ఆపరేషన్స్ మాజీ ఈడీ గౌరీశంకర్ వెల్లడించారు. వేమూరి నియమించిన వ్యక్తులే ఇప్పటికీ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో పనిచేస్తున్నారని, అక్రమాలను బహిర్గతం చేసినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నారు. తన సర్టిఫికెట్లు నిజమైనవని సబర్మతీ యూనివర్సిటీ నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రంఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ లేదా పోలీసులతో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌ను కోరారు. ఫైబర్ గ్రిడ్‌లో అక్రమాలపై బహిరంగ చర్చకు వేమూరి సిద్ధమా? అని సవాల్ చేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.1,500 కోట్ల బిల్లులను చెల్లిస్తే అందులో 80 శాతం వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరాసాఫ్ట్, నెట్‌ఇండియా, నెటాప్స్ సంస్థల ఖాతాల్లోకే వెళ్లాయన్నారు. గౌరీ శంకర్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లలో అక్రమాలు..
► సెట్ టాప్ బాక్స్‌ల కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కటి రూ.4,400 చొప్పున 12 లక్షల బాక్సులు కొనుగోలు చేశారు. ఇందులో 8.60 లక్షలు మాత్రమే పని చేస్తున్నాయి. ఒక్కో సెట్ టాప్ బాక్స్ కాల పరిమితి ఐదేళ్లు కాగా పదేళ్లుగా చూపించి ప్రభుత్వ గ్యారంటీతో ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.450 కోట్ల రుణం తీసుకున్నారు.
► ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ల నుంచి నెలకు రూ.11 కోట్లు బిల్లులు వసూలు కావాల్సి ఉండగా టెరా సాఫ్ట్ అక్రమాలకు పాల్పడి గరిష్టంగా రూ.ఏడు కోట్లు మాత్రమే వసూలైనట్లు చూపింది. తక్కువ బిల్లింగ్ చూపిస్తూ రూ.70 కోట్లకుపైగా దోపిడీ చేశారు. ఈ బిల్లింగ్‌ను సరి చేసేందుకు నేను సాఫ్ట్ వేర్ మార్చడంతో ఒక్క నెలలోనే రూ.8.50 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. హరికృష్ణప్రసాద్ ఓ 420, మోసగాడు. తన స్నేహితుడు కనుమూరి కోటేశ్వరరావు, కుమార్తె అభిజæ్ఞ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. కుంభకోణంలో బడా నేతల పాత్రను బయటపెడతా. దీనిపై సీబీఐ విచారణ చేస్తే నిజాలు నిర్ధారణవుతాయి.
టెండర్ కమిటీలో టెరాసాఫ్ట్ డైరెక్టర్...
► వేమూరి హరికృష్ణప్రసాద్ 2012 ఆగస్టు 10 నుంచి 2015 సెప్టెంబరు 8 వరకు టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
► ఏపీ ఫైబర్ గ్రిడ్ తొలి దశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు 2015 ఆగస్టు 26న ఇన్‌క్యాప్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కా>ర్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ అనుమతి తీసుకుంది.
► ఈ టెండర్‌ను 2015 ఆగస్టు 30న టెరా సాఫ్ట్ దక్కించుకుంది. టెరా సాఫ్ట్ డైరెక్టర్ అయిన హరికృష్ణప్రసాద్ టెండర్ మదింపు కమిటీ సభ్యుడుగా ఉండటం అక్రమం. టెరా సాఫ్ట్‌కు కేబుళ్లు వేయడం, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్) ఏర్పాటు, హెడ్ ఎండ్ అనుభవం లేకున్నా నా సంస్థ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పనులు దక్కించుకున్నారు.
► సిగ్నమ్ కంపెనీ సీఈ, ఎండీ అయిన నేను ఇదే అంశంపై ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీ సాంబశివరావుకు ఫిర్యాదు చేశా. టెరాసాఫ్ట్‌కు అనుభవం ఉందని చెప్పాలంటూ హరికృష్ణప్రసాద్ నన్ను తీవ్రంగా బెదిరించారు.
► నాసిరకం కేబుళ్లు, క్లాంప్‌లతో తొలి దశ పనులను 2016లో ముగించి బిల్లులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment