Gauri Shankar
-
ప్రభుత్వం సాధించిన విజయాలకు అక్షర చిహ్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయపరంపరకు అక్షరచిహ్నంగా ‘తెలంగాణ మోడల్’ పుస్తకం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన ’తెలంగాణ మోడల్‘’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ప్రవేశపెట్టిన పథకాలు నేడు దేశానికి ఎలా నమూనా అయ్యాయో ఈ పుస్తకంలో గౌరీశంకర్ పొందుపరిచారని చెప్పారు. విజయాలను నమోదు చేయడం అంటే చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ కార్యకలాపాలు భద్రపరచడమేనని, ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఈ విజయాలు పుస్తకరూపంలో రావడం భవిష్యత్తరాలకు పాఠాలుగా నిలుస్తాయన్నారు. ‘టుడే ఏ రీడర్– టుమారో ఏ లీడర్’ అంటారని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ పాల్గొన్నారు. ఎర్రోజు శ్రీనివాస్ ‘నడక’ పుస్తకావిష్కరణ తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలన్నీ కలిపి తీసుకొచ్చిన ’నడక’ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ వ్యాసాల ద్వారా దశాబ్దాల కాల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని విశ్లేషించిన తీరును కేటీఆర్ అభినందించారు. -
రూ.1,500 కోట్ల ‘ఫైబర్’ ఫ్రాడ్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఐటీ విభాగం సలహాదారుగా పనిచేసిన వేమూరి హరికృష్ణప్రసాద్ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) బిజినెస్, ఆపరేషన్స్ మాజీ ఈడీ గౌరీశంకర్ వెల్లడించారు. వేమూరి నియమించిన వ్యక్తులే ఇప్పటికీ ఏపీఎస్ఎఫ్ఎల్లో పనిచేస్తున్నారని, అక్రమాలను బహిర్గతం చేసినందుకే తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నారు. తన సర్టిఫికెట్లు నిజమైనవని సబర్మతీ యూనివర్సిటీ నిర్ధారిస్తూ ధ్రువీకరణ పత్రంఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ లేదా పోలీసులతో విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్‌ను కోరారు. ఫైబర్ గ్రిడ్‌లో అక్రమాలపై బహిరంగ చర్చకు వేమూరి సిద్ధమా? అని సవాల్ చేశారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.1,500 కోట్ల బిల్లులను చెల్లిస్తే అందులో 80 శాతం వేమూరి హరికృష్ణప్రసాద్‌కు చెందిన టెరాసాఫ్ట్, నెట్‌ఇండియా, నెటాప్స్ సంస్థల ఖాతాల్లోకే వెళ్లాయన్నారు. గౌరీ శంకర్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లలో అక్రమాలు.. ► సెట్ టాప్ బాక్స్‌ల కొనుగోళ్లలో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కటి రూ.4,400 చొప్పున 12 లక్షల బాక్సులు కొనుగోలు చేశారు. ఇందులో 8.60 లక్షలు మాత్రమే పని చేస్తున్నాయి. ఒక్కో సెట్ టాప్ బాక్స్ కాల పరిమితి ఐదేళ్లు కాగా పదేళ్లుగా చూపించి ప్రభుత్వ గ్యారంటీతో ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.450 కోట్ల రుణం తీసుకున్నారు. ► ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ల నుంచి నెలకు రూ.11 కోట్లు బిల్లులు వసూలు కావాల్సి ఉండగా టెరా సాఫ్ట్ అక్రమాలకు పాల్పడి గరిష్టంగా రూ.ఏడు కోట్లు మాత్రమే వసూలైనట్లు చూపింది. తక్కువ బిల్లింగ్ చూపిస్తూ రూ.70 కోట్లకుపైగా దోపిడీ చేశారు. ఈ బిల్లింగ్‌ను సరి చేసేందుకు నేను సాఫ్ట్ వేర్ మార్చడంతో ఒక్క నెలలోనే రూ.8.50 కోట్ల బిల్లులు వసూలయ్యాయి. హరికృష్ణప్రసాద్ ఓ 420, మోసగాడు. తన స్నేహితుడు కనుమూరి కోటేశ్వరరావు, కుమార్తె అభిజæ్ఞ పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి భారీ అక్రమాలకు పాల్పడ్డారు. కుంభకోణంలో బడా నేతల పాత్రను బయటపెడతా. దీనిపై సీబీఐ విచారణ చేస్తే నిజాలు నిర్ధారణవుతాయి. టెండర్ కమిటీలో టెరాసాఫ్ట్ డైరెక్టర్... ► వేమూరి హరికృష్ణప్రసాద్ 2012 ఆగస్టు 10 నుంచి 2015 సెప్టెంబరు 8 వరకు టెరా సాఫ్ట్ అనుబంధ సంస్థ టెరా క్లౌడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ► ఏపీ ఫైబర్ గ్రిడ్ తొలి దశ పనులను రూ.333 కోట్లతో చేపట్టేందుకు 2015 ఆగస్టు 26న ఇన్‌క్యాప్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా>ర్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) నుంచి ఏపీఎస్ఎఫ్ఎల్ అనుమతి తీసుకుంది. ► ఈ టెండర్‌ను 2015 ఆగస్టు 30న టెరా సాఫ్ట్ దక్కించుకుంది. టెరా సాఫ్ట్ డైరెక్టర్ అయిన హరికృష్ణప్రసాద్ టెండర్ మదింపు కమిటీ సభ్యుడుగా ఉండటం అక్రమం. టెరా సాఫ్ట్‌కు కేబుళ్లు వేయడం, నెట్ వర్క్ ఆపరేషన్ సెంటర్(నాక్) ఏర్పాటు, హెడ్ ఎండ్ అనుభవం లేకున్నా నా సంస్థ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి పనులు దక్కించుకున్నారు. ► సిగ్నమ్ కంపెనీ సీఈ, ఎండీ అయిన నేను ఇదే అంశంపై ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ సాంబశివరావుకు ఫిర్యాదు చేశా. టెరాసాఫ్ట్‌కు అనుభవం ఉందని చెప్పాలంటూ హరికృష్ణప్రసాద్ నన్ను తీవ్రంగా బెదిరించారు. ► నాసిరకం కేబుళ్లు, క్లాంప్‌లతో తొలి దశ పనులను 2016లో ముగించి బిల్లులు తీసుకున్నారు. -
భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా!
సాక్షి వెబ్ ప్రత్యేకం (భోపాల్): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను విమర్శించిన వారే ఇప్పుడు తమ పిల్లలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ విపక్ష బీజేపీ నేత గోపాల్ భార్గవ మాటల్ని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్ నాయకులు తమ వారసులకు లోక్‌సభ టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారట, నిజమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘రైతు కొడుకు మళ్లీ తండ్రిలాగే వ్యవసాయం, అధికారి కుమారుడు తిరిగి తన నాన్నలాగే సేవారంగం, వ్యాపారి తనయుడు వ్యాపారం చేయగా లేనిది.. 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న రాజకీయ నాయకుల వారసులు భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉపయోగించే గోపాల్ భార్గవ కుమారుడు అభిషేక్ ప్రస్తుత మధ్యప్రదేశ్ బీజేపీ యువజన మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారసులూ అర్హులే.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గౌరీశంకర్ కూడా తన కూతురు మౌసమ్ బీ సేన్‌కు బాలాఘాట్ నియోజకవర్గ లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 సంవత్సరాలు నిండి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే నేతల వారసులు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి పూర్తిగా అర్హులని.. వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని గౌరీ శంకర్ మీడియాతో అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కోసం మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్-3 నియోజకవర్గ సీటును వదులుకున్నానని , నాయకుల తనయులు టిక్కెట్లను ఆశించడంలో తప్పులేదని, కానీ సీట్ల కేటాయింపులో అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఒత్తిడి.. ఆగని విమర్శల తాకిడి మాజీ మంత్రి గౌరీ శంకర్ షెజ్వార్ తనయుడు ముదిత్ ఈసారి లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్, నరేంద్ర సింగ్ తోమర్ వారసుడు దేవేంద్రకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. సీనియర్ నాయకుడు రాఘవాజీ తన కుమార్తె జ్యోతి షాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నించినా బీజేపీ హైకమాండ్ తిరస్కరించింది. నిరుత్సాహపడిన రాఘవాజీ తన తనయకు లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాల్సిందేనని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీజేపీలో జరుగుతున్న వారసత్వ రగడను చూసి కాంగ్రెస్ సంబరపడుతోంది. ఇన్ని రోజుల నుంచి తమను విమర్శిస్తూ వచ్చిన కాషాయ నేతలపై ఇదే అదనుగా హస్తం నేతలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వారసత్వ కుంపట్లను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
జిల్లాలో 4 కరువు మండలాలు
గుంటూరు ఈస్ట్ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కేంద్ర కరువు పరిశీలనా బృందం సమావేశం నిర్వహించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జేడి.పి.గౌరీశంకర్, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.ఎస్.చక్రవర్తి, రూరల్ డెవలప్మెంట్ డిప్యూటీ సెక్రటరీ గోధన్లాల్ జిల్లా అధికారులతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ 2014లో ఖరీఫ్ సీజన్లో వర్షాభావ కారణంగా దేశంలో అనేక మండలాలలో కరువు ఏర్పడిందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు ప్రాంతాల వివరాలను, నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని చెప్పారు.ఆ నివేదికను అనుసరించి తాము రాష్ర్టంలో పర్యటిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో కరువు మండలాలలో పర్యటించి జిల్లా అధికారుల నుంచి వివరాలను సేకరించామని చెప్పారు. జిల్లా అధికారులు ఇచ్చే రిపోర్టు,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్టు కేంద్రానికి నివేదిస్తామన్నారు.జేసీ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో రొంపిచర్ల,నూజెండ్ల ,శావల్యాపురం,ఈపూరు మండలాలను కరువు మండలాలుగా గుర్తించామన్నారు. మొత్తం 170 కోట్ల రూపాయలు నష్టాన్ని అంచనా వేసామని చెప్పారు.సమావేశం అనంతరం జిల్లా అధికారులతో కలిసి కేంద్ర బృందం నాలుగు మండలాల పర్యటనకు వెళ్లింది.సమావేశంలో డీఆర్వో నాగబాబు ,వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
తరగతి గదిలో కుప్పకూలిన విద్యార్థి
గుమ్మఘట్ట, న్యూస్‌లైన్ : గుమ్మఘట్ట మండలం గోనబావి ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో ఓ విద్యార్థి ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రధానోపాధ్యాయురాలు అంజని ప్రభావతి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గోనబావికి చెందిన ఉప్పర చిన్న తిమ్మప్ప కుమారుడు నగేష్ (12) ప్రాథమిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం ప్రార్థన సమావేశం ముగిసిన తర్వాత తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతుండగా ఉన్నట్లుండి సృ్పహతప్పి కిందపడిపోయాడు. వెంటనే ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స చేయించిన తర్వాత రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే ప్రాణం విడిచాడు. లో బీపీ, గుండెపోటు వల్ల మృతి చెంది ఉంటాడని వైద్యుడు డాక్టర్ పి.సత్యనారాయణ తెలిపారు. విషయం తెలియగానే ఎంఈఓ గౌరీశంకర్ గ్రామానికి చేరుకుని.. విద్యారి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. బాగా చదివే విద్యార్థి ఆకస్మిక మరణం జీర్ణించుకోలేకపోతున్నామని ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు కంటతడి పెట్టారు. విద్యార్థి మృతికి సంతాప సూచకంగా పాఠశాలకు సెలవు ప్రకటించారు. కుమారుడు మృతి చెందాడని తెలుసుకుని.. ఉపాధి హామీ పనికి వెళ్లిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ‘అమ్మా, నాన్న.. మీరు పని నుంచి వచ్చేలోపే ఇంటికి వస్తానంటివి కదయ్యా’ అంటూ తల్లి శివలక్ష్మి విలపించిన తీరు చూపరులను కలచివేసింది.