గుంటూరు ఈస్ట్ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కేంద్ర కరువు పరిశీలనా బృందం సమావేశం నిర్వహించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జేడి.పి.గౌరీశంకర్, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.ఎస్.చక్రవర్తి, రూరల్ డెవలప్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీ గోధన్‌లాల్ జిల్లా అధికారులతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ 2014లో ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ కారణంగా దేశంలో అనేక మండలాలలో కరువు ఏర్పడిందన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు ప్రాంతాల వివరాలను, నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని చెప్పారు.ఆ నివేదికను అనుసరించి తాము రాష్ర్టంలో పర్యటిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా జిల్లాలో కరువు మండలాలలో పర్యటించి జిల్లా అధికారుల నుంచి వివరాలను సేకరించామని చెప్పారు. జిల్లా అధికారులు ఇచ్చే రిపోర్టు,రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్టు కేంద్రానికి నివేదిస్తామన్నారు.జేసీ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో రొంపిచర్ల,నూజెండ్ల ,శావల్యాపురం,ఈపూరు మండలాలను కరువు మండలాలుగా గుర్తించామన్నారు. మొత్తం 170 కోట్ల రూపాయలు నష్టాన్ని అంచనా వేసామని చెప్పారు.సమావేశం అనంతరం జిల్లా అధికారులతో కలిసి కేంద్ర బృందం నాలుగు మండలాల పర్యటనకు వెళ్లింది.సమావేశంలో డీఆర్వో నాగబాబు ,వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 4 కరువు మండలాలు
Published Thu, Apr 2 2015 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM
Advertisement