మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తర్వాత రబీ నుంచి అమలు చేస్తాం: మంత్రి తుమ్మల
డిసెంబర్‌లోగా మరో 3 లక్షల మందికి రూ.2500 కోట్ల రుణ మాఫీ
రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వారికీ మాఫీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిందని, పంట దిగుబడులు కూడా వచ్చేశాయన్నారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు.
కమిటీ నివేదికకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రబీ సీజన్ నుంచి రైతుభరోసా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. శనివారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు.
సాగు చేసే రైతులకే రైతు భరోసా అమలు చేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. గత ప్రభుత్వం పంటలు సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు రైతుబంధు కింద డబ్బులు ఇచ్చిందని, దాదాపు రూ.25 వేల కోట్లు ఇలాంటి భూములకు ఇచ్చినట్లు తుమ్మల వ్యాఖ్యానించారు.
చిన్న పొరపాట్లతో..: దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతురుణ మాఫీ చేయలేదని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. సాంకేతిక కారణాలు, చిన్నపాటి పొరపాట్లతో దాదాపు 3 లక్షల మందికి మాఫీ కాలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారని, వారికి డిసెంబర్‌లోగా రూ.2,500 కోట్ల మేర రుణమాఫీ చేయనున్నట్లు వివరించారు.
రెండు లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న వారికీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా రూ.2 లక్షలకు మించి ఉన్న బకాయిని చెల్లించిన రైతులకు మాఫీ చేసేందుకు విడతల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. రాష్ట్రంలో పంటబీమా అమలు లేదని, త్వరలో ప్రతి రైతుకూ ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని, త్వరలో బీమా కంపెనీలను టెండర్లకు పిలుస్తామన్నారు.
రాష్ట్రంలో పంట దిగుబడులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కోటా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి లబ్ధి కలిగించే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందని, రెండేళ్లపాటు ఈ కమిషన్‌కు అవకాశం ఉందన్నారు. మెరుగైన అంశాలతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment