kharif season
-
ఖరీఫ్ సీజన్ రైతు భరోసా లేదు!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిందని, పంట దిగుబడులు కూడా వచ్చేశాయన్నారు. రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందన్నారు.కమిటీ నివేదికకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రబీ సీజన్ నుంచి రైతుభరోసా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్‌లోని రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో కలిసి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా అమలు చేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతుందన్నారు. గత ప్రభుత్వం పంటలు సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు రైతుబంధు కింద డబ్బులు ఇచ్చిందని, దాదాపు రూ.25 వేల కోట్లు ఇలాంటి భూములకు ఇచ్చినట్లు తుమ్మల వ్యాఖ్యానించారు. చిన్న పొరపాట్లతో..: దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతురుణ మాఫీ చేయలేదని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని మంత్రి తుమ్మల చెప్పారు. సాంకేతిక కారణాలు, చిన్నపాటి పొరపాట్లతో దాదాపు 3 లక్షల మందికి మాఫీ కాలేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహించారని, వారికి డిసెంబర్‌లోగా రూ.2,500 కోట్ల మేర రుణమాఫీ చేయనున్నట్లు వివరించారు. రెండు లక్షల రూపాయలకు మించి రుణాలు తీసుకున్న వారికీ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో భాగంగా రూ.2 లక్షలకు మించి ఉన్న బకాయిని చెల్లించిన రైతులకు మాఫీ చేసేందుకు విడతల వారీగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. రాష్ట్రంలో పంటబీమా అమలు లేదని, త్వరలో ప్రతి రైతుకూ ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుందని, త్వరలో బీమా కంపెనీలను టెండర్లకు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కోటా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి లబ్ధి కలిగించే సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసిందని, రెండేళ్లపాటు ఈ కమిషన్‌కు అవకాశం ఉందన్నారు. మెరుగైన అంశాలతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన ఈ–కేవైసీ
సాక్షి, అమరావతి: దాదాపు ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నప్పటికీ నిర్ధేశించిన గడువులోగా ఈ–క్రాప్‌నకు ఈ–కేవైసీ పూర్తి చేయలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ నిర్వాకానికి తోడు సాంకేతిక సమస్యలు వెంటాడడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇంకా లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ పెండింగ్‌లోనే..ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉద్యాన, పట్టు తదితర పంటలన్నీ కలిపి 1.34 కోట్ల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు 96.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ఆ మేరకు ఈ–క్రాప్ నమోదు చేయగా, వీఏఏలు, వీఆర్వోల అథంటికేషన్ పూర్తి కాగా, రైతుల ఈ–కేవైసీ మాత్రం నమోదయ్యింది. ఇంకా లక్షల ఎకరాలకు సంబంధించి లక్షలాది మంది రైతుల ఈ–కేవైసీ నమోదు కావాల్సి ఉంది. మరో పక్క మండల, జిల్లా అధికారుల సూపర్ చెక్ కూడా పూర్తి కాలేదు. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ–క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సర్వర్లు పనిచేయక, వెబ్సైట్ సకాలంలో ఓపెన్ కాక, క్షేత్రస్థాయి పరిశీలనలో యాప్ సరిగా పనిచేయక పోవడం తదితర సాంకేతిక సమస్యలతో ప్రారంభంలో ఈ–క్రాప్ నమోదు నత్తనడకన సాగింది. కాగా, వరదలు, వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతినడంతో నష్టం అంచనాల తయారీలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిమగ్నమవడంతో ఈ–క్రాప్ నమోదుకు కొంత కాలం బ్రేకులు పడ్డాయి. తొలుత సెపె్టంబర్ 15 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించినప్పటికీ, ఒకేసారి ఈ–క్రాప్, పంట నష్ట పరిహారం అంచనాలు తయారు చేయాల్సి రావడంతో గడువును సెపె్టంబర్ 25వ తేదీకి పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ 30వ తేదీ వరకు గడువిచ్చారు. 7వ తేదీ వరకు ఆధార్ దిద్దుబాటుకు అవకాశంఈ–కేవైసీ పూర్తి కాకపోవడంతో చేసేది లేక మరోసారి గడువును పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ అప్డేటెడ్ ప్రక్రియ పెండింగ్ వల్ల చాలా మంది రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో రైతుల ఈ–కేవైసీతో పాటు ఆధార్ దిద్దుబాటుకు ఈ నెల 7వ తేదీ వరకు గడువునిచ్చారు. సూపర్ చెక్ కూడా 7వతేదీ కల్లా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ–క్రాప్ ముసాయిదా జాబితా 8వ తేదీన రైతుసేవాకేంద్రాలు (ఆర్బీకే)ల్లో ప్రదర్శించనున్నారు. 8 నుంచి 13వ తేదీ వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి అదే సమయంలో పరిష్కరించనున్నారు. 16వ తేదీన తుది జాబితాను ప్రదర్శించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయినట్టుగా 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు భౌతిక రసీదులతో పాటు ఎస్ఎంఎస్ రూపంలో రైతుల మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌లు పంపించనున్నారు. -
ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు!
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలకు తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పంట నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ పంట నమోదు నత్తనడకన సాగుతున్నది. గడిచిన నెల రోజుల్లో కేవలం 31 శాతం మాత్రమే పూర్తయింది. మరొక వైపు ఏది ఏమైనా సెపె్టంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.సర్వర్లు పనిచేయక..ఫొటోలు అప్లోడ్ కాక.. రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూముల వివరాలను మండల వ్యవసాయాధికారులు సర్వే నంబర్ల వారీగా ఈ–పంట వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తొలుత గ్రామాల సర్వే నంబర్ల ఆధారంగా భూముల వివరాలను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్బీకే రైతులు సాగు చేసే పంట వివరాలను ఈ–పంట వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ ప్రొసీజర్ మొత్తం కంప్యూటర్లో మాత్రమే చేయాలి. గతంలో మాదిరిగా మొబైల్లో నమోదుకు అవకాశం ఇవ్వలేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే పొలాల నుంచి మళ్లీ ఆఫీసుకు వచ్చి ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రెండో దశలో మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లలో ఈ–పంట అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని రిజి్రస్టేషన్ చేసుకుని ఈ–పంట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వివరాల ఆధారంగా రైతు పొలం వద్దకు వెళ్లి జియో కో–ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ సమస్యల వల్ల పంట ఫొటోలు తీసుకోవడం లేదు. రోజుకు 10 కిలోమీటర్లకు పైగా.. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాలకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ రోజుకు 10 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో దశలో అప్లోడ్ చేసిన పంట వివరాలు, ఫొటోలను తొలుత వీఏఏలు,ఆ తర్వాత వీఆర్వోలు, చివరగా రైతులు అథంటికేషన్ (ఈ కేవైసీ) చేయాలి. కొన్ని జిల్లాలకు మాత్రమే సర్వర్లు ఇవ్వడం, ఆ సర్వర్లు కాస్తా సరిగా పనిచేయకపోవడంతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోజుకు వంద ఎకరాలు చేయాలంటూ ఒత్తిడి! ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన, పట్టు తదితర పంటలకు సంబంధించి 1,34,48,611 ఎకరాలు సాగవగా, వీఏఏలు 59,27,115 ఎకరాల వివరాలను మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 31 శాతం మాత్రమే ఈ–పంట నమోదు పూర్తయింది. వెబ్సైట్, యాప్, సర్వర్లు మొరాయిస్తుండడంతో రోజుకు ఆర్బీకే పరిధిలో 30–40 ఎకరాలకు మించి ఈ–పంట నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రోజుకు 100 ఎకరాల్లో పంట నమోదు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.జియో కో– ఆర్డినేట్స్ పరిధిని పెంచాలి.. రాష్ట్రంలో ఈ–క్రాప్ నమోదు సజావుగా సాగడం లేదు. సర్వర్ సరిగా పనిచేయక, యాప్ సకాలంలో ఓపెన్ కాక నమోదులో జాప్యం జరుగుతోంది. నిర్ణీత గడువులోగా పూర్తికాకపోతే పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానీ, సంక్షేమ ఫలాలు పొందడంలో రైతులు నష్టపోతారు. విత్తనాల పంపిణీలో మహిళా కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఏ విధంగా సహాయకులుగా నియమించారో అదేరీతిలో ఈ–పంట నమోదులో వీఏఏలకు సహాయకులుగా వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లను నియమించాలి. జియో ఫెన్సింగ్ మాగాణిలో 500 మీటర్లు మెట్టలో 250 మీటర్లకు పెంచాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
పంటల బీమా ప్రీమియం 'తక్షణమే చెల్లించండి': వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ చెల్లించకపోవడంతో రైతులకు పంటల బీమా పరిహారం చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ హామీ కింద పెట్టుబడి సాయంగా సీఎం చంద్రబాబు ఏటా రైతులకు ఇస్తామన్న రూ.20 వేలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఆదివారం “ఎక్స్’లో ట్వీట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. ఉచిత పంటల బీమాలో ఆదర్శంగా నిలిచాం.. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియాన్ని మా ప్రభుత్వ హయాంలో ఏటా ఏప్రిల్–మే నెలల్లో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్‌లో పంటలు వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థంగా పథకాన్ని అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటా విడుదల చేస్తుంది. అనంతరం సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇలా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.7,802 కోట్లు అందించి అండగా నిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతతో రైతులకు తీవ్ర నష్టం.. 2023–24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటా ఇవ్వలేదు. ఇప్పటికే జూన్, జూలై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టులో దాదాపు పక్షం రోజులు పూర్తి కావస్తున్నా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేక పోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా పరిహారం చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మళ్లీ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే దుస్థితిరైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలన్నీ కుదేలైనా మా ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అన్నదాతలకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఆ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం అందించాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడి డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ, వడ్డీ వ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే దుస్థితి కల్పించారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులతో పాటు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి 2023–24 పరిహారం సొమ్ము విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తు పెట్టుకోండి చంద్రబాబూ! వైఎస్సార్ రైతు భరోసాతో పెట్టుబడి సాయం ఇలారైతుల సంఖ్య లబ్ధి రూ.కోట్లలో 53.58 లక్షలు 34,288 -
దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వరి, పప్పులు, పెసర, రాగి, మొక్కజొన్న, నూనెగింజలు, చెరకు తదితర పంటలు కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 904 లక్షల హెక్టార్లలో సాగైనట్లు ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 879.22 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలను సాగు చేశారని పేర్కొంది. అదేవిధంగా, గత ఏడాది 263.01 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా ఈ ఏడాది 276.91 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఇదే సమయానికి 99.71 లక్షల హెక్టార్లలో పప్పు «ధాన్యాలు సాగు జరగ్గా, ఈ ఏడాది 110.61 లక్షల హెక్టార్లకు పెరిగింది. వీటితో పాటు గతేడాది 174.53 లక్షల హెక్టార్లలో నూనెగింజల సాగవగా ఈసారి 179.69 లక్షల హెక్టార్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ముతక తృణ ధాన్యాలు, చెరకు సాగు కూడా పెరిగింది. సాగు పెరగడంతో పప్పు, నూనెగింజల ధరలు తగ్గొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్‌లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్‌కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
‘కనీస’ చట్టబద్ధత ఎండమావేనా?
ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఆశించిన మేరకు లేకపోవడంతో అన్నదాతలకు నిరాశే మిగిలింది. వరి ఎక్కువగా పండించే రాష్ట్రాలు వరి సాధారణ రకానికి రూ. 3,000 నుంచి రూ. 3,200; ఏ గ్రేడ్ రకానికి రూ. 3,200 నుంచి రూ. 3,400 ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. కానీ కేంద్రం సాధారణ రకానికి రూ. 2,300; ఏ గ్రేడ్ రకానికి రూ. 2,320 మాత్రమే ప్రకటించింది. పత్తికి రూ. 1,000 నుంచి రూ.1,500 పెంచాలని కోరితే రూ. 500 పెంపుతో సరిపెట్టారు. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయా, పెసలు, మినుములు... వంటి పంటలకు రాష్ట్రాల సిఫార్సులకు అనుగుణంగా ధరలు పెంచలేదు. శాస్త్రీయత లేకుండా తోచిన ధర ప్రకటించడంలో ఔచిత్యం ఏమిటి?పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్లు ఆదాయం అందాలనీ, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందనీ వ్యవసాయ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ 2005లో నాటి యూపీఏ ప్రభుత్వానికి అందించిన నివేదికలో స్పష్టం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ డిమాండ్ అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఆశ్చర్యం ఏమంటే... స్వామినాథన్ కమిషన్ అందించిన సిఫార్సులను 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉండి అమలు చేయకుండా అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని నమ్మబలికింది. మరోపక్క, దేశంలో దశాబ్దాలపాటు అపరిష్కృతంగా, చిక్కుముళ్లుగా బిగుసుకుపోయిన సమస్యలకు తాము పరిష్కార మార్గాలు చూపగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతుంటారు. అయెధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, చంద్రయాన్ విజయం, సూర్యయాన్‌కు సన్నద్ధత వంటి అంశాలను ఉదహరించే అధికార బీజేపీ గత పదేళ్లుగా రైతాంగ సమస్యలకు అరకొరగా తప్ప శాశ్వత పరిష్కార మార్గాలేమీ చూపించలేకపోవడం గమనార్హం! ఫలితంగానే దేశానికి ఆహార భద్రత చేకూర్చడానికి ఆరుగాలం కష్టపడే అన్నదాతలు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని ఎండ, వాన, చలిని తట్టుకొని నెలల తరబడి తమ డిమాండ్ల సాధన కోసం ఉధృతమైన ఉద్యమం చేశారు. గత 10 ఏళ్లల్లో నాలుగు దశల్లో దేశ రైతాంగం చేసిన ఆందోళన కార్యక్రమాలు ఇంతకుముందెప్పుడూ కనివిని ఎరుగనివి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 300కు పైగా రైతు సంఘాలు సంఘటితమై ఉద్యమించాయంటే సమస్య తీవ్రత ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. 750 మందికి పైగా ప్రాణాలు పోయినా లెక్కచేయక రైతాంగం ప్రదర్శించిన పట్టుదల కారణంగానే కేంద్రం పార్లమెంట్లో మూడు వివాదాస్పద రైతు బిల్లుల్ని ఉపసంహరించుకొంది. కానీ వారి ఇతర డిమాండ్లను మాత్రం నెరవేర్చలేదు.దేశ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న అతి ప్రధాన డిమాండ్ ఎంఎస్పీ(కనీస మద్దతు ధర)కి చట్టబద్ధత. దీనినే ‘కిసాన్ న్యాయ్ గ్యారంటీ’ అంటున్నారు. కేంద్రం ముందు రైతు సంఘాలు పెట్టిన ఇతర డిమాండ్లలో 1) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒప్పందాల నుంచి భారత్ బయటకు రావడం 2) వ్యవసాయ దిగుమతులపై సుంకాల పెంపుదల 3) 2020 విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు 4) ఉపాధి హామీ పనులు ఏడాదికి 200 రోజులకు పెంపు 5) రైతుకు, రైతు కూలీలకు పెన్షన్ వర్తింపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. రైతులు పెట్టిన ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా రైతులు పట్టుబడుతున్న ప్రధాన డిమాండ్ 23 పంటలకు కనీస మద్దతు ధరలతో చట్టబద్ధత కల్పించడం. ఈ అంశాన్ని ప్రభుత్వం ఆర్థిక కోణంలో కాకుండా రైతుల ఆర్థిక కోణంలో చూడాలని అంటున్నారు. కానీ, కేంద్రం ఈ డిమాండ్‌కు తలొగ్గకపోగా మరో కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా కంది, మినుము, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు పండిస్తే ఐదేళ్లపాటు కనీస మద్దతుతో కేంద్ర సంస్థలయిన జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్)లు కొంటాయనీ, అందుకుగాను రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకొంటాయనీ ప్రతిపాదించింది. దీనిని రైతు సంఘాలు ఒప్పుకోవడం లేదు. కేంద్రం మాత్రం ఈ ప్రణాళికను అమలు చేయాలనే గట్టి పట్టుదలతో ఉంది. పంటమార్పిడి అన్నది అంత తేలికైనది కాదు. రైతులలో పంట మార్పిడి విధానంపై అవగాహన పెంచాలి. ప్రభుత్వ సహకారం అందాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలి. ఇందుకు చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా, దేశంలోని అన్ని ప్రాంతాలలోని వ్యవసాయ భూములు పంట మార్పిడికి పూర్తి అనుకూలంగా లేవన్నది ఓ చేదు వాస్తవం. సమగ్రమైన అధ్యయనం, వాటి ఫలితాలు పరిశీలించిన తర్వాతనే పంటల మార్పిడి విధానం అమలు చేయాలే తప్ప, బలవంతంగా అమలు చేయాలనుకోవడం వల్ల ప్రతిఘటన ఎదురవుతుంది. నిజానికి, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించే విషయంలోనూ, ఇతర డిమాండ్ల పరిష్కారంలోనూ ఎన్డీఏ–2 ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత కారణంగానే బీజేపీ ఈ ఎన్నికలలో 60 లోక్‌సభ స్థానాలకు పైగా నష్టపోయిందని పరిశీలకుల విశ్లేషణ. ప్రధానంగా... పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని మెజారిటీ స్థానాల్లో రైతాంగం బీజేపీని ఆదరించలేదు. అయితే, మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా కొలువుదీరిన ఎన్డీఏ–3 ప్రభుత్వం రైతాంగం చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుందా? లేక ఉద్యమాన్ని అణచివేస్తుందా అన్నదే కీలకం. ఎన్నికల ముందు దేశ రైతాంగాన్ని తమ హామీల ద్వారా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ కూటమి పక్షాలు (ఇండియా బ్లాక్) ప్రయత్నించినా అది పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే దేశ రైతాంగం ఆశలు, ఆకాంక్షలు ఏమవుతాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తే ఏటా కేంద్ర ప్రభుత్వంపై రూ. 12 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని నీతి ఆయోగ్ తేల్చింది. దాదాపు రూ. 50 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో ఇంత మొత్తం కేటాయించడం అసాధ్యమే. పైగా, వ్యవసాయం అంటే కేవలం 23 పంటలే కాదు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయల మాటేమిటి? వాటికి ప్రోత్సాహకాలు అవసరం లేదా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమాలు, వాటిపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గిపోయినట్లు 77వ జాతీయ నమూనా సర్వే వెల్లడించడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం దేశంలోని చిన్న సన్న కారు రైతు కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ. 10,218 మాత్రమే. రైతు కూలీల సగటు నెలవారీ ఆదాయం రూ. 4,063. ఆదాయాలు పెరగకపోవడం వల్ల వారికున్న రుణభారం తగ్గడం లేదు. ఫలితంగానే రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 11,290 మంది, 2022లో 10,281 మంది, 2021లో 9,898 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతుల ఆత్మహత్యల్లో పెరుగుదల 3.7 నుంచి 5.7 శాతంగా ఎన్సీఆర్బీ డేటా వెల్లడిస్తోంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 53 శాతం మంది రైతు కూలీలేనన్నది చేదు నిజం. రైతులు, అనుబంధ వృత్తికూలీల ఆదాయం పెరగకపోవడం కారణంగానే గ్రామీణ పేదరికం క్రమేపీ పెరుగుతున్నది. మోదీ చెప్పినట్లు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు. ఇప్పట్లో హరియాణాకు తప్ప ఇతర ప్రధాన రాష్ట్రాలకు ఎన్నికలు లేవు కనుక... రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎంఎస్పీకి చట్టబద్ధత ఓ ఎండమావిగానే మిగిలిపోతుందన్నది నిష్టుర సత్యం.డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
అన్నారం నుంచి నీటి తరలింపునకు కసరత్తు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్ గుండా ఖరీఫ్ సీజన్లో నీటిని ఎగువకు తరలించడానికి రాష్ట్ర ఇరిగేషన్ సాంకేతిక ఉన్నతాధికారుల బృందం శనివారం కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈఎన్సీ జనరల్ గుమ్మడి అనిల్‌కుమార్ బృందంతోపాటు సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజెషన్ (సీడీఓ) మోహన్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణల బృందాలు, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి మేడిగడ్డ (లక్ష్మి) అన్నారం (సరస్వతీ) బరాజ్‌లను పరిశీలించారు. ముందుగా అన్నారంలో చేపట్టిన సీపేజీ మరమ్మతు లను పరిశీలించిన అనిల్‌కుమార్.. వాటిని త్వరగా పూర్తిచే యాలని ఆదేశించారు. కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ ద్వారా నీటిని తరలించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న 11 మోటార్ల టెస్ట్ రన్లు, రిపేర్లు పూర్తిచేసి సిద్ధంగా ఉంచినట్లు అధికారు లకు ఆయనకు చెప్పారని సమాచారం. అదేకాకుండా అన్నా రం బరాజ్ పెద్దవాగు, మానేరు వాగులతోపాటు చిన్నచిన్న వాగుల ద్వారా నీటిలభ్యత ఉందని ఇంజనీర్లు ఈఎన్సీతో పేర్కొన్నారు. ఇప్పటికే అన్నారం బరాజ్‌లో ఉన్న మొత్తం 66 గేట్లను మూసి ఉంచారు. నీటి తరలింపు అంశంపై పరిశీలన చేయాలని ఇంజనీర్లను ఆయా బృందాలు ఆదేశించినట్లు తెలిసింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఎగువ నుంచి ప్రాణహిత ద్వారా 20 వేల క్యూసెక్కులకుపైగా నీరు వస్తోంది. ఉన్నతాధికారుల బృందం వెంట ఎస్ఈ కరుణాకర్, ఈఈలు యాదగిరి, తిరుపతిరావు ఉన్నారు. -
గడిచిన ఐదేళ్లూ ఈ పాటికే ఖాతాల్లోకి..
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ఊపందుకుంటున్న వేళ పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో చిల్లిగవ్వలేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అప్పుల కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. గత ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం చేతికందగా ఈసారి వ్యవసాయ పనులు మొదలైనా దిక్కులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆర్బీకేలలో విత్తనాలు, ఎరువులు నిల్వ చేయడంతోపాటు కొన్ని సందర్భాల్లో పీఎం కిసాన్ కంటే ముందుగానే తొలి విడత పెట్టుబడి సాయం చేతికందిన వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ డబ్బులు రైతులు దుక్కి దున్ని భూమిని సిద్ధం చేసుకోవడం, సబ్సిడీ పచ్చి రొట్ట విత్తనాలు వేసుకోవడం, నారుమళ్లు పోసు కోవడం, నాట్లు వేయడం లాంటి అవసరాలకు ఉపయోగపడేవి. గతంలో వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా మూడు విడతల్లో అందించిన సాయం సన్న, చిన్నకారులకు ఎంతగానో ఉపయోగపడేది. రాష్ట్రంలో అర హెక్టార్ (1.25 ఎకరాలు) లోపు విస్తీర్ణం కలిగిన రైతులు 50 శాతం మంది ఉండగా హెక్టార్ (2.50 ఎకరాలు) లోపు విస్తీర్ణమున్న రైతులు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టార్ లోపు సాగుభూమి ఉన్న రైతులు వేసే పంటలకు అయ్యే పెట్టుబడిలో 80 శాతం ఖర్చు రైతు భరోసా రూపంలో అందడంతో వారికి ఎంతో ఊరటగా ఉండేది. తాము అధికారంలోకి వస్తే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామని సూపర్ సిక్స్‌లో టీడీపీ – జనసేన కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించారు. ఒకపక్క వ్యవసాయ పనులు జోరందుకున్నా ప్రభుత్వ పెద్దలెవరూ ఇంతవరకూ ఆ ఊసెత్తక పోవడం పట్ల రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పేరు మార్చేందుకే ఉత్సాహం..ఇచ్చిన హామీ కంటే మిన్నగా వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ప్రతీ రైతు కుటుంబానికి ఏటా మే/ జూన్‌లో రూ.7500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో 2 వేలు చొప్పున క్రమం తప్పకుండా జమ చేశారు. ఏటా సగటున 51.50 లక్షల మందికి ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కింద రూ.34,288.17 కోట్లు జమ చేసి రైతులకు అండగా నిలిచారు. భూ యజమానులతో పాటు అటవీ, దేవదాయ భూసాగుదారులకే కాకుండా సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు ఐదేళ్లూ వైఎస్ జగన్ ప్రభుత్వమే సొంతంగా పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచింది. పీఎం కిసాన్ కింద 2024–25 సీజన్ తొలి విడత సాయాన్ని మాట ప్రకారం కేంద్రం ఇటీవలే జమ చేసింది. సీఎం చంద్రబాబు కూడా అదే మాదిరిగా రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.20 చొప్పున పెట్టుబడి సాయాన్ని కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ఇవ్వాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చటంలో చూపిన ఉత్సాహాన్ని సాయం అందించడంలోనూ ప్రదర్శించాలని కోరుతున్నారు.పెట్టుబడి కోసం అగచాట్లు..గత ఐదేళ్లు పెట్టుబడి సాయం సకాలంలో అందింది. దీంతో అదునులో విత్తనాలు కొనుగోలు చేసేవాళ్లం. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తుందో చెప్పడం లేదు. కేంద్రం నుంచి పీఎం కిసాన్ సాయం అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంతవరకు విడుదల కాకపోవడంతో పెట్టుబడి కోసం అగచాట్లు తప్పడం లేదు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.– కారసాని శివారెడ్డి. సూరేపల్లి, బాపట్ల జిల్లాసాగు ఖర్చుల కోసం ఇబ్బందులు..గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అందజేసిన వైఎస్సార్ రైతు భరోసా సాయం రైతులకు కొండంత అండగా నిలిచేది. ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాలో నేరుగా జమ చేసి భరోసా కల్పించేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వకపోవడంతో సాగు ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.– చింతల రాజు, బురదకోట, ప్రత్తిపాడు రూరల్, కాకినాడ జిల్లాఐదేళ్లు నమ్మకంగా ఇచ్చారు..వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా డబ్బులు పడేవి. ఆ నగదుతో పాటు కొంత డబ్బు కలిపి పంటలు సాగు చేసేవాళ్లం. ఐదేళ్లు నమ్మకంగా రైతు అకౌంట్లో జమ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంత వరకు ఆ ఆలోచన చేయలేదు. ఎప్పుడు ఇస్తారో నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. రైతులు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. – తూళ్లూరి నీరజ, గమళ్లపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లామా గోడు పట్టించుకోండి..గత ఐదేళ్లు రైతు భరోసా సకాలంలో అందడంతో సాగు సాఫీగా సాగేది. ప్రస్తుత పాలకులు మా బాధను పట్టించుకుని రైతులకు ఆర్థిక సాయం త్వరగా అందించాలి. – రాధయ్య, రైతు, పెద్దతయ్యూరు, శ్రీరంగరాజపురం, చిత్తూరు జిల్లా.పాత రోజులు గుర్తుకొస్తున్నాయి..సీజన్ మొదలై నెల గడుస్తున్నా ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం అందలేదు. ప్రధాని మోదీ సాయం అందిచాన అది ఎందుకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాయం అందక పోవడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పడం లేదు. ఏదో బాధపడి విత్తనాలు కొనుగోలు చేశాం. మిగిలిన పనులకు పెట్టుబడి సహాయం అత్యవసరం. – చింతల వెంకటరమణ, రైతు, లుకలాం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం జిల్లావారం పది రోజుల్లోనే ఇస్తామని..అధికారంలోకి వచ్చిన వారం పది రోజుల్లోనే రైతు భరోసా అందిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఖరీఫ్ సీజన్లో రైతులను ఆదుకోవాలి. లేదంటే అప్పులే శరణ్యం.– ప్రభాకర్, రైతు, తిరుపతి రూరల్ మండలంవ్యవసాయం ఇక కష్టమేజగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ నెలలో రైతు భరోసా సాయం ఖాతాలో పడేది. ఇప్పుడు ప్రభుత్వం మారడం వల్ల రైతుల గురించి ఆలోచన చేసే విధంగా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు వ్యవసాయం చేయడం కష్టమే,–ఆకుల నారాయణ రైతు వంగర సాయం చేయాలి...మాలాంటి పేద రైతులకు గత ప్రభుత్వం అందించిన రైతు భరోసా సాయం ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం వ్యవసాయ పనులు, సేద్యం ప్రారంభమైనా కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందకపోవడం విచారకరం. రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఆలోచించి సాయం చేయాలి. – వెన్నపూస కృష్ణారెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట, మర్రిపాడు మండలం -
నాన్ సబ్సిడీ సీడ్ పంపిణీ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: నాన్ సబ్సిడీ విత్తన పంపిణీ ఈసారి మరింత ఆలశ్యమయ్యేట్టు కన్పిస్తోంది. ప్రతీ ఏటా సబ్సిడీ విత్తనంతో పాటు నాన్ సబ్సిడీ విత్తనాలను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు. కానీ ఈసారి ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఎన్నికల వేళ.. ఖరీఫ్ సీజన్లో రైతులు ఇబ్బంది పడకూడదన్న ముందుచూపుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైనప్పటికీ, సబ్సిడీ విత్తన పంపిణీ జోరుగా సాగుతోంది. అగ్రి ల్యాబ్‌్సలో సర్టిఫై చేసిన సీడ్‌ను ఆర్బీకేల్లో నిల్వ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ పూర్తి కాగా, వేరుశనగ విత్తన పంపిణీ 90 శాతం పూర్తయింది. వరితో సహా ఇతర విత్తనాల పంపిణీ ఊపందుకుంటోంది.ఇప్పటికే 3.11లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాల పంపిణీఖరీఫ్ సీజన్ కోసం 6.32 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనం అవసరం కాగా, 6.28 లక్షల క్వింటాళ్ల విత్తనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అందుబాటులో ఉంచింది. 4.38 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో ఉంచింది. ఇప్పటి వరకు 34,500 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలతో పాటు 2,55,899 క్వింటాళ్ల వేరుశనగ, 20,340 క్వింటాళ్ల వరి, 95 క్వింటాళ్ల అపరాలు చొప్పున 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీ చేశారు.రెండేళ్లలో 305 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనంసీజన్లో నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారిన పడి, కోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాల బారిన పడకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్ సబ్సిడీ సీడ్‌నే మార్కెట్లో అందుబాటులో ఉంచింది. రైతుల నుంచి వచ్చే డిమాండ్ మేరకు నాన్ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసేది. ఇందుకోసం ప్రైవేటు కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఏటా సీజన్‌కు ముందే ఒప్పందాలు చేసుకునేది.ఇలా గత రెండేళ్లలో 305.43 క్వింటాళ్ల నాన్ సబ్సిడీ విత్తనాన్ని పంపిణీ చేసింది. ఖరీఫ్–2022లో 108.44 క్వింటాళ్ల పత్తి, 2.52 క్వింటాళ్ల మిరప, 2.25 క్వింటాళ్ల సజ్జలు, 37.20 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాల పంపిణీ జరిగింది. గడిచిన ఖరీఫ్–2023లో సైతం 17.38 క్వింటాళ్ల పత్తి, 0.64 క్వింటాళ్ల మిరప, 137 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను పంపిణీ చేసింది.నకిలీల బారిన పడకుండా చర్యలుఈసారి కూడా ఖరీఫ్ సీజన్‌కు 3 నెలల ముందుగానే పత్తి, మిరప ఇతర పంటల విస్తీర్ణానికి తగినట్టుగా విత్తనాలు సరఫరా చేసేలా కంపెనీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా 29 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ప్రస్తుతం మార్కెట్లో 30 లక్షల ప్యాకెట్లు అందుబాటులోకి తెచ్చింది. నకిలీల నివారణకు విస్తృతంగా తనిఖీలు చేసి, ముగ్గురు విత్తన డీలర్లపై 6 ఏ కేసులు నమోదు చేసింది. 7.77 లక్షల విలువైన పత్తి, మిరప విత్తనాలను జప్తు చేసింది. 2.13 కోట్ల విలువైన 435 క్వింటాళ్ల పత్తి, మిరప, ఇతర విత్తనాల అమ్మకాలను నిలిపివేసింది.ఫలితంగా ఎక్కడా నాసిరకం అనే మాటే విన్పించలేదు. సీజన్‌కు ముందే ప్రైవేటు కంపెనీలతో ఒప్పందానికి ఏర్పాట్లు చేసినా ఎన్నికల కోడ్ కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. దీంతో ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తన పంపిణీపై ఈసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విత్తనాలు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి రాయితీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు బృందం కుట్రపూరిత రాజకీయాలతో నిలిచిపోయిన ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచాంగ్ తుపాన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పోలింగ్ ముగిసే వరకు డీబీటీ పథకాల చెల్లింపులపై ఎన్నికల కమిషన్ విధించిన ఆంక్షలను ఎత్తివేయడంతో నేటి నుంచి ఇన్పుట్ సబ్సిడీ జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు ప్రామాణికాల ఆధారంగా అంచనా దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు గతేడాది ఖరీఫ్ సీజన్లో సాగుపై కొంత మేర ప్రభావం చూపాయి. వర్షపాతం, సాగు విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, వాగు ప్రవాహం, భూగర్భ జల స్థాయిలు, జలాశయాల స్థాయి లాంటి ఆరు ప్రామాణికాల ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు నిబంధనల మేరకు లెక్క తేల్చారు. ఇందులో ఉద్యాన పంటల విస్తీర్ణం 92,137 ఎకరాలు కాగా వ్యవసాయ పంటలు 13,32,108 ఎకరాలున్నాయి.ఆర్బీకేల్లో జాబితాలు ఇక రబీ 2023–24 సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లు గుర్తించారు. ఇందులో 64,695 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 5,99,685 ఎకరాలు వ్యవసాయ పంటలున్నాయి. ఈ నేపథ్యంలో కరువు ప్రభావంతో ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 6,95,897 మంది రైతులకు రూ.847.22 కోట్లు, మిచాంగ్ తుపాన్‌తో నష్టపోయిన 4,61,337 మంది రైతులకు రూ.442.36 కోట్లు చొప్పున 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు పెట్టుబడి రాయితీగా లెక్కతేల్చారు. సామాజిక తనిఖీల్లో భాగంగా అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు.మోకాలొడ్డిన బాబు బృందం కరువు సాయంతో పాటు మిచాంగ్ తుపాన్ పరిహారం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్చిలోనే ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందంటూ చంద్రబాబు బృందం ఈసీకి ఫిర్యాదు చేసి నిధుల విడుదలను అడ్డుకుంది. ఖరీఫ్ వేళ రైతులకు సాయం అందకుండా మోకాలొడ్డింది. పోలింగ్ ముగిసే వరకు ఇతర డీబీటీ పథకాలతో పాటు రైతులకు జమ చేయాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించి ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో మే 10వతేదీన జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఒత్తిళ్లకు తలొగ్గి వివరణల సాకుతో ఎన్నికల కమిషన్ తాత్సారం చేయడంతో నిధులు జమ కాలేదు. తాజాగా పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డీబీటీ పథకాల లబ్దిదారులకు నగదు బదిలీపై ఆంక్షలను ఎన్నికల కమిషన్ సడలించింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెట్టుబడి రాయితీ జమ చేసేందుకు మార్గం సుగమమైంది.అర్హులైన రైతుల ఖాతాల వారీగా బిల్లులు జనరేట్ చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో 11.57 లక్షల మందికి రూ.1,289.58 కోట్లు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా మొత్తంతో కలిపి ఐదేళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు రూ.3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీగా అందించినట్లవుతుంది. -
క్రాప్‌లోన్ కట్టాల్సిందే...!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బ్యాంకులు మాత్రం రైతుల నుంచి అప్పులు వసూలు చేస్తూనే ఉన్నాయి. నోటీసులు ఇవ్వడంతోపాటు అధికారులు రోజూ ఫోన్లు చేస్తూ చికాకు పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనూ వారి వేధింపులు ఆగడం లేదనడానికి సరస్వతి చెప్పిన సంఘటనే ఉదాహరణ. అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రైతుభరోసా సొమ్మును కూడా అప్పు కింద జమ చేసుకున్నారు. ఖరీఫ్ సీజన్ జూన్ నుంచే ప్రారంభం అవుతుందని, కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాలని, అప్పుడే కొత్త పంట రుణం ఇస్తామని చెబుతున్నాయి. మరోవైపు సహకార బ్యాంకులు కూడా రైతుల అప్పులను ముక్కుపిండి వసూలు చేస్తూనే ఉన్నాయి. వారు తాకట్టు పెట్టిన భూములను వేలం వేసేందుకు ఇప్పటికే అనేకమందికి నోటీసులు కూడా ఇచ్చాయి. భరోసా ఇవ్వని యంత్రాంగం...అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే రూ. 2 లక్షల వరకు రుణం మాఫీ చేయాలంటే రూ. 30 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికిప్పుడు రుణమాఫీ మార్గదర్శకాలు కానీ, అందుకు సంబంధించిన ప్రక్రియ కానీ మొదలు పెట్టడం సాధ్యం కాదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అంటే జూన్ 4వ తేదీ వరకు కోడ్ అమలులో ఉన్నందున అప్పటివరకు రుణమాఫీపై ముందుకు సాగలేమని అంటున్నారు. అయితే అప్పటివరకు రైతులు బ్యాంకుల్లో కొత్త పంటరుణాలు తీసుకోవాలి. కానీ పాతవి ఉండటంతో కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులు చెప్పిన ప్రకారమే పాత అప్పులు చెల్లించాలని, అంతకు మించి తాము ఏమీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం రుణమాఫీ విడుదల చేశాక బ్యాంకులకు రైతులు చెల్లించిన సొమ్ము అడ్జెస్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు మండి పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపటా్ననికి చెందిన సీహెచ్ సరస్వతి గతేడాది లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో దానికోసం ఎదురుచూస్తు న్నారు. కానీ బ్యాంకర్లు మాత్రం ఆమెకు ప్రతీ రోజూ ఫోన్ చేసి అప్పు చెల్లించాల్సిందేనని, ప్రభుత్వ రుణమాఫీతో తమకు సంబంధం లేదని వేధిస్తున్నారు. అంతేగాక నోటీసులు ఇచ్చారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమె స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి వడ్డీతో కలిపి రూ.1.10 లక్షలు చెల్లించారు. అతని పేరు లక్ష్మయ్య (పేరు మార్చాం)... ఖమ్మం జిల్లాకు చెందిన ఈ రైతు గత మార్చి నెలలో రూ. 95 వేల పంట రుణం తీసుకున్నా రు. బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడితో తీసు కున్న అప్పుతో కలిపి మొత్తం రూ.1.05 లక్ష లు చెల్లించాడు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని, అప్పటివరకు ఆగాలని వేడుకున్నా బ్యాంకులు కనికరించలేదని వాపోయాడు. -
6న రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్‌తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించి వారం తిరగకముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలు ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తూ ఐదేళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పైసా కూడా బకాయి పెట్టకూడదన్న సంకల్పంతో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేస్తోంది. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్‌లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాల (వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించి సీజన్ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితులతో 14,23,995.5 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. 22 జిల్లాల్లో మిచాంగ్ ప్రభావం మిచాంగ్ తుపాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. భారమైనా పెట్టుబడి రాయితీ పెంపు కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా దాన్ని రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్‌కు రూ.6800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని రూ.8500కు పెంచారు. నీటి పారుదల భూములైతే గతంలో రూ.13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని రూ.17 వేలకు పెంచారు. వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500 చొప్పున, మల్బరీకి రూ.4800 నుంచి రూ.6వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదేళ్లలో రూ.3,271 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 2023–24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈనెల 6వతేదీన రూ.1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ
న్యూఢిల్లీ: రాబోయే ఖరీఫ్ సీజన్(ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30)లో ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఎప్పటిలాగే రూ.1,350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. అలాగే దేశంలో కొత్తగా మూడు సెమీ–కండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. టాటా గ్రూప్, జపాన్‌కు చెందిన రెనిసస్ వంటి కంపెనీలు కలిసి రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి. రక్షణ, అటోమొబైల్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలకు అవసరమైన సెమీ–కండక్టర్లను తయారు చేస్తారు. -
విత్తన పరిశోధనకు మరో ముందడుగు
సాక్షి, అమరావతి: విత్తన రంగంలో మరో విప్లవాత్మక సంస్థ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతోంది. కృష్ణాజిల్లా గన్నవరం వద్ద నిర్మిస్తున్న డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ఈ సంస్థ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. రైతులకు నాణ్యమైన సర్టీఫై చేసిన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. దేశంలోనే తొలిసారిగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఇక్కడ సర్టిఫై చేసిన విత్తనాలనే మార్కెట్లోకి విడుదల చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు సరఫరా చేస్తోంది. మరోవైపు.. విత్తన పరిశోధనలకు మరింత ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థకు అనుబంధంగా రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తోంది. ఈ తరహా పరిశోధనా కేంద్రం జాతీయ స్థాయిలో ఒక్క వారణాసిలో మాత్రమే ఉంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వపరంగా ఈ తరహా పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఎక్కడా కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు. ఇప్పుడు గన్నవరంలోని విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో రూ.45 కోట్ల అంచనాతో తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గతేడాది మార్చిలో శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.18 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు పరిపాలనామోదం ఇవ్వగా, ఏపీ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. కొత్త రకాల విత్తనాలకు రూపకల్పన.. ఈ సంస్థ ఏర్పాటుతో రాష్ట్రంలో విత్తన నాణ్యత పరీక్షించే యంత్రాంగం బలోపేతం కానుంది. మానవ వనరుల అభివృద్ధి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా సీడ్ సైన్స్, టెక్నాలజీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. వాతావర ణాన్ని తట్టుకోగల, అధిక దిగుబడినిచ్చే కొత్త రకాల విత్తనాల రూపకల్పనతో పాటు సంకర జాతుల అభివృద్ధిలో ఈ సంస్థ భవిష్యత్తులో కీలక భూమిక పోషించనుంది. జాతీయ స్థాయిలో ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థల సమన్వయంతో వ్యవసాయ పట్టభద్రులు, డిప్లమో హోల్డర్లకు కెపాసిటీ బిల్డింగ్ కింద శిక్షణ ఇవ్వనున్నారు. ఏటా కనీసం వెయ్యిమంది అగ్రి గ్రాడ్యుయేట్స్, రెండువేల మంది అగ్రి డిప్లమో హోల్డర్స్‌కు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. అత్యాధునిక సౌకర్యాలు.. ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రస్థాయి విత్తన జన్యు బ్యాంకుతో పాటు సీడ్ గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్ హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. అలాగే.. ► విత్తనాలు నిల్వచేసేందుకు ప్రత్యేకంగా గోదాములు నిర్మిస్తున్నారు. ► రైతుల శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు వ్యవసాయ పట్టభద్రులు, పీజీ, డిప్లమో చదివే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించి ఈ రంగంలో పరిశోధనల వైపు అడుగువేసే వారికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చేందుకు ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. ► ఇప్పటికే పరిశోధనా సంస్థ భవన సముదాయంతో పాటు ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం పూర్తికావచ్చింది. ► వచ్చే జూలై నాటికి వీటి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు రైతులకు అధిగ దిగుబడునిచ్చే నాణ్యమైన, మేలు రకం వంగడాలు అందించేందుకు విస్తృత పరిశోధనలు చేసే దిశగా ఆలోచన చేయాలన్న సీఎం జగన్ సూచనల మేరకు డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. సంస్థ సేవలు అందుబాటులోకి వస్తే విత్తన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోను న్నాయి. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
రాష్ట్రంలోనూ పంటల బీమా!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని అమలు చేసే యోచనలో ఉంది. రైతు యూని ట్‌గా దీని రూపకల్పనకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు చెబుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకం అమలు జరిగేలా కార్యా చరణ ఉంటుందన్నారు. పంటల బీమా అమలు లోకి వస్తే ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగే రైతులకు ఆర్థికసాయం చేసేందుకు వీలుంటుంది. పంటల బీమాలో రైతులు కొంత ప్రీమియం భరిస్తే, ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో తన వాటాగా చెల్లి స్తుంది. పంటల బీమాను అమలు చేసే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రకారం కంపెనీలు పంట నష్టం జరిగితే రైతులకు పరిహారం ఇవ్వాలి. అయితే రైతులపై ఏమాత్రం ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే అంతా చెల్లిస్తేనే ప్రయోజన ముంటుందని అధికారులు అంటున్నారు. పంటల బీమా లేక రైతుల అవస్థ: కేంద్రం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఇది 2016–17 రబీ నుంచి ప్రారంభమైంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 2019–20 వరకు ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. అయితే ఈ పథకం కంపెనీలనే బాగుపర్చుతుందన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఫసల్ బీమా నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి విపత్తులకు పంట నష్టపోయిన రైతులు ఆర్థిక సాయం అందే అవకాశమే లేకుండా పోయింది. 2020–21 వానాకాలం, యాసంగి సీజన్లు కలిపి 9 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 2021–22లోనూ 12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కానీ రైతులకు ఒక్కపైసా నష్టపరిహారం అందలేదు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో వడగళ్లు, భారీ వర్షాలకు జరిగిన పంట నష్టం జరిగింది. దాదాపు 10 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేయగా, చివరకు వ్యవసాయశాఖ 2.30 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు తేల్చింది. ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతులకు రూ. 230 కోట్లు పరిహారంగా ప్రకటించింది. ఇక మొన్నటికి మొన్న ఈ నెల మొదటివారంలో రాష్ట్రంలో తుపాను కారణంగా వివిధ రకాల పంటలకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. కానీ రైతులకు ఎలాంటి ఆర్థిక చేయూత అందలేదు. వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడంలోనూ విఫలమైంది. ఇలా ప్రతీ ఏడాది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. పంటల బీమాతోనే రైతులకు మేలు ఫసల్ బీమాకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గత ప్రభుత్వ హయాంలోనే కసరత్తు జరిగింది. గ్రామం యూనిట్‌గా కాకుండా రైతు యూనిట్‌గా దీనిని ప్రవేశపెట్టాలని అనుకున్నారు. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయి. బెంగాల్ ప్రభుత్వం విజయవంతంగా సొంత పథకాన్ని అమలు చేస్తుంది. అక్కడ అధ్యయనం చేసి, ఆ ప్రకారం ముందుకు సాగాలని అధికారులు అనుకున్నారు. కానీ ఏదీ ముందుకు పడలేదు. కేంద్ర ఫసల్ బీమా పథకం వల్ల కంపెనీలకు లాభం జరిగిందనేది వాస్తవమే కావొచ్చు. కానీ ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరిగిందని కూడా రైతు సంఘాలు అంటున్నాయి. ► 2016–17లో తెలంగాణలో వివిధ కారణాలతో 1.58 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో 2.35 లక్షల మంది రైతులు రూ. 178 కోట్లు నష్టపరిహారం పొందారు. ► 2017–18లో వివిధ కారణాలతో 3.18 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో 4.42 లక్షల మంది రైతులు రూ. 639 కోట్లు పరిహారం పొందారు. ► 2018–19లో 1.2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 2.2 లక్షల మంది రైతులు రూ. 570 కోట్ల పరిహారం పొందారు. ► 2019–20లో 2.1 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 3.24 లక్షల మంది రైతులు రూ. 480 కోట్ల పరిహారం పొందారు. ►ఫసల్ బీమా పథకం నుంచి తప్పుకున్న తర్వాత వ్యవసాయశాఖ నష్టం అంచనాలు వేయడం కూడా నిలిపివేసింది. దీంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. -
ఖరీఫ్ దిగుబడులు...144 లక్షల టన్నులు
సాక్షి, అమరావతి: ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులపై ఆశాజనకంగా ఉన్నారు. వ్యవసాయ శాఖ విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదిక ప్రకారం ఈసారి 144 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో ఖరీఫ్ సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఖరీఫ్ సీజన్లో సాధారణ విస్తీర్ణం 84.98 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 89.68 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దిగుబడులు 164 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 74 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగయ్యాయి. దిగుబడులు 144 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. అయితే, రెండో ముందస్తు అంచనా నివేదికలో దిగుబడులు కొంతమేర పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. జూలైలో అధిక, సెప్టెంబర్లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవగా, జూన్, ఆగస్టు నెలల్లో కనీస వర్షపాతం నమోదుకాక రైతులు ఇబ్బందిపడ్డారు. సగటున 593 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 493.8 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. ఈ ప్రభావం ఖరీఫ్ పంటల సాగుపై పడింది. ఫలితంగా సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే, దిగుబడులు మాత్రం ఆశాజనకంగా ఉంటాయని రైతులు అంచనా వేస్తున్నారు. పంటల అంచనాలు ఇలా.. మొదటి ముందస్తు అంచనా దిగుబడుల నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆహార పంటలు 47లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 73.89లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రధానంగా వరి గత ఏడాది 40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 74.81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది 36.55 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 67.43 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. చెరకు 24.43లక్షల టన్నులు, పామాయిల్ 22.87లక్షల టన్నులు, మొక్కజొన్న 4.88లక్షల టన్నులు, వేరుశనగ 2.32లక్షల టన్నులు, అపరాలు 2.17లక్షల టన్నులు చొప్పున దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ప్రతికూల వాతావరణంలో సైతం మిరప రికార్డు స్థాయిలో 6 లక్షల ఎకరాలకు పైగా సాగవగా, 12 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కాగా, పత్తి 12.85లక్షల టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. -
ఈ–క్రాప్ నమోదు 10కి పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల10వ తేదీ కల్లా ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ–క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా ప్రదర్శించాలన్నారు. అక్టోబర్ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్‌తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాల న్నారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్‌సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవా లన్నారు. గ్యాప్ పొలంబడులకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. -
పక్కాగా.. పారదర్శకంగా ఈ–క్రాప్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట (ఎలక్ట్రానిక్ క్రాప్) నమోదును వ్యవసాయ శాఖ వేగవంతం చేసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగవుతుండగా.. సాగైన ప్రతి పంటను నమోదు చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. సంక్షేమ ఫలాలు ఈ–క్రాప్ నమోదే ప్రామాణికం కావడంతో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత సీజన్ మాదిరిగానే పంటల నమోదుతోపాటు నూరు శాతం ఈకేవైసీ నమోదే లక్ష్యంగా ముందుకెళ్తోంది. 78 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యం 1.10 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రధానంగా 38.36 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇతర పంటల విషయానికి వస్తే.. 2.56 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.30 లక్షల ఎకరాల్లో కందులు, 7.19 లక్షల ఎకరాల్లో వేరుశనగ, సుమారు లక్ష ఎకరాల చొప్పున ఆముదం, చెరకు పంటలు సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరాతోపాటు సెప్టెంబర్‌లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు లక్ష్యం దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో సాగైన పంటల నమోదుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ డేటా నమోదుతో పాటు తొలిసారి జియో ఫెన్సింగ్ ఆధారంగా జూలైలో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలుత తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నమోదు చేపట్టగా, ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో శ్రీకారం చుట్టారు. నమోదులో అగ్రస్థానంలో కర్నూలు ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవగా.. 46.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 84.98 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు లక్ష్యం కాగా.. 55.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటికే 31.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 22 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవ్వాల్సి ఉండగా.. 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేశారు. 17.53 లక్షల ఎకరాల్లో వరి, 5.52 లక్షల ఎకరాల్లో పత్తి, 3.53 లక్షల ఎకరాల్లో మామిడి, 2.86 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.10 లక్షల ఎకరాల్లో కంది, 2.13 లక్షల ఎకరాల్లో మిరప, 1.60 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న, 1.50 లక్షల ఎకరాల్లో జీడిమామిడి, 1.35 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.29 లక్షల ఎకరాల్లో బత్తాయి, 99 వేల ఎకరాల్లో కొబ్బరి, 75 వేల ఎకరాల్లో ఆముదం, 61 వేల ఎకరాల్లో అరటి, 52 వేల ఎకరాల్లో నిమ్మ, 46 వేల ఎకరాల్లో టమోటా పంటలు నమోదు చేశారు. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు నూరు శాతం నమోదుతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. జియో ఫెన్సింగ్ ద్వారా హద్దులు నిర్ధారించి.. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో ఆధార్, వన్‌బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, సీసీఆర్సీ కార్డు వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించి, రైతు ఫోటోను ఆర్బీకే సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. గిరి భూమి వెబ్సైట్లో నమోదైన వివరాల ఆధారంగా అటవీ భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు. 30 నాటికి తుది జాబితాలు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 25 నాటికి పూర్తి చేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్ 30న ఆర్బీకేల్లో తుది జాబితాలను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ డూప్లికేషన్‌కు తావులేకుండా.. డూప్లికేషన్‌కు తావు లేకుండా ఈ–ఫిష్ డేటాతో జోడించారు. ఈ–క్రాప్‌తో పాటు ఈ–కేవైసీ (వేలి ముద్రల) నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ రైతుకు భౌతికంగా రసీదు అందజేస్తున్నారు. ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 10 శాతం ఎంఏవోలు–తహసీల్దార్లు, 5 శాతం జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు, 3 శాతం సబ్ కలెక్టర్లు, 2 శాతం జాయింట్ కలెక్టర్లు, 1 శాతం చొప్పున కలెక్టర్ ర్యాండమ్ చెక్ చేస్తున్నారు. -
ఎందుకంత తొందర రామోజీ!?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలుచేస్తున్నామని చెప్పారు. అంతేకాక.. అన్నదాతలకు రైతుభరోసా సాయాన్ని అందజేయడంతోపాటు 60వేల క్వింటాళ్ల విత్తనాలను ఆర్బీకేల్లో పొజిషన్ కూడా చేశామన్నారు. డిమాండ్ మేరకు మరిన్ని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను భయభ్రాంతులకు గురిచేసేలా ఈనాడులో వస్తున్న కథనాలపై ఆయన మండిపడ్డారు. గతంలో ఎన్నడూలేని విధంగా రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహరహం శ్రమిస్తున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో రైతులకు ముఖ్యమంత్రి అండగా నిలుస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేక విషం కక్కుతోందన్నారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని, ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని రామోజీని కాకాణి ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరులోగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడితే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు. ఆ దిశగా ఆర్బీకేల ద్వారా అవగాహన కూడా కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో రైతులు ఆర్బీకేల ద్వారా విత్తనాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. వచ్చే నెలాఖరు తర్వాత సమీక్ష.. మరోవైపు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారని.. ఈ విషయంలో ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఈ విషయం రామోజీకి తెలియకపోవచ్చని.. ఎందుకంటే ఆయన నిత్యం చంద్రబాబు పల్లకీ మోయటంలో మునిగితేలుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక సెప్టెంబర్ నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ ఇంతలోనే రైతులకు లేని బాధ మీకెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత పూర్తిస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆ తర్వాత రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. నిజానికి.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, టీడీపీ ఐదేళ్లూ కరువు విలయతాండవం చేసిన విషయాన్ని మంత్రి కాకాణి గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించినా ఏ ఒక్క ఏడాది రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదని.. అయినా ఏనాడు ఈనాడు సింగిల్ కాలమ్ వార్త కూడా రాసిన పాపాన పోలేదన్నారు. రైతులకు రూ.2,558 కోట్లు ఎగ్గొట్టిన బాబు ఐదేళ్లలో 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం) బకాయిలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైపరీత్యాల వేళ జరిగే పంట నష్టపరిహారాన్ని ఆ సీజన్ ముగియకుండానే ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని కాకాణి చెప్పారు. అలాగే, ఇప్పటివరకు 22.74 లక్షల మంది రైతులకు రూ.1,965 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించామన్నారు. ఇక టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54.48 లక్షల మందికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.7,802 కోట్ల బీమా పరిహారం చెల్లించిందన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులకు ప్రత్యేకంగా రూ.1,70,769 కోట్ల లబ్ధిచేకూర్చిన ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని మంత్రి కాకాణి హితవు పలికారు. -
80 శాతం సబ్సిడీపై విత్తనాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టింది. 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను సిద్ధం చేసింది. అధిక వర్షాలతో నారుమడులు, నాట్లు దెబ్బతిన్న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేస్తోంది. అలాగే రాయలసీమలో అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.98.92 కోట్లు ఖర్చు చేస్తోంది. 5.14 లక్షల క్వింటాళ్లు పంపిణీ ఖరీఫ్ సీజన్లో 89.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం 5.73 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సమకూర్చుకుంది. ఇందులో భాగంగా 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసింది. అయితే ఊహించని రీతిలో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూలైలో కురిసిన వర్షాలతో కాస్త ఊపిరిపీల్చుకున్నప్పటికీ ఆగస్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారాయి. సీజన్లో ఇప్పటివరకు 341.10 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 261.60 మి.మీ. మాత్రమే కురిసింది. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. అయితే.. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో 20–59 శాతం మధ్య లోటు వర్షపాతం రికార్డైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో సుమారు 132 మండలాల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నట్టుగా గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులు ఇబ్బంది పడకుండా.. గతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు రాయలసీమలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఉలవలు, అలసందలు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల విత్తనాలను అందించారు. ఇలా 2018–19 సీజన్లో 63,052 క్వింటాళ్లు, 2019–20 సీజన్లో 57,320 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క రైతూ విత్తనం కోసం ఇబ్బందిపడకుండా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. మరోవైపు అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న జిల్లాల్లో రైతుల కోసం తక్కువ కాలపరిమితి కలిగిన ఎంటీయూ–1121, ఎంటీయూ–1153, బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్– 34449, ఎంటీయూ–1010 రకాలకు చెందిన 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీ కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు వరి విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణాలో 1,221 క్వింటాళ్లు, ఎన్టీఆర్ జిల్లాలో 278 క్వింటాళ్లు, ఏలూరు జిల్లాలో 24 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు పంపిణీ చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రాయలసీమలో కూడా అపరాలు, చిరుధాన్యాల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 25,750 క్వింటాళ్లు, అనంతపురం జిల్లాలో 14,650 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లాలో 11,500 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 6 వేల క్వింటాళ్లు, వైఎస్సార్ జిల్లాలో 670 క్వింటాళ్లు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 250 క్వింటాళ్ల చొప్పున ఆర్బీకేల్లో విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఉలవలు, అలసందలకు 85–90 రోజులు, కొర్రలకు 80–85 రోజులు, మినుములకు 70–75 రోజులు, పెసలకు 65–75 రోజుల పంట కాలం ఉంటుంది. కాస్త వర్షాలు కురిస్తే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నేను 20 ఎకరాల్లో ఎంటీయూ–1318 రకం వరి వేశా. వర్షాలు, వరదలతో నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.8 వేలు నష్టపోయా. ఆర్బీకే ద్వారా ఎంటీయూ 1121 రకం 4.5 క్వింటాళ్ల విత్తనాన్ని 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందించింది. సబ్సిడీపోనూ రూ.3,402 మాత్రమే చెల్లించాను. ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు. గతంలో ఇంత వేగంగా స్పందించిన ప్రభుత్వాలు లేవు. – చలమలశెట్టి రామ్మోహన్ రావు, మోటూరు, గుడివాడ మండలం, కృష్ణా జిల్లా ప్రభుత్వం ఆదుకుంది 3.5 ఎకరాలు సొంతంగా, 2 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. ఖరీఫ్‌లో వరి సాగు చేస్తే జూలైలో కురిసిన కుండపోత వర్షాలతో నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఎకరాకు రూ.7 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఖరీప్ సాగుకు దూరంగా ఉండాలని భావించా. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై కోరుకున్న విత్తనం ఆర్బీకే ద్వారా అందించి ఆదుకుంది. ఆ విత్తనంతో నాట్లు వేసుకున్నాం. గతంలో ఎప్పుడూ ఇలా అదును దాటక ముందే 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేసిన దాఖలాలు లేవు. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – యెరగాని వీరరాఘవులు, దిరుసువల్లి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా -
Fact Check: వాస్తవాలు తెలిసి కూడా ‘ఈనాడు’ అబద్ధాలు
సాక్షి, అమరావతి: తొలకరి వర్షాలు కాస్త ఆలశ్యం కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టింది. రైతుల డిమాండ్ల మేరకు 80 శాతం రాయితీపై వారు కోరుకున్న విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మేలు చూసి రామోజీకి కడుపులో మంట మొదలైంది. ‘ఎండ మండి.. మొలక ఎండుతోంది’ అంటూ రైతులను గందరగోళ పర్చేలా ఈనాడు ఓ కథనాన్ని అచ్చేసింది. సత్యదూరమైన ఆరోపణలు చేసింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పన ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో (జూన్ నెలలో) ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా వ్యవసాయంపై సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పనపై ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకే, మండల స్థాయి వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రూపొందించారు. లోటు వర్షపాతం కారణంగా బెట్ట పరిస్థితులున్న ఏడు జిల్లాల్లో 80 శాతం రాయితీపై విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద రైతులు ఇతర పంటలను సాగు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మండలాల్లో ఆర్బీకేల ద్వారా విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేశారు. రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మినుము 400 క్వింటాళ్లు, పెసర 3,200 క్వింటాళ్లు, కంది 1,000 క్వింటాళ్లు, ఉలవలు 53,000 క్వింటాళ్లు, అలసందలు 1,900 క్వింటాళ్లు, కొర్రలు 500 క్వింటాళ్లు చొప్పున మొత్తం 60 వేల క్వింటాళ్ళ విత్తనాలను సిద్ధం చేశారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ప్రత్యామ్నాయ పంటలకు మారడానికి రైతులు ఆగస్టు చివరి వారం వరకు వేచి చూస్తుంటారు. ఈలోగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే సంప్రదాయ పంటలను సాగు చేస్తారు. లేదంటే ప్రత్యామ్నాయ పంటలు వేస్తారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేస్తోంది. ఆర్బీకేల్లో నమోదు చేసుకున్న రైతులకు ఈ నెల 20 నుంచి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేయనుంది. రైతులకు శిక్షణ మరో వైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిలదొక్కుకొని మంచి దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు కూడా ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పంటల ప్రణాళికల అమలులో తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది. ఆ 4 జిల్లాల్లో విత్తన పంపిణీకి శ్రీకారం జూలై నెలలో అధిక వర్షాలతో పంటలు దెబ్బ తిని మళ్లీ పంట వేసుకునేందుకు సిద్ధపడిన రైతులను ఆర్బీకేల ద్వారా గుర్తించారు. వారి జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఇంకా ఎవరైనా ముందుకొస్తే వారి పేర్లను కూడా నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. వారు కోరుకున్న విత్తనాన్ని 80 శాతం రాయితీ పంపిణీ చేస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతుల కోసం 2,804 క్వింటాళ్ల వరి విత్తనాలను అవసరమని గుర్తించారు. ఇప్పటి వరకు 895 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేయగా, 773 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు పంపిణీ చేశారు. -
జోరందుకున్న ఖరీఫ్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే సాగునీరు విడుదల చేయడంతో పాటు ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఖరీఫ్–2022లో దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం అందించడంతో పాటు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేశారు. అవసరమైనన్ని ఎరువులు, పురుగు మందుల నిల్వల్ని అందుబాటులో ఉంచారు. కానీ.. జూన్‌లో రుతు పవనాలు మొహం చాటేయడంతో రైతులు ఒకింత కలవరపాటుకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్ధం చేయగా.. పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా జోరు పెంచి సార్వా సాగుకు శ్రీకారం చుట్టారు. సాగుకు ముందే రూ.5,040.43 కోట్ల సాయం సీజన్‌కు ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా కింద 52.31 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు ఖరీఫ్–2022లో పంటలు దెబ్బతిన్న 10.20 లక్షల మందికి రూ.1,117.21 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. ఆర్బీకేల ద్వారా 5.73 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సిద్ధం చేయగా.. ఇప్పటికే 5.15 లక్షల టన్నులను రైతులకు పంపిణీ చేశారు. ఇందులో ప్రధానంగా 1.52 లక్షల టన్నుల వరి, 2.91 లక్షల టన్నుల వేరుశనగ, 39 వేల టన్నుల పచ్చిరొట్ట విత్తనాలు అందించారు. నాన్ సబ్సిడీ విత్తనాలకు సంబంధించి పత్తి 14.15 క్వింటాళ్లు, మిరప 60 కేజీలు, సోయాబీన్ 137 క్వింటాళ్లను రైతులకు విక్రయించారు. సీజన్‌కు 17.44 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. 14.75 లక్షల టన్నులు అందుబాటులో ఉంచారు. ఇందులో ఇప్పటికే 4.59 లక్షల టన్నులు విక్రయించారు. ఆర్బీకేల ద్వారా 5.60 లక్షల టన్నుల సరఫరా లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 1.59 లక్షల టన్నులు నిల్వ చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆర్బీకేల్లో అవసరమైన పురుగుల మందులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. 23 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు ఖరీఫ్ సాగు లక్ష్యం 89.37 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 39.70 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 9.62 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇతర పంటల విషయానికొస్తే 5.12 లక్షల ఎకరాల్లో పత్తి, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4.6 లక్షల ఎకరాల్లో అపరాలు, 1.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, పంటలు వేశారు. 9 ఎకరాల్లో వరి వేశా 9 ఎకరాల్లో స్వర్ణ రకం వరి సాగు చేస్తున్నా. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ముదురు దశకు చేరుకున్న పంటకు మేలు చేస్తాయి. మా గ్రామంలో పంట బాగానే ఉంది. కాస్త ఆలస్యంగా నాట్లు వేసిన వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. వర్షాలు రెండ్రోజులు తెరిపిస్తే నీరు కిందకు దిగిపోతే నాట్లకు ఇబ్బంది ఉండదు. – కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్వల్పకాలిక రకాలే మేలు ఈ వర్షాలతో పత్తి, ఆముదం, కంది వంటి పంటలకు ఇబ్బంది ఉండదు. ఇప్పటివరకు నారుమడులు వేయకపోతే మాత్రం బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్–34449, ఎంటీయూ–1153, ఎంటీయూ–1156, ఎంటీయూ–1010, ఐఆర్–64 వంటి స్వల్పకాలిక రకాలను సాగు చేసుకుంటే మేలు. ఉత్తరకోస్తా, కృష్ణాడెల్టాలో వెద పద్ధతిలో సాగు చేసే రైతులు పడిపోని రకాలను ఎంపిక చేసుకోవాలి. – టి.శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధనా కేంద్రం, మార్టేరు ఈ సూచనలు పాటిస్తే మేలు విత్తిన 15 రోజుల్లోపు నారుమడులు, వెదజల్లిన పొలాలు 3 రోజుల కంటే ఎక్కువ నీట మునిగి ఉంటే మొలక శాతం దెబ్బతినకుండా నీరు తీయగలిగితే ఇబ్బంది ఉండదు. ఒకవేళ మొలక దెబ్బతింటే మాత్రం మళ్లీ నారు ఊడ్చుకోవచ్చు లేదా స్వల్పకాలిక రకాలు సాగు చేసుకోవచ్చు. విత్తిన 15–30 రోజులలోపు ఉన్న పొలాలు 5 రోజుల కంటే ఎక్కువ నీట మునిగితే.. నీరు పూర్తిగా తీసివేసి 5 సెంట్ల నారుమడికి ఒక కిలో యూరియా, ఒక కిలో ఎంవోపీ బూస్టర్ డోస్‌గా వేసుకుంటే వారం రోజుల్లో కొత్త ఆకు చిగురిస్తుంది. నారుమడి కుళ్లకుండా లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్బన్‌డిజమ్ మందును పిచికారీ చేసుకోవాలి. – ఎం.గిరిజారాణి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, వరి పరిశోధనా కేంద్రం, మచిలీపట్నం -
ఈ–క్రాప్ నమోదుకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఈ–పంట నమోదులో మరిన్ని సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఈ సీజన్లో 89.37 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా.. తొలకరి కాస్త ఆలస్యం కావడంతో ఇప్పటివరకు 9.07 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టగా, మిగిలిన జిల్లాల్లో వచ్చే వారం ప్రారంభించనున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు పంట నష్టపరిహారం, పంటల బీమా, పంట కొనుగోలుకు ఈ–పంట నమోదే ప్రామాణికం కావడంతో చిన్నపాటి లోపాలకూ ఆస్కారంలేని రీతిలో ఈ–పంట నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నూరు శాతం ఈ–క్రాప్ నమోదు చేస్తున్నప్పటికీ ఈకేవైసీ నమోదులో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద ఈ–పంట నమోదు చేస్తున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ)సౌజన్యంతో ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేశారు. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో అనుసంధానించిన యాప్‌లో రైతు ఆధార్ నెంబర్ కొట్టగానే అతని పేరిట ఏ ఏ సర్వే నెంబర్లలో ఎంత విస్తీర్ణంలో వ్యవసాయ, కౌలు భూములున్నాయో తెలిసిపోతుంది. తొలుత ఆధార్, వన్ బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్‌నెంబర్, సీసీఆర్సీ కార్డుల వివరాలను ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి ప్రతిరోజు కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనకు చేస్తారు. యాప్‌లో నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిపోల్చుకుని అంతా ఒకే అనుకుంటే జియో కోఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోను తీసి అప్లోడ్ చేస్తారు. జియో ఫెన్సింగ్ ద్వారా సరిహద్దుల గుర్తింపు.. ఈసారి కొత్తగా జియో ఫెన్సింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. మొన్నటి వరకు సాగుచేసే పొలానికి కాస్త దూరంగా నిలబెటిŠట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే సరిపోయేది. కానీ, ఇక నుంచి ఖచ్చితంగా సాగుచేసే పొలంలో నిలబెట్టి జియో ఫెన్సింగ్ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించిన తర్వాతే ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. గిరిజన రైతులు సాగుచేసే అటవీ భూముల (ఆర్ఓఎఫ్ఆర్) డేటా ఉన్న గిరిజన సంక్షేమ శాఖకు చెందిన గిరి భూమి వెబ్‌సైట్‌తో అనుసంధానం చేస్తున్నారు. తద్వారా ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో గిరిజనులు సాగుచేసే పంటల వివరాలు కూడా పక్కాగా ఈ–క్రాప్‌లో నమోదు చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఈ ఫిష్ డేటాతో అనుసంధానం ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ యూజ్ అని నమోదు చేస్తున్నారు. డుప్లికేషన్‌కు తావులేకుండా ఉండేందుకు ఈ–ఫిష్ డేటాతో ఇంటిగ్రేట్ చేశారు. ఈ–క్రాప్ నమోదు పూర్తికాగానే రైతుల ఫోన్ నెంబర్లకు డిజిటల్ రశీదు, వీఏఏ/వీహెచ్ఏ, వీఆర్ఏల వేలిముద్రలతో పాటు చివరగా రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) తీసుకోవడం పూర్తికాగానే రైతు చేతికి భౌతికంగా రశీదు అందజేస్తారు. ప్రతీ సీజన్లోనూ నూరు శాతం ఈ–పంట నమోదు చేయగా, ఖరీఫ్–22లో 92.4 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. గడిచిన రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 97.47 శాతం ఈకేవైసీ నమోదు చేశారు. ఇక ఈసారి ఈ–పంటతో పాటు నూరు శాతం ఈకేవైసీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ 20 కల్లా ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తిచేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్ 30న తుది జాబితాలను ప్రదర్శిస్తారు. -
ఖరీఫ్ సీజన్ కు కృష్ణా డెల్టా నీటిని విడుదల చేసిన మంత్రి అంబటి
-
AP: ఖరీఫ్ సీజన్‌కు కృష్ణా డెల్టా నీటి విడుదల.. నెల ముందుగానే
సాక్షి, విజయవాడ: ఖరీఫ్ సీజన్ కృష్ణా డెల్టా నీటిని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీటిపారుదల శాఖ మంత్రి అంటి రాంబాబు కాలువలకు నీరు విడుదల చేశారు. కృష్ణమ్మకు ప్రజాప్రతినిధులు, అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను సమర్పించి వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, దూలం నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో నీటి కొరత లేదు ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల కాలువలకు నీరు విడుదల చేసినట్లు తెలిపారు. గతంలో జూన్ నెలాఖరులో కానీ, జూలై మొదటి వారంలో కానీ నీరు వదిలేవారని.. ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు విడుదల చేశామని పేర్కొన్నారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి రైతుకు ఇబ్బంది ఉండదని. పులిచింతలలో 34 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నాని చెప్పారు. ‘పట్టిసీమ నుంచి కుడా నీరు తెచ్చే అవసరం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదు. ఈ ఏడాది పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదు. దివంగత వైఎస్సార్, సీఎం జగన్ పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యింది. వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటాం. కృష్ణా వరదల నుంచి క్షేమంగా ఉండేలా ప్రజల కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి సీఎం జగన్’ అనిపేర్కొన్నారు. చదవండి: 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ విజయానికి కృషిచేద్దాం నెల రోజుల ముందే నీటి విడుదల రైతుల మేలు కోసం నెల రోజుల ముందే నీరు విడుదల చేశామని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో దేవుడు కరుణించాడని.. వరుణ దేవుడి కరుణా కటాక్షాలతో జలాశయాలు నిండు కుండలా ఉన్నాయని తెలిపారు. రైతులకు పంటలు పండి మంచి దిగుబడి వచ్చిందన్నారు. నాలుగేళ్లల్లో రైతుల నుంచి ధాన్యం కూడా కొనుగోలు చేశారని చెప్పారు. ‘వైఎస్ హయాంలో పులిచింతల పనులు పూర్తిచేశారు. పులిచింతలలో 34 టీఎంసీల నీరు నిల్వ చేసుకున్నాం. కృష్ణా డెల్టాకు నీటి కొరత లేకుండా ఇస్తున్నాం. పోలవరం వ్యయం పెంచి కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందేలా చేశారు. 12,900 కోట్ల నిధులు కేంద్రం నుంచి తెప్పించగలిగారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏపీ అన్నపూర్ణగా పంటలతో కళకళలాడుతుంది. ఢిల్లీ వెళ్లి ఏం చేశారన్న వారు జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోవాలి’ అని హితవు పలికారు. -
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఎగబాకడం, రైతుల నుండి పెరిగిన డిమాండ్, తగ్గిన సరఫరా కారణంగా దేశంలో ఎక్కువైన ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కేంద్రం దృష్టిసారించింది. రానున్న ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు దిగింది. బ్లాక్‌మార్కెటింగ్ అరికట్టేందుకు కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 370 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణలో నాలుగు యూరియా డైవర్షన్ యూనిట్లలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మిశ్రమ యూనిట్లో తనిఖీలు చేశాయి. మరో వారం పాటు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. తనిఖీల సందర్భంగా గుజరాత్, కేరళ, హరియాణా, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏకంగా 70,000 బస్తాల నకిలీ యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా 30 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా, 112 మిశ్రమ తయారీదారులను డీఆథరైజ్ చేసినట్లు వెల్లడించింది. దాదాపు రూ. 2,500 ఖరీదు చేసే 45 కిలోల యూరియా బస్తాను రైతులకు వ్యవసాయ అవసరాలకు రాయితీపై రూ.266కే కేంద్రం అందిస్తోంది. అయితే డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో సబ్సిడీ ధరకు యూరియాను పొందలేకపోతున్న రైతన్నలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
రైతన్నలకు విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం విత్తనాలను సిద్ధం చేసింది. ఆర్బీకేల ద్వారా రైతులకు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. రబీ కోతలు జోరందుకోవడంతో ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీకి సిద్ధం చేయగా.. మే 1 నుంచి వేరుశనగ, జూన్ 1 నుంచి వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 2023–24 ఆరి్థక సంవత్సరంలో 9.15 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు ఖరీఫ్ సీజన్ కోసం 6.18 లక్షల క్వింటాళ్లను ఆర్బీకేల ద్వారా రైతులకు అందించనున్నారు. రబీ సీజన్ కోసం 2.97 లక్షల క్వింటాళ్లను సిద్ధం చేయనున్నారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ అమలవుతున్న జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.1,000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో పాటు చిరుధాన్యాల విత్తనాలపై 50 శాతం, వేరుశనగ, నువ్వుల విత్తనాలపై 40 శాతం, అపరాలపై 30 శాతం, శనగ విత్తనాలపై 25 శాతం చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజన రైతులకు అన్నిరకాల విత్తనాలను 90 శాతం సబ్సిడీపై, కంటింజెన్సీ కింద 80 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఆర్బీకేల ద్వారా అందిస్తాం ఖరీఫ్ సీజన్‌కు సరిపడా విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. రైతుల ద్వారా సేకరించిన విత్తనాలతో పాటు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, ప్రైవేట్ కంపెనీల నుంచి సేకరించి అగ్రి ల్యాబ్‌లలో నాణ్యత ధ్రువీకరించిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరుగుతోంది. -
యంత్ర వ్యవ‘సాయం’
ఖరీఫ్ నాటికి నూరు శాతం ఆర్బీకేల్లో యంత్ర సేవా కేంద్రాలు అందుబాటులో ఉండాలి. ఆర్బీకేలకు అనుబంధంగా కిసాన్ డ్రోన్స్‌ను సత్వరమే ఏర్పాటు చేయాలి. జూలైలో కనీసం 500 కిసాన్ డ్రోన్స్, డిసెంబర్ కల్లా మరో 1,500 డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. రైతులకు వ్యక్తిగతంగా టార్పాలిన్లు, స్ప్రేయర్ల పంపిణీకి సాధ్యమైనంత త్వరగా శ్రీకారం చుట్టాలి. జూలైలో టార్పాలిన్లు, జూలై–డిసెంబర్ మధ్య మూడు విడతల్లో స్ప్రేయర్లు పంపిణీ చేయాలి. – వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. గ్రామ స్థాయిలో ప్రతి రైతుకు ఆధునిక యంత్రాలను అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే మెజార్టీ ఆర్బీకేల్లో రైతు గ్రూపులకు యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఆర్బీకేల్లో ఏర్పాటు చేయాలి. అవసరమైన మేరకు టార్పాలిన్లు, స్ప్రేయర్లు వంటి వ్యక్తిగత పరికరాలను రైతులకు పంపిణీ చేయాలి. అలా చేస్తే వ్యవసాయ యాంత్రీకరణ మరింత పెరిగి.. రైతులు మరింతగా లబ్ధి పొందేందుకు దోహద పడుతుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అధికారులు రూపొందించిన వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యాన శాఖలపై జరిగిన సమీక్షలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుత రబీ సీజన్‌తో పాటు రానున్న ఖరీఫ్ సీజన్లో అనుసరించాల్సిన కార్యాచరణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇంకా మిగిలిన 4,225 ఆర్బీకేల్లో సీహెచ్‌సీలకు ఏప్రిల్‌లో యంత్రాల పంపిణీ పూర్తి చేయాలని చెప్పారు. రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్నారు. రైస్ మిల్లర్ల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఇటీవలి అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలకు సంబంధించి ఎన్యుమరేషన్‌ను వేగవంతం చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాలని, ఈ విషయంలో మరింత శ్రద్ధ పెట్టడంతో పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఆర్బీకేల్లో కియోస్క్‌లు నూరు శాతం పని చేసేలా చూడటంతో పాటు, వాటి సేవలు పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కియోస్క్‌ల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా 10.5 లక్షల టన్నుల ఎరువులు 2023–24 సీజన్లో 10.5 లక్షల టన్నుల ఎరువుల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఎరువులతో పాటు రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుల మందులను ఏపీ ఆగ్రోస్ ద్వారా పంపిణీకి చర్యలు చేపట్టామని చెప్పారు. రబీ సీజన్లో 100 శాతం ఈ క్రాపింగ్ పూర్తయిందని, దీని ఆధారంగానే రబీ ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి రకాలను ప్రోత్సహిస్తున్నామని, 2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతి చేయదగ్గ వరి రకాలను సాగు చేసేలా ప్రోత్సహించామని చెప్పారు. తద్వారా దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చిందని తెలిపారు. ప్రస్తుత రబీ.. 2022–23 సీజన్లో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను రైతులు సాగు చేశారని, 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే.. ► పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. వీటి వల్ల్ల వరి, వేరుశనగలో 15 శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5 శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. పత్తిలో 16 శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశనగలో 12 శాతం, వరిలో 9 శాతం దిగుబడులు పెరిగినట్టుగా క్షేత్ర స్థాయి పరిశీలనలో గుర్తించాం. ► పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు కానుంది. 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)లకు జీఏపీ (గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) సర్టిఫికేషన్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ► రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాం. 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు ఏర్పాటు చేశాం. వీటితో పాటు మూడు ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేశాం. అకాల వర్షాల వల్ల పంట నష్టంపై అంచనా వేసేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో నివేదికలు ఖరారు చేసి, రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తాం. ► ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, ఉద్యాన శాఖల సలహాదారులు తిరుపాల్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ బి.నవీన్ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకష్ణ ద్వివేది, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు చేవూరు హరికిరణ్, ఎస్.ఎస్. శ్రీధర్, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, ఏపీ సీడ్స్, ఆగ్రోస్ ఎండీలు డాక్టర్ శేఖర్ బాబు, ఎస్.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్: సీఎం ► ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి దశల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలి. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ► జూన్‌లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పరీక్షా ఫలితాలు వచ్చేలా చూడాలి. వాటి ఆధారంగానే రైతులకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలి. భూ పరీక్ష కోసం నమూనాల సేకరణ, పరీక్షలు, ఫలితాలు, వాటి ఆధారంగా సాగు పద్ధతులు, రైతులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్ఓపీ రూపొందించుకోవాలి. ఈ పరీక్ష ఫలితాల ఆధారంగానే శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు పంటలకు అవసరమైన స్థాయిలో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలి. అప్పుడే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్.. ఆర్బీకే సేవలు మరో దశకు వెళ్తాయి. ► ఉద్యాన వన పంటల సాగు విస్తీర్ణం ఏటా పెరగడం వల్ల దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకు తగినట్టుగా మార్కెటింగ్ ఉండాలి. రైతులు తాము పండించిన పంటలను విక్రయించుకోవడానికి ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. ఆ విధంగా మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యాన పంటలు పండించే రైతులను మార్కెటింగ్‌కు అనుసంధానం చేయాలి. అప్పుడే వారికి మంచి ఆదాయం వస్తుంది. -
AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి 2021 ఖరీఫ్ సీజన్‌లోని అర్హుల జాబితా లెక్కతేలింది. ఈ సీజన్‌కు సంబంధించి 10.76 లక్షల మంది రూ.లక్ష లోపు రుణాలు పొందినట్లు గుర్తించగా, వారిలో నిర్ణీత గడువులోగా చెల్లించడం, ఈ–క్రాప్ ప్రామాణికంగా పంటలు సాగుచేసిన 5.68 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరికి రూ.115.33 కోట్లు జమచేయనున్నారు. అలాగే, రబీ 2020–21 సీజన్లో 2.54 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.45.22 కోట్లు జమచేయనున్నారు. ఈ జాబితాలను జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ఈ నెల 19–22 వరకు ప్రదర్శిస్తుండగా ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. అలాగే, అర్హుల జాబితాలను సామాజిక తనిఖీలో భాగంగా బుధవారం నుంచి 25వరకు ప్రదర్శిస్తారు. అంతేకాదు.. ఎస్వీపీఆర్ పోర్టల్ https://karshak.ap.gov.in/ysrsvpr/ హోంపేజీలో ''know your status''అనే విండోలో తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకోవచ్చు. రైతులు తమ వివరాలు సరిచూసుకుని వారి పేర్లు, బ్యాంకు ఖాతా నంబర్లలో తప్పులుంటే తగిన వివరాలు సంబంధిత ఆర్బీకే సిబ్బందికి అందించి సరిచేసుకోవాలి. అర్హత కలిగి తమ పేరులేని రైతులు బ్యాంకు అధికారి సంతకంతో ధృవీకరించి ఆర్బీకేల్లో దరఖాస్తు సమర్పిస్తే పునఃపరిశీలన చేసి అర్హత ఉంటే జాబితాల్లో చేరుస్తారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి 8.22లక్షల మంది ఖాతాలకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ఈ నెల 28న సీఎం జగన్ జమ చేస్తారు. -
‘ఎర్ర’బంగారం మెరుపులు
సాక్షి, అమరావతి: మిరప రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లతామరతో సహా తెగుళ్ల ప్రభావం ఈసారి పెద్దగా లేకపోవడం.. గతేడాది కంటే మిన్నగా దిగుబడులొచ్చే అవకాశం ఉండటం, మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలుకుతుండటంతో రైతుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 3.62 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది రికార్డు స్థాయిలో 5.12 లక్షల ఎకరాల్లో సాగైంది. పూతకొచ్చే దశలో విరుచుకుపడిన నల్లతామరకు తోడు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఫలితంగా 60–70 శాతం పంట దెబ్బతినగా, హెక్టార్‌కు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గుతుందని భావించారు. కానీ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంట సాగవుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 3.95 లక్షల ఎకరాలు కాగా.. 5.55 లక్షల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేస్తున్నారు. సర్కారు బాసటతో.. నల్లతామర పురుగు ప్రభావంతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన మిరప రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో విత్తు నుంచీ ప్రభుత్వం అండగా నిలిచింది. నాణ్యమైన మిరప నారును అందుబాటులో ఉంచడంతోపాటు నల్లతామరను ఎదుర్కొనేందుకు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ రూపొందించిన ప్రోటోకాల్‌పై ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించింది. ప్రత్యేక పోస్టర్లు, హోర్డింగ్‌లతో పాటు కరపత్రాలు ముద్రించి వలంటీర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయించింది. మిరప ఎక్కువగా సాగయ్యే ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు తోట బడులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. వీడియో, ఆడియో సందేశాలతో వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం పంట పూత దశకు చేరుకోగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎక్కడా నల్లతామరతో పాటు ఇతర తెగుళ్ల జాడ కనిపించలేదు. ఫలితంగా దిగుబడులు కూడా ఈసారి గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు రావడం గగనంగా మారగా.. ఈ ఏడాది హెక్టార్‌కు 40–50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధరలు 2020–21లో క్వింటాల్ రూ.13 వేలు పలికిన ఎండు మిర్చి 2021–22లో ఏకంగా రికార్డు స్థాయిలో గరిష్టంగా రూ.27 వేల వరకు పలికింది. ప్రస్తుతం సాధారణ మిరప రకాలు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతుండగా.. బాడిగ, 341 రకాలు రూ.27,500 వరకు పలుకుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతమున్న డిమాండ్ కొనసాగి.. ఎగుమతులు ఊపందుకుంటే ధరలు ఇదే రీతిలో కొనసాగే అవకాశాలుంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దిగుబడి బాగా వచ్చేలా ఉంది నేను మూడెకరాల్లో మిరప వేశా. గతేడాది నల్లతామర పురుగు వల్ల ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. సేంద్రియ, బిందు, మల్చింగ్ విధానాల్లో సాగు చేయడంతో తెగుళ్ల బెడద కన్పించలేదు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చేలా ఉంది. మార్కెట్లో రేటు కూడా బాగుంది. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నా. – కల్యాణం వెంకట కృష్ణారావు, కోనయపాలెం, చందర్లపాడు, ఎన్టీఆర్ జిల్లా నల్లతామర ప్రభావం లేదు ఈ ఏడాది నల్లతామర ప్రభావం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. వర్షాలు కాస్త కలవరపెడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడులొస్తాయి. గతేడాది హెక్టార్‌కు 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది రెట్టింపు వస్తుందని అంచనా వేస్తున్నాం. – వంగ నవీన్‌రెడ్డి, జొన్నలగడ్డ, గుంటూరు జిల్లా రికార్డు స్థాయిలో సాగు గతేడాది నల్లతామర దెబ్బకు ఈసారి విస్తీర్ణం తగ్గిపోతుందనుకున్నాం. కానీ రికార్డు స్థాయిలో రైతులు మిరప సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రైతుకు విత్తు నుంచీ తోడుగా నిలవటంతో పంటపై తెగుళ్ల ప్రభావం ఎక్కడా కన్పించడం లేదు. కచ్చితంగా హెక్టార్‌కు 50 క్వింటాళ్లకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. – ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డైరెక్టర్, ఉద్యాన శాఖ -
అన్నదాతకు అండ.. గింజగింజకూ మద్దతు
అన్నదాతలు పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ ఒక్క రైతన్న కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పంటల కొనుగోళ్ల సమయంలో వారికి అన్ని విధాలా అండగా నిలవాలి. – అధికార యంత్రాంగానికి సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటనూ ఈ–క్రాపింగ్ చేయడం వల్ల ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందనే విషయంలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. పంటల నమోదు నూరు శాతం పూర్తి కాగా, వీఏఏ, వీఆర్వోల ద్వారా ఈ – కేవైసీ 99 శాతం పూర్తైనందున ఈనెల 15వ తేదీలోగా రైతుల ఈ – కేవైసీ (వేలిముద్రలు) పూర్తిచేసి ప్రతి రైతుకు డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని సూచించారు. పంటల కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సోషల్ ఆడిట్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ఖరీఫ్ సీజన్ దాదాపుగా పూర్తైంది. కోతలు మొదలయ్యేలోగా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం చేసిన ఏర్పాట్లు, నిబంధనలు, సూచనలు, సలహాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఆర్బీకేలకు అనుసంధానించిన వలంటీర్లు ఆర్బీకే మిత్రలుగా, ధాన్యం కొనుగోళ్లలో సహాయం కోసం తీసుకుంటున్న వలంటీర్లు రైతు సహాయకులుగా వ్యవహరించాలి. బియ్యం ఎగుమతులపై దృష్టి రాష్ట్రంలో వరి విస్తారంగా సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల రంగంలో ఉన్న వారితో కలిసి పని చేయాలి. బియ్యం ఎగుమతిదారులకు, రైతులకు ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ (నూకలు)ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారు కానుంది. సీఎం యాప్‌తో ధరల పర్యవేక్షణ ఎక్కడైనా పంటలకు ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా సమీక్షిస్తుండాలి. ఎక్కడైనా ధర పతనమైనట్లు సీఎం యాప్ ద్వారా గుర్తిస్తే వెంటనే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి. ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఎలా ఆదుకుంటామనే విషయంలో సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పకడ్బందీగా ఉండాలి. కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వచేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాలి. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ధరలు పతనం కాకుండా అన్నదాతలకు మేలు జరుగుతుంది. పొగాకు రైతులకు నష్టం జరగకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌కు ముందే భూసార పరీక్షలు.. పంటల సంరక్షణకు ప్లాంట్ డాక్టర్ ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు నిర్వహించి పూర్తి వివరాలను సాయిల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. మధ్యలో ఏవైనా చీడపీడలు, తెగుళ్లు లాంటివి పంటలకు సోకితే ఫోటోలు తీసి శాస్త్రవేత్తల సహకారంతో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని తేవాలి. విచ్చలవిడిగా క్రిమి సంహారక మందుల వాడకాన్ని నివారించాలి. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ సిఫార్సుల మేరకు పంటలను సాగు చేస్తే విచక్షణా రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు దోహదం చేస్తుంది. ఈదఫా 1.15 కోట్ల ఎకరాల్లో సాగు ఖరీప్ సీజన్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అక్కడక్కడా వరి నాట్లు కొనసాగుతున్నందున ఈదఫా ఖరీఫ్ సాగు 1.15 కోట్ల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరిగిందని, సాధారణ పంటల నుంచి రైతులు వీటి వైపు మళ్లినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 14.10 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారని చెప్పారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రానున్న రబీ సీజన్లో 57.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసి 96 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరికరాలు, అద్దెల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత సాయాన్ని అక్టోబరు 17న అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భూసార పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బాంబే, కాన్పూర్ ఐఐటీల సాంకేతిక విధానాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, హెచ్.అరుణ్‌కుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సేవలో వలంటీర్లు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) వలంటీర్ల సేవలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా రైతుల సేవలో భాగస్వాములు కానున్నారు. ఆర్బీకే సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లే సమయంలో రైతుల సేవల్లో అంతరాయం కలగకుండా గ్రామాల్లో చురుగ్గా పని చేసే వలంటీర్లను ఆర్బీకేలకు ప్రభుత్వం అనుసంధానించింది. రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేల్లోనూ ఒక్కోవలంటీర్ చొప్పున కేటాయించింది. ఇంటర్లో బయాలజీ చదివిన వారికి ప్రాధాన్యతనిచ్చింది. ఈ కేవైసీ నమోదులో వలంటీర్లు ఈ పంట నమోదులో ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు కూడా భాగస్వాములవుతున్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే 100 శాతం ఈ పంట నమోదు పూర్తయ్యింది. వీఏఏ/ వీహెచ్‌ఏలు 87 శాతం, వీఆర్ఏలు 77 శాతం ఈ కేవైసీ (వేలిముద్రలు) పూర్తి కాగా, 10 శాతం రైతుల నుంచి వేలిముద్రల సేకరణ పూర్తయ్యింది. ఈ దశలో వలంటీర్లను రైతుల ఇళ్లకు పంపి వారి వేలిముద్రల నమోదులో భాగస్వామ్యం చేశారు. స్పెషల్ డ్రైవ్ రూపంలో ఈ నెల10 కల్లా దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణలోనూ భాగస్వామ్యం అక్టోబర్ 15 నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ ధాన్యం సేకరణలోనూ వలంటీర్లను భాగస్వాములను చేస్తున్నారు. ఏ కేటగిరీ ఆర్బీకేలకు నలుగురు, బి, సి కేటగిరీ ఆర్బీకేలకు ఇద్దరు చొప్పున వలంటీర్లను కేటాయిస్తున్నారు. వీరిలో ఒకరు ఆర్బీకేకు అనుసంధానించిన వలంటీర్ కూడా ఉంటారు. ధాన్యం సేకరణ అసిస్టెంట్, రూట్ అసిస్టెంట్లుగా వీరి సేవలను వినియోగించుకుంటారు. కల్లాల్లోని ధాన్యం శాంపిళ్లను తీసుకొచ్చి తేమ శాతం తదితర ఐదు రకాల పరీక్షలు నిర్వహించడం, గోనె సంచులు సిద్ధం చెయ్యడం, లోడింగ్, అన్ లోడింగ్‌కు హమాలీలు, రవాణాకు వాహనాలను సమకూర్చడం, ధాన్యాన్ని మిల్లులకు తరలించడం, మొత్తం ప్రక్రియను ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయడం వంటి సేవలందిస్తారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు వీరికీ శిక్షణ ఇస్తారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరికి నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. దసరా తర్వాత రెండ్రోజుల పాటు శిక్షణ ఆర్బీకే కార్యకలాపాలపై వలంటీర్లకు దసరా తర్వాత రెండ్రోజులు శిక్షణ ఇస్తారు. ఆర్బీకేలకు వచ్చే రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవడం, వారికి అవసరమైన ఇన్పుట్స్ కోసం కియోస్క్ ద్వారా దగ్గరుండి బుక్ చేయించడం, ఆర్బీకేలకు కేటాయించే ఇన్‌పుట్స్‌ను స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. పంటల వారీగా శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలతో కూడిన వీడియోలను స్మార్ట్ టీవీల్లో ప్రదర్శించడం, డిజిటల్ లైబ్రరీలో ఉండే పుస్తకాలను, ఇతర సమాచారాన్ని రైతులకు అందించడంతో పాటు ఆర్బీకే ద్వారా అందించే ఇతర సేవల్లోనూ రైతులకు తోడుగా నిలిచేలా తర్ఫీదునిస్తారు. సీఎం ఆశయాల మేరకు.. నేను పల్లంట్ల 2వ వార్డు వలంటీర్‌ను. నా పరిధిలో 93 కుటుంబాలున్నాయి. ఇప్పటివరకు వారికి అవసరమైన సేవలు మాత్రమే అందిస్తున్నా. ఇప్పుడు పల్లంట్ల ఆర్బీకేకు నన్ను అటాచ్ చేశారు. రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం ఆనందంగా ఉంది. వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సీఎం వైఎస్ జగన్ ఆశయాల మేరకు సేవలందిస్తా. – పి.సందీప్, పల్లంట్ల ఆర్బీకే, ఏలూరు జిల్లా రైతులకు తోడుగా ఉంటా ఊళ్లో ఉన్న రైతులందరికీ సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. రైతులకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్టే. కొత్తగా వచ్చే తెగుళ్లు, పురుగుల సమాచారాన్ని పై అధికారులకు తెలియజేసి వాటి నివారణలో రైతులకు తోడుగా ఉంటాను. –పూల అన్వర్‌బాషా, ఎర్రగుడిదిన్నె ఆర్బీకే, నంద్యాల జిల్లా ఆర్బీకే సేవలు రైతు ముంగిటకు తీసుకెళ్తా మూడేళ్లుగా వలంటీర్‌గా సంతృకరమైన సేవలందించాను. ఇప్పుడు మా ఆర్బీకే పరిధిలో రైతులకు సేవ చేసే అదృష్టం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటా. ఆర్బీకే సేవలు రైతుల ముంగిటకు తీసుకెళ్తాను. – గంగదాసు ఉషారాణి,పెద్దవరం ఆర్బీకే, కృష్ణా జిల్లా -
'హర్ష'పాతం
సాక్షి, విశాఖపట్నం: కరువు ఛాయల్లేకుండా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపించాయి. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇవి ప్రభావం చూపుతాయి. ఖరీఫ్ పంటలకు ఈ రుతుపవనాలే కీలకం. అందుకే నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందోనని ఇటు రైతులు, అటు ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తి చూపుతాయి. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు ఇప్పటివరకు వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తరచూ తేలికపాటి నుంచి మోస్తరుగాను, అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిశాయి. ఇలా వరుసగా నాలుగేళ్ల నుంచి ఖరీఫ్ సీజనులో వరుణుడు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిపిస్తూనే ఉన్నాడు. ఇందుకు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఎంతో దోహదపడ్డాయి. రుతుపవనాల సీజను మొదలైన జూన్ నుంచి ఇప్పటివరకు బంగాళాఖాతంలో ఏడు అల్పపీడనాలు, రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల్లో ‘నైరుతి’ సీజన్ ముగింపు ఇక మరికొద్ది రోజుల్లోనే నైరుతి రుతుపవనాల సీజను ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్డీపీఎస్) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో సాధారణం, ఐదు జిల్లాల్లో అధిక, ఒక జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. విజయనగరం, కాకినాడ, బాపట్ల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అధిక వర్షపాతం, శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. అరకొర వర్షాలతో కరువు పరిస్థితులేర్పడే అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ ఏడాది సాధారణానికి మించి అధిక వర్షం కురవడం విశేషం. సాధారణం కంటే అధికం.. మరోవైపు.. నైరుతి రుతుపవనాల సీజనులో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 514.7 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా 544.3 మి.మీలు కురిసింది. ఇది సాధారణం కంటే దాదాపు 6.0 శాతం అధికమన్నమాట. ఒక్క సెప్టెంబర్‌లోనే 95 మి.మీలకు గాను 115.9 మి.మీలు (22 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. నిజానికి.. సాధారణంకంటే 20 శాతానికి పైగా తక్కువ వర్షం కురిస్తే లోటు వర్షపాతంగా పరిగణిస్తారు. ఇలా ఈ నైరుతి రుతుపవనాల సీజనులో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం రికార్డు కాలేదు. ఈ నేపథ్యంలో కరువు ఛాయలు ఏర్పడకుండా ఖరీఫ్ సీజను ముగుస్తుండడం, అవసరమైనప్పుడల్లా వర్షాలు కురుస్తూ పంటలకు ఢోకా లేకపోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
సూక్ష్మ సేద్యం విస్తరిస్తోంది
ఈయన పేరు ఆర్. రామ్మోహన్‌రెడ్డి.కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్.పేరేముల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.57 ఎకరాల్లో కంది, ఆముదం పంటలు సాగుచేసే వారు. 90 శాతం సబ్సిడీపై బిందు పరికరాల కోసం ఆర్బీకేలో నమోదు చేసుకున్నారు. సర్వేచేసి బిందు సేద్యానికి అనువైనదిగా గుర్తించారు. తన వాటాగా రూ.44,343 చెల్లించారు. దీంతో గతానికంటే భిన్నంగా నేడు ఎలాంటి సిఫార్సుల్లేకుండా దరఖాస్తు చేయగానే వెంటనే పరికరాలు అమర్చారు. ఇప్పుడు కొత్తగా బత్తాయి మొక్కలు వేసుకున్నారు. దీంతో రైతు రామ్మోహన్‌రెడ్డి ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూక్ష్మసేద్యం విస్తరిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా బిందు, తుంపర సేద్య పరికరాల కోసం రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. రైతుభరోసా కేంద్రాల్లో రికార్డు స్థాయిలో రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే, అంచనాల తయారీ, మంజూరు ప్రక్రియతో పాటు పరికరాల అమరిక వేగం పుంజుకుంది. ఫలితంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే దిగుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులు దేశవ్యాప్తంగా సూక్ష్మసేద్యంలో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 12 లక్షల మంది రైతులు 34.70 లక్షల ఎకరాల్లో బిందు.. 12.98 లక్షల ఎకరాల్లో తుంపర సేద్యం చేస్తున్నారు. సూక్ష్మ సేద్యానికి మరో 28.35 లక్షల ఎకరాలు అనువైనవి కాగా.. దశల వారీగా దీనిని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా.. తొలివిడత కింద 2022–23లో రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడం ద్వారా 1.70 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూర్చాలని నిర్ణయించారు. తద్వారా అదనంగా 26 లక్షల టన్నుల దిగుబడులతో రూ.1,500 కోట్లకు పైగా జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్ : అదనపు స్థూల విలువ) సాధించవచ్చునని అంచనా వేస్తున్నారు. అనంతపురంలో అత్యధికంగా.. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం, ప్రకాశం మినహా కోస్తా జిల్లాలకు చెందిన 5–12.5 ఎకరాల్లోపు రైతులకు 50 శాతం రాయితీతో బిందు.. 50 శాతం రాయితీపై రాష్ట్రవ్యాప్తంగా తుంపర పరికరాలు అందిస్తున్నారు. పరికరాల సరఫరాకు 37 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇప్పటివరకు 3,60,120 ఎకరాల్లో బిందు పరికరాల కోసం 1,13,757 మంది.. 57,817 ఎకరాల్లో తుంపర పరికరాల కోసం 20,080 మంది రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.02 లక్షల ఎకరాలకు 28,339 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 76,140 ఎకరాలకు 22,827 మంది, ప్రకాశం జిల్లాలో 37,245 ఎకరాలకు 12,759 మంది, వైఎస్సార్ జిల్లాలో 35,780 ఎకరాలకు 11,097 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ నాటికి లక్ష్య సాధన ఈ నేపథ్యంలో.. టెక్నికల్ కమిటీలతో క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ చురుగ్గా సాగుతోంది. అర్హుల ఎంపిక ప్రక్రియ 90 శాతం పూర్తయ్యింది. అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో అర్హత పొందిన రైతులకు తుంపర పరికరాల పంపిణీ చురుగ్గా సాగుతోంది. బిందు పరికరాల కోసం ఇప్పటికే 20 వేల ఎకరాల్లో సర్వే పూర్తికాగా, 5వేల ఎకరాల్లో అమరిక పూర్తయ్యింది. పరికరాల అమరిక ప్రక్రియను డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారం రోజుల్లోనే పరికరాలిచ్చారు. నేను 2.5 ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నా. 50 శాతం రాయితీపై తుంపర పరికరాలు తీసుకున్నాను. ఆర్బీకేలో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే పొలానికి తీసుకొచ్చి ఇచ్చారు. మిరప సాగు తర్వాత అపరాలు సాగుకు వినియోగిస్తా. – శ్యామల సత్యనారాయణరెడ్డి, రామచంద్రపురం, ఎన్టీఆర్ జిల్లా డ్రిప్‌తో రూ.75వేల నికర ఆదాయం నాకు నీటి సౌకర్యం ఉన్న ఐదెకరాల పొలం ఉంది. డ్రిప్ లేకపోతే ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేలు ఖర్చవుతుంది.. పంట దిగుబడి తక్కువగా వస్తుంది. అదే డ్రిప్ ఉంటే రూ.15వేలు సరిపోతుంది. ఆదాయం కూడా ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.75వేల వరకు వస్తుంది. – చుక్కా లక్ష్మీనారాయణ, రేకులకుంట, అనంతపురం జిల్లా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు నేను 4.91 ఎకరాల్లో నేరేడు పంట సాగుచేస్తున్న. ఆర్బీకేలో దరఖాస్తు చేయగానే సర్వేచేసి మంజూరు ఆర్డర్ ఇచ్చారు. ఈ మధ్యే పొలంలో పరికరాలు అమర్చారు. వీటి వినియోగంతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు కృషిచేస్తా. – చమరాతి ప్రమీలమ్మ, ఓదివీడు, అన్నమయ్య జిల్లా బుడ్డశనగ కూడా వేస్తున్నా.. నేను 2.44 ఎకరాల్లో వేరుశనగ సాగుచేస్తున్నా. సబ్సిడీపై తుంపర పరికరాలు ఇటీవలే అమర్చారు. వీటి ద్వారా వేరుశనగ పంటే కాకుండా బుడ్డశనగ ఇతర పంటలను కూడా సాగుచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. – సి. రామసుబ్బారెడ్డి, గడ్డంవారిపల్లి, వైఎస్సార్ జిల్లా ఈసారి దిగుబడులు పెరుగుతాయి సూక్ష్మ సాగునీటి పథకం కింద తుంపర, బిందు పరికరాల కోసం రైతుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. పెద్దఎత్తున రైతులు ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేరుకున్నారు. అర్హుల గుర్తింపు, అంచనాల తయారీ, పరికరాల అమరిక చురుగ్గా సాగుతోంది. డిసెంబర్ కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖచ్చితంగా దిగుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. – డాక్టర్ సీబీ హరనాథరెడ్డి, పీఓ, ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం -
ఖరీఫ్‌లో పంటల నమోదుకు ‘ఈ–క్రాప్’
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట నమోదుకు అధికార యంత్రాంగం సోమవారం నుంచి శ్రీకారం చుడుతోంది. సాంకేతిక సమస్యలకు తావులేకుండా పకడ్బందీగా ఈ–పంట నమోదుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులు సంయుక్తంగా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో దండోరాతోపాటు రైతు వాట్సాప్ గ్రూపులు, ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. పక్కాగా నమోదు ఈ ఖరీఫ్‌లో 92.05 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 47.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలుకు ఈ క్రాప్ నమోదే ప్రామాణికం. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో అనుసంధానిస్తూ అమలు చేస్తున్న వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి ఈ పంట నమోదే ప్రామాణికం. ఈ నేపథ్యంలో చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం లేకుండా ఈ క్రాప్ నమోదు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా సన్నద్ధమైంది. క్షేత్రస్థాయిలో పరిశీలన.. ఈ క్రాప్ నమోదు కోసం ఆధార్, 1 బీ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్, సీసీఆర్సీ కార్డులతో రైతులు ఆర్బీకేల వద్దకు వెళితే సరిపోతుంది. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటాతో యాప్‌ను అనుసంధానించినందున రైతు ఆధార్ నెంబర్ నమోదు చేయగానే సర్వే నంబర్లవారీగా భూముల వివరాలు తెలుస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఏ సర్వే నెంబర్ పరిధిలో ఏ రకం పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. ఆ తర్వాత వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజూ కనీసం 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపడతారు. యాప్‌లో నమోదైన వివరాలతో సరి పోల్చుకుని జియో కో ఆర్డినేట్స్‌తో సహా పంటల ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు. అనంతరం యాప్‌లో నమోదు చేసిన వివరాలన్నీ తెలియచేసి రైతు వేలిముద్ర (మీ పంట తెలుసుకోండి – ఈకేవైసీ) తీసుకోగానే యాప్ ద్వారానే సంబంధిత ఫోన్ నెంబర్‌కు డిజిటల్ రసీదు జారీ అవుతుంది. ఆ తర్వాత వీఏఏ /వీహెచ్ఏ, వీఆర్వో వేలిముద్రలు వేసి సబ్మిట్ చేస్తారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే రైతుకు భౌతిక రసీదు అందజేస్తారు. పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను కూడా నమోదు చేసేలా యాప్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భూమి ఖాళీగా ఉంటే నో క్రాప్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వా కల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రి ల్యాండ్ అని నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారు. పండ్ల తోటలు, సుబాబుల్, యూకలిఫ్టస్, ఆర్చర్డ్ (అలంకరణ పుష్పాలు) తోటలను వయసువారీగా నమోదు చేస్తారు. ఈ ఆప్షన్లో వివరాలు.. సీసీఆర్సీ కార్డులు లేని సాగుదారులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కానివారు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తుంటే పర్యవేక్షణాధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకసారి వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత మార్పు (ఎడిట్) చేసే అవకాశం వీఏఏ/వీహెచ్‌ఏలకు కల్పించలేదు. ఎంఏవోలు/ ఎంఆర్వోలు 10 శాతం, ఏడీఏ/ఏడీహెచ్‌లు 5 శాతం, డీఏవో/డీహెచ్‌ఒలు మూడు శాతం, జాయింట్ కలెక్టర్లు రెండు శాతం, కలెక్టర్లు ఒక శాతం చొప్పున విధిగా ఈ పంట నమోదును ర్యాండమ్‌గా తనిఖీ చేయాలి. ఈసారి పబ్లిక్ సెర్చ్ ఆప్షన్ కూడా కల్పించారు. పంట నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ఆ వివరాలను ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేటి నుంచి ప్రారంభమవుతున్న ఈ పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అనంతరం సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తారు. -
అరకొరగానే వరి! కారణాలివేనా? కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఈ ఏడాది వరి సాగు 24 శాతం మేర తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే జూలై 8 నాటికి తెలంగాణలోనూ వరి సాగు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. జూన్‌లో రుతుపవనాల రాకలో జాప్యం జరగడం, పప్పు ధాన్యాలు, నూనెగింజల మద్దతు ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో వాటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఈ నెల 8న వ్యవసాయ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. గత ఏడాది ఈ సమయానికి దేశవ్యాప్తంగా 94.99 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారు. అయితే ఈ ఏడాది కేవలం 72.24 లక్షల హెక్టార్లలో (24% తక్కువ) మాత్రమే వరి నాట్లు పడ్డాయి. 2012 జూలై 11 నాటికి 96.7 లక్షల హెక్టార్లలో వరి సాగవగా, ఆ తర్వాత ఏడాదిలో గరిష్టంగా 1.25 కోట్ల హెక్టార్ల మేర సాగు జరిగింది. వరి ఎక్కువగా సాగు చేసే ఛత్తీస్‌గఢ్‌లో గత ఏడాది ఇదే సమయానికి 15.14 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ ఏడాది ఏకంగా 6.19 లక్షల హెక్టార్ల మేర తగ్గి కేవలం 8.95 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యింది. తెలంగాణలో గత ఏడాది జూలై 8 నాటికి 93 వేల హెక్టార్లలో వరి వేయగా, ఈ ఏడాది కేవలం 53 వేల హెక్టార్లలో మాత్రమే సాగయ్యింది. వరికి స్వల్పం..ఇతర పంటలకు భారీగా.. రుతుపవనాల వైఫల్యానికి తోడు ఈ ఏడాది వరి మద్దతు ధరను కేవలం రూ.100 మాత్రమే పెంచడం..రైతులు వరి సాగుకు మొగ్గు చూపక పోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మరోవైపు వంట నూనెలు, పప్పుధాన్యాల దిగుమతిని తగ్గించేందుకు, దేశీయంగా నూనె గింజల దిగుబడిని పెంచేలా వాటి మద్దతు ధరలను కేంద్రం గణనీయంగా పెంచింది. ఈ కారణంగానే రైతులు వరి సాగును తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం వరి సాగు విస్తీర్ణం తగ్గితే దాని ప్రభావం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిరుపేదలకు సరఫరా చేసే బియ్యం పంపిణీపై పడే ప్రమాదముంది. ఈ దృష్ట్యా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వరి నాట్లు పెంచాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రాలను కోరారు. దేశంలో బియ్యం నిల్వలకు కొరత లేదని, అంతర్జాతీయ డిమాండ్ దృష్ట్యా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే మంచి ధర వస్తుందని తెలిపారు. -
20 నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం నాణ్యమైన, ధ్రువీకరించిన వేరుశనగ విత్తనాలను ఈ నెల 20వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కె–6, నారాయణి, కదిరి లేపాక్షి (కె–1812) రకాల విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను కిలో రూ.51.48కి రైతులకు ఇచ్చేందుకు సిద్ధం చేసింది. గత సీజన్లో మాదిరిగానే ఈ విత్తనాల్లో మూడోవంతును సొంతంగా అభివృద్ధి చేసిన వాటినే పంపిణీ చేయనుంది. ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగువిస్తీర్ణం 17.90 లక్షల ఎకరాలు కాగా గతేడాది 18.50 లక్షల ఎకరాల్లో సాగైంది. 5.40 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.5,550 కాగా గతేడాది రూ.6,500 వరకు పలికింది. ఈ ఏడాది రూ.6,800 నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. ఈ ఏడాది సాగు లక్ష్యం 18.40 లక్షల ఎకరాలు కాగా, మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధర లభిస్తుండడంతో ఈసారి కూడా లక్ష్యానికి మించే సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రైతులు వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలతో పాటు వేరుశనగ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. సర్టిఫై చేసిన సొంత విత్తనం సబ్సిడీ విత్తనం కోసం గతంలో పూర్తిగా ప్రైవేటు కంపెనీలపైనే ఆధారపడే వాళ్లు. కంపెనీలు ఏ విత్తనం ఇస్తే దాన్నే సబ్సిడీపై పంపిణీ చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ కనీసం మూడోవంతు విత్తనమైనా సొంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత సీజన్ నుంచి సొంత విత్తన తయారీకి శ్రీకారం చుట్టారు. రబీ 2020–21లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి, ఆ తర్వాత సర్టిఫై చేసి ఖరీఫ్–2021లో పంపిణీ చేశారు. గడిచిన రబీ 2021–22లో ఉత్పత్తి చేసిన విత్తనాన్ని అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లలో సర్టిఫై చేసి ఖరీఫ్ సీజన్ కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పంపిణీ చేయనున్న 3,95,761 క్వింటాళ్ల విత్తనాల్లో.. లక్ష క్వింటాళ్లు రబీలో రైతులు ఉత్పత్తి చేసినవే. టెండర్ల ద్వారా ప్రైవేటు కంపెనీల నుంచి సమీకరించే మిగిలిన విత్తనాన్ని సైతం ర్యాండమ్‌గా అగ్రి ల్యాబ్స్‌లో సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. అదేరోజు నుంచి కిలో రూ.85.80 ధర ఉన్న విత్తనాలను 40 శాతం సబ్సిడీ పోను రూ.51.48కి రైతులకు పంపిణీ చేయనున్నారు. రైతుకు నాణ్యమైన విత్తనం విత్తనోత్పత్తి చేసే రైతు నుంచి నేరుగా విత్తనాలు సేకరిస్తున్నాం. ప్రతి పైసా వారి ఖాతాకే జమచేస్తున్నాం. ఈ విధానం వల్ల విత్తనోత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు సాగుచేసే రైతుకు నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. ప్రైవేటు కంపెనీలు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం అందించేందుకు పోటీపడుతున్నాయి. సర్టిఫై చేసిన విత్తనాన్ని ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
AP: ఈ-పంట ఉత్పత్తులు భేష్..
సాక్షి, అమరావతి: రసాయన అవశేషాల్లేని పంటల ధ్రువీకరణ (క్రాప్ సర్టిఫికేషన్) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (జీఏపీ) సర్టిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం 2019 రబీ సీజన్లో వైఎస్సార్ పొలంబడులకు శ్రీకారం చుట్టింది. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? ఇందులో భాగంగా గ్రామానికి 25 ఎకరాలను ఎంపిక చేసి, విత్తు నుంచి కోతల వరకు 14 వారాల పాటు ఉత్తమ యాజమాన్య పద్ధతుల(జీఏపీ)పై ఆర్బీకేల ద్వారా శిక్షణ ఇస్తారు. తోటి రైతులతో కలిసి ప్రతి రోజూ పంటను పరిశీలిస్తూ సమగ్ర సస్యరక్షణ, పోçషక, నీటి, కలుపు, పురుగు మందుల యాజమాన్య పద్ధతులతో పాటు కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు ఎప్పుడు.. ఎలాంటి యంత్ర పరికరాలను వినియోగించాలో ఫామ్ మెకనైజేషన్ ద్వారా ఎంపికైన రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ విధంగా సమగ్ర పంట నిర్వహణా పద్ధతులను పాటిస్తూ పర్యావరణహితంగా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో రసాయన అవశేషాలు లేకుండా మేలైన దిగుబడులను ఏవిధంగా సాధించవచ్చో తెలియజెపుతారు. రైతులు తమ సొంత వ్యవసాయ క్షేత్రాల్లో వాటిని పాటించేలా ప్రోత్సహిస్తారు. పొలంబడులతోపాటు తోట, పట్టు, మత్స్యసాగు, పశు విజ్ఞాన బడులను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. 10 నుంచి 22 శాతం పెట్టుబడి ఆదా 5 సీజన్లలో నిర్వహించిన పొలంబడుల ద్వారా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పప్పుధాన్యాల వంటి పంటల్లో 10 నుంచి 22% మేర పెట్టుబడి ఖర్చు ఆదాతో పాటు 10 నుంచి 24% మేర దిగుబడులు పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. మూడేళ్లలో రూ.71.17 కోట్లతో 39,944 పొలంబడుల ద్వారా 11.98 లక్షల మంది రైతులను ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దారు. ఇదే స్ఫూర్తితో 2022–23 సీజన్లో రూ.50.27 కోట్లతో 17 వేల పొలంబడులు నిర్వహించాలని సంకల్పించారు. ఎఫ్ఏఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పటి వరకు శిక్షణలకే పరిమితమైన వ్యవసాయ శాఖ రానున్న ఖరీఫ్ సీజన్ నుంచి ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్, ప్రొటోకాల్స్‌పై రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయిల్లో అధికారులు, సిబ్బంది, రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు టెక్నికల్ కో ఆపరేషన్ ప్రొగ్రామ్ (టీసీపీ) కింద ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 30 మంది వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మలిదశలో ఈ నెల 16 నుంచి విడతల వారీగా ఆగçస్టు్ట 20 వరకు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఎంపిక చేసిన 130 మంది అధికారులు, 260 మంది రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణనిస్తారు. శాస్త్రవేత్తలు పరీక్షించాకే ధ్రువీకరణ రానున్న ఖరీఫ్‌లో 9 రకాలు, రబీలో 7 రకాల పంటలకు సంబంధించి 5.10 లక్షల మంది రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. 3 సీజన్లలో పొలంబడులలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించిన రైతులను పంటల వారీగా గుర్తిస్తారు. వారికి దశల వారీగా శిక్షణనిస్తారు. నిర్ధేశించిన ప్రొటోకాల్ మేరకు రానున్న ఖరీఫ్ సీజన్లో మోతాదుకు మించి రసాయన పురుగు మందులు వినియోగించకుండా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులను గుర్తిస్తారు. వీరు పండించిన పంట ఉత్పత్తుల నాణ్యతను వ్యవసాయ, ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా పరీక్షించిన తర్వాత వారికి ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా జీఏïపీ సర్టిఫికేషన్ (ధ్రువీకరణ) జారీ చేస్తారు. ఇలా ధ్రువీకరణ పొందిన రైతుల పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుంది. పొలంబడి పండితుడంటున్నారు నాకున్న రెండెకరాల్లో ఏటా కూరగాయలు సాగు చేసేవాడిని. గడిచిన రబీలో 1.5 ఎకరంలో పొలం బడి పద్ధతిలో, మిగిలిన అరెకరంలో పాత పద్ధతిలో వరి సాగు చేశాను. పొలం బడిలో సాగు చేసిన క్షేత్రంలో 42 బస్తాలు, మిగిలిన అరెకరంలో 12 బస్తాల చొప్పున మొత్తం 54 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.19,400 పోగా, రూ.55,400 మిగిలింది. పొలంబడిలో నేర్చుకున్న పాఠాలు తోటి రైతులకు చెబుతుంటే ఊళ్లో నన్ను పొలంబడి పండితుడు అంటున్నారు. ఇదే రీతిలో సాగు చేస్తే రానున్న ఖరీఫ్ సీజన్లో జీఏపీ గుర్తింపును ఇస్తామంటున్నారు. – జి.శ్రీనివాసులు, గాజులవారిపల్లి, చిత్తూరు జిల్లా జీఏపీ కోసం రూట్ మ్యాప్ ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి జీఏపీ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశాం. టెక్నికల్ కో ఆపరేషన్ ప్రాజెక్టు కింద ఎఫ్ఏఓ ద్వారా రైతులతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వర్సిటీ శాస్త్రవేత్తల ద్వారా మూల్యాంకనం చేసి నాణ్యమైన దిగుబడులు సాధించే రైతులకు జీఏపీ గుర్తింపునిస్తాం. కనీసం 5 లక్షల మందికి ఇలా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, వ్యవసాయ శాఖ -
AP: ముందస్తు ఏరువాక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్‌లో జలాశయాల కింద రైతులకు ముందుగానే సాగునీరు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ సీజన్‌ను ముందుగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు సోమశిల కింద ఉన్న ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌కు ముందస్తుగా నీటిని విడుదల చేయాలని గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. తుపానుల బారిన పడి రైతులు పంటలు నష్టపోకుండా ఉండేలా ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదల ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో హెల్త్ హబ్‌లకు భూములను కేటాయించడంతో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2022–27 ఏపీ ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి, 2022–27 ఏపీ లాజిస్టిక్ విధానానికి పచ్చ జెండా ఊపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు. వరుసగా వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు నీటితో మూడో పంటకు అవకాశం ► వైఎస్సార్ హాయాంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ హయాంలోనూ పుష్కలంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు బాగున్నాయి. దీంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్‌కు ముందస్తుగా నీటి విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని రైతులకు ముందుగా తెలిజేయడం ద్వారా ముందస్తు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లును చేసుకుని సమాయత్తం అవుతారు. ► గతంలో ఆగస్టులో నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఖరీఫ్‌కు వివిధ ప్రాజెక్టుల నుంచి ముందుగానే నీటిని విడుదల చేస్తున్నాం. దీనివల్ల నవంబర్, డిసెంబర్లలో వచ్చే తుపానుల బారిన పడకుండా రైతులు పండించిన పంట చేతికి వస్తుంది. అలాగే రబీకి కూడా ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల మూడో పంట కింద అపరాలు, ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ► గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీన నీటి విడుదల చేయనున్నాం. పోలవరం రివర్ స్లూయిస్ డెడ్ స్టోరేజీ నుంచి, ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. కృష్ణా డెల్టాకు, గుంటూరు చానల్‌కు జూన్ 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తాం. పులిచింతలలో 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులిచింతల పునరావాసానికి రూ.100 కోట్లు చెల్లించడంతో ఇది సాధ్యమైంది. దీంతో పట్టిసీమతో సంబంధం లేకుండా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. ► పెన్నా బేసిన్‌లోని గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల ప్రాజెక్టుల నుంచి జూన్ 10న సాగునీటిని విడుదల చేస్తాం. సోమశిలలో 56 టీఎంసీల నీరు ఉంది. రాయలసీమలో ఎస్ఆర్బీసీ పరిధిలోని అవుకు, గోరుకల్లు నుంచి జూన్ 30వ తేదీన నీటిని విడుదల చేస్తాం. నాగార్జున సాగర్ కింద కుడిగట్టు ఆయకట్టుకు జూలై 15న నీళ్లిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఆర్బీకేల ద్వారా అన్ని విధాలా భరోసా ► ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులతో పాటు సమస్తం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ► కొన్ని ప్రాంతాల్లో ఖరీప్ సీజన్ ముందుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభం కావడంతో ధాన్యం సేకరణలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల కింద ముందస్తుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభించడంతో ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తవని భావిస్తున్నాం. అలాగే మూడో పంట ద్వారా పంటల మార్పిడికి అవకాశం కలుగుతుంది. సాగునీటి విడుదల షెడ్యూల్ ఆధారంగా సాగు నీటి సలహా మండలి సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. సంక్షేమ క్యాలెండర్ అమలుకు ఆమోదం ► ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు కేబినెట్ ఆమోదించింది. సీఎం మే 13వ తేదీన ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా, మే 16న వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభిస్తారు. మే 19న పశువులకు చెందిన అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభిస్తారు. ► జూన్ 6న 4,014 కమ్యునిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402 కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు. ఖరీఫ్–21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను జూన్ 14న, జూన్ 21న అమ్మ ఒడి పథకం అమలు చేస్తాం. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా.. ► కృష్ణా జిల్లా పామర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)గా అప్‌గ్రేడ్. 38 అదనపు పోస్టులు మంజూరు. అప్‌గ్రెడేషన్ కోసం రూ.8.18 కోట్లు వ్యయం. ► పులివెందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు. 26 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ. ► వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు, తదితర పనుల కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.1,600 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం. ► మార్క్‌ఫెడ్‌లో 8 డిప్యుటీ మేనేజర్లు, 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మంజూరు. ► నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో దివంగత మంత్రి గౌతం రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు. ► నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టనున్న క్రిబ్కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పుల కారణంగా ఎరువులకు బదులు బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్కోకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో 16 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం. ► రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలకు కేబినెట్ ఆమోదం. కోవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ హబ్స్‌లో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థలకు భూముల కేటాయింపు. మచిలీపట్నంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించనున్న ఆస్పత్రి కోసం ఎకరా భూమి కేటాయింపునకు ఆమోదం. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 3 ఎకరాలు, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రికి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. రూ.100 కోట్లకు పైబడి పెట్టుబడితో పాటు 50 శాతం పడకలు ఆరోగ్య శ్రీకి కేటాయించాలనే నిబంధన. వైఎస్సార్ జిల్లా చిన్నమాచుపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్ హబ్ కింద ఏర్పాటు కానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు. ► సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు, పడమటి కండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్టైల్ పార్క్‌కు కేటాయింపు. ► శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసీకి 235 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు, ఇక్కడే మరోచోట 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, పశు సంవర్థక, మినరల్స్, టెక్స్టైల్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం. ► పెనుగొండలో మెగా స్పిరిట్యువల్ సెంటర్, టూరిస్ట్ బేస్ క్యాంప్‌నకు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు అనుమతి. ► తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిసార్ట్‌కు 10.50 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్. ► కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో రిసార్ట్ కోసం ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు. ► విశాఖపట్నం జిల్లా ఎండాడలో కాపు భవన్ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► నంద్యాల జిల్లా ప్యాపిలిలో హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ కోసం 25.93 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ఆ మేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్ ఆమోదం. ► పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో నర్సపూర్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన 1,754.49 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చి, ప్రస్తుతం ఆ భూమిని అనుభవిస్తున్న లీజుదారులకు ఎకరా కేవలం రూ.100 చొప్పున పూర్తి హక్కులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం. దీని వల్ల 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ► పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ గతంలో జారీ చేసిన జీవో సవరణకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు ఆమోదం. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం స్థలాల కేటాయింపు. -
ఏపీలో మాత్రమే.. ఎరువుల పంపిణీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ కోసం గ్రామస్థాయిలో వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువుల పంపిణీతో పాటు వివిధ రకాల సేవలందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి వెల్లడించారు. ఖరీఫ్ సీజన్లో ఎరువుల కేటాయింపులు, పంపిణీ అమలు తీరుపై కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి సోమవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్దన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా.. ఏపీలో మాత్రమే గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీ జరుగుతున్నదన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో సైతం ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)కే రైతులకు అందించడంలో ఆర్బీకేలు కీలకభూమిక పోషిస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్ 2022 కోసం 19.02 లక్షల టన్నులను కేంద్రం కేటాయించిందని, వాటిని నెలవారీగా నిర్ధేశించిన మేరకు రాష్ట్రానికి కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు గోదాముల నుంచి ఆర్బీకేలకు సరఫరా చేసేందుకు అయ్యే రవాణా ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ ఖర్చులను కేంద్రం భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఏపీ ఎరువులకు ఇస్తున్న రాయితీలను కాంప్లెక్స్ ఎరువులకు కూడా ఇచ్చి ధరల వ్యత్యాసాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఎరువుల వినియోగాన్ని నియంత్రించాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయ సూచించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు, రవాణా ఖర్చులూ విపరీతంగా పెరిగినప్పటికీ.. సబ్సిడీని పెంచిన విషయాన్ని గుర్తించాలన్నారు. -
ఆర్బీకేల ద్వారానే పత్తి విత్తన విక్రయాలు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ సీజన్లో నిర్ధేశించిన సాగు లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన బీటీ పత్తి విత్తనాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీకి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరి హరికిరణ్ ఆదేశించారు. ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోన్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థతో కంపెనీలు ఎంవోయూలు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తన ఉత్పత్తిదారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం 5.82 లక్షల హెక్టార్లు కాగా, రానున్న ఖరీఫ్ సీజన్లో 6.17 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఇందుకోసం 36 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమన్నారు. ఆ మేరకు జన్యు ఇంజనీరింగ్ అంచనాల కమిటీ (జీఈఏసీ) ఆమోదించిన నాణ్యమైన బీటీ విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తివిత్తన విక్రయ ధర (475 గ్రాముల ప్యాకెట్) బీజీ–1కు రూ.635, బీజీ–2 ప్యాకెట్‌కు రూ.810గా నిర్ణయించిందన్నారు. అంతకు మించి విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జీఈఏసీ నిషేధించిన హెచ్‌టీ పత్తివిత్తనాలను విక్రయించరాదని, ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు తమదృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీఫ్ సీజన్లో 47 లక్షల విత్తన ప్యాకెట్లు సరఫరా చేయగలమని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. -
ఏపీకి 19.02 లక్షల టన్నుల ఎరువులు
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్–2022 సీజన్లో ఏపీకి రూ.19.02 లక్షల టన్నుల ఎరువులను కేటాయించనున్నట్టు కేంద్ర, వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజ వెల్లడించారు. ఖరీఫ్ సన్నద్ధతపై వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ కమిషనర్లతో సోమవారం ఢిల్లీ నుంచి వారు సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో సాగవుతున్న ఖరీఫ్ పంటల విస్తీర్ణం, పంటలు, భూసార పరిస్థితులపై చర్చించారు. ఐదేళ్లుగా ఎరువుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల కేటాయింపుపై ప్రకటన చేశారు. ఎరువుల వాడకాన్ని తగ్గించేలా రైతులను చైతన్య పరచి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచేలా కృషి చేయాలని సూచించారు. వరి సాగు లక్ష్యం 16.33 లక్షల హెక్టార్లు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో 57.32 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. వీటిలో ప్రధానంగా వరి 16.33 లక్షల హెక్టార్లు, వేరు శనగ 7.30 లక్షల హెక్టార్లు, పత్తి 6.24 లక్షల హెక్టార్లు, కంది 2.70 లక్షల హెక్టార్లు, మినుము లక్ష హెక్టార్లు, పెసర 14 వేల హెక్టార్లు, జొన్న 17 వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.16 లక్షల హెక్టార్లు, నువ్వులు 13 వేల హెక్టార్లు, రాగి 26 వేల హెక్టార్లు, మిరప 1.80 లక్షల హెక్టార్లు, కూరగాయలు 2.65 లక్షల హెక్టార్లు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 57.32 లక్షల హెక్టార్లుగా అంచనా వేశామన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 79.8 శాతం నేలల్లో నత్రజని, 15.80 శాతం నేలల్లో భాస్వరం, 14.71 శాతం నేలల్లో పొటాష్, 35 శాతం నేలల్లో జింక్, 24 శాతం నేలల్లో ఐరన్, 17 శాతం నేలల్లో బోరాన్ లభ్యత తక్కువగా ఉన్న విషయాన్ని భూసార పరీక్షల్లో గుర్తించినట్టు కమిషనర్ తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం రాష్ట్రానికి యూరియా 8 లక్షల టన్నులు, డీఏపీ 2.25 లక్షల టన్నులు, ఎంవోపీ 1.41 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 6.41 లక్షల టన్నులు, ఎస్ఎస్పీ 95 వేల టన్నులు.. మొత్తం 19.02 లక్షల టన్నులు అవసరమని కమిషనర్ కోరగా.. ఆ మేరకు ఏపీకి ఎరువులను కేటాయిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ, ఎరువుల మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శులు ప్రియరంజన్, నీరజలు ప్రకటించారు. -
ఖరీఫ్‌లో సిరుల పంట
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 80.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుంది. ఇది గత ఖరీఫ్ కన్నా 12.86 లక్షల మెట్రిక్ టన్నులు అధికం. భారీ వర్షాలవల్ల ఈసారి ఉభయ గోదావరి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరి పంట దెబ్బతిన్నప్పటికీ దిగుబడి కూడా మెరుగ్గా ఉంది. వ్యవసాయ రంగంపై రెండో ముందస్తు అంచనాలతో కూడిన వాస్తవ పత్రాన్ని ఆ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సమర్పించారు. ఆ వివరాలు.. ► ఈ ఖరీఫ్‌లో 40.29 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేయగా 80.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. అదే గత ఖరీఫ్‌లో 39.86 లక్షల హెక్టార్లలో వరి పంట సాగుచేయగా 67.60 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అయినట్లు తుది అంచనాలు స్పష్టంచేశాయి. ► గత ఖరీఫ్‌లో ఎకరానికి సగటున 1,700 కేజీల ధాన్యం దిగుబడి కాగా.. ఈ ఖరీఫ్‌లో 1,997 కేజీలు రానుందని అంచనా వేశారు. ► మొక్కజొన్న ఉత్పత్తి కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పెరిగింది. గత ఏడాది 4.34 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఈ ఖరీఫ్‌లో 5.26 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది. ► కందులు కూడా ఈ ఖరీఫ్‌లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయి. ఇవి ఈసారి 1.19 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా గత ఖరీఫ్‌లో కేవలం 80 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చాయి. ► ఇక గత ఖరీఫ్‌లో మొత్తం పప్పు ధాన్యాలు 1.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయితే.. ఇప్పుడు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయి. ► గత ఖరీఫ్‌తో పోలిస్తే మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఖరీఫ్‌లో అదనంగా 13.96 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. గత ఖరీఫ్‌లో 74.15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా ఈ ఖరీఫ్‌లో 88.11 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కానున్నాయి. రూ.172 కోట్లతో సబ్సిడీ విత్తనాలు గడచిన ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.172 కోట్ల సబ్సిడీతో 11.80 లక్షల మంది రైతులకు 6.91 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది. అలాగే.. రైతుభరోసా కేంద్రాల ద్వారా 1.29 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేసింది. -
11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కరప: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ చెప్పారు. ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప, పాతర్లగడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తుపాన్లు, భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో 2.48 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 7.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 1.30 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అమ్ముకోకుండా.. ఆర్బీకే సిబ్బంది కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రబీ సీజన్లో రైతులు బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగుచేయవద్దని, వాటిని కొనుగోలుచేయబోమని చెప్పారు. రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకంలో 18 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, ఇతర సంస్థలకు మరో 4 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్‌లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్‌తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్‌లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
'ఆర్బీకేల్లో' దండిగా ఎరువులు
సాక్షి, అమరావతి: రబీ–2021–22 సీజన్లో ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. సీజన్లో 23.44 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా. దీంతో ఆ మేరకు కేటాయింపులు జరిపేందుకు కేంద్రం కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏ దశలోనూ ఎరువుల కోసం ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రబీ పంటల సాగు కోసం అక్టోబర్‌లో 4.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం. ప్రారంభ నిల్వలు 6.51 లక్షల టన్నులుండగా.. అక్టోబర్ 26 నాటికి కేంద్రం 2.50 లక్షల టన్నుల మేర సరఫరా చేసింది. దీంతో ఎరువుల నిల్వలు 9.01 లక్షల టన్నులకు చేరుకున్నాయి. వీటిలో ఇప్పటివరకు 3.37 లక్షల టన్నుల ఎరువులను విక్రయించారు. ప్రస్తుతం 5.64 లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆర్బీకేల ద్వారా అవగాహన రబీ సీజన్ కోసం ఆర్బీకేల ద్వారా 1.95 లక్షల టన్నులు ఎరువులు సరఫరా చేయాలనేది లక్ష్యం. ఇప్పటివరకు 88 వేల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ ఉంచగా.. అక్టోబర్ 26 నాటికి 25 వేల టన్నుల ఎరువులను రైతులకు విక్రయించారు. మిగిలిన ఎరువులను కూడా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిమాండ్ మేరకు డీఏపీ, ఎంవోపీ ఎరువులను ఆర్బీకేల్లోనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్నివేళలా అన్ని పంటలకు డీఏపీ, ఎంవోపీ ఎరువులపైనే ఆధారపడకుండా సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. కాంప్లెక్స్ ఎరువులే మేలు రబీలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. డీఏపీ, ఎంవోపీలపైనే పూర్తిగా ఆధార పడకుండా కాంప్లెక్స్ ఎరువుల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. డీఏపీలో నత్రజని, భాస్వరం, ఎంవోపీలో పొటాష్ మాత్రమే లభిస్తాయి. అదే కాంప్లెక్స్ ఎరువుల్లో నత్రజని, భాస్వరంతోపాటు పొటాష్, గంథకం వంటి ఇతర పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. కాంప్లెక్స్ ఎరువుల వినియోగం వల్ల పంట ఎదుగుదల, దిగుబడిలో ఏ మాత్రం తేడా రాదు. ఎరుపు రంగు పొటాష్‌కు బదులు మార్కెట్లో తెలుపు రంగు పొటాష్ లభిస్తోంది. ఎరుపు రంగులో లభ్యమయ్యే 60 శాతం పొటాష్ తెలుపు రంగులోనూ ఉంటుంది. ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతున్న వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ -
వాస్తవ సాగుదారులకే పంటరుణాలు
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమిస్తూ వ్యవసాయం చేసేవారికి.. వాస్తవ సాగుదారులకు మాత్రమే పంటరుణాలు అందనున్నాయి. సాగు చేస్తున్న భూ యజమానులతో సహా ప్రతి రైతు వివరాలను ప్రభుత్వం ఈ–క్రాప్‌లో నమోదు చేస్తోంది. దీని ఆధారంగా పంటరుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ).. ఇక ఈ–క్రాప్ డేటా ఆధారంగానే పంటరుణాలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 90 లక్షల ఎకరాలు, రబీలో 60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద ఎత్తున భూములు కలిగిన రైతుల సంఖ్య 70 లక్షలకుపైగా ఉంటే.. వాస్తవ సాగుదారుల సంఖ్య మాత్రం 45 లక్షల నుంచి 50 లక్షలే. 60 నుంచి 70 శాతం సాగుభూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వీరిసంఖ్య 20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాల్లో సాగుచేస్తున్న వారిలో భూ యజమానులకన్నా కౌలుదారులే ఎక్కువ. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కుదవపెట్టి పొందిన పంటరుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఆ వడ్డీలో కేంద్రం 3 శాతం రాయితీ ఇస్తుంది. సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులు సైతం వ్యవసాయం పేరిట పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీని వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారు. వారు ఏటా రెన్యువల్ చేయించుకోవడం లేదా కొత్త రుణాలు పొందడం పరిపాటిగా మారింది. బ్యాంకులకు నిర్దేశించిన రుణలక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకు ఈ రెన్యువల్స్ ఉంటున్నాయి. రుణాలు దక్కని వాస్తవ సాగుదారులు పంటరుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. పంటల బీమాతోసహా ఇతర రాయితీలు వారికి దక్కేవికాదు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు మాత్రమే సంక్షేమ ఫలాలు, రాయితీలు దక్కేలా గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీతో అండ చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికభారాన్ని తగ్గించే లక్ష్యంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంటరుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. ఈ విధంగా ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి ఎన్ఐసీ రూపొందించిన పోర్టల్‌లో బ్యాంకర్స్ అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం 11.03 లక్షలమంది రైతులకు రూ.6,389.27 కోట్ల మేర రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరయ్యాయి. వారికి 4 శాతం చొప్పున రు.232.35 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ జాబితాను ఈ–క్రాప్‌లో ఆధార్ నంబర్‌తో సరిపోల్చి చూడగా 6.67 లక్షల మంది మాత్రమే వాస్తవ సాగుదారులని తేలింది. సాగుచేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పొందిన రుణాన్ని బట్టి చూస్తే వారికి చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ.112.71 కోట్లు. ఈ మొత్తాన్ని రెండురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన బ్యాంకర్స్ కమిటీ రుణాల మంజూరు, వడ్డీ రాయితీ చెల్లింపుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి రైతులతోపాటు కౌలుహక్కు ధ్రువీకరణపత్రం (సీసీఆర్సీ) పొందిన కౌలుదారులు, జేఎల్‌జీ గ్రూపులకు ఈ–క్రాప్ ఆధారంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకర్ల కమిటీని కోరింది. రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరు చేసి సకాలంలో చెల్లించినవారి వివరాలను మాత్రమే ఇకనుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల (ఎస్వీపీఆర్) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఒత్తిడి ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ–క్రాప్ ఆధారంగా లక్ష్యం మేరకు పంటరుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ చేసేందుకు బ్యాంకర్ల కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ–క్రాప్ ఆధారంగా రుణాలిస్తాం ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులకు రుణాలివ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మావద్ద రుణాలు పొందిన భూ యజమానుల వివరాలు మాత్రమే ఉంటాయి. ముందుగా మా వద్ద ఉన్న లోన్‌చార్జి రిజిస్టర్, ఈ–కర్షక్, ఈ–క్రాప్ పోర్టల్స్‌ను అనుసంధానించాలి. ఇందుకు ప్రభుత్వ సహకారం అవసరం. సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్స్‌ను అనుసంధానించిన తర్వాత ఈ–క్రాప్ ఆధారంగా పంటరుణాల మంజూరుకు శ్రీకారం చుడతాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ ఆర్బీకేల్లో రుణాలు పొందినవారి జాబితాలు ఈ–క్రాప్ ఆధారంగా రుణాలు మంజూరు చే సేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించింది. సోషల్ ఆడిట్లో భాగంగా అర్హత ఉండి రుణాలు రానివారి వివరాలు ప్రదర్శిస్తాం. సాగుదార్లతో జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. సీసీఆర్సీ కార్డులు జారీచేస్తున్నాం. రుణార్హత ఉన్న కౌలుదారుల జాబితాను కూడా లోన్చార్జ్ రిజిస్టర్కి అనుసంధానం చేస్తాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
ఆహార ధాన్యాల సాగు.. బాగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగిసింది. చివర్లో ‘గులాబ్’ తుపాను గుబులు పుట్టించినప్పటికీ ఆశించిన స్థాయిలో కురిసిన వర్షాలతో సాగు సజావుగా సాగింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఏడాది విస్తీర్ణంలో కాస్త తగ్గినప్పటికీ ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం కాస్త పెరిగింది. వరితో సహా మిరప, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, ఉల్లి లక్ష్యానికి మించి సాగయ్యాయి. మొత్తమ్మీద 96.4 శాతం మేర సాధారణ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లో నూరు శాతం అధిగమించగా, కర్నూలు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 99 శాతం మేర సాగయ్యాయి. ఇక విశాఖపట్నం మినహా మిగిలిన జిల్లాల్లో 90–96 శాతం మేర అయితే.. విశాఖలో మాత్రం 87 శాతం మేర మాత్రమే పంటలు సాగయ్యాయి. రాయలసీమలో ‘వరి’ సిరులు ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 38.40 లక్షల ఎకరాలు. 2019లో అది 38.15 లక్షల ఎకరాలు అయితే, 2020లో 38.52 లక్షల ఎకరాల్లో సాగయింది. అదే ఈ ఏడాది 39.17లక్షల ఎకరాల్లో సాగైంది. విశాఖ (95 శాతం), శ్రీకాకుళం (96 శాతం), పశ్చిమగోదావరి (97 శాతం) జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో నూరు శాతానికి మించి వరి సాగైంది. అత్యధికంగా రాయలసీమలోని చిత్తూరులో 193 శాతం, వైఎస్సార్ కడపలో 133 శాతం, అనంతపురంలో 125 శాతం, కర్నూలులో 100 శాతం మేర వరి సాగైంది. పెరిగిన మిరప, మొక్కజొన్న, అపరాలు ► గడిచిన సీజన్‌తో పోలిస్తే ఈసారి మిరప, మొక్కజొన్న రికార్డు స్థాయిలో సాగయ్యాయి. ► మిరప దాదాపు 1.24 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దీని సాధారణ విస్తీర్ణం 3.40 లక్షల ఎకరాలైతే.. గతేడాది 3.43 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది ఏకంగా 4.67 లక్షల ఎకరాల్లో సాగైంది. ► ఇక మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాలు కాగా.. గతేడాది 2.81 లక్షల ఎకరాల్లో సాగైంది. తొలిసారిగా ఈ ఏడాది 3.08 లక్షల ఎకరాల్లో సాగైంది. ► అపరాల సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. గత ఖరీఫ్‌లో 6.76 లక్షల ఎకరాల్లో సాగైన అపరాలు ఈసారి 7.41 లక్షల ఎకరాల్లో సాగైంది. తగ్గిన వేరుశనగ, పత్తి సాగు ఇక ఖరీఫ్‌లో నూనె గింజల సాధారణ విస్తీర్ణం 18.97 లక్షల ఎకరాలు కాగా.. గత సీజన్లో 19.22 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 17.37 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాదితో పోలిస్తే 2 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. అలాగే, గతేడాది 18.41 లక్షల ఎకరాల్లో సాగైన వేరుశనగ ఈ ఏడాది 16.26 లక్షల ఎకరాలకే పరిమితమైంది. 14.73 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన పత్తి 12.86 లక్షల ఎకరాల్లో సాగైంది. -
విత్తన మాఫియా పెత్తనానికి చెక్ పెట్టేలా!
విత్తన మాఫియా నుంచి రైతుల్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ ఒక్క రైతు కల్తీ, నకిలీ విత్తనాల బారిన పడకూడదన్న సంకల్పంతో నాణ్యమైన విత్తనోత్పత్తిపై దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు సరిపడా విత్తనాలను ఇప్పటినుంచే తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసింది. సీజన్ ప్రారంభానికి ముందే సర్టిఫై చేసిన విత్తనాన్ని అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఇప్పటికే సీడ్ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే. దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది. – సాక్షి, అమరావతి 8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేసేలా.. ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌లో 94 లక్షల ఎకరాలు, రబీలో 59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. రెండు సీజన్లలో వివిధ పంటలకు సంబంధించి 8.75 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.06 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 2.50 లక్షల క్వింటాళ్ల శనగ, 2 లక్షల క్వింటాళ్ల వరి, 16,762 క్వింటాళ్ల అపరాలు, 2,500 క్వింటాళ్ల చిరు ధాన్యాల విత్తనాలు అవసరమవుతాయని గుర్తించారు. ఈ దృష్ట్యా 2022–23 సీజన్‌కు సరిపడా విత్తనం కోసం ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే కార్యాచరణ సిద్ధం చేశారు. ముఖ్యంగా విశేష ప్రాచుర్యం పొందిన రకాల విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కనీసం 38,468 క్వింటాళ్ల వేరుశనగ, 7,820 క్వింటాళ్ల శనగ, 3 వేల క్వింటాళ్ల వరి, 245 క్వింటాళ్ల అపరాలు, 3 క్వింటాళ్ల చిరు ధాన్యాలకు సంబంధించి ఫౌండేషన్ సీడ్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన 4,800 ఎకరాల్లో మొత్తం 49,537 క్వింటాళ్ల ఫౌండేషన్ సీడ్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ సీడ్ ఆధారంగా రానున్న రబీ 2021–22 సీజన్లో 1,470 గ్రామాల్లో కనీసం 85,764 ఎకరాల్లో 8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటిలో డిమాండ్ అధికంగా ఉన్న 4,05,713 క్వింటాళ్ల వేరుశనగ (కే–6, కదిరి, లేపాక్షి, నారాయణి రకాలు), 2 లక్షల క్వింటాళ్ల 20 రకాల వరి విత్తనాలు, 2,50 లక్షల క్వింటాళ్ల శనగలు (జేఎల్‌జీ–11, ఎన్‌బీఈజీ –49)తో పాటు 17 వేల క్వింటాళ్ల అపరాలు (కందులు, మినుములు, పెసలు), 2,500 క్వింటాళ్ల చిరుధాన్యాలు, నువ్వులు ఇతర విత్తనాలు సిద్ధం చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా వాటి నాణ్యతను పరీక్షించి.. సర్టిఫై చేసిన విత్తనాలను వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచే ఆర్బీకేల్లో రైతులకు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇకనుంచి క్రమం తప్పకుండా ఇదే రీతిలో ఫౌండేషన్ సీడ్ ద్వారా విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలు తీరగా మిగిలిన విత్తనాలను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయిలో రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్టు ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు ‘సాక్షి’కి తెలిపారు. -
లక్ష్యం దిశగా 'సాగు'తున్న ఖరీఫ్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఖరీఫ్ లక్ష్యం దిశగా సాగవుతున్నది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తుండడంతో ఖరీఫ్ సాగు వేగం పుంజుకుంది. రాయలసీమలో అధిక వర్షపాతం సీజన్లో సాధారణ వర్షపాతం 556 ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 441 ఎంఎం వర్షపాతం కురవాల్సి ఉండగా, 500 ఎంఎం వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర సాధారణ వర్షపాతం 622.4 ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 497.9 ఎంఎం కురవాల్సి ఉండగా.. 536.2 ఎంఎం వర్షపాతం కురిసింది. ఇక రాయలసీమలో సాధారణ వర్షపాతం 406.6ఎంఎం కాగా, సెప్టెంబర్ 10 నాటికి 312.9 ఎంఎం కురవాల్సి ఉండగా..415.4 ఎంఎం కురిసింది.కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం కురవగా, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం కురిసింది. లక్ష్యం దిశగా ఖరీఫ్.. రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 93.32లక్షల ఎకరాలు కాగా, 2019లో రికార్డు స్థాయిలో 90.38లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, 2020లో 90.20లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగైంది. కాగా ఈఏడాది 95.35లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా ఇప్పటికే 75లక్షల ఎకరాల (80 శాతం) విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వరి సాధారణ విస్తీర్ణం 38.4లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 39.97 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాల్లో (83శాతం) వరి సాగైంది. ఈ ఏడాది మొక్కజొన్న లక్ష్యానికి మించి సాగైంది. 2.55లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 2.60లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఇక 9లక్షల ఎకరాల్లో అపరాలు సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 86 శాతం సాగయ్యాయి. అత్యధికంగా కందులు 5.05 లక్షల ఎకరాల్లో సాగవగా, మిగిలిన విస్తీర్ణంలో మినుములు, పెసలు, ఉలవలు సాగయ్యాయి. 19.95లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగు చెయ్యాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకు 16.47లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. తగ్గనున్న వేరుశనగ, పత్తి, మిరప ప్రధానంగా 18.62లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన వేరుశనగ ఈసారి 15.47లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. అదే విధంగా పత్తి సాగు లక్ష్యం 15లక్షల ఎకరాలు కాగా, 12లక్షల ఎకరాల్లోనే సాగైంది. అదే విధంగా 3.72లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప ఈ ఏడాది 2.23లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ మేరకు ఈ మూడు పంటలకు సంబంధించి ఏటా సాగవ్వాల్సిన విస్తీర్ణం పూర్తయినట్టుగా వ్యవసాయశాఖాధికారులు లెక్కతేల్చారు. దీంతో ఆ మేరకు మిగిలిన విస్తీర్ణంలో రైతులు అపరాలు, చిరు ధాన్యాల వైపు మళ్లినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 7.56లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఖరీఫ్ సీజన్‌కు 20.20లక్షల టన్నులు అవసరం కాగా, రాష్ట్రంలో 19.69లక్షల టన్నుల నిల్వలుండగా, ఇప్పటి వరకు 12,13,187 టన్నుల అమ్మకాలు జరిగాయి. కాగా సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఖరీఫ్సాగు పూర్తయ్యే అవకాశాలుకన్పిస్తున్నాయి. ఆమేరకు అవసరమైన ఎరువులు, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కడా కొరత రానీయకుండా సమృద్ధిగా నిల్వ ఉంచారు. ఖరీఫ్ సాగు కోసం సెప్టెంబర్ నెలకు రైతులకు 6,07,017 ఎంటీల ఎరువుల అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7.56లక్షల ఎంటీల ఎరువుల నిల్వలు ఉన్నాయి. లక్ష్యానికి మించి పంటల సాగు ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీజన్ ముగిసే వరకు రైతులకు సరిపడా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై నిఘా ఉంచాం. –హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
రేటు పెంచితే వేటు.. ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు అన్నివిధాలా అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఎరువుల విషయంలో అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సమృద్ధిగా ఎరువులు ఉన్నప్పటికీ, కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎమ్మార్పీకి మించి విక్రయిస్తోన్న డీలర్లపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న దాడుల్లో అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఎరువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను సీజ్ చేయడమే కాకుండా, ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.2.09 కోట్ల విలువైన 810.61 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. ఫారమ్ ‘ఓ’లో పేర్కొన్న ఎరువులకు మించి నిల్వ చేసిన డీలర్లపై కేసులు నమోదు చేసి, వారి వద్ద ఉన్న రూ.6.92 కోట్ల విలువైన ఎరువుల అమ్మకాలను నిలిపి వేశారు. వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, విజయనగరంలో ఒక డీలర్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు. శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కర్నూలు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 10 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కోర్టుల్లో విచారించే ఈ కేసుల్లో నేరారోపణ రుజువైతే సీజ్ చేసిన స్టాక్ విలువలో 25 నుంచి 100 శాతం వరకు జరిమానాలు విధించవచ్చు. తీవ్రతను బట్టి వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తారు. లైసెన్స్ లేకుండా డీఏపీ నిల్వలు నోటిఫైడ్ లైసెన్స్‌లో లేని ఎరువులను విక్రయిస్తున్న ప్రకాశం జిల్లా వేటపాలెంలోని యాషువా ఎంటర్ ప్రైజెస్ యజమాని కొల్లూరి సురేష్‌తో పాటు విశాఖ జిల్లా నర్సీపట్నంలో లైసెన్సు లేకుండా 11.52 ఎంటీల ఐపీఎల్ కంపెనీకి చెందిన డీఏపీని నిల్వ చేసి, అనధికారికంగా విక్రయిస్తోన్న గొలుసు శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నాన్ నోటిఫైడ్ బయో ఫెర్టిలైజర్స్‌ను తెలంగాణలో విక్రయిస్తోన్న కృష్ణా జిల్లా గన్నవరంలోని దశరథ్ ఫెర్టిలైజర్స్ లైసెన్సును రద్దు చేశారు. ఎరువుల నిల్వలు ఇలా.. ఖరీఫ్ సీజన్లో 95.35 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వరకు 65 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి సాగు లక్ష్యం 39.97 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 26 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. సీజన్ కోసం 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రారంభ నిల్వతో కలిపి రాష్ట్రంలో 18.04 లక్షల టన్నుల నిల్వలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 9.94 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 8.10 లక్షల టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆర్బీకేల ద్వారా రైతులకు డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇందుకోసం ఆర్బీకేల్లో 1,36,805 టన్నుల నిల్వలుంచగా, ఇప్పటి వరకు 69,874 టన్నుల అమ్మకాలు జరిగాయి. ఇంకా 66,931 టన్నుల ఎరువుల నిల్వలున్నాయి. సీజన్ ముగిసే వరకు దాడులు ఖరీఫ్ సీజన్‌కు సరిపడా సమృద్ధిగా ఎరువుల నిల్వలున్నాయి. అయినా కొంత మంది డీలర్లు లైసెన్సుకు విరుద్ధంగా నిల్వ చేయడమే కాకుండా, ఎమ్మార్పీకి మించి, బిల్లుల్లేకుండా విక్రయిస్తున్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదు. ధరల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాం. సీజన్ ముగిసే వరకు ఈ దాడులు కొనసాగుతాయి. ధరలు పెరిగి పోతున్నాయంటూ కొంత మంది డీలర్ల సంఘ ప్రతినిధులు తప్పుడు ప్రకటనలు ఇస్తూ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇటువంటి వారిపై కూడా క్రిమినల్ కేసులు పెడతాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
Kurasala Kannababu: ఎరువుల కొరత లేదు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో డీఏపీతో సహా ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్బీకేల్లో కూడా చాలినంత ఎరువు నిల్వలున్నాయని చెప్పారు. ప్రస్తుత సీజన్‌కు 20.20 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, 6.71 లక్షల ప్రారంభ నిల్వలున్నాయని, కేంద్రం ఇప్పటి వరకు 10.22 లక్షల టన్నులు సరఫరా చేసిందన్నారు. ఇప్పటి వరకు 8,19,089 టన్నుల విక్రయాలు జరగ్గా ప్రçస్తుతం రాష్ట్రంలో 8,73,591 టన్నుల నిల్వలున్నాయన్నారు. ఆర్బీకేల్లో 1,60,311 టన్నుల నిల్వలుంచగా, ఇప్పటి వరకు 64,795 టన్నుల విక్రయాలు జరిగాయన్నారు. ఇంకా 62,491 టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సమృద్ధిగా డీఏపీ నిల్వలు తూర్పు గోదావరితో పాటు పలు చోట్ల డీఏపీ కొరత సృష్టించి కొంతమంది వ్యాపారులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరుపుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. సీజన్లో డీఏపీ 2,49,999 టన్నులు అవసరం కాగా, ప్రారంభ నిల్వ 42,589 టన్నులుండగా, కేంద్రం ఇప్పటివరకు 1,29,185 టన్నులు రాష్ట్రానికి సరఫరా చేసిందన్నారు. ఇప్పటి వరకు 93,195 టన్నులు అమ్మకం జరగ్గా, ఇంకా 78,579 టన్నులు నిల్వలున్నాయని చెప్పారు. ఆగస్టుకు సంబంధించి 63,320 టన్నులు అవసరం కాగా, ఇప్పటికే కేంద్రం 63,450 టన్నులు కేటాయించిందన్నారు. డీఏపీ 50 కేజీల బస్తా రూ.1200 మించి విక్రయించడానికి వీల్లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క డీలర్ అయినా ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని, అవసరమైతే వారి లైసెన్సులు రద్దు చేయిస్తామన్నారు. -
కాడి, మేడి సిద్ధం.. ఖరీఫ్‌కు సన్నద్ధం
నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తొలకరి పలకరిస్తున్న వేళ.. పుడమితల్లి పులకిస్తుండగా.. కొండంత ఆశతో ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. పొలాలనన్నీ హలాల దున్నేందుకు కాడి, మేడి సిద్ధం చేసుకుంటున్నారు. ఏరువాక పౌర్ణమి రోజు వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి, ఎడ్లను అలంకరించి పొలం పనులకు శ్రీకారం చుట్టడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహానికి తోడు వాతావరణం కాస్త అనుకూలంగా ఉండడంతో రెట్టించిన రైతులు ఉత్సాహంతో సాగుకు సమాయత్తమవుతున్నారు. ఖరీఫ్ సాగుకు ముందే వైఎస్సార్ రైతుభరోసా కింద అన్నదాతలకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. వర్షాకాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా రైతన్నల ముంగిటకు తీసుకెళ్లింది. గతం కంటే మిన్నగా పంటరుణాల మంజూరుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2019 ఖరీఫ్‌లో 90.38 లక్షల ఎకరాల్లోను, 2020లో 90.20 లక్షల ఎకరాల్లోను పంటలు సాగయ్యాయి. ఈ ఖరీఫ్‌లో 94.84 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాల్లో నారుమళ్లు పోసేందుకు పనులు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సకాలంలో మంచి వర్షాలు కురుస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. 7.40 లక్షలమందికి 4.21 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సబ్సిడీ, నాన్‌సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందుల్ని కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తున్నారు. సాగుకుముందే 4,78,829 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు 5,09,762 క్వింటాళ్ల విత్తనాల కోసం 9,35,905 మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 7,40,885 మందికి రూ.129.88 కోట్ల సబ్సిడీతో 4,21,245 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సిద్ధం చేశారు. ఆర్బీకేల ద్వారా 4,44,960 మంది రైతులకు రూ.111.09 కోట్ల సబ్సిడీతో 3,19,960 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సరఫరా చేశారు. ఖరీఫ్‌లో 2.37 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేయగా, ఇప్పటివరకు 1,46,976 మందికి రూ.5.89 కోట్ల సబ్సిడీతో 62,184 క్వింటాళ్లు అందజేశారు. ఆర్బీకేల ద్వారానే నాన్‌సబ్సిడీ విత్తనాలు నాన్‌సబ్సిడీ విత్తనాలకు సంబంధించి తొలిసారిగా 45,412 ప్యాకెట్ల మిరప విత్తనం కోసం ఇండెంట్ పెట్టగా, ఇప్పటివరకు 23,047 ప్యాకెట్లు పంపిణీ చేశారు. మొక్కజొన్న, పత్తి, వరి విత్తనాలకు సంబంధించి 28,144 ప్యాకెట్ల విత్తనాల కోసం ఇండెంట్ పెట్టగా ఇప్పటివరకు 5,936 ప్యాకెట్ల విత్తనాలు సరఫరా చేశారు. మరోపక్క తొలిసారిగా ఆర్బీకే స్థాయిలో ఎరువులను కూడా నిల్వచేశారు. 88,930 టన్నుల ఎరువుల కోసం ఇండెంట్ పెట్టారు. 70,256 టన్నుల ఎరువుల్ని ఆర్బీకేల్లో నిల్వ చేయగా.. 16,477 మంది రైతులు 7,779 టన్నుల్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆర్బీకేల్లో 62,477 టన్నుల ఎరువులున్నాయి. మరోవైపు తొలిసారిగా సర్టిఫై చేసిన 900 టన్నుల పురుగుమందులను ఆర్బీకేల్లో నిల్వ చేస్తున్నారు. ఖరీఫ్‌లో 8,604 పొలంబడులు నిర్వహిస్తుండగా, తొలిసారిగా రైతు భరోసా–యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ (ఆర్బీ–యూడీపీ) యాప్ ద్వారా ఈ–క్రాప్ బుకింగ్‌కు శ్రీకారం చుడుతున్నారు. పంటరుణాలు రూ.65,149 కోట్లు, టర్మ్ రుణాలు రూ.19,039 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. సన్న, చిన్నకారు రైతులకు ఆర్బీకేల వద్ద అద్దెకు సాగుయంత్రాలను సమకూర్చే లక్ష్యంతో తొలివిడతగా ఒక్కొక్కటి రూ.15 లక్షలతో 3,250 సీహెచ్‌సీలతో పాటు రూ.210 కోట్లతో నియోజకవర్గస్థాయిలో నిర్మించిన 162 ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఖరీఫ్‌లో ఎన్నో ప్రయోగాలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారి సర్టిఫై చేసిన సబ్సిడీ, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుమందులను కూడా ఆర్బీకేల ద్వారా డోర్ డెలివరీ చేస్తున్నాం. మిరప, మొక్కజొన్న తదితర విత్తనాలను కూడా ఆర్బీకేల్లో ఉంచడం వల్ల బ్లాక్‌మార్కెట్‌ను నిరోధించగలిగాం. ఇన్‌పుట్స్‌లో ఏ ఒక్కటి ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
ఖరీఫ్ సాగు.. మరింత బాగు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2021 పంటల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రకటించింది. గడచిన ఖరీఫ్ సీజన్లో 90.86 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. ఈ ఖరీఫ్‌లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా 94.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేసింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే.. ఈ ఖరీఫ్‌లో 3.34 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకు రావడం ద్వారా 7.23 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఖరీఫ్–2021 సాగు లక్ష్యానికి అనుగుణంగా దిగుబడి అంచనాలను వ్యవసాయ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. మొత్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో 94.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయించాలని నిర్ణయించగా.. అందులో వరి విస్తీర్ణం అత్యధికంగా 39.50 లక్షల ఎకరాలుగా ఉంది. 5.21 లక్షల ఎకరాల్లో తృణధాన్యాలు, 8.97 లక్షల ఎకరాల్లో అపరాలు కలిపి మొత్తం ఆహార ధాన్యాలు 53.68 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. 19.72 లక్షల ఎకరాల్లో నూనె గింజలు, 14.81 లక్షల ఎకరాల్లో పత్తి, 3.69 లక్షల ఎకరాల్లో మిరప, లక్ష ఎకరాల్లో చెరకు, మరో 1.31 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గతం కంటే ఘనంగా.. టీడీపీ హయాంలో సగటున ఏటా ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 80.51 లక్షల టన్నులు కాగా, అందులో 73.86 లక్షల టన్నుల వరి దిగుబడి ఉంది. ఖరీఫ్–2019లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 87.77 లక్షల టన్నులు కాగా, అందులో వరి దిగుబడి 80.13 లక్షల టన్నులు. ఖరీఫ్–2020లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 86.78 లక్షల టన్నులు కాగా, ఇందులో వరి దిగుబడి 78.89 లక్షల టన్నులు. పెరగనున్న దిగుబడులు ఈ ఖరీఫ్‌లో 39.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఎకరాకు 2,156 కేజీల చొప్పున 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. తృణధాన్యాల దిగుబడి 6.74 లక్షల టన్నులు, అపరాల దిగుబడి 2.11 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్క వేశారు. ఈ విధంగా 53.68 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాల దిగుబడి 94.01 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఆయిల్ సీడ్స్ 8.34 లక్షల టన్నులు, చెరకు 29.70 లక్షల టన్నులు, పత్తి 10.43 లక్షల టన్నులు, మిరప 8.48 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలేశారు. రానున్న ఖరీఫ్–21 సీజన్లో మొత్తంగా 94.20 లక్షల ఎకరాల్లో ఆహార ధాన్యాలతో పాటు అన్నిరకాల పంటల ద్వారా 154.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రెండేళ్ల కంటే మిన్నగా దిగుబడులు గడచిన రెండేళ్ల కంటే మిన్నగా రానున్న ఖరీఫ్‌లో దిగుబడులు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆహార ధాన్యాలు ఖరీఫ్–2019లో 87.77 లక్షల టన్నులు, ఖరీఫ్–2020లో 86.78 లక్షల టన్నుల దిగుబడులు రాగా, ఈ ఖరీఫ్‌లో 94.01 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశాం. గత ఖరీఫ్‌లో 78.89 లక్షల టన్నుల వరి దిగుబడి రాగా, వచ్చే ఖరీఫ్‌లో 85.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అశిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
అపరాల దిగుమతులపై ఆంక్షల ఎత్తివేత
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాన్ని సడలించడంతో అందరికీ పప్పు ధాన్యాలు ప్రత్యేకించి కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్లుగా ఇవి ఆంక్షల జాబితాలో ఉండడంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుత కరోనా సమయంలో అందరికీ పౌష్టికాహారాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ మూడు పప్పుధాన్యాలను ఓపెన్ క్యాటగిరీలో చేర్చి దిగుమతికి అనుమతించినట్టు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. ధరల పెరుగుదల నుంచి సామాన్య ప్రజలను కాపాడడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. ఆంక్షల తొలగింపు గడువు అక్టోబర్ 31 వరకే ఉండడంతో వ్యాపారులు వెంటనే రంగంలోకి దిగారు. రెండున్నర లక్షల టన్నుల కంది, ఒకటిన్నర లక్షల టన్నుల మినుము, 50–75 వేల టన్నుల పెసరపప్పును మయన్మార్, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నారు. గతేడాది పంటల కాలంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉండడం, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని నాఫెడ్ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య) వద్ద బఫర్ నిల్వలు తరిగిపోవడం వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం దిగుమతులకు అనుమతించింది. మీ దగ్గరున్న నిల్వలెంతో చెప్పండి.. నిత్యావసర వస్తువులు ప్రత్యేకించి పప్పుధాన్యాల నిల్వలు, వాటి ధరలు ఎంతెంత ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. కొన్ని పప్పుల ధరలు భారీగా పెరగడంతో కేంద్రం రాష్ట్రాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఎవరెవరి వద్ద ఎన్నెన్ని నిల్వలున్నాయో తేలనుంది. ధర పెరుగుతుందని కొంతమంది బడా వ్యాపారులు సరకును దాస్తుంటారు. ఇప్పుడా లెక్కలు కూడా తేలతాయని మార్కెటింగ్ శాఖాధికారి ఒకరు తెలిపారు. తక్కువ ధరకు అమ్ముకోవద్దు.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల హెక్టార్లు, రబీలో 23.74 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ఉత్పత్తులన్నింటికీ కనీస మద్దతు ధర లభించింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రబీలో అపరాల సాగు బాగా పెరిగింది. ఇప్పుడిప్పుడే పంట దిగుబడి చేతికి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంది. పప్పు ధాన్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినందున రైతులు ఈసారి గిట్టుబాటు ధరలకు అపరాలను అమ్ముకోవచ్చునని, దళారుల మాట విని తక్కువ ధరలకు అమ్ముకోవద్దని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సూచించారు. -
పంపిణీకి సర్టిఫైడ్ విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్ – 2021 సీజన్లో సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాన్ని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీఎల్) వ్యవసాయ శాఖతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17 నుంచి వేరుశనగ, 30వ తేదీ నుంచి మిగిలిన విత్తనాలను పంపిణీ చేయబోతున్నారు. సీజన్ ఏదైనా సరే స్థానిక లభ్యతను బట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తుంటారు. సకాలంలో సబ్సిడీ విత్తనం దొరక్క దళారీలు, ప్రైవేటు ఏజెన్సీల ఉచ్చులో పడి రైతులు ఏటా వందల వేల కోట్ల రూపాయల పెట్టుబడిని నష్టపోయేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గత రెండేళ్లుగా సకాలంలో ప్రభుత్వం నాణ్యమైన విత్తనాన్ని అందించడమే కాకుండా ప్రైవేటు ఏజెన్సీలపై నిఘా ఉంచడంతో ‘నాసి రకం’ అనే మాట విన్పించలేదు. ఖరీఫ్ సీజన్లో 92.45 లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 41.20 లక్షల ఎకరాల్లో వరి, 18.02 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 7.60 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. సీజన్ కోసం 7,91,439 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, లక్ష్యానికి మించి 7,98,125 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన 85 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట (జనుము, పిల్లిపెసర, జీలుగు) విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు ఆర్బీకేల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విత్తనోత్పత్తి, పంపిణీలో మరిన్ని సంస్కరణలు 2021–22 వ్యవసాయ సీజన్ నుంచి విత్తన పంపిణీలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సీజన్ ప్రారంభం కాకుండానే కావాల్సిన విత్తనాన్ని సేకరించి ప్రాసెస్ చేసి, పరీక్షించి సర్టిఫై చేసి ఆర్బీకేల ద్వారా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. గతంలో ఏటా 10 వేల వరకు శాంపిల్స్ పరీక్షించే వారు. కానీ ఈ ఏడాది ర్యాండమ్‌గా 20 వేల నుంచి 25 వేల శాంపిల్స్‌ను విజయవాడ, కర్నూలులోని సంస్థకు చెందిన ల్యాబ్స్‌లో పరీక్షించి సర్టిఫై చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తన సేకరణ, ప్రాసెస్, పంపిణీ కోసం గతేడాది రూ.573 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది రూ.700 కోట్లు ఖర్చు చేస్తోంది. సబ్సిడీ కింద గతేడాది రూ.236 కోట్లు భరించగా, ఈ ఏడాది రూ.350 కోట్లు భరించేందుకు సిద్ధమైంది. తొలిసారి సొంతంగా వేరుశనగ విత్తనం చరిత్రలో తొలిసారిగా గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద క్వింటాల్‌కు రూ.6,500 చొప్పున చెల్లించి 25 వేల మంది రైతుల నుంచి 4.48 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సేకరించారు. 40 శాతం సబ్సిడీపై ఈ నెల 17వ తేదీ నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 73,449 మంది రైతులు ఆర్బీకేల్లో విత్తనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వరిలో కొత్త వంగడాలు వరి విషయానికి వస్తే డిమాండ్ ఎక్కువగా ఉన్న ఎంటీయూ 7029, 1121, 1064, 1061, బీపీటీ 5204, ఆర్జీఎల్ 2537 రకం విత్తనాలను విత్తనోత్పత్తి ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. అపరాలు 22,743 క్వింటాళ్లు, తృణ ధాన్యాలు 3,310 క్వింటాళ్లు సిద్ధం చేశారు. ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం కొత్తగా అభివృద్ధి చేసిన ఎంటీయూ 1224, ఎంటీయూ 1210, రాగి వేగావతి, కదిలి లేపాక్షి (వేరుశనగ) రకాలకు చెందిన ఫౌండేషన్ సీడ్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎకరాకు రూ.60 వేల ఆదాయం విత్తనోత్పత్తి కోసం 18 ఎకరాల్లో ఎంటీయూ 1121 రకం సాగు చేశా. 255 క్వింటాళ్ల విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు అందించా. విత్తనోత్పత్తి ద్వారా ఎకరాకు రూ.60 వేల ఆదాయం వచ్చింది. బోనస్‌గా క్వింటాల్‌కు రూ.50 వరకు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – వాళ్లి సత్యం, కొండకరకం, విజయనగరం జిల్లా గ్రామమంతా వేరుశనగ విత్తనోత్పత్తి వేరుశనగ విత్తనోత్పత్తి కోసం 20 ఎకరాల్లో కే–6 రకం సాగు చేశా. ఏపీ సీడ్స్‌కు 280 క్వింటాళ్ల విత్తనాన్ని అందించా. ఎకరాకు 80 వేల ఆదాయం వచ్చింది. మా గ్రామంలో అందరూ విత్తనోత్పత్తి చేస్తారు. ఈ ఏడాది అందరం వేరుశనగ విత్తనాన్ని సాగు చేశాం. – ఎన్.విష్ణువర్ధన్‌రెడ్డి, పులేటిపల్లి, అనంతపురం జిల్లా సర్టిఫై చేసిన విత్తనాలు సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యతకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సౌజన్యంతో ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. మే 17 నుంచి వేరుశనగ, మే 30 నుంచి మిగిలిన విత్తనాలు పంపిణీ ప్రారంభిస్తాం. – డి.శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ -
17 నుంచి రైతులకు విత్తనాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో వివిధ పంటలకు సంబంధించి 7.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఈ నెల 17వ తేదీ నుంచి రైతులకు సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ పనులు, సరుకుల రవాణాకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్నందున పూర్తి జాగ్రత్తలతో చేసుకోవాలని సూచించారు. ఖరీఫ్‌కు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, రైతులకు ఇచ్చే విత్తనంతో పాటు ప్రతి ఒక్కటీ నాణ్యతగా ఉండాలని, ఇది మనం వారికి ఇచ్చిన హామీ అని స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పథకం కింద జూన్ చివరిలోగా ప్రతి జిల్లాల్లో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలని ఆదేశించారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్ష వివరాలు ఇవీ.. చెక్ చేయండి... గ్రామాల్లో రైతులకు అండగా ఉండేలా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కలెక్టర్లు, జేసీలు ఆర్బీకేలను ఓన్ చేసుకుని రైతులకు సేవలందించాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, స్టాక్ పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వ్యవసాయ సలహా కమిటీలు... ప్రతి జిల్లాలో నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. వ్యవసాయ సలహా కమిటీలు వెంటనే అన్ని చోట్ల ఏర్పాటు కావాలి. పంటల ప్లానింగ్ మొదలు ప్రతి అడుగులో ఈ కమిటీలు రైతులతో కలిసి పని చేయాలి. అవసరమైతే రైతులకు ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆ కమిటీలు చూపాలి. రూ.1.13 లక్షల కోట్ల పంట రుణాలు టార్గెట్. అది సాధించాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది. ప్రతి జిల్లాలో కోటి పనిదినాలు కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మంజూరయ్యాయి. వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఇప్పటి వరకు 4.57 కోట్ల పని దినాల కల్పన మాత్రమే జరిగింది. జూన్ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి. తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు.. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణ పనులు జూన్ 1న ప్రారంభం కావాలి. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం. మిగిలినవి కోర్టు వివాదాల్లో ఉన్నందున ప్రత్యామ్నాయ నివేదికలను పీఎంఏవైకి పంపించాం. వాటికి సంబంధించి వచ్చే నెలలోగా అనుమతి వచ్చే వీలుంది. ఇళ్ల నిర్మాణాల సన్నాహక పనులను ఈనెల 25వ తేదీలోగా కలెక్టర్లు తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (ఎకానమీ బూస్టప్) మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాలు, వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది. 8,679 లేఅవుట్లలో నీటి సదుపాయాన్ని డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో సమన్వయం చేసుకుని ఈనెల 31లోగా పూర్తి చేయాలి. ఎక్కడైనా నోడల్ అధికారుల నియామకం జరగకపోతే ఈనెల 15లోగా పూర్తి చేయాలి. నిరాటంకంగా ఇళ్ల నిర్మాణం జరిగేందుకు తగినంత ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలి. ఇళ్ల స్థలాలు.. ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,19,053 అర్హులైన లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 98,834 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి. 10,752 మందికి ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 1,520 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. ఇక మిగిలిన 1,06,781 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చొరవ చూపండి. వేగంగా భవన నిర్మాణాలు.. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్సార్ గ్రామీణ, పట్టణ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణాలను, నాడు–నేడు కింద అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలను, ఆధునీకరణ పనులను పూర్తి చేయడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెలలో అందించే సాయం ► మే 13న వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు రూ.7,500 చొప్పున ఖాతాల్లో జమ. ఖరీఫ్‌లో సాగు పెట్టుబడి కింద సాయం. ► మే 25న ఖరీఫ్–2020కి సంబంధించిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు చెల్లింపు. ► మే 18న వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున సహాయం (చేపలవేట నిషేధ సాయం) ఆ ఏడు.. చాలా ముఖ్యం స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి. లేకపోతే మనం ఆ సమయం నిర్దేశించుకుని ఏం ప్రయోజనం? గత ఏడాది జూన్ 9 నుంచి ఈనెల 10వ తేదీ వరకు స్పందనలో 2,25,43,894 ఫిర్యాదులు, అర్జీలు రాగా 85 శాతం సకాలంలో పరిష్కరించగలిగాం. ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు. శానిటేషన్, వీధి దీపాలు, తాగు నీటితో పాటు ఇంటి స్థలం.. ఈ ఏడు మనకు చాలా ముఖ్యం. -
ఏపీ: ఎరువుకు రాదు కరువు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సాగువేళ రైతు ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెలలో వైఎస్సార్ రైతుభరోసా మొదటి విడత సొమ్ము, వైఎస్సార్ ఉచిత పంటల బీమా సొమ్ము దాదాపు రూ.6,230 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్‌లో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఈనెల 13న వైఎస్సార్ రైతుభరోసా కింద 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,230 కోట్లను ప్రభుత్వం జమచేయనుంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా – 2020 ఖరీఫ్‌కు సంబంధించి 38 లక్షల మంది రైతులకు ఈనెల 25న సుమారు రూ.2 వేల కోట్లు సొమ్ము ఇవ్వనుంది. సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతలకు సబ్సిడీ విత్తనాల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఖరీఫ్ సాగులో ఎంతో కీలకమైన ఎరువులకు కొరత లేకుండా పటిష్టమైన ప్రణాళిక రూపొందించింది. గతంలో సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా.. అదును దాటకముందు ఎరువులు అందుతాయో లేదో అనే ఆందోళనతో అన్నదాతలు కొట్టుమిట్టాడేవారు. కానీ ప్రస్తుతం సీజన్‌కు ముందే స్థానికంగా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కావాల్సిన ఎరువులను క్షేత్రస్థాయిలో నిల్వ చేస్తుండడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 20.20 లక్షల టన్నుల కేటాయింపు ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 92.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం 21.70 లక్షల మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఎరువులు అవసరమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం 20.20 లక్షల ఎంటీలు కేటాయించింది. వీటిని నెలవారీ డిమాండ్‌కు అనుగుణంగా ఆయా కంపెనీల ద్వారా కేటాయించనుంది. కోవిడ్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఎరువుల దిగుమతులపై ఆంక్షలు విధించే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 1.50 లక్షల టన్నుల ఎరువుల కొనుగోలుకు.. ఎరువుల పంపిణీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.75 కోట్లు విడుదల చేసింది. ముందస్తుగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను నాలుగంచెల çపద్ధతిలో క్షేత్రస్థాయిలో నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థాయిలో ఒక్కో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) వద్ద కనీసం 5 టన్నులు నిల్వచేస్తారు. ఇందుకోసం ఏపీ మార్క్‌ఫెడ్ వద్ద 40 వేల టన్నులు సిద్ధం చేస్తున్నారు. మండల స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు)/జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల్లో కనీసం 40 వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేయనున్నారు. ఇక సబ్ డివిజన్ స్థాయిలో ఆర్బీకే హబ్‌లలో 20 వేల టన్నులు నిల్వచేస్తారు. జిల్లాస్థాయి మార్క్‌ఫెడ్ గొడౌన్లలో 50 వేల టన్నులు, రిటైలర్, హోల్‌సేల్ డీలర్ల వద్ద 5 లక్షల టన్నులు, కంపెనీ గోదాముల్లో 1.50 లక్షల టన్నుల ఎరువులను నిల్వచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఆర్బీకేల వద్ద గ్రామస్థాయిలో ఖరీఫ్ కోసం కనీసం 2 లక్షల టన్నులు (యూరయా 85 వేల టన్నులు, డీఏపీ 28 వేల టన్నులు, ఎంవోపీ 9 వేల టన్నులు, కాంప్లెక్స్ 78 వేల టన్నులు) ఉంచాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్లకు నిర్దేశించారు. అవసరమైనచోట ఆర్బీకేల ద్వారా ఎక్కువ పరిమాణంలో రైతులకు ఎరువులను అందించేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ స్థాయిల్లో గోడౌన్లలో ముందస్తుగా నిల్వచేసే ఎరువుల నమూనాలను ల్యాబొరేటరీల్లో పరీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని జేడీలకు ఆదేశాలిచ్చారు. చరిత్రలో తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకనుగుణంగా చరిత్రలో తొలిసారి ఖరీఫ్ సీజన్లో సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువులను ఆర్బీకే స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నాం. మార్కెట్ ధరల కంటే తక్కువకే లభ్యం కానున్నాయి. బహిరంగ మార్కెట్లో కృత్రిమ ఎరువుల కొరత, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
శివారు భూములకూ నీటి నెలవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులతోపాటు ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు అంతటికీ సమృద్ధిగా సాగునీరు అందించడంపై జల వనరుల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. డిజైన్ చేసిన మేరకు కాలువల ప్రవాహ సామర్థ్యం ఉందా.. తగ్గిందా.. అనే అంశాన్ని పరిశీలించేందుకు అధునాతన ఏడీసీపీ (అకాస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్) పరికరాన్ని వినియోగిస్తున్నారు. కాలువల ప్రవాహ సామర్థ్యం డిజైన్ చేసిన దానికంటే తక్కువగా ఉన్నట్టు తేలితే.. పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధాన కాలువలు, ఉప కాలువలతోపాటు డి్రస్టిబ్యూటరీలకూ ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కడా) నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. తద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. చివరి భూములకు సులభంగా నీళ్లందేలా చేస్తారు. ప్రవాహ సామర్థ్యం తగ్గడం వల్లే.. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ కాలువ కింద తెలంగాణ పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6.57 లక్షల ఎకరాలు.. ఏపీలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3.82 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువను ఆధునికీకరించే పనులు కూడా పూర్తయ్యాయి. అయినా.. శివారు ఆయకట్టు భూములకు నీళ్లందించడం కష్టంగా మారింది. ప్రవాహ నష్టాలు 40 శాతం ఉన్నాయని తెలంగాణ వాదిస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 27 శాతానికి మించవని ఏపీ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని లెక్కించేందుకు ఈ ఏడాది ఏడీసీపీ పరికరాన్ని జల వనరుల శాఖ అధికారులు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుకు చేరే నీటిని ఎప్పటికప్పుడు లెక్కించి.. ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉంటే డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను చేపడతారు. తద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలతో పాటు శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ), తెలుగు గంగ, హెచ్చెల్సీ (తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ), వంశధార, తోటపల్లి వంటి భారీ ప్రాజెక్టులతోపాటు చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద కాలువల సామర్థ్యాన్ని కూడా ఇదే రీతిలో మదింపు చేసి.. డిజైన్ మేరకు ప్రవాహం ఉండేలా చర్యలు చేపట్టారు. ఖరీఫ్ మొదలయ్యేలోగా.. ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోగా భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద కాలువలు, డి్రస్టిబ్యూటరీల మరమ్మతు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కడాను ఆదేశించింది. దీంతో ఆయకట్టు వ్యవస్థపై సమగ్రంగా సర్వే చేసి, మరమ్మతులు చేపట్టాల్సిన పనులను గుర్తించాలని 13 జిల్లాల చీఫ్ ఇంజనీర్లకు కడా సూచించింది. ఇందుకు సంబంధించి చీఫ్ ఇంజనీర్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన కడా ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ప్రాజెక్టుల్లోకి నదీ జలాలు చేరేలోగా మరమ్మతులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. తద్వారా నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేస్తోంది. -
ఆర్బీకేలకు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డు
సాక్షి, అమరావతి: సాగులో మెళకువలు, సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రాలను గతేడాది మే 30న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన 10,725 ఆర్బీకేలు, 154 ఆర్బీకే హబ్‌ల ద్వారా గడచిన 11 నెలలుగా వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు సేవలందుతున్నాయి. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను స్కోచ్ సంస్థకు సమర్పించారు. ఇందులో భాగంగా మన రాష్ట్రం నుంచి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వాటి ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలు రైతులకు అందిస్తున్న సేవల వివరాలను వ్యవసాయ శాఖ సమర్పించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్బీకేలు అందిస్తున్న సేవలను గుర్తించిన స్కోచ్ సంస్థ వైఎస్సార్ ఆర్బీకేలకు బంగారు పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని శనివారం ఆ సంస్థ వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించింది. త్వరలో ఈ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ అందుకోనున్నారు. విత్తు నుంచి విపణి వరకు.. విత్తు నుంచి విపణి వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు ఉత్పాదక సేవలందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీకేలు వ్యవసాయ, అనుబంధ రంగాలైన ఉద్యాన, పట్టు, పాడి, ఆక్వా రంగాల సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. వన్‌స్టాప్ షాప్ కింద ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కియోస్‌్కల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతోపాటు ఆక్వా, పాడి రైతులకు అవసరమైన సీడ్, ఫీడ్ కూడా అందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా పొలం బడులు, తోట బడులు, మత్స్య సాగుబడులు, పశు విజ్ఞాన బడులు నిర్వహిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు అవసరమైన శాస్త్ర, సాంకేతిక సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. నాలెడ్జ్ హబ్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆర్బీకేల్లో లైబ్రరీలు ఏర్పాటు చేయడంతో పాటు వైఎస్సార్ రైతు భరోసా మాసపత్రికను తీసుకొస్తున్నారు. ఇటీవలే దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ఆర్బీకే యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. మరోవైపు ఖరీఫ్ సీజన్ నుంచి గ్రామ స్థాయిలోనే పంటల కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. కొనుగోలు చేసిన ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఆర్బీకే స్థాయిలో 2,587 గొడౌన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు అద్దెకు సాగు యంత్రాలను అందుబాటులో తీసుకొచ్చే లక్ష్యంతో 10,285 ఆర్బీకేల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు (యంత్ర సేవా కేంద్రాలు)తో పాటు 151 హైటెక్ హై వాల్యూ మెకనైజేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుబంధంగా నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 11 వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లను తీసుకొస్తున్నారు. అలాగే 9,899 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 8,051 ఆటోమేటిక్ కలెక్షన్ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటికి అనుబంధంగా జనతా బజార్లు, కేటిల్ షెడ్స్, ఆక్వా ఇన్ఫ్రా ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా వ్యవసాయ అనుబంధ సేవలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. సాధారణంగా స్కోచ్ సంస్థ డిపార్టుమెంట్లకు మెరిట్ అవార్డులిస్తుంది. కానీ.. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రశంసలు జల్లు కురిపించడమే కాకుండా ఏకంగా గోల్డ్ మెడల్‌ను ప్రకటించడం ఆనందంగా ఉందని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఇది సీఎం మానస పుత్రికైన రైతు భరోసా కేంద్రాలకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు అన్నారు. -
కందులు.. ఆల్‌టైమ్ రికార్డు ధర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కందులు పంటకు గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో కందులు క్వింటాలుకు రూ.7,200 వరకు ధర లభిస్తోంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు కావడం విశేషం. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కందులుకు ఇంతటి ధర లభించలేదు. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో గత ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన కందులు పంట చెప్పుకోదగినంతగా దిగుబడులు రాకపోవడంతో దిగాలు పడిన రైతులకు మంచి ధర పలుకుతుండడం సంతోషాన్నిస్తోంది. కందులుకు క్వింటాలుకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ.ఆరు వేలు కాగా గత నెల వరకు మార్కెట్లో రూ.5,000 నుంచి రూ.5,600 మధ్య ధర కొనసాగింది. ఇప్పుడీ ధర అమాంతం రూ.ఏడు వేలు దాటింది. రైతుల వద్ద నుంచి కందులు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. 5,44,220 ఎకరాల్లో సాగు.. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 5,44,220 ఎకరాల్లో కందుల పంటను రైతులు సాగు చేశారు. సాధారణంగా దీన్ని అంతర పంటగా సాగు చేస్తారు. అంతర పంటగా సాగు చేస్తే ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లు, ఒకే పంటగా సాగు చేస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. గతేడాది కురిసిన అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో దిగుబడులు కాస్త తగ్గాయి. కొన్ని జిల్లాల్లో ఎకరానికి 4–5 క్వింటాళ్లు దిగుబడి రాగా, మరికొన్ని జిల్లాల్లో 3–4 క్వింటాళ్లకు మించి రాలేదు. అదే సమయంలో నాణ్యత కూడా తగ్గింది. గత డిసెంబర్ నుంచి పంట కోతలు ప్రారంభమయ్యాయి. ఈ మార్చి రెండో వారం వరకు ఇవి కొనసాగుతాయి. గత డిసెంబర్ 2వ వారం నుంచే మార్కెట్‌కు కందులు వస్తున్నాయి. వచ్చే మే నెల రెండోవారం వరకు కూడా వచ్చే అవకాశముంది. పోటీ పడి కొంటున్నారు.. కందులు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.6 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ నెలాఖరు వరకు కందులుకు మార్కెట్లో పెద్దగా రేటు లేదు. క్వింటాల్ రూ.5,000–5,600 మధ్య ఉండింది. గడిచిన నెల రోజులుగా ఊహించని రీతిలో ధర పెరగడం మొదలైంది. నాణ్యతను బట్టి రూ.6,800 నుంచి రూ.7,200కుపైగా పలుకుతోంది. రాష్ట్రంలో కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు మార్కెట్లకు పెద్ద ఎత్తున కందులు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఇస్తామంటూ వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. ప్రభుత్వ చర్యల వల్లే.. నిజానికి మూడేళ్లుగా కందులుకు మార్కెట్లో సరైన ధర పలకలేదు. అయితే కనీస మద్దతు ధరలు లభించని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఆ మేరకు గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా కందులును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయించింది. గతేడాది మార్కెట్లో కందులుకు రూ.4,500కు మించి ధర పలకలేదు. దాంతో ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,800 చొప్పున కనీస మద్దతు ధరను నిర్ణయించడమేగాక.. 394 కోట్ల రూపాయలు వెచ్చించి 61,772 మెట్రిక్ టన్నుల కందులును మార్క్‌ఫెడ్ ద్వారా గతేడాది కొనుగోలు చేసింది. అంతేగాక ఈ సీజన్లో కందులుకు కనీస మద్దతు ధరను రూ.6 వేలుగా నిర్ణయించి.. అంతకన్నా తక్కువకు విక్రయించవద్దని, ఒకవేళ మార్కెట్లో ధర పెరగకుంటే ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొంటుందని రైతులకు అభయమిచ్చింది. ఇది రైతుల్లో భరోసాను నింపగా.. వ్యాపారుల్లో పోటీని పెంచింది. ఈ నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటుండడంతో కందులుకు రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ధర ఇలా పెరగడం ఇదే తొలిసారి.. నా పొలంలో పూర్తి కంది పంట సాగు చేశా. మొన్నటిదాకా క్వింటాలు ధర రూ.5,600కు మించి పలకలేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.6000గా ప్రకటించింది.. కంగారు పడొద్దు.. మార్కెట్లో రేటు పెరుగుతుంది.. ఒకవేళ పెరగకపోతే కనీస మద్దతు ధరకు కొంటామని అధికారులు చెప్పారు. ఆ మేరకు ఓపిక పట్టాం. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.7,200 ధర పలుకుతోంది. దిగుబడి తగ్గినా.. ధర పెరగడంతో ఊరట లభించింది. ఈ ధర ఇలాగే ఉంటే రైతుకు గిట్టుబాటవుతుంది. –సి.వలీసాహెబ్, చింతకుంటపల్లి, చాపాడు మండలం, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే రైతుకు మంచి ధర... ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మార్కెట్లో కందులు, పెసలు ధరలు పెరుగుతున్నాయి. కనీస మద్దతు ధర దక్కని ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. ఈ కారణంగానే వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడుతోంది. ఈ కారణంగానే కందులు క్వింటాలు ధర రూ.7,200కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు. –పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
పరుగులు పెడుతున్న పోలవరం పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఫలాలను 2022 ఖరీఫ్‌లో రైతులకు అందించే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హెడ్ వర్క్స్ (జలాశయం), కుడి, ఎడమ కాలువలను 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీల)ను ఆలోగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. డిస్ట్రిబ్యూటరీల పనులకు సంబంధించి ఇప్పటికే సర్వేను పూర్తి చేశారు. బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల అలైన్మెంట్ మేరకు ఎక్కడెక్కడ ఎంత భూమి సేకరించాలో తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిపై స్పష్టత వచ్చాక భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. భూసేకరణకు సమాంతరంగా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు నిర్వహించి, వాటిని కాంట్రాక్టర్లకు అప్పగించడానికి కసరత్తు చేస్తున్నారు. (చదవండి: పోలవరంపై సానుకూలం) యాక్షన్ ప్లాన్ మేరకు వేగంగా పనులు ►పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2021 డిసెంబర్ కల్లా ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) మేరకు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువలు, పునరావాసం కల్పన పనులను వేగవంతం చేసింది. ►2021 మే నాటికి స్పిల్ వే, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. వాటికి సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టాలని అధికారులకు నిర్దేశించింది. ►2021 జూన్‌లో గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, ఈసీఆర్ఎఫ్ పనులను వరద సమయంలోనూ కొనసాగించడం ద్వారా వచ్చే డిసెంబర్ నాటికి జలాశయం పనులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆలోగా జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీలు (అనుసంధానాలు), ప్రధాన కాలువల పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. ►పోలవరం కుడి కాలువ ద్వారా పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాల్సి ఉంది. అలాగే కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలి. ఎడమ కాలువ కింద తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ►ఆయకట్టుకు నీళ్లందించాలంటే ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువలు తవ్వాలి. కానీ.. గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీలపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కనీసం సర్వే పనులు కూడా చేపట్టలేదు. దీంతో ప్రాజెక్టు పనులకు సమాంతరంగా డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో అధికారులు ఈ మేరకు సర్వే పనులు పూర్తి చేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నారు. -
నైరుతి రాగం.. రైతుకు లాభం
సాక్షి, అమరావతి: ఊహించిన దాని కంటే అధిక వర్షాలు కురిపించిన నైరుతి రుతు పవనాలు అన్నదాతల్లో సంతోషాన్ని నింపాయి. వాతావరణ శాఖ అంచనాల కంటే ఈసారి రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌తోపాటు అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, కుందూ, వంశధార, మహేంద్ర తనయ నదుల్లో వరద పోటెత్తడంతో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. గత ఖరీఫ్‌తో పోలిస్తే.. ప్రస్తుత సీజన్లో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. జూన్ 1న ఆరంభమైన ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (నైరుతి రుతు పవనాల కాలం) బుధవారంతో ముగియనుంది. ► నైరుతి సీజన్లో శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో సాధారణ, అధిక వర్షపాతం నమోదైంది. ► రాష్ట్రంలో సాధారణ సగటు వర్షపాతం 549.1 మిల్లీమీటర్లు కాగా.. ప్రస్తుత సీజన్లో 691.6 మిల్లీమీటర్ల (26 శాతం అధికం) వర్షపాతం నమోదైంది. ► మొత్తం 670 మండలాలకు గాను 437 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ► 173 మండలాల్లో సాధారణ.. 57 మండలాల్లో లోటు, 3 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ► వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 76.3 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పెరిగిన సాగు ► మంచి వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత ఏడాది ఖరీఫ్‌లో 32.64 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా.. ఈ ఏడాది ఈ నెల 23వ తేదీ నాటికే సాగు విస్తీర్ణం 34.05 లక్షల హెక్టార్లకు చేరింది. ► వారం రోజుల్లో సాగులోకి వచ్చే పంటల్ని చేరిస్తే సాగు విస్తీర్ణం 35 లక్షల హెక్టార్లకు చేరుతుందని అంచనా. ► గత ఏడాది 5.30 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయగా.. ఈ ఏడాది ఈ నెల 23వ తేదీ నాటికే 6.62 లక్షల హెక్టార్లకు చేరింది. ► గత ఖరీఫ్‌లో 13.71 లక్షల హెక్టార్లలో వరి సాగవగా.. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 14.35 లక్షల హెక్టార్లకు చేరింది. ► నూనెగింజల సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌లో 5.81 లక్షల హెక్టార్లు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 7.16 లక్షల హెక్టార్లకు పెరిగింది. -
మద్దతు ధర ఇవ్వాల్సిందే
ఈ ఖరీఫ్‌లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత లేకపోవడంతో, వ్యవసాయ ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ఏ ఒక్క రైతు నష్ట పోకుండా చూడాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న తరహా ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఏ సమస్యలు రాకూడదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 93.61 లక్షల టన్నుల ఉత్పత్తి (వివిధ పంటలు) జరుగుతుందని అంచనా కాగా, 62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ అన్ని విధాలా సహాయకారిగా ఆర్బీకేలు ► పంటల ఈ–క్రాపింగ్‌తో పాటు, రైతుల పేర్లు నమోదు, ధాన్యం సేకరణపై సమాచారం.. ఇతరత్రా ఏదైనా సరే, ఆర్బీకేల (రైతు భరోసా కేంద్రాలు) స్థాయిలోనే జరగాలి. ప్రతి ఆర్బీకే వద్ద పంటల కనీస గిట్టుబాటు ధరల (ఎమ్మెస్పీ) పట్టికను ఒక పెద్ద ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శించాలి. గ్రామాల్లో రైతులకు ఆర్బీకేలు అన్ని విధాలుగా పూర్తి సహాయకారిగా ఉండాలి. ► ఏ పంట వేస్తే బాగుంటుంది? ఎంత ఆదాయం వస్తుంది? ఆర్బీకేల ద్వారా ఏ పంటలు సేకరిస్తామన్నది రైతులకు ముందుగానే చెప్పాలి. ఆ తర్వాత కచ్చితంగా ధరలు వచ్చేలా చూడాలి. సాగు నీటి సరఫరాను దృష్టిలో ఉంచుకుని, రైతులకు అవగాహన కల్పించాలి. ఇది జరగకపోతే జేసీలదే బాధ్యత. ► స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. ఈ దిశగా ఇప్పటికే సలహా కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ► ప్రతి పంట ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం కావాలి. అప్పుడే ఆ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. బయటి మార్కెటింగ్‌లోనూ అవకాశం కల్పించాలి. ► బహిరంగ మార్కెట్లో పంటల కొనుగోలుదారుల (వ్యాపారుల) వివరాల డేటాను ఈ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్బీకేకు అనుసంధానం చేయాలి. ► ఎఫ్ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) కంటే తక్కువ నాణ్యతతో సేకరించే బియ్యాన్ని (నూకలు) రవ్వ, పిండి తదితర అవసరాలకు వినియోగించుకునే విషయం పరిశీలించాలి. పంటల ఉత్పత్తి సేకరణకు సంబంధించి ఎస్ఓపీ ఖరారు చేయాలి. పత్తి కొనుగోళ్లు.. మార్కెటింగ్ ► వీలైనంత వరకు ఎక్కువగా పత్తి కొనుగోలు చేయాలి. గత ప్రభుత్వ హయాంలో పత్తి కొనుగోళ్లలో అవినీతి చోటు చేసుకుంది. ఇప్పుడు ఎక్కడా అలాంటి వాటికి తావుండకూడదు. ► మార్కెటింగ్ విభాగం (మార్క్‌ఫెడ్) గ్రామాల్లో రైతుల నుంచి 30 శాతం ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు, మిగిలిన 70 శాతం ఉత్పత్తులు కూడా అమ్ముడుపోయేలా చూడాలి. పది రకాల పంటల సేకరణ ► ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల రిజిస్ట్రేషన్, సేకరణ, పేమెంట్లు మొత్తం ప్రక్రియ “సీఎం యాప్’ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్–సీఎం ఏపీపీ) ద్వారా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ► ఆర్బీకేల వద్ద ముందుగానే రైతుల పేర్లు నమోదు చేసుకుని.. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, రాగులు, చిరు ధాన్యాలు, వేరుశనగ, పత్తి, కందులు, పెసర్లు, మినుముల వంటి మొత్తం 10 రకా«ల పంటల సేకరణకు సిద్దమవుతున్నామని చెప్పారు. మొత్తం 3 వేల కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. ► ఈ సమీక్షలో మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఖరీఫ్‌లో దాదాపు రూ.3,300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు (వాల్యూ యాడెడ్), ఫుడ్ ప్రాసెసింగ్ వంటి చర్యల ద్వారా రైతులకు మరింత మేలు చేయాలి. 2019–20 రబీ సీజన్లో కందులు, శనగలు, మొక్కజొన్న, జొన్న, పసుపు, ఉల్లిపాయలు, అరటి పండ్లు, బత్తాయిలు, టమాటా, పొగాకు తదితర వ్యవసాయ ఉత్పత్తులను దాదాపు రూ.3,200 కోట్లతో కొనుగోలు చేశాం. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచాం. -
ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం
ముంబై: దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన రుతుపవనాలు, మంచి వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల ఉత్పత్తి భారీగా పెరగనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడి 5–6 శాతం ఎక్కువగా ఉంటుందని, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో, ఉత్పాదకత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయం బలంగా ఉండడం అన్నది కరోనాతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ 21 నాటికి దీర్ఘకాల సగటు కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు.. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పంటల విత్తుకు దోహపడినట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. ఖరీఫ్ సీజన్ 2020లో 109 మిలియన్ హెక్టార్లలో 2–3 శాతం అధికంగా విత్తు వేయడం ఉంటుందని పేర్కొంది. వరి సాగు పెరగనుందని, మంచి వర్షాలకు తోడు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసపోవడం దోహదపడే అంశాలుగా తెలిపింది. లాభదాయకత కూడా ఎక్కువే.. కరోనా కారణంగా సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు అధికంగా పాడైపోయే గుణమున్న టమాటా వంటి వాటికి బదులు తక్కువ పాడైపోయే స్వభావం కలిగిన వంకాయ, బెండకాయ వంటి పంటలకు మళ్లినట్టు క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగు భారీగా పెరగడం వల్ల పలు నిత్యావసర వస్తువల ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు లాభదాయకత మొత్తం మీద 3–5% అధికం కానుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. సాగు విస్తీర్ణంపెరగడం, అధిక ఉత్పాదకత, కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ కొనుగోళ్లు మద్దతునిస్తాయని వివరించింది. యాపిల్ సాగులో లాభదాయకత మెరుగుపడుతుందని, పత్తి, మొక్కజొన్న ధరలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఏపీ తదితర రాష్ట్రాల్లో జోరుగా వరిసాగు కార్మికులు వలసపోవడం వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులే నేరుగా విత్తనాలను వేయనున్నారు. ఇది తక్కువ ఉత్పాదకతకు దారితీయనుంది. కానీ, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కార్మికులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల విత్తడంలో వృద్ధి కనిపించనుంది. దీంతో మొత్తం మీద గతేడాది కంటే ఖరీఫ్ సీజన్ 2020లో వరి ఉత్పాదకత పెరగనుంది. ఉత్తర భారత రైతులకు ఖరీఫ్ సీజన్ 2020 ఎంతో లాభాన్ని మిగల్చనుంది. పంటల సాగు మిశ్రమంగా ఉండడానికి తోడు ప్రభుత్వ కొనుగోళ్లు అధికంగా ఉండడం వల్లే ఇది సాధ్యం కానుంది. – హేతల్ గాంధీ, క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ -
కావాల్సినంత కరెంట్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. రబీ నాటికి వ్యవసాయానికి 9 గంటల పగటి విద్యుత్‌ను వందశాతం ఫీడర్ల ద్వారా ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంధనశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఏపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ► రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలో నిర్వహణ లోటుపాట్లకు సంబంధించి చీఫ్ ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కీలకమైన పవర్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పరికరాలలో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలి. ► రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయానికి 9 గంటల పగటి పూటే విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఖరీఫ్‌లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరుగుతుందనే అంచనాలకు అనుగుణంగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు çచేసుకోవాలి. ► వర్షాకాలంలో మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడకుండా చూడాలి. బ్రేక్ డౌన్ సమయంలో తక్షణ విద్యుత్తు పునరుద్ధరణకు వీలుగా విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. ► సబ్ స్టేషన్లు, జిల్లా వారీగా పనితీరు స్కోర్ నమోదు చేసి ర్యాంకులివ్వాలి. సమీక్ష సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, విజిలెన్స్ జేఎండీ కే వెంకటేశ్వరరావు, పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హెచ్ హరనాథ రావు, జె పద్మ జనార్దన రెడ్డి పాల్గొన్నారు. -
ఖరీఫ్ సీజన్‌కు వరి విత్తనాలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన వివిధ రకాల వరి విత్తనాలను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. ఈ సీజన్‌కు ఎన్ని ఎకరాలకు, ఎన్ని వరి విత్తన రకాలను సిద్ధం చేశారన్న వివరాలను విత్తనాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి శుక్రవారం నివేదించింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారని సర్కారు అంచనా వేసిన నేపథ్యంలో ఆ మేరకు అన్ని రకాల విత్తనాలను ఆ సంస్థ అందుబాటులో ఉంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వీటిని సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. 67.78 లక్షల ఎకరాలకు సరిపోను..... రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ సీజన్లో 67.78 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం 19.72 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 13 రకాల వరి విత్తనాలను అందుబాటులో ఉంచారు. అందులో అత్యధికంగా ఎంటీయూ–1010 కాటన్ దొర సన్నాల వరి రకం విత్తనాలను 5 లక్షల క్వింటాలు సిద్ధం చేసి ఉంచారు. అవి 16 లక్షల ఎకరాలకు సరిపోతాయని నివేదికలో పేర్కొన్నారు. బీపీటీ–5204 సాంబ మసూరి రకం విత్తనాలను 4.80 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేశారు. అవి 15.90 లక్షల ఎకరాలకు సరిపోతాయి. 13 రకాల వరి విత్తనాల్లో ఈ రెండు రకాలే సగం ఉండటం విశేషం. ఈ రెండు రకాలపైనే రైతులు ఆసక్తి చూపుతారని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అందుబాటులో ఉన్న వరి విత్తన రకాలు -
విత్తనాలు రెడీ
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో రైతులకు సబ్సిడీపై ఇచ్చే విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ నెల 18 నుంచి విత్తనాలు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇ–క్రాప్ బుకింగ్ ఆధారంగా విత్తనాలు సరఫరా చేస్తారు. రైతులు గ్రామ సచివాలయాల్లో డబ్బు చెల్లించి రాయితీ పొందవచ్చు. సబ్సిడీ వర్తించని వారు పూర్తి మొత్తాన్ని చెల్లించి విత్తనాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ, 2,28,732 క్వింటాళ్ల వరి, 83,215 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలు వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. సబ్సిడీ ఇలా.. ► 13 రకాల వరి వంగడాలను 9 జిల్లాలకు కేటాయించారు. ఈ విత్తనాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీ ఉంటుంది. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రైతులు సొంతంగా విత్తనం తయారు చేసుకుంటారు కాబట్టి ఆ జిల్లాలకు తక్కువ కేటాయించారు. ► గ్రామ సచివాలయాల్లో రైతులు నిర్ధేశించిన సొమ్ము చెల్లించి రశీదును గ్రామ వ్యవసాయ సహాయకులకు చూపి విత్తనాల్ని పొందవచ్చు. ► జాతీయ ఆహార భద్రత మిషన్ కింద గుర్తించిన జిల్లాలకు, గుర్తించని జిల్లాలకు సబ్సిడీలో తేడా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)లో ఉన్నాయి. ► కే–6, ఇతర రకాల వేరుశనగ విత్తనాల ధరను క్వింటాల్‌కు రూ.7,850గా నిర్ణయించారు. దీనిపై 40 శాతం పోను రైతులు క్వింటాల్‌కు రూ.4,710 చెల్లించాలి. ► పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసే జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలపై 50 శాతం సబ్సిడీ ఉంటుంది. -
ధాన్యం కొనుగోళ్లు.. లక్ష్యం చేరేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబం ధించి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుతాయా.. అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సారి ధాన్యం దిగుబడులు భారీగా ఉంటాయని సేకరణకు 3,700 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత 3 నెలల కాలంలో 3,658 కేంద్రాల ద్వారా 40 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయింది. 15, 20 రోజుల్లో ఖరీఫ్ ముగియనుంది. మరో 16 లక్షల టన్నుల సేకరణ చేయాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా నుంచి 7.20 లక్షల టన్నుల మేర ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. 5 లక్షల టన్నుల మేర సేకరణ జరిగింది. గరిష్టంగా మరో 50 వేల టన్నులు సేకరించినా, మిగతా లక్ష్యాలు చేరుకోవడం కష్టమే. అంచనాలు తప్పాయా..? వ్యవసాయ శాఖ లెక్కలు అంచనాలు తప్పాయా? లేక మిల్లర్లతో కుమ్మౖక్కై అధికారులు ఏమైనా తప్పుడు అంచనాలు రూపొందిం చారా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో జిల్లాకు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గంలో ధాన్యం తీసుకొచ్చి, ఇక్కడి కేంద్రాల్లో అమ్మేవారు. ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పోలీసు శాఖ సాయంతో కట్టడి చేశారు. ఈ చర్యల కారణంగా కొనుగోళ్లు ఏమైనా తగ్గాయా? అనే దానిపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. ఇక జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ అంచనాలకు తగ్గట్లుగా ధాన్యం సేకరణ జరగడం లేదు. అయితే ఖరీఫ్ ఆలస్యమైనందున ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని, ఈ 15 రోజుల్లో ఉధృతంగా కొనుగోళ్లు ఉంటాయని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎంత నిజముందో ఈ నెలాఖరుకు తేలిపోనుంది. -
2,252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సాక్షి, అమరావతి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 2,252 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు పౌర సరఫరాల సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఖరీఫ్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,815, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,765 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ధరను కేంద్రం మరికొంత పెంచొచ్చని ఓ అధికారి తెలిపారు. కనీస మద్దతు ధర కంటే మార్కెట్లో ఎక్కువ ధర ఉంటే రైతులు బయట కూడా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యానికి తేమ శాతం కొలిచే మీటర్లు, బరువు తూచే యంత్రాలు, టార్పాలిన్లు, తూర్పారపట్టే యంత్రాలు, తదితర వాటిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటివరకు 9.63 లక్షల మంది రైతులు పేర్లను నమోదు చేసుకున్నారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు –కోన శశిధర్, ఎక్స్అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ రైతులు దళారుల బారిన పడి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలి. దీనివల్ల రైతులకు మద్దతు ధర కూడా లభిస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 2,252 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. అవసరమైతే కేంద్రాలను పెంచుతాం. ఎక్కువ ధర ఇస్తామని చెప్పి కొందరు దళారులు తూకాల్లో మోసం చేసే ప్రమాదం ఉంది. మోసం చేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక అధికారులకు తెలపాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తాం. -
చినుకు చక్కగా..
సాక్షి, అమరావతి: జూన్ 1న మొదలైన ఖరీఫ్ (సార్వా) సీజన్ సెప్టెంబర్ 30తో ముగిసింది. నైరుతి రుతు పవనాలు కూడా సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసినట్లే లెక్క. సాంకేతికంగా చూస్తే.. రుతు పవనాలు దాటిపోవడానికి వారం అటూ ఇటూ పట్టవచ్చు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆరంభంలో కొంత నిరాశ కలిగించినప్పటికీ చివరకు వచ్చేసరికి సంతృప్తి మిగిల్చాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన దానికంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం.. మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. నైరుతి సీజన్లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 514.4 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది ఈ సీజన్లో 565.2 మిల్లీమీటర్ల వర్షపాతం (10 శాతం అధికం) నమోదైంది. వాతావరణ శాఖ 50 ఏళ్ల సగటు వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తుంది. దీనికంటే 19 శాతం ఎక్కువ కురిసినా, తక్కువ కురిసినా సాధారణ వర్షపాతంగానే పేర్కొంటుంది. సాధారణం కంటే 20 శాతం తక్కువైతే లోటు వర్షపాతంగా, ఎక్కువైతే అధిక వర్షపాతంగా గుర్తిస్తుంది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే 12 శాతం, కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో 9 శాతం అధిక వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో 556.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 676.4 మిల్లీమీటర్లు (22 శాతం అధికం) వర్షపాతం రికార్డయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో 728.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికి గాను 874 మిల్లీమీటర్లు (20 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లలో జలకళ ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో అనుకున్న వర్షపాతం నమోదు కావడంతోపాటు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార నదుల్లో వరద నీరు పోటెత్తింది. ఫలితంగా శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగుకు, భూగర్భ జలమట్టం పెరుగుదలకు ఇది బాగా దోహదపడుతోంది. ఈ వర్షాలు రబీలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు కూడా బాగా ఉపకరిస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సాగు.. బాగు సెప్టెంబర్ 30తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాలన్నది లక్ష్యం. ఈ లెక్కన జూన్ 1నుంచి సెప్టెంబర్ 25 నాటికి 38.30 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 35.26 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సీజన్ మొత్తమ్మీద చూస్తే.. సెప్టెంబరు 25వ తేదీ వరకూ గణిస్తే 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. దీని ప్రకారం చూస్తే ఈ సీజన్లో సాగు సంతృప్తికరంగా ఉన్నట్లే. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్ ఆరంభం నుంచి రెండు నెలలు సరైన వర్షం కురవకపోవడం వల్ల నిర్ణయించిన సాగు లక్ష్యంలో 93 శాతం విజయవంతమైంది. -
‘వరి’వడిగా సాగు...
సాక్షి నెట్వర్క్: ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వరి సాగుపై సందేహాలు నెలకొన్నాయి. సరిపడా వర్షాలు లేకపోవడంతో రైతులు ఈ పంట సాగుపై ఆశలు వదులుకున్నారు. దీంతో సీజన్ మధ్యలోకి వచ్చేసరికి కూడా వరి సాధారణం కంటే చాలా తక్కువగా సాగులోకి వచ్చింది. కురవబోయే వర్షాలను నమ్ముకుని అక్కడక్కడా నాట్లు వేసిన పరిస్థితి.. కానీ, పదిహేను రోజుల క్రితం కురిసిన వర్షాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వరినాట్లు రికార్డు స్థాయిలో పడ్డాయి. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో నాట్లు పడుతున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీ వరకు నమోదైన గణాంకాలను బట్టి.. తెలంగాణలో ఈ ఖరీఫ్‌లో వరి గత విస్తీర్ణపు రికార్డులను మించి సాగవుతోందని తేలింది. ఇంత భారీ విస్తీర్ణంలో వరి సాగు కావడం ఇదే ప్రథమమని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు పత్తి అత్యధికంగా సాగులోకి రాగా, వరి తరువాత స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో వరి అత్యధికంగా సాగవుతోంది. ఈ జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణానికి మించి సాగు (5,03,038 ఎకరాలు)లోకి రావడం విశేషం. నిజామాబాద్ (4,92,831 ఎకరాలు), నల్లగొండ (4,78,275 ఎకరాలు) జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఈ పంట సాగు (61,435 ఎకరాలు)లో చివరి స్థానంలో నిలుస్తోంది. మొత్తానికి తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 31,38,419 ఎకరాలు కాగా, ఈ నెల 12 వరకు 30,03,041 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. పత్తి సాగులో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి ఏకంగా 8,54,265 ఎకరాల్లో సాగవుతోంది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అతి తక్కువగా 42,899 ఎకరాల్లో సాగవుతోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41,94,717 ఎకరాలు కాగా, అంతకుమించి 43,40,353 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. -
వరి పెరిగె... పప్పులు తగ్గె..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి నాలుగో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరం సీజన్లో ఏకంగా 28.49 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.64 కోట్ల టన్నులకు చేరింది. అంటే అదనంగా 54 లక్షల టన్నులు పెరిగింది. ఇక కీలకమైన పత్తి దిగుబడి పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేల్స్ ఉత్పత్తి కాగా, 2018–19లో కేవలం 2.87 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 52 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గిందన్నమాట. గులాబీ పురుగు కారణంగా దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తి గణనీయంగా పడిపోయినట్లు కేంద్రం అంచనా వేసింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా కాస్త మందగించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 2.34 కోట్ల టన్నులకు పడిపోయింది. అంటే 5 లక్షల టన్నులు తగ్గింది. ఇక నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.22 కోట్ల టన్నులకు పెరగడం గమనార్హం. మొక్కజొన్న 2.72 కోట్ల టన్నులు, సోయాబీన్ 1.37 కోట్ల టన్నులు, వేరుశనగ 66 లక్షల టన్నులకు పెరిగింది. చెరుకు రికార్డు స్థాయిలో 40.01 కోట్ల టన్నులు ఉత్పత్తి కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో మూడో ముందస్తు అంచనాల నివేదిక ప్రకారం 2018–19 సీజన్లో ఖరీఫ్, రబీ కలిపి ఆహార ధాన్యాల ఉత్పత్తి 91.93 లక్షల టన్నులుగా ఉంది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే 2018–19 సీజన్లలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2016–17లో 1.01 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండగా, 2017–18 సీజన్లో 96.20 లక్షలకు పడిపోయింది. ఈసారి ఇంకాస్త పడిపోవడం గమనార్హం. అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014–15లో తెలంగాణలో ఆహార ధాన్యాల ఉత్పత్తి కేవలం 72.18 లక్షల టన్నులు మాత్రమే. ఆ తర్వాత 2015–16లో ఇంకా తగ్గి 51.45 లక్షల టన్నులకు పడిపోయింది. అయితే అప్పటినుంచి పెరుగుతూనే వస్తుంది. వర్షాలు, సీజన్లను బట్టి ఉత్పత్తి వత్యాసాలు ఉన్నా, పరిస్థితి మెరుగ్గానే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. -
ముఖం చాటేసిన నైరుతి
వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు. మధ్య భారతంలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తీవ్రమవుతున్న నీటి సమస్య ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ మే నెలలోనే ప్రకటించింది. చెన్నై చేరిన నీళ్ల రైలు చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. దక్షిణ మెట్రోపోలీస్ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే. -
చినుకు జాడేది?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చినుకు జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడైనా అంతా సవ్యంగా ఉంటుందనుకుంటే సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నెల ఒకటిన ఆరంభమైన ఖరీఫ్ సీజన్లో 26వ తేదీ వరకు పరిశీలిస్తే నాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 59 శాతంపైగా లోటు వర్షపాతం నమోదైంది. దీన్ని వాతావరణ పరిభాషలో స్కాంటీ (తీవ్ర దుర్భిక్షం) అని అంటారు. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 58 శాతం వరకు తక్కువ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జిల్లాలో సాధారణం కంటే 79.1 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 63.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 62 శాతం, కృష్ణా జిల్లాలో 60.6 శాతం లోటు వర్షం కురిసింది. ఇదే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కురవాల్సిన సగటు సాధారణ వర్షం కంటే 42.9 శాతం తక్కువ కురిసింది. మూడొంతుల ప్రాంతంలో వర్షాభావమే.. రాష్ట్రంలో మూడొంతుల ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలు ఉండగా 276 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితి (59 శాతం పైగా లోటు వర్షపాతం) ఉంది. మరో 228 మండలాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 20 నుంచి 59 శాతం తక్కువ వర్షం కురిసింది. గత ఐదేళ్లలో వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం, ఈ ఏడాది కూడా ఇప్పటివరకు వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. జలాశయాలు, ప్రాజెక్టులు నీరు లేక అడుగంటాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు. జూన్ చివరి వారం వచ్చినా వర్షం జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరగా వర్షం కురిస్తే వేరుశనగ, ఇతర పంటలు సాగు చేయాలని రాయలసీమ రైతులు ఎదురుచూస్తున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరితే వరి సాగు చేయాలని యోచిస్తున్నారు. ఖరీఫ్ సాగుపై ప్రభావం ఈ ఏడాది కూడా వర్షాభావం ప్రభావం ఖరీఫ్ సాగుపై తప్పేలా లేదని అధికారులు అంటున్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు వేరుశనగ, ఇతర మెట్ట పంటలు సాగు చేస్తుంటారు. రాష్ట్రంలో 9.15 లక్షల హెక్టార్లు (సుమారు 23 లక్షల ఎకరాల్లో) వేరుశనగ సాగు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1.9 శాతం విస్తీర్ణంలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1.6 శాతం మాత్రమే సాగైంది. ఇంకా సాగుకు సమయం ఉన్నప్పటికీ వర్షాభావం వల్ల సాగు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
కరువు రైతులకు రూ. 2620.12 కోట్ల బకాయిలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.2620.12 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు గత ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మొన్నటి వరకూ విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన వరప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితిపై ఆయన కలెక్టర్ల సదస్సులో సోమవారం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2018–19 ఖరీఫ్ సీజన్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, రబీలో 13 జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యన్నారు. అలాగే, 2019–20 ఖరీఫ్‌లో ఈనెల 21 వరకు 59.1 శాతం లోటు వర్షపాతం నమోదైందంటూ గణాంకాలతో వివరించారు. ‘2018–19లో ఖరీఫ్‌లో 347 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వం రూ.900.40 కోట్లు విడుదల చేసింది. 16 లక్షల మంది రైతులకు రూ.1,832.60 కోట్ల పెట్టుబడి రాయితీ మొత్తాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే, రబీ సీజన్లో 257 కరువు మండలాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.644.97 కోట్ల కేంద్ర సాయం కోరింది. దీనిపై సీఎం హోదాలో మీరు మరోసారి లేఖ రాసి నిధులు విడుదలకు ప్రయత్నం చేయాలి. రబీ సీజన్లో రూ.787.52 కోట్లు, ఖరీఫ్ సీజన్లో 1832.60 కోట్లు కలిపి మొత్తం రూ.2620.12 కోట్ల పెట్టుబడి రాయితీని గత ప్రభుత్వం రైతులకు చెల్లించలేదు’.. అని వరప్రసాద్ వివరించారు. దీనికి స్పందించిన సీఎం జగన్.. గత ప్రభుత్వం అన్నీ ఇలాగే చేసిందని, అయినా మనం ప్రథమ ప్రాధాన్యం కింద రైతులకు పెట్టుబడి రాయితీ బకాయిలు విడుదల చేయాలి రావత్ అన్నా.. అని చెప్పారు. విత్తన కొరత పాపం టీడీపీ సర్కారుదే.. ఖరీఫ్ సీజన్లో విత్తనాల కొరత అంశంపై కలెక్టర్ల సదస్సులో ఎక్కువసేపు చర్చ జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి, రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కొరత ఉందని ప్రజాప్రతినిధులు ప్రధానంగా ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ఒక రకం వరి విత్తనం కొరత ఉందని మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. చిత్తూరు జిల్లాలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడంలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుని.. ఇది గత ప్రభుత్వం చేసిన పాపమని ఆరోపించారు. విత్తనాల సేకరణ కోసమున్న రూ.360 కోట్లను కూడా ఎన్నికల పథకాలకు గత ప్రభుత్వం మళ్లించిందని.. దీనివల్ల ఇప్పుడు విత్తనాలు కొనాలన్నా దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. వచ్చే ఐదేళ్లకు దీర్ఘకాలిక దృక్పథంతో విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామన్నారు. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. ఏటా అవసరాల కంటే పది శాతం ఎక్కువ బఫర్ స్టాక్ ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. జూన్ వరకూ వర్షపాత లోటు ఉన్న నేపథ్యంలో ఈ సీజన్లో వర్షాల అంచనా ఏమిటని ఆయన వాకబు చేశారు. ఒకవేళ వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోతే ప్లాన్–బి’ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. విత్తనాలు దొరక్కపోతే మిల్లెట్స్ అయినా ప్రత్యామ్నాయంగా అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు ఏదో మాట్లాడబోగా.. ‘గత ప్రభుత్వం రూ.360 కోట్లను మళ్లించింది. మనం ప్రభుత్వంలోకి వచ్చి నెల కూడా కాలేదు. అధికారులు సమస్య తీర్చడానికి కిందా మీద పడుతున్నారు. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. లేనివి ఇప్పుడు సృష్టించలేరు కదా. రైతులు ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రావత్ అన్నా.. మీరు డబ్బు విడుదల విషయంలో కొంచెం ఉదారంగా ఉండండి..’ అని ఆదేశించారు. కరువు నేపథ్యంలో ఉద్యాన పంటల పరిరక్షణకు కూడా నిధులు అవసరమైతే తక్షణమే విడుదల చేయాలన్నారు. అనంతరం, కరువు నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం లాభదాయకత గురించి వ్యవసాయ సలహాదారు విజయ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బ్యాగుల్లో ఇంటింటికీ సన్న బియ్యం ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి జరిగిన చర్చలో ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ మాట్లాడుతూ.. సర్కారు నిర్ణయం మేరకు ప్రజలకు వినియోగించుకునే బియ్యాన్నే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 10, 15 కిలోలుగా బ్యాగుల్లో ప్యాక్‌చేసి డోర్ డెలివరీ చేస్తామన్నారు. ధాన్యం ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల బకాయి ఉందని.. ఈ నిధులు విడుదల చేయాలని కోన శశిధర్ కోరారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న వివిధ రకాల ధాన్యం ఏడు జిల్లాల్లో పండదని, దీనివల్ల సేకరణ సమస్య రాకుండా చూడాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ.. ‘ గత ప్రభుత్వం అందరికీ బకాయిలు పెట్టింది. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా నిధులను ఎన్నికల పథకాలకు, చంద్రబాబుకు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు మళ్లించింది. ఇది ఎంత చెప్పినా తక్కువే. రావత్ అన్నా.. తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలి. లేకపోతే ఈ సీజన్లో ధాన్య సేకరణకు రైతుల వద్దకు వెళ్తే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పడాల్సి వస్తుంది’ అని ఆర్థిక శాఖ కార్యదర్శికి సూచించారు. గ్రామ సచివాలయాల్లో సరుకుల నిల్వ గ్రామ సచివాలయాల్లోని ఒక గదిలో నిత్యావసర సరుకులను నిల్వ చేస్తారు. ఒకవేళ ఇక్కడ అదనపు గది లేనిపక్షంలో పక్కనే ఒక గదిని సమకూర్చుకుని అక్కడ నిల్వచేయాలి. అక్కడి నుంచి గ్రామ వాలంటీర్లు నిత్యావసర సరకులు తీసుకెళ్లి తమ పరిధిలోని 50 ఇళ్ల వారికి డోర్ డెలివరీ చేస్తారు. పట్టణాల్లోనూ ఇదే తరహాలో వార్డు సచివాలయాల నుంచి వార్డు వాలంటీర్లు ఇంటింటికీ అందజేస్తారు. ప్రతి పౌరుడూ ఒక మొక్క నాటాలి రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ ఒక మొక్కను నాటాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది ఐదు కోట్ల మొక్కలను నాటాలనేది తన ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి ఇంటిలో, స్కూళ్లు, ఆస్పత్రులలో, ప్రతి ప్రభుత్వ స్థలంలో మొక్కల నాటేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. రైతులకు పగలే తొమ్మిది గంటల విద్యుత్ రాష్ట్రంలోని 18.15 లక్షల పంపు సెట్లకు 6,663 ఫీడర్ల ద్వారా పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని సదస్సులో ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. 3,854 ఫీడర్ల ద్వారా ఉ.5 నుంచి సా.7 వరకూ పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా ఈనెల 17 నుంచి ప్రారంభించామన్నారు. మరో 2,809 ఫీడర్ల ద్వారా కూడా విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను రూ.1,700 కోట్లతో పనులు చేపట్టామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో 57,450 వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, వాటిని త్వరగా జారీ చేయడంతోపాటు ఏటా 50 వేల వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలుచేస్తున్నామని వివరించారు. మరోవైపు.. రాష్ట్రంలో 1.7 కోట్ల మంది వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్తు సరఫరాలో పగటిపూట అంతరాయాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉండి ఉండవచ్చని, సబ్స్టేషన్లు, ఫీడర్లు పెంచాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఒకేసారి కాకుండా రెండు విడతల్లో తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని, దీనివల్ల భూగర్భ జలమట్టం పడిపోకుండా ఉంటుందని కొందరు మంత్రులు సూచించగా.. ఇందులో తనకేమీ అభ్యంతరంలేదని పగలు తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్తు సరఫరా చేస్తామన్న హామీ అమలుచేయాలన్నదే తన లక్ష్యమని సీఎం చెప్పారు. ఐఏఎస్‌ల్లా కాదు... ప్రజాప్రతినిధుల్లా ఆలోచించండి అర్హులైన పేదలకు న్యాయం చేసే విషయంలో చట్టం అంటూ గిరిగీసుకోవద్దని, అవసరమైన చోట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అవినీతిని ఏమాత్రం సహించవద్దని, అయితే అదే సమయంలో పేదలకు న్యాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల్లా కాకుండా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల్లా ఆలోచించాలన్నారు. మనమూ, వాళ్లూ ఒక్కటే... ఇది మన ప్రభుత్వం ‘మనమూ, వాళ్లూ ఒక్కటే. ఇది మన ప్రభుత్వం. మనం ప్రతిపక్షంలో లేం. మనది అధికార పక్షం. అధికారులంతా మన ప్రభుత్వంలో భాగమే. మనమూ, వాళ్లూ ఒక్కటే. ఈ విషయాన్ని మొదట నీ బుర్రలోకి ఎక్కించుకోవాలి’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురక అంటించారు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చ సందర్భంగా గిరిజా శంకర్‌ను ఉద్దేశించి మంత్రి అవంతి శ్రీనివాస్ అన్న మాటలపై సీఎం ఘాటుగా స్పందించి ఇలా వ్యాఖ్యానించారు. మంగళగిరి – చినఅవుటపల్లి రహదారి నిర్మిస్తే... గన్నవరం ఎయిర్‌పోర్టుకు స్థలం, విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ల నిర్మాణం గురించి కలెక్టరు ఇంతియాజ్ ప్రస్తావించగా మంగళగిరి నుంచి చినఅవుటపల్లి వరకూ రహదారి నిర్మిస్తే విజయవాడలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘విజయవాడలో మొదట నిర్మాణంలో ఉన్న రెండు ఫ్లైఓవర్లను కనీసం ఆరు నెలల్లో పూర్తి చేయండి. ఇవి పూర్తయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు గురించి చూద్దాం. మంగళగిరి నుంచి చిన్నఅవుట్పల్లి వరకూ రహదారి నిర్మాణానికి భూమి ఉంది. దీన్ని నిర్మిస్తే గుంటూరు నుంచి విజయవాడ నగరంలోకి రాకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లవచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో ఫ్లైఓవర్లు కడుతూనే... ఉన్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్ ఇంతియాజ్ ఐకానిక్ వంతెన గురించి ప్రస్తావించగా.. ‘ఐకానిక్ కాదు, ముందు రోడ్డు పనులు ప్రారంభించి తర్వాత కలవండి’ అని సీఎం సూచించారు. -
ఖరీఫ్‌కు వేళాయె!
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ అధికారికంగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది వర్షాలు సాధారణంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో లక్ష్యానికి అనుగుణంగా ఖరీఫ్ సాగుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సంసిద్ధం చేసింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికి మరో వారం రోజులు పడుతుందని వాతావరణ శాఖ భావిస్తోంది. బావుల కింద తప్ప ఇంకా ఎక్కడా దుక్కులు దున్నడం ప్రారంభం కాలేదు. ఏరువాక వచ్చే వరకు కాడీ మేడీ కదిలే పరిస్థితి లేనప్పటికీ వ్యవసాయ శాఖ ఇప్పటికే ఖరీఫ్ ప్రణాళికను ఖరారు చేసింది. విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ మొదలు పెట్టింది. వ్యవసాయ శాఖ క్యాలెండర్ ప్రకారం జూన్ ఒకటిన ఖరీఫ్ సీజన్ మొదలై అక్టోబరుతో ముగుస్తుంది. ఈ సీజన్లో వచ్చే నైరుతీ రుతుపవనాలతో 556 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్‌లో 93.7, జూలైలో 151.3, ఆగస్టులో 88.2, సెప్టెంబర్‌లో 152.7 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అక్టోబరు నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయి. వేసవి కాలంలో సాగుచేసే పచ్చిరొట్ట పంటల్ని జూన్ నెలలో చేలల్లోనే తొక్కించి జూలై నుంచి పునాస పంటలకు రైతులు సంసిద్ధమవుతారు. సాగు విస్తీర్ణం పెంపు ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 42.04 లక్షల హెక్టార్లలో పంటల్ని సాగు చేయించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇది గత ఏడాది ఖరీఫ్ కన్నా 2.51 లక్షల హెక్టార్లు ఎక్కువ. గత ఏడాది 39.53 లక్షల హెక్టార్లుగా నిర్ణయించినప్పటికీ సాగయింది మాత్రం 35.47 లక్షల హెక్టార్లే. ఈ సీజన్లో వర్షపాతం సాధారణంగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఖరీఫ్ ప్రణాళికపై అవగాహన కల్పించేలా అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహించింది. చిరుధాన్యాలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. ఆహార పంటల్లో ప్రధానమైన వరిని 16.25 లక్షల హెక్టార్లలో, జొన్న, మొక్కజొన్న, రాగి, చిరుధాన్యాలన్నింటినీ కలిపి 2.66 లక్షల హెక్టార్ల సాగుగా ఖరారు చేసింది. రాయలసీమలో ప్రధాన పంట అయిన వేరుశనగను 9.16లక్షల హెక్టార్లుగా నిర్ణయించి సుమారు 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధంచేసినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇతర పంటల్లో ముఖ్యమైన పత్తి సాగు విస్తీర్ణం 5.63 లక్షల హెక్టార్లుగా, మిర్చి 1.34 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. 15 విత్తన సంస్థలపై నిషేధం ఇదిలా ఉంటే.. కల్తీ విత్తనాల బెడదను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సుమారు 15 విత్తన సంస్థలపై వ్యవసాయ శాఖ నిషేధాన్ని విధించింది. ఈ కంపెనీల నుంచి విత్తనాలు కొని మోసపోవొద్దని హెచ్చరించింది. బీటీ పత్తి విత్తనాల పేరిట కొందరు బోల్‌గార్డ్–3 అనే అనుమతిలేని పత్తి విత్తనాలను కూడా అంటగడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన వ్యవసాయ అధికారులు ప్రభుత్వం సూచించిన సంస్థల వద్దే బీటీ పత్తి విత్తనాలను కొనుక్కోవాలని సూచించారు. సీజన్‌కు సరిపడా విత్తనాలను, ఎరువులను సేకరించి ఉంచామని, ఏ రైతూ కంగారు పడాల్సిన పనిలేదని వ్యవసాయ కమిషనర్ మురళీధర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఖరీఫ్‌కు ప్రభుత్వం తరఫున చేయాల్సిన అన్ని ఏర్పాట్లుచేశామని, అధికోత్పత్తి, తెగుళ్ల నివారణ మొదలు ఎరువుల వాడకం వరకు అన్ని అంశాలపై రైతులకు అవగాహన కల్పించామని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా ఖరారు రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడక ఖరీఫ్ సాగు ముందడగు వేయకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను కూడా వ్యవసాయ శాఖ తయారుచేసింది. ఇందుకోసం అన్ని రకాల విత్తనాలను పంపిణీకి సిద్ధంగా చేసింది. జూలై 15లోగా సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే 1,04,732 హెక్టార్లలో ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేందుకు 24,022 క్వింటాళ్ల వరి, మినుము, పెసర, కంది, మొక్కజొన్న, రాగి, వేరుశెనగ, ఉలవ, జొన్న, కొర్రలు వంటి రకాల విత్తనాలను సిద్ధంచేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వరికి బదులు ఆరుతడి పంటలైన మినుము, పెసర, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు వంటి స్వల్పకాలిక పంటలు సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పత్తికి బదులు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు వంటి పంటల సాగుకు రైతులను సంసిద్ధం చేశారు. -
కనిష్టం 180.. గరిష్టం 240
సాక్షి, హైదరాబాద్ :కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీఫ్ సీజన్లోనే వీలైనంత ఎక్కువ గోదావరి నీటిని ఎత్తిపోసి గరిష్ట ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండే జూలై నుంచి వరద తీవ్రత తగ్గే వరకు వీలైనన్ని ఎక్కువ రోజులు నీటిని ఎత్తిపోసేలా రంగం సిద్ధం చేస్తోంది. రోజుకు రెండు టీఎంసీల చొప్పున కనిష్టంగా 90 రోజుల్లో 180 టీఎంసీల నుంచి గరిష్టంగా 120 రోజుల్లో 240 టీఎంసీలను ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నీటిని ఎక్కడికక్కడ చెరువులకు మళ్లించేలా తూముల నిర్మాణం వేగిరం చేయాలని సూచించారు. ఇలా వరద..అలా ఎత్తిపోత.. ఈసారి జూన్ 11 తర్వాతే రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేయడంతో రుతుపవనాలు పుంజుకొని గోదావరిలో ప్రవాహాలు ఉధృతం అయ్యేందుకు జూలై నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూలై చివరి నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నారు. వరద ఆలస్యం కావడం సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు కలసి రానుంది. వరద ఆలస్యమైతే మరో 20–30 పనిదినాలు ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా మారతాయి. ఈ సమయంలో మోటార్ల బిగింపు పూర్తిస్థాయిలో చేయడంతోపాటు వెట్‌రన్‌ను పూర్తి చేసే వీలు చిక్కనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల సహా ఎల్లంపల్లి, మిడ్‌మానేరు దిగువన ఉన్న ప్యాకేజీల్లో పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోయడం సులభమవుతుంది. జూలై మొదలు నవంబర్ వరకు గోదావరిలో ఉధృతంగా నీటి ప్రవాహాలుంటాయి. ఏటా ఈ కాలంలోనే 2 వేల నుంచి 3 వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం 90 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 180 టీఎంసీలను, గరిష్టంగా 120 రోజుల్లో 240 టీఎంసీలను ఎత్తిపోయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులను ఆదేశించారు. 180 టీఎంసీల నీటిని ఎత్తిపోశాక అన్ని మోటార్లను నడపకున్నా అవసరమున్న మేర నీటిని తోడేలా ఒక్కో మోటార్‌ను నడిపించి నీటిని తీసుకోవాలని సూచించారు. ఈ నీటిని తోడేందుకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో 3,800 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఇక ఎత్తిపోసే నీటిని మిడ్‌మానేరుకు తరలించి అక్కడ వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి కనిష్టంగా 60 టీఎంసీలు మళ్లించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. పునరుజ్జీవ పథకంలో ఒక టీఎంసీ నీటిని తీసుకునే వెసలుబాటు ఉన్నా ప్రస్తుతం అక్కడ అర టీఎంసీ నీటిని తీసుకునేలా పంపులు సిద్ధమవుతున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్–1 కిందే 9.60 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీరు సరిపోనుంది. ఇక స్టేజ్–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఎస్సారెస్పీకి సహజంగా వచ్చే గోదావరి ప్రవాహపు నీళ్లు దీనికి సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 120 టీఎంసీలతో మేడిగడ్డ (16.17 టీఎంసీలు), అన్నారం (10.87 టీఎంసీలు), సుందిళ్ల (8.83 టీఎంసీలు), ఎల్లంపల్లి (20 టీఎంసీలు), మేడారం (0.78 టీఎంసీ), మిడ్‌మానేరు (25 టీఎంసీలు), అనంతగిరి (3.50 టీఎంసీలు), రంగనాయక్ సాగర్ (3 టీఎంసీలు), కొండపోచమ్మ సాగర్ (15 టీఎంసీలు) వద్ద నిల్వ చేసి అవసరాలకు తగినట్లు వాటి కింది కాల్వలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. జూలై 15లోగా తూములు, చెరువులకి మళ్లింపు... కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసే గోదావరి నీటిని వీలైనన్ని చెరువులకు మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ చెరువులను నింపడం ద్వారా గరిష్ట ఆయకట్టుకు నీరందించాలని సూచించారు. మొత్తంగా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే గోదావరి నీటితో 3,011 చెరువులు నింపాలని అందుకు తగ్గట్లే తూముల నిర్మాణం చేయాలని సూచించారు. కాళేశ్వరం నీళ్లతో తొలి ప్రయోజనం ఎస్సారెస్పీ ఆయకట్టుకే అందనుంది. ఎస్సారెస్పీ పరిధిలో మొత్తంగా 775 తూముల నిర్మాణం అవసరం ఉంటుందని ఇది వరకే గుర్తించారు. ఈ తూముల నిర్మాణం జరిగితే కాళేశ్వరం కాల్వల ద్వారా 1,192 చెరువులకు నీటిని మళ్లించే వెసలుబాటు ఉంటుందని గుర్తించి ఈ తూముల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టారు. ఇక కాళేశ్వరం పరిధిలోనే మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మ సాగర్ వరకు 158 తూముల నిర్మాణం అవసరం ఉంటుందని, వాటి ద్వారా గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను అభివృధ్ధి చేసి 2,100 చెరువులకు నీరందించే అవకాశం ఉంటుందని గుర్తించారు. తూముల నిర్మాణ పనులను జూలై 15 నాటికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెరువులన్నీ నింపితే కనిష్టంగా 35 టీఎంసీల నీటినిల్వ సాధ్యం కానుంది. -
ఇలా వరద.. అలా ఎత్తిపోత!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్లో గోదావరి వరద నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు ఎత్తిపోయాలని నీటి పారుదలశాఖ నిర్ణయించింది. దానికి అనుగుణంగా పనులు ముమ్మరం చేసింది. గోదావరిలో ప్రవాహాలు మొదలయ్యే జూన్ తొలి లేక రెండో వారం నుంచే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టుకు మళ్లించాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. ఈ మేరకు పంపుల బిగింపు ప్రక్రియను ఇంజనీర్లు వేగిరం చేశారు. మార్చి చివరి నాటికి మెజార్టీ పనులు పూర్తి చేసి, ఏప్రిల్‌లో వెట్‌రన్ నిర్వహించేవిధంగా పనులు చేస్తున్నారు. కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ, గరిష్టంగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పంపుల బిగింపు పనులు జరుగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పంపుల బిగింపు.. కాళేశ్వరం నీటిని తీసుకునే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌ల పరిధిలో ఇప్పటికే మట్టి, కాంక్రీట్ పనులు పూర్తికాగా, పంపులు, మోటార్ల బిగింపు వేగంగా సాగుతోంది. మూడు పంపుహౌస్‌లకు అవసరమైన యంత్రాలను జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫిన్లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మేడిగడ్డ పంపుహౌస్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే 4 పంపుల బిగింపు పూర్తయింది. మరో రెండో పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన పంపుల ద్వారా 10,594 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశముంది. మేడిగడ్డకు దిగువన అన్నారం పంపుహౌస్‌లో 8 మోటార్లకుగాను 6 పంపులు, మోటార్ల బిగింపు పూర్తవగా, మరో రెండు పురోగతిలో ఉన్నాయి. వీటి ద్వారా 2 టీఎంసీల నీటిని తరలించే వీలుంది. సుందిళ్ల వద్ద 9 మోటార్లకుగాను రెండు పూర్తవ్వగా, మరో రెండు వచ్చే నెల మొదటివారానికి సిద్ధం కానున్నాయి. మొత్తంగా ఏప్రిల్‌లో అన్ని పంపులు, మోటార్లు సిద్ధం చేసి వెట్ ట్రయల్ రన్లను నిర్వహించనున్నారు. గోదావరి ఎగువ నుంచి వరద ఉధృతి తీవ్రమైన వెంటనే నీటిని బ్యారేజీలు, పంపుహౌస్‌ల ద్వారా ఎల్లంపల్లికి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్లంపల్లి దిగువన శరవేగంగా.. ఎల్లంపల్లి దిగువన ఉన్న నంది మేడారం, రామడుగు (ప్యాకేజీ–6, 8) పంపుహౌస్‌ల్లోనూ రెండు టీఎంసీ నీటిని లిఫ్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో గ్రావిటీ కెనాల్, టన్నెల్, పంపుహౌస్‌లు నిర్మించాల్సి ఉండగా అన్ని పనులు పూర్తికావచ్చాయి. మొత్తం 124 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 7 పంపుల్లో 4 పంపులను ఇప్పటికే సిద్ధం చేయగా, ఇందులో రెండు పంపుల డ్రైన్ పూర్తయింది. మరో 3 పంపుల పనులు పురోగతిలో ఉన్నాయి. ప్యాకేజీ–7లో మేడారం రిజర్వాయర్‌తోపాటు 11.24 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 2.4 కి.మీ. టన్నెల్ లైనింగ్ పనులు మే నెలలో పూర్తి కానున్నాయి. ప్యాకేజీ 8లో 139 మెగావాట్ల సామర్థ్యంతో 22,036 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ఏడు పంపులను అమర్చాల్సి ఉండగా, 5 పంపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. మరో రెండింటినీ వచ్చే నెలకు సిధ్ధం చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్‌లో గోదావరిలో ప్రవాహాలు మొదలైన తొలి లేక రెండో వారం నుంచే నీటిని మళ్లించుకునేలా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పనులను ప్రగతిభవన్ నుంచే ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్‌రావులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు. మిడ్‌మానేరుకు చేరే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని, అటు నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ద్వారా కొండపోచమ్మ సాగర్ కింది ఆయకట్టుకు ఇచ్చేలా గంధమల్ల, బస్వాపూర్‌ల కింది చెరువులను నింపేలా గ్రావిటీ కెనాళ్లు, అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాళ్లు, టన్నెళ్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.