ప్రతామ్నాయానికి ‘సెప్టెంబర్’ అనుకూలం
అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యామ్నాయ పంటలు విత్తుకునేందుకు సెప్టెంబర్ నెల అనుకూలమని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ఆగస్టులో కురిసిన వర్షాలకు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇంకా భూములు ఖాళీగానే ఉన్నందున ఏదో ఒక పంట వేసుకుంటే అంతోఇంతో పంట దిగుబడులతో పాటు పశువుల మేత లభిస్తుందని అన్నారు.
సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయం:
+ సెప్టెంబర్‌లో ఎర్రనేలల్లో జొన్న, సజ్జ, పెసర, అలసంద, మినుములు, ఉలవ వేసుకోవచ్చు. నల్లరేగడి భూముల్లో జొన్న, కొర్ర, పెసర, అనుము, ఉలవ, పొద్దు తిరుగుడుసాగు చేసుకోవాలి.
+ ఎకరాకు నాలుగు కిలోలు జొన్నలు, ఎకరాకు రెండు కిలోల కొర్రలు, ఎకరాకు 1.6 కిలోలు సజ్జలు, ఎకరాకు 6 నుంచి 7 కిలోలు పెసలు విత్తుకోవాలి. ఎకరాకు 8 నుంచి 10 కిలోలు అలసందలు సరిపోతాయి. ఉలవలు ఎకరాకు 8 నుంచి 10 కిలోలు అవసరం. అనుములు 6 నుంచి 8 కిలోలు కావాలి. పొద్దుతిరుగుడు ఎకరాకు 2 కిలోలు అవసరం. విత్తేసమయంలో యూరియా, సింగిల్ సూపర్‌పాస్ఫేట్, ఎంవోపీ ఎరువులు కొద్దిగా వేసుకోవాలి.
+ జూన్, జూలైలో వేసిన వేరుశనగ పంటలో శనగపచ్చ పురుగు ఆశించినందున 1.5 గ్రాములు లార్విన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగకు ఆశించిన లద్దె పురుగు నివారణకు పొలంలో అక్కడక్కడ ఎరపంటగా ఆముదం మొక్కలు వేయాలి. లద్దె పురుగులు ఆముదం మొక్కలపై గ్రుడ్లు పెట్టినట్లు గుర్తించిన వెంటనే తీసివేసి వాటిని నాశనం చేయాలి. గ్రుడ్లు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారీ చేయాలి. ఎకరాకు 10 పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎకరాకు 400 మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా ఒక లీటర్ వేపనూనె 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వా నివారణకు ఎకరాకు 200 గ్రాములు థయోడికార్బ్ లేదా 200 మి.లీ నొవాల్యురాన్ లేదా 400 మి.లీ క్లోరోఫెనాఫేర్ లేదా 40 మి.లీ ఫ్లుబెండమైడ్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే 5 కిలోలు వరితవుడు + అర కిలో బెల్లం + 50 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోఫైరిపాస్ లేదంటే 350 మి.లీ మిథోమిల్‌తో విషపు ఎర తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లాలి. దీని వల్ల లద్దె పురుగును సమూలంగా నివారించుకోవచ్చు.
+ ప్రత్తిలో ప్రమాదకరమైన గులాబీ రంగు కాయతొలుచు పురుగు లక్షణాలు కనిపిస్తున్నందున రైతులు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 4 నుంచి 6 ఫిరమోన్ ఎరలు ఉంచాలి. గుబురుగా ఉన్న పూలను తీసేయాలి. తొలిదశలో 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ వేపనూనె లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఆశించిన కాయలు ఎక్కుగా కనిపిస్తే 2 మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా 2.5 మి.లీ క్లోరోఫైరిఫాస్ లేదా 1 గ్రాములు థయోడికార్బ్ లేదా 2 మి.లీ పిప్రోనిల్ ఒక లీటర్ నీటికి కలిపి బాగా తడిచేలా 10 రోజులు వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.
+ జొన్న, మొక్కజొన్నలో ఆశించిన కాండంతొలుచు పురుగు నివారణకు ఎకరాకు 320 మి.లీ మోనోక్రోటోఫాస్ 36 ఎస్‌ఎల్ లేదా 60 మి.లీ కోరజోన్ 200 లీటర్ల నీటికి కలిపి విత్తుకున్న 10 నుంచి 12 రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి.