సాగుకు వేళాయె..
అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను రైతులు వినియోగించుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప తెలిపారు. జిల్లావ్యాప్తంగా కొన్ని మండాలాల్లో భారీగానూ, మరికొన్ని మండలాల్లో మోస్తరుగానూ వర్షాలు కురిశాయి. ఏ మాత్రం ఆలస్యంగా చేయకుండా నేల తయారీ, నీటి సంరక్షణ, పంటల సరళిపై రైతులు దృష్టి పెట్టాలని వారు సూచించారు.
లోదుక్కులతో ప్రయోజనం
మొదటిసారి వర్షం కురిసిన ప్రాంతాల్లో నేల తయారీ, లోదుక్కులు చేసుకోవాలి. మెట్ట, బీడు భూములను బాగా దున్నుకుంటే మేలు. వాలు ప్రాంతానికి అడ్డంగా దున్నడం వల్ల తేమ శాతాన్ని పెంచుకోవడంతో పాటు భూసారం కొట్టుకుపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే నేలకోతను నివారించుకోవచ్చు. గత పంట అవశేషాలను పూర్తిగా తొలగించుకోవాలి. దీర్ఘ చతురస్రాకారంలో ఉండే రెక్కనాగలితో 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు దున్నుకోవాలి. భూమిలోపలి పొర కూడా గుల్లబారిపోతుంది. పోషకాల సమతుల్యత మెరుగుపడుతుంది. గుండ్రంగా ఉండే పళ్లెపు నాగలితో కూడా 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు దన్నుకోవచ్చు. రాతి, ఎగుడు దిగుడు, ఇసుక నేలల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు ఐదు, ఏడు మడకలు కలిగిన పరికరాలతో లోతుగా దుక్కులు చేసుకోవాలి. గునపం నాగలి (చీసిల్‌ఫ్లౌ) ఉపయోగించి ప్రతి మూడు అడుగులకు లోతుగా దుక్కి చేసుకుంటే మేలు. వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది.
అంతర పంటలు వేసుకోవాలి
జూన్ 15 తర్వాత నైరుతీ రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలకు కంది పంట 1.8 మీటర్ల దూరంలో విత్తుకోవచ్చు. జూలై మొదటి వారంలో కురిసే వర్షాలకు కంది సాళ్ల మధ్య పెసర లేదా కొర్ర, సజ్జ విత్తుకోవచ్చు. ఈ అంతర పంటలు సెప్టెంబర్‌లో కోతకు వస్తాయి. ఆ తర్వాత కంది సాళ్ల మధ్యలో ఉలవ లేదా మేత జొన్న వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కందితో పాటు నాలుగైదు అంతర పంటల ద్వారా నికర ఆదాయం పెరుగుతుంది. కంది పంట మధ్యలో పప్పుజాతి పంటలు వేయడం వల్ల భూసారం పెరిగి కంది దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. వేరుశనగ పంట జూలైలో వేసుకోవడం మంచిది. వేరుశనగలో కూడా మేరసాళ్లు, అంతర పంటలు తప్పనిసరిగా వేసుకుంటే మేలు.