నెలాఖరు వరకు వేరుశనగ సాగుకు అనుకూలం
- ఆగస్టులో ప్రత్యామ్నాయమే శరణ్యం
- ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రవీంద్రనాథరెడ్డి
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ పంట విత్తుకునేందుకు నెలాఖరు వరకు సమయం ఉందని, ఆ తర్వాత విత్తుకుంటే పంట దిగుబడులు బాగా తగ్గుతాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించారు.
ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటలు :
విత్తుకు సరిపడా పదును వర్షం అయితే ఈనెలాఖరు వరకు వేరుశనగ సాగు చేసుకోవచ్చు. ఆగస్టులో మాత్రం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఆగస్టు 15వ తేదీ వరకు ఎర్రనేలల్లో జొన్న, గోరుచిక్కుడు, సజ్జ, పెసర, అలసంద, కంది వేసుకోవచ్చు. ఆగస్టు 15 తర్వాత ఎర్ర నేలల్లో ఉలవ, ఆముదం విత్తుకోవచ్చు.తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, ఉరవకొండ, బెళుగుప్ప, విడపనకల్, కనేకల్లు, పెద్దవడుగూరు, పుట్లూరు, యాడికి తదితర నల్లరేగడి భూములు కలిగిన మండలాల్లో ఆగస్టులో జొన్న, గోరుచిక్కుడు, కొర్ర, పెసర, ఆముదం, ప్రత్తి పంటలు విత్తుకోవచ్చు.
+ ఎకరాకు నాలుగు కిలోల జొన్నలు అవసరం. సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు (సెం.మీ), మొక్కల మధ్య 12 నుంచి 15 సెం.మీ దూరం ఉండాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎకరాకు 50 కిలోలు యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్, 20 కిలోల పొటాష్ వేసుకోవాలి.
+ ఎకరాకు 1.6 కిలోల సజ్జ విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12 నుంచి 15 సెం.మీ ఉండాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎకరాకు 50 కిలోల యూరియా, 75 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్, 35 కిలోల పొటాష్ ఎరువులు వేయాలి.
+ ఎకరాకు 2 కిలోల కొర్రలు అవసరం. సాళ్ల మధ్య 20 నుంచి 22 సెం.మీ, మొక్కల మధ్య 7.5 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 35 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్‌పాస్ఫేట్, 35 కిలోల పొటాష్ ఎరువు వేసుకోవాలి.
+ ఎకరాకు 6 నుంచి 7 కిలోల పెసలు అవసరం. సాళ్ల మధ్య 30 సెం.మీ దూరంలో విత్తాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ ఎరువు వేసుకోవాలి.
+ ఎకరాకు 8 నుంచి 10 కిలోల అలసందలు అవసరం. సాళ్ల మధ్య 30 నుంచి 45 సెం.మీ ఉండాలి. ఎకరాకు 35 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్, 35 కిలోల పోటాష్ ఎరువు వేసుకోవాలి.
+ ఆగస్టు మొదటి వారం వరకు కంది వేసుకోవచ్చు. పీఆర్‌జీ–176, ఎల్‌ఆర్‌జీ–52 రకాలు ఎంచుకోవాలి. సాళ్ల మధ్య 60 సెం.మీ, మొక్కల ధ్య 20 సెం.మీ దూరం ఉండాలి. ఎకరాకు 5 నుంచి 6 కిలోలు అవసరం. కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా కాప్టాన్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి.
+ ఎకరాకు 8 నుంచి 10 కిలోల ఉలవలు అవసరం. సాళ్ల మధ్య 30 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉండాలి. ఎకరాకు 8 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్, 15 కిలోల పొటాష్ వేయాలి.