కోటి ఆశలతో..
– ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న రైతన్న
– ఊరిస్తోన్న ముందస్తు వర్షాలు.. నైరుతిపై బోలెడు ఆశలు
– మొదలైన విత్తన పంపిణీ ...ఆందోళన రేకెత్తిస్తోన్న నాసిరకం విత్తనం
– పంట రుణాల మంజూరులో బ్యాంకర్ల మెలిక
నాలుగేళ్లుగా వరుస కరువులతో అల్లాడుతున్న ‘అనంత’ రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో ఖరీఫ్ పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ముందస్తు వర్షాలు ఊరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఐదు రోజుల ముందుగానే తీరం దాటి మన రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఈ ఏడాదైనా కరువు నుంచి గట్టెక్కొచ్చని రైతులు ఆశగా ఉన్నారు. కాగా.. గత రెండేళ్లలాగే ఈసారీ నాసిరకం విత్తనాలు రైతులను భయపెడుతున్నాయి. పంట రుణాల కోసం బ్యాంకులకు వెళితే తిప్పలు తప్పడం లేదు. ఏటా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నా నివారించడంలో అధికార యంత్రాంగం విఫలమవుతూనే ఉంది.
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది ముందస్తు వర్షాలు రైతుల్లో ఆశలు రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి మడకశిర, గుడిబండ, చిలమత్తూరు, గుమ్మఘట్టతో పాటు 12 మండలాల్లో మంచి వర్షం కురిసింది. మేలో సాధారణ వర్షపాతం 39.6 మిల్లీమీటర్లు కాగా.. ఇప్పటిదాకా 32.6 మి.మీ నమోదైంది. నెలాఖరుకు సాధారణ వర్షపాతం దాటే అవకాశముంది. దీంతో రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో వారం కిందట కురిసిన వర్షానికి విత్తనం వేస్తున్నారు.
6.04 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు
ఈ ఏడాది జిల్లాలో 6.04 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. రాయితీపై 4.01 లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విత్తన పంపిణీ మొదలైంది. ఆయిల్ ఫెడ్, మార్క్‌ఫెడ్, ఏపీసీడ్స్ విత్తనకాయలను పంపిణీ చేస్తున్నాయి. ఏటా జరిగినట్లే ఈసారీ నాసిరకం విత్తనం రైతులను కలవర పెడుతోంది. ఊజీలు, లొట్టలు, పుల్లలు అధిక శాతం ఉన్నాయి. బస్తా విప్పి కాయలు చూస్తే ప్రాసెసింగ్ జరగలేదనే విషయం స్పష్టమవుతోంది. వీటిని ఒలిస్తే బస్తాకు 20 కిలోల విత్తనం కూడా రాదని రైతులు చెబుతున్నారు. కాయలు జిల్లాకు చేరిన వెంటనే వ్యవసాయాధికారులు పరిశీలించాలి. నాసిరకమని తేలితే వెనక్కు పంపాలి. గతేడాది వంద లోడ్లదాకా వెనక్కి పంపారు. అవే కాయలను రీసైక్లింగ్ చేసి.. బిల్లులు మార్చి ఇతర మండలాలకు చేరవేసినట్లు అప్పట్లో విమర్శలొచ్చాయి. ఈ ఏడాది పరిశీలన లేకుండానే నేరుగా పంపిణీ చేస్తున్నారు. నాసిరకం కాయలు వెలుగుచూసిన వెంటనే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తే మంచి విత్తనాలు అందే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.
తప్పని ‘రుణ’ తిప్పలు
ఖరీఫ్, రబీలో రూ.4,846 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఖరీఫ్‌లో అత్యధికంగా రూ.4,346 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకూ 20శాతం కూడా రుణాలు అందజేయలేదు. రైతులు బ్యాంకుకు వెళితే పాతబకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని చెబుతున్నారు. కొన్ని బ్యాంకులు రెండు విడతల రుణమాఫీ పోనూ తక్కిన మూడు విడతల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంకర్లకు ఇచ్చిన బాండ్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆ బకాయిలు కూడా చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో కొందరు రుణాలు తీసుకోకుండానే వెనక్కి వస్తున్నారు. జూలై 15 వరకూ రుణపంపిణీ ఉంటుంది. ఈలోపు రుణాలు తీసుకోకపోతే బీమా ప్రీమియం చెల్లించే అవకాశం ఉండదు. విధిలేని పరిస్థితుల్లో చాలామంది రైతులు వడ్డీవ్యాపారుల వద్ద అప్పులు చేసి.. బ్యాంకులోని పాతఅప్పులకు జమ చేసి రెన్యూవల్ చేసుకుంటున్నారు. ఏటా సగటును 6.20 లక్షల మంది రుణాలు పొందుతున్నారు. వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు రైతులు పంట పెట్టుబడుల కోసం బ్యాంకులను ఆశ్రయించకుండా వడ్డీవ్యాపారుల వద్దకు వెళుతున్నారు.
నైరుతిపైనే ఆశలు..
నైరుతి రుతుపవనాలు ఏటా జూన్ 15 తర్వాత కేరళ తీరం దాటి మన జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది ఐదు రోజులు ముందుగానే తీరం దాటుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో రైతులు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. వర్షాలు బాగా కురిస్తే వేరుశనగతో పాటు వరి, పత్తి, కంది తదితర పంటలు వేస్తారు. గతేడాది కూడా మే, జూన్, జూలైలో వర్షాలు ఊరించాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే..పంటసాగు చేసిన తర్వాత కీలక దశ (ఆగస్టు, సెప్టెంబరు)లో వరుణుడు మొహం చాటేశాడు. దీంతో పంటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి.
ఆయకట్టు రైతులూ ఆందోళనలోనే..
హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు కూడా ఈ ఏడాది ఆందోళనగానే ఉన్నారు. మనకు హెచ్చెల్సీ నుంచి 32.5 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా.. టీబీడ్యాంలో పూడిక కారణంగా ఏటా 21–22 టీఎంసీలను మాత్రమే కేటాయిస్తున్నారు. నీటి వృథా పోనూ ఇందులో 15–16 టీఎంసీలు మాత్రమే జిల్లాకు చేరుతున్నాయి. గతేడాది 23.14 టీఎంసీలు కేటాయించగా.. 9 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. ఇవి తాగునీటి అవసరాలకు కూడా సరిపోలేదు. దీంతో జిల్లాలో హెచ్చెల్సీ కింద పంటలు సాగు చేసే 1.80 లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు నష్టపోయారు. గతేడాది 28 టీఎంసీల నీరు హంద్రీ–నీవా ద్వారా పీఏబీఆర్‌కు చేరినా అధికారులు పంటలను కాపాడలేకపోయారు. ఈ ఏడాది హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనుల నేపథ్యంలో నీరు వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయకట్టు రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.