వేరుశనగ నూతన వంగడం @ కదిరి | Kadiri Agriculture Development and Research Station Groundnut Variety | Sakshi
Sakshi News home page

వేరుశనగ నూతన వంగడం @ కదిరి

Published Tue, Jul 12 2022 6:26 PM | Last Updated on Tue, Jul 12 2022 6:43 PM

Kadiri Agriculture Development and Research Station Groundnut Variety - Sakshi

వేరుశనగ సాగుకు దేశంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా పేరుగాంచింది. కానీ అతివృష్టి, అనావృష్టి, చీడపీడలతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. ఈ క్రమంలోనే కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతుకు అండగా నిలిచారు. పరిశ్రమిస్తూ.. పరిశోధన చేస్తూ నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు తట్టుకునే విత్తనాన్ని ఉత్పత్తి చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు.  

కదిరి: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రం రాష్ట్రానికే తలమానికం. ఇక్కడ ఉత్పత్తి చేసిన వేరుశనగ విత్తన రకాలు దేశ వ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దాదాపు 14 రకాల నూతన వంగడాలను కదిరి పరిశోధన స్థానం ఉత్పత్తి చేసింది. జాతీయ వేరుశనగ ఉత్పత్తిలో 50 శాతం కే–6 వంగడానిదే కావడం గమనార్హం. 


అనంత నుంచి కదిరికి మార్పు.. 

1954లో ప్రాంతీయ నూనె గింజల పరిశోధన కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేశారు. పరిశోధనకు అనువైన వాతావరణ పరిస్థితులు, తగిన నేలకోసం 1959లో కదిరికి తరలించారు. 1982లో ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అనుబంధం చేశారు. 1985లో పూర్తిస్థాయి పరిశోధన కేంద్రంగా మారింది. అనేక మంది శాస్త్రవేత్తలు 40 ఎకరాల విస్తీర్ణంలోని పొలాల్లో నిరంతరం శ్రమిస్తుంటారు. ఒక కొత్తరకం వంగడం కనుక్కొని విడుదల చేయడానికి 8 ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 


మూలవిత్తనంపై 50 శాతం సబ్సిడీ.. 

కదిరి పరిశోధన స్థానం విడుదల చేసిన వేరుశనగ మూల విత్తనాన్ని రైతులకు జగన్‌ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఈ సబ్సిడీని ఎత్తేశారు. అయితే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం రాయితీని తిరిగి పునరుద్ధరించింది. కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మూలవిత్తనం తీసుకెళ్లి పండించిన దిగుబడులను సైతం మళ్లీ రైతులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. మూలవిత్తనం కొనుగోలు సమయంలోనే ఇక్కడి శాస్త్రవేత్తలు దిగుబడుల కొనుగోలుపై రైతులతో ఒప్పందం చేసుకుంటారు. 
 
పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు.. 
కదిరి–1(కె–1), కదిరి–2(కె–2), కదిరి–3(కె–3), వేమన, కదిరి–4(కె–4), కదిరి–5(కె–5), కదిరి–6(కె–6), కదిరి–7(కె–7), కదిరి–8(కె–8), కదిరి–9(కె–9), కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి ఇలా మొత్తం 14 నూతన వంగడాలను కనుగొని మార్కెట్‌లోకి విడుదల చేశారు. 1971లో మొట్టమొదట కే1 రకం ఇక్కడ విడుదల చేశారు. ప్రస్తుతం అధిక దిగుబడి నిచ్చి, బెట్టను బాగా తట్టుకునే కదిరి–6, కదిరి 7, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి–9, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి(కె1812) రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. 


అధిక దిగుబడినిచ్చే రకాలు.. 

కదిరి లేపాక్షి (కె1812): ఈ వంగడాన్ని 2020 సంవత్సరంలో విడుదల చేశారు. ఖరీఫ్‌లో హెక్టారుకు 35 క్వింటాళ్లు, రబీలో 45 నుంచి 50 క్వింటాళ్ల దాకా దిగుబడినిస్తుంది. పంట కాలం 112 రోజులు. ఆకుమచ్చ, వైరస్‌ తెగులు, రసం పీల్చే పచ్చదోమ, తామర వంటి చీడపీడలను బాగా తట్టుకోగలదు. బెట్ట పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. 


కదిరి అమరావతి:
ఈ రకం విత్తనాన్ని 2016లో విడుదల చేశారు. ఇది కె–6, ఎన్‌సీఏసి 2242 రకాలను సంకరణ చేసి అభివృద్ధి చేసిన గుత్తి రకం. 115  నుంచి 120 రోజుల్లో పంట చేతికొస్తుంది. హెక్టారుకు 1,705 కిలోల దిగుబడినిస్తుంది. నీటి ఆధారంగా సగటున 2,590 కిలోల దిగుబడి వస్తుంది. మొవ్వకుళ్లు, ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులతో పాటు బెట్టను కూడా బాగా తట్టుకోగలదు. 


కదిరి–6(కె–6) :
ఈ విత్తనం 2002లో విడుదలైంది. గింజ పరిమాణం జేఎల్‌ 24 కన్నా 5 శాతం పెద్దగా ఉంటుంది. పంట కాలం 110 రోజులు. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి 880, రబీలో 1,600 నుంచి 1,700 కిలోల దిగుబడి నిస్తుంది. ఆకర్షణీయమైన గింజ నాణ్యత వల్ల మన దేశ ఎగుమతిలో 60 శాతం కె–6 రకం ఉంది. దేశ వేరుశనగ విస్తీర్ణంలోనూ 50 శాతం వరకు ఆక్రమించింది. దీన్ని ‘ఫ్రైడ్‌ ఆఫ్‌     ఇండియా’గా పిలుస్తారు. 


కదిరి–7(కె–7):
ఇది పెద్ద గుత్తి రకం విత్తనం. పంట కాలం ఖరీఫ్‌లో 120 నుంచి 125 రోజులు, రబీలో 130 నుంచి 135 రోజులు. దీన్ని 2009లో విడుదల చేశారు. ఆకుమచ్చ, తామర పురుగులను బాగా తట్టుకుంటుంది. వంద గింజల బరువు 70 గ్రాముల వరకు ఉంటుంది. 40 రోజుల వరకు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. ఎగుమతికి, పచ్చికాయలకు అధిక గిరాకి ఉండే రకం. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో అయితే 1,800 నుండి 2,000 కిలోల దిగుబడి నిస్తుంది. 


కదిరి–8(కె–8):
ఇది కూడా పెద్ద గుత్తిరకం. దీన్ని 2009లో విడుదల చేశారు. 100 గింజల బరువు 75 గ్రాములు ఉంటుంది. తామర పురుగులను తట్టుకోగలదు. నీటి వసతి, సారవంతమైన భూములకు అనుకూలమైన రకం. పంటకాలం ఖరీఫ్‌లో 120 రోజులు, రబీలో 130 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో 1,800 నుంచి 2,000 కిలోల దిగుబడినిస్తుంది. 


కదిరి–9(కె–9):
ఈ వంగడాన్ని 2009లో విడుదల చేశారు. ఇది చిన్న గుత్తి రకం. 45 రోజుల పాటు వర్షం రాకపోయినా తట్టుకోగలదు. నెల రోజుల పాటు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి∙115 రోజులు, రబీలో 115 నుంచి 120 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి 1,000 కిలోలు, రబీలో అయితే 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడినిస్తుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు, రసంపీల్చే పచ్చదోమ, తామర, ఎర్రనల్లి, నులి పురుగులను తట్టుకునే రకం. 


కదిరి అనంత:
దీన్ని 2010లో విడుదల చేశారు. ఇది కూడా చిన్న గుత్తి రకం. వర్షాభావ పరిస్థితులను బాగు తట్టుకోగలదు. బెట్ట పరిస్థితుల నుంచి∙త్వరగా కోలుకునే రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో అయితే 1400 నుంచి∙1,800 కిలోల దిగుబడి వస్తాయి. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి 110 రోజులు, రబీలో 110 నుంచి  120 రోజులు ఉంటుంది. ఆకుమచ్చ, రసం పీల్చే పురుగులను బాగా తట్టుకోగలదు.  

కదిరి హరితాంధ్ర: ఈ రకం విత్తనాన్ని కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు  2010లో విడుదల చేశారు. పరిపక్వ దశ వరకు ఆకుపచ్చగా ఉండి ఎక్కువగా పశువుల మేత(కట్టె)నిస్తుంది. ఇది కూడా ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడి నిస్తుంది. బెట్టను, ఆకుమచ్చ, తామర పురుగు, కాళహస్తి తెగుళ్లను బాగ తట్టుకోగలదు.  

స్థానికంగానే మంచి విత్తనం 
వ్యవసాయ పరిశోధన కేంద్ర కదిరిలో ఉండటం ఈ ప్రాంత రైతుల అదృష్టం. దీనివల్ల స్థానికంగానే మేలైన విత్తనం లభిస్తోంది. కదిరి రకాలు దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలకు రైతులంతా రుణపడి ఉంటాం. 
– రైతు జి.గోగురత్నం, వేపమానిపేట, తలుపుల మండలం 

సందేహాలన్నీ నివృత్తి చేస్తారు
కదిరి వేరుశనగ రకాలు దేశంలోనే పేరుగాంచాయి.  వేరుశనగ రైతులకు ఏ సందేహాలున్నా కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎంతో ఓపికతో నివృత్తి చేస్తారు. ఏ సమయంలో ఫోన్‌ చేసినా పలుకుతారు. ఈ ప్రాంత రైతులే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఇక్కడికి వచ్చి మూల విత్తనం తీసుకెళ్తుంటారు. 
– ఎం.రమణ, సున్నపుగుట్ట తండా, కదిరి మండలం 

అందరి కృషి ఫలితమే 
శాస్త్రవేత్తలందరికి కృషి ఫలితంగానే మేలైన రకాలు అందిస్తున్నాం. ఒక కొత్త రకం పరిశోధనకు ఎనిమిదేళ్లు పడుతుంది. పరిశోధన స్థానం ఉత్పత్తి చేసిన  మరో రెండు కొత్త రకం వంగడాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కదిరి వేరుశనగ రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయంటే మన రాష్ట్రానికే గర్వకారణం. దేశంలోని ఐదు ముఖ్యమైన పరిశోధన స్థానాల్లో కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం కూడా ఒకటి.     – డాక్టర్‌ సంపత్‌కుమార్, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త, కదిరి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement