కదిరి తహసీల్దార్ కార్యాలయంలో చేతిలో డబ్బులతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు హయాంలో ‘తెలుగు తమ్ముళ్లు’ లంచాలు, దౌర్జన్యాలతో పనులు కానిచ్చుకున్నట్లుగానే ఇప్పుడూ బరితెగిస్తున్నారు. తమ పనులు చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు డబ్బులు ఎరగా వేసేందుకూ వెనుకాడడంలేదు. ఇందుకు తాజాగా సోమవారం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండల రెవెన్యూ అధికారికి లంచం ఇచ్చేందుకు ఏకంగా టీడీపీ మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డే ప్రయత్నించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఆ వివరాలు.. కదిరిలో పల్లె రఘునాథరెడ్డికి సంబంధించి శ్రీవివేకానంద పేరుతో డిగ్రీ కాలేజీ ఉంది.
కాలేజీకి సెక్యూరిటీ కార్పస్ ఫండ్ కోసం సైదాపురం రెవెన్యూ పొలంలో 38/1, 38/2, 38/5, 38/6 సర్వే నంబర్లలోని 4.5 ఎకరాల స్థలాన్ని పూచీగా చూపించారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని సుమారు 88 ప్లాట్లుగా విభజించి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎలాంటి హద్దులు చూపకుండానే అమ్మకాలు చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి.. అనుమతుల్లేవని తేల్చారు. ఈ తతంగం చాలారోజుల క్రితమే జరిగింది. ప్రస్తుతం ఈ స్థలానికి అధికారిక అనుమతులివ్వాలని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. అయితే, వారు ససేమిరా అన్నారు.
చదవండి: బండారూ.. తప్పుడు ప్రచారం మానుకో..
డబ్బు ఎరగా చూపి..
రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు రాకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి పల్లె రఘునాథరెడ్డిపై ఒత్తిడి ఎక్కువైంది. ఈ క్రమంలో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అనుమతులివ్వాలని కోరారు. లంచాలు ఇచ్చేందుకూ ప్రయత్నించారు. డబ్బు వద్దని.. నిబంధనల ప్రకారమే పనిచేస్తామని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. తాజాగా.. సోమవారం ఉదయం కూడా కదిరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన పల్లె రఘునాథరెడ్డి తన చేతిలో ఇలా‘నోట్లు’ పట్టుకుని ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మోసపూరిత బుద్ధి మానుకుంటే మంచిది : ఎమ్మెల్యే సిద్ధారెడ్డి
అవినీతికి పాల్పడటం, అక్రమాలు చేయడం టీడీపీ నేతలు మానుకుంటే మంచిది. సెక్యూరిటీ కార్పస్ ఫండ్‌కు అనుమతులు తీసుకున్న స్థలంలో ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం సరికాదు. మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. ఎలాంటి అనుమతులివ్వడం సాధ్యంకాదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పారు. అయితే.. డబ్బులతో అధికారులకు గాలం వేయాలని పల్లె రఘునాథరెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటు.
Comments
Please login to add a commentAdd a comment