groundnut seeds
-
వేరుశనగ నూతన వంగడం @ కదిరి
వేరుశనగ సాగుకు దేశంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా పేరుగాంచింది. కానీ అతివృష్టి, అనావృష్టి, చీడపీడలతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూసేవారు. ఈ క్రమంలోనే కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతుకు అండగా నిలిచారు. పరిశ్రమిస్తూ.. పరిశోధన చేస్తూ నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. వాతావరణ పరిస్థితులు, తెగుళ్లు తట్టుకునే విత్తనాన్ని ఉత్పత్తి చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. కదిరి: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రం రాష్ట్రానికే తలమానికం. ఇక్కడ ఉత్పత్తి చేసిన వేరుశనగ విత్తన రకాలు దేశ వ్యాప్తంగా సాగు చేస్తున్నారు. దాదాపు 14 రకాల నూతన వంగడాలను కదిరి పరిశోధన స్థానం ఉత్పత్తి చేసింది. జాతీయ వేరుశనగ ఉత్పత్తిలో 50 శాతం కే–6 వంగడానిదే కావడం గమనార్హం. అనంత నుంచి కదిరికి మార్పు.. 1954లో ప్రాంతీయ నూనె గింజల పరిశోధన కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేశారు. పరిశోధనకు అనువైన వాతావరణ పరిస్థితులు, తగిన నేలకోసం 1959లో కదిరికి తరలించారు. 1982లో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అనుబంధం చేశారు. 1985లో పూర్తిస్థాయి పరిశోధన కేంద్రంగా మారింది. అనేక మంది శాస్త్రవేత్తలు 40 ఎకరాల విస్తీర్ణంలోని పొలాల్లో నిరంతరం శ్రమిస్తుంటారు. ఒక కొత్తరకం వంగడం కనుక్కొని విడుదల చేయడానికి 8 ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూలవిత్తనంపై 50 శాతం సబ్సిడీ.. కదిరి పరిశోధన స్థానం విడుదల చేసిన వేరుశనగ మూల విత్తనాన్ని రైతులకు జగన్ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఈ సబ్సిడీని ఎత్తేశారు. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం రాయితీని తిరిగి పునరుద్ధరించింది. కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మూలవిత్తనం తీసుకెళ్లి పండించిన దిగుబడులను సైతం మళ్లీ రైతులు ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. మూలవిత్తనం కొనుగోలు సమయంలోనే ఇక్కడి శాస్త్రవేత్తలు దిగుబడుల కొనుగోలుపై రైతులతో ఒప్పందం చేసుకుంటారు. పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు.. కదిరి–1(కె–1), కదిరి–2(కె–2), కదిరి–3(కె–3), వేమన, కదిరి–4(కె–4), కదిరి–5(కె–5), కదిరి–6(కె–6), కదిరి–7(కె–7), కదిరి–8(కె–8), కదిరి–9(కె–9), కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి ఇలా మొత్తం 14 నూతన వంగడాలను కనుగొని మార్కెట్లోకి విడుదల చేశారు. 1971లో మొట్టమొదట కే1 రకం ఇక్కడ విడుదల చేశారు. ప్రస్తుతం అధిక దిగుబడి నిచ్చి, బెట్టను బాగా తట్టుకునే కదిరి–6, కదిరి 7, కదిరి హరితాంధ్ర, కదిరి అనంత, కదిరి–9, కదిరి అమరావతి, కదిరి లేపాక్షి(కె1812) రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అధిక దిగుబడినిచ్చే రకాలు.. కదిరి లేపాక్షి (కె1812): ఈ వంగడాన్ని 2020 సంవత్సరంలో విడుదల చేశారు. ఖరీఫ్‌లో హెక్టారుకు 35 క్వింటాళ్లు, రబీలో 45 నుంచి 50 క్వింటాళ్ల దాకా దిగుబడినిస్తుంది. పంట కాలం 112 రోజులు. ఆకుమచ్చ, వైరస్ తెగులు, రసం పీల్చే పచ్చదోమ, తామర వంటి చీడపీడలను బాగా తట్టుకోగలదు. బెట్ట పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. కదిరి అమరావతి: ఈ రకం విత్తనాన్ని 2016లో విడుదల చేశారు. ఇది కె–6, ఎన్సీఏసి 2242 రకాలను సంకరణ చేసి అభివృద్ధి చేసిన గుత్తి రకం. 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికొస్తుంది. హెక్టారుకు 1,705 కిలోల దిగుబడినిస్తుంది. నీటి ఆధారంగా సగటున 2,590 కిలోల దిగుబడి వస్తుంది. మొవ్వకుళ్లు, ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులతో పాటు బెట్టను కూడా బాగా తట్టుకోగలదు. కదిరి–6(కె–6) : ఈ విత్తనం 2002లో విడుదలైంది. గింజ పరిమాణం జేఎల్ 24 కన్నా 5 శాతం పెద్దగా ఉంటుంది. పంట కాలం 110 రోజులు. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి 880, రబీలో 1,600 నుంచి 1,700 కిలోల దిగుబడి నిస్తుంది. ఆకర్షణీయమైన గింజ నాణ్యత వల్ల మన దేశ ఎగుమతిలో 60 శాతం కె–6 రకం ఉంది. దేశ వేరుశనగ విస్తీర్ణంలోనూ 50 శాతం వరకు ఆక్రమించింది. దీన్ని ‘ఫ్రైడ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. కదిరి–7(కె–7): ఇది పెద్ద గుత్తి రకం విత్తనం. పంట కాలం ఖరీఫ్‌లో 120 నుంచి 125 రోజులు, రబీలో 130 నుంచి 135 రోజులు. దీన్ని 2009లో విడుదల చేశారు. ఆకుమచ్చ, తామర పురుగులను బాగా తట్టుకుంటుంది. వంద గింజల బరువు 70 గ్రాముల వరకు ఉంటుంది. 40 రోజుల వరకు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. ఎగుమతికి, పచ్చికాయలకు అధిక గిరాకి ఉండే రకం. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో అయితే 1,800 నుండి 2,000 కిలోల దిగుబడి నిస్తుంది. కదిరి–8(కె–8): ఇది కూడా పెద్ద గుత్తిరకం. దీన్ని 2009లో విడుదల చేశారు. 100 గింజల బరువు 75 గ్రాములు ఉంటుంది. తామర పురుగులను తట్టుకోగలదు. నీటి వసతి, సారవంతమైన భూములకు అనుకూలమైన రకం. పంటకాలం ఖరీఫ్‌లో 120 రోజులు, రబీలో 130 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుండి 1,000 కిలోలు, రబీలో 1,800 నుంచి 2,000 కిలోల దిగుబడినిస్తుంది. కదిరి–9(కె–9): ఈ వంగడాన్ని 2009లో విడుదల చేశారు. ఇది చిన్న గుత్తి రకం. 45 రోజుల పాటు వర్షం రాకపోయినా తట్టుకోగలదు. నెల రోజుల పాటు పరిపక్వ నిద్రావస్థలో ఉంటుంది. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి∙115 రోజులు, రబీలో 115 నుంచి 120 రోజులు. ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి 1,000 కిలోలు, రబీలో అయితే 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడినిస్తుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు, రసంపీల్చే పచ్చదోమ, తామర, ఎర్రనల్లి, నులి పురుగులను తట్టుకునే రకం. కదిరి అనంత: దీన్ని 2010లో విడుదల చేశారు. ఇది కూడా చిన్న గుత్తి రకం. వర్షాభావ పరిస్థితులను బాగు తట్టుకోగలదు. బెట్ట పరిస్థితుల నుంచి∙త్వరగా కోలుకునే రకం. దిగుబడి కూడా బాగుంటుంది. ఖరీఫ్‌లో ఎకరాకు 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో అయితే 1400 నుంచి∙1,800 కిలోల దిగుబడి వస్తాయి. పంటకాలం ఖరీఫ్‌లో 105 నుంచి 110 రోజులు, రబీలో 110 నుంచి 120 రోజులు ఉంటుంది. ఆకుమచ్చ, రసం పీల్చే పురుగులను బాగా తట్టుకోగలదు. కదిరి హరితాంధ్ర: ఈ రకం విత్తనాన్ని కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు 2010లో విడుదల చేశారు. పరిపక్వ దశ వరకు ఆకుపచ్చగా ఉండి ఎక్కువగా పశువుల మేత(కట్టె)నిస్తుంది. ఇది కూడా ఎకరాకు ఖరీఫ్‌లో 800 నుంచి∙1,000 కిలోలు, రబీలో 1,400 నుంచి 1,600 కిలోల దిగుబడి నిస్తుంది. బెట్టను, ఆకుమచ్చ, తామర పురుగు, కాళహస్తి తెగుళ్లను బాగ తట్టుకోగలదు. స్థానికంగానే మంచి విత్తనం వ్యవసాయ పరిశోధన కేంద్ర కదిరిలో ఉండటం ఈ ప్రాంత రైతుల అదృష్టం. దీనివల్ల స్థానికంగానే మేలైన విత్తనం లభిస్తోంది. కదిరి రకాలు దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఇక్కడి శాస్త్రవేత్తలకు రైతులంతా రుణపడి ఉంటాం. – రైతు జి.గోగురత్నం, వేపమానిపేట, తలుపుల మండలం సందేహాలన్నీ నివృత్తి చేస్తారు కదిరి వేరుశనగ రకాలు దేశంలోనే పేరుగాంచాయి. వేరుశనగ రైతులకు ఏ సందేహాలున్నా కదిరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎంతో ఓపికతో నివృత్తి చేస్తారు. ఏ సమయంలో ఫోన్ చేసినా పలుకుతారు. ఈ ప్రాంత రైతులే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఇక్కడికి వచ్చి మూల విత్తనం తీసుకెళ్తుంటారు. – ఎం.రమణ, సున్నపుగుట్ట తండా, కదిరి మండలం అందరి కృషి ఫలితమే శాస్త్రవేత్తలందరికి కృషి ఫలితంగానే మేలైన రకాలు అందిస్తున్నాం. ఒక కొత్త రకం పరిశోధనకు ఎనిమిదేళ్లు పడుతుంది. పరిశోధన స్థానం ఉత్పత్తి చేసిన మరో రెండు కొత్త రకం వంగడాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కదిరి వేరుశనగ రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయంటే మన రాష్ట్రానికే గర్వకారణం. దేశంలోని ఐదు ముఖ్యమైన పరిశోధన స్థానాల్లో కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం కూడా ఒకటి. – డాక్టర్ సంపత్‌కుమార్, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త, కదిరి -
గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామని నమ్మించి వేలాది మంది నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేసిన గ్రీన్‌గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా కాంత్‌పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీల నుంచి నూనే తీసే యంత్రం ఇస్తామని దాంతో నెలకు పదివేలు సంపాదించవచ్చని ఆశ చూశారు. ఏజెంట్ల ద్వారా వీటికి ప్రచారం కల్పించి వేలాది మందిని మోసం చేశారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ స్కాంలో దాదాపు ఆరు వేలకు పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం. -
గొలుసు కట్టు.. గుట్టు రట్టు!
హైదరాబాద్: వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామని నమ్మించారు.. ఏజెంట్ల ద్వారా భారీ ప్రచారం చేశారు.. యంత్రం కొనుగోలు చేసిన వారికి నెలకు రూ.20 వేలు ఇస్తామని నమ్మబలికారు. వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు.. చివరికి వారందరినీ మోసం చేసి బోర్డు తిప్పేయాలని పన్నాగం పన్నారు. చివరికి పోలీసులు ఈ మోసగాళ్ల గుట్టు విప్పారు. ఇదీ మోసం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన జిన్నా శ్రీకాంత్, భాస్కర్ అనే మరో వ్యక్తితో కలసి హైదరాబాద్ ఉప్పల్‌లో గ్రీన్‌గోల్డ్ బయోటెక్ పేరిట గతేడాది ఓ కంపెనీ ప్రారంభించారు. రూ.లక్ష చెల్లిస్తే వేరు శనగ గింజల నుంచి నూనె తీసే యంత్రం ఇస్తామని చెప్పేవారు. ప్రతి నెలా రూ.20 వేలు ఇస్తామని ఏజెంట్ల ద్వారా చాలా మందిని నమ్మించారు. ఏజెంట్లకు కూడా భారీ నజరానాలు ఇస్తామని ఆశ చూపెట్టారు. ఇలా కొద్ది కాలంలోనే అక్కడి ప్రజలకు నమ్మకంగా ఉంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. బుధవారం రంగంలోకి దిగిన పోలీసులు ఉప్పల్‌లో ఉన్న సంస్థ కార్యాలయంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. మోసం బయటపడిందిలా.. సరూర్‌నగర్‌లో నివాసం ఉండే ఎన్.ఇందిరా కిరణ్ (28) అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. ఓ రోజు వేరుశనగల నుంచి నూనె తీసే యంత్రం స్కీం గురించి స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. నూనెతో పాటు నెలకు రూ.20 వేలు కూడా వస్తాయని నమ్మి, మరుసటి రోజే గ్రీన్‌గోల్డ్ కార్యాలయానికి వెళ్లి నిర్వాహకులను సంప్రదించాడు. ఆ ‘స్కీం’గురించి అన్ని వివరాలు చెప్పి కిరణ్‌ను శ్రీకాంత్ నమ్మించాడు. ఇచ్చిన లక్ష రూపాయల నుంచి నెలనెలా రూ.20 వేల చొప్పున ఇస్తామని అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అయితే నెల దాటినా కూడా డబ్బులు రాకపోవడంతో కంపెనీ యాజమాన్యాన్ని ఆశ్రయించాడు. అయినా ఫలితం లేకపోయింది. తనలాగే చాలా మందిని కంపెనీ యాజమాన్యం మోసం చేసిందని గుర్తించిన బాధితుడు కిరణ్ ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. సూత్రధారులు శ్రీకాంత్, భాస్కర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆశ చూపి మాయ చేశారు ఆశలు చూపి మాయ చేశారు,, హంగులు ఆర్భాటాలు చేశారు. అరచేతిలో వైకుంఠం చూపి చివరకు నట్టేట ముంచారని చిలుకానగర్‌కు చెందిన రాంరెడ్డి తన ఆవేదనను తేలిపారు. మూడు నెలల క్రితం రూ.70 వేలు కట్టించుకున్నారని మొదట్లో మూడు నెలల వరకు రూ.10 వేలు నెలకు బ్యాంకు ఖాతాల్లో వేసేవారని తరువాత కొత్త కష్టమర్లను నమ్మడానికి పాత వారిని వదిలేసి కొత్త వారికి డబ్బులు వేసి అనేక రకాలుగా నమ్మించి మోసం చేశారని తన ఆవేదనను వెల్లడించారు. –చిలుకానగర్‌కు చెందిన రాంరెడ్డి బాధితుడు -
రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి: వైఎస్ జగన్
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం ఆయన తొండూరు మండలం ఇనగలూరులో వేరుశెనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మొలకెత్తని విత్తానాల గురించి తమ గోడు వినిపించారు. నాసిరకం విత్తనాల వల్లే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాసిరకం విత్తనాలు ప్రభుత్వమే దగ్గరుండి సప్లయి చేస్తుందంటే సిగ్గుతో తల ఒంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జులై 15వ తేదీ లోపు రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం వైఎస్ జగన్... జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతులకు విత్తనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ప్చ్..50 శాతం బాగాలేవ్!
వేరుశనగ కాయలు ఒలిచి పరిశీలించిన ఎమ్మెల్యే విత్తనాల నాణ్యతపై పెదవి విరుపు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని ఆదేశం బీఎన్ఆర్ పేట (చిత్తూరు రూరల్) : ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాలు 50 శాతమే బాగున్నాయ ని, మరో 50 శాతం బాగా లేవని చిత్తూ రు ఎమ్మెల్యే సత్యప్రభ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్ పేటలో సబ్బిడీ విత్తనాల పంపిణీని ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్ పర్సన్ గీర్వాణి, ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే పంపిణీకి ఉంచిన కాయలను ఒలిచి, గింజల నాణ్యతను పరిశీలించారు. వాటి ని వేదికపై ఉన్న సింగిల్‌విండో అధ్యక్షుడు రంగనాథంకు చూపారు. వ్యవసా య అధికారులతో చర్చించి నాణ్యత కలి గిన విత్తనాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రైతులకు వ్యవసాయపరంగా ఏ సహా యం కావాలన్నా ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. జె డ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ, రైతుల శ్రే యస్సు కు ఉద్దేశించిన పథకాల ప్రయోజనాలు అర్హులకు అందేలా చూడాలని వ్యవసా య అధికారులకు ఆమె సూచించారు. 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ మాట్లాడుతూ, జిల్లాలో వేరుశనగ పంట గత ఏడాది 1.14 లక్ష హెక్టార్లలో సాగు కాగా ఈ ఏడాది 1.36 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. వేరుశనగ పంట సాగు విస్తీర్ణాన్ని పెం చేందుకు ప్రభుత్వం రాయితీతో విత్తనాలను అందజేస్తోందన్నారు. ఇందుకు జి ల్లాకు 90 వేల క్వింటాళ్లు కావాల్సి ఉం డగా తొలి విడతగా 50 వేల క్వింటాళ్లు వచ్చాయన్నారు. వీటితోపాటు రాయితీ తో కందులు, జనుము, జిప్సంను కూ డా ప్రభుత్వం ఇస్తోందన్నారు. వేరుశనగ బ స్తా ధర రూ. 2250 ఉంటే రాయితీతో రూ.1500 ఇస్తున్నామన్నారు. కార్యక్రమం లో జెడ్పీ సీఈవో పెంచల కిషోర్, ఆర్డీవో కోదండరాామిరెడ్డి, మండల వ్య వసాయశాఖాధికారి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసన్, ఏడీ రమేష్, సర్పంచ్ శోభా, పంచాయతీ కార్యదర్శి చిరంజీవి, టీడీపీ నాయకులు చంద్రప్రకాష్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. గుడిపాలలో.. గుడిపాల: మండలంలోని నరహరిపేట జెడ్పీ హైస్కూల్ ఆవరణలో సోమవారం వేరుశనగ విత్తనకాయలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయాధికారి హిమబిందు మాట్లాడుతూ, మండలానికి 810 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల అవసరం ఉందని, ఇప్పటివరకు 585 క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయన్నారు. అలాగే 4క్వింటాళ్ల కందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నా రు. తహశీల్దార్ బెన్నురాజ్, ఎంపీడీవో మల్లికార్జున్, ఎంపీపీ దీపశ్రీ, జెడ్పీటీసీ సభ్యురాలు సుమతి, సింగిల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయుడు, ఏఈలు దుర్గాప్రసాద్, సయ్యద్‌పీరా, బాలాజి, మహేష్‌బాబు, వైస్ ఎంపీపీ వేలాంగణి, టీడీపీ నాయకులు బాలాజి, నాగరాజ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వేరుశనగ కాయలకు జిప్సం మెలిక వేరుశనగ కాయలు తీసుకునే రైతులు కచ్చితంగా జిప్సం తీసుకోవాలని ప్రభుత్వం మెలిక పెట్టడంతో రైతులు విధిలేక తీసుకుంటున్నారు. ఎకరా పొలానికి 200 కేజీల జిప్సం తీసుకుంటేనే విత్తన కాయలు ఇస్తున్నారు. 200కేజీల జిప్సంకు అదనంగా రూ.340 రైతులు చెల్లిస్తున్నారు. -
జేసీ ప్రభాకర్ వివాదస్పద వ్యాఖ్యలు
-
జేసీ ప్రభాకర్ వివాదస్పద వ్యాఖ్యలు
అనంతపురం: తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముకునేందుకే అన్నదాతలు ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దళారుల సహకారంతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వేరుశెనగ విత్తనాల ధరలు పెరిగినందునే సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ పెరిగిందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిపోయిన తర్వాత రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని ప్రకటించి సంచలనం రేకిత్తించారు. -
పురుగుల దాడి ఎక్కువే... జాగ్రత్త
పాడి-పంట: కడప అగ్రికల్చర్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల రైతులు ఇప్పటికే వేరుశనగ విత్తనాలు వేసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని కొందరు ఇప్పుడిప్పుడే విత్తనాలు విత్తుతున్నారు. అయితే ఈ పైరుపై చీడ పురుగుల దాడి ఎక్కువగానే ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే దిగుబడులు దెబ్బతింటాయని వైఎస్సార్ జిల్లా ఊటుకూరు కృషి విజ్జాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేరుశనగ పైరులో చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలపై ఆయన అందిస్తున్న సూచనలు... వర్షాధార పైరులో... వర్షాధార వేరుశనగ పైరులో ఎర్ర గొంగళి పురుగు తాకిడి అధికంగా ఉంటుంది. పెద్ద పురుగులు చాలా చురుకుగా నేల మీద పాకుతూ గుంపులు గుంపులుగా పంటను తినేస్తాయి. ఈ పురుగు నివారణకు... నేల తడిసేలా వర్షం పడిన మరుసటి రోజు నుంచి 3-4 రోజుల పాటు పొలం గట్ల వద్ద రాత్రి వేళ 7-11 గంటల మధ్య మంటలు వేయాలి. రెక్కల పురుగులు అక్కడికి వచ్చి మంటలో పడి చనిపోతాయి. గుడ్ల సముదాయం, చిన్న పురుగులు ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. పొలం చుట్టూ లోతుగా గాడి తీసి, అందులో 2% మిథైల్ పారాథియాన్ పొడిని వేయాలి. పొలంలో, గట్ల మీద అక్కడక్కడ జిల్లేడు, అడవి ఆముదం కొమ్మలను (ఆకులతో ఉన్న) వేస్తే గొంగళి పురుగులు వాటి పైకి చేరతాయి. ఆ తర్వాత కొమ్మలను ఒక చోటికి చేర్చి, చెత్త వేసి కాల్చేయాలి. ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు వేప గింజల కషాయాన్ని కలిపి పిచికారీ చేసుకుంటే పురుగు గుడ్లు, పిల్ల పురుగులు నశిస్తాయి. ఎదిగిన పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వేరు పురుగు చేరి... వేరు పురుగు తెల్లగా, లద్దె పురుగు మాదిరిగా ఉంటుంది. ఇది భూమిలో దాగి ఉంటూ మొక్కల వేర్లను కొరికి తినేస్తుంది. దీంతో మొక్కలు చనిపోతాయి. ఈ పురుగును నివారించాలంటే విత్తనాలు విత్తడానికి ముందే ఎకరానికి 5 కిలోల ఫోరేట్ గుళికలు వేసుకోవాలి. లేకుంటే కిలో విత్తనాలకు 6 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ పట్టించి శుద్ధి చేయాలి. ఫోరేట్ గుళికలు వేరు పురుగులను నివారించడంతో పాటు రసం పీల్చే పురుగులు, చెదల బారి నుంచి పైరును 30 రోజుల వరకూ కాపాడతాయి. రసాన్ని పీలుస్తాయి రసం పీల్చే పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు వేరుశనగ పైరుకు అపార నష్టం కలిగిస్తాయి. పచ్చదోమ దాడి చేస్తే ఆకులు పసుపు రంగుకు మారతాయి. ఆకు చివరి భాగాలు క్రమేపీ ఇంగ్లీషు ‘వి’ ఆకారంలో ఎరుపు రంగుకు మారి కాలినట్లు కన్పిస్తాయి. తామర పురుగులు ఆశిస్తే ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగులు లేత ఆకులను గీకి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు పైకి ముడుచుకుపోతాయి. అంతేకాదు... తామర పురుగులు మొవ్వుకుళ్లు, కాండంకుళ్లు వైరస్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. పంట ఎదుగుదల కూడా తగ్గుతుంది. పేనుబంక తల్లి, పిల్ల పురుగులు కొమ్మల చివర్లలో, లేత ఆకుల అడుగు భాగంలో, పూత పైన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తుంటాయి. దీనివల్ల మొక్కలు వడలిపోయి గిడసబారతాయి. ఈ పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల నల్లని శిలీంద్రాలు ఆశించి, పూత రాలిపోతుంది. కిలో విత్తనాలకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి శుద్ధి చేసుకుంటే పంటను తొలి దశలో రసం పీల్చే పురుగులు ఆశించవు. పైరులో పురుగులు కన్పించినట్లయితే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 15-20 రోజుల తర్వాత ఈ మందును పిచికారీ చేసినట్లయితే వైరస్ తెగుళ్ల వ్యాప్తిని కూడా అరికట్టవచ్చు. పేనుబంక నివారణకు 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవచ్చు. ఆలస్యంగా విత్తినప్పుడు... వేరుశనగ విత్తనాలను ఆలస్యంగా వేసినప్పుడు లేదా పైరు ఎక్కువ రోజులు బెట్టకు గురైనప్పుడు ఆకుముడత పురుగులు ఆశిస్తాయి. తల్లి పురుగు ఆకు అడుగు భాగంలో మధ్య ఈనెకు దగ్గరగా గుడ్లు పెడుతుంది. వాటి నుంచి బయటికి వచ్చిన పిల్ల పురుగులు ఆకు పొరల్లో చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివల్ల ఆకు పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. పురుగులు పెద్దవవుతూ రెండు మూడు ఆకులను గూడుగా చేసుకొని పత్రహరితాన్ని తినేస్తుంటాయి. దీంతో ఆకులు మాడినట్లు కన్పిస్తాయి. పప్పు జాతి పైర్లతో పంట మార్పిడి చేసుకుంటే ఆకుముడత పురుగు తాకిడి ఉండదు. రా త్రి వేళల్లో పొలంలో దీపపు ఎరలను ఏర్పాటు చేస్తే రెక్కల పురుగులు అక్కడికి వచ్చి వాటిలో పడి చనిపోతాయి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేయాలి. -
రాయితీ ఉత్తిదే.. వేరుశనగ విత్తనాల పంపిణీలో గోల్మాల్
పరిగి, న్యూస్‌లైన్: వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాల ధర రైతులను అయోమయానికి గురిచేస్తోంది. పేరుకు 40శాతం రాయితీ అంటూ ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేస్తుండగా వాస్తవానికి రైతుకు పది రూపాయల రాయితీ కూడా వర్తించడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు లెక్కల గారడీతో రైతును నట్టేట ముంచుతున్నారు. ఓపెన్ మార్కెట్లో వేరుశనగ విత్తనాల ధరకు, వ్యవసాయ శాఖ నిర్ణయించిన ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. రాయితీ అంటూ పంపిణీ చేస్తున్న విత్తనాల ధర బయటికంటే ఎక్కువగా ఉండటంతో రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లాలోనే అత్యధికంగా పరిగి ప్రాంత రైతులు వేరుశనగ సాగు చేస్తారు. జిల్లాలో 15వేల ఎకరాల్లో వేరుశనగ సాగవుతుందని అధికారులు అంచనా వేస్తుండగా... ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 12వేల పైచిలుకు ఎకరాల్లో సాగు చేయనున్నారు. పొంతన లేని లెక్కలు... వేరుశనగ విత్తనాలకు వ్యవసాయ శాఖ నిర్ణయించిన ధర, ప్రభుత్వం ప్రకటించిన రాయితీని పరిశీలిస్తే... రైతుకు రాయితీ ఉత్తిదేనని స్పష్టమవుతుంది. క్వింటా వేరుశనగ విత్తనాల ధర రూ.5,400గా పేర్కొంటున్న వ్యవసాయ శాఖ అధికారులు, వాటిని ప్రభుత్వం ప్రకటించిన 40శాతం రాయితీ మేరకు రూ.1,800 పోను క్వింటా రూ.3,600 ధర చొప్పున రైతులకు అందజేస్తున్నారు. అయితే బయటి మార్కెట్లో వేరుశనగ విత్తనాల ధర ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పక్క జిల్లా గద్వాల్వ్యవసాయ మార్కెట్లో క్వింటా వేరుశనగ కాయలు రూ.2,500 నుంచి రూ.3,600 వరకు విక్రయిస్తున్నారు. అలాగే పరిగి వ్యవసాయ మార్కెట్లో సైతం క్వింటా రూ.3,400 నుంచి రూ.3,800 వరకు అమ్ముతున్నారు. బయట ధరలు ఇలా ఉంటే ప్రభుత్వం తమకిస్తున్న రాయితీ ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులే ప్రభుత్వ రాయితీని నొక్కేస్తున్నారన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరానికి జిల్లాకు 12,234 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించగా, ఇందులో పరిగి వ్యవసాయ డివిజన్‌కే 8,254 క్వింటాళ్లు అలాట్ చేశారు. ఈ విత్తనాలపై జిల్లా రైతులకు ప్రభుత్వం ద్వారా రూ.2,20,21,200 రాయితీ వర్తించాల్సి ఉంది. అయితే ఈ మొత్తాన్ని అధికారులో, మరే పెద్దలో స్వాహా చేస్తారని రైతులు ఆరోపిస్తున్నారు. మాకొద్దీ రాయితీ విత్తనాలు.. రాయితీ ప్రయోజనం అందని విత్తనాలు తమకొద్దని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పరిగి ప్రాంతానికి చెందిన వేలాదిమంది రైతులు మహబూబ్‌నగర్, గద్వాల్ వ్యవసాయ మార్కెట్ల నుంచి క్వింటాళ్ల కొద్దీ వేరుశనగ విత్తనాలను కొనుగోలు చేశారు. మండల పరిధిలోని రూప్ఖాన్పేట్లోనే వందమందికి పైగా రైతులు సుమారు 300 క్వింటాళ్ల వేరుశనగకాయలు గద్వాల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. అక్కడ క్వింటా రూ.2,500 -2,600 చొప్పున కొనుగోలు చేయగా, రవాణా ఖర్చులు కలుపుకొని రూ.2,800కే ఇంటికి తెచ్చుకున్నామని రైతులు పేర్కొంటున్నారు. మూడు క్వింటాళ్లు తెచ్చుకున్నా.. బయటి మార్కెట్‌తో పోలిస్తే రాయితీ వేరుశనగ విత్తనాల ధర ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గద్వాల్‌కు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేశాను. క్వింటా రూ.2,600 ధర చొప్పున మూడు క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు తెచ్చుకున్నాను. - రఘు, రూప్‌ఖాన్‌పేట్ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే పంపిణీ.. విత్తనాల ధరను, రాయితీని ప్రభుత్వమే నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలను వ్యవసాయశాఖ అధికారులుగా మేం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర, రాయితీల మేరకు వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నాం. - నగేష్‌కుమార్, ఏడీఏ పరిగి