పరిగి, న్యూస్‌లైన్: వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ విత్తనాల ధర రైతులను అయోమయానికి గురిచేస్తోంది. పేరుకు 40శాతం రాయితీ అంటూ ప్రభుత్వం విత్తనాలు పంపిణీ చేస్తుండగా వాస్తవానికి రైతుకు పది రూపాయల రాయితీ కూడా వర్తించడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు లెక్కల గారడీతో రైతును నట్టేట ముంచుతున్నారు. ఓపెన్ మార్కెట్‌లో వేరుశనగ విత్తనాల ధరకు, వ్యవసాయ శాఖ నిర్ణయించిన ధరకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. రాయితీ అంటూ పంపిణీ చేస్తున్న విత్తనాల ధర బయటికంటే ఎక్కువగా ఉండటంతో రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లాలోనే అత్యధికంగా పరిగి ప్రాంత రైతులు వేరుశనగ సాగు చేస్తారు. జిల్లాలో 15వేల ఎకరాల్లో వేరుశనగ సాగవుతుందని అధికారులు అంచనా వేస్తుండగా... ఒక్క పరిగి నియోజకవర్గంలోనే 12వేల పైచిలుకు ఎకరాల్లో సాగు చేయనున్నారు.
పొంతన లేని లెక్కలు...
వేరుశనగ విత్తనాలకు వ్యవసాయ శాఖ నిర్ణయించిన ధర, ప్రభుత్వం ప్రకటించిన రాయితీని పరిశీలిస్తే... రైతుకు రాయితీ ఉత్తిదేనని స్పష్టమవుతుంది. క్వింటా వేరుశనగ విత్తనాల ధర రూ.5,400గా పేర్కొంటున్న వ్యవసాయ శాఖ అధికారులు, వాటిని ప్రభుత్వం ప్రకటించిన 40శాతం రాయితీ మేరకు రూ.1,800 పోను క్వింటా రూ.3,600 ధర చొప్పున రైతులకు అందజేస్తున్నారు. అయితే బయటి మార్కెట్‌లో వేరుశనగ విత్తనాల ధర ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పక్క జిల్లా గద్వాల్‌వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా వేరుశనగ కాయలు రూ.2,500 నుంచి రూ.3,600 వరకు విక్రయిస్తున్నారు. అలాగే పరిగి వ్యవసాయ మార్కెట్‌లో సైతం క్వింటా రూ.3,400 నుంచి రూ.3,800 వరకు అమ్ముతున్నారు. బయట ధరలు ఇలా ఉంటే ప్రభుత్వం తమకిస్తున్న రాయితీ ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులే ప్రభుత్వ రాయితీని నొక్కేస్తున్నారన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరానికి జిల్లాకు 12,234 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించగా, ఇందులో పరిగి వ్యవసాయ డివిజన్‌కే 8,254 క్వింటాళ్లు అలాట్ చేశారు. ఈ విత్తనాలపై జిల్లా రైతులకు ప్రభుత్వం ద్వారా రూ.2,20,21,200 రాయితీ వర్తించాల్సి ఉంది. అయితే ఈ మొత్తాన్ని అధికారులో, మరే పెద్దలో స్వాహా చేస్తారని రైతులు ఆరోపిస్తున్నారు.
మాకొద్దీ రాయితీ విత్తనాలు..
రాయితీ ప్రయోజనం అందని విత్తనాలు తమకొద్దని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పరిగి ప్రాంతానికి చెందిన వేలాదిమంది రైతులు మహబూబ్‌నగర్, గద్వాల్ వ్యవసాయ మార్కెట్ల నుంచి క్వింటాళ్ల కొద్దీ వేరుశనగ విత్తనాలను కొనుగోలు చేశారు. మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్‌లోనే వందమందికి పైగా రైతులు సుమారు 300 క్వింటాళ్ల వేరుశనగకాయలు గద్వాల్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. అక్కడ క్వింటా రూ.2,500 -2,600 చొప్పున కొనుగోలు చేయగా, రవాణా ఖర్చులు కలుపుకొని రూ.2,800కే ఇంటికి తెచ్చుకున్నామని రైతులు పేర్కొంటున్నారు.
మూడు క్వింటాళ్లు తెచ్చుకున్నా..
బయటి మార్కెట్‌తో పోలిస్తే రాయితీ వేరుశనగ విత్తనాల ధర ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గద్వాల్‌కు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేశాను. క్వింటా రూ.2,600 ధర చొప్పున మూడు క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు తెచ్చుకున్నాను.
- రఘు, రూప్‌ఖాన్‌పేట్
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే పంపిణీ..
విత్తనాల ధరను, రాయితీని ప్రభుత్వమే నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలను వ్యవసాయశాఖ అధికారులుగా మేం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన ధర, రాయితీల మేరకు వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.
- నగేష్‌కుమార్, ఏడీఏ పరిగి
రాయితీ ఉత్తిదే.. వేరుశనగ విత్తనాల పంపిణీలో గోల్‌మాల్
Published Sat, Sep 28 2013 2:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement