యర్రంరెడ్డి(59), రెడ్డమ్మ(50)
వైఎస్‌ఆర్ జిల్లా , గాలివీడు : గోరాన్‌చెరువు గ్రామం బీసీ కాలనీకి చెందిన పందికుంట యర్రంరెడ్డి(59), రెడ్డమ్మ(50) సోమవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. మృతుడు యర్రంరెడ్డి కౌలుకు తీసుకున్న 5 ఎకరాలతో పాటు తన తల్లిపేరుతో ఉన్న రెండు ఎకరాల భూమిలో టమాట, వేరుశనగ పంటలు సాగు చేశాడు. ఇందుకోసం రూ, 6 లక్షలు అప్పు చేశాడు. నాలుగు సంవత్సరాల నుంచి సరైన వర్షాలు లేవు. సాగు చేసిన పంట చేతికి రాలేదు.
అప్పుల భారం ఎక్కువైంది. మరోవైపు రూ లక్ష వ్యయంతో రెండేళ్ల కిందట మూడు పాడి ఆవులు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. సంవత్సరం కిందట పాడి ఆవులు మృత్యువాతపడ్డాయి. అప్పు చెల్లించాల్సిన గడువు సమీపించడంతో ఏమి చేయాలో దిక్కుతోచలేదు. దీంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఊరిబయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ముగ్గురు కుమారులు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రహంతుల్లా, సీఐ యుగంధర్, ఎస్‌ఐ ఇనాయతుల్లా, ఏఓ మధుసూధన్ మంగళవారం సంఘటన స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment