ఆత్మహత్యకు పాల్పడిన గంగాధర్ (ఫైల్)
ప్రేమించిన అమ్మాయిని మోసం చేయలేకపోయాడు. నిశ్చితార్ధమయిన యువతితో పెళ్లికి సిద్ధం కాలేకపోయాడు. వంచన సరికాదని భావించాడు. క్షమాపణ కోరడానికి భయపడ్డాడు. దీంతో తానే చనిపోవాలని నిర్ణయించుకున్నాడో యువకుడు..తన మరణ శాసనాన్ని తానే రాసుకున్నాడు. కన్న తండ్రిని ఒంటరి చేసి మృత్యు ఒడి చేరాడు.
వైఎస్‌ఆర్ జిల్లా,ఖాజీపేట: ప్రేమ..పెళ్లి మధ్య నలిగిన ఓ యువకుడు తనువు చాలించాడు. ప్రేమను చంపుకోలేక మరొకరితో పెళ్లికి సిద్ధం కాలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిశ్చితార్ధమైన యువతికి క్షమాపణ చెప్పడానికి బయలుదేరి మార్గం మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్న వైనమిది. వివరాలివి. పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన కోపూరి గంగాధర్(27) ఇంటర్ వరకు చదువుకున్నాడు, బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. వివాహం చేసుకోవాలని భావించాడు. ఈ విషయం తెలియని తండ్రి లక్షుమయ్య తన కుమారునికి పోరుమామిళ్ల మండలం కవలకుంట్లలో ఓ యువతితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. గతనెలలో నిశ్చితార్థం కూడా జరిగింది. తొందరలోనే వివాహానికి ముహూర్తం పెట్టుకోవాలనుకున్నారు. ఈ తరుణంలో గంగాధర్ తన ప్రేమ సంగతిని తండ్రికి చెప్పాడు. లక్షుమయ్య ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. పునరాలోచనలో పడ్డాడు. నిశ్చితార్ధం చేసుకున్న వారింటికి వెళ్లి కుమారునితో క్షమాపణలు చెప్పించాలని భావించాడు. ఈనేపథ్యంలో గంగాధర్‌ను తీసుకుని మంగళవారం కవలకుంట్ల బయలుదేరాడు. ప్రేమను దాచి నిశ్చితార్ధమయ్యాక క్షమాపణ అడగడం విషయంలో గంగాధర్ మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. దారిలో తండ్రిని విడిచి పరారయ్యాడు. కుమారుడి ఆచూకీ కోసం తండ్రిగాలించి విఫలమయ్యాడు.(జైలులో ఆత్మహత్య చేసుకున్న తండ్రి)
రావులపల్లె చెరువులో మృతదేహం
రావులపల్లె చెరువులో బుధవారం ఉదయం గంగాధర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. మృతుని జేబులో సెల్‌ఫోను, ఒక పేపర్ పోలీసులకు కనిపించింది. పేపరుపై తండ్రి సెల్‌ఫోన్ నెంబరు రాసి ఆయనకు తన మృతదేహాన్ని అప్పగించాలని గంగాధర్ కోరాడు. పేపరుమీద ఉన్న నెంబరుకు పోలీసులు సమాచారమివ్వడంతో లక్షుమయ్య చెరవుగట్టుకు చేరుకున్నా డు. చెట్టంత కుమారుడు నిర్జీవంగా కనిపించేసరికి కన్నీరు మున్నీరయ్యాడు. మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. నిశ్చితార్థం అయిన అమ్మా యి ఇంటికి వెళ్లి క్షమాపణ కోరితే వారు ఏమంటారో అని గంగాధర్ బాగా మానసిక ఆందోళనకు.. ఒత్తిడికిగురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. వృద్ధాప్యంలో లక్షుమ య్య ఒంటరయ్యాడు. పెళ్లి చేసుకుని జీవిత చరమాంకంతో తోడుగా నిలుస్తాడనుకున్న కొడుకు అకాల మరణంతో ఆ వృద్ధుడు తేరుకోలేకపోతున్నాడు. 2012లో అనారోగ్యంతో ఇతని భార్య చనిపోయింది. గంగాధర్ ఒక్కడే కుమారుడు. నన్ను ఒంటరిని చేసే వెళ్లిపోతావా అంటూ రోదిస్తుంటే అక్కడున్నవారి హృదయాలు చలించిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment