end lives
-
కరోనా సోకిందని తల్లి, కుమార్తె బలవన్మరణం
తిరువొత్తియూర్: మలేషియాలో నివాసం ఉంటున్న తమిళ కుటుంబానికి కరోనా సోకడంతో విరక్తి చెంది తల్లి, కుమార్తె మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు. కడలూరు జిల్లా దిట్టకుడి కి చెందిన రవిరాజా (40) కంప్యూటర్ ఇంజినీర్. 12ఏళ్లకు పైగా మలేషియాలో భార్య సత్య (37), కుమార్తె గుహదరాణి (5)తో నివాసముంటున్నారు. గత వారం రవిరాజా సహా భార్య, కుమార్తెకు కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. రవిరాజా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. సత్య, గుహదమణి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో విరక్తి చెందిన సత్య, గుహదమణి నాలుగు రోజుల ముందు ఇంటి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి రవిరాజా ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం సాయంత్రం మృతిచెందాడు. రవిరాజా బంధువులు మాట్లాడుతూ మృతదేహాలను ఇవ్వడానికి మలేషియా ప్రభుత్వం తిరస్కరించిందని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వారి అస్తికలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి అస్తికలు సొంత గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
ఒకేసారి చనిపోవాలనుకున్నా..!
పేదింట పుట్టినా ఉన్నత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ తనకంటూ గుర్తింపు సాధించుకున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘రోజూ చనిపోవడం కంటే ఒకసారే చనిపోవాలనుకున్నాను’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొనడం హృదయాలను కలిచివేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు ప్రేమ విఫలం కావడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్ సమాచారం ప్రకారం ఇందుకు సబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లెల చెరువు గ్రామానికి చెందిన వంకబోయిన గాలయ్య, నాగమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు వంకరబోయిన శ్రీనివాసులు(27) గచ్చిబౌలి ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసే అన్న కృష్ణమూర్తితో కలిసి సుదర్శన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణమూర్తి నైట్ డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం 8.30 గంటలకు తిరిగి వచ్చాడు. ఇంట్లోకి రాగానే బెడ్రూమ్ గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. (ప్రేమ వ్యవహారం నడిపి.. పెళ్లి చేసుకోవడానికి..!) ఎంత పిలిచినా తమ్ముడు శ్రీనివాసులు పలుకలేదు. దీంతో తలుపు విరగ్గొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కాల్ చేయగా 108 వచ్చి చూసి శ్రీనివాసులు అప్పటికే మృతి చెందారని ధ్రువీకరించారు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ నోట్‌తో పాటు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శ్రీనివాసులు ‘తన చావుకు ఎవరు కారణం కాదని... బతకాలని లేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని... రోజు చావడం కంటే ఒకే సారి చస్తున్నా’నని సూసైడ్ నోట్లో రాశాడు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రేమ విఫలమే కారణమా? మేస్త్రీ పని చేసే గాలయ్య, కూలీ పనులు చేసే నాగమ్మల చిన్న కొడుకు శ్రీనివాసులు ఉన్నత చదువు చదివి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ యువతిని ప్రేమించగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నట్లు సోదరుడు కృష్ణమూర్తి పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆరు నెలలుగా మాట్లాడుకోవడం లేదు. లాక్డౌన్ సమయంలో ఊరికి వెళ్లిన సోదరుడు ఇంటి నుంచే కొద్ది రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేశారని తెలిపారు. యువతి కుటంబ సభ్యులతో తాను వెళ్లి మాట్లాడతానని చెప్పినా తన తమ్ముడు శ్రీనివాసులు అంగీకరించలేదన్నారు. మూడు నెలల క్రితం నుంచి ఇద్దరు అన్నదమ్ములు కలిసి సుదర్శన్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రేమించిన అమ్మాయిని మరువలేకనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడాదిగా తండ్రి ఇంటి వద్దే.. ఆత్మహత్య
తూర్పుగోదావరి ,కాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ పరిధి రాజేశ్వరి నగర్‌కు చెందిన వల్లభాపురపు దుర్గాప్రసాద్ (53), వెంకట పద్మావతి (45) దంపతులు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి పడక గదిలో సీలింగ్‌కు చీరతో వెంకట పద్మావతి, వంట గదిలో సీలింగ్ హుక్కు చీరతో దుర్గాప్రసాద్ ఉరివేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై బెంగళూరులో ఉంటోంది. చిన్న కుమార్తె రాధిక బీటెక్ చదువుతూ ఇంటివద్దే ఉంటోంది. ఆదివారం ఇంద్రపాలెంలోని అమ్మమ్మ ఇంటికి రాధిక వెళ్లింది. ఆ రాత్రి భార్యభర్తలిద్దరే ఇంట్లో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 సమయంలో తల్లిదండ్రులకు రాధిక తన అమ్మమ్మ ఇంటి నుంచి ఫోన్ చేయగా సమాధానం రాలేదు. దీంతో ఆమె ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు తెరచి లోపలికి వెళ్లి చూడగా వంటగదిలో తండ్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సర్పవరం ఎస్సై కృష్ణబాబు, సిబ్బంది శవ పంచానామాలు నిర్వహించారు. రాధిక ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. ఏడాదిగా తండ్రి ఖాళీగా ఇంటి వద్దే ఉండడంతో తరచూ తల్లిదండ్రులు గొడవ పడేవారని, ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని రాధిక పోలీసులకు తెలిపింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహితుడు, బాలిక ఆత్మహత్య
తూర్పుగోదావరి ,ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పక్క పక్క బిల్డింగ్లు వారివి... ఏం జరిగిందో ఏమో.. ఓ వివాహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. అతని మృతదేహం వద్ద రోదించిన బాలిక కొద్ది సేపటికే ఇంటికెళ్లి ఉరేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి 16వ డివిజన్లోని వాంబే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ పది నిమిషాల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడటం మిస్టరీగా మారింది. మృతి చెందిన వివాహితుడికి భార్య, ఐదేళ్ల పాప ఉండగా బాలిక తల్లి దుబాయ్‌లో పనికి వెళ్లగా తమ్ముడితో కలసి ఆమె ఇక్కడ ఉంటోంది. బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.లక్ష్మణరెడ్డి, ఎస్సై కె.శివాజీలు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం రామస్వామిపేటకు చెందిన రౌతు శివ (29) ఏడేళ్ల కిందట సత్యశ్రీని వివాహం చేసుకోగా ఐదేళ్ల రోషిణి సాయి కుమార్తె ఉంది. నాలుగేళ్ల నుంచి వారంతా వాంబే కాలనీలో ఉంటున్నారు. శివ, అతని భార్య సత్యశ్రీ నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నారు. గురువారం ఉదయం సత్యశ్రీ బయటకు వెళ్లి వచ్చే సరికి ఇంటి లోపల గడియపెట్టి ఎంత కొట్టినా భర్త శివ తీయకపోవడంతో పక్కింటి వారిని, ఇతరులను పిలిచింది. తలుపు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడంతో అతన్ని కిందకు దించి చూసే సరికి మృతి చెందాడు. శివ మృతదేహం వద్దకు బ్లాక్ నంబరు–6లో తమ్ముడితో కలసి ఉంటున్న దుర్గాదేవి (17) వచ్చి రోదించింది. ఈ లోగా ఆమెను అక్కడున్న వారిలో ఒకరు మందలించడంతో పరుగెత్తుకుని ఇంటికి వెళ్లి తలుపు వేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. తలుపు తీయకపోవడంతో బద్దలు గొట్టి లోపలకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండగా దుర్గాదేవిని కిందకు దించారు. చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఆర్థిక సమస్యలే కారణం ఆర్థిక సమస్యలతోనే తన భర్త రౌతు శివ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సత్యశ్రీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇద్దరం వస్త్ర దుకాణంలో పని చేస్తున్నామని, కరోనా వైరస్ నేపథ్యంలో కొంత ఆర్థిక సమస్య ఏర్పడిందని, దాని వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె చెప్పింది. ఈ మేరకు ఎస్సై శివాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొట్టడం వల్లే మనస్తాపం చెంది.. అన్నగా పిలిచే శివ మృతదేహం వద్దకు దారా దుర్గాదేవి వెళ్లినప్పుడు ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురు కొట్టడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని బాలిక మేనమామ రమణ బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దుర్గాదేవి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లే డాడీ లే... అంటూ రౌతు శివ మృతదేహం వద్ద అతని భార్య సత్యశ్రీతో పాటు ఐదేళ్ల కుమార్తె రోషిణి సాయి కూర్చుని ‘లే డాడీ లే...’ అని అనడం అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. ఆ చిన్నారికి తామేం సమాధానం చెప్పాలంటూ సత్యశ్రీ, శివ తండ్రి రౌతు శ్రీను రోధిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ పాపతో కలసి జీవిస్తున్న తరుణంలో శివ ఆత్మహత్యకు పాల్పడడం మింగుడు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తల్లికి ఏం చెప్పాలి దుర్గాదేవి మృతి చెందడంతో దుబాయ్‌లో ఉన్న ఆమె తల్లి సుజాతకు ఏం సమాధానం చెప్పాలని పిన్ని పగడాల సీతామహాలక్ష్మి రోదించింది. దుర్గాదేవిని తనకు అప్పగించి వెళ్లిన ఆమెకు తన ముఖం ఎలా చూపించాలంటూ బాధపడింది. అన్యాయంగా కొంతమంది కొట్టడంతోనే బాలిక మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. -
కరోనా కంటే చావే శరణ్యమని..
ఇల్లందకుంట(హుజురాబాద్): మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆశ్రమ నిర్వాహకులు, పోలీసులు, అధికారుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండలం కోరపల్లి పంచాయతీ పరిధి కాపులపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి అంకిరెడ్డి(77)కి యుక్త వయస్సులోనే వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తగదాతో విడిపోయారు. అప్పటినుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. గ్రామంలో తన సోదరి కుమారులతో కలిసి జీవనం సాగించేవాడు. ఇంటివద్ద తనను సరిగా పట్టించుకునేవారు లేకపోవడంతో అల్లుళ్ల సహాయంతో మొదట కరీంనగర్‌లోని వృద్ధాశ్రమంలో కొద్ది రోజులు ఉన్నాడు. అనంతరం ఇల్లందకుంట మండల కేంద్రంలో రామసాయి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో 2017లో చేరాడు. సదరు ట్రస్ట్‌లో ఇటీవల ముగ్గురికి కరోనా సోకింది. దీంతో వృద్ధుల బంధువులకు నిర్వాహకులు సమచారం ఇచ్చారు. పీహెచ్సీలో పరీక్షలు చేయించారు. అంకిరెడ్డితో రూంలో ఉన్నవారు ఇంటికి వెళ్లిపోయారు. తనతో పాటు ఉన్నవారు ఇంటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉండలేక మనస్తాపం చెంది సోమవారం రాత్రి ఆశ్రమంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంకిరెడ్డి ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకులే కారణమంటూ అఖిలపక్ష నాయకులు ఆశ్రమం ఎదుట ఆందోళన చేశారు. అయితే ఆశ్రమంలో కరోనా రావడంతో అందరి కుటుంబ సభ్యులకు సమాచా రం ఇచ్చామని, అంకిరెడ్డి బంధువులకు సమాచారం ఇస్తే స్పందన లేదని, కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసి ఆశ్రమంలో నే ఉంచుకోవాలని, ఇక్కడ చూసుకునేవారు లేరని అన్నట్లు ఆశ్రమ నిర్వాహకుడు ముక్కా వెంకన్న పేర్కొన్నారు. ముందుగా చెప్పినట్లుగానే.. మూడురోజుల క్రితం వృద్ధాశ్రమంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు పరిశీలనకు వచ్చారు. వృద్ధులందరినీ ఇంటికి పంపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటికి వెళ్తే తనను పట్టించుకునేవారు ఎవరూ లేరని, దీని కంటే నాకు చావు శరణ్యమని అక్క డే ఉన్న అంకిరెడ్డి విలపించాడు. తను అన్నట్టుగానే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
భార్యను చంపి.. గొంతు కోసుకుని..
చిత్తూరు ,వి.కోట: భార్యను హతమార్చి అనంతరం తానూ గొంతుకోసుకున్న సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాముగానిపల్లెకు చెందిన ప్రభాకర్‌రెడ్డి (37)కి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా అల్కీల్æ గ్రామానికి చెందిన అరుణ(29)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి దిలీప్(7), మౌనిక (6) పిల్లలు ఉన్నారు. ప్రభాకర్ గొరెల్రు మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య అరుణపై అనుమానం పెంచుకుని మద్యం సేవించి గొడవ పడేవాడు. గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ చేసినా ఫలితం లేదు. సోమవారం దంపతులు ఇద్దరూ గొర్రెలకు మేతకోసం ఉదయాన్నే తమ పొలం వద్దకు వెళౠ్లరు. అక్క డ ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ప్రభాకర్ క్షణి కావేశంతో తన వద్ద ఉన్న కొడవలితో భార్య మెడపై నరికి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో తానూ గోంతుకోసుకుని ఆత్మహత్యకుయత్నించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ మహేష్‌బాబు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ప్రభాకర్‌ను కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ ఆరిపుల్లా గ్రామస్తులతో మాట్లాడి సమాచారం సేకరించారు. -
కరోనా వచ్చిందంటూ హేళన.. ఆత్మహత్య
బ్రహ్మసముద్రం: అనుమానం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కరోనా వైరస్ వచ్చిందంటూ హేళన చేయడంతో ఆ వ్యక్తి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండల పరిధిలోని ముప్పులకుంటలో గత ఐదు రోజుల క్రితం బోయ రామచంద్రప్ప కరోనా వైరస్‌తో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన చాకలి నాగన్న అతన్ని గ్రామంలో చనిపోకముందు పలకరించాడని అతనితో గ్రామస్తులు దూరంగా ఉంటూ వచ్చారు. ‘నీకు కూడా కరోనా వైరస్ సోకింది’దంటూ హేళన చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నాగన్న.. గురువారం మధ్యాహ్నం ముప్పులకుంట – కళ్యాణదుర్గం అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉండగా అటుగా వెళ్లిన పశువుల కాపరులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. స్థానికులు 108 వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లైన నెలకే వేధింపులతో..
పెద్దపల్లి,ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన జక్కుల సమత (23) అనే వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సమతను నాలుగు నెలల క్రితం వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన జక్కుల మహేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లైన నెల రోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త మహేష్‌తో పాటు అత్తమామ మల్లవ్వ, చంద్రయ్య, ఆడపడుచు సునీత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. అంతే కాకుండ మహేశ్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధించేవాడని మృతురాలి సోదరుడు జెల్ల అనిల్ తెలిపాడు. అనిల్ ఫిర్యాదు మేరకు రామగుండం ఏసీపీ ఉమేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిద్రపట్టడం లేదని.. ఉరేసుకుని
మోత్కూరు : నిద్ర పట్టడం లేదని మనోవేదనతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరులోలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన కొండకింది సోమిరెడ్డి (52) అలియాస్ థామస్‌రెడ్డి స్థానిక ఓ జువెల్లరి షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతను ఆరు నెలలుగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు. ఉదయం భార్య జోనమ్మ, కుమారుడు జోసెఫ్‌రెడ్డి కూలి పనులకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సరికి తండ్రి విగతజీవిగా కనిపించాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్ఐ అంకిరెడ్డి యాదయ్య తెలిపారు. -
భార్య మృతి.. భర్త ఆత్మహత్య
పంజగుట్ట: అనుమానాస్పద స్థితిలో భార్య మరణించింది. భవనంపై నుంచి దూకి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల బంధువుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లగడపు నాగేశ్వర రావు(37), రోజా (29) దంపతులు. వీరికి అర్చక్ (9), భరత్(6) ఇద్దరు కొడుకులున్నారు. ఆరు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి బీఎస్ మక్తాలో నివాసం ఉంటున్నారు. నాగేశ్వర రావు, రోజా ఇద్దరూ కూలీ పనులకు వెళ్తుండగా పిల్లలు స్థానికంగా ఉన్న సంతోషి మాతా స్కూల్లో ఒకరు మూడవ తరగతి, మరొకరు ఒకటవ తరగతి చదువుతున్నారు. మంగళవారం తెల్లవారు జామున సుమారు 5 గంటల ప్రాంతంలో వీరు ఉండే భవనం ఐదవ అంతస్తుకు వెళ్లిన నాగేశ్వరరావు ఎలివేషన్ రేలింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీపంలోనే రోజా తల్లిదండ్రులు ఉండటంతో వారు సమాచారం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందాడు. వీరు నివాసం ఉండే మూడవ అంతస్తుకు వెళ్లిచూడగా మంచంపై రోజా మృతి చెంది ఉండగా ఇద్దరు పిల్లలు రోజాకు అటు ఒకరు, ఇటువైపు ఒకరు పడుకుని ఉన్నారు. రోజా మరణంపై అనుమానాలు రోజా మరణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా నాగేశ్వర్రావు మేస్త్రీ పనిచేస్తుండగా, రోజా కూడా అతనితో పాటు కూలీ పనికి వెళ్లేదని, ఇద్దరూ కలిసి రోజు కనీసం రూ. 1500 వరకు సంపాదించేవారని బంధువుల ద్వారా తెలిసింది. పిల్లలను అడిగితే నాలుగు రోజులుగా తల్లిదండ్రుల మధ్య స్వల్ప ఘర్షణలు అవుతున్నట్లు అవి ఎందుకో తెలియవని చెపుతున్నట్లు తెలిసింది. కాగా రోజా బాడీపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. రోజాను చంపి భయంతో నాగేశ్వర రావు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే కారణమేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనాథలైన పిల్లలు... తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. ఇద్దరు చిన్న పిల్లలకు తల్లిదండ్రులు లేరు అని తెలియక ఆడుకుంటున్నారు. పిల్లల అమ్మమ్మ వారిని పట్టుకుని ఏడుస్తున్న తీరు చూపరుల హృదయాలను కలచివేసింది. -
తమ్మునికి కరోనా, అన్న ఆత్మహత్య
కర్ణాటక,కోలారు: తమ్మునికి కరోనా సోకగా, ఆ భయంతో అన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలారు నగరంలోని గాంధీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కాలనీకి చెందిన నాగరాజ్ (37) అనే తాపీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. శనివారం మధ్యాహ్నం తమ్మునికి కరోనా పాజిటివ్‌గా రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు అతనిని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో తనకు కూడా కరోనా సోకి ఉంటుందేమోననే అన్న నాగరాజ్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అజయ్, శ్రావణిల ప్రేమ విషాదాంతం
మేడిపల్లి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు పెద్దల నిర్ణయాన్ని అడిగారు. వివాహానికి వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బుధవారం మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న బోరెండల్ కిరణ్‌కుమార్ కూతురు శ్రావణి (23) స్థానికంగా ఉన్న బిగ్‌బజార్ సేల్స్ విభాగంలో పని చేస్తోంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన తుమ్మల చంద్రయ్య కుమారుడు అజయ్ ఉప్పల్‌లోని బజాజ్ వెహికల్ షోరూంలో పని చేస్తున్నాడు. శ్రావణి, అజయ్‌లకు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇటీవల వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.(మేడ్చల్: ఓయో లాడ్జిలో దారుణం!) శ్రావణి కుటుంబికులు ఇందుకు అంగీకరించినా.. అజయ్ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదని పోలీసులు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రేమికులిద్దరూ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం మేడిపల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి బాత్రూంలో నీళ్ల చప్పుడు రావడంతో హోటల్ సిబ్బంది డోర్‌ను తట్టారు. అప్పటికే ఇద్దరూ క్రిమిసంహారక మందును తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్ డోర్ తీసి కిందపడిపోయాడు. అంతకు ముందే బెడ్‌పై శ్రావణి మృతిచెంది ఉంది. అజయ్‌ను చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఎంత కాలం నటిస్తావు..?
శంషాబాద్: మూడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి.. ఆత్మహత్యకుకు ముందు భర్త వెంకటేశ్వరావును ఉద్దేశించి మాట్లాడిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అతడి ప్రవర్తనతో విసిగి జీవితంపై విరక్తితో ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నాని లావణ్య లహరి గతంలోని ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.. అదే రోజు ఆ వీడియోకు ముందు వెంకటేశ్వర్రావును ఉద్దేశించి కూడా లావణ్య మాట్లాడిన మరికొంత వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ‘సమాజాన్ని మోసం చేయడానికి ముసుగు వేసుకుని నటిస్తున్నావు.. ఎంత కాలం నటిస్తావు..? నీ కుటుంబ చరిత్ర కూడా ఎంతో హీనమైంది.. నిన్ను కూడా అదే దారిలో నడిపించాలని వారు చూస్తున్నారు. ప్రేమ.. ప్రేమ అని వెంటపడి నన్ను మోసం చేశావు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘డబ్బుతో ఏ నీచానికైనా ఒడిగట్టాలనే మనస్తత్వం నీది.. మన మధ్యన ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదు. ఏడు నెలల గర్భం పోయి నేను బెడ్‌పై ఉన్నప్పుడు మరో ఆడదానితో చాటింగ్ చేశావు. రేపు దానిని కూడా నువ్వు మోసం చేస్తావు’ అని లావణ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నీవు నన్ను కొట్టిన ప్రతి దెబ్బలను ప్రతి గోడ చెబుతుంది.. అంతలా నన్ను శారీరకంగా హింసించావు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, గతంలోని వీడియోకి అనుబంధంగానే ఈ వీడియో ఉన్నప్పటికీ.. అప్పుడు బయటికి వచ్చిన వీడియో మధ్యలోంచి ఉంది.. ఇందులో ఆమె భర్తను నేరుగా ప్రశ్నించి.. ఆవేదన వ్యక్తం చేసినట్లు ఉంది. -
రమ్య ఆత్మహత్య.. శివభార్గవ్ కోసం గాలింపు
నెల్లూరు(క్రైమ్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రమ్య ఆత్మహత్య కేసులో నిందితుడు శివభార్గవ్ కోసం వేదాయపాళెం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రమ్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో నిందితుడు స్నేహితులతో కలిసి వారి ఇంటికి సమీపంలోని ఓ కళాశాలలో క్రికెట్ ఆడినట్లు, అనంతరం పరారైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని నిందితుడి ఆచూకీ కోసం విచారిస్తున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులను, బంధువులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. (ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో ) -
అంగన్వాడీ ఆయా ఆత్మహత్య
ఖమ్మంరూరల్: ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండల పరిధిలోని నాయుడుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటలోని తాళ్ళగడ్డకు చెందిన రేణుక(35)కు, నాయుడుపేటకు చెందిన పోలేబోయిన నాగేశ్వరరావుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. రేణుక అంగన్వాడీ ఆయాగా పని చేస్తోంది. భర్త నాగేశ్వరరావు ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడికి కూడా మాటలు సరిగా రావు. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా సరిగాలేకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. ఈ నెల 11న ఎవరూ లేని సమయంలో ఇంట్లోని ఇనుప పైపునకు ఉరి వేసుకుంది. కుటుంబీకులు గమనించి ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అపస్మారస్థితిలోనే చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు రావుల నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ ఎస్సై బాణాల రాము తెలిపారు. -
తన సొంత ఊర్లో వివాహం ఇష్టం లేక
నెల్లూరు(క్రైమ్): తన సొంత ఊర్లో వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమా చారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన మణికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరు కుమార్తెలకు నెల్లూరులో వివాహం చేశాడు. చిన్నకుమార్తె రాజేశ్వరి(23) కోయంబత్తూరులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు ఆమె నెల్లూరు నగరంలోని కొత్తూరులో నివాసం ఉంటున్న తన అక్క విజయలక్ష్మి ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో రాజేశ్వరికి తంజావూరులోనే సమీప బంధువుతో వివాహం చేసేందుకు ఆమె అవ్వ, కుటుంబసభ్యులు నిర్ణయించారు. తనకు తంజావూరులో వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, నెల్లూరు లో చేస్తే అక్కలతో కలిసి ఉంటానని రాజేశ్వరి వారికి చెప్పింది. వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన విజయలక్ష్మి, ఆమె కుటుంబసభ్యులు ఇంటి బయట మాట్లాడుకుంటుండగా రాజేశ్వరి ఇంట్లోని దూలానికి చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి ఇంట్లోకి వచ్చిన విజయలక్ష్మి తన సోదరి దూలానికి వేలాడుతుండటాన్ని గమనించి పెద్దగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, స్థానికులు హుటాహుటిన రాజేశ్వ రిని కిందకు దించారు. చికిత్సనిమిత్తం జీజీహెచ్‌కు తరలించా రు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజేశ్వరి అక్క భర్త శరవణ్‌కుమార్ బుధవారం అర్ధరాత్రి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సంతానం లేదని దంపతుల ఆత్మహత్య
బాసర:పెళ్లయి మూడేళ్లవుతున్నా పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాసర మండలం టాక్లీలో విషాదం నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మేశెట్టి రంజితను మహారాష్ట్రకు చెందిన సంతోష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. సంతోష్ ఇల్లరికం వచ్చాడు. అప్పటినుంచి దంపతులిద్దరూ టాక్లీలోనే ఉంటున్నారు. అయితే వారితోపాటు పెళ్లయిన వారికి పిల్లలు కలగడంతో కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. పిల్లల కోసం నిజామాబాద్, బాసరలోని వైద్యులను సంప్రదించారు. పిల్లలు లేకుంటే సమాజంలో చిన్నచూపు చూస్తారన్న భావనతో కొద్దిరోజులుగా భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ.. బుధవారం రాత్రి బాసరలోని గోదావరిలో ఇద్దరూ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం మృతదేహాలు నీటిలో తేలగా.. జాలర్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దంపతులిద్దరినీ సంతోష్ (26), రంజిత (22)గా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఉరి వేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య
మేడిపల్లి : మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు తెలిపిన మేరకు..మూలుగు జిల్లా వాజేడు మండలం తగుళ్లపల్లి గ్రామానికి చెందిన సూరిబాబు కుమారుడు నాగసాయిచందు (27). నగరంలోని మేడిపల్లి పరిధిలోని విహారిక కాలనీలో ఉంటూ మేడిపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత పదిహేను రోజులుగా నాగసాయిచందు లీవ్‌లో ఉన్నాడు. గురువారం మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో పాటు పని చేసే కానిస్టేబుల్ ప్రసన్న గమనించి కిందికి దించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు, నాగసాయిచందుకు మధ్య వివాదం ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదని
బొమ్మనహళ్లి : ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన బుధవారం సాయంత్రం ఆనేకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆనేకల్ పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన బి.తనూజ(22) ఇదే పట్టణంలోని కళాశాలలో ద్వితీయ పీయూసీ చదువుతోంది. తల్లిదండ్రులు మగ్గం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. సదరు యువతి తాను చదివే కళాశాలలోనే ఓ యువకుడిని ప్రేమించింది. తమకు వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరింది. వారు అంగీకరించకపోవడంతో బుధవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఎంతపని చేశావు నాయనా!
బొండపల్లి: తనకు ఇష్టంలేని గ్రూపును ఎంచుకొని చదవమనందుకు ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కన్నవారికి గర్భశోకాన్ని మిగిల్చాడు. ఈ విషాద సంఘటన దేవుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై డి.సాయికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. దేవుపల్లి గ్రామానికి చెందిన మూకల శ్రావణ్ కుమార్ (15) గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. కరోనా కారణంగా ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే ఇంటర్లో తనకు ఇష్టంలేని ఎంపీసీ గ్రూపును ఎంచుకొని తల్లిదండ్రులు చదవమన్నారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్ ఈ నెల ఐదో తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంతలో శ్రావణ్ కుమార్ దేవుపల్లి గ్రామ శివారు.. కోరాడ కృష్ణమూర్తికి చెందిన మామిడి తోటలో ఉన్న బావిలో శవమై తేలి ఉన్నట్టు వీఆర్వో నాగరాజు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు రామారావు, కోండమ్మ, సోదరుడు ఉన్నారన్నారు. అదృశమైన కుమారుడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని ఎదురుచూశామని.. శవమై దర్శనమిస్తాడని అనుకోలేదని తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
నవ వధువు బలవన్మరణం
పెగడపల్లి(ధర్మపురి): వరకట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వి వాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బతికపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ స భ్యులు, పోలీసులు తెలిపిన వివరాలప్ర కారం..గ్రామానికి చెందిన ఐలేని అంజి రెడ్డి–శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్య(22) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ది వ్యకు అదే గ్రామానికి చెందిన పెయ్యాల రాజిరెడ్డి–అంజలి దంపతుల కుమారుడు ప్రవీన్రెడ్డితో 2020 ఫిబ్రవరి 22న వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.10 ల క్షల నగదు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నం కింద ముట్టజెప్పారు. ఈనేపథ్యంలో దివ్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా ప్రవీన్‌రెడ్డి స్థానికంగా వ్యవసాయం చేస్తున్నాడు. (ప్రేమజంట ఆత్మహత్య) కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని లేదా కట్నం కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాలని అత్త, మామ రాజిరెడ్డి, అంజలిలతో పాటు భర్త వేధిస్తున్నారు. అంతే కాకుండా ప్రవీన్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా దివ్యను ఇబ్బందులను గురి చేయడంతో పాటు వాట్సప్ ద్వారా అసభ్యకరమైన మెస్సెజ్‌లు పంపించేవాడు. నాలుగు రోజులు క్రితం హైదరాబాద్ నుంచి తల్లి గారింటికి వచ్చిన దివ్య అత్తింటి పోరును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది. దీంతో మంగళవారం ఉదయం దివ్యను ఆమె తల్లిదండ్రులు అత్తారింటికి తీసుకు వచ్చి వారితో మాట్లాడుతుండగా తిరిగి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన దివ్య ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని తన తల్లిగారి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక తమ కూతరు ఆత్మహత్య చేసుకుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, ఎస్సై నవతలు ఘటనా స్థలాన్ని సందర్శించి శవ పంచనామ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రేమజంట ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో గ్రామ శివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గుండేటి రమ్య (22), మండలోజి ప్రణీత్‌చారి(22) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరు వేర్వేరు కులాలకు చెందినవారు. ఇటీవల రమ్యకు పెళ్లి నిశ్చయమైంది. తమ ప్రేమ విఫలం కావడం, మరొకరితో పెళ్లి ఇష్టంలేక రమ్య, ప్రణీత్‌చారి మంగళవారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లి గ్రామశివారులో పురుగుల మందు తాగి అనంతరం చెట్టుకు ఉరేసుకోగా రమ్య ఉరితాడు తప్పి కిందపడింది. తన తండ్రి ల క్ష్మణ్‌కు ఫోన్ చేసి పురుగుల మందు తాగానని చెప్పింది. వెంటనే అతడు మెట్‌పల్లిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ప్రణీత్‌చారి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతురాలి తండ్రి లక్ష్మణ్, మృతుడి తల్లి మండలోజు సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
నాన్నా.. తాగొద్దు.. అమ్మను బాగా చూసుకో
కర్నూలు(సెంట్రల్): నాన్నా తాగొద్దు. అమ్మను బాగా చూసుకో అంటూ లెటర్ రాసి పెట్టి బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కల్లూరులోని జానకీ నగర్‌కు చెందిన విజయకుమార్ జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్యలతోపాటు ఇంట్లో తండ్రి మందుకు అలవాటుపడడంతో చదువుపై దృష్టి సారించలేకపోయేవాడు. ఈక్రమంలో శుక్రవారం ఇంట్లో వాళ్లు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొనిఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలుతెలియాల్సి ఉంది. -
బిర్యానీ కోసం భర్తపై అలిగి..
సాక్షి, చెన్నై: తనకు బిర్యానీ కొనివ్వలేదన్న మనస్తాపంతో భర్తపై అలిగి ఓ వివాహిత ఆత్మాహుతి చేసుకుంది. మహాబలిపురంలో ఈ ఘటన వెలుగు చూసింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. మహాబలిపురంలోని శిల్ప తయారీ సంస్థలో మనోహరన్ పనిచేస్తున్నాడు. గురువారం తనకు బిర్యానీ తినాలని ఆశగా ఉందని, కొనిపెట్టాలని భర్తను శరణ్య కోరింది. అంతంత మాత్రమే నగదు ఉందని, మళ్లీ చూద్దామన్నట్టు చెప్పి ఇంటి నుంచి మనోహరన్ బయటకు వెళ్లాడు. మనస్తాపానికి గురైన శరణ్య భర్త మీద కోపంతో ఆయన బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను తీసి, తనపై పోసుకుని నిప్పు అంటించుకుంది. మంటల్ని ఆర్పి ఆమెను చెంగల్పట్టు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో శరణ్య మృతిచెందింది. -
మనోవేదనతో సర్పంచ్ ఆత్మహత్య
పూడూరు: మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సర్పంచ్ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. పూడూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) గత ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అయితే, ఆయన మంగళవారం రాత్రి కుటంబీకులతో కలిసి భోజనం చేసి ఓ గదిలో నిద్రించాడు. బుధవారం తెల్లవారినా నిద్రలేవలేదు. పడుకొని ఉండొచ్చని భావించిన ఆయన తమ్ముడు శ్రీహరి పొలానికి వెళ్లాడు. (అక్కా.. నాకు బతకాలని లేదు!) గంట తర్వాత అతడు తిరిగి వచ్చినా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో గదికి వెనుక ఉన్న తలుపులను తీసి చూడగా ఆనందం దూలానికి ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. కొంతకాలంగా తన సోదరుడికి ఆరోగ్యం సహకరించడం లేదని శ్రీహరి తెలిపారు. ఈక్రమంలో మానసికంగా వేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుఆనందం రాసిన ఓ సూసైట్ నోట్‌ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని అందులో సర్పంచ్ పేర్కొన్నాడు. వచ్చే నెలలోతనకు వివాహం నిశ్చయమైందని, అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. మృతుడి సోదరుడు శ్రీహరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, సర్పంచ్ల సంతాపం.. కొత్తపల్లి సర్పంచ్ ఆనందం ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, మండలంలోని పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆనందం మృతికి సంతాపం వ్యక్తం చేశారు.