
ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రీ, కూతురు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: భార్య మీద కోపంతో ఒక వ్యక్తి కన్న కూతురితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన రామనగర తాలూకా కటమానదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. కటమానదొడ్డి గ్రామం నివాసి రామచంద్ర (38), కుమార్తె వర్ష (5)ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామచంద్ర భార్య, కుమార్తెతో కలిసి రామనగరలో నివసించేవాడు. బుధవారం రాత్రి భార్యతో గొడవపడ్డ రామచంద్ర, కుమార్తెను తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోని ఇంట్లో మొదట కుమార్తెకు ఉరివేసి తరువాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు రామచంద్ర సెల్ఫీ వీడియో తీసుకుని తన భార్య ప్రవర్తన వల్లే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సందేశం రికార్డు చేశాడు. మిగతా కుటుంబ సభ్యులను క్షమాపణ కోరాడు. విషయం కాస్త బయటకు పొక్కడంతో భార్య పరారైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.