రోదిస్తున్న మృతుడి భార్య, కుటుంబ సభ్యులు, బత్సల శంకరరావు (ఫైల్)
సంతబొమ్మాళి: నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబంతో సంతోషంగా గడపాలని బతుకుదెరువుకు విదేశాలకు వెళ్లాడు. అనారోగ్య సమస్యల కారణంగా అక్కడే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకరరావు (38) గత ఏడాది మార్చిలో సౌదీ అరేబియా వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో వెల్డింగ్ పని చేస్తున్నాడు. నెల రోజుల నుంచి కిడ్నీ, నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడంతో స్వదేశానికి రావాలని ప్రయత్నించాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనల కారణంగా రావడానికి వీలులేకుండా పోయింది.
దీంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ నెల 15న ఆస్పత్రిలో చేరి కరోనా, ఇతర పరీక్షలు చేయించుకున్నాడు. తర్వాత ప్రత్యేక రూమ్‌లో ఉంచడంతో మరింత మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నెల 16, 17 తేదీల్లో బంధువులకు ఫోన్ చేసి అనారోగ్య సమస్యల కారణంగా చనిపోతానని చెప్పాడు. అలాంటి పని చేయవద్దని, త్వరలోనే లాక్‌డౌన్ ఎత్తివేస్తారని, స్వదేశానికి వచ్చేయవచ్చని బంధువులు భరోసా కల్పించారు. అయినా ఒత్తిడికిలోనై గురువారం రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు తెలిపారు. భర్త మరణవార్త విని భార్య కుసుమ, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులకు, జిల్లా అధికారులకు కుటుంబ సభ్యులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment