శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి (ఫైల్)
తిండిపోతును కాదు.. తాగుబోతును, తిరుగుబోతును అసలే కాదు.. పెద్దగా ఆశల్లేవు.. ఆర్భాటాలకు పోలేదు. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేసిన వాడ్ని కాదు. కానీ, ఆ దేవుడు నాకే ఎందుకు వేశాడీ శిక్ష? సాగు చేయడం తప్ప నాకు మరో ప్రపంచమే తెలియదు. ఇంటిల్లాపాదీ పొలం పనుల్లో చెమటోడ్చడం తప్ప ఏనాడూ సుఖ పడింది లేదు. వ్యవసాయంలో పిల్లలకు సంపాదించి పెట్టిందేమీ లేకపోగా చేసిన అప్పులకు తాతలిచ్చిన గడ్డంతా కరిగించేస్తున్నాను. మళ్లీ మళ్లీ పొలం అమ్మాలంటే మనసొప్పడం లేదు. ఉన్నదంతా అమ్మేస్తే బిడ్డల భవిష్యత్తేంటా అనే ప్రశ్న మెదడునుతొలిచేస్తోంది. నాతోపాటు కుటుంబ సభ్యులనూకష్టపెడుతున్నాననే బాధ గుండెల్ని పిండేస్తోంది. ఎంత మదనపడ్డానో.. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో.. నాకూఅందరిలా బతకాలని ఉంది. జనంలో దర్జాగా తిరగాలనుంది. కానీ, దేవుడు నాకా అదృష్టం ఇవ్వలేదు. ఇది భూమిని నమ్ముకున్న ఓ అన్నదాత కన్నీటి కథ. ఈ అప్పుల భారం నేనిక మోయలేనంటూ ప్రాణార్పణ చేసిన రైతన్న వ్యథ. పెద్దారవీడు పంచాయతీ సిద్దినాయునిపల్లెకు చెందిన రైతు శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి తాను ఆత్మహత్య చేసుకునే ముందు చెప్పుకున్న బాధలు వింటే మనసున్న ఎవరికైనా కడుపు తరుక్కుపోవాల్సిందే..!
ప్రకాశం, పెద్దారవీడు: పెద్దారవీడు పంచాయతీ సిద్దినాయునిపల్లెకు చెందిన శింగారెడ్డి సత్యనారాయణరెడ్డి(50), వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, వివాహమైన ఒక కుమార్తె ఉంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న శింగారెడ్డి తన తొమ్మిది ఎకరాల పొలంలో పత్తి, మిరప పంటలు సాగు చేస్తూ వచ్చాడు. అతడి తల్లి, భార్యకు పొలం పనులలో కష్టపడడం తప్ప మరో ప్రపంచం తెలియదు. వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో నష్టం వాటిల్లింది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు బతికించుకునేందుకు పొలాల్లో మొత్తం 16 బోర్లు వేశాడు. పెట్టుబడుల కోసం దాదాపు రూ.25 లక్షల దాకా అప్పులు చేశాడు. అప్పులకు వడ్డీలకు వడ్డీలు పెరిగాయి. అప్పిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమయ్యాయి. మంగళవారం రాత్రి ఇద్దరు కుమారులు కొండారెడ్డి, సుబ్బారెడ్డిలను దగ్గర కుర్చోపెట్టుకొని తన పరిస్థితి చెప్పాడు. మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పొలం అమ్మి అప్పులు తీర్చాలని చెప్పాడు. తనలా పొలం మీద ఆధారపడకుండా ఏదో ఒక పని చేసుకొని జీవించాలని, పొలాన్ని నమ్ముకుంటే తనలా అప్పుల పాలవుతారని హితబోధ చేశాడు.
సూసైడ్ నోట్‌లో అప్పుల వివరాలు..
ఆ రాత్రి అందరూ నిద్రించాక తనకు అప్పులు ఇచ్చిన వారి పేర్లు, నగదు, ఏ బ్యాంక్‌లో ఎంత అప్పు తీసుకుంది ఓ కాగితంలో వివరంగా రాసి పెట్టాడు. మరో కాగితంపై తన మృతికి తానే కారణమని సూసైట్ నోటు రాసి రాసి సంతకం పెట్టాడు. అప్పులెలా తీర్చాలో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, కుటుంబ భారాన్ని మోయలేక, అప్పుల వారికి సమాధానం చెప్పలేక మనోవేదన అనుభవించానని అందులో పేర్కొన్నాడు. ఇప్పటికే కొంత పొలం అమ్మాను ఉన్న పొలమంతా అమ్మి అప్పులకు కడుతుంటే పిల్లల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించుకున్నాని ఆవేదన వ్యక్త పరిచాడు. ఏదారి లేక ఇక నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాని, కష్టం చేయడం తప్ప ఇంకేమి తెలియని అమ్మ, జేజిని బాగా చూసుకోవాలని కుమారులను కోరాడు. మిమ్మల్నందరిని విడిచిపెట్టి పోతున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నాడు. అనంతరం బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సత్యనారాయణరెడ్డి సూసైడ్ నోట్‌లో రాసిన అంశాలు ఆ గ్రామస్తులను ఎంతగానో కలచివేశాయి.
Comments
Please login to add a commentAdd a comment