నిఖిత , సోని, సోలం సరయు
పెద్దకొత్తపల్లి/గూడూరు/కుల్కచర్ల/గజ్వేల్‌రూరల్: తక్కువ మార్కులు, ఫెయిల్ కావడాన్ని తట్టుకోలేక ఐదుగురు ఇంటర్ విద్యార్థులు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన సుధాకర్, రాజేశ్వరి కుమార్తె సోని (16) వనపర్తిలోని స్కాలర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం వెలువడిన ఫలితాల్లో మొదటి సంవత్సరం 314 మార్కులు వచ్చాయి. దీంతో తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. (ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్)
అలాగే.. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని చెంద్రుగూడెంకు చెందిన సోలం జంపయ్య, నాగమణి దంపతుల దత్తత కూతురు సోలం సరయు (16) నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లిలోని గిరిజన గురుకుల ఆశ్రమ కళాశాలలో చదువుతోంది. ఈమె మూడు సబ్జెక్టుల్లో తప్పినట్లు తెలిసింది.
తీవ్ర మనస్తాపానికి గురైన సరయు.. శుక్రవారం ఉదయం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని భజ్యానాయక్ తండాకు చెందిన విస్లావత్ హన్మంతు, సక్రిబాయిల కూతురు నిఖిత (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ అయింది. దీంతో రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారం గ్రామానికి చెందిన అగుళ్ల సాయిలు, మంగ దంపతుల కూతురు శ్రావణి (17) ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అలాగే. గజ్వేల్ పట్టణానికి చెందిన బద్రీనాథ్ అలియాస్ అభి (17) ఇంటర్‌లో ఫెయిలయ్యాడు. ఇది తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment