
మృతి చెందిన దంపతులు వెంకటేశ్వరరావు, శ్రావణి (ఫైల్)
కృష్ణాజిల్లా, వీరులపాడు(నందిగామ): ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు.. అయితే క్షణికావేశంలో భార్య ఆత్మహత్యకు పాల్పడగా చూసి తట్టుకోలేక భర్త కూడా పురుగుల మందు తాగి తుది శ్వాస విడిచాడు. మృత్యువులోను ఒకటిగానే నిలిచారు. ఎస్‌ఐ శ్రీహరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు (24), నవాబుపేటకు చెందిన శ్రావణి (21) ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2019 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.(పోలీస్ స్టేషన్‌లో 'మూగ ప్రేమ' వివాహం)
ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఉదయం తన పుట్టింటికి వెళ్లి వస్తానని శ్రావణి భర్త వెంకటేశ్వరరావును కోరింది. భర్త నిరాకరించటంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. క్షణికావేశంలో శ్రావణి ఇంటిలోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త వెంకటేశ్వరరావు హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తట్టుకోలేని వెంకటేశ్వరరావు ఈ నెల 11న గుంటూరు ప్రభుత్వాస్పత్రి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. కాగా శ్రావణి శుక్రవారం ఉదయం మృతిచెందగా వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్ర తుది శ్వాస విడిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి)
Comments
Please login to add a commentAdd a comment