సాక్షి, హసన్‌పర్తి: ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని అంత్యక్రియలకు భార్య, కుమారుడు హాజరుకాలేకపోయారు. అమెరికాలో ఉండడం వల్ల కడసారి చూపును వాట్సాప్ వీడియోలో చూస్తూ రోధించసాగారు. కూతురే కుండ పట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటన హసన్‌పర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు.. హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన కందుకూరి సూర్య నారాయణ(65) కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ పొందాడు. ఆయనకు భార్య శాంతమ్మ, కుమారుడు కిరణ్, కూతురు కృష్ణవేణి ఉన్నారు. కిరణ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూతురు, అల్లుడు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నారు.
రెండు నెలల క్రితం శాంతమ్మ అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లగా ఇంట్లో సూర్యనారాయణ ఒక్కడే ఉన్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సూర్యనారాయణ మృతదేహాన్ని మరుసటిరోజు పోలీసులు రాయపర్తిలో కెనాల్ నుంచి బయటకు తీశారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. ఇదిలా ఉండగా.. సూర్యనారాయణ ఇంటికి తాళం వేసి ఉండటంతో బంధువులు ఆయన కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే రాయపర్తిలో ఈనెల 9న గుర్తు తెలియని వ్యక్త మృతదేహం లభ్యమైనట్లు హసన్‌పర్తి పోలీసులు తెలపగా.. రాయపర్తి పోలీసులు పంపిన ఫొటోలను బంధువులకు చూపించారు. దీంతో మృతుడు సూర్యనారాయణగా గుర్తించారు.
భార్యకు సమాచారం
సూర్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని బంధువులు ఫోన్ ద్వారా అటు అమెరికాలో ఉంటున్న భార్య శాంత, కుమారుడు కిరణ్, ఇటు హైదరాబాద్‌లో ఉంటున్న కూతురు కృష్ణవేణికి అందించారు. అయితే అమెరికాలో ఉంటున్న వారు ఇక్కడికి రావడం సాధ్యం కాదని, దీంతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కడసారి చూపులు చూశారు. ఇదిలా ఉండగా, ఆదివారం హైదరాబాద్ నుంచి కూతురు వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment