ఆత్మహత్య చేసుకున్న శాంతిప్రియ
వైఎస్‌ఆర్ జిల్లా, పోరుమామిళ్ల: టీచర్ ట్రైనింగ్ చేస్తున్న అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్న ఘటన బుధవారం మండలంలోని అక్కలరెడ్డిపల్లెలో జరిగింది. ఎస్‌ఐ మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కలరెడ్డిపల్లెకు చెందిన దాసరిపల్లె వెంకటయ్య, కుమారిల పెద్ద కూతురు శాంతిప్రియ పోరుమామిళ్లలోని కృష్ణశారద కళాశాలలో టీచర్ ట్రైనింగ్ చేస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓబుళాపురం ఓబులేసు పోరుమామిళ్లలోని ఓ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. రోజూ ప్రేమిస్తున్నానంటూ ఆమెను వెంటపడేవాడు. తనను వేధించవద్దని శాంతిప్రియ చెప్పినా అతను తన వైఖరి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శాంతిప్రియ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు అమ్మాయి తల్లి కుమారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మోహన్ తెలిపారు.
నిందితుడిని ఉరి తీయాలి: మృతురాలి తల్లి
‘ఓబులేసు వేధిస్తున్నాడని చెబితే మేము మా అమ్మాయినే మందలించాము. అయినా ఓబులేసు మా ఇంటిపై దాడి చేసి కత్తితో బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడి మా అమ్మాయి ఉరి వేసుకుంది’.. అని మృతురాలు శాంతిప్రియ తల్లి కుమారి బోరు న విలపించింది. దిశ చట్టం అమలు చేసి ఓబులేసును ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేసింది. ట్రైనింగ్ పూర్తయితే ఉద్యోగం వస్తుందని, కుటుంబానికి ఆసరా గా ఉంటుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నాం.. ఇంతలోనే దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడని కన్నీరు మున్నీరైంది.
Comments
Please login to add a commentAdd a comment