eve teasing
-
HYD: బోరబండలో రెచ్చిపోయిన కామాంధులు!
హైదరాబాద్: బోరబండ(Borabanda)లో అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. పదిహేడేళ్ల ఓ బాలికతో కొందరు దుండగులు అనుచితంగా ప్రవర్తించారు. ఇంట్లోకి వెళ్లి మరీ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్ వాళ్లను అడ్డుకుని.. ఆమెను రక్షించారు. అయితే.. దుండగుల దాడిలో ఆ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 100కు(Dial 100) ఫోన్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు(Police) ఆ కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడి డ్రైవర్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదీ చదవండి: కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష -
యువతి నుదిట సింధూరం.. యువకుడి పాలిట మరణ శాసనం
సాక్షి, క్రైమ్: షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. బలవంతంగా యువతి నుదట దిద్దిన సింధూరం!.. ఓ యువకుడిపాలిట మరణ శాసనమైంది. ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని హతమార్చాడు ఓ తండ్రి. సినీ ఫక్కీలో పక్కా మర్డర్‌కు ప్లాన్ వేసి మరీ కిరాతకంగా ప్రాణం తీశాడు. బీహార్‌కు చెందిన కరుణాకర్ కుటుంబం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలో నివాసం ఉటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆగష్టు 29వ తేదీ నుంచి కరుణాకర్ కనిపించకుండా పోయాడు. దీంతో.. అతని సోదరుడు దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. రంజిత్ కుమార్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారమే కరుణాకర్‌ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. రంజిత్ కుమార్ కూతురిపై కరుణాకర్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె నుదుటిపై సింధూరం కూడా దిద్ది ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. ఈ విషయం బయటకు పొక్కితే తన పరువు పోతుందని రంజిత్ రగిలిపోయాడు. కరుణాకర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగష్టు 15వ తేదీన కేశంపేట మండలంలోని నిడదవెళ్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్డులో ఉన్న వరి చేను దగ్గరికి పిలిపించుకున్నాడు. విచక్షణా రహితంగా కరుణాకర్‌పై దాడికి దిగాడు. కాళ్లు చేతులు కట్టేసి వరి చేను నీటి బురద లో తలకాయ ముంచి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అదే బురదలో పాతిపెట్టి వెళ్లిపోయారు. దర్యాప్తు ద్వారా ఈ కేసును చేధించామని, ప్రధాన నిందితుడు రంజిత్‌తో పాటు అతనికి సహకరించిన వాళ్లనూ అరెస్ట్ చేశామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితులపై 302, 201 ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా.. వాళ్లను జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. -
నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్‌కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్ నిఘా వేశాయి. మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్ కృషిని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినులపై హెచ్ఎం అసభ్యకర ప్రవర్తన మహబూబాబాద్ రూరల్: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం షేక్ సర్వర్ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాందాస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్ పాషాను సస్పెండ్ చేశారు. (చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..) -
ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు
భోపాల్: ఈవ్ టీజింగ్‌ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్‌లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమె ముఖంపై 10 సెంటీమీటర్ల మేర లోతైన గాటు పెట్టి బ్లేడుతో పలుచోట్ల దాడిచేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం శివరాజ్ ఆదేశించారు. బాధితురాలిని సీఎం పరామర్శించి లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. మున్సిపల్ అధికారులు ఒక నిందితుని ఇంటిని కూల్చివేశారు. अन्याय का प्रतिकार करना अन्य लोगों के लिए प्रेरणा का कार्य है, इस नाते बहन सीमा अन्य महिलाओं के लिए प्रेरक भी हैं। उनके बेटा और बेटी पढ़ते हैं और उनके सहयोग के लिए भी कलेक्टर भोपाल को आवश्यक निर्देश दिये हैं। pic.twitter.com/BXQ5ywPCxG — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 12, 2022 -
పోకిరీ మైనర్!
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్ టీజర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలు, అమ్మాయిలను నడి రోడ్డు మీదే అసభ్య పదజాలంతో దూషించడం, ఫోన్, సోషల్ మీడియాలలో వేధిస్తున్నారు. 319 మంది ఈవ్ టీజర్లకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సైబరాబాద్ షీ టీమ్స్ కౌన్సెలింగ్ ఇచ్చాయి. వీరిలో 98 మంది మైనర్లే ఉన్నారు. 19–24 ఏళ్ల వయస్కులు 112 మంది ఉండగా.. 25–35 ఏళ్ల వాళ్లు 92 మంది, 36–50 ఏళ్ల వయస్సు వారు 17 మంది ఉన్నారు. గత రెండు నెలలో సైబరాబాద్ షీ టీమ్‌కు వివిధ మాధ్యమాల ద్వారా 355 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా 299 ఫిర్యాదుల వాట్సాప్ ద్వారా చేయగా.. ట్విటర్లో 8 మంది, హ్యాక్ ఐలో 7 మంది, ఈ–మెయిల్ ద్వారా 5 మంది, ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా 36 మంది, భౌతికంగా 30 మంది ఫిర్యాదు చేశారు. ఫోన్లో మహిళలను వేధించే ఆకతాయిలే ఎక్కువ. గత రెండు నెలలలో 141 పిటీషన్లు ఈ తరహావే కావటం గమనార్హం. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారని 34 మంది, సోషల్ మీడియాలో 33, బెదిరింపులు 33, స్టాల్కింగ్ 35 మంది, పెళ్లి చేసుకుంటానని మోసం పోయిన మహిళలు 19 మంది, అసభ్యప్రవర్తన 31, వాట్సాప్‌లో వేధింపులు 11, కామెంట్లు 7 మంది, రహస్యంగా మహిళల ఫొటోలు, వీడియోల చిత్రీకరణ 3, పని ప్రదేశాలలో వేధింపులు 3, ప్రేమ సమస్యలు 2, ఫ్లాషింగ్ 2 మంది మహిళా బాధితులున్నారు. 7 బాల్య వివాహాలకు చెక్.. గత రెండు నెలల వ్యవధిలో సైబరాబాద్ కమిషనరేట్‌లో 7 బాల్య వివాహాలను షీ టీమ్‌లు అడ్డుకున్నాయి. 81 కేసులను నమోదు చేశాయి. వీటిలో 18 క్రిమినల్ కేసులు కాగా.. 63 పెట్టీ కేసులున్నాయి. బస్టాప్స్, రైల్వే స్టేషన్లు, మాల్స్, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాలలో 1,003 డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో 248 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. వీటిలో 117 పెట్టీ కేసులను నమోదు చేశారు. మిగిలిన ఆకతాయిలను కౌన్సెలింగ్‌కు పంపించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రాత్రి సమయాల్లో నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 75 మంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్, సైబరాబాద్ షీ టీమ్ సంయుక్తంగా కలిసి కౌన్సెలింగ్ ఇచ్చాయి. -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్‌పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్‌మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్‌లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్‌లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్‌కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్‌చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్‌ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్‌ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్‌గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్‌క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్‌గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్‌లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్‌కాల్, మెసేజ్‌లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్‌లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్‌కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్‌కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
ఆకతాయిల భరతం పట్టే ‘స్పెషల్ 40’
భోపాల్: అక్షయ్ కుమార్–కాజల్ అగర్వాల్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’ గురించి తెలుసు.. ఈ ‘స్పెషల్ 40’ ఏమిటి? అనే కదా డౌటు. ఆ సినిమాలో ఒక గ్రూప్ సభ్యులు సీబిఐ, ఇన్కామ్టాక్స్ ఆఫీసర్లుగా పోలీసులను బోల్తా కొట్టిస్తుంటారు. అయితే ఈ‘స్పెషల్ 40’ ని మాత్రం పోలీసులే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది. మురికివాడల్లో నివసించే ఆడపిల్లలపై రౌడీలు, తాగుబోతుల కన్నుపడింది. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే రకరకాలుగా వేధించడం, అఘాయిత్యాలకు పాల్పడటం లాంటివి జరిగేవి. ‘ఈ దేశంలో ప్రతి పౌరుడు టోపీ ధరించని పోలీసే’ అనేది మన తెలుగు సినిమా డైలాగ్ కావచ్చుగానీ శాంతిభద్రతల సంరక్షణ అనేది మన అందరి బాధ్యత. ‘స్పెషల్ 40’లో ఉన్న మహిళల్లో ఎవరూ పోలిస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారు కాదు. ఎక్కడో ఏదో సంఘటన చూసి కడుపు రగిలిపోయిన వారు, ‘చూస్తూ కూడా ఏమీ చేయలేమా’ అని నిస్సహాయంగా పిడికిళ్లు బిగించిన వారు, ‘మనకెందుకులే’ అని రాజీపడి, అదో పశ్చాత్తాపమై, భారమై, బాధపడి ‘లేదు. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు. ‘స్పెషల్ 40’ సభ్యులకు కరాటే, తైక్వాండోలాంటి ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇవ్వడంతో పాటు, చట్టం, న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఎలాంటి చర్యలు నేరాల పరిధిలోకి వస్తాయి? ఏ నేరానికి ఎలాంటి శిక్ష పడుతుంది? ముఖ్యమైన సెక్షన్లు ఏం చెబుతున్నాయి?... మొదలైనవి ‘స్పెషల్ 40’ సభ్యులకు కొట్టిన పిండి. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ‘స్పెషల్ 40’ సభ్యులు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’లాంటి విషయాలపై పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. అనుకోకుండా ఆపద ఎదురైతే ముందుగా చేయాల్సిన పని ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?... మొదలైన విషయాలను తెలియపరుస్తున్నారు. ఈ గ్రూప్‌లో 20 ఏళ్ల వయసు నుంచి మొదలు 60 పైబడి ఉన్న మహిళలు కూడా ఉన్నారు. వీరి గ్రూప్‌లో సీనియర్ అయిన చంద్రకాంత మాలవీయాకు 63 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఇదంతా ఎందుకు తల్లీ!’ అన్నవారు లేకపోలేదు. అయితే చంద్రకాంత వారి మాటలను పట్టించుకోలేదు. ‘భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం గా దీన్ని భావిస్తున్నాను. ఎందరో ఆడపిల్లలు నన్ను సొంత తల్లిలా భావించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు’ అంటుంది చంద్రకాంత. ‘స్పెషల్ 40లో నేను సభ్యురాలిని అనే విషయం తలచుకోగానే చెప్పలేనంత ఉత్సాహం, ధైర్యం ఒంట్లోకి వచ్చి చేరుతాయి. ఆడపిల్లల రక్షణ కు అవసరమైతే ప్రాణాలు కూడా లెక్క చేయను’ అంటుంది సంధ్యా మనోజ్ కాస్త ఉద్వేగంగా.ఒక మురికి వాడలో నివసించే రీతి అనే అమ్మాయి ఒకరోజు పోకిరీల బారిన పడింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే ‘ఈ సమయంలో అటు వైపు ఎందుకు వెళ్లావు?’ అని మందలించాడు నాన్న. నిజానికి అప్పుడు రాత్రి ఎనిమిది కూడా దాటలేదు. మరోసారి ఒకచోట తాగుబోతుల బెడద ఎదురైతే వెంటనే ‘స్పెషల్ 40’కి సమాచారం ఇచ్చింది. ‘స్పెషల్ 40’ ఆ తాగుబోతుల భరతం పట్టింది. ఇప్పుడు ‘స్పెషల్ 40’ సభ్యుల దగ్గర వాకీ–టాకీలు ఉన్నాయి. వాటికంటే మఖ్యంగా అంతులేని ధైర్యం ఉంది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే అపారమైన తపన ఉంది. ఇంతకంటే కావల్సింది ఏమిటి! -
చెప్పు దెబ్బలు తిన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
లక్నో : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఇద్దరు యువతులు కలిసి అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చెప్పులతో దేహశుద్ది చేసిన ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాన్‌కు చెందిన అనూజ్ మిశ్రా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్ మిశ్రా జలాన్ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో స్టేషన్‌వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్‌మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్ టీజింగ్‌కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు. (చదవండి : బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..) దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. చివరికి అనూజ్‌మిశ్రా క్షమించమని మహిళ కాళ్లు మీద పడ్డా అప్పటికే కనికరించలేదు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న వారు అతని బట్టలు చించేసి మరోసారి చితకబాదారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అనూజ్ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడికి ఈ శాస్తి జరగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
చెంపలు వాయించింది
కర్ణాటక,మండ్య : మండ్య నగరం నుంచి పాండవపురకు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడి చెంప వాయించింది ఓ యువతి. ప్రస్తుతం ఈ వీడియో కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. మండ్య నగరం నుంచి పాండవపురకు యువతి గురువారం బస్సులో వెళ్తుండగా అదే బస్సులో వెనక సీటులో కూర్చున్న యువకుడు యువతిని తాకడం చేశాడు. ఓపిగ్గా చూసిన యువతి పరిస్థితి శ్రుతి మించడంతో ఒక్కసారిగా ఆగ్రహంతో సదరు యువకుడి చెంప చెల్లున వాయించింది. నీ చెల్లి, తల్లి ఉంటే ఇలాగే చేస్తావా అంటూ అతడిని ప్రశ్నించింది. బస్సులో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ వెంటనే యువకుడు బస్సు నుంచి కిందకు దిగి వెళ్లిపోయాడు. -
చున్నీ లాగాడని చితకబాదిన ఎస్ఐ?
నెల్లూరు(క్రైమ్): ఏమాత్రం సంబంధం లేని విషయంలో ఎస్ఐ తన కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తూ ఓ తల్లి సోమవారం వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట విలపించింది. సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను కోరింది. బాధిత తల్లి, సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వేదాయపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 21వ తేదీన తెలుపురంగు స్కూటీలో వెలుతున్న యువకుడు ఓ యువతి చున్నీ పట్టుకుని లాగాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో అనుమానంతో ఆదివారం రాత్రి గాంధీనగర్‌కు చెందిన పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. తనకు ఏమీ తెలియదనీ, ఎవరి చున్నీ లాగలేదని ఆ యువకుడు చెబుతున్నా పట్టించుకోకుండా ఎస్ఐ కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్టేషన్ బయట ఉన్న కుటుంబసభ్యులను పిలిచిన పోలీసులు వెంటనే అతనిని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు అతనిని చికిత్సనిమిత్తం జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేయించారు. ఎస్ఐ వ్యవహారశైలిని నిరసిస్తూ బాధిత తల్లి, కుటుంబసభ్యులు సోమవారం వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తన కుమారుడు ఈ నెల 21వ తేదీన నెల్లూరు నగరంలోనే లేడని పనుల కోసం బయటకు వెళ్లాడని చెబుతున్నా పోలీసులు వినకుండా తీవ్రంగా కొట్టారని బాధిత తల్లి చంద్రకళ ఆరోపించింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఆ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదే విషయాన్ని ఆమె స్థానిక వేదాయపాళెం ఇన్స్పెక్టర్ టి.వి.సుబ్బారావును సైతం కోరింది. -
రెచ్చిపోతున్న ఈవ్ టీజర్స్
-
ఈవ్ టీజింగ్ తట్టుకోలేక యువతి ఆత్మహత్య
వైఎస్ఆర్ జిల్లా, పోరుమామిళ్ల: టీచర్ ట్రైనింగ్ చేస్తున్న అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్న ఘటన బుధవారం మండలంలోని అక్కలరెడ్డిపల్లెలో జరిగింది. ఎస్ఐ మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కలరెడ్డిపల్లెకు చెందిన దాసరిపల్లె వెంకటయ్య, కుమారిల పెద్ద కూతురు శాంతిప్రియ పోరుమామిళ్లలోని కృష్ణశారద కళాశాలలో టీచర్ ట్రైనింగ్ చేస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓబుళాపురం ఓబులేసు పోరుమామిళ్లలోని ఓ దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. రోజూ ప్రేమిస్తున్నానంటూ ఆమెను వెంటపడేవాడు. తనను వేధించవద్దని శాంతిప్రియ చెప్పినా అతను తన వైఖరి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శాంతిప్రియ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు అమ్మాయి తల్లి కుమారి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మోహన్ తెలిపారు. నిందితుడిని ఉరి తీయాలి: మృతురాలి తల్లి ‘ఓబులేసు వేధిస్తున్నాడని చెబితే మేము మా అమ్మాయినే మందలించాము. అయినా ఓబులేసు మా ఇంటిపై దాడి చేసి కత్తితో బెదిరించాడు. అతని బెదిరింపులకు భయపడి మా అమ్మాయి ఉరి వేసుకుంది’.. అని మృతురాలు శాంతిప్రియ తల్లి కుమారి బోరు న విలపించింది. దిశ చట్టం అమలు చేసి ఓబులేసును ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేసింది. ట్రైనింగ్ పూర్తయితే ఉద్యోగం వస్తుందని, కుటుంబానికి ఆసరా గా ఉంటుందని ఎంతగానో ఆశలు పెట్టుకున్నాం.. ఇంతలోనే దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడని కన్నీరు మున్నీరైంది. -
తమ్ముడూ నిన్నే..
తమ్ముడూ నిన్నే.ఎవరూ చూడటం లేదనుకుంటున్నావేమో.ఆమెకు తెలియకుండా ఫోన్లోబంధించాలనుకుంటున్నావేమో.చెత్త ఆలోచనలకు వాడాలనుకుంటున్నావేమో.మానుకో. మారు.నీ పనులకు శిక్షలు ఉన్నాయి.నీ చేష్టలకు బేడీలు పడతాయి.స్త్రీలు అప్రమత్తమయ్యారు.వారు నిన్ను వదలరు. తాట తీస్తారు. మెట్రోలో ప్రయాణిస్తున్నారు ముగ్గురు స్నేహితులు. ఆఫీస్ వేళ కావడం వల్ల రద్దీగా ఉంది ట్రైన్. ఈ ముగ్గురికీ సీట్ దొరకలేదు. కూర్చున్న లేడీస్‌కి దగ్గరగా నిలబడి ఉన్నారు. ఇంతలో మ«ధ్యలో నిలబడ్డవాడు మెల్లగా ఫోన్లోని కెమెరా ఆన్ చేశాడు. ఈ అమ్మాయిలను ఫోకస్ చేశాడు. కూర్చుని ఉన్న అమ్మాయిల ఎదను చేయి పైకెత్తి కేప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కూర్చున్న అమ్మాయిలు వీళ్లను గమనించట్లేదు. కాని ఆ ముగ్గురి పక్కన నిలబడ్డ ఒక అమ్మాయి పసిగట్టి.. అతని చేతిలోంచి ఫోన్ లాగేసి ‘మిమ్మల్ని వీడు వీడియో తీస్తున్నాడు’ అంటూ ఆ ఫోన్‌ను ఆ అమ్మాయిల చేతికిచ్చింది. వాళ్లు అలెర్ట్ అయ్యేలోపు ఈ ముగ్గురూ ఆ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. గోలగోల అయ్యింది. అందరూ కలిసి పక్కస్టేషన్లో ఆ ముగ్గురిని పోలీసులకు అప్పజెప్పారు. బస్టాప్‌లో ఆ కుర్రాడు. ఈ పని కోసమే వచ్చినట్టున్నాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఒకావిడను వెనక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసేవారికి అతను మామూలుగా ఫోన్ పట్టుకున్నట్టు ఉంటుంది. కాని అందులో ఆమె వెనుకభాగం రికార్డ్ అవుతోంది. ఇంతలో ఆమె వెనక్కి తిరిగింది. అతడు కంగారు పడ్డాడు. అనుమానం కలిగించింది. వెంటనే వెళ్లి ఫోన్ లాక్కుంటే కెమెరా ఆన్‌లో ఉంది. మైట్రో ట్రైన్ వెళుతూ ఉంది. ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎదురుగా కాలేజీ అమ్మాయి నిలబడి ఉంది. అతను ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి ఎదురుగా నిలబడి ఉన్న అమ్మాయికి కనిపించేలా పెడ్తున్నాడు. ముందు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఎంతసేపైనా ఆ వీడియోను ఆఫ్ చేయకపోయేసరికి అతనికి తెలియకుండా ఏమన్నా ఆన్ అయిందేమో అనుకొని అతనికి చెప్పబోతూ ఆ వీడియోను చూసి షాక్ అయింది. అది పోర్న్ వీడియో. కావాలనే.. తనకు కనిపించాలనే అతను అలా పెట్టాడు అని అర్థమైంది ఆ అమ్మాయికి. ఇవన్నీ నిజాలే. జరిగినవే.. జరుగుతున్నవే. అయితే ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్న వాళ్లకు ఇవీ నేరాలే అది వీటికి శిక్షలున్నాయని తెలియదు. మనల్ని ఎవరు పట్టుకుంటారు అన్న ధీమాతో ప్రవర్తిస్తుంటారు. కాని వీళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని నడుచుకునేలా చేసే చట్టాలున్నాయి. ఈ నేరాలు ఏ చట్టం కిందకు వస్తాయి? ‘మహిళ అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఆమెను, ఆమె కదలికలను, శరీర భాగాలను చిత్రీకరిస్తే నిర్భయ చట్టంలోని 354 (డి) కింద నేరం. మొదటిసారి చేస్తే మూడేళ్ల జైలుశిక్ష.. పదేపదే చేస్తే అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఐపీసీ 509 ప్రకారం ఇది మహిళ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే చర్య. కాబట్టి ఈ సెక్షన్ కింద కేసు నేరస్తుడికి మూడు నుంచి అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివాటికి పాల్పడినందుకు, పోర్న్‌వీడియోలు చూపించినందుకు ఐపీసీ 294 (అబ్సీన్ యాక్ట్) కింద మూడు నెలల నుంచి ఆరునెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. వీన్నిటితోపాటు ఐటీ యాక్ట్ ఉండనే ఉంది. 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం మహిళకు సంబంధించిన దృశ్యాలను కామాన్ని ప్రేరేపించేలా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్లో ప్రచురించిన, ప్రసారం చేసినా అయిదేళ్ల జైలు శిక్షతోపాటు లక్షరూపాయల జరిమానా ఉంటుంది. అమ్మాయిలే కాదు.. అబ్బాయిల తల్లిదండ్రులూ ఇవి తెలుసుకోవాలి. తమ పిల్లల కదలికల మీద నిఘా వేయాలి’ అని వివరిస్తున్నారు అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్ పార్వతి. కంప్లయింట్ ఎక్కడ ఇవ్వాలి? అయితే ఈ శిక్షలన్నీ పడాలంటే ముందు ఆ నేరం నమోదు కావాలి. అంటే నేరస్తుడిని పట్టుకోవాలి. ‘బహిరంగ ప్రదేశాల్లో ఇలా తమను ఎవరైనా వెంటాడుతున్నారు.. తమ మీద ఫోన్ ఫోకస్ అయి ఉంది అన్న అనుమానం రాగానే రియాక్ట్ కావాలి. వెంటనే అవతలి వ్యక్తి చేతుల్లోంచి ఫోన్ లాక్కోవాలి. గట్టిగా అరిచి చుట్టూ ఉన్నవాళ్ల దృష్టిని తన వైపు తిప్పి ఆ వ్యక్తి పారిపోకుండా చేయాలి. 100కి డయల్ చేస్తే షీటీమ్స్‌కి కనెక్ట్ అయ్యి దగ్గర్లో ఉన్న షీ టీమ్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ వాళ్ల ‘హాక్ – ఐ’ యాప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ యాప్‌లూ ఉన్నాయి అందుబాటులో. హాక్– ఐలోని ఎస్ఓఎస్ నొక్కితే చాలు మీరు రక్షణ వలయంలోకి వెళ్లినట్టే. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రమాదంలో ఉన్నామనే అనుమానం కలిగితే చాలు ఆ యాప్ ఓపెన్ చేసి ఫోన్ కదిలిస్తే సమీప పోలీస్ సిబ్బందికి సంకేతాలు వెళ్లి నేరస్తుల వేట మొదలవుతుంది. ఇవన్నీటితోపాటు మీకు దగ్గర్లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లోనైనా జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేయవచ్చు. మిమ్మల్ని వీడియో తీసిన కాపీ అతని ఫోన్లో లేకపోయినా... దాని కాపీ ఇంకా ఎక్కడ దొరికినా.. కూపీలాగి నేరస్తుడిని కటకటాల్లో తోసే వీలుంటుంది’ అని చెప్తారు తెలంగాణలోని విమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఇన్స్పెక్టర్ కిరణ్. ఇంత మందిలో నన్నెవరు చూడొచ్చారులే అనే జులాయీల ధిలాసాకు వణుకు పుట్టించే టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. ట్రాక్ యాప్‌ల నుంచి సర్వైలెన్స్ ఐ వరకు పోలీస్ రిపోర్ట్ నుంచి కోర్ట్ కొరడా దాకా బోలెడు. అందుకే మహిళల పట్ల మర్యాద పాటించడం ఒక్కటే రక్షణ కవచం. అది నేర్చుకుంటే ఇవన్నీ దూరం. ఈ పాఠం అందరికీ! – సరస్వతి రమ కొత్త యాప్‌లున్నాయి.. జాగ్రత్త కొత్త కొత్త యాప్‌లు వస్తున్నాయి వాటి గురించి అవగాహన ఉండాలి. మనకు తెలియకుండానే మనల్ని వీడియో తీస్తుంటారు. అనుమానం వచ్చి పట్టుకుంటే ఆ ఫోన్లో ఏమీ కనిపించదు. అలాంటి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటారు. అందుకే ఫోన్ లాక్కోగానే గ్యాలరీలోకి వెళ్లి చూసే బదులు కెమెరా యాక్టివ్‌లో ఉందా అనేది చెక్ చేయాలి. కెమెరా యాక్టివ్‌లో ఉంటే కచ్చితంగా మిమ్మల్ని ట్రేస్ చేస్తున్నట్లే లెక్క. కొన్ని ఫోన్లలో టచ్ చేయంగానే కెమెరా ఆఫ్ అయిపోయేలా సెట్టింగ్స్ ఉంటాయి. అప్పుడు ఓపెన్‌లో ఉన్న ట్యాబ్స్ అన్నీ చెక్ చేయాలి. గ్యాలరీలో ఫీడ్ ఏమీ దొరక్కపోయినా తర్వాత ఎక్కడోక్కడ కాపీ చేస్తారు. అప్పుడు దాంతో ఇమేజ్ అనాలిసిస్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ లాక్కోగానే కెమెరా పొజిషన్‌ను చెక్ చేయడం మాత్రం మరవద్దు. ఒకవేళ ఎక్కడా ఏమీ దొరక్కపోయినా సీసీ కెమెరా ఫుటేజ్‌తో నేరస్తులు ఏం చేశారో చూడొచ్చు. ఫేస్ రికగ్నినిషన్ కెమెరాలను అమర్చీ ఇలాంటి వాళ్ల ఆగడాలను అరికట్టొచ్చు.– సందీప్ ముదాల్కర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అండ్ ట్రైనర్, ఇ. పార్వతిఅడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్ -
ప్రేమించాలంటూ వేధింపులు..
ఘట్కేసర్: తనను ప్రేమించాలని వేధించిన యువకుడిని ఘట్కేసర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ కథనం ప్రకారం.. పెద్దపల్లి సాగర్ రోడ్డుకు చెందిన ఎండీ ఇంతియాజ్ నగరంలోని తార్నాకలో నివాసం ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న పెద్దపల్లికి చెందిన ఓ విద్యార్థినిని ప్రేమించాలని ఏడాదిగా వేధిస్తున్నాడు. వేధింపుల విషయమై అతడిపై పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. విద్యాభ్యాసం కోసం ఈ నెల 8న మండలంలోని చౌదరిగూడలోని కాలేజీకి రోడ్డుపై వెళ్తుండగా నిందితుడు బైక్‌పై వచ్చి తార్నాకలోని అతడి స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. తనను ప్రేమించని పక్షంలో అంతు చూస్తానని బెదిరించాడు. ఆమె గట్టిగా అరవడంతో తిరిగి ఆమెను కాలేజీ సమీపంలో వదిలివెళ్లాడు. ఈ విషయమై నిందితుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధిని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
తల్లీకూతుళ్లను అడ్డగించి అసభ్యకరంగా..
బంజారాహిల్స్: నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న తల్లీకూతుళ్లను ఇద్దరు యువకులు అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం:13లోని గౌరీశంకర్ కాలనీలో నివసిస్తున్న లక్ష్మి అనే వివాహిత తన ఏడేళ్ల కూతురితో కలిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వైట్‌హౌస్ మీదుగా గౌరీశంకర్ నగర్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. వైట్‌హౌస్ వెనకాల రోడ్డు వద్దకు రాగానే ఇద్దరు ఆగంతుకులు స్కూటీ మీద వచ్చి అడ్డగించారు. వీరిలో ఓ యువకుడు ఆమె కూతురును బలవంతంగా స్కూటీపై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మరో యువకుడు లక్ష్మి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేస్తుండగానే ఆగంతుకుడు ఆమెను కిందకు నెట్టేసి పరారయ్యాడు. ఆందోళన చెందిన ఆమె కూతురు కోసం గాలిస్తూ ఇంటికి వెళ్లగాఇంట్లోనే కూతురు కనిపించింది. తన కూతుర్ని బలవంతంగా లాక్కెళ్లి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 323, 341 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. -
థియేటర్లో ఈవ్‌టీజింగ్
చెన్నై, తిరువొత్తియూరు: సినిమా చూస్తున్న సమయంలో మహిళ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై వలసరవాక్కం బెత్తానియా నగర్ 3వ వీధికి చెందిన జయలక్ష్మి (40) శనివారం రాత్రి వడపళణిలో ఉన్న మాల్లో సినిమా చూస్తున్నారు. ఆమె వెనుక సీట్లలో కూర్చొని ఉన్న ఇద్దరు యువకులు కాళ్లతో ఆమెకు అసౌకర్యం కలిగించినట్టు తెలిసింది. దీని గురించి జయలక్ష్మి వారిని ప్రశ్నించగా వారు ఆమెతో అసభ్యంగా మాట్లాడి గొడవ చేశారు. దీని గురించి జయలక్ష్మి వడపళణి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో వారు సాలిగ్రామంకు చెందిన రమిష్ (29), రమేష్ (26) అని తెలిసింది. మద్యం మత్తులో ఉన్నట్టు తెలిసింది. -
బైక్ ఇచ్చి.. బలయ్యాడు!.
తాడేపల్లిరూరల్: తన బైక్‌ను స్నేహితులకివ్వడం.. ఆ యువకుడి ప్రాణాలనే బలిగొంది. ఆ స్నేహితులు ఓ యువతిని వేధించడం.. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో అవమాన భారంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి పట్టణ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ చానెల్లో(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తున్న తాడేపల్లి ముగ్గురోడ్డు ప్రాంతానికి చెందిన చరణ్‌రాజు తన బైక్‌ను విజయవాడలోని స్నేహితుడు శివ, అతనితోపాటు వచ్చిన మరో యువకుడికి ఈ నెల 24వ తేదీ రాత్రి ఇచ్చి విజయవాడలోని చర్చికి వెళ్లాడు. వారిద్దరూ బైక్‌పై విజయవాడ వన్‌టౌన్ ప్రాంతానికి వెళ్లి అక్కడ ఓ యువతిని ఈవ్‌టీజింగ్ చేయడంతో ఆమె వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు చరణ్ రాజును అదుపులోకి తీసుకుని రోజంతా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారించారు. ఈవ్ టీజింగ్ చేసింది చరణ్‌రాజు కాదని నిర్ధారించుకున్నాక విడిచిపెట్టారు. చేయని తప్పునకు శిక్ష అనుభవించానంటూ తీవ్ర మనస్తాపం చెందిన చరణ్‌రాజు గురువారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
మేజర్లుగా మారుతున్న వారు ఎక్కువ శాతం నేరగాళ్లుగా..
సాక్షి, సిటీబ్యూరో: ఏడాది క్రితం తొమ్మిదో తరగతి పిల్లాడు ఆకస్మాత్తుగా స్కూలుకెళ్లడం మానేశాడు. చదువులో పూర్తిగా వెనుకబడిపోయాడు. 24 గంటలూ తన గదిలోనే ఉండేవాడు. ఆ పిల్లాడి ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు పసిగట్టలేకపోయారు. చివరకు ఎదురుగా ఉన్న ఓ లేడీస్ హాస్టల్లో స్నానం చేస్తున్న అమ్మాయిల ఫొటోలను తన మొబైల్ఫోన్లో చిత్రీకరిస్తూ పట్టుబడిపోయాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లు తెరుచుకున్నాయి. నగరంలో అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. అదొక్కటే కాదు. తల్లిదండ్రుల పెంపకంలోని లోపాలు, సామాజిక మాద్యమాలు, మీడియా, సినిమాలు వంటి అనేక కారణాలు చిన్నారుల్లో నేరప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయి. అశ్లీల సాహిత్యం, హింసాత్మక సినిమాలు ఎదుగుతున్న పిల్లలను నేరాల వైపు నడిపిస్తున్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీల్లో కంఫ్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు ఇచ్చే ప్రాధాన్యం మోరల్ సైన్స్‌కు ఇవ్వడం లేదు. నీతి కథలు బోధించే అధ్యాపకుల జాడే లేదు. ఏది మంచి, ఏది చెడు అని విడమర్చి చెప్పే చదువులు లేవు. దీంతో ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందాల్సిన ఉన్నతమైన మానవ విలువలు అంతరించిపోతున్నాయి. విచ్ఛిన్న సంబంధాల్లోనే చిచ్చు.... ఒక్క ‘దిశ’ విషయంలోనే కాదు. గతంలో జరిగిన అనేక లైంగిక దాడుల్లోనూ అరాచకమైన మనస్తత్వం కలిగిన వారే నేరాలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల మైనారిటీ తీరని పిల్లలు ఉంటే, మరి కొన్ని చోట్ల అప్పుడప్పుడే మేజర్లుగా మారుతున్న వారు ఎక్కువ శాతం నేరగాళ్లుగా మారుతున్నారు. ఈ తరహా నేరాల్లో విచ్ఛిన్నమై న కుటుంబసంబంధాలే ప్రధాన కారణమని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘ భార్యాభర్తల మధ్య తర చూ జరిగే ఘర్షణలు, విడాకులు కోసం దారితీసే పరిస్థితులు, వివాహేతర సంబంధాలు తదితర అంశాలు పిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రశ్నించేవారు, పర్యవేక్షించే వారు లేకపోవడం వల్లనే తప్పులు చేస్తున్నా రు. ’’ అని ప్రముఖ మనస్తత్వ నిపుణులు డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి పేర్కొన్నారు. మరోవైపు పేదరికం కారణంగా, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లస్కూల్ దశలోనే చదువు ఆపేసిన పిల్లల మెదళ్లు నేరాలకు అడ్డాలవుతున్నాయి. ఇలాంటి వారి మెదళ్లు చదువు, విజ్ఞానానికి బదులు శూన్యంతో ఉండి నేరపూరితమైన ఆలోచనలు, అరాచకత్వంతో నిండిపోతున్నాయి అన్నారు. మానసిక అసమతౌల్యం... ‘‘పిల్లల్లో నేరప్రవృత్తికి సంబంధించిన లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు దూరం కావడం, ఒంటరిగా గడపడం, చదువులో వెనుకబడిపోవడం వంటివి నేరపూరితమైన ఆలోచనలుగా భావించవచ్చు. ప్రాథమికంగా గుర్తిస్తే మార్పు తేవడం సాధ్యమే...’’ అంటారు ప్రముఖ మానసిక నిపులు డాక్టర్ లావణ్య. మొదట్లోనే గుర్తించి మార్పు తేకపోవడం వల్లనే ఇలాంటి వ్యక్తులు కుటుంబాల నుంచి విడివడి నేరస్తులుగా మారుతున్నారని, శవంపైన సైతం లైంగిక దాడికి పాల్పడే క్రూరత్వాన్ని సంతరించుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అరచేతిలో అశ్లీలాన్ని చూపించే మొబైల్ ఫోన్ ఒక మహమ్మారిలా యువతను కబళిస్తోంది. టీనేజీ యువత మంచి కంటే చెడు పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. కానీ ఈ మంచి, చెడులను చెప్పే కుటుంబాలు, విద్యాసంస్థలు ఆ పని చేయకపోవడం వల్ల నేరస్తులుగా మారుతున్నారు. మనిషిలోని ‘బాధ’ తెలియాలి ఒక మనిషి పరిపూర్ణమైన ఉత్తమ వ్యక్తిత్వాన్ని సంతరించుకోకుండానే ఎదుగుతున్న దశలో నేరస్తుడగా మారుతున్నాడంటే సుస్థిరమైన కుటుంబం లేకపోవడమే ప్రధాన కారణం. నీతి, నైతిక విలువలు లేని విద్యాబోధన మరో కారణం. దీంతో మనుషులను గౌరవించే మనస్తత్వం అలవడడం లేదు. అలాగే తన చర్యల వల్ల ఎదుటి మనిషిని ఎలా బాధకు గురిచేస్తున్నాడో కూడా తెలుసుకోలేక పశువుగా మారుతున్నాడు. విలువలు బోధించే కుటంబం, విద్య చాలా అవసరం.–డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, మానసిక వైద్య నిపుణులు -
పోకిరి మారట్లే!
సాక్షి,సిటీబ్యూరో: నూనూగు మీసాలు రాని కుర్రాడు బాలికను అటకాయిస్తున్నాడు..విచ్చలవిడిగా తిరుగుతూ కంటి చూపుతో ఇబ్బంది పెడుతున్నాడు. ఒకేచోట పనిచేస్తున్న సహోద్యోగినిని ఫాలో అవుతూ పురుషులు వేధిస్తున్నారు.. జుట్టు నెరిసి.. వయసు మళ్లిన ఇంకొందరు పెద్దమనుషులు మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని వికృతంగా ప్రవర్తిస్తున్నారు. భయపడి కొందరు.. ఎవరికీ చెప్పుకోలేక ఎందరో మహిళలు, యువతులు, బాలికలు వేధింపులను మౌనంగానే భరిస్తున్నారు. కొందరు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలా ఈ ఏడాది 11 నెలల్లో సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 1,247 మంది ఈవ్ టీజర్లను షీ బృందాలు పట్టుకున్నాయి. అంటే నెలకు సగటున 113 వేధింపుల కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఓవైపు ఆకతాయిల ఆట కట్టిస్తున్న షీ బృందాలు ఇటు బాలికలు, అటు బాలురకు అవగాహన సదస్సులు సైతం నిర్వహించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఆపద, వేధింపులు ఎదురైనప్పుడు ఏం చేయాలన్న దానిపై బాలికలు స్పష్టత ఇస్తూనే.. అమ్మాయిలను వేధిస్తే కుర్రాళ్ల కెరీర్ ఎలా పాడైపోతుందో.. సమాజంలో ఎంత చులకనగా మారిపోతారో చెబుతూ పోలీసులు సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. ఇలా ఈ ఏడాది 11 నెలల్లో రెండు కమిషనరేట్లలో నాలుగు వేలకు పైగా శిబిరాలు ఏర్పాటు చేసి 6 లక్షల మందిని జాగృతి చేశారు. ఈవ్ టీజర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు ఫోన్‌తోనే పట్టించేస్తున్నారు.. బస్టాప్‌లు, ఆటో స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లతో పాటు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు.. ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. పోలీసు స్టేషన్లలో నేరుగా వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెయిల్, హాక్ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని యువతులను చైతన్యం చేస్తున్న తీరు బాగానే పనిచేస్తోంది. ఇందుకనుగుణంగా వాట్సాప్, ఫేస్బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్ 100 ద్వారా మహిళల ఫిర్యాదుల శాతం పెరిగింది. అయితే ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీలో రంగంలోకి దిగుతున్న షీ బృందాలు అక్కడికి చేరుకొని ఆకతాయిల వెకిలి చేష్టలను వీడియో తీసి సాక్ష్యాలతో కోర్టుకు సమర్పిస్తుండడంతో నిందితులు కటకటాలపాలవుతున్నారు. మేజర్లు, మైనర్లు కూడా.. జంట కమిషనరేట్లలో ఇప్పటి దాకా షీ బృందాలకు చిక్కివారిలో ఎక్కువగా 1,057 మంది మేజర్లుంటే, 190 మంది మైనర్లు ఉన్నారు. చిన్నప్పటి నుంచి సమాజంలోని స్త్రీల పట్ల గౌరవం పెంచేలా తలిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం వల్లనే ఆకతాయిలుగా మారుతున్నారని షీ బృందం ఇచ్చే కౌన్సెలింగ్‌లో తేటతెల్లమవుతోంది. వయసుల వారీగా పరిశీలిస్తే ఎక్కువగా కౌమార దశలో ఉన్న విద్యార్థులు, యువకులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మనవడు, మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన సీనియర్ సిటిజన్లు కూడా మహిళలను వేధించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోందని పోలీసులు, కౌన్సిలర్లు అంటున్నారు. ఆ కుటుంబాల పిల్లలే ఎక్కువ యువతులను వేధిస్తూ షీ బృందాలకు పట్టుబడుతున్నవారిలో ఎక్కువగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేసే కుటుంబాల్లోని పిల్లలే ఉంటున్నారు. పిల్లలపై వీరి పర్యవేక్షణ తక్కువగా ఉండడంతో దారి తప్పుతున్నారని కౌన్సిలింగ్లో గుర్తిస్తున్నారు. ఉదయం పిల్లలను స్కూలు, కాలేజీలకు పంపిన తర్వాత విధులకు వెళ్లే భార్యాభర్తలు.. తిరిగి వచ్చేసరికి రాత్రి దాటుతోంది. ఈ మధ్య పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. సెల్‌ఫోన్‌తో ఏం చేస్తున్నారనే విషయాలు కన్నవారు దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో ఆ తరహా పిల్లలు ఈవ్ టీజర్లుగా మారుతున్నారు. ఇటువంటి కుటుంబాలు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.– అనసూయ,సైబరాబాద్ షీ–టీమ్స్ ఇన్చార్జి -
స్టూడెంట్ పోలీస్
దూషణ నుంచి ఈవ్‌టీజింగ్, హెరాస్మెంట్, డొమెస్టిక్ వయొలెన్స్, దాడి, లైంగిక దాడి.. ఎంతటి తీవ్రమైన నేరాన్ని ఎదుర్కొన్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటే భయపడ్తారు మహిళలు. పోలీసులకు చెప్పేకన్నా నేరం తాలూకు బాధను భరించడమే నయమనే భావనలో ఉంటారు. పోలీసుల ప్రవర్తనపట్ల ఉన్న భయమే కారణం. ఇలాంటి భయాన్ని పోగొట్టి.. మహిళలకు, పోలీసులకు మధ్య స్నేహాన్ని పెంపొందించి.. ఏ ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా పోలీసులకు చెప్పే వాతావరణాన్ని కల్పించమని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఫెడరేషన్.. ఉత్తరప్రదేశ్ డీజీపీకి లేఖ రాసింది. ఇది చాలా వైరల్ అయ్యి అక్కడి పోలీసులనూ ఆలోచింపచేసింది. ఓ అడుగు ముందుకేసేలా కదిలించింది కూడా. దాని పర్యవసానమే... ఆ జిల్లాల్లోని విద్యార్థినులను ఒకరోజు స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్చార్జిగా నియమించాలని ఘజియాబాద్ పోలీసులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తులను మొదలు పెట్టారు కూడా. పోలీసులు నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఘజియాబాద్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థినుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని పర్యవేక్షణ, మహిళల మీద జరుగుతున్న నేరాలు, అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు.. మొదలైన వాటి మీద శిక్షణనిస్తారు. తర్వాత సీనియర్ పోలీస్ అధికారులు వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి స్థానిక పోలీస్స్టేషన్లకు ఒకరోజు ఇన్చార్జిగా నియమిస్తారు. దీనివల్ల పోలీసులంటే భయం పోవడమే కాకుండా.. అనుకూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలస్తుంది, పోలీసులకు, మహిళలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. క్విజ్, వ్యాసరచనతో... స్కూళ్లల్లో క్విజ్, వ్యాసరచన పోటీలు పెట్టి, నెగ్గిన విద్యార్థినులను స్టేషన్ ఇంచార్జీలుగా ఎంపిక చేస్తే బాగుంటుందని ఘజియాబాద్ అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడొకరు పోలీసులకు సలహా ఇచ్చారు. దీని గురించి పోలీసులూ ఆలోచిస్తున్నారట. ఏమైనా పోలీసులు ఇలాంటి చొరవ తీసుకోవడం మంచి ఫలితాన్నే ఇస్తుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవల జరిపిన పలు సర్వేల్లో మహిళలకు జరిగిన అన్యాయం గురించి మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల సంఖ్య ఇదివరటికంటే 22 శాతం పెరిగిందని తేలింది. దీన్నిబట్టే ఘజియాబాద్ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని అనుకుంటున్నారంతే. మన దగ్గర షీటీమ్స్ వగైరా ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాలూ చేపడితే మరిన్ని మంచి ఫలితాలు వచ్చి.. మహిళల పట్ల జరిగే నేరాలు చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుందేమో! -
యువతిని వేధిస్తున్న ఆకతాయిలు అరెస్టు !
సాక్షి, విజయవాడ: బస్టాండు సమీపంలో యువతిని వేధిస్తున్న ఆరుగురు ఆకతాయిలను కృష్ణ లంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బస్టాండు ప్రాంగణంలో బస్సు కోసం వేచిచూస్తున్న యువతిని ఆరుగురు యువకులు వేధిస్తుండగా బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వేధింపులకు గురిచేస్తున్న ఆరుగురితోపాటు, స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
అనంతలో కామాంధుడి వికృత చేష్టలు
-
యాంటి రోమియో స్క్వాడ్ పని తీరు భేష్
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించిన వివాదాస్పద యాంటి రోమియో స్క్వాడ్ బృందానికి తాజాగా మరో మద్దతుదారు దొరికారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి యాంటి రోమియో స్క్వాడ్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో బీజేపీ స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రారంభోత్సవానికి హాజరైన మనోజ్ తివారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైన యాంటి రోమియో స్క్వాడ్ బృందాల పని తీరు చాలా బాగుంది. మహిళల రక్షణకు ఇది చాలా మంచి పద్దతి. త్వరలోనే దీన్ని ఢిల్లీలో కూడా ప్రారంభిస్తే బాగుంటుంద’న్నారు. ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారి పని పట్టడం కోసం 2017లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ యాంటి రోమియో స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ బృందాల పని తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల రక్షణ పేరిట ఈ బృందాలు జంటలపై దాడులకు తెగబటమే కాక యువకులకు గుండు కొట్టించడం.. గుంజీలు తీయించడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. దాంతో కొన్ని రోజుల పాటు ఈ బృందాల మీద నిషేధం విధించారు. కానీ తాజాగా మహిళల పట్ల నేరాలు పెరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ ఈ యాంటి రోమియో స్క్వాడ్‌ను తిరిగి పునరుద్దరించారు. -
రౌడీ షీటర్లపై నిఘా
సాక్షి, అనకాపల్లి (విశాఖపట్నం) : త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలు, పట్టణాల్లో ఉండే రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. అనకాపల్లిలోని కొత్తూరు మహార్షి ఫంక్షన్ హాల్లో పోలీస్‌సబ్ డివిజన్ పరిధిలో అధికారులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నేరాల సంఖ్యను తగ్గించామన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. అలాగే ప్రస్తుతం ఎక్కువగా గొడవలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో క్రైం రేటు తగ్గించగలిగామన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారించేందుకు ఆర్అండ్బీ, రవాణాశాఖ, వివిధశాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోస్టుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతంలో తగ్గుముఖం పట్టిందని, గతంలో గిరిజనులు వారికి ఆశ్రయం ఇచ్చేవారని, ఇప్పడు ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందాలని రోడ్లు, సెల్‌టవర్లు ఏర్పాట్లు చేసేందుకు సహకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, అటువంటి వారు తరుచూ ఏర్పాటు చేసినట్లయితే పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు దృష్టిపెడుతూ, ఎక్సైజ్ శాఖతో చర్చిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావు, సీఐలు కిరణ్‌కుమార్, తాతారావు, రామచంద్రరావు, శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మాటు వేసి పట్టేస్తారు..
సాక్షి, సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్ చేస్తున్నారని ఫిర్యాదు అందితే సంఘటనా స్థలానికి చేరుకొని నిఘా వేసి నిందితులను పట్టుకునే సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు పంథా మార్చాయి. ఎక్కువగా ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మాటు వేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నాయి. ఇటు అమ్మాయిలు, అటు ఈవ్‌టీజర్లకు తెలియకుండానే పోకిరీల వెకిలిచేష్టలు, వేధింపులను వీడియో రికార్డు చేసి సాక్ష్యాలతో సహా పట్టుకుంటున్నాయి. వారిపై కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నారు. వీరిలో కొందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి పరివర్తన తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. బస్టాప్‌లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు అందుతుండటంతో సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నెలరోజుల్లో రెండు కమిషనరేట్ల పరిధిలో 210 కేసులు నమోదు చేశారు. 80 మందిపై క్రిమినల్, పెట్టీ కేసులు పెట్టారు. ఆకతాయిలను వెంబడిస్తూ... వివిధ పనుల నిమిత్తం ఇల్లు, వసతి గృహాల నుం చి ఒంటరిగా బయటికి వస్తున్న విద్యార్థినులు, యువతులను టార్గెట్‌గా చేసుకుని పోకిరీలు వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు, విచారణలు అంటూ ఠాణాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు వారి ఆగడాలను బరిస్తున్నారు. కొందరు పోకిరీలు గచ్చిబౌలి, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, ఉప్పల్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో యువతులు, విద్యార్థినులను ప్రతిరోజూ వెంటపడి వేధిస్తున్నారు. బాధితులు భయపడుతుండడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. దీనిపై నిఘా వేసిన ‘షీ’ బృందాలు వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నాయి. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా మఫ్టీలో ఉంటూ ఆకతాయిల ఆగడాలను వీడియో తీసి న్యాయస్థానంలో సాక్ష్యాలు సమర్పిస్తున్నారు. లేడీస్ హాస్టళ్లలోనూ ప్రత్యేక చర్యలు... బస్‌స్టాపులు, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులను నియంత్రిస్తున్న పోలీసులు.. యువతులు, మహిళల హాస్టళ్లు పరిసర ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ నివారించేందుకు చర్యలు చేపట్టారు. అపహరణలు.. అత్యాచారయత్నాలు.. వేధింపులు.. ఈవ్‌టీజింగ్ తదితర నేరాలను కట్టడి చేసేందుకు లా అండ్ అర్డర్ పోలీసులకూ సమాచారం ఇస్తున్నారు. హాస్టళ్ల నిర్వాహకులతో చర్చించి సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎస్సీఎస్సీ మార్గదర్శనంలో ‘సేఫ్ స్టే’ పకడ్బందీగా అమలు చేయాలని సూచిస్తున్నారు. హాస్టళ్లలో వైఫై సౌకర్యంతో పాటు బాధితులకు వేధింపుల ఫోన్లు రాగానే ‘షీ’ బృందం సాంకేతిక సభ్యులకు సమాచారం అందించాలని సూచించారు. బాధితుల్లో ఎక్కువ మంది స్టేషన్‌కు వచ్చేందుకు సందేహిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. అలాగే ఆకతాయిలకు ఎలా బుద్ధి చెప్పాలి, స్వీయ ఆత్మరక్షణ, పోలీసులకు ఎలాంటి సమాచారంఇవ్వాలన్న అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు.