పోకిరీలకు షీ టీమ్ షాక్ ! | SHE Teams arrest 23, including 3 minors | Sakshi
Sakshi News home page

పోకిరీలకు షీ టీమ్ షాక్ !

Published Fri, Jul 15 2016 12:55 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

పోకిరీలకు షీ టీమ్ షాక్ ! - Sakshi

పోకిరీలకు షీ టీమ్ షాక్ !

హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు/యువతులు/బాలికల్ని వేధిస్తున్న 23 మంది పోకిరీలను షీ-టీమ్స్ అరెస్టు చేశాయి. పట్టుబడిన వారిలో ఓ స్కూల్ టీచర్‌తో పాటు 14 మంది మైనర్లు ఉన్నారని అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా గురువారం వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఎన్.రెడ్డి కిరణ్, కె.రమేష్ వివిధ సర్వీసు ప్రొవైడర్లకు చెందిన సిమ్‌కార్డులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఇలా తమ చేతిలో ఉన్న సిమ్‌కార్డుల్ని దుర్వినియోగం చేస్తున్న వీరిద్దరూ వాటిని వినియోగించి యువతులు/మహిళలకు ఫోన్లు చేస్తూ, అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారు.

ఇద్దరు బాధితులు నుంచి ఫిర్యాదు స్వీకరించిన షీ-టీమ్స్ నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాయి. నగరంలోని యాకత్‌పురాకు చెందిన మహ్మద్ సలీముద్దీన్ వృత్తిరీత్యా టైలర్. స్థానికంగా ఉండే మహిళ ఫోన్ నెంబర్ సేకరించిన ఇతడు ఫోన్లు, వాట్సాప్ సందేశాలతో వేధిస్తున్నాడు. ఆమె కుమారుడు, భర్త మందలించినప్పటికీ లెక్క చేయకుండా తన పంథా కొనసాగించాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకున్న షీ-టీమ్స్ నిందితుడిని అరెస్టు చేశాయి. నగరానికి చెందిన విద్యార్థులైన ఎ.రవీందర్ యాదవ్, జి.పరమేష్ కొన్ని రోజులుగా దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థిని వెంటపడుతున్నారు. పేరు, చిరునామా తదిరాలు చెప్పాల్సిందిగా వేధిస్తున్నారు. ఆ ప్రాంతంలో కాపుకాసిన షీ-టీమ్స్ వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాయి.

కటకటాల్లోకి చేరిన ‘టీచకుడు’...

చాంద్రాయణగుట్టలోకి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న సంతోష్‌నగర్ వాసి ఎన్.విజయ్‌కుమార్ ‘టీచకుడి’గా మారి షీ-టీమ్స్‌కు చిక్కాడు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఎనిమిదో తరగతి బాలిక తన తల్లి సెల్‌ఫోన్ నుంచి రహస్యంగా ఎవరికో సందేశాలు పంపడాన్ని ఆమె సోదరి గుర్తించింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో అంతా కలిసి బాలికను ఆరా తీశారు. సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ఆమె చదువుతున్న పాఠశాలలో లెక్కలు బోధిస్తున్న టీచర్‌కు పంపినట్లు తేలింది.

అతడు ఇంటికి వెళ్లిన తర్వాత ఎస్సెమ్మెస్‌లు పంపమని వేధిస్తాడని బాలిక కుటుంబీకులకు చెప్పింది. సదరు టీచర్ నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్‌ల్లో కొన్ని అభ్యంతరకరంగా ఉండటంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు ‘టీచకుడి’ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతగాడి వ్యవహారాలను స్కూలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
 
విద్యార్థినులకూ చేదు అనుభవాలు...

ఖైరతాబాద్‌లోని ఫిష్ మార్కెట్ సమీపంలో నిమ్మకాయ సోడాల విక్రేత జె.సంగప్ప ఓ ఎనిమిదో తరగతి విద్యార్థిని వెంటపడి వేధిస్తున్నాడు.  కొన్ని సందర్భాల్లో నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నీ పేరు ఏంటి? అంటూ లేఖలు రాసి ఆమెపైకి విసిరాడు.  సదరు బాలిక తన వెంటపడి వేధించవద్దంటూ లేఖ రాసి తన స్నేహితురాలి ద్వారా పంపింది. అయినప్పటికీ పంథా మార్చుకోని సంగప్ప వేధింపులు కొనసాగించాడు. దీంతో భయాందోళనలకు గురైన బాలిక స్కూలుకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉండిపోసాగింది.

దీంతో ఆరా తీసిన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. బాలిక తండ్రి షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని సంగప్పను అరెస్టు చేశారు. కాచిగూడలోని సెయింట్ ఫ్రాన్సెస్ కాలేజ్ వద్ద ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన షీ-టీమ్స్ వీడియో రికార్డింగ్‌తో నిఘా ఉంచాయి. ఆ ప్రాంతంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వివేక్ సింగ్, గౌరవ్ సింగ్‌లతో పాటు మరో 11 మంది మైనర్లను పట్టుకున్నాయి. వీరిలో మేజర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. మైనర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేశాయి. జూపార్క్ వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న చాంద్రాయణగుట్టకు చెందిన ముగ్గురు మైనర్లను షీ-టీమ్స్ పట్టుకున్నాయి.
 
 ధైర్యంగా ఫిర్యాదు చేయండి

 ‘నగరంలో వేధింపులు ఎదుర్కొనే వారు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలి. బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. అత్యవసర సమయాల్లో ‘100’కు ఫోన్ చేసి తక్షణ సాయం పొందవచ్చు. షీ-టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555, ఈ-మెయిల్ ఐడీ (hydsheteam@gmail.com), ఫేస్‌బుక్ పేజ్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు ఇవ్వడం, సహాయం పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నాం. పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని హాకా భవన్‌లో ఉన్న భరోసా కార్యాలయానికీ నేరుగా రావచ్చు.’- స్వాతి లక్రా,అదనపు సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement