లీడర్‌షిప్‌ కావాలి | International Womens Day Wishes by Swati Lakra | Sakshi

లీడర్‌షిప్‌ కావాలి

Mar 8 2025 4:44 AM | Updated on Mar 8 2025 4:44 AM

International Womens Day Wishes by Swati Lakra

స్వాతి లక్రా, ఐపీఎస్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నేను ఐపీఎస్‌ జాయిన్‌ అయినప్పుడు అంటే 1995లో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో రెండు లేదా మూడు శాతం మాత్రమే మహిళలు ఉండేవారు. ఐపీఎస్‌ క్యాడర్‌లో ఇంకా తక్కువ.. ఎంతంటే నేను ఏ పోస్ట్‌కి వెళ్లినా ఆ పోస్ట్‌లో ఫస్ట్‌ ఉమన్‌ని నేనే అయ్యేంత! కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మా బ్యాచ్‌లో పదమూడు మంది మహిళలం ఉంటే ఇప్పుడు 60 మంది వరకూ ఉంటున్నారు. 

ఇంతకుముందు పోలీసులు అంటే కేవలం పురుషులే అన్న ఇమేజ్‌ ఉండేది. ఇప్పుడది మారిపోయింది. డిపార్ట్‌మెంట్‌లోని అన్ని స్థాయుల్లోకి మహిళలు వస్తున్నారు. తెలంగాణలో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించింది ప్రభుత్వం. దాంతో మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు పోలీస్‌ అంటే మహిళలు కూడా అనే ఇమేజ్‌ స్థిరపడిపోయింది. పోలీస్‌ స్టేషన్స్‌లో సౌకర్యాలూ విమెన్‌ ఫ్రెండ్లీగా మారుతున్నాయి. తెలంగాణనే తీసుకుంటే.. ప్రతి స్టేషన్‌లో మహిళల కోసం సపరేట్‌ వాష్‌ రూమ్స్‌ని కట్టించాం. కొన్ని జిల్లాల్లో అయితే బేబీ కేర్‌ సెంటర్స్‌ని కూడా ఏర్పాటు చేశాం. 

ఈ మధ్య సైబరాబాద్‌ కమిషనరేట్‌లో కూడా బేబీ కేర్‌ సెంటర్‌ను పెట్టారు. ఇదివరకు బందోబస్త్‌లు, గణేశ్‌ నిమజ్జనానికి మహిళా పోలీస్‌లు డ్యూటీకి వెళితే వాష్‌రూమ్స్‌ ఉండక చాలా అవస్థపడాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్‌ వాష్‌రూమ్స్‌ సౌకర్యం వచ్చింది. ఎక్కడ బందోబస్త్‌ ఉంటే అక్కడికి ఈ మొబైల్‌ వాష్‌రూమ్‌ని పంపిస్తున్నారు. ఇలా మహిళలు చక్కగా పనిచేసుకోవడానికి అనుగుణమైన వసతులు ఏర్పాటవుతున్నాయంటే మహిళల పనికి గుర్తింపు, డిమాండ్‌ వచ్చినట్టే కదా!

దృష్టి పెడతారు.. 
ఏ రంగంలో అయినా ఎంతమంది మహిళలు వస్తే అంత వేగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ అవుతుంది. మొత్తం వ్యవస్థలోనే విమెన్‌ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్‌ ఏర్పడుతుంది. అంతేకాదు లీడర్‌షిప్‌ రోల్స్‌ని పొందే అవకాశం వస్తుంది. లీడర్‌షిప్‌ రోల్స్‌లో మహిళలు ఉంటే స్త్రీల అవసరాల మీద దృష్టిపెడతారు. సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.

చెప్పుకోదగ్గదే కానీ..   
మహిళా సాధికారత సాధించాలంటే ముందు స్త్రీల హక్కుల గురించి స్త్రీలతోపాటు సమాజమూ తెలుసుకోవాలి. స్త్రీ సెకండ్‌ సిటిజన్‌ కాదు.. తోటి ΄ûరురాలే అన్న స్పృహ రావాలి. అది ఇంటినుంచే మొదలవ్వాలి. నన్ను మా బ్రదర్‌తో సమానంగా చదివిస్తేనే కదా నా ఐపీఎస్‌ కల సాధ్యమైంది. అలా కొడుకైనా కూతురైనా ఇద్దరూ సమానమే.. హక్కులు, అవకాశాలు ఇద్దరికీ సమానమే అనే భావన పేరెంటింగ్‌లో కనిపించాలి. తర్వాత స్కూల్లో టీచింగ్‌లోనూ భాగం కావాలి. అప్పుడే అది సమాజంలో రిఫ్లెక్ట్‌ అవుతుంది. స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. ఆడపిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికస్వాతంత్య్రానికి అదే మెట్టు! కాబట్టి అమ్మాయిలు అందరూ చదువు మీద దృష్టిపెట్టాలి. 

ఎలాంటి టాస్క్‌లకైనా సిద్ధమే! 
ఏ రంగంలో అయినా మహిళలు శారీరక శ్రమలో కానీ.. బుద్ధికుశలతలో కానీ పురుషులతో సమంగా ఉంటున్నారు. అలాగే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కూడా! మహిళలు కదా అని తేలికపాటి టాస్క్‌లు ఇవ్వడం ఉండదు. కీలకమైన బాధ్యతలనూ అప్పగిస్తారు. నన్నే తీసుకుంటే నేను మావోయిస్ట్‌ ఏరియాల్లో కూడా పని చేశాను. కాబట్టి మహిళలకు సమాన అవకాశాలే ఉన్నాయి.. ఉంటాయి.. ఉండాలి కూడా!

– సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement